ఆగస్టస్
- Santhosh Sarma Lakkaraju

- Jul 25
- 4 min read
Updated: Aug 1
ఆగస్టస్ కథ, విజ్ఞాన కథ, శాస్త్రవేత్త కథ, శాస్త్రీయ ఆలోచన, మూఢనమ్మకాలు, ఆవిష్కరణ, విజ్ఞాన సాహిత్యం, సందేశాత్మక కథ, ఆలోచింపజేసే కథ, రోమ్ చరిత్ర, తెలుగు కథ, శాస్త్రీయ దృక్పథం, మన తెలుగు కథలు, Science Story, Scientific Thinking, Innovation, Superstition, Telugu Science Fiction Story

Augustus - Telugu Emotional Social Story | Santhosh Sarma Lakkaraju
ఆగస్టస్ - తెలుగు భావోద్వేగ సామాజిక కథ | సంతోష్ శర్మ లక్కరాజు
Published In manatelugukathalu.com on 25/07/2026
కొత్త ఆలోచనలు పుట్టిన ప్రతిసారీ వాటిని అర్థం చేసుకునే సమాజం ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. భయం, మూఢనమ్మకాలు, అపోహలు విజ్ఞానాన్ని ఎలా అణచివేస్తాయో హృదయాన్ని కదిలించేలా చెప్పే ఆలోచనాత్మక కథే "ఆగస్టస్". ప్రతి ఆవిష్కరణ వెనుక ఉన్న పోరాటాన్ని, శాస్త్రీయ దృక్పథం అవసరాన్ని గుర్తుచేసే సందేశాత్మక రచన ఇది.
18వ శతాబ్దం, రోమ్ నగరం. ఇంకాసేపట్లో చీకటి పడుతుండటంతో జనమందరూ ఇంటికి వెళ్లిపోయే హడావిడిలో ఉన్నారు. ఓ వీధి కూడలి చివర నలుగురైదుగురు గుమిగూడి ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. వారిలో ఒకరు "ఒరేయ్, ఈ మధ్య ఆ ఆగస్టస్ ని ఎక్కడైనా చూశావా?" అని మిగతావారిని అడిగాడు.
"ఎవడు? చింపిరి జుట్టేసుకుని, ఎప్పుడూ ఏవో ప్రయోగాలంటూ పిచ్చోడిలా తిరుగుతుంటాడు వాడేనా? వాడిని చూసినా ఎవరు పట్టించుకుంటార్రా?" అన్నాడు ఇంకొకడు.
"కాదు రా. ఈ మధ్య నేను వాడి ఇంటి వైపు వెళ్తుంటే, లోపల నుండి వింత శబ్దాలు, అప్పుడప్పుడు కాంతి వస్తున్నాయి. నా సందేహం వాడేమైనా క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నాడా అని?"
"అవునా. అయితే వాడి మీద ఓ కన్నేసి ఉంచాల్సిందే. వాడు నిజంగానే క్షుద్ర ప్రయోగాలు చేస్తుంటే, అది మనకి, మన ఊరికి ముప్పు తెస్తుంది." ఈ మాటతో అక్కడ ఉన్న వారి గుండెల్లో భయం మొదలైంది.
అంతలో వేరొకడు "మనం ఈ విషయాన్ని తేలికగా తీసుకుని వేచి చూడకూడదు. వెంటనే ఈ ఆగస్టస్ సంగతి గవర్నర్ గారికి చెప్పాలి. వాడి విషయం ఆయనే చూసుకుంటారు." అని ప్రతిపాదించాడు.
"అవును. అదే సరైన నిర్ణయం. మనం రేపొద్దునే గవర్నర్ గారిని కలిసి, ఆగస్టస్ చేస్తున్న క్షుద్ర ప్రయోగాలపై ఫిర్యాదు చేద్దాం. వాడి అంతు చూద్దాం." అని అందరూ ముక్తకంఠంతో నిర్ణయించుకుని, చీకటి పడిపోతుండటంతో ఇళ్లకు బయలుదేరారు.
