'Bandhavya Bandham' - New Telugu Story Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 04/11/2023
'బాంధవ్య బంధం' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
హరి...
‘టు లెట్’ బోర్డు ఉన్న ఇంటి ముందు హెూండా ... ఆపాడు....
"సత్యా! దిగరా..." అన్నాడు తాను దిగుతూ...
హెూండాకు స్టాండ్ వేశాడు.
"రేయ్ ! మామా... బోర్డు చూడు...”
"ఆ.. చూచాను..."
“అయితే పద లోపలికి..."
“అటు చూడు..."
హరి... సత్య చూపిన వైపు చూశాడు.
'బాక్సర్ డాగ్...' గేటు ముందు ఆగివున్న వారిని సమీపించింది.
"భౌ... భౌ..." అని అరిచింది.
"జిమ్మీ !...” మృదు మధుర కంఠం. అందమైన అమ్మడు ... వరండాలో ప్రవేశించి వీధి గేటువైపు చూచింది.
“ఎవరండీ !...”
“ఇల్లు కావాలి”... చెప్పాడు సత్య.
“టూలెట్ బోర్డు చూచారా !...".
“ఆ... అవునండీ !..." సత్య జవాబు.
హరి... ఆ అమ్మాయిని చూచాడు. ఆశ్చర్యపోయాడు. నోట మాట రాలేదు. చూస్తూ వుండి పోయాడు.
"జిమ్మీ !... గెట్ బ్యాక్... గెట్ బ్యాక్ !.." పిలిచింది ఆ అమ్మాయి.
గేటువైపు నడిచింది.
“రేయ్ మామా !... ఆ అమ్మాయి వస్తూవుంది !..."
“ఆమె కాక వేరెవరైనా వచ్చి కుక్కను పట్టుకోక పోతే మనం లోన ప్రవేశించలేము కదరా !..."
“ఆ... ఆ... అవునవును...’’
ఆమె గేటును సమీపించింది.
జిమ్మీ ఆమెవైపు తిరిగి తన కాళ్లను పైకెత్తింది...
ఆ ఇల్లు రెండంతస్తుల మేడ... ఆమె ఆ ఇంటి... కూతురు... తల్లి మహేశ్వరి... తండ్రి ఆనందరావు.. కెమికల్ ఫ్యాక్టరీకి రావు గారు... సి.యం.డి. మహేశ్వరి ఒక డైరక్టర్... శ్రమించి పైకి వచ్చినవారు... వారిది ప్రేమ వివాహం.... కొడుకు.. కూతురు.. శంకర్... నారాయణి.
ఇరువురు నారాయణికి సమస్కరించారు ఎంతో వినయంగా... నారాయణికి... వారి వాలకాన్ని... అవసరానికి పెట్టే దొంగ నమస్కరాన్ని చూచి నవ్వొచ్చింది. నవ్వడం అసభ్యత... అవుతుందని అనుకొని చిరునవ్వుతో గేటు తెరిచింది.
"రండి..." అంది.
"ధన్యవాదములు !..." చిరునవ్వుతో హరి ముఖంలోకి క్షణంసేపు చూచి... నారాయణికి చెప్పాడు సత్య....
హరి ముఖంలోకి క్షణం సేపు చూచి... నారాయణి జిమ్మీతో ముందుకు నడిచింది.
హరి సత్యలు ఆమెను అనుసరించారు.
నారాయణి వరండాలో ప్రవేశించింది. జిమ్మీని గొలుసుతో కట్టివేసింది.
"అమ్మా !..." పిలిచింది.
నలభై అయిదు సంవత్సరాల ఆమె తల్లి మహేశ్వరి... వరండాలోకి వచ్చింది.
హరి, సత్యలను చూచింది.
“నారాయణీ !.. వీళ్లెవరూ ?”
ఇరువురూ మహేశ్వరికి వినయంగా నమస్కరించారు.
“టు లెట్ బోర్డు...” సణిగాడు సత్య.
