top of page
Original.png

జాన'పద' సోయగం!


శ్రీరంగంలోని విప్రనారాయణుడి కుటీరం వద్ద మధురవాణి, దేవదేవి నర్తకీమణులు ఎదురుపడగా, జానపద భాషా సౌందర్యాన్ని ప్రతిబింబించే సాహిత్య దృశ్యం.

Jaanapada Soyagam - Telugu Sahithya Article | Bhattu Venkata Rao

జాన'పద' సోయగం! - తెలుగు సాహిత్య వ్యాసం| భట్టు వెంకటరావు

Published in manatelugukathalu.com on 07/09/2026


జానపదుల మాటల్లోని జీవం, సామెతలలోని భావగాఢత, పద్యాలలోని సాహిత్య సౌందర్యం గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి తెలుగు సాహిత్యాభిమానికీ ఈ వ్యాసం ఒక ఆసక్తికరమైన పఠనం.


కావేరీనది ఒడ్డున శ్రీరంగంలో మధురవాణి, దేవదేవి అనే ఇద్దరు అక్కచెళ్ళెళ్ళు మంచి నర్తకీమణులు ఉండేవేవారు. ఒకరోజు ఆ నగరాన్ని పాలించే చోళమహారాజు ఆస్థానంలో, రాజు సమక్షంలో నర్తించి, ఆయన మెప్పును పొంది, ఆ రాజు ఇచ్చిన బహుమానములను స్వీకరించి, తిరిగి తమ ఇంటికి వెళ్ళే క్రమంలో విప్రనారాయణుడనే పేరున్న ఉత్తమ వైష్ణవుడి కుటీరం మీదుగా నడిచి వెళుతూ ఆయనకు ఎదురుపడ్డారు. విప్రనారాయణుడు మహాభక్తుడు.


తన కుటీరం పరిసరాల్లోనైనా, మరెక్కడైనా సరే నడుస్తున్నప్పుడు తనకు ఎదురుగా ఎవరు వస్తున్నారు, ఎవరు తనను చూస్తున్నారు అనే సంగతులేవీ ఆయనకు పట్టవు. సర్వవేళలా శ్రీరంగనాథుడి ఆలోచనలతో ఆ భక్తాగ్రేసరుడి చిత్తం నిండి ఉండేది. ఆ స్థితిలో ఉన్న ఆయన, ఆ నర్తకీమణులనేమి పట్టించుకుంటాడు? వాళ్ళలా తనకు ఎదురుపడి నమస్కరించినప్పటికీ, వారి వైపు చూడకుండా, తన దారిన తాను నడిచి వెళ్ళిపోయాడు. ఆ ఇరువురు అక్కాచెళ్ళెల్లలో, చెల్లెలు దేవదేవికి ఆయన వాలకం ఏమాత్రం నచ్చలేదు.


ఉ. మ్రొక్కిన నెవ్వరేమనఁడు మోమటుపెట్టుక చక్కఁబోయె నీ

దిక్కును జూడఁడాయె నొకదీవన మాటయు నాడఁడాయె వీఁ

డెక్కడి వైష్ణవుండు మనకేటికి మ్రొక్కితిమమ్మ యక్కటా

నెక్కొని వెఱ్ఱిబుద్ధిమెయి నిద్దురవోయిన వాని కాళ్ళకున్.

(సారంగు తమ్మయ, వైజయంతీ విలాసము, ద్వితీయ, 10)


“ఈయనది ఇదేం తీరు? కనీసం కన్నెత్తి చూడనైనా చూడడు. ఎదురుపడి నమస్కరిస్తే ఒక చిన్న దీవననైనా ఇవ్వడు? వెర్రివాళ్ళ వలె పోయి పోయి ఈయనకు ఎందుకు నమస్కరించాం మనం? 'నిద్రపోయేవాడి కాళ్ళకు మొక్కినట్లయింది' కదా మన పరిస్థితి!” అంది అక్కతో. సందర్భానికి తగినట్లుగా ఎంత అర్థవంతంగా ఇమిడిందో ఈ సామెత అనిపిస్తుంది. ఆంధ్రదేశం ఈ సామెతను మర్చిపోయి ఎన్నాళ్ళయిందో తెలీదు.

చెల్లెలి దూకుడు మాటలను విన్న అక్క మధురవాణి "ఆయన మన వైపు చూస్తే ఏమిటి, చూడకపోతే ఏమిటి? పూజ్యుడైన వ్యక్తి ఎదురైనపుడు భక్తితో నమస్కరించడం ధర్మం. అది మనవంటి వారికి శ్రేయస్సును కలగజేస్తుందని మరువకూడదు సుమా!" అంది చెల్లెలితో.


ఆ. బ్రహ్మచర్యమును జపంబు నధ్యయనంబు

హరిదినోపవాస మచ్యుతాంఘ్రి

చింతనముఁ దదీయసేవానురక్తియు

సుదతి జగతి నతని సొమ్ము సుమ్ము.