మరుసటి రోజు పొద్దున్నే అందరూ కలిసి రోమ్ నగర గవర్నర్ గారిని కలవటానికి వెళ్లారు.
చాలా ముఖ్యమైన విషయం, మన ఊరు ఆపదలో ఉంది అని చెప్పటంతో, వారికి గవర్నర్ ని కలవటానికి అనుమతి లభించింది. అందరి ముఖాలలో కలవరపాటు గమనించిన గవర్నర్ "ఏం జరిగింది?" అని అడిగాడు.
"ప్రభూ! మన ఊరిలో క్షుద్ర ప్రయోగాలు జరుగుతున్నాయి. ఊరు నాశనం అవుతుంది" అని వారు ఆగస్టస్ గురించి రాత్రి అనుకున్నదంతా గవర్నర్ కి చెప్పారు.
ఆగస్టస్ చేస్తున్న ప్రయోగాల సంగతి తెలుసుకున్న గవర్నర్ కోపంతో ఊగిపోయాడు. "దేశంలో ఇలాంటి క్షుద్ర మాంత్రికులు ఎక్కువైపోయారు. మొన్నామధ్య పొరుగు దేశంలో కూడా వాడెవడో మెరుపుని భూమి పైకి తీసుకొస్తానని ఏవేవో ప్రయోగాలు మొదలుపెట్టినట్టు తెలిసింది.
ఇలాంటి వాళ్లని ఊరికే వదిలేయకూడదు. పదండి అందరం కలిసి వెళ్లి ఆ ఆగస్టస్ సంగతి చూద్దాం" అని కొంత మంది భటులతో కలిసి గవర్నర్ ఆగస్టస్ ఇంటికి బయలుదేరాడు.
అందరూ ఎంత పిలుస్తున్నా, తలుపులు ఎంత గట్టిగా కొడుతున్నా ఆగస్టస్ ఇంటి తలుపు తీయటం లేదు. దాంతో ఇక లాభం లేదని భటులు తలుపులు పగలగొట్టారు. గవర్నర్ తో కలిసి ఫిర్యాదు చేసిన వాళ్ళు కూడా ఆగస్టస్ ఇంటి లోపలికి చొరబడ్డారు.
ఇంట్లో ఎవరూ కనపడలేదు. కానీ తలుపు వేసి ఉన్న ఒక గది నుండి మాత్రం కొన్ని శబ్దాలు వస్తున్నాయి. తలుపు సందులో ఏదో కాంతి కూడా కనపడుతోంది. అది చూసిన గవర్నర్ కి ఒళ్లు మండిపోయింది. వెంటనే భటులతో ఆ తలుపు కూడా పగలగొట్టించాడు.
ఆ శబ్దానికి లోపల తన ప్రయోగంలో నిమగ్నమైన ఆగస్టస్ ఉలిక్కిపడి చూశాడు. నగర గవర్నర్ ని చూసేసరికి అతనికి కంగారు పుట్టింది. బల్ల పైన ఉన్న ఒక వస్తువుని కప్పి ఉంచటానికి ప్రయత్నిస్తున్నాడు.
అది చూసిన గవర్నర్, "పక్కకు తప్పుకో" అని ఆగస్టస్ ని పక్కకి తోసాడు. బల్ల పైన ఉన్నదానిని చూసి గవర్నర్ కి, అక్కడికి వచ్చిన వారందరి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అది విపరీతంగా వెలిగిపోతున్న ఒక కాంతి గోళం.
"ఏంట్రా ఇది? అయితే వీళ్ళందరూ చెప్పింది నిజమే. నువ్వు క్షుద్ర ప్రయోగాలు చేస్తున్నావ్. ఈ క్షుద్ర శక్తిని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావురా? దీంతో ఎవరికి ఏ హాని తలపెట్టావురా? లేక ఈ ఊరినే నాశనం చేద్దాం అనుకుంటున్నావా? చెప్పరా?" అని గద్దించాడు గవర్నర్.