“ఓ... ఇల్లు కావాలా !!..”
"అవునండీ !..."
“ఎంత రెంటులో !... "
“ఎంతైనా ఫరవాలేదులెండి.. మేమిద్దరం వుంటాము...” నవ్వుతూ చెప్పాడు సత్య.
“అతను మూగవాడా !...” అడిగింది నారాయణి సత్యను.
ఆశ్చర్యపోవడం హరి వంతు అయింది. ప్రశ్నార్థకంగా నారాయణ ముఖంలోకి చూచాడు హరి.
చిరునవ్వుతో అతని ముఖంలోకి క్షణం సేపు చూచి...
"అమ్మా !... బాగా విచారించు...” అంటూ లోనికి వెళ్లిపోయింది నారాయణి.
" అబ్బాయ్ !... మీ పేర్లు..?”
“నా పేరు సత్య.... వీడి పేరు హరి... ఇద్దరం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాము. ఒకే వూరివారం... వరుసకు బావా మరదులం... పోర్షన్ చూపిస్తారా మేడమ్ !... "
అభ్యర్థనగా అడిగాడు సత్య....
బయట వున్న మెట్లను చూపించి పైకి రమ్మని చెప్పి... తాను లోనికి వెళ్లింది.
హరి... సత్యలు మెట్లు ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కు చేరారు.
నారాయణి వచ్చి... పోర్షన్ తాళం తీసి... "చూచుకోండి..." అంది.
ఇరువురు క్షణం సేపు ఆమె ముఖంలోకి చూచి పోర్షన్లో ప్రవేశించారు. రెండు బెడ్ రూములు .. అటాచెడ్ బాతరూమ్సు... హాలు... కిచిన్... ఎన్ట్రన్స్ లో వరండా... అందంగా కిటికీలు... ద్వారాలు... గాలీ వెలుతురు.... అన్నీ హరి సత్యకు బాగా నచ్చాయి.
ఐదు నిముషాల తర్వాత బయటికి వచ్చారు...
నారాయణి స్థానంలో మహేశ్వరి నిలబడివుంది.
"ఇల్లు నచ్చిందా !..." అడిగింది.
"ఆ... ఆ.. మేడమ్... బాగుంది..." చెప్పాడు సత్య.
"రెంట్..." హరి పూర్తి చేయకముందే...
“పదివేలు...ప్లస్ కరెంటు ఛార్జీలు... సబ్మీటరు వుంది..." చిరునవ్వుతో చెప్పింది మహేశ్వరి.
“ఓకే.. మేడమ్... అడ్వాన్స్ !..." అడిగాడు హరి.
“మూడు మాసాలు...”
“చెక్కు ఇమ్మంటారా... క్యాషా !..” అడిగాడు సత్య....
“మీ ఇష్టం...” నవ్వుతూ చెప్పింది మహేశ్వరి.
“రేపు వుదయం అడ్వాన్స్ ఇస్తాము..." చెప్పాడు సత్య.
"ఎపుడు వస్తారు ?..."
“మంచి రోజు చూచుకొని..." చిరునవ్వుతో చెప్పాడు హరి.
“సరే మంచిది... క్రిందికి రండి..." ఆమె లోన వున్న మెట్ల ద్వారా కిందికి దిగింది.
సత్య హరిలు వరండాలోకి వచ్చారు. మహేశ్వరి వారిని సమీపించింది.
"రేపు ఉదయం... పది గంటల వరకు మీ అడ్వాన్స్ కోసం... చూస్తాము. మీరు రాని పక్షంలో.. వేరెవరైనా వస్తే వారికి ఇస్తామని చెపాల్సివుంటుంది...” నవ్వుతూ చెప్పింది మహేశ్వరి.
హరి తన జేబులోంచి పర్స్ తీశాడు.
అందులో రెండువేల ఐదు వందలు ఉన్నాయి. రెండువేలు చేతికి తీసుకొని మహేశ్వరికి అందిస్తూ...
