చార్ ధాం యాత్ర - పార్ట్ 6
- Pulletikurthi Nagesh
- 20 hours ago
- 6 min read
#CharDhamYathra, #చార్ధాంయాత్ర, #PulletikurthiNagesh, #పుల్లేటికుర్తినగేష్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Char Dham Yathra - Part 6 - New Telugu Story Written By Pulletikurthi Nagesh Published In manatelugukathalu.com On 07/01/2026
చార్ ధాం యాత్ర - పార్ట్ 6 - తెలుగు కథ
రచన: పుల్లేటికుర్తి నగేష్
ఈ ఆద్యంత ప్రయాణంలో మనకి దారిలో వచ్చే ఊర్ల పేర్లు కూడా చాలా గంభీరంగా, లోతుగా మన ప్రక్కనే వస్తున్న పర్వతాలు, లోయల్లా వుంటాయి.
ఉదాహరణకి చూడండి హరిద్వార్, రిషికేశ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాధ్, బదరీనాధ్, హనుమాన్ చట్టి, జానకి చట్టి,
ఉత్తరకాశీ, ధరలి, ముఖబా, భైరాం ఘాటి, రుద్ర ప్రయాగ, సోన్ ప్రయాగ, ఊఖీమఠ్, గుప్త కాశీ,
గౌరి కుండ్, దేవ్ ప్రయాగ, నంద ప్రయాగ, జోషిమఠ్, విష్ణు ప్రయాగ..
ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో వున్నాయి.
ఒక్క పేరైన సింపుల్ గా పేలవం గా వుందా???
అన్నీ గంభీరంగా నిజంగా ఇది దేవ భూమే సుమా అన్నట్లు వున్నాయి కదా.
పేర్లు చదువుతుంటే మంత్రాలు చదువుతున్నట్లు వుంది కదూ..
పేరు లో ఏముందిలే అనుకుంటున్నారా..
లేదు లేదు చాలా వుంది.
ఉదాహరణ కి నా పేరే తీసుకోండి. నేను చిన్నప్పటి నుండి మార్చు కోవాలనుకున్న వాటిలో నా పేరు ఒకటి.
ఇప్పటికీ నాకు డౌటే.. నా పేరు.. నగేషా??.. నాగేషా??..
కన్ఫ్యూషన్ లో పుట్టి వుంటాను, అలా పెట్టారు..
ఇది చాలదన్నట్టు ఇంటి పేరు “పుల్లేటికుర్తి”..
ఏదో ఇడ్లీ వుడుకుతుంది.. అన్నట్లుంటుంది కదూ.
కానీ గోత్రం చెప్పి నప్పుడు మాత్రం కొంచెం బలంగా అనిపిస్తుంది “విశ్వజ్ఞ బ్రహ్మర్షి”.
కాని కొన్ని పేర్లు వింటే చిన్న వైబ్రేషన్ వస్తుంది, ముఖం వెలిగి పోతుంది కూడా.
మహేశ్ బాబు పేరు విన్న అమ్మాయిల మొహాల్లా.. విన్నా, పలికినా పెదవుల పై చిన్న చిరునవ్వు.
కొందరు సార్ధక నామధేయులు వుంటారు.
నాకు తెలిసీ మా ఇంట్లో అందరూ సార్ధక నామధేయులే..
మా ఆవిడ సుజాత, మా చిన్నాడు ‘సుమంతు’, వీరి పేరు విన్న వెంటనే తెలిసిపోతుంది.. వీళ్ళు చాలా అమాయకులు, నెమ్మదస్తులు అయి వుంటారని,
మా పెద్దాడు పేరు .. శ్రీ క ర్..
వాడి పేరులో చిన్న వైబ్రేషన్ వుంది. వాడు దగ్గర వున్నా, దూరంగా వున్నా మాకైతే ఝలక్‌లు ఇస్తూనే వుంటాడు.
మన యాత్రా దారితప్పి ఎటో వెళ్ళిపోయింది కదూ. మళ్ళీ మెయిన్ రోడ్డు మీదకి వద్దాం.
సాయిగారు రాత్రే చెప్పారు ఉదయం త్వరగా బయలుదేరాలి అని ఎంత త్వరగా బయలుదేరితే అంత త్వరగా చేరుకుంటాం అని.
ofcourse కండిషన్స్ apply.
