top of page
Original.png

అప్రమత్తత

21 hours ago
5 min read

అప్రమత్తత తెలుగు కథ – రైల్వే పట్టాలపై ప్రమాదంలో చిక్కుకున్న వృద్ధుడిని యువకుడు రక్షిస్తున్న దృశ్యం, చూస్తున్న సుశీల్
నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదం – అప్రమత్తతే నిజమైన రక్షణ.

Apramatthatha - Telugu Social Story | Putrevu Srinivasa Rao

అప్రమత్తత - తెలుగు సామాజిక కథ | పుట్రేవు శ్రీనివాసరావు

Published in manatelugukathalu.com on 07/11/2026


రైల్వే స్టేషన్‌లో భద్రతా హెచ్చరికను పదేపదే చూసిన సుశీల్, అదే తరహా ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూస్తాడు. ఆ తరువాత రైలు ప్రయాణంలో ఎదురైన మరో సంఘటన, తండ్రి చెప్పిన మాటలు అతనికి అప్రమత్తత అసలు విలువను తెలియజేస్తాయి. నిర్లక్ష్యం నుంచి బాధ్యత వైపు సాగిన ఆలోచనాత్మక ప్రయాణమే ‘అప్రమత్తత’ కథ.


రైల్వేస్టేషన్‌  రెండో నంబర్‌ ప్లాట్‌ఫారమ్‌పై ఒక బెంచ్‌లో సుశీల్‌ కూర్చున్నాడు. చుట్టుపక్కలంతా చూసాడు. స్టేషన్ చాలా రద్దీగా ఉంది.  మైక్ నుండి తడపడుతున్నట్లుగా చిన్న ప్రకటన తాను వెళ్లాల్సిన రైలు అరగంట ఆలస్యమవుతుందని వినిపించింది.  “అరగంటా?.” అని నిట్టూర్చాడు. 


వాచ్ చూసుకున్నాడు. ఇంకా ముప్పై నిమిషాల సమయం ఉంది.

ప్లాట్‌ఫారమ్‌ మధ్యలో ఎత్తుగా అమర్చిన పెద్ద టెలివిజన్‌ స్క్రీన్‌ వైపు అతని దృష్టి మళ్లింది. రంగురంగుల ప్రకటనలు మారుతూ వస్తున్నాయి. ఇంతలో ఒక సామాజిక అవగాహన ప్రకటన మొదలైంది. 


ఒక వృద్ధుడు ఓవర్‌బ్రిడ్జి మెట్లు ఎక్కే ఓపిక లేక పట్టాల మీదుగా అవతలి ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను పట్టాలు దాటుతుండగా వేగంగా ఒక రైలు దూసుకొస్తుంది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది పరుగెత్తుకొచ్చి అతన్ని సకాలంలో ప్లాట్‌ఫారమ్‌పైకి లాగి కాపాడాడు. చివరగా తెరపై పెద్ద అక్షరాలు కనిపించాయి. “ఇలాంటి సాహసాలు చేయకండి. మీ ప్రాణం మీ కుటుంబానికి ముఖ్యం.”


సుశీల్‌ తల ఊపాడు. “చాలా మంచి సందేశం.”


కొద్దిసేపటికి అదే ప్రకటన మళ్లీ వచ్చింది.

ఇంకొంతసేపయ్యాక  మళ్లీ వచ్చింది.

ముప్పై నిమిషాల్లో దాదాపు మూడుసార్లు అదే ప్రకటన రిపీట్ అయ్యింది.

అక్కడున్న ప్రయాణికులంతా ఆ ప్రకటన చూశారు.


అంతలో సుశీల్‌ వెళ్లాల్సిన రైలు ప్లాట్‌ఫారమ్‌కు వస్తోందని ప్రకటన వినిపించింది.

అతను లేచి బ్యాగ్‌ భుజానికి వేసుకున్నాడు.

అప్పుడే ప్లాట్‌ఫారమ్‌ చివరన పెద్ద కలకలం.


“అయ్యో,” “పట్టాల మీద పడిపోయాడు.” “ఎవరైనా రండి.” అని కేకలు వినిపించాయి.


