బలం
Balam - Telugu Family Story | Ganti Asa Padmini
బలం - తెలుగు కుటుంబ కథ | గంటి ఆశ పద్మిని
Published in manatelugukathalu.com on 14/10/2026
“ఏవండీ లేవండి సమయం ఆరయింది. అబ్బా లేవండీ మీరు, మీ మొద్దు నిద్ర” అనుకుంటూ భర్తను నిద్ర లేపుతోంది శాంతమ్మ.
ఇంతలా లేపుతున్నా అంత నిద్రేంటి అని భర్త రామానుజం దగ్గరకు వెళ్లి చూసింది శాంతమ్మ. ఒళ్లంతా చల్లపడిపోయి, ఏ కదలిక లేకుండా పడుకుని ఉన్నాడు రామానుజం.
శాంతమ్మకు కాళ్లు, చేతులు ఆడలేదు. వెంటనే తన పెద్ద కొడుకుని గట్టిగా పిలిచింది.
పెద్ద కొడుకుతోపాటు మిగతా ముగ్గురు కొడుకులు, కోడళ్లు, మనవళ్లు అందరూ నిద్ర లేచి శాంతమ్మ గదికి వచ్చారు. అక్కడ తండ్రిని చూసి వెంటనే డాక్టర్ని ఫోన్ చేసి పిలిచారు. డాక్టర్ వచ్చి రామానుజంని పరీక్షించి నిద్రలోనే ప్రాణం పోయిందని చెప్పి వెళ్లిపోయాడు.
శాంతమ్మ భర్త పోయిన విషయం విన్న వెంటనే నిశ్శబ్దంగా అలా కుర్చీలోకి వాలిపోయింది. కొడుకులు, ఇంటి సభ్యులు తమ బంధువులకు, స్నేహితులకు, సన్నిహితులకు రామానుజం ప్రాణం పోయిన విషయం చెప్పారు.
ఇంటి చుట్టుపక్కల వాళ్లకు ఈ విషయం తెలిసి ఒకరొకరుగా వచ్చి వెళ్లడం ఆరంభించారు. బంధువులు కూడా రావడం ఆరంభించారు.
నలుగురు కొడుకులు జరగాల్సిన కార్యక్రమాలు చేస్తున్నారు. అవసరమైన వస్తువులు తెస్తున్నారు. కొంతసేపటి తర్వాత శాంతమ్మ కోలుకుని భర్త పార్థివ దేహం వద్దకు వచ్చింది. ఇంతలో పంతులుగారు వచ్చారు. రామానుజం పార్థివ దేహానికి స్నానం చేయించారు.
కుటుంబ సభ్యులు, బంధువులందరు ప్రదక్షిణాలు పూర్తి చేశారు. ఇంటి వద్ద ముగించాల్సిన కార్యక్రమాలన్నీ ముగించుకుని పార్థివ దేహాన్ని శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. నలుగురు కొడుకులు తండ్రికి తలకొరివి పెట్టి ఇంటికి తిరిగొచ్చారు.
ఇంటి వద్ద శాంతమ్మ తరపు బంధువులు, రామానుజం తరపు బంధువులు ఎవరికి తోచిన పని వాళ్లు చేస్తున్నారు. బంధువులందరూ శాంతమ్మ కుటుంబానికి తోడుగా పెద్ద కర్మ అయ్యేదాకా ఉండి ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. పెద్ద కర్మ పూర్తి అవ్వగానే ఆ రోజే చాలామంది బంధువులు వాళ్ల ఇళ్లకు బయలుదేరిపోతుండగా... చిట్ట చివరి కోడలు యశోద తన తండ్రిని ఆస్తి పంపకాల విషయం గురించి అత్తగారిని అడగమని పంపించింది.
యశోద తండ్రి కృష్ణమూర్తి, శాంతమ్మ దగ్గరకు వెళ్లి, ‘చెల్లెమ్మా, బావగారు ఆస్తి పంపకాలు ఏమైనా చేశారా?’ అని అడిగాడు. శాంతమ్మ వెంటనే తన గదిలో ఉన్న అలమరా లోంచి ఆస్తి పత్రాలు తీసుకొచ్చి అందరి ముందరే నలుగురు కొడుకులకు పంచింది. శాంతమ్మ చేసిన పనికి వెంటనే తన అన్న, “అమ్మా, ఆస్తి అంతా పిల్లలకు పంచేస్తే మరి నీకు?” అని అడిగాడు.
“నా పిల్లలు నాకు ఉన్నారు, ఆస్తి ఎందుకు?” అని అంది శాంతమ్మ. “పిల్లలు ఉన్నారు కానీ నీకంటూ కొంచెం అయినా ఆస్తి ఉంటే బాగుండు” అని అన్నాడు శాంతమ్మ అన్న.
