top of page
Writer's pictureAshok Anand

బందె


'Bande' - New Telugu Story Written By Ashok Anand

'బందె' తెలుగు కథ

రచన: అశోక్ ఆనంద్


"అర్జెంటుగా రెండు యూనిట్ల 'బి నెగెటివ్' బ్లడ్ కావాలి. లేదంటే తల్లి, బిడ్డ ఇద్దరూ బ్రతకడం కష్టం" అంటూ తాపీగా సెంటర్ ఫ్రెష్ నములుతూ వచ్చి చెప్పింది అసిస్టెంట్ డాక్టర్.

'రక్తం' అనే పదం తప్ప మరే మాటా అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు పరమేశ్వరం.

"ఏంటయ్యా, గుడ్లప్పగించి చూస్తున్నావ్! నీకే చెప్పేది" అని బిత్తర మొహంతో బెదిరిపోతూన్న పరమేశ్వరం పై కసురుకుంది డాక్టరమ్మ.

"అయ్యన్నీ నాకు తెలవకే కదమ్మా, పెద్దాసుపత్రని మా ఊరు కాడ్నుంచి దాని పెసవానికి ఇందాకా తీస్కొచ్చాను" తడుముకుంటూ సమాధానమిచ్చాడు.

"పోనీ డబ్బైనా ఉందా?"

"బస్సు సార్జీలకి పోగా ఓ నూటేభై రూపాయలుంటాయమ్మ"

"నువ్వూ, నీ కూతురు ఎక్కడైనా కట్టగట్టుకుని చావండి" అనేసి అప్పటికే కింద నుంచి బైక్ హార్న్ చేస్తున్న ఆమె ప్రియుడి కోసం అంగలేసుకుంటూ వెళ్ళిపోయింది.

'ఆ డాట్టరమ్మ పోతేపోనీ. నీకోసం నేనున్నా'నంటూ పరమేశ్వరం ముక్కు స్తంభాన్ని గాఢంగా కౌగిలించుకుంది ఓ కన్నీటి బొట్టు. బీదవాడికి కన్నీళ్ళ కంటే ఆప్తులెవరూ ఉండరు.

** ఇదంతా గమనిస్తూ ముందున్న బెంచ్ పైన కూర్చున్న ఓ కుర్రాడు పరమేశ్వరం దగ్గరకొచ్చి, "మీరేం కంగారు పడకండి, ఇలా కూర్చోండి" అని చెప్పి, 'ఈ రక్తం - ఇన్ని యూనిట్లు - ఈ హాస్పిటల్' వగైరా వివరాలన్నీ టైప్ చేసి తన వాట్సాప్ స్టేటస్ లోనూ, గ్రూప్స్ లోనూ పోస్ట్ చేశాడు.

జీవితానికి చాలా పనికొచ్చే బిగ్ బాస్ షో యూట్యూబ్లో చూస్కుంటున్న ఓ స్నేహితుడు, వాట్సాప్ మెసేజ్ టోన్ విని, గ్రూప్ ఓపెన్ చేసి, 'ఎహే! ఈడికేం పనుండదు, అడ్డమైనవన్నీ షేర్ చేస్తాడు' అని పాపం స్నేహితుడు చేసిన దౌర్భాగ్యపు పనిని తిట్టుకుని, బొడ్డు చూపిస్తూ టిక్ టాక్ వీడియో అప్లోడ్ చేసిన తన స్నేహితురాలి వాట్సాప్ స్టేటస్ను స్క్రీన్ షాట్స్ తీస్కుని బాత్రూమ్ లోకి దూరిపోయాడు.

**

బిగ్ బాస్ చూట్టం, టిక్ టాక్లు చేయటం లాంటి 'ముఖ్యమైన' పనుల్లో మునిగిపోయిన 'మనుషుల' మధ్య, అక్కడక్కడా పనీపాటా లేని కొందరు మాత్రం బ్లడ్ మెసేజ్ ను ఫార్వర్డ్ చేస్తున్నారు.

