top of page
Original.png

అసలైన మఖానుబావుడు

అసలైన మఖానుబావుడు, అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము, తెలుగు కథ, గ్రామీణ జీవితం, మానవత్వం, జీవన తత్వం, గ్రామీణ విలువలు, స్ఫూర్తిదాయక కథ, తెలుగు సాహిత్యం, మంచి మనుషులు, జీవిత పాఠాలు, రామరాజు, గ్రామ సంస్కృతి, మానవ సంబంధాలు, తెలుగు కథలు

గ్రామీణ వాతావరణంలో కర్ర పట్టుకుని ఉన్న రామరాజు అనే వృద్ధుడు, అతని మాటలను శ్రద్ధగా వింటున్న యువ వైద్యుడు. జీవన జ్ఞానం, మానవత్వం మరియు గ్రామీణ విలువలను ప్రతిబింబించే దృశ్యం
గ్రామీణ వాతావరణంలో కర్ర పట్టుకుని ఉన్న రామరాజు అనే వృద్ధుడు, అతని మాటలను శ్రద్ధగా వింటున్న యువ వైద్యుడు. జీవన జ్ఞానం, మానవత్వం మరియు గ్రామీణ విలువలను ప్రతిబింబించే దృశ్యం

Asalaina Makhanubhavudu - Telugu Inspirational Story | Ayyala Somayajula Subrahmanyam 

అసలైన మఖానుబావుడు - తెలుగు ప్రేరణాత్మక కథ | అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత   

Published In manatelugukathalu.com On 13/06/2026


మన సమాజంలో నిజమైన మహానుభావులు ఎప్పుడూ పెద్ద పదవుల్లోనే ఉండరు. కొన్నిసార్లు వారు సాధారణ గ్రామీణ జీవితంలో, నిస్వార్థమైన మాటల్లో, సంతృప్తి నిండిన చిరునవ్వుల్లో కనిపిస్తారు. "అసలైన మఖానుబావుడు" కథ అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని మన ముందుకు తీసుకువస్తుంది. చదువు కంటే జీవిత జ్ఞానం గొప్పదని, సంపద కంటే మానవత్వం విలువైనదని, నిజమైన గౌరవం మన ప్రవర్తనలోనే ఉంటుందని ఈ కథ హృద్యంగా తెలియజేస్తుంది.


అప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటలు. తెనాలి నుండి కొల్లూరు వెళ్ళే బస్సులో కూర్చున్నాను. ఇంకా డ్రైవర్, కండక్టర్ రాలేదు. అసలు తెనాలి నుండి మా ఊరు వరాహపురానికి సరాసరి బస్సు ఉంది. కానీ అది రెండు గంటలకు అని తెనాలి ఎంక్వయిరీలో చెప్పారు.


ఈ రెండు గంటలు ఇక్కడ ఉండి చేసేదేముంది? కొల్లూరు బస్సులో వేమూరులో దిగితే ఏదో ఆటోరిక్షా ఎక్కి మా ఊరు వెళ్ళవచ్చు. ఇంకా గంటన్నర అయినా అదనంగా మా

అమ్మా నాన్నలతో గడిపినట్లుగా ఉంటుంది కదా అని బస్సు ఎక్కాను.


నిజానికి మా ఊరు వరాహపురమే గానీ, మా నాన్నగారు జిల్లా పరిషత్ ఉపాధ్యాయులుగా ఉండడం చేత తరచు బదిలీల వలన మా బాల్యమూ, చదువూ వేరే ఊళ్ళల్లోనే ఎక్కువగా గడిచిపోయింది. మా బామ్మ తాతయ్యలు వరాహపురంలోనే ఉండడం వలన పండుగలకు, సెలవులకు వస్తూ పోతుండేవాళ్ళం.


ఆ పిదప కాలేజీ చదువులు. ఎం.బి.బి.ఎస్. గుంటూరులోనే చదవడం, అప్పుడు మా నాన్నగారు పనిచేస్తున్న ఊళ్ళకు వెళ్ళడం.. మొత్తం మీద మా వరాహపురం మాకు పూర్తిగా తెలియదు. అక్కడ మాకు అయిదెకరాల పొలం, ఒక ఇల్లు ఉంది. మా నాన్నగారు రిటైరైన తరువాత వరాహపురంలో ఉంటున్నారు గనుక ఒక ఆదివారం వాళ్ళను చూసొద్దామని బయలుదేరాను.


