ఒక భారీ సినిమా - పార్ట్ 1

Oka Baari Cinema - Part 1 - Telugu Comedy Story | Bhaskara Rao B. R. K. V.
ఒక భారీ సినిమా - పార్ట్ 1 - తెలుగు హాస్య కథ | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 07/11/2026
కొడుకును హీరోగా పెట్టి రూ.300 కోట్లతో భారీ సినిమా తీయాలనుకున్న సుబ్బరాజు కల, షూటింగ్ మొదలైన వెంటనే ఊహించని హాస్య పరిణామాలకు దారితీస్తుంది. “ఒక భారీ సినిమా – పార్ట్ 1” సినిమా రంగంలోని అతిశయోక్తులను సరదాగా చూపించే వినోదాత్మక కథ.
సుబ్బరాజు రియల్ ఎస్టేట్‌లో బాగా గడించాడు. దిగువ మధ్యతరగతి నుంచి ఉన్నత శ్రేణి ధనవంతునిగా ఎదిగిన సుబ్బరాజుకు చిన్నప్పట్నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక బలంగా ఉండేది.
కానీ ఆస్తిపరుడు కాకపోవడం చేతను, మరీ ముఖ్యంగా తన ఎత్తు ఐదు అడుగులే అవడం చేతను తన కోరిక తీరలేదు.
దాంతో తన ఒక్కగాని ఒక్క కొడుకు నూకరాజుతో ఎలాగైనా ఒక భారీ సినిమా తానే నిర్మాతగా మారి తీయాలని సంకల్పించాడు. కానీ నూకరాజు తండ్రి కంటే ఒక్క అంగుళం మాత్రమే ఎత్తుతో ఐదు అడుగుల ఒక్క అంగుళం మాత్రమే ఉన్నాడు.
అదే విషయాన్ని తాను డైరెక్టర్‌గా పెట్టుకోబోయే ఆయన్ని అడిగితే...
"ఆ!! ఈ రోజుల్లో మనిషి లేకుండానే గ్రాఫిక్స్‌తో సినిమా మొత్తం చుట్టేస్తుంటే హైట్ పెద్ద ప్రాబ్లెమ్ కాదు" అంటూ సెలవిచ్చేసరికి... ఎగిరి గంతేసినంత పని చేశాడు సుబ్బరాజు.
ఎన్నో భారీ సినిమాలు తీసి ప్రజల్ని మెప్పించిన ఆ డైరెక్టరే అభయం ఇచ్చేసరికి, రెండు వందల కోట్లు పెట్టి తీద్దామనుకున్న సినిమాను మూడు వందల కోట్ల బడ్జెట్‌కు పెంచేశాడు.
మంచి రోజు చూసుకుని కొడుకుని తీసుకుని సదరు డైరెక్టర్ ఇంటికి అడ్వాన్సు ఇవ్వడానికి వెళ్లాడు.
మాటలన్నీ పూర్తయ్యాక, "సుబ్బారాజు గారూ! మనం తీసే సినిమా భారీ బడ్జెట్‌ది కనుక ముందుగా హీరో ఓపెనింగ్ సీను, ఇంటర్వెల్ ముందు సీను, క్లైమాక్స్ సీను తీసి ట్రైలర్‌గా ప్రజల్లోకి వదుల్దాం.
దాని మీద వచ్చే స్పందన చూసి మిగిలిన పార్ట్స్ ఫినిష్ చేద్దాం. అంటే బిల్డింగ్ స్కెలిటన్ పూర్తి చేసి గోడలు కట్టడం లాంటిది" అన్నాడు నవ్వుతూ నెత్తిమీద క్యాప్ తీసి బుర్ర గోక్కుంటూ.
"మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఎలా తీస్తారో నాకు అనవసరం. కానీ నా కోరిక నా బిడ్డ ద్వారా తీరాలనే ఉద్దేశ్యంతో వీడి భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నాను" అంటూ నూకరాజు రెండు చేతులతో పాటుగా డబ్బు ఉన్న సూట్‌కేసును కలిపి డైరెక్టరు చేతిలో పెట్టాడు సుబ్బరాజు.