** "ఇద్దామనే ఉంది కానీ, లాస్ట్ టైమ్ ఇలానే బ్లడ్ అర్జంట్ అనేసరికి పరుగున వెళ్ళిస్తే, తర్వాత తెల్సింది ఆ బ్లడ్ ను బయట బ్లాక్ లో యూనిట్ కి ఎనిమిదొందల చొప్పున అమ్ముకున్నారని" అంటూ పక్కనున్న తన స్నేహితునికి చెప్తున్నాడు ఫార్వార్డ్ మెసేజ్ అందుకున్న ఎవరో ఓ వ్యక్తి. అతని ఆవేదనలో అర్థం ఉందని మౌనంగా కూర్చున్నాడు ఇంకో స్నేహితుడు.

** మరో స్నేహితుడి అభిమాన హీరోని నోటికొచ్చిన బండ బూతులు తిడుతూ, తన అభిమాన నటుడంటే ఎంత ఇష్టమో వెలిబుచ్చుతూ, 'మా హీరో అవి చేశాడు, ఇవి చేశాడు, మమ్మల్ని ఏవేవో చేయమన్నాడు' అంటూ నిన్న రాత్రి వీరంగం చేసిన ఓ డిగ్రీ కుర్రాడు ఈ ఫార్వార్డ్ బ్లడ్ మెసేజ్ చూశాడు. పాపం చాలా బాధ పడ్డాడు. లేచాడు. ప్యాంట్ వేసుకున్నాడు. రోడ్డు మీదకొచ్చి నాలుగు పాల ప్యాకెట్లు కొన్నాడు.

చాలా ఆవేశంగా బైక్ తీసాడు. బండి డబ్భై స్పీడందుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తారసపడ్డ బిచ్చగాళ్ళను చూసి 'దేశాన్ని' తిట్టుకున్నాడు. తిన్నగా వెళ్ళి సినిమా హాలు ముందు ఆపి, అప్పటికే జరుగుతున్న తన అభిమాన హీరో పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటూ, పాల ప్యాకెట్లు తీసి, ఆ హీరో కటౌట్ పై వేసి, దేశంపై తన బాధ్యతను చాటుకున్నాడు విప్లవకారుడు.

** కిందటేడు.. కూతురు ఎవడినో ప్రేమించిందన్న విషయం తెలిసి, అప్పటికప్పుడే వేరే పెళ్ళి నిశ్చయించి, అబ్బాయికి ఆ ప్రేమ విషయమంతా చెప్పి మరీ పెళ్ళి జరిపించేసాడు పరమేశ్వరం.

'నిండా పదహారేళ్ళయినా నిండకుండా అప్పుడే శిరీషకి పెళ్లేంట'ని ఎవరో గానీ ప్రశ్నిస్తే.. 'పదహారేళ్ళకి ప్రేమించొచ్చు గానీ పదహారేళ్ళకి పెళ్ళి చేయకూడదా' అన్న పరమేశ్వరం లాజిక్ కి నోరు మెదపలేకపోయేవారు మిగతావాళ్ళు.

శోభనం గదిలో ఒక మాటైనా మాట్లాడకుండా, కనీసం బెదిరిపోతున్న శిరీష మొహం వైపు ఒక చూపైనా చూడకుండా, రాగానే లైటు తీసేసాడు, వెంటనే భుజంపై చెయ్యేసి పైట తీసేసాడు ఆ నిస్సహాయురాలి భర్త. శిరీష చూడ్డానికి వేపపుల్లలా చాలా సన్నగా, సరిగ్గా ముప్ఫై కిలోల బరువు కూడా లేకుండా ఉంటాది. శిరీష ఆ నొప్పిని భరించలేక ఏడవటం మొదలెట్టింది. ఆ ఏడుపు తన భర్తకి అంతకంతా సుఖాన్నీ, కసినీ పెంచుతుంది. అరుపులు ఎక్కువయ్యేసరికీ మెల్లగా లొంగబర్చుకోగలిగాడు,