వేడి నీళ్ళు, వేడి వేడి కాఫీలు వుండడం తో ఉదయం త్వరగా బయలు దేరడంలో ఎవరికీ ఇబ్బందులు లేవు.
కష్టమైన యాత్ర అంతా అయిపోయింది.. ఇక ప్రయాణంలో పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవులే అనే రిలీఫ్ అందరి మొహాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
అలా జోషిమఠ, గుప్త ప్రయాగ, రుద్ర ప్రయాగ ల మీదుగా రాత్రి 7 గంటలకి బద్రీనాథ్ చేరాము.
చలి చాలా ఎక్కువగా వుంది. రూంలు అలాట్ అయినవెంటనే సూట్కేసు లు పడేసి అందరం మెల్లగా నడచుకుంటూ దర్శనానికి బయలుదేరాము.
నిజంగా దారి, హోటల్ లు, షాప్ లు చాలా బాగుంది బద్రీనాథ్.. వీధులు లో నడుస్తుంటే ఏదో విదేశీ వీధులలో తిరుగుతున్నట్లు వుందంటే అతిశయోక్తి కాదు. అంత నీట్ గా ఉంది.
ప్రతి హోటల్ ఒక unique డిజైన్ తో వుంది. షాప్స్ దాటుకుంటూ అలకనంద ఒడ్డుకు చేరితే అక్కడ నుండి బద్రీనాథ్ టెంపుల్ నిజంగా చాలా అందంగా, అద్భుతంగా, కళ్ళు మిరమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో మెరిసిపోతుంది.
ఏమైనా విష్ణుమూర్తి వైభోగమే వైభోగం కదా.. చాలా అంటే చాలా కలర్ ఫుల్ గా వుంది.
అలకనంద్ ని దాటుకుంటూ పోతే, ఇక్కడ అలకనంద గుడికి దగ్గరగా చాలా వడి వడిగా ప్రవహిస్తుంది. హోరు తెలుస్తోంది.
కుడి ప్రక్కన వేడినీటి బుగ్గ తప్త కుండ్ వుంటుంది. ఆవిర్లు అంత రాత్రి, అంత చలిలో కూడా బయటకి చిమ్ముతున్నాయి.
ఉదయం జనం ఎక్కువ వుంటారు, ఇప్పుడు జనం ఎక్కువ లేరు. టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ నుండి లైన్ స్టార్ట్ అయింది.
చలి చాలా ఎక్కువగా వుంది. మూడు నాలుగు డిగ్రీ లు మైనస్ లో వుండవచ్చు. దర్శనం అనగానే అల్మోస్ట్ అందరూ బయలు దేరారు. దర్శనం బాగా జరిగినది.
గర్భ గుడిలో, మూలవిరాట్, శ్రీ బద్రీనారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఒక మీటర్ ఎత్తైన సాలగ్రామ శిలతో చేసిన నల్ల రాతి విగ్రహం.
ఈ విగ్రహం పద్మాసనం, నాలుగు చేతులతో ధ్యాన ముద్రలో కూర్చొని ఉంటుంది. ఇది స్వయంభువు అని చెప్తారు.
గర్భగుడిలోనే ఉన్న ఇతర ముఖ్య విగ్రహాలు, ఉద్ధవుడు – భగవానుడి పక్కన నిలబడి ఉంటాడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుని స్నేహితుడు. ఇంకా బద్రీనారాయణునికి ముందు కుబేరుడు, గరుడుడు మోకాలి మీద కూర్చొని నమస్కార ముద్రలో, నర-నారాయణుల విగ్రహాలు వున్నాయి. అఖండ జ్యోతి కూడా వుంది.
ఇది ఆలయం మూసివేసే ఆరునెలలు కూడా కొండెక్కకుండా వుంటుందట.
ఆలయం బయట లక్ష్మీదేవి హనుమంతుడు ఘంటాకర్ణుడు, వేదవ్యాసుడు, గణేశుడు, శేషనాగు మొదలైన చిన్న విగ్రహాలు కూడా వున్నాయి.
తప్తకుండ్ దగ్గర నర-నారాయణ పర్వతాల మధ్య శ్రీనారద ముని విగ్రహం కూడా ఉంది.
ఇక్కడ ఘంటాకర్ణుడు గురించి చిన్న మాట. గర్భగుడిలో స్వామి ని దర్శించే ముందు ఘంటాకర్ణునికి మన వివరాలు చెప్పి అనుమతి తీసుకుని దర్శనం చేసుకోవాలట.