శాంతమ్మ నలుగురు కొడుకులు శాంతమ్మ దగ్గరకు వచ్చి “మా అమ్మకు ఏ లోటు లేకుండా చూసుకుంటాము మేము” అని చెప్పారు. “జాగ్రత్తగా ఉండు” అని చెప్పి వెళ్లిపోయాడు శాంతమ్మ అన్న.
భర్త పోయిన బెంగ, బాధలో మునిగిపోయిన శాంతమ్మ అసలు కుటుంబ బాధ్యత పట్టించుకోలేదు. ఇలా ఒక ఏడాది గడిచిపోయింది. ఇంతలో రామానుజం మొదటి తిథి వచ్చింది. మళ్లీ అందరి బంధువులను పిలిచి చేయవలసిన కార్యక్రమాలు, పిండ ప్రదానం అన్నీ జరిపించారు నలుగురు కుమారులు.
శాంతమ్మ ఇంటి బాధ్యత పట్టించుకోకపోవడం వల్ల “నలుగురు కోడళ్లు ఒకరిపైన ఒకరు పెత్తనాన్ని కోరుకుంటూ ఇంటిని రావణకాష్టం చేశారు”. అందుకోసం నలుగురు కొడుకులు “ఎవరి ఆస్తిని వాళ్లు పంచుకుని వేరు అయిపోవాలని నిర్ణయించుకున్నారు”.
తల్లికి ఆ సంగతి చెప్పారు. శాంతమ్మ ఎంతో నచ్చజెప్పింది అందరికీ. కానీ ఎవరూ శాంతమ్మ మాటను పట్టించుకోకుండా ఒక మంచి రోజున వేరు అయ్యేందుకు ముహూర్తం పెట్టుకున్నారు.
పెద్ద కోడలు “ఇంతకీ అత్తగారు ఎవరి దగ్గర ఉంటారు?” అని అడిగింది.
మూడో మరిది “ఎవరి దగ్గరో ఎందుకు ఉంటుంది? మా నాన్న కట్టించిన ఈ ఇంట్లోనే ఉంటుంది” అని అన్నాడు. “ఆస్తిని నలుగురం పంచుకుంటారు కానీ బాధ్యత ఒకరే వహించాలా? అదేమీ కుదరదు” అంది పెద్ద కోడలు.
“ఒక్కో నెల ఒక్కొక్కరి ఇంట్లో ఉంటే సరిపోతుంది. అప్పుడు ఒకరికే బాధ్యత ఉండదు” అని సలహా ఇచ్చింది నాలుగో కోడలు. పెద్ద కోడలు వెంటనే సరే అంది “తన పైన పడే బాధ్యతను తప్పించుకునేందుకు”.
మిగిలిన ఇద్దరు సరే అనకపోతే వాళ్లు చెడ్డవాళ్లు అవుతారని సరే అన్నారు. ఇంతలో శాంతమ్మ “నేను నా భర్త కట్టించిన ఇల్లు వదిలి ఎక్కడకూ వెళ్లను” అంది.
“అది ఎలా కుదురుతుంది? నేను ఒక్కడినే నీ బాధ్యత మొత్తం తీసుకోవాలంటే... మిగిలిన ముగ్గురు కూడా నీ కొడుకులే కదా” అన్నాడు. “అలాగైతే మొత్తం ఆస్తి, ఈ ఇల్లు ఎవరికి రాశారో వాళ్లకే రాసి ఉండాల్సింది” అంది పెద్ద కోడలు.
శాంతమ్మను మరేమీ మాట్లాడనివ్వకుండా నలుగురు కొడుకులు ఒక్కో నెల ఒక్కొక్కరి ఇంట్లో ఉండాలనే నిర్ణయం తీసుకుని... మొదటి నెల పెద్ద కొడుకు దగ్గర తన భర్త కట్టించిన ఇంట్లోనే ఉండమన్నారు తల్లిని.
శాంతమ్మ ఎంతో ఒంటరిగా, తన భర్తతో ఆ ఇంట్లో, ఆ గదిలో గడిపిన జ్ఞాపకాలతో మొదటి నెల గడిపింది. మొదటి నెల చివరి రోజు పెద్ద కొడుకు తల్లిని తీసుకువెళ్లాలి అనే విషయం తన పెద్ద తమ్ముడికి ఫోన్ చేసి తెలియపరిచి... ఉదయం సరిగ్గా ఆరు గంటలకు వచ్చి తల్లిని తీసుకువెళ్లమని చెప్పాడు.
