అర్ధాంగి

Ardhangi - Telugu Family emotional Stories | Nandyala Vijaya Lakshmi
అర్ధాంగి - తెలుగు కుటుంబ భావోద్వేగ కథలు | నంద్యాల విజయలక్ష్మి
Published in manatelugukathalu.com on 19/11/2026
అర్ధాంగి కథ భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, పరస్పర అవగాహన ఎంత ముఖ్యమో చెప్పే హృదయస్పర్శి కుటుంబ కథ. అనన్య సహనం, రఘులో వచ్చిన మార్పు దాంపత్య బంధానికి కొత్త అర్థాన్ని చూపిస్తాయి.
తరాలు మారినా అర్ధాంగి అనే పదముతో స్త్రీలు ఎప్పుడూ సగభాగం అనే నిజం మారలేదు.
అంటే స్త్రీలకు పూర్తి స్వేచ్ఛ, భావప్రకటనకు అధికారం అంతంతమాత్రమే. కాదని పెదవి విప్పితే సంసారం కల్లోలసాగరమే.
భారతీయ సగటు మహిళల జాబితాలో అనన్య కూడా చేరిపోయింది. కథ మామూలే.
సంసారం జీవనదిలా సాగిపోవాలంటే కొన్ని త్యాగాలు తప్పవు.
సహనమే శ్రీరామరక్ష అన్న నానుడి నేటి తరం వారికి నచ్చదు.
అందుకే సంసారాలు సజావుగా సాగక మనస్పర్థలు, విడాకుల కోసం దరఖాస్తులు మామూలు అయిపోయాయి.
ఆమె అప్సరస కాదు, అలా అని అనాకారి కాదు. సన్నజాజి నడుము లేకపోయినా ఆకర్షణీయమైన వదనము ఉంది. జీవితముపై గొంతెమ్మ కోరికలు లేవు.
కలలో విహరించదు. సామాన్యమైన జీవితము, తన ఇల్లు ప్రేమకు నిలయము కావాలి అనుకుంది.
సర్దుకుపోయే మనస్తత్వం, సంస్కారం ఆమెకు ఎనలేని ఆభరణాలు. ఎక్కడైనా, ఎలా ఉన్నా జీవితాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుకోగలననే ఆత్మవిశ్వాసం ఉన్నాయి.
ఆమెకు తల్లిదండ్రులు పెట్టిన పేరు అనన్య. పేరుకు ధీటుగా పెరిగింది. కాలముతో పాటు ఆమె మారలేదు. స్త్రీ జీవితములో జరిగే అద్భుతమైన మార్పు వివాహము.
ఆమె జీవితాన్ని అనుకోని రీతిలో ఈ కొత్త బంధం మార్చేసింది. పెళ్ళి అయిన తొలిరోజే “నీకు ఈ చీర ఏమీ బాగులేదు” అంటూ మొహం చిట్లించి చూసిన భర్త వైఖరికి నివ్వెరపోయింది.
అదే విషయము మృదువుగా “ఈ చీరలో కన్నా మొన్న మేము కొన్న చీరలో ఇంకా బాగుంటావు” అనచ్చు, కానీ అలాంటి సున్నిత భావ ప్రకటన అతనిలో లేదు అని తెలుసుకుంది. “వెళ్ళి చీర మార్చేయి” అన్నాడు రఘు.
“ఈ మనిషి మాట తీరు ఇదా?” అనుకుంది. ఏమీ మాట్లాడలేదు.
మర్నాడు పొద్దున్న “మా అమ్మా, చెల్లి వాళ్ళు వస్తారు. నవ్వుతూ నాలుగు రకాలు చేయి. రెండు స్వీట్లు తప్పకుండా చేయి. మా చెల్లికి స్వీట్లు అంటే చాలా ఇష్టం.
నాన్నకి మెత్తగా వండు” ఇలా చెప్పి వెళ్ళిపోయాడు సమాధానము కోసము ఎదురు చూడకుండా. అనన్య వింది. ఆప్యాయంగా “నువ్వు ఒక్కదానివీ చేయగలవా? నేను సాయం చేయనా?” అని ఒక మాట కూడా అనలేదు. తెల్లవారింది. సందడి మొదలైంది.
“ఏమ్మా కోడలా, కొంచెం ఒళ్ళు చేసినట్టు ఉన్నావే. నా మొహానా కొంచెము కాఫీ నీళ్ళు పోయి. మీ మామగారికి పండ్ల రసం, మా అమ్మాయికి హార్లిక్స్ తీసుకురా” అంది అత్తగారు అధికారంగా. అనన్యకు ఇవన్నీ కొత్త. తనను ఎవరూ అది చేయి అని శాసించలేదు.
వచ్చే కోపాన్ని తమాయించుకుంది. కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఇంతలోనే వాంతి అయింది. నీరసముగా ఉన్నా ఎలాగో అన్నీ వండి టేబుల్ మీద పెట్టింది.
