top of page
Original.png

ఆస్తుల రక్షణ భారమేనా?


ఆస్తుల రక్షణ గురించి ఆలోచిస్తున్న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి విశ్వనాథం తన భార్యతో కలిసి ఆస్తి పత్రాలను పరిశీలిస్తున్న దృశ్యం.

Aasthula Rakshana Baaramena? - Telugu Social Story | B. N. Satyanarayana

ఆస్తుల రక్షణ భారమేనా? - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 08/09/2026


ఆస్తులు సంపాదించడం ఒక ఎత్తయితే, వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా పదవీ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవించాలనుకునే వారికి ఆస్తుల నిర్వహణ, కుటుంబ భద్రత, భవిష్యత్తు గురించి ఆలోచించడం ఎంతో అవసరం. ఈ నేపథ్యంలో “ఆస్తుల రక్షణ భారమేనా?” అనే తెలుగు సామాజిక సందేశ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది.


విశ్వనాథం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయ్యాడు. అతడు సర్వీస్‌లో ఉండగానే హైదరాబాద్‌లో ఒక ఇల్లు కొనుక్కొని అక్కడే స్థిరపడ్డాడు. అతడి స్వస్థలం ఏలూరు. అక్కడ తండ్రిగారి ద్వారా ఆరు ఎకరాల మాగాణి, ఒక ఇల్లు అతడికి సంక్రమించాయి. విశ్వనాథం ఆ భూమిని ముగ్గురు రైతులకు కౌలుకు ఇచ్చి, వచ్చిపోయేటప్పుడు ఉండేందుకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఇంటిని మాత్రం తన దగ్గరే ఉంచుకున్నాడు.


అతడి భార్య ఒక సాధారణ గృహిణి, పేరు విమల. వారికి ముగ్గురు కుమార్తెలు. ఆ ముగ్గురికి వివాహాలు జరిగిపోయాయి. ఇద్దరు అమ్మాయిలైతే అమెరికాలోనూ, ఒక అమ్మాయి న్యూజిలాండ్‌లోనూ ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాలతో సహా అక్కడే స్థిరపడిపోయారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకమారు వచ్చి తల్లిదండ్రులను చూసేందుకు కాలెండర్ పెట్టుకున్నారు.


విశ్వనాథం సాయంత్రం అయ్యేసరికి మిత్రులతో కూడి వాకింగ్ చేస్తూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ తన విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా గడుపుతున్నాడు.


అయితే ఇప్పుడు అనుకోకుండా అతడికొక పెద్ద సమస్యే వచ్చిపడింది. తన భూమిని కౌలు చేస్తున్న రైతుల్లో ఒకడికి దుర్బుద్ధి పుట్టి తాను కౌలు చేస్తున్న భూమి తనదేనంటూ అతడు ప్రచారం చేసుకుంటున్నాడని, జాగ్రత్తపడమని తన బంధువుల నుండి విశ్వనాథానికి కబుర్లు రాసాగేయి.


దాంతో అతడిలో ఆందోళన మొదలయింది. ఉక్కిరిబిక్కిరి కాసాగేడు. తానా ఒంటరివాడు. ఇప్పుడు తనకెప్పుడూ ఎదురుకానటువంటి ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో అతడికి తెలియడం లేదు. పిల్లల్ని సంప్రదించాడు. "డాడీ! ఈ విషయాలు మాకు ఏమీ తెలవవు. మీకు ఏది మంచిది అనిపిస్తే అది చేయండి. మాకు ఎటువంటి అభ్యంతరాలు ఉండవు" అని చెప్పడంతో మిత్రులతోనే ఈ విషయమై సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం మంచిది అని భావించాడు. ఆరోజు సాయంత్రమే తాను ఎదుర్కొంటున్న సమస్యను వారి ముందుంచి సలహాలు కోరాడు.