“దీన్ని టోకెన్ అడ్వాన్స్ గా ఉంచండి. రెండువేలు... రేపు ఉదయం తొమ్మిది గంటలకు వీడు వచ్చి మీకు ఇరవై ఎనిమిది వేలు క్యాష్ ఇస్తాడు..."
మహేశ్వరి డబ్బును అందుకుంది.
"బాబూ... మీ పేరు ?”
“హరి... వస్తామండీ..."
హరి సత్యలు వారికి మరోసారి చెప్పి... వీధిలోకి ప్రవేశించారు.
* * *
"నాన్నా! " తన తల్లి పార్వతి కంఠం... ఫోన్లో...
"చెప్పమ్మా !.." అడిగాడు హరి.
"ఇల్లు దొరికిందా హరీ !...
“ఆ.. దొరికిందమ్మా !... నేనూ నా మిత్రుడు సత్య కలసి వుంటున్నాము...".
"ఇల్లు కలవారు మంచివారేనా !..."
“చేరి వారం కూడ కాలేదు. వారిని గురించి మనకెందుకమ్మా !... అడ్వాన్స్ మూడు నెలలు ముప్ఫైవేలు ఇచ్చాం. ఇంట్లో ప్రవేశించాము. మిద్దె మీద.. ఒకే పోర్షన్. మాకు సపరేట్ మెట్లు... మా పాటికి మేము రావచ్చు.... పోవచ్చు... మా వలన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు... కానీ ..." అగిపోయాడు హరి.
"ఆ.. ఏమిట్రా... కానీ...” అడిగింది తల్లి పార్వతి.
“అమ్మా!...”
“చెప్పు నాన్నా!...”.
"ఆ యింట్లో ఓ అమ్మాయి వుంది..."
“ వుంటే !... అహ సరే!... ఎంత వయస్సు" వ్యంగ్యంగా అడిగింది పార్వతి.
“అమ్మా !... నీవనుకొన్నట్టు ఏమీలేదు కానీ...”
“ఆ... కానీ... ఏంటో చెప్పరా !...” విసుక్కొంటూ అడిగింది.
"ఆ పిల్లకు ... అంతా నీ పోలికలు...”
“ఆ..” ఆశ్చర్యపోయింది పార్వతి.
“నిజం అమ్మా... ఆ పిల్ల ఫొటో పంపుతాను నీవే చూడు.. సరేనా !..."
“సరే... పంపు... నీవు... నీవు...”.
“ఆ.. ఆ.. జాగ్రత్తగా వుంటానమ్మా !..” తల్లి ముగించక ముందే నవ్వుతూ చెప్పాడు. సెల్ కట్ చేశాడు. సత్య సెల్లో వున్న నారాయణి ఫొటోను తల్లికి పంపాడు.
పార్వతి... నారాయణి ఫొటోను చూచింది. ఆశ్చర్యపోయింది. అంతా తన పోలికే... మనస్సున ఏదో అనుమానం... పాత జ్ఞాపకాలు... హరికి ఫోన్ చేసి నారాయణి తల్లి పేరును కనుక్కొంది. తన అనుమానం నిజం అయింది. మనస్సున గత స్మృతులు...
* * *
వివాహం అయి పార్వతి ఆ యింటికి వచ్చింది. భర్త మోహన్బాబు... మామగారు మనోహర్బాబు... అత్తయ్య కమల... పెద్ద మరదలు మహేశ్వరి... చిన్న మరదళ్లు.. మాలతి, మాధవి.. ఆ యింటి సభ్యులు.
మనోహరా బాబుగారు.. కొడుకు వివాహానికి ముందే పెద్ద కూతురు మహేశ్వరి వివాహం చేయ ప్రయత్నాలు చేశాడు. కానీ కాలం కలిసిరాలేదు.