మా ఊరిలో ఓ కూలిపోయిన జమీందార్ బంగళా ఉండేది. వ్యవసాయ పనులు లేని తరుణంలో పెద్దా చిన్నా

పేకాడుకుంటూనో, జనపనార తాళ్ళు పేనుకుంటూనో ఆ అరుగుల మీద కూర్చునేవాళ్ళు. 


“ఇదే నా అండీ రావడం” అని వాళ్ళడగడం. 

“ఆ ఇదే” అని ఆటోలో ఉండే సమాధానం ఇవ్వడం.

“రెండు రోజులుంటారా?” అని వాళ్ళడగడం. 

“లేదు. రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతున్నాను” అని నేను చెప్పడం మామూలు.


డాక్టర్ని గనుక, అవునన్న కాసేపటిలోనే అవసరాన్ని బట్టి ముగ్గురో నలుగురో వైద్య సలహాల నిమిత్తం వస్తుండేవాళ్ళు.


డ్రైవర్ కండక్టర్ బస్సు ఎక్కారు. బస్సు కదిలింది. 

అప్పుడు నాకొక అనుమానం కలిగింది. తీరా వేమూరులో ఆటోరిక్షాలు లేకపోతే; భోజనాల వేళయిందని ఆటోవాళ్ళు రారేమో; లేక పనుల తరుణం కదా, వరాహపురానికి బస్సు పడ్డ తరువాత ఇంతకంటే పొలం పనికి వెళితేనే గిట్టుబాటు అని ఆటోరిక్షా వాళ్ళు కూడా పొలం పనికి వెళతారేమో; అంతకంటే పెద్ద సమస్య అప్పటికి లేదు. గనుక ఆ ఆలోచనలోనే మునిగిపోయాను. నా వెనుక కండక్టర్ వచ్చినట్లున్నాడు.

“ఏ ఊరు” కండక్టర్ అడుగుతున్నాడు. 


“వేమూరు” సమాధానం.


“పదిహేనియ్యి” కండక్టర్. 


“ఆ ఎనక సీట్లో అదిగో ‘మఖారాణి’ (మహారాణి) ఉందిగా, టిక్కెట్టులు కొట్టించలా?”


‘మఖరాణి’ - నాకు ఆసక్తితో పాటు కొంచెం నవ్వు వచ్చింది. వెనక్కి తిరిగి చూశాను. బాగా వెనక సీట్లో కూర్చున్న ఒకామె “మూడు టిక్కెట్టులు తెంపించితినే. నాకు, ఆ ముసలాయనకూ, అడుగో అక్కడ నిలబడ్డారే బిడ్డల్ని ఎత్తుకొని, దానికే” అని అంది.


వెనుక సీట్లో ఉన్న ముసలాయనకు డెబ్బయి అయిదేళ్ళుంటాయి. మనిషి గట్టిగానే ఉన్నాడు.

నల్లనిముఖం మీద, కొంచెం పెరిగిన గడ్డం, తెల్లని కనుబొమ్మలు, ముఖానికి బాగానే అమరినట్టున్నాయి. చేతికర్ర మాత్రం ఆయన సీటు పక్కనే కింద పెట్టి ఉంది. 


“ఇదిగో పిల్లా; అట్టా బిడ్డనెత్తుకుని నిలబడే బదులు ఆ సీటు మీద ఇద్దరే గదా కూకుంది. అల్లిద్దరినీ కూసింత జరగమను. మరి బొత్తిగ నోట్లో నాలిక లేకుంటే యట్టాగే?” అని ఆ సీటుపై

కూర్చున్న వాళ్ళతో “కూసింత జరగండమ్మ. బిడ్డని ఎత్తుకు యెట్టా నిలబడుద్దీ?” అన్నాడు.

 

వాళ్ళూ సరుదుకు కూర్చున్నారు. ఆ బిడ్డ తల్లి ఒదిగి కూర్చుంది. 

వెనక సీట్లో సంభాషణ మొదలయింది.


