రీఛార్జ్
- Munipalle Vasundhara Rani

- Apr 1
- 3 min read

బామ్మ కథలు - 46
Recharge - Telugu Moral Story | Vasundhara Rani Munipalle
రీఛార్జ్ - తెలుగు నీతి కథ | వసుంధర రాణి మునిపల్లె
Published in manatelugukathalu.com on 01/04/2026
చింటూ అన్నయ్య అర్జున్ ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ మధ్య కాలేజీలో పోటీలు బాగా ఎక్కువైపోయాయి. మంచి ర్యాంకు రావాలన్నా, అందరికంటే ముందుండాలన్నా రాత్రనక, పగలనక చదవాల్సి వస్తోంది.
అయితే, ఈ మధ్య పుస్తకాల కంటే ఫోన్‌లో వీడియో పాఠాలు చూస్తూ చదువుకోవడం అర్జున్‌కు అలవాటైంది. "పుస్తకాల్లో చదివితే తలనొప్పి వస్తోంది బామ్మా, అదే వీడియోలు అయితే త్వరగా అర్థమవుతున్నాయి" అని అర్జున్ రాత్రంతా ఆ నీలి వెలుతురు ముందే గడుపుతున్నాడు. దీనివల్ల వాడికి నిద్ర కరువైంది. పొద్దున్నే లేచేసరికి కళ్లు ఎర్రబడి, తల భారంగా ఉండి, చిన్న విషయానికే తమ్ముడి మీద, అమ్మ మీద విపరీతమైన చిరాకు పడుతున్నాడు.
ఒక ఆదివారం మధ్యాహ్నం, అర్జున్ తన ఫోన్‌లో ఒక ముఖ్యమైన 'మాక్ టెస్ట్' రాస్తున్నాడు. సరిగ్గా మధ్యలో ఉండగా ఫోన్ స్క్రీన్ మీద "Battery Low - 2% Remaining" అని మెసేజ్ వచ్చింది. అంతే, అర్జున్ కంగారుగా గది అంతా ఛార్జర్ కోసం వెతికాడు. "అమ్మో! ఇది ఆగిపోతే నా పరీక్ష ఆగిపోతుంది, నా ర్యాంకు పడిపోతుంది" అని హడావిడి చేస్తూ ప్లగ్ పాయింట్ దగ్గరికి వెళ్లి ఛార్జర్ పెట్టాడు.
హాల్లో కూర్చుని ఉన్న బామ్మ ఇదంతా గమనిస్తోంది. అర్జున్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వచ్చి, కళ్లజోడు తీసి కళ్లు నలుపుకుంటూ సోఫాలో కూర్చున్నాడు. బామ్మ మెల్లగా వాడి దగ్గరికి వెళ్లి అడిగింది, "ఏమైందిరా అర్జున్? అంత కంగారు పడ్డావు?"
"ఏం లేదు బామ్మా, బ్యాటరీ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టకపోతే ఫోన్ డెడ్ అయిపోతుంది కదా, అందుకే వెంటనే పెట్టాను" అన్నాడు నీరసంగా.
బామ్మ నిట్టూర్చి ఇలా అంది, "ఆ ఫోన్ బ్యాటరీ గురించి నీకున్న శ్రద్ధ నీ శరీరం మీద లేదేరా అర్జున్! ఈ చిన్న వయసులోనే ఆ చత్వారం ఏంటి, ఆ సోడా బుడ్డి కళ్లజోడు ఏంటి? మా కాలంలో ఇంత ఆరోగ్యమైన తిండి ఉండేది, మంచి అలవాట్లు ఉండేవి. అందుకే మా కళ్లు ఇప్పటికీ బానే ఉన్నాయి. మీకేమో ఆ తిండి లేదు, పైగా ఈ ఫోన్లే లోకం అయిపోయాయి. ఈ ర్యాంకుల పోటీ, పరీక్షల ఒత్తిడి అని చెప్పి నీ నిద్రను, ఆరోగ్యాన్ని కూడా 'డెడ్' చేసుకుంటున్నావు. మరి నీ మెదడుకి, కళ్లకి నువ్వు ఇస్తున్న రీఛార్జ్ ఏది?" అని అడిగింది.