సుశీల్‌ పరుగెత్తాడు. జనాన్ని దాటుకుని ముందుకు వెళ్లిన అతనికి కనిపించిన దృశ్యం చూసి గుండె ఆగినంత పనైంది.


అదే ప్రకటనలో చూపించిన దృశ్యం. ఒక పెద్దాయన ఓవర్‌బ్రిడ్జి మెట్లు ఎక్కకుండా పట్టాలపైకి దిగి అవతలి ప్లాట్‌ఫారమ్‌ చేరడానికి ప్రయత్నించాడు. అదే సమయంలో గూడ్స్‌ ఇంజన్‌ అటువైపు దూసుకొచ్చింది.


జనం కేకలు వేయడంతో భయపడిపోయిన పెద్దాయన పట్టాల మధ్యలో పడిపోయాడు.

అంతలో ఒక యువకుడు ప్రాణాలకు తెగించి పట్టాలపైకి దూకి అతని చేయి పట్టుకుని పైకి లాగాడు.


ఇంజన్‌ గర్జిస్తూ దూసుకుపోయింది. కొన్ని క్షణాల పాటు అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు.


తర్వాత ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

పెద్దాయన వణుకుతున్నాడు. “నాకు... నాకు ఏం జరిగేదో.” అని కళ్లలో నీళ్లతో అన్నాడు.


సుశీల్‌ అతన్ని చూస్తూ ఉండిపోయాడు.

“టెలివిజన్‌లో అన్ని సార్లు హెచ్చరిక చూసినా అదే తప్పు ఎలా చేశాడు?”

అతని మనసులో చిన్నప్పటి వేమన పద్యం మెదిలింది.


“మనిషి స్వభావం మారడం ఎంత కష్టం. ఎన్ని హెచ్చరికలు చేసినా కొందరు తమ అలవాట్లను మార్చుకోరు. అనుభవం అనే గురువు దెబ్బతీసేవరకు జ్ఞానం రాదు.” అనుకుంటూ సుశీల్‌ తన రైలు వైపు నడిచాడు.


అతని బోగీ దగ్గరకు వెళ్లి ఎక్కబోతుండగా, ఒక్కసారిగా అతని ఫోన్‌ మోగింది.

“హలో?” అవతలి వైపు అతని భార్య స్వరం. “ఎక్కడ ఉన్నారూ?”


“స్టేషన్‌లోనే ఉన్నాను. రైలు ఎక్కబోతున్నాను.”


“నాన్నగారికి మళ్లీ ఛాతిలో నొప్పి వచ్చింది. డాక్టర్‌ వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకురమ్మన్నారు. మీరు త్వరగా రండి.”


సుశీల్‌ ఒక్కసారిగా ఆందోళన చెందాడు. “ఏమైందీ? నాన్నగారికి?”


“అవును. మీరు వచ్చిన వెంటనే  హాస్పిటల్ కి వెళ్ళాలి.”


ఫోన్‌ పెట్టేశాడు. సుశీల్‌ గడియారం చూశాడు.రైలు కదలడానికి ఇంకా రెండు నిమిషాలే ఉన్నాయి.


అతను బోగీలోకి ఎక్కాడు.రైలు నెమ్మదిగా కదిలింది.

కిటికీ బయట ప్లాట్‌ఫారమ్‌ వెనక్కి జారిపోతోంది.

అతని మనసులో మాత్రం ఆ పెద్దాయన ముఖమే తిరుగుతోంది.

“నాన్నగారికి కూడా వయసు అయింది. మెట్లు ఎక్కడం కష్టమే.” అతని ఆలోచన ఒక్కసారిగా ఆగిపోయింది.


“మెట్లు ఎక్కడం కష్టమని పట్టాల మీదుగా వెళ్లకూడదు అని ఇప్పుడే ఒక పెద్దాయనకు చెప్పుకున్నాను. మరి నాన్నగారిని ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు నేను ఏం చేస్తాను?”

రైలు వేగం పెరిగింది.


సుశీల్‌ కిటికీలోంచి బయటకు చూస్తూ ఉండిపోయాడు.

అప్పుడే అతని ఫోన్‌కు ఒక మెసేజ్‌ వచ్చింది.