“శానా కాలానికి కలిశావురా అల్లుడా; ఆ ఇప్పుడు సెప్పు. ఏంది సెప్తున్నావు? అమ్మ అయ్య జరిగిపోయారా?”


“మూడేళ్ళయింది మావా; మా కడగొట్టు తమ్ముడి పెళ్ళి సేసి, నాలుగయిదు నెలల తేడాతో పెళ్ళయిన ఏడాదిలోనే కాలం చేశారు;” ఆ రెండో వ్యక్తి మాటల్లో కాస్త నాగరీకం కనిపిస్తున్నది.

 

“అయితే బరువు బంధాలన్నీ దించుకున్నాక నన్నమాట. పోనీలే, దిగుల్లేదు. మీ అయ్య నాకంటే మూడు నాలుగేళ్ళు పెద్దాడనుకుంటా. సిన్నప్పుడు ఆడకొచ్చినప్పటి నుంచి సావాసగాళ్ళమే. ఎప్పటికైనా యెల్లిపోవలసినోళ్ళమే గదా; అయినా అల్లుడా.. జంటలో ఒకల్లుండి ఒకల్లు పోతే దిగులుపడాల. నిజం సెప్పమంటావా: అసలు ఈ వొయిసులోనేరా తోడూ జోడూ కావలసింది; మంచి వొయిసు మీదున్నప్పుడు యెట్టా అయినా జరిగిపోద్ది;” అంటూ బిగ్గరగా నవ్వాడు. 


వాళ్ళిద్దరూ బస్సులో ఉన్నది తామిద్దరే అయినట్టు, ఎవరేమనుకుంటారో అన్న ఆలోచన లేకుండా బిగ్గరగా మాట్లాడుకుంటున్నారు.


“అది సరేగానీ మావా, వరాహపురానికి సరాసరి బస్సుందిగా, ఇదెందుకెక్కావు?”

“ఉందిగానీ అల్లుడా, ఇంకా రెండు గంటలకు గానీ రాదంట. ఇక్కడ ఈ బస్సు టేషన్ లో కూకునే బదులు ఏలూరిలో దిగి నాలుగడుగులేత్తే సరి. యిప్పడయితే బస్సులయి వచ్చినయి గానీ, నాకు పాతికేళ్ళున్నప్పుడు అట్టగా మోకాటి లోతు బంకనేల బురదలో లాక్కుంటూ, పీక్కుంటూ నడిచేటోల్లమే గదా;”


“అప్పుడు సరే, ఇప్పుడు ముసిలోడివి గదా?”


“ఎంత ముసిలోన్నయినా ఆ మాత్రం నడవలేనంత గాలేదులే;” అని తన కర్రను చూస్తూ “ఈ మూడో కాలి ఉండాలి కానీ, మూడు మైళ్ళైనా వడిగానే నడుత్తా;” అంటూ మళ్ళీ నవ్వు.


“అయినా వరాహపురం బస్సులో జేరినా మళ్ళీ మా పల్లెకే. ఇందులో సగం దూరం యెటూ నడవొలిసింది. అడ్డంబడి యెల్తే అంతే అవుద్ది” ముసలాయన సమాధానం.


నా సమస్యకు పరిష్కారం చెప్పాడనిపించింది. నిజమే, రెండు మూడు కిలోమీటర్లు నడవలేమా? రోజూ మార్నింగ్ వాక్ కు యింతకంటే కొంచెం యెక్కువే నడవడం లేదా? ఇప్పుడు మధ్యాహ్నమే అయినా మబ్బులు పట్టి వాతావరణం చల్లగా ఉంది. నడవలేక కాదు, ఇప్పటి హోదా అట్టా నడవనివ్వదు.


వెనకసీటులో మళ్ళీ బిగ్గరగా సంభాషణ: “మావా.. అసలు మీ ఊరు వరాహపురం గాదంటగా, మా అయ్య చెప్పేవోడు.”