ఆమె తర్వాత ఇద్దరు ఆడపిల్లలు... మాలతి... మాధవి... మహేశ్వరి వివాహం అయిన తర్వాత... వారి వివాహాలు జరుగవలసి వుంది.
మనోహర్ బాబు మహేశ్వరి విషయంలో చేసే ప్రయత్నం... ఫలించకపోవటానికి కారణం... ఆమెకు జాతకంలో మూలా నక్షత్రం.... ఆ నక్షత్రం కల ఆడ పిల్లలకు అత్తవారింట మామగారు వుండకూడదని శాస్త్ర వచనం.. ఎందరో వచ్చి చూచారు.... నక్షత్రం పేరు వినగానే... కొందరు జవాబు వ్రాయకపోవడం... మరికొందరు అమ్మాయి అబ్బాయికి నచ్చలేదని కార్డు ముక్క వ్రాయడం... జరిగింది.
తన వివాహ విషయం తల్లిదండ్రులకు పెద్ద సమస్యగా మారిందన్న విషయం మహేశ్వరిని... ఎంతగానో వేధించే విషయం... తమ ఇంటికి ప్రక్క ఇల్లు... తన మామయ్య దామోదరరావు గారిది. వారికి ఇరువురు ఆడపిల్లలు కవలలు. రాధ...రాణి ... తన వయస్సు వారు. ఒకే స్కూలు.. కాలేజీల్లో ముగ్గురూ కలసి చదువుకొన్నారు. మంచి స్నేహితులు, బంధువులు...
తన మనోవేదనను... మహేశ్వరి రాధతో పంచుకొనేది... వారి ఇంట్లో.. ఓ ఔట్ హౌస్... అందులో ఆనందరావు అతని తల్లి కాత్యాయని వుండేవారు.
ఆనందరావు ... ఇంజనీర్... పి.డబ్ల్యు.డి. డిపార్టుమెంటులో... అతను... మహేశ్వరిని చూచిన తొలి చూపులోనే ఆమెను ఒప్పించి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు.... సమయానుకూలంగా మహేశ్వరిని పలకరించడం... సరదాగా మాట్లాడటం... ప్రారంభించాడు.
ఆనందరావు అందగాడు. మంచి మాటకారి... ఐదు నిముషాలు అతనితో మాట్లాడితే... ఆ తర్వాత అతనితో మరలా మాట్లాడాలనే భావన ఎదుటి వారి మనస్సున నిలుస్తుంది... అవకాశం కోసం... ప్రయత్నిస్తారు.
మహేశ్వరి పరిస్థితి... అదే... అతన్ని గురించిన వివరాలను రాధ మూలంగా తెలుసుకొంది.
అన్ని విషయాలకన్నా మహేశ్వరికి ఆనందం కలిగించిన విషయం వారికి తండ్రి లేరన్న విషయం... కాత్యాయనీతో పరిచయం పెంచుకొంది. కులగోత్రాల విషయాలకు వస్తే... రెండు కుటుంబాల మధ్యన శాఖా బేధం...
ఆ కారణంగానే... మహేశ్వరి తండ్రి మనోహర్ బాబు... తన బావ దామోదరం ద్వారా ఆనందరావు వివరాలు తెలుసుకొని... తనకు శాఖాబేధం నచ్చని కారణంగా మౌనంగా వుండిపోయాడు.... కానీ... మహేశ్వరి... తన తండ్రికి తల్లికి తన వలన బాధ కలుగ కూడదని... ఆనందరావుతో తన నిర్ణయాన్ని తెలియచేసింది. మహేశ్వరిని ఎంతగానో అభిమానించే ఆనందరావు... తన వుద్యోగానికి ట్రాన్సఫర్ కావాలని పై అధికారులతో విన్నవించుకొని... విజయాన్ని సాధించాడు. కాపురాన్ని ఆ వూరినుంచి ఎత్తేశాడు. మహేశ్వరి... ఆనందరావు పట్ల తనకున్న అభిప్రాయన్ని తన నిర్ణయాన్ని వదిన పార్వతికి తెలియచేసింది.