రెండు నెలల తర్వాత అనుకున్న ముహూర్తానికి బీహార్‌లోని కురుక్షేత్రం గ్రౌండ్‌లో సినిమా ప్రారంభమయ్యింది.
స్పెషల్ ట్రైన్ వేయించి మరీ జనాల్ని షూటింగ్ స్పాట్‌కు తీసుకువెళ్లాడు. మంత్రుల్ని, ఇతర ప్రజాప్రతినిధుల్ని అయితే విమానం మీద తీసుకువెళ్లాడు.
హీరోగారి ఇంట్రడక్షన్ సీను అది. డైరెక్టరు ఆదేశంపై వంద వరకు రోడ్ రోలర్లను తెప్పించాడు సుబ్బరాజు.
భారీ సినిమా కాబట్టి ఉన్నవాటిలో అవి భారీ వాహనాలు కావడంతో సీను రిచ్‌గా కనిపించాలని అలా చేశానని చెప్పిన డైరెక్టర్, హీరో వేసుకునే డ్రెస్ అమెరికా నుంచి స్పెషల్‌గా తెప్పించాడు.
ముహూర్తం సమీపించడంతో హీరోను నాలుగైదు సార్లు పిలిచినా క్యారవాన్‌లోంచి బయటకు ఊడిపడకపోవడంతో అనుమానం వచ్చి క్యారవాన్‌లోకి వెళ్లాడు సుబ్బరాజు.
లోపల చైర్‌లో డ్రెస్సు ఉంది కానీ నూకరాజు కనిపించలేదు. భయంతో "నూకా! నూకా!!" అని గట్టిగానే పిలిచేసరికి "ఊఁ... ఊఁ..." అని మూలుగు వస్తోందే తప్ప మనిషి కనిపించడం లేదు. మనిషి కనపడకుండా శబ్దం ఎక్కడి నుంచి వస్తోందో అర్థం కాక కొడుకును పిలుస్తూనే అక్కడ ఉన్న అన్నిటినీ తిరగేసి మరీ చూశాడు చెమటలు కక్కుతూ భయంతో.
ఫలితం లేకపోవడంతో "ఎక్కడున్నావ్?" అని గట్టిగా అడిగాడు.
"ఇక్కడ నాన్నా" అన్న నూకరాజు మాట వినపడ్డ వైపు చూసేసరికి, అది చైర్‌లో ఉన్న డ్రెస్ మధ్య నుంచి వచ్చింది.
క్షణం ఆలస్యం చేయకుండా కుర్చీలోంచి డ్రెస్ తీసేసరికి దాని మధ్యలో ఉన్నాడు ఊపిరి లేనివానిలా.
"ఏమైంది నాన్నా?!" అంటూ వంటిమీద డ్రెస్ తీసేస్తూ తండ్రి హృదయం తల్లడిల్లిపోగా కన్నీటి పర్యంతమవుతూ అడిగాడు సుబ్బరాజు.
"ఇది అమెరికా వాళ్లు వేసుకునే డ్రస్సు కదా, వాళ్లేమో పొడుగ్గా ఉంటారు. వాళ్ల కొలతలతో తయారయ్యింది నా కోసం. నేనేమో పొట్టి. అదికాస్తా నాకు పెద్దదై నేను దాంట్లో మునిగిపోయాను" అన్నాడు బిక్కముఖం వేసుకుని. బాధ వచ్చింది సుబ్బరాజుకు కొడుకు అవస్థను చూసి.
అంతలో డైరెక్టరు నేరుగా వీళ్ల దగ్గరకు కంగారుగా వచ్చి ఏమైందని వాకబు చేసి, దానిలో తన తప్పు ఉండటంతో మారు మాట్లాడక "ఏదో ఒక డ్రస్ వేసుకుని రమ్మని" చెప్పి వెళ్ళిపోయాడు.