“కాదంటే కాదు, అవునంటే అవును. మా తాత, మా నాయన సిన్నతనాన పొట్ట సేత్తో పట్టుకొని అదే పరమట మాసర్ల నుండి వరాహపురం వలసవచ్చిండట; ఎందుకనో ఇప్పటికీ”


“యెప్పుడయినా పానం అటు గుంజుతుంటది. మనోళ్ళు ఆడనే ఉన్నరు గదా అని అనిపిస్తది. నేను వరాహపురంలోనే పుట్టి పెరిగినా ఊగ తెలిసింది, సిన్నతనాన ఆడింది”


“పాడింది, బువ్వ సంపాయించటం నేర్పింది, బువ్వ తింటున్నదా యీడనే;”


“అయితే ఇక్కడనే నా ఊరంటూ వుండిపోవడమేనా?”


“అంతేరా అల్లుడా; నాది అని సెప్పుకునేందుకే ఆ ఊర్లో కుంటభూమి, సెంటునేల, ఒక గుడిసె యేదీలేనోణ్ణి. ఏ ఊరు నీకంటే యేమని సెప్పాల? ఇంత బువ్వ కూడ దొరకని ఊరు వానికి వుండేం లేకేం?”


“ఎంత నగ్నసత్యం. ఎంత సాదాసీదాగా చెప్పాడు; ఊరే లేనివాడికి దేశం మాత్రం యేముంటుంది; అందుకే రెక్కలు తప్ప కష్టం చేసుకుని కడుపు నింపుకోలేని వారికి ఎక్కడైనా ఒకటేకదా; అర్థశాస్త్రాన్ని అవుపోశణ పట్టేశాడు.”


“ఏందే పిల్లా, అట్టా వొల్లుమరిచి కునుకు తీత్తన్నావ్? చేతిలో పిల్ల జారిపోద్ది. జాగరత్తగా కూకో; అంత ఆపుకోలేకపోతే ఆ సంటిదాన్ని నాకియ్యి” అంటూ కోడలిని మందలిస్తున్న ముసలాయన మందలింపుతో మళ్ళీ బస్సు లోకం లోకి వచ్చాను. ఆ బిడ్డతల్లి ‘ఒద్దులే’ అంటూ సర్దుకు కూర్చుంది.


“పెద్దొలిద్దరికీ అప్పసెల్లల పిల్లలనే జేసుకున్నా; మూడోవాడికి మా తమ్ముడి మనవరాలినే జేసుకున్నా; ఇదిగో యిదే ఆ పిల్ల; అమరతలూరిచ్చినా అల్లుడు శానా మంచోడు. పిల్లని పానంగా చూసుకుంటాడు.”

 

“అంతేలే మావా; అంతకన్న ఆడపిల్లను కన్నాళ్ళకు కావలసిందేముంది?”


“ అదిసరే ఎవురిది వాళ్ళకి పంచిచ్చినావా?”


“నేనిచ్చేదేముంది? ఆల్లే తలా యెకరా దీసుకుని మా ముసల్దానికి, నాకు ఎకరం, మా గుడిసె అట్టేపెట్టారు. ముగ్గురు కూడ పూరిల్లయినా సౌకర్యంగా యేసుకున్నారు. మా అయ్య యెకరంన్నర వదిలిపోయిండు. మా రెక్కల కట్టంమీదనే ఇంకో రెండున్నర కొనుక్కున్నాం. మా యత్త తెలివిగలది. ఇద్దరు మగాల్ల కట్టం జేసుద్ది.” అంటున్న ముసలాయన వైపు చూశాను.


ఒక విధమైన సంతృప్తితో గంభీరంగా, హాయిగా కనిపించింది.

“మరలా మా ఊర్లో ఎకరం ఎంత జేసుద్ది?”


“ఐదన్నా అమ్మేటోడు లేడు; అయినా యియాల రేత్రి లచ్చంటే లెక్కేముందిలే. ముప్పై యెల్లకాడ ఏభై వేలు పెట్టి ఎకరం కొనాలంటే శాన మదనపడిన; సేతిలో ముప్పై వేలున్నయి. ఇంకో ఇరవైవేలు యాడ అప్పు తేవాల, అప్పెట్ట దీర్చాల అని.”


“ఆరోజులు గామట్టే కొన్నావు. ఈ రోజుల్లో అయితే కొనగలవా?”