శాంతమ్మ గదికి వెళ్లి “అమ్మా, రేపు నువ్వు పెద్ద తమ్ముడి దగ్గరకు వెళ్లాలి. నీ సామాన్లు, అవసరమైన వస్తువులు సర్దుకుని ఉదయం సరిగ్గా ఆరు గంటలకల్లా సిద్ధంగా ఉండు” అని చెప్పాడు పెద్ద కొడుకు.
శాంతమ్మ “మీ నాన్న చనిపోయి తక్కువ రోజులే అయ్యింది కదా, ఇంకా కొన్ని నెలలు నేను ఇక్కడే ఉంటాను. ఆ తర్వాత తమ్ముళ్ల దగ్గరకు వెళ్తాను” అని చెప్పింది. “అదేమీ కుదరదు, ఉదయాన్నే సిద్ధంగా ఉండు” అని చెప్పి వెళ్లిపోయాడు పెద్ద కొడుకు.
రాత్రి గడిచింది, ఉదయం ఆరు అయింది. శాంతమ్మ రెండో కొడుకు కొత్తగా కొన్న కారులో వచ్చి అన్న వాకిట్లో తల్లిని తీసుకెళ్లేందుకు నిలబడ్డాడు. తమ్ముడ్ని చూడగానే అన్న తల్లిని తీసుకువచ్చేందుకు తల్లి గది దగ్గరకు వెళ్లి... “అమ్మా, అమ్మా” అని పిలిచాడు.
లోపల నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో లోపలకు వెళ్లి చూశాడు. గదిలో ఎక్కడా తల్లి శాంతమ్మ కనబడలేదు. కంగారుగా వచ్చి గుమ్మం ఎదురుగా ఉన్న తన తమ్ముడికి చెప్పాడు. మిగిలిన ఇద్దరు తమ్ముళ్లకు ఫోన్ చేశాడు.
నలుగురు కొడుకులు తల్లి ఎక్కడకు వెళ్లి ఉంటుంది అనే ఆలోచనలో పడ్డారు. తమ తమ పిల్లలను చుట్టుపక్కలకి పంపించి వెతికించారు. ఎక్కడా కనబడలేదు.
ఇంతలో మేనమామ శాంతమ్మతో మాట్లాడేందుకు ఫోన్ చేశాడు. తల్లిని బాగా చూసుకుంటాము అని మేనమామ ముందు చెప్పిన మాటలు గుర్తువచ్చి, తల్లి ఇంట్లో లేదని చెబితే పరువుపోతుందని “అమ్మ గుడికి వెళ్లింది, వచ్చాక ఫోన్ చేస్తుంది” అని చెప్పారు నలుగురు కొడుకులు.
సాయంత్రమైనా తల్లి జాడ తెలియకపోవడంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు నలుగురూ. కొడుకులు తెలిసిన చోటికి వెళ్లి వెతుకుతున్నారు. పోలీసులు వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. రెండ్రోజులు గడిచిపోయాయి.
తల్లి కోసం వెతుకుతున్న నలుగురు కొడుకులకు రెండ్రోజుల తర్వాత కోర్ట్ నోటీసులు వచ్చాయి. అందరూ ఎవరు పంపించి ఉంటారా అని నోటీస్ తెరిచి చూశారు. శాంతమ్మ తనకు నచ్చిన ఇంట్లో ఉండే హక్కును కల్పించమని కోర్ట్ వారిని పెట్టుకున్న పిటిషన్ గురించి రాసుంది.
నలుగురు కొడుకులు కోర్ట్ వారు చెప్పిన తేదీకి కోర్టుకి వచ్చారు. తల్లి ఎక్కడ ఉందో వెతికారు. ఒక చెట్టు కింద నిలబడి ఉన్న తల్లిని చూసి తన దగ్గరకు వెళ్లి... “అమ్మా, నిన్ను మేము బాగానే చూసుకుంటున్నాము కదా.
ఒక్కో నెల ఒక్కొక్కరి దగ్గర ఉండమని చెప్పాము అంతే తప్ప నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పించలేదు. ఇలా కోర్టుకి వచ్చి మా పరువు ఎందుకు తీస్తున్నావు? కేసు వెనక్కి తీసుకో, మన ఇంటికి మనం వెళ్లిపోదాము” అన్నారు నలుగురు కొడుకులు.
శాంతమ్మ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా నిలబడి ఉంది. ఇంతలో లాయర్ విశ్వనాథం వచ్చి లోపలకు రమ్మని పిలిచాడు. శాంతమ్మ మెల్లగా అడుగులు వేసుకుంటూ వెళ్లింది.
న్యాయమూర్తి శాంతమ్మను, “అమ్మా, మీరు మీకు నచ్చిన ఇంట్లో ఉండేందుకు హక్కును కల్పించమని కోర్టును ఆశ్రయించిన కారణం ఏమిటి?” అని అడిగారు. శాంతమ్మ...,
“నా పేరు శాంతమ్మ. నేను రామానుజం గారి భార్యను.