నేను చేసుకున్న మూడు దర్శనాలప్పుడు, అన్నీ చెప్పి అనుమతి తీసుకున్నాను. నేను కొంచెం రూల్ మైండెడ్ లెండి.
ఈ ఘంటాకర్ణుడు మహాశివుని ప్రమధ గణాలలో ఒక శక్తి. మరి ఇక్కడ ఎందుకు వుందో తెలుసుకోవాలి.
ఎక్కడా శివుని విగ్రహం లేదు. నేను తెలుసుకున్నది ఇక్కడ రాస్తున్నాను.
విష్ణు ద్వేషంతో జీవితాన్ని గడుపుతున్న గంట కర్ణుడు, చెవులకు గంటలు కట్టుకుని, ఎందుకంటే ఎవరైనా విష్ణు నామాన్ని ఆలపించిన మరుక్షణం అది తనకు వినపడకుండా తన గంటలను చెవుల ద్వారా మోగిస్తూ ఆ నామాన్ని వినకూడదు అని నిశ్చయించుకున్నాడట.
ఈయన కుబేరునికి పరిచారకుడు కూడా నట. రాక్షసుడయిన ఈ ఘంటా కర్ణుడి ముక్తి పొందడం కోసం శివుని గురించి ఘోర తపస్సు చేశాడట.
అయితే శివుడి ప్రత్యక్షమై ముక్తి మాత్రం ఆ శ్రీమన్నారాయణ ఒక్కడే ఇవ్వగలుగుతాడు అనిచెప్పగా హతాశుడై,
స్వామి, విష్ణు మాట వినబడితేనే నాకు హృదయం కుత కుత లాడుతుందే, నన్ను పోయి ఆ విష్ణువుని ఆశ్రయించమని చెప్తున్నావే ఇది న్యాయమా అని అడిగితే,
బదరిలో తపస్సు చేసుకుంటున్న కృష్ణ పరమాత్మను ఆశ్రయించమంటూ చెప్పి అంతర్ధాన మయ్యాడు.
అప్పటినుండి ఇక్కడ క్షేత్రపాలకుడిగా వున్నాడాని అంటారు.
కధ ఎలా వున్నా ఈయన అనుమతి తీసుకునే వెళ్ళాలి అది ఫిక్స్.
అలా అన్ని దర్శనాలు చేసుకుని తిరిగి వచ్చాము. అప్పటికే అలసిన మాకు వేడి వేడి భోజనం స్వాగతం పలుకుతుంది. సుష్టి గా తిని, ఇక నిద్రకి ఉపక్రమించామ్.
భోజన సమయంలో చిన్న బ్రీఫింగ్ అయింది. మరునాడు బ్రహ్మకపాలం లో శ్రాద్ధ కర్మలు చేయించుకునే వాళ్ళు పేర్లు ఇస్తే పంతులు గారిని అరేంజ్ చేస్తామన్నారు. మేం కూడా పేర్లు ఇచ్చాము.
ఉదయం ఆరు గంటలకు దర్శనానికి వెళ్ళి, అక్కడ నుండి అలకనంద తీరంలో బ్రహ్మకపాలం దగ్గర శ్రాద్ధ కర్మలు జరుపు తారు అని చెప్పారు.
రూమ్ లు ఎంత బాగున్నా, ఈ చలిలో ఏమాత్రం నిద్ర పట్టలేదు. పైగా ఎక్కువ సేపు హీటర్ వేసుకుంటే ఆక్సిజన్ తగలబడి పోయి మనం ఊపిరి ఆడక పైకి పోతాం అని మా సాయి గారి బెదిరింపులు.
పైపెచ్చు బ్రహ్మకపాలం కూడా కూతవేటు దూరంలోనే వుంది.
ఆక్సిజన్ అందక పైకి పోతే మన పెద్దలతోబాటు మనం కూడా భోజనాలకి కూర్చోవాలి.
ఇన్ని భయాలతో నిద్ర ఎలా పడుతుంది మీరే చెప్పండి.
అయితే అదృష్టం గీసర్ లో వేడి నీళ్ళు బాగా వచ్చాయి. వేడినీటి స్నానం ఇంత అద్భుతం అని తెలిసింది అప్పుడే. స్నానాలు కాఫీలు ముగించుకొని దర్శనానికి బయలు దేరాము.