“నా కట్టా అనిపించదురా అల్లుడా; ఆ మాట కొత్తే అప్పుడు బత్తా దాన్నెం యెందుండేది.. మగా అయితే నాలుగొందలు పై మాటేగదా;”


“నువ్వెన్నైనా జెప్పు మావా; ఎట్టా అయినా ఆ రోజులే వేరు;”


“నే నొప్పుకోనురా అల్లడా; అప్పుడుండే కట్టం సుఖం అప్పుడు లేవా? వుప్పుడుండే కట్టం సుకం వుప్పుడూ ఉన్నాయి; అంతెందుకురా, ఆ రోజుల్లో ఒక సలిజరమో, మసూచికమో తగులుకున్నదంటే ఊల్లే మాయమయ్యేవి. ఇప్పుడు కరోనా కూడా అట్టనే.”


“అయితే అత్తా నువ్వూ కట్టం జేత్తానే ఉంటారా యింక?”


“కట్టం సేయమనె కదరా బగమంతుడు మడుసుల్ని లోకంలోకి పంపింది?”


“అయినా వుప్పుడు మగోల్లు మొనగాన్లయినరుగా; ఆల్లే యెగసాయం అదీ జేసి పెడతంటారు. ఎప్పుడైనా మీ అత్తకు నలతగా ఉంటే కోడల్లే కూరో నారో శారో సేసి, వన్నెం వండి పంపిత్తుంటారు. కాలం కలిసొచ్చి వొల్లు దగ్గర బెట్టుకుని, శ్రద్ధగా సంటిపిల్లను సాకినట్టు సాకితే, ఎకరాకి ఏబైబత్తాలు వడ్లు, ఐదు బత్తాలు మినుములు అవుతాయి.”


“అయితే మావా అంతా సౌక్యంగానే వుందంటావు”


“అంతెక్కడరా అల్లుడా; మనం ఎవోరి దగ్గరా సెయ్యి సాపకుండా గీరకంగా బతుకుతా ఉంటా, యెవురైనా ఆకలి అని వాకిట ముందుకొత్తే ముద్దన్నం పెట్టగలిగితే సాలు యేవంటావు?”


“అయన్నీయేంది గానీ పిల్లగాల్లురా; నా మనవలు, అచ్చం సిన్ని కిట్టయ్యవే అనుకో; అల్ల అల్లరి, ఆటలు సూత్తావుంటే తాతగానోడి బతుకు దండగనిపిత్తదిరా; అదీ కావలసింది. అంతకన్నా యే గొప్పోడు మాత్తరం ఏం ఘనకార్యం సేత్తరు;”


ఇంతలో ఆ ముసలయ్య మనవరాలు యెందుకో ఏడవసాగింది. కోడలు ఆ పిల్ల ఏడుపు మానిపించేందుకు తంటాలు పడుతున్నది.


“ఏందే పిల్లా అట్టా సూత్తావు? రొమ్ము దాన్ని నోట్లో బెట్టు.”


ఆ కోడలు పిల్ల సిగ్గుతో తటపటాయిస్తోంది.


“ఓహో, బస్సు అని సిగ్గా? ఈ బస్సులో ఉన్నాళ్ళలో తల్లి పాలు తాగని వోల్వెవరో జెప్పమని!” అని గదమాయించి, తల్లిపాలంటే గురుతొచ్చింది అన్నట్టు “అల్లుడా, పటమటన కరెంట్ తో యెగసాయమే గదా;”


“అవునే మావా”;


“సేనుకయినా సెట్టుకయినా అంతేరా. బగమంతుడు దయ జూసి మబ్బులకు సిల్లుపడి వర్షాలు కురిసావే; యెంతయినా తల్లిపాలు తల్లిపాలే, పోతావు పోతపాలే.”


“నిజమే మాకాడ వర్షాలు సరిగా పడవు. మరి ఏంజేత్తాం, ఈ యేడు పరవాలేదనుకో.”


“అదెలా? వానదేవుడు పార్టీలు మారుతున్నాడటగా; మన ముఖ్యమంత్రి సెవుతున్నాడు. ఆమద్దన మా సిన్నాడు ఒక సిన్న బొమ్మల పెట్టి కొనుకొచ్చి యింట్లో పెట్టాడు” (టీవీ సెట్) అంటూ బిగ్గరగా నవ్వాడు ఆ ముసలాయన.