మాకు నలుగురు కొడుకులు. మా ఆస్తిని నా భర్త నలుగురు కొడుకులకు సమానంగా పంచేశారు. ఒక్క చిల్లిగవ్వ కూడా నా పేరు మీద రాయలేదు మా ఆయన. గత సంవత్సరం నా భర్త కాలం చేశారు. నా కొడుకులు ఆస్తిని పంచుకున్నారు.
నేను మొదటిసారి నా భర్తతో కలిసి అడుగు పెట్టిన ఇల్లు నాకు దేవాలయం. ఇల్లంటే నాలుగు ఇటుకలు, పిడికెడు సిమెంట్ కాదు... జీవితకాలం జ్ఞాపకం. కష్టాలు, ఆనందాలు, అనుభవాల సమ్మేళన స్థలం. ఒక చిరకాలపు పరిచయం.
నేను పుట్టి పెరిగిన ఊరు, ఇల్లు, అయినవాళ్లందరినీ వదిలేసి వచ్చిన నాకు ఆ ఇల్లే ప్రపంచం. ఆ ఇల్లే నాకు బడి, గుడి, కళాశాల, వైద్యశాల.
ఆ ఇంట్లోనే నేను ఒకటి కాదు నాలుగు పురుళ్లు పోసుకున్నాను. ఆ నేల నా బిడ్డల బుడి బుడి అడుగుల భువనం. నా పిల్లలతో నేను గడిపిన అంబరం. అలాంటి ఇంటిలో నేను నా తుది శ్వాస వరకు గడపాలి అనేది నా చిరకాలపు కోరిక.
నా పిల్లలు నన్ను వృద్ధాశ్రమంలో చేర్పిస్తాం అనడం లేదు. కానీ ఒక్కో నెల ఒక్కొక్కరి చొప్పున నలుగురూ నన్ను పంచుకుంటున్నారు. నేను నా జీవితాన్ని మొదలు పెట్టిన ఇల్లు నా ఇల్లు.
పిల్లలకు ఆస్తిని రాసిచ్చినంత మాత్రాన నేను ఎందుకు నా ఇల్లును వదిలి వెళ్లాలి? నేను ప్రతి నెల ఇల్లు మారుతూ ఎందుకు వెళ్లాలి? నేను, నా భర్త కలిసి బ్రతికిన ఇంట్లోనే నేను ఉండేందుకు నా భర్త నాకు ఆర్థిక బలాన్ని ఇవ్వలేదు.
చట్టమైనా నాకు నా ఇంట్లో ఉండేందుకు బలాన్ని ఇవ్వాలని కోరుకుంటూ కోర్టును ఆశ్రయించాను. నేను నా ఇంట్లోనే ఉండేందుకు నాకు బలం కావాలి” అని తన వాదన రూపంలో బాధంతా చెప్పింది.
శాంతమ్మ మాటలు విన్న న్యాయమూర్తి తీర్పు చెప్పే ముందే... శాంతమ్మ నలుగురు కొడుకులు తల్లి బాధను తెలుసుకుని... న్యాయమూర్తిగారిని అనుమతి అడిగి తల్లి కాళ్లపైన పడి, “అమ్మా, మేము నీ మనసును తెలుసుకోకుండా మా సుఖాల కోసము నిన్ను బాధ పెట్టాలి అనుకున్నాము. ఆ ఇల్లు నీ ఇల్లు అని మర్చిపోయి ప్రవర్తించాము.
మమ్మల్ని క్షమించు, అరవై ఏళ్ల నీ అనుభవాల భవనంలో దర్జాగా వచ్చి ఉండు” అని కోరారు.
శాంతమ్మ గౌరవంగా, చట్టపరమైన బలంతో మళ్లీ తన ఇంట్లో తాను అడుగుపెట్టి తుదిశ్వాస విడిచేవరకు తన ఇంట్లోనే కాలాన్ని గడిపింది.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
గంటి ఆశ పద్మిని గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: నా పేరు గంటి ఆశ పద్మిని.
నేను ఇప్పటివరకు ముఫై కథలు, పది బాలగేయాలు, ఒక మినీ నవల , ఐదు పుస్తక సమీక్షలు చేసాను.రాసాను. నా కథలు విశ్వభవిష్యత్, ఈనాడు, రేపటికోసం పత్రికలో పబ్లిష్ అయ్యాయి. సుమబాల, ఉషబాల, బాలబాట పుస్తకాల్లో, కదంబం అనే వెబ్ మ్యాగజైన్ లో కూడా నా కథలు ప్రచురణ అయ్యయి.








Comments