ఆ మాటలకి ఆగస్టస్ తడబడిపోయాడు. నోట మాట పెగలలేదు. "అది, అది, నేను ఎవరికీ ఏ హాని చేయాలనుకోవడం లేదు, అది..." అని ఆగస్టస్ ఏదో చెప్పబోయేలోపే గవర్నర్ ఆదేశంతో భటులు ఆగస్టస్ ని కింద పడేసి తన్నడం మొదలుపెట్టారు.
అతని మీద ఫిర్యాదు చేసిన వాళ్లు, అతని ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నాశనం చేయటం మొదలుపెట్టారు. అందరూ కలిసి ధైర్యం తెచ్చుకుని ఒక కర్రతో ఆ కాంతి గోళాన్ని కూడా పగలగొట్టారు.
అది చూసిన ఆగస్టస్ "వద్దు వద్దు" అని ఎంత అరిచినా అతని మొహం మీద పిడిగుద్దులు గుద్దసాగారు. వాళ్ల దెబ్బలకి తాళలేక ఆగస్టస్ ప్రాణాలు విడిచాడు.
వచ్చిన పని అవగానే, గవర్నర్ "ఈ క్షుద్ర మాంత్రికుడి శవాన్ని తీసుకెళ్లి నగర కూడలిలో పడేయండి. కాకులు, రాబందులు వీడి శవాన్ని పీక్కు తింటుంటే అది చూసిన జనంలో మళ్లీ ఎవరైనా ఎప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయాలనుకుంటే వెన్నులో వణుకు పుట్టాలి." అని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆగస్టస్ శవాన్ని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి నగర కూడలిలో పడేసారు భటులు.
తన పదేళ్ల కొడుకుకి ఈ కథ చదివి వినిపించి ఐప్యాడ్ మూశాడు తండ్రి.
కథ విన్న కొడుకు ఎంతో బాధతో "నాన్నా, ఆగస్టస్ ఎందుకు నాన్న క్షుద్ర ప్రయోగాలు చేశాడు? ఇంతకీ అతను ఆ ప్రయోగాలు చేసి తెచ్చిన ఆ కాంతి గోళం ఏంటి నాన్న" అని తండ్రిని అడిగాడు.
అందుకు సమాధానంగా తండ్రి నిశబ్దంగా పైకి లేచి, స్విచ్ బోర్డు దగ్గరికి వెళ్లి, లైట్ స్విచ్ ఆన్ చేసి "ఎలక్ట్రిక్ బల్బ్. ఆగస్టస్ కనుక్కున్నది ఎలక్ట్రిక్ బల్బ్" అన్నాడు.
గమనిక: ఎలక్ట్రిక్ బల్బ్ నిజ ఆవిష్కర్త థామస్ ఆల్వా ఎడిసన్ గారు. కానీ ఈ కథలో ఆగస్టస్ అని చూపించటం వెనుక మా ఉద్దేశం ఎడిసన్ గారిని తక్కువ చేయటం కాదు.
మూఢ నమ్మకాలకి, పిడి వాదనలకు ఎంతో మంది శాస్త్రవేత్తలు, మానవాళి ఎదుగుదలకి ఉపయోగపడే వారి ఆవిష్కరణలు బలి కాబడ్డాయి. అటువంటి పరిస్థితులు మళ్లీ తలెత్తకూడదు అనేదే ఈ కథ వెనుక ఉద్దేశం.
***
సంతోష్ శర్మ లక్కరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం :
నా పేరు సంతోష్. నేను వృత్తి రీత్యా Data Analyst ని. చిన్నప్పటినుండి పుస్తకాలు చదవటం చాల చాల ఇష్టం. నాకు ఎంతో ఇష్టం అయిన రచయిత దైవ సమానులు "కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ" గారు. నేను హైదరాబాద్ వాస్తవ్యుడని. నేను రాసిన కొన్ని కథలు కవితలు ఒక చిన్న పుస్తకంగా అచ్చువేయబడినది. అందులో లేని నేను రాసిన ఇతర కథల ను వివిధ "Online Telugu Stories Websites and Competitions" కి పంపించాలని అనుకుంటున్నాను.






Comments