మిత్రులు తలోరకంగా తమకు తోచిన సలహాలు ఇవ్వసాగేరు. అందులో ఒక మిత్రుడికి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. అతడు విశ్వనాథానికి కంగారుపడవద్దని చెప్పి, ఇటువంటి లిటిగేషన్లు సులభంగా పరిష్కరించేవారు కొందరు ఉన్నారు. అటువంటి వారిలో ఒకరిని నీకు కలుపుతాను. అతడిని కలువు. నీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి ఒక అడ్రసు ఇచ్చి అతడిని కలుసుకోవాల్సిందిగా సలహా ఇచ్చాడు.


విశ్వనాథానికి ఆ మిత్రుడు ఇచ్చిన సలహా నచ్చింది. భార్యతో చర్చించాడు. ఆమె కూడా బాగుంది అనడంలో విశ్వనాథం మిత్రుడు ఇచ్చిన అడ్రసుకు వెళ్లి ఆ వ్యక్తిని కలిశాడు. విషయం విపులంగా వివరించాడు.


అంతా విన్న అతడు ఆ భూమిని తానే కొనుక్కుంటానని తెలియజేస్తూ, "విశ్వనాథం గారూ! ఇటువంటి గొడవల్లో ఉన్న భూముల్ని మేము సగం ధరలకే కొంటూ ఉంటాం. ఎందుకంటే వాటిని స్వాధీనం చేసుకోవడం విషయంలో మాకు డబ్బు ఎక్కువగా ఖర్చు అవుతుంది. పైగా అప్పుడప్పుడు రాజకీయాలను ఆశ్రయించవలసి వస్తుంది. ఇటువంటి విషయాలలో మా ఇబ్బందులు మాకు ఉంటాయి. కాబట్టి ఆలోచించుకొని చెప్పండి. మీరు సరేనంటే మనం ఈ డీల్ కుదుర్చుకుందాం. ఇందులో ఎటువంటి మొహమాటాలు వద్దు. మీకు ఇష్టమైతేనే ముందుకు పోదాం" అంటూ అతడు సూటిగా చెప్పడంతో విశ్వనాథం ఇక ఏమీ ఆలోచించాలనుకోలేదు.


తన అంగీకారం తెలియజేసి, "మీ వైపు నుండి అన్ని పనులు పూర్తి కాగానే నాకు ఫోన్ చేయండి. రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసుకుందాం" అని చెప్పి విశ్వనాథం లేచి అతడికి నమస్కారం చేసి తన ఇంటికి బయలుదేరాడు. అప్పటికి విశ్వనాథానికి గుండె తేలికపడినట్లు అయింది.


ఒప్పందం కుదిరిన పది రోజులకే, "విశ్వనాథం గారూ! రండి, రిజిస్ట్రేషన్ పనులు పూర్తి చేసుకుందాం" అంటూ ఆ వ్యక్తి నుండి ఫోన్ రావడంతో విశ్వనాథం భార్యతో సహా వెళ్లి రిజిస్ట్రేషన్ పనులు అన్నీ పూర్తి చేసేసి, వచ్చిన డబ్బు మొత్తం తీసుకుని భార్యతో కలిసి ఇంటికి చేరుకున్నాడు.


అయితే ఇప్పుడు విశ్వనాథానికి మరో భయం పట్టుకుంది. ఈ రైతులాగే మిగిలిన ఇద్దరు రైతులు ఏవైనా ఇబ్బందులు కలగజేస్తే, అప్పుడు తానేమి చేయాలి? ఇప్పటిలాగానే మరలా డబ్బు నష్టపోవాలా? అనే సంశయం అతడిలో తలెత్తింది.


"లేదు, ఏదో సరియైన పరిష్కారం వెదకాలి" అనుకున్నాడు.


ఆలోచించసాగేడు. ఆలోచించగా ఆలోచించగా అతడికొక ఆలోచన తట్టింది. తానా ఒంటరివాడు. ఈ పరిస్థితుల్లో ఆస్తులు కాపాడుకోవడం కష్టమేనని తెలిసి రావడంతో మిగిలిన భూమినీ అమ్మివేయడమే మంచిది అనే నిర్ణయానికి వచ్చాడు. ఆ విషయాన్నే భార్యతో చెప్పాడు. ఆమె తొలుత అంగీకరించలేదు. అయితే అమ్మకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, నష్టం గురించి ఆమెకు తెలియజెప్పడంతో ఆమె కూడా ఒప్పుకుంది.