ఎన్ని శోభనాల అనుభవమో మరి ఆ చీకటే సాక్షి. గది బయట దూరంగా కూర్చుని మూలుగుతున్న వీధి కుక్క అరుపులో, శిరీష ప్రక్కటెముకలు చిదిగిపోతున్న శబ్దం ఏకమైపోయింది. స్మశానంలో ఉండే నిస్తేజాన్నంతటినీ ఆమె రొమ్ము స్థనాలు అరువు తీస్కున్నాయి. వ్రేలాడుతున్న ఆమె కనురెప్పల సంజ్ఞలతో ఆ గది మొత్తం వైరాగ్యాన్ని పులుముకుంది.

"నేనింత 'కష్టపడినా' నీకు రక్తస్రావం కాలేదేంటి? నువ్వు కన్నెపిల్లవు కావు" అని పొద్దున్నే శిరీషను చావబాదడం మొదలెట్టాడు పాతిర్వత్ర్య్ సంఘానికి ప్రెసిడెంట్ అయిన ఆ భర్త.

'మాలో లేని రక్తాన్ని మేమెక్కడినుంచి తెచ్చిపెట్టాలి' అని శిరీష బదులు ఆమె నరనరాలు ఏడుస్తున్నాయి. 'పెళ్ళికి ముందే పదిమందితో కులికిన ఈ సాని.. ని నాకు కట్టబెట్టాలని చూస్తారా మిమ్మల్ని ఊరికే వదలను' అంటూ పది నెలల క్రిందట వదిలేసిపోయినోడు తిరిగి ఈ ఊరు వైపు కూడా రాలేదు.

** "చాలా ట్రై చేశాను కానీ రక్తదాతలు దొరకలేదు" అని పరమేశ్వరంతో చెప్పాడు కుర్రాడు. లోపల శిరీషకి నొప్పులు తీవ్రమయ్యాయి. షికారు తిరిగొచ్చిన డాక్టరమ్మ నోటితో ఈలలేసుకుంటూ లోపలికెళ్ళి కాసేపటికి తిరిగొచ్చి, "నీ కూతురు పోయిందయ్యా, కానీ బిడ్డకేం కాలేదు లోపలికెళ్ళి చూస్కో" సినిమా నాలెడ్జ్ లేదనుకుంటా సింపుల్గా చెప్పేసింది. పరమేశ్వరం లోపలికెళ్ళాడు. కూతురి నుదుటిన చేతితో నిమిరి, పక్కన పడుకున్న బిడ్డను చూశాడు.

'ఓరి భగవంతుడా! ఈ ఆడబిడ్డను నేనెట్టా సాకేది, ఎట్టా దాని సవర్త జేసేది, ఎట్టా దాన్ని అత్తారింటికి అంపేది' అని మనసులో చింతించాడు.

హాస్పిటల్ వెనుక డంపింగ్ ప్లేసులో తిండి లేక, దీనంగా ఉన్న ఊరకుక్కల్ని చూసి పరమేశ్వరం జాలి పడ్డాడో ఏమో! ఆ ఆడబిడ్డను అక్కడ 'విసిరేసి' వెళ్ళిపోయాడు.

ఉచితంగా ఊరకుక్కల కడుపు నిండింది. శరీరం నుండి ఊడిపోయి గింజుకుంటున్న గుండెకాయను ఓ ఎలుక వచ్చి పీక్కు తినసాగింది. ఆ పసికందు చివరిగా విడిచిన నిశ్వాస 'ప్రపంచాన్ని' ఉద్దేశించి ఓ లేఖ రాసింది..

"ప్రియమైన నా రేపటికి.. ఉదయించక ముందే నిన్ను హత్య చేస్తున్నందుకు మన్నిస్తావని ఆశిస్తూ.. వీడ్కోలు"

***

అశోక్ ఆనంద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

అశోక్ ఆనంద్.

రచయిత, దర్శకుడు, సాహితీ వేత్త


32 views0 comments

Comments


bottom of page