మహేశ్వరిని తనతో ఆ కొత్త వూరికి తీసుకొని వెళ్లి మిత్రుల సమక్షంలో శాస్త్రయుక్తంగా వివాహం చేసుకొన్నాడు. మహేశ్వరి రాత్రివేళ ఇంటినుండి బయటకు వెళ్లేందుకు వదిన పార్వతి సహకరించింది. మహేశ్వరి వివాహం ఆ రీతిగా ఆనందరావుతో జరిగింది.
ఆమె పట్ల తాను ఎంతో అభిమానంగా వర్తించిన గతం పార్వతికి గుర్తుకు వచ్చింది......
'నన్ను ఎప్పుడూ మహేశ్వరి... తలచుకొన్నందున... తనకు నా పోలికలతో కూతురు పుట్టింది... ఆనందంగా తనలో తాను నవ్వుకొంది పార్వతి. మహేశ్వరికి నా యింటివారికి ఇరవైఒక్క సంవత్సరాలుగా సంబంధ బాంధవ్యాలు లేవు.... మహేశ్వరి వీరికి ఏమీ అన్యాయం చేయలేదే !... తను కుటుంబానికి సమస్యగా... వివాహం కాకుండా తనవారికి కష్టం కలిగిస్తున్నానని తలచి... నచ్చిన వ్యక్తితో వెళ్లి శాస్త్రోక్తంగా వివాహం చేసుకొంది.
అది వీరందరి దృష్టిలో తప్పు... నేరం... నా దృష్టిలో అది ఒప్పు... ఆనాడు యీ ఇంటికి నేను కొత్త కాబట్టి చెప్పలేకపోయాను. కానీ... నేడు.. నేను నిర్భయంగా నాకు ఏది న్యాయం .. ధర్మం... అని తోస్తే అది చేయగలను... చేయాలి... అనుకొంది పార్వతి.
* * *
గడచిన ఇరవై ఒక్క సంవత్సరాల్లో... ఆ ఇంటి పెద్ద మనోహర్ బాబు వారి ధర్మపత్ని కమలగారు పరమపదించారు. పార్వతి బావమరిది శ్యామ్ బాబు... అతని భార్య... పదహారేళ్ల కొడుకు... పదేళ్ల కూతురు... ఆస్థి పంచుకొని... అమ్ముకొని సిటీలో టింబరు వ్యాపారంలో స్థిరపడ్డారు.
పార్వతికి పెద్ద కొడుకు ముకుంద... బ్యాంక్ ఆఫీసర్.. వివాహం అయింది. కోడలు దివ్య గర్భవతి. తొలి కాన్పు ఆడపిల్ల సుధ.
రెండవ వాడు హరి... వివాహం కాలేదు.
మూడవది కూతురు.. కుముద... ప్లస్టు సెకండ్ ఇయర్.
ఆనందరావుగారు జిల్లా జడ్జిగా పనిచేసి ఆరునెలల క్రిందట రిటైర్ అయినారు.
స్వగ్రామానికి వచ్చి... ప్రశాంతమైన వాతావరణంలో ఎంతో ప్రీతిగా చూచుకొనే ఇల్లాలు... పార్వతి... చిన్న కూతురు కుముదతో ఆనందంగా... కాలం గడుపుతున్నాడు.
ఆ దంపతుల నిర్ణయం... త్వరలో హరికి వివాహం చేయాలన్నది. సంబంధాలు విచారిస్తున్నారు.... వారి సిస్టమ్... సంబంధం ముందు వారికి నచ్చాలి. ఆ తర్వాత ఆ విషయం హరి వరకూ వెళుతుంది.