“ఆయన్నీ రాజకీయాలులే మావా మనకెందుకు?”


“ఉప్పుడు సూత్తంటే అట్టనే ఉందనుకో. మా సిన్నతనాన గాంధీగోరంటే యెంత బక్తి.. ఆయన్ను సూసేందుకే నాకు పదేళ్ళప్పుడు మా పిల్లలం పెద్దలం తెనాలి దాకా నడిచే”

పోయింది. అదీ రాజకీయం అంటే; ఆయన మఖానుభావుడు. మా పాతికేళ్ళప్పుడు వావిలాల గోపాలకిట్టయ్య; ఆయన కూడా మఖానుబావుడే; ఆయనంటే గాంధీగారంత కాకపోయినా శానా వూపుండేది. గొప్ప మడిసి. మరి రామారావొచ్చిండు, అదొక జాతర.

రాజకీయాలంటే అయిరా; వుప్పుడు అందరందరే ననుకో”; 

మాట పూర్తి కాకుండానే,

 

“వేమూరు దగ్గర కొచ్చాం. చెప్పుకున్న కబుర్లు చాలుగానీ, దిగి మెల్లిగా తలుపు దగ్గరకు రా ముసలయ్యా; వేమూరులోనేగా దిగేది?” అని కండక్టర్ హెచ్చరించాడు.


“దిగుతాన్లే అయ్యా; నన్ను దించకుండానే కొల్లూరు బస్సు లాగిత్తావా” అంటూ లేచి వంగి కింద కర్రను అందుకుంటూ,

“ఇదిగో అమ్మాయి, బస్సు ఆగేటప్పుడు కుదుపుద్ది; సంకలో పిల్లుంది. అడావుడీ లేదు, బస్సు ఆగినంక నింపాదిగా దిగు” అంటూ కోడలిని హెచ్చరించాడు.


ఆ పక్కనున్నాయన “మెల్లిగా దిగుతావా? అసలే పెద్దోడివి, యే కాలో యే సెయ్యో..” అని అన్నాడు.


“అట్టా జరగాలనుంటే ఆరోజే మనం ఆగమన్నా ఆగుద్దా?”


“ఒకసారి మనేపుకు రారాదంటే మావా?”


“వొద్దామనే ఉంటదిరా; ఏదీ, నార్లు పోశామా, నాట్లు, కలుపులు, మందులు, యెరువులు, నీళ్ళు కొట్టుకోవడం, కోతలు, కుప్పలు, నూర్పిళ్ళు, ఆపై మినుములు జల్లుకోడం - ఈ రంగుల రాట్నం యిట్టూ తిరుగుతనే ఉంటుంది; అయినా యీలు సూసుకుని ఒకసారి నేనూ మీ అత్తా వత్తాములే” అంటున్నాడు.


అక్కడ ఒక ఆటో రిక్షా ఆగి ఉంది. బస్సు దిగి నేను వెళ్ళి “వరాహపురం వస్తావా?” అని అడుగుతున్నాను. ఆ కర్ర పోటేసుకుంటూ ఆ ముసలయ్య నా దగ్గరకొచ్చాడు.

“వరాహపురమా.. ఎవురి తాలూకు తమరు?”


“రాఘవమ్మ గారి మనవణ్ణి” - నా దృష్టిలో మా నాయనమ్మే చాలా పేరున్న మనిషని (పాపులర్ అని).


“అట్టా సెప్పు. అయితే అడ్డాది రంగయ్యగారి మనవడివంటయ్యా తమరూ? పెద్దాయనవా, సిన్నాయనవా? ఇద్దరూ డాట్టర్లేనంట గదా;”


“పెద్దవాణ్ణే.”


“ఓసోసి; అయితే వరదయ్యగారివన్నమాట; సెప్పుకోంగా యినడవే గానీ వుప్పుడే పెత్తెచ్చంగా సూడడం. నీకు మంచి మంచోడివని, మంచి డాట్టరువని శానా పేరుందయ్యా. ఏ మాటకామాటే సెప్పుకోవాలి. ఇదంతా మీ తాతగారు సేసుకున్న పూజల పలమేనయ్యా.