కాసేపటి తర్వాత మరో డ్రస్ వేసుకుని ముహూర్తం షాట్ కోసం రాగా, డైరెక్టర్ చెరో ప్రక్కన నలభయ్యేసి, వెనుక ఇరవై రోడ్ రోలర్లను ఉంచి మధ్యలో నూకరాజును నిలబెట్టి కెమెరాలోంచి చూసి వెంటనే కోపంతో క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టి రుసరుసలాడుతూ వచ్చి తన చైర్‌లో కూర్చున్నాడు.
యూనిట్ అంతా హడలిపోయారు. ఎవ్వరూ దగ్గరకు వెళ్లడానికి సాహసించలేకపోతే సుబ్బరాజు ధైర్యం చేసి వెళ్లి "ఏమైంది సార్?" అని అడిగాడు.
"నా తలకాయ్ అయ్యిందండి... నా తలకాయ్ అయ్యింది! ఫ్రేమ్‌లోకి మీ అబ్బాయి వస్తుంటే రోలర్లు కనిపించడం లేదు. రోలర్లు కనిపిస్తే వాటి మధ్య మీ అబ్బాయి కనిపించడం లేదు. ఏం చేయాలో తోచడం లేదు" అని కాసేపు మౌనం వహించి, "ఒక పని చేస్తాను.
ముందుగా మీ అబ్బాయి ముఖాన్ని క్లోజ్ అప్‌లో షూట్ చేసి, తరువాత వాటి మధ్య నిలబెట్టి రోలర్లనే హైలైట్ చేసి చూపిస్తాను.
ఆపైన మూడు ప్రక్కలా ఓ పది రోలర్లను బ్లాస్ట్ చేయిస్తాను. ఆ దుమ్ము ధూళి మధ్య హీరో నడుచుకుంటూ ప్రేక్షకులకు కనిపిస్తాడు. ఎలా ఉంది మీ అబ్బాయి ఇంట్రడక్షన్ సీను?" అంటూ గర్వంగా నవ్వుతూ సుబ్బరాజు ముఖంలోకి చూశాడు.
"మార్వెలస్ సార్... సూపర్బ్!" అన్నాడు సుబ్బరాజు వెలిగిపోతున్న ముఖంతో.
అనుకున్నట్టే బ్లాస్టింగ్ జరిగింది. తాటిచెట్టంత ఎత్తున దుమ్ము ఎగిసిపడింది. దాని మధ్యనుంచి నూకరాజు నడచి వస్తుంటే చూడాలని సుబ్బరాజు, షూట్ చేయాలని యూనిట్ అంతా ఎదురుచూస్తున్నారు ఆత్రుతగా. పైకెగిరిన దుమ్ము నేలను చేరింది కానీ నూకరాజు కనపడలేదు.
ఒక్కసారిగా అక్కడున్న వారంతా కంగారు పడుతూ గాలించారు. సుబ్బరాజైతే ఏడుపు లంకించుకున్నాడు.
కొంతమంది అతన్ని సముదాయించే పనిలో ఉండి, మరికొంత మంది చుట్టుప్రక్కలా, రోలర్ల మధ్యలోనూ వెతికారు. ఎట్టకేలకు వాళ్ల అన్వేషణ ఫలించి రెండు కిలోమీటర్ల అవతల పడిపోయి ఉన్నాడు.
నెమ్మదిగా తీసుకుని వచ్చి "అంత దూరం ఎందుకు వెళ్లావు?" అని అడిగాడు డైరెక్టరు.
"వెళ్లడమా! నా బొందా!! బ్లాస్టింగ్ వల్ల దుమ్ముతో పాటు నేను ఎగిరి అక్కడ పడ్డాను" అని చెప్పి ఎక్కిఎక్కి ఏడ్చేశాడు.
సుబ్బరాజు మనసులో ఎంతో బాధ ఉన్నా పైకి మాత్రం గంభీరంగా ఉండి కొడుకును హాస్పిటల్‌కు తీసుకువెళ్లే పనిలో పడ్డాడు.
================================
ఒక భారీ సినిమా - పార్ట్ 2 త్వరలో మీ ముందుకు వస్తుంది.
================================
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
***
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి










Comments