రెండు మూడు సంబంధాలు వచ్చాయి. పెద్దవాళ్లకు నచ్చాయి. కానీ హరికి నచ్చలేదు. నచ్చని పిల్లను... వారిచ్చే కట్న కానుల దృష్ట్యా కొడుకును ఒప్పించి... వివాహం జరిపించాలనే దానికి ఆ దంపతులు పూర్తి వ్యతిరేకులు. తమకు... తమ కుమారుడికి వధువు నచ్చితేనే వివాహం. అదీవారి నిర్ణయం.
ప్రస్తుతంలో... పార్వతికి హరి పంపిన తన మరదలి కూతురు... నారాయణి ఫొటో తనకు బాగా నచ్చింది. అంతగా నచ్చేదానికి కారణం... ఆ అమ్మాయి తనకు ఎంతో ప్రియమైన పెద్ద మరదలు మహేశ్వరి కూతురు కావటం....
ఆ రాత్రి... పడకగదిలో తమ మనోభిప్రాయాన్ని భర్త మోహన్ బాబు తో ప్రస్తావించింది.
“ఏమండీ !..."
“ఆ... ఏమిటి... పార్వతీ !...".
"మన హరి వివాహ విషయం !..."
"ఆ... చూస్తున్నాంగా సంబంధాలు !.. మనకు తగినది ఇంకా జతపడలేదుగా !... దేనికైనా టైమ్ రావాలి.... మనం... మన ప్రయత్నం నిమిత్త మాత్రం... ఆ టైమ్ వచ్చిందంటే... అన్నీ ఆటోమేటిక్ గా సెటిరైట్ అయిపోతాయి. సహనంతో మన ప్రయత్నం మాత్రం మనం చేయాలి..." చిరునవ్వుతో వేదాంతిలా చెప్పాడు మోహన్ బాబు.
"అవును.. మీరు చెప్పింది నిజమే !... నా అభిప్రాయం ప్రకారం... ఆ సమయం ఆసన్నమయిందని అనిపిస్తోందండీ !..."
"అంటే !... మీ తరఫున మనకు తగిన వారు ఎవరైనా వున్నారా !.. మీ అన్నయ్యగారు ఏదైనా సంబంధాన్ని చెప్పారా !..” ఆతృతతో అడిగాడు మోహన్.
“మనవాడే ఓ పిల్లను చూచి నాకు ఫోటో పంపాడు. చూడండి... " తన సెల్లోని నారాయణి ఫొటోను భర్తకు చూపించింది పార్వతి.
మోహన్ బాబు ... ఆ ఫొటోను చూచి ఆశ్చర్యపోయాడు.
ఆయనికి వారి పెండ్లి చూపులు గుర్తుకు వచ్చాయి.. ఆశ్చర్యానందాలతో...
"పారూ !... ఎవరు ఈ అమ్మాయి ?... అచ్చం నీలా అంటే మన పెండ్లిచూపులు నాడు నీవు ఎలా వున్నావో... అలాగే వుంది కదూ !..." చిరునవ్వుతో అడిగాడు మోహన్......
“అవునండీ....”
“మనవాడు ఈ పిల్లను ప్రేమించాడా !..."
“లేదు....”
“వీరు మనవారేనా ?...”
“ఆ...'
“అయితే ఈ అమ్మాయి మనవాడికి నచ్చిందన్నమాట !..”
“తెలీదు !..."
“తెలియదా !..."
“అవును...”
“అయితే.. ఈ ఫొటోను వాడు నీకు ఎందుకు పంపినట్టు ?...”.
“నాలా వున్నందున...”.
మోహన్ వెంటనే బదులు పలుక లేదు.. ఆలోచన !....
'తనకు ఇష్టం లేందే... హరి ఎవరో అమ్మాయి ఫొటోను తన తల్లికి ఎందుకు పంపుతాడు... మనస్సులో ఆమెపై ప్రేమ అనే భావన వుండివుంటేనే ఇలాంటి చర్యలు జరుగుతాయి. ఏది ఏమైనా హరితో మాట్లాడాలి...' ఆ నిర్ణయానికి వచ్చాడు మోహన్....