ఇంతలో రఘు రావడము, అందరూ కబుర్లు చెప్పుకుంటూ చేసిన వంటలకు వంక పెడుతూ సణుక్కుంటూ ఎలాగో తినడం అయిందనిపించి కంచాలలో చేతులు కడుక్కున్నారు.
అలసిపోయి నీరసంగా పడుకున్న అనన్యని ఎవరూ లేపలేదు. ఏమిటీ ఈ మనుషులు? కోడలు అంటే ఒక పనిమనిషా వీళ్ళ దృష్టిలో! ఈ మనిషిని ఎలా మార్చాలి? ఆలోచిస్తూనే, తనూ కొంచెము తిని మిగిలిన పనులు చేసుకుంది.
ఇదే వరస వాళ్ళున్న రెండు రోజులు. మళ్ళీ నిశ్శబ్దం.
ఆ రోజు రఘు ఆఫీస్ నుండి తొందరగా వచ్చాడు. ఏదో సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు కనిపించాడు.
ఉదయము రఘు ఆఫీస్‌కి వెళ్లగానే తెలిసిన వార్త అతని సహోద్యోగి భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని. అందరూ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు.
ప్రేమించడము చేతకాని మూర్ఖుడిని ఎన్నాళ్లు భరిస్తుంది? తాగుబోతైనా, తిరుగుబోతైనా తరతరాలుగా స్త్రీ సహిస్తూనే ఉంది.
అన్నిటికన్నా ప్రేమరాహిత్యం మరీ నేరము.
అదృష్టవంతుడు. ఆమె తన చావుకు ఎవరూ కారణము కాదు అని రాసి చనిపోయింది. లేకపోతే భర్తను జైలులో పెట్టేవారు. అప్పుడే రఘు మొదటిసారిగా అనన్య గురించి ఆలోచించాడు.
ఆమె మంచిదే. తనే మూర్ఖుడిలా అహంకారం చూపబోయాడు. ఆమె మంచితనాన్ని చేతకానితనముగా తీసుకున్నాడు.
ఆమె ఎదిరించవచ్చు, లేచిపోవచ్చు, ఏమైనా చేయవచ్చు. అర్ధాంగి అనే పదానికి విలువనిచ్చి, వివాహ బంధాన్ని గౌరవిస్తూ సహనంతో తనతో ఉంటోంది.
రఘు ఇంటికి వస్తూనే “అనన్యా!” అంటూ ప్రేమగా పిలిచాడు. అనన్య ఆశ్చర్యంగా, కొంచెము సంకోచముతో అతని దగ్గరకు వెళ్ళింది.
అతను నాలుగు అడుగులు ముందుకు వేసి “నన్ను క్షమించు” అంటూ ఆమె చీర కొంగులో మొహం దాచుకున్నాడు. “ఎందుకు?” సందేహంగా అడిగింది.
“నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను, నాకే తెలియని విధంగా.” “ఏమిటా మాటలు? ఇవాళ మీరు కొత్తగా కనపడుతున్నారు” అంది అనన్య. “అవును నేను మారాను.
ఇకనుండీ నీకు ప్రేమను పంచే పతిని. నీ ప్రేమకోసము యాచించే బిచ్చగాడిని” అన్నాడు. ఆమె ప్రేమగా అతడిని దగ్గరకు తీసుకుంది. వెంటనే అతడు ఆమె ఒడిలోకి పసిపాప లాగా జారాడు. ఆమె నవ్వడం మొదలుపెట్టింది.
అతడు కూడా తన నవ్వును జోడించాడు. ఏముంది మామూలే, అతడు నవ్వితే ఆనందం. ఆలుమగల బంధము బలపడటానికి అర్ధాంగిదే ప్రధానపాత్ర.
సర్దుకుపోదాం అనే భావనతోనే ప్రశాంతత లభిస్తుందని అనన్య సంతృప్తిపడటము మొదలుపెట్టింది.
***
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
నంద్యాల విజయలక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నంద్యాల విజయలక్ష్మి
ఊరు. హైదరాబాదు
నేను ఎం.ఏ . ఆంగ్లసాహిత్యము బి.ఇ. డి చేసి ఆంగ్ల ఉపన్యాసకురాలిగా పని చేసి ఇప్పుడు విశ్రాంత జీవనము గడుపుతున్నాను. రెండు వందలపైగా కవితలు, మూడుకథానికలు రాసాను. యాభై పైగా సర్టిఫికెట్స్, సహస్రకవిమిత్ర బిరుదు పొందాను. పుస్తకపఠనము పై నాకు ఆసక్తి. విశ్వనాథసాహిత్యమునుండీ ఆధునిక రచయితలు పుస్తకాలు చదివాను. ఇంకా ఎన్నో చదవాలని కోరిక.










Comments