ముందే చెప్పినట్లు దర్శనానికి రద్దీ ఎక్కువగా వుంది. లైన్ కిలోమీటర్ కి ఎక్కువే వుంది. కానీ సింగల్ లైన్ కాబట్టి ఏమాత్రం ఇబ్బంది లేదు.
అలా ఒక రెండు గంటల సమయం పట్టింది దర్శనానికి. దర్శనం బాగా జరిగినది. బయటకి వచ్చేసరికి మా వాలంటీర్స్ మమ్మల్ని అలకనంద ఒడ్డుకు అదే బ్రహ్మకపాలం దగ్గరకు తీసుకు వెళ్లారు.
అందరం పంచెలలోకి మారి శ్రాద్ధ కర్మలు భక్తి శ్రద్ధలతో చేశాము.
ఇక మధ్యాహ్నం భోజనాల తరువాత ముఖ్యమైన “మాన” విలేజ్ సందర్శనము.
ఇది మన దేశానికి చివరి గ్రామం అని మొన్నటి వరకు చెప్పేవారు. ఇప్పుడు మాత్రం ఈ గ్రామం మన దేశానికి మొదటి గ్రామము అంటున్నారు.
ఇదే కరెక్ట్.
భౌగోళికంగా, చారిత్రాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రదేశము.
ఇది బద్రినాథ్ ధామ్‌కు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో వుంది. చమోలి జిల్లాలో ఉంది. ,
హిమాలయ పర్వతాల మధ్య, అలకనంద నది ఒడ్డున చాలా అందమైన గ్రామం.
దీనికి తర్వాత ఇండో-టిబెట్ (చైనా ఆక్రమిత టిబెట్ అనుకుంటా) సరిహద్దు వస్తుంది.
ఈ గ్రామం సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. శీతాకాలంలో తీవ్రమైన చలివాతావరణం కారణంగా గ్రామ ప్రజలు దిగువ ప్రాంతాలకు వలస వెళ్తారు.
మానా గ్రామానికి భారతీయ ఇతిహాసాలతో, ముఖ్యంగా మహాభారతంతో గాఢమైన సంబంధం ఉంది.
పాండవులు తమ చివరి ప్రయాణమైన స్వర్గారోహణ యాత్రలో ఈ మార్గం గుండా వెళ్లారని పురాణ కథనం. ఈ ప్రాంతం మొత్తం పాండవుల అడుగుజాడలతో నిండినదిగా భావిస్తారు.
మొదటగా మేం వ్యాస గుహ చూడడానికి బయలుదేరాము. సుమారు ఒక పావుగంట నడక. కొంచెం కష్టమే. నడక కష్టమనుకుంటే “పిట్టులు” వున్నాయి. మనిషికి 1100 చార్జి చేస్తున్నారు. మేం నడిచే వెళ్ళాము.
వేదవ్యాసుడు ఇక్కడే మహాభారతాన్ని రచించాడని విశ్వాసం. గుహలో వ్యాసుడి విగ్రహం ఉంటుంది. అక్కడి నుండి గణేశ గుహకి వెళ్ళాము. వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని మహా గణపతి లిఖించిన స్థలం అది.
ఇక అక్కడి నుండి సరస్వతి నది పుట్టిన ప్రదేశానికి వెళ్ళాము. ద్రౌపది నది దాటడానికి భీముడు ఒక పెద్ద బండ రాయిని నదిపై ఉంచాడని పురాణ కథనం. దీనికి “భీమ్ ఫూల్” అంటారు. అక్కడ నది సౌండ్ వినవాలసినదే. చాలా ఉదృతంగా ప్రవాహం వుంటుంది.
అక్కడ ఒక ఆర్చ్ వుంటుంది. అక్కడి నుండి పాండవులు స్వర్గారోహణ ప్రారంభించారట.
ఇక అక్కడినుండి మేం వెనుతిరిగాం. ఇంకా పైకి వెళ్తే, వసుధార జలపాతం, కేశవ ప్రయాగ్ మొదలైన ప్రదేశాలు వస్తాయి.
పాండవులు దారిలో ప్రాణాలు వదిలిన ప్రదేశాలు, భీముని గదా పడిన ప్రదేశం మొదలైనవి వస్తాయి.