(ద్వితీయాశ్వాసం, 13)


“బ్రహ్మచర్యం పాటిస్తూ జపతపాలను నియమం తప్పకుండా ఆచరించడం, ప్రతిరోజూ వేదాధ్యయనం చేయడం, హరిసేవయే కర్తవ్యంగా, అనుక్షణం శ్రీమహావిష్ణువు యొక్క పాదసేవానురక్తితో జీవితాన్ని గడపడం అనేవి ఆ మహానుభావుడికి ఈ జన్మలో అలంకారములైనాయి చెల్లెలా!” - అని మరింతగా విప్రనారాయణుడిని పొగిడి చెప్పింది అక్క.

అంత సులభంగా విని ఊరుకునే మనస్తత్వం కాదు చెల్లెలు దేవదేవిది.


చ. ప్రకటజితేంద్రియుల్ ధరఁ బరాశరకౌశికులంతవారు స్త్రీ

లకు వశు లంతకంటె మిగులం దృఢమై మగకచ్చ బిగ్గఁగ

ట్టుకొనఁగ నీఁతడెంత శుకుఁడో హనుమంతుఁడొ భీష్ముఁడో వినా

యకుఁడో తలంచుమా సరసిజాయతలోచన నెమ్మనంబునన్.

(ద్వితీయాశ్వాసం, 16)


ఈ భూమిపై పరాశరుడు, కౌశికుడు అంతటివారే స్త్రీలకు లోబడిపోయారు. వారిని మించినవాడు ఈయన అనుకోవడానికి ఈయనేమైనా శుకుడా, హనుమంతుడా, భీష్ముడా లేక వినాయకుడా? ఒకసారి ఆలోచించవమ్మా అక్కమ్మా - అంది. (పరాశరుడు - దాశరాజు కూతురు మత్స్యగంధిని చూడడంతోటే మోహంలో పడ్డాడు. వ్యాసుడు జన్మించాడు. కౌశికుడు - అనగా కుశికుని పుత్రుడైన గాధి కొడుకు విశ్వామిత్రుడు. కఠోరమైన తపస్సులో ఉండి కూడా, అప్సరసలలో ఒకరైన మేనక మోహంలో పడ్డాడు. వారి సంతానంగా శకుంతల జన్మించాడు).


క. కిలికించిత రసపూరముఁ

జిలికించి కటాక్షవీక్షచే నలినాక్షుల్

తిలకించి చూచినప్పుడు

పులకించక నరుల దేహములు లోహములే.

(ద్వితీయాశ్వాసము, 21)


చూపులో ఒక రకపు శృంగారభావన చిలికేలా గట్టి చూపు చూస్తే, శరీరం పులకించి ఎంతటి మగవాడైనా స్త్రీకి దాసుడు కాకపోవడానికి మగవాళ్ళ శరీరాలు ఏమైనా లోహాలతో చేయబడినవా అక్కా, ఆలోచించు! - అని మరింతగా విశదీకరించి చెప్పి "నిర్జితేంద్రియుడు, నిష్ఠాపరుడు అని నీవంటున్న ఇతడి నియమ నిష్ఠాపరత్వాన్ని పూర్తిగా పోగొట్టి, ఇతడిని ఒక మామూలు విటుడినిగా మారుస్తాను, చూస్తావా?" అని సవాలు విసిరింది అక్కకు చెల్లెలు.

దానికి అక్క అన్నది కదా:


క. నీవే కా దిప్పురిలో

నే వేశ్యాపుత్త్రియైన నీతని విటునిం

గావింపఁ జాలెనేనియు

నావేశ్యకు నీళ్ళుఁ గట్టెయలు నే మోతున్.

(ద్వితీయాశ్వాసం, 27)


"అలాగంటవా, అయితే నువ్వే కాదు చెల్లెలా! ఈ శ్రీరంగంలో ఎవరు ఆ పని సాధించగలిగినా ఆమెకు నేను సేవకురాలినై నీళ్ళు, కట్టెలు మోస్తాను నా జీవిత పర్యంతం!" అని ప్రతిసవాలు విసిరింది. సేవకురాలినౌతానని చెప్పడానికి 'నీళ్ళు, కట్టెలు మోస్తానని' జానపదుల వ్యవహారపు మాటలను ప్రయోగించి చెప్పాడు సారంగు తమ్మయ్య. తాను ఎటువంటి సేవను చేయడానికి సిద్ధపడిందో ఆ మాటలు కళ్ళకు కట్టి చూపుతాయి. జానపదుల మాటల్లో గొప్ప జీవం ఉంటుందని చెప్పడానికి సారంగు తమ్మయ రచించిన 'వైజయంతీ విలాసము' అనే పేరుతో ప్రసిద్ధమైన 'విప్రనారాయణ చరిత్రము' లోంచి తీసుకున్న ఇవి, కొన్ని ఉదాహరణలు మాత్రమే!

*****

పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



భట్టు వెంకటరావు గారి కొన్ని ఇతర రచనలు:



భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: భట్టు వెంకటరావు


భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.

కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని. 

సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను. 


నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.


ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!

నమస్కారములతో,


భట్టు వెంకటరావు,

హైదరాబాదు. 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page