విశ్వనాథం ఆలోచనలు పరిపరివిధాలుగా సాగసాగేయి.


వచ్చే ఆ డబ్బుతో ఏంచేయాలి? ఆ డబ్బుని ఎలా వినియోగించాలి? అని. హైదరాబాద్‌లోనే ఆస్తులేమైనా కొంటే ఎలా ఉంటుంది? అని లెక్కలు కట్టాడు. అయితే అది కూడా తలకు రోకలిబండ చుట్టుకోవడమే అవుతుందని, వాటి రక్షణా గాలిలో దీపమే అవుతుందని గ్రహించి ఆ ఆలోచన విరమించుకున్నాడు.


అలా ఆలోచించి కడకు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ డబ్బును ఆస్తుల్లో కాకుండా ఏ బ్యాంకుల్లోనో మ్యూచువల్ ఫండ్స్‌లోనో ఇన్వెస్ట్ చేయడమే ఉత్తమమని నిర్ధారించుకున్నాడు. తన తదనంతరం భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ డబ్బు తన పిల్లలకు చేరుతుంది అని దృఢంగా విశ్వసించాడు.


ఇప్పుడు ఆ భూమిని ఎలా అమ్మాలి? అని ఆలోచించుకుని పేపర్ ప్రకటన ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. అనుకున్న తడవుగానే పేపర్ ప్రకటన ఇచ్చాడు.


భూమిని అమ్మివేయనున్నాననే విషయం ముందుగా కౌలు రైతులకు చెప్పడం తన ధర్మంగా భావించి రైతులిద్దరినీ కలిసి, విషయం చెప్పి వారిని భూమి ఖాళీ చేయవలసిందిగా చెప్పి, వారికి సంతోషం కలిగేలా వారు కోరకపోయినా కొంత డబ్బును వారికి ఇచ్చి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు.


పేపర్ ప్రకటన చూసిన కొందరు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. అపార్ట్‌మెంట్లు కట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నామని కొందరు అంటే, వ్యవసాయమే చేయాలనుకుంటున్నామని మరికొందరు అంటుంటే, వేరొకరు మాత్రం అక్కడ ఒక పరిశ్రమ పెట్టాలనుకుంటున్నాం అని—ఇలా ఒకటేపనిగా ఫోన్లు రాసాగాయి.

విశ్వనాథం ఎవరికమ్మితే లాభదాయకంగా ఉంటుందోనని ఆలోచించసాగాడు.

కడకు పరిశ్రమ పెడతానన్న వానికే తన భూమిని అమ్మాలని నిశ్చయానికి వచ్చాడు.


ఎందుకంటే తమ పట్టణంలో ఒక పరిశ్రమ వస్తే కనీసం పట్టణంలో కొంతమంది యువతకైనా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి లభిస్తుందని, అందుకు తన ఈ నిర్ణయం కొంతైనా దోహదకారి అవుతుందని, తనకూ కొంత సంతృప్తి మిగులుతుందని భావించి, పరిశ్రమ పెట్టాలనుకునే వారితో సంప్రదింపులు జరిపాడు. ఒప్పందం కుదుర్చుకున్నాడు.


రిజిస్ట్రేషన్ వగైరాలు పూర్తి అయ్యాక వచ్చిన ఆ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు.


తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ బ్యాంకుకు వెళ్లారు. డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేశారు.

తమ డబ్బుతో ఎటువంటి రిస్క్‌లు లేనటువంటి బ్యాంకులు, ఎల్‌ఐసీలు వంటి సంస్థల షేర్లు కొనవలసిందిగా రిక్వెస్ట్ పెట్టుకొని వాటిలో తమ డబ్బును పెట్టుబడులుగా మార్చుకున్నారు.


భార్యాభర్తలిద్దరికీ ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంది. పిల్లలకు అన్ని విషయాలు చెప్పి సంతోషపడ్డారు.


సమస్యలు అన్నీ పరిష్కారం కావడంతో తేలికపడ్డ హృదయాలతో భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆనందంగా, హుషారుగా విహారయాత్రలకు సన్నద్ధమయ్యారు.


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page