ఇంకా యుధిష్ఠిరుడు ఇంద్రుడు పంపిన రథం ఎక్కిన ప్రదేశం, దాని ముందు వున్న మెట్లు అన్నీ సజీవంగా వున్నాయి (ఈ మధ్యన TV 9 లో వచ్చిన “దృశ్యం” డాక్యుమెంటరీ చూడండి).
మానా గ్రామంలో ప్రధానంగా భోటియా తెగకు చెందిన ప్రజలు నివసిస్తారు. వ్యవసాయం, పశుపోషణ తో బాటు ఉన్ని వస్త్రాల తయారీ వీరి ప్రధాన వృత్తి.
సాదాసీదా జీవితం, పండుగలు, ఆచారాలు బద్రినాథ్ యాత్రకు వచ్చిన భక్తులు తప్పకుండా మానా గ్రామాన్ని సందర్శిస్తారు.
ఇది ఆధ్యాత్మిక యాత్ర + ప్రకృతి ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ, ధ్యానం చేసే వారికి ఇది స్వర్గధామం లాంటిది.
అందాలు + సాహస యాత్ర + చరిత్ర మూడు కలిసిన అరుదైన ప్రదేశం.
మానా విలేజ్ అనేది కేవలం ఒక చిన్న గ్రామం కాదు. అది భారతీయ పురాణ చరిత్రకు సాక్ష్యం, ఆధ్యాత్మికతకు ప్రతీక, హిమాలయ సహజసౌందర్యానికి నిలువెత్తు రూపం.
మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, ప్రకృతిని ఒకేచోట అనుభవించాలంటే మానా విలేజ్ తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశం.
ఇక సాయంత్రం హోటల్ కి చేరి, కొంత సేపు విశ్రాంతి తరువాత మళ్ళీ అందరం దర్శనానికి వెళ్ళాము. రాత్రికి విశ్రాంతి తీసుకుని ఉదయం 5 గంటలకే ప్రయాణం ప్రారంభించి సాయంత్రానికి హరిద్వార్ చేరుకున్నాము.
అక్కడ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయం గంగాస్నానం చేసి లోకల్ కోవెల్లు దర్శనం చేసుకుని వచ్చేసరికి, యధావిధిగా వేడి వేడి బ్రేక్ ఫాస్ట్ రెఢీ గా వుంది. అందరి ఫీడ్ బాక్ తీసుకున్నారు.
అందరూ చాలా సంతోషంగా వున్నారు యాత్ర సురక్షితంగా, సుఖంగా, పూర్తి భక్తి రసంతో సాగింది. కొందరైతే సాయి దంపతులకు పాదాభివందనం చేశారు కూడా.
మేం ఏదో ఉడత భక్తి గా దంపతులిద్దరికి శాలువాలు కప్పి సత్కరించుకున్నా. వాళ్ళకి ఎంత కృతజ్ఞతలు చెల్లించుకున్నా తక్కువే.
సాయి గారు ముందు నుండు చెప్తున్నట్లు యాత్ర మొత్తం భగవన్నామస్మరణ తోనే ప్రారంభం అయి ముగుసినది కూడా.
అదే ఈ యాత్ర సఫలానికి ఇంధనం అని సాయి గారు చెప్పిన మాట సత్యము.. సత్యము.. సత్యము..
ఇక ఇష్టం లేకపోయినా యాత్ర ముగించక తప్పదు.
ఈ యాత్ర ముగిస్తే కానీ ఇంకో యాత్ర ప్రారంభించలేము కదా..
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను.. “జీవితం లో అన్నింటికన్నా కష్టమైనది మనల్ని మనం సంతోషంగా వుంచుకోవడం.. అలాంటి అవకాశం వస్తే ఎప్పుడూ వదులుకోవద్దు”.. ముఖ్యంగా ఆ అవకాశాలు ఇలాంటి యాత్రల రూపాలలో వస్తాయి.. గుర్తుంచుకోండి.
మళ్ళీ ఇంకో అద్భుతమైన యాత్రానుభవాలతో మళ్ళీ కలుద్దాం.
సమాప్తం
***
పుల్లేటికుర్తి నగేష్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: పుల్లేటికుర్తి నగేష్

పేరు: పుల్లేటికుర్తి నగేశ్
వృత్తి: ప్రభుత్వ ఉద్యోగం.
వుండేది: విజయవాడ మరియు హైదరాబాద్
పుట్టిన ఊరు;;;; శ్రీకాకుళం