"పారూ !..."
“చెప్పండీ....”
"ఆ ఆమ్మాయి వాళ్ల వివరాలు...'
"నాకు తెలుసు..."
"ఏమిటీ ?..."
" ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసండీ !...".
“ఎవరో చెప్పు .!..."
"నా మరదలు... మీ పెద్ద చెల్లెలు... మహేశ్వరి కూతురు...” మెల్లగా చెప్పింది సావిత్రి.
మోహన్ ఆశ్చర్య పోయాడు. కనుబొమ్మలు ముడిపడ్డాయి.
అర్థాంగి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.
"హరిని అడిగాను...."
“ఏమడిగావు ?...”
"ఆ అమ్మాయి తల్లి పేరు ఏమిటని ?....”
"ఏం చెప్పాడు ?
నా పెద్ద మరదలు... మీ చెల్లెలు 'మహేశ్వరి' పేరును చెప్పాడు ....".
మోహన్ ముఖంలోకి పరీక్షగా చూస్తూ మెల్లగా చెప్పింది పార్వతి.
కొన్ని క్షణాలు భార్య ముఖంలోకి చూచి... నిట్టూర్చి... తలను ప్రక్కకు త్రిప్పుకున్నాడు మోహన్ బాబు.
పార్వతి మౌనంగా వారి ముఖభంగిమలను గమనిస్తూ వుంది.
“పారూ !..."
“చెప్పండి !...”
"ఆ అమ్మాయి పైన ఎలాంటి ఆశలను పెంచుకోకు...”
“మనవాడు కావాలంటే !...”.
“అనడు...”
“అంటే !..."
ప్రశ్నార్థకంగా పార్వతి ముఖంలోకి విసుగ్గా చూచాడు...
“నా కొడుకు నా నిర్ణయాన్ని ఏనాడు కాదనబోడు పార్వతీ !..." వ్యంగ్యంగా చెప్పాడు మోహన్.
“వాడు ... నాకూ.. కొడుకేనండీ !..."
“అంటే !...”
“వాడు నామాటనూ ఏనాడూ కాదనబోడు...”
“అంటే !...”
‘‘ఆ నారాయణి... నా మరదలు మహేశ్వరి కూతురు... నా రెండవ కోడలు కావాలి... అవుతుంది...." తన నిశ్చితాభిప్రాయాన్ని గంభీర వదనంతో చెప్పింది పార్వతి.
భార్య అవతారాన్ని చూచి మోహన్ బాబు ... సాలోచనగా తలదించుకొన్నాడు.
"కాలం మారింది... మన మనస్తత్వాలనూ... అందరి ఆనందం కోసం మార్చుకోవడంలో తప్పు లేదు... అది తప్పుకాదు...’’ పార్వతి గది నుండి బయటకు నడిచింది. మోహన్ ఆమెను ఆశ్చర్యంతో చూస్తూ వుండి పోయాడు.
* * *
"ఫోన్... రింగయింది...
“హలో !...” సెల్ చేతికి తీసుకొని అన్నాడు హరి.
“నాన్నా... హరీ !...”
“ఆ... చెప్పమ్మా. !...”.
“నేను చెప్పేది జాగ్రత్తగా విను నాన్నా!...”
"ఏంటమ్మా!..."
“నాకు కోడలు కావాలి... '
“ఏదీ !...”
“కోడలు...”
“కోడలా !..."
“అవును....”
“ఎక్కడ వుంది ?... అమ్మా !... ఎవరు ఆ అతిలోక సుందరి? ....” వ్యంగ్యంగా అడిగాడు హరి.
"నీ ఇంటి క్రింది ఇంటిలో వుందిరా !..."
“ఆ...'
"అవును...”
“అమ్మా !... ఏంటమ్మా !... నీ మాటలు... నాకేం అర్థం కావడం లేదు... దయచేసి కాస్త వివరంగా చెప్పమ్మా !..."