“విష్ణువర్ధన్‌ గారు మీ నాన్నగారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బయల్దేరారు. మీరు స్టేషన్‌ నుంచి నేరుగా ఆసుపత్రికి రండి.”


సుశీల్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

అప్పుడే అతని దృష్టి బోగీ తలుపు దగ్గర నిల్చున్న ఒక వ్యక్తిపై పడింది.

ఆ వ్యక్తి చేతిలో ఒక చిన్న బ్యాగ్‌ ఉంది.


అతను తలుపు దగ్గర నిలబడి, రైలు వేగంగా వెళ్తున్నప్పటికీ బయటికి చూస్తున్నాడు.

సుశీల్‌ వెంటనే అతన్ని లోపలికి రావాలని చెప్పాడు. “అన్నా. తలుపు దగ్గర అలా నిలబడకండి. ప్రమాదం.”


ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వి, “ఏమీ కాదు. నాకు అలవాటే.” అన్నాడు.


సుశీల్‌ ఒక్కసారిగా ఆగిపోయాడు. అదే మాట. “నాకు అలవాటే.”

అతనికి టెలివిజన్‌ ప్రకటన గుర్తొచ్చింది.

పెద్దాయన పట్టాల మీదికి దిగేటప్పుడు కూడా బహుశా ఇలాగే అనుకుని ఉంటాడు.

“ఏమీ కాదు... నాకు అలవాటే...”


సుశీల్‌ అతని భుజంపై చేయి వేసి లోపలికి లాగాడు.

“అలవాటు అని ప్రమాదాన్ని చిన్నచూపు చూడకండి. ఒకసారి జరిగితే తిరిగి సరిచేసుకునే అవకాశం ఉండకపోవచ్చు.”


ఆ వ్యక్తి సుశీల్‌ వైపు ఆశ్చర్యంగా చూశాడు.

“మీరు రైల్వే ఉద్యోగా?”


“కాదు.” 


“అయితే ఇంతగా ఎందుకు చెబుతున్నారు?”


సుశీల్‌ కాసేపు మౌనంగా ఉన్నాడు.

“ఈ రోజు నేను ఒక హెచ్చరికను మూడుసార్లు చూశాను. నాలుగోసారి అదే హెచ్చరికను జీవితంలో చూశాను.”


అతని మాటలు ఆ వ్యక్తికి అర్థం కాలేదు.

కానీ సుశీల్‌కు మాత్రం అర్థమైంది.

హెచ్చరికలు ఎప్పుడూ టెలివిజన్‌ స్క్రీన్‌పైనే రావు.

కొన్నిసార్లు అవి మన కళ్లముందు జరిగే సంఘటనల రూపంలో వస్తాయి.

కొన్నిసార్లు మనం వినే మాటల రూపంలో వస్తాయి.

కొన్నిసార్లు మనసులో కలిగే చిన్న అనుమానం రూపంలో వస్తాయి.


మరి కొన్నిసార్లు, మనల్ని మనమే మార్చుకోవాలని ప్రకృతి ఇచ్చే చివరి అవకాశంగా వస్తాయి.

కొంతసేపటికి రైలు తదుపరి స్టేషన్‌లో ఆగింది.

సుశీల్‌ ఫోన్‌ మోగింది. అతని భార్య. 


“హలో?” “నాన్నగారిని ఆసుపత్రికి తీసుకొచ్చాం. డాక్టర్‌ పరీక్షిస్తున్నారు.”


సుశీల్‌ ఊపిరి పీల్చుకుకుని, “నేను వస్తున్నాను.” అన్నాడు.


ఫోన్‌ పెట్టబోతుండగా భార్య మళ్లీ అంది. “ఒక్క నిమిషం. నాన్నగారు నీతో మాట్లాడాలంటున్నారు.”


“హలో నాన్నా.” అవతలి వైపు బలహీనమైన స్వరం.


“సుశీల్‌...” 


“చెప్పండి నాన్నా.”


“నువ్వు చిన్నప్పుడు నేను చెప్పిన మాట గుర్తుందా?”


“ఏ మాట?”