అర్జున్ వెంటనే, "మరి అలా రాత్రంతా చదవకపోతే ర్యాంకు రాదు కదా బామ్మా? అందరూ గంటల తరబడి చదువుతుంటే, నేను నిద్రపోతే వెనుకబడిపోనా?" అన్నాడు ఆవేదనగా.
బామ్మ నవ్వుతూ "చూడు అర్జున్, నువ్వు రాత్రంతా ఫోన్ చూస్తూ చదువుతుంటే నీ మెదడు ఒక నిండిపోయిన చెత్త కుండీ లాగా తయారవుతుంది. నువ్వు లోపలికి పంపిస్తున్న సమాచారం అంతా అక్కడ పేరుకుపోతుందే తప్ప, సర్దుకోదు. మనం నిద్రపోతున్నప్పుడే మన మెదడు ఒక లైబ్రరీలాగా పనిచేస్తుంది. ఆ రోజంతా నువ్వు నేర్చుకున్న పాఠాలను ఒక్కో గదిలో భద్రపరుస్తుంది. నువ్వు నిద్రపోకపోతే, ఆ లైబ్రరీ తలుపులు తీయవు. అప్పుడు పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు నీకు ఏదీ సమయానికి గుర్తు రాదు. దానివల్ల నువ్వు 10 గంటలు చదివినా, అది నిద్రపోయి చదివే గంటల చదువుతో సమానం కాదు."
"ర్యాంకు రావాలంటే కష్టపడటం కాదురా, ఇష్టపడి తెలివిగా చదవాలి. 100% చార్జింగ్ ఉన్న ఫోన్ ఎంత వేగంగా పనిచేస్తుందో, సరైన నిద్ర ఉన్న మెదడు కూడా అంత వేగంగా ఆలోచిస్తుంది. నిద్రలేక నీ మెదడు బ్యాటరీ ఎప్పుడో 'రెడ్ జోన్' లోకి వచ్చేసింది.. అది నీకు అర్థం కావట్లేదా? ఫోన్ కి వైర్ పెట్టి ఛార్జింగ్ ఇచ్చినట్టు, మనిషికి ఇచ్చే అసలైన రీఛార్జ్ అంటే 'నిద్ర'. ఆ నిద్ర లేకపోతే నీకు ఏకాగ్రత అస్సలు ఉండదు."
"పరీక్షల కంటే నీ ఆరోగ్యమే ముఖ్యం. ఫోన్ బ్యాటరీ పోతే కొత్తది కొంటాం, కానీ నీ కళ్లు, ఆరోగ్యం పాడైతే తిరిగి రావు. ఈ రోజు నుంచి రాత్రి 10 గంటలకే నీ ఫోన్ ని పక్కన పెట్టి నువ్వు కూడా నిద్ర అనే రీఛార్జ్ కి వెళ్ళిపో. అప్పుడే రేపు పొద్దున్న నీ మెదడు, నీ కళ్లు మళ్ళీ 100% ఉత్సాహంతో పని చేస్తాయి" అని గట్టిగా క్లాస్ పీకింది బామ్మ.
అర్జున్‌కి బామ్మ మాటల్లోని తర్కం అర్థమైంది. తన కళ్లజోడు పక్కన పెట్టి, "నిజమే బామ్మా.. ఈ పోటీ లోకంలో పడిపోయి నన్ను నేను మర్చిపోయాను. ఈ రీఛార్జ్ లేకపోతే నేను కూడా ఆ ఫోన్ లాగే హ్యాంగ్ అయిపోయేలా ఉన్నాను. ఇవాళ రాత్రి నుంచి టైంకి నిద్రపోతాను" అన్నాడు నవ్వుతూ.
సమాప్తం.
వసుంధర రాణి మునిపల్లె గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వసుంధర రాణి మునిపల్లె గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: వసుంధర రాణి మునిపల్లె
నాకు ఈ సదవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.
నేనొక హౌస్ వైఫ్ ని నాకు కథలు రాయడం ఒక హాబీ.
ఇంతకుముందు జాగృతి లాంటి పత్రికలలో కథలు ప్రచురితమయ్యాయి. ఇంకా కొన్ని కథలు పరిశీలనలో ఉన్నాయి.




Comments