ఆయన చేతిలో మనూరి దేవాలయంలో సివలింగం సగం అరిగిందటయ్య. పిల్లలు లేకపోతేనేం, మీ నాన్నగారిని దత్తు తెచ్చుకుని ఆయనకు గంపెడు సంసారం అయింది. అంతా గవురవంగా బతుకుతా మంచి మడుసులని పేరు దెచ్చుకుంటున్నారు.”


మీ తాతగారు రంగయ్య గారు ‘మఖానుభావుడు’. తాతగారికి తగ్గ... అని ఏదో అనబోతున్నాడు. నేనే ఆ పొగడ్తల ధోరణి మారుద్దామని.

“ఇందాక ‘మఖారాణి ‘..” 


“అవునయ్యా మా ముసల్ది నా మేనమామ కూతురే. దానికి ఆల్లయ్య తెల్లాళ్ళ రానీ పేరు”

‘ఎలిజబెత్ రానీ’ అని పేరు పెట్టుకున్నాడు. దాన్నే నేను ‘మఖారాణీ’ అంటుంటా. 

అది మఖరానీ కావటంతో నేను మగరాజునయిన; వుప్పుడంతా మనూళ్ళో నన్ను “రామరాజు” అంటారు.


అది మఖరానీ గావటంతో నేను మగరాజునయిన. ; వుప్పుడంతా మనూళ్ళో నన్ను “రామరాజు” అంటారు, రామయ్యనయితే.” అని నవ్వి,

“ఏమీ అనుకోబాకండి యిట్టా అడిగానని. తమరు మా పేరున్న డాట్టరుగారు సంతోషమే; ఆ వైద్దగం ఏదో మనోళ్ళకి సెయ్యరాదయ్యా. పుట్టినూరు కన్నతల్లి సమానమంటారు”

అన్నాడు. 


ఆ ఊహించని ప్రశ్నకు ఏం చెప్పాలో అని కంగారు పడుతున్నాను.


మళ్ళీ రామరాజు “ఏదో అట్టా అడగాలనిపించి అడిగానయ్యా. మీకున్న యిబ్బందులేవో మీకు ఉండేవంటాయి. అయినా ఆ ఏమన అన్నట్టు ఎవురైనా మెతుకు బంగారం మింగరు గదా బాబూ. అందులోనూ తమరు పేదోళ్ళంటే వల్లమాలిన అభిమానంగా సూత్తారంట. మా పల్లెలో అందరూ సెప్పుకుంటారు” అని ముగించాడు.


మా ఇరివురిది వరాహపురమే; ఈ రామరాజును గురించి గానీ అతని కుటుంబం గురించి గానీ నాకేమీ తెలియదు. కానీ ఈ రామరాజుకు మా వంశవృక్షం మొత్తం తెలుసు. నేను

చదువుకున్న వాణ్ణి, నాగరీకుణ్ణి. రామరాజు ఏమీ చదువుకోలేదు, అనాగరికుడు. నాకున్నట్టి పరిసరాలలో ఉన్న అన్నింటిపై రామరాజుకు సొంత అభిప్రాయాలున్నాయి. ఉండటమే కాదు, వాటిని స్వేచ్ఛగా వ్యక్తీకరిస్తున్నాడు కదా;


దాచుకోవడం, భావాలకు ముసుగులేయడం తెలియని “అనాగరికుడు”. ప్రపంచం పోకడలు తెలిసి కూడా సంతృప్తిగా, సంతోషంగా జీవిస్తున్నాడు;


ఒక విద్యలో (అదీ చదువు విద్యలో) తప్ప అన్నింటా నా కంటే పెద్దవాడు. అయినా నన్ను గౌరవిస్తున్నాడు. అన్నిటికి మించి ఏ సంకోచాలూ లేకుండా, శషబిషలు చూపెట్టకుండా నాకు కర్తవ్య బోధ చేశాడు;


నిజమైన మహానుభావుడు; రామరాజు ఉచ్చారణలో చెప్పాలంటే నిజమైన అసలైన “మఖానుబావుడు”.


——————————————శుభంభూయాత్‌————————————————


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి,మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page