“ప్రమాదం దగ్గరకు వెళ్లి ధైర్యం చూపించేవాడిని కాదు... ప్రమాదం రాకుండా చూసుకునేవాడే నిజమైన ధైర్యవంతుడు.”


సుశీల్‌ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. అతని కళ్లముందు టెలివిజన్‌ ప్రకటన ప్రత్యక్షమైంది.


పట్టాలపై పడిన వృద్ధుడు, అతన్ని కాపాడిన యువకుడు,  తర్వాత తాను తలుపు దగ్గర ఉన్న ప్రయాణికుడిని లోపలికి లాగడం అన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయాయి.

అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. “నాన్నా... ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోను.” ఫోన్‌ పెట్టేశాడు.


రైలు మళ్లీ కదిలింది. సుశీల్‌ కిటికీలోంచి బయటికి చూశాడు.

దూరంగా రైల్వే స్టేషన్‌ టెలివిజన్‌ స్క్రీన్‌ ఇంకా కనిపిస్తోంది.అదే ప్రకటన మళ్లీ వస్తోంది.


“ఇలాంటి సాహసాలు చేయకండి. మీ ప్రాణం మీ కుటుంబానికి ముఖ్యం.”

సుశీల్‌ చిరునవ్వు నవ్వాడు.


అతనికి ఇప్పుడు ఆ ప్రకటన ఒక ప్రభుత్వ ప్రకటనలా అనిపించలేదు.

అది తన తండ్రి స్వరం, అది తన కుటుంబం ఇచ్చిన హెచ్చరిక, అది తన అంతరాత్మ చెప్పిన మాట. అప్పుడతనికి వేమన మాటల అసలు అర్థం మరింత స్పష్టమైంది.


మంచి మాట చెవికి చేరడం సమాచారం, ఆ మాట మనసుకు చేరడం విజ్ఞానం, ఆ మాట జీవితంలో ఆచరించడం జ్ఞానం.


సుశీల్‌ కళ్లుమూసుకున్నాడు. రైలు ముందుకు సాగుతోంది.

ఈసారి అతని ప్రయాణం కేవలం ఒక నగరం నుంచి మరో నగరానికి కాదు.


నిర్లక్ష్యం నుంచి అప్రమత్తత వైపు, అలవాటు నుంచి బాధ్యత వైపు, హెచ్చరిక నుంచి జీవితపాఠం వైపు. అతని మనసులో చివరి మాటగా ఒక్క వాక్యం మాత్రమే మిగిలింది.


“ప్రమాదం జరిగిన తర్వాత ‘అదృష్టం బాగుండి బ్రతికిపోయాను’ అనుకోవడం కంటే, ప్రమాదం జరగకముందే ‘అప్రమత్తంగా ఉన్నాను’ అని చెప్పుకోగలగడం నిజమైన అదృష్టం.”


***










📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



పుట్రేవు శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




పుట్రేవు శ్రీనివాసరావు

పరిచయం:

రచయిత పేరు : పుట్రేవు శ్రీనివాసరావు

పుట్టింది విజయనగరం జిల్లా బొబ్బిలి. అకౌంటెంట్ జనరల్, హైదరాబాద్ కార్యాలయం లో ఉద్యోగిని. మా కార్యాలయంలో ఉన్న రంజని తెలుగు సాహితీ సంస్థలో కార్యదర్శిగా, కోశాధికారిగా విధులు నిర్వర్తించాను. నా మొదటి కథ

" మనీ పర్స్" 09.09.1999 లో ఆంధ్రభూమి సింగిల్ పేజీ కథలు శీర్షిక లో ప్రచురితమైంది. అప్పటినుండి కథలు, కవితలు వ్రాయడం కొనసాగిస్తున్నాను. ఈ మధ్యనే మలేషియా సంస్థ "కస్తూరి విజయం" ప్రచురించిన "అమ్మమ్మ ఖజానా" పుస్తకంలో నేను వ్రాసిన "చిట్టి చేతులు" కథ కు చోటు దక్కింది. ఈ పుస్తకం ఆంగ్లంలోనూ, హిందీ లోనూ కూడా అనువాదం చేయబడింది.





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page