“హరీ...”
“ఏమమ్మా!..."
“నేను చెప్పింది నీకు నిజంగా అర్ధం కాలేదా !...”.
“కాలేదు... జననీ !...”
“సరే విను... మీ ఇంటి ఓనర్ కూతురు... నీవు నాకు పంపిన ఫొటోలోని పిల్ల... నాకు కోడలుగా కావలి. అంటే నీవు ఆ పిల్లను ప్రేమించి నీ చుట్టూ తిరిగేలా చేయాలి..." చిరునవ్వుతో చెప్పింది పార్వతి.
"అమ్మా!... ఇలా చెప్పడం... నీకు న్యాయమా !..."
"న్యాయమే కాదురా... ధర్మం కూడా !..."
"ఏందమ్మా !... వింతగా మాట్లాడుతున్నావు ?..."
"ఎప్పుడూ వినని మాటలు విన్నపుడు.. అవి వింతగానే తోస్తాయి. సావధానంగా ఆలోచించుకో... చెప్పిన మాటలను అర్థం చేసికో... సరైన కార్యాచరణ ప్రారంభించు. వీక్లీ పన్స్ నాకు అప్డేట్ చేయాలి..." చిరునవ్వుతో చెప్పింది పార్వతి.
"ఏమిటమ్మా !... " ఆశ్చర్యంతో అడిగాడు హరి.
“నీ లవ్ ప్రోగ్రెస్ !... విష్ యు గుడ్లక్... డియర్..." అంది పార్వతి.
"అమ్మా !... నీవు నాకు ఇలాంటి శిక్షను ఎందుకు వేస్తున్నావమ్మా !.. న్యాయమా !..." దీనంగా అడిగాడు హరి.
"ఓరి పిచ్చివాడా... ఆ మహేశ్వరి ఎవరనుకొన్నావ్ ?..."
“నేను ఏమీ అనుకోలేదమ్మా !... నాకు తెలిసింది వారు నా రెంటెడ్ హౌస్ ఓనర్.. అంతే !..."
“ఆవిడ మీ మేనత్తరా !..."
“అమ్మా !...” ఆశ్చర్యపోయాడు హరి.
“అవును నాన్నా !... మహేశ్వరి నీ మేనత్త... నా మరదలు... మీనాన్నగారి చెల్లెలు...”
తాను ఏవిధమైన సాయం చేసి... మహేశ్వరి వివాహాన్ని ఆనందరావుతో జరిగేలా చేసిందో... వివరించింది పార్వతి.
ఆఫీస్కు రెడీ అయి మేడపై గది నుండి కిందికి దిగి వస్తున్న మోహన్ బాబు... భార్య తన కుమారుడితో సెల్లో చెప్పిందంతా విన్నాడు.
మహేశ్వరి ఇల్లు వదిలి పోయేదానికి సాయంగా తన భార్య... పార్వతి నిలబడ్డ విషయం తెలియని మోహన్ బాబు ఆశ్చర్యపోయాడు.
భార్య కుమారునితో ప్రసంగం ముగించగానే... మెట్లుదిగి క్రిందికి దిగివచ్చాడు.
"పారూ !... నీవు చెప్పిందంతా నిజమేనా !...”
పార్వతి నవ్వుతూ...“ అంతా విన్నారా !...'
అవునన్నట్టు తల ఆడించాడు మోహన్ బాబు... అతని మనస్సున తన భార్య తన కుటుంబ సభ్యులందరినీ మోసం చేసిందనే భావన... ఆమె కళ్లల్లోకి చూచి మాట్లాడలేక పోయాడు.
“వస్తాను... పారూ...” అంటూ వేగంగా వరండా వైపు నడిచాడు.
పార్వతి వారిని అనుసరించింది.
"నేను ఆనాడు... మీ కుటుంబ సభ్యులకు వున్న సమస్యను తీర్చాను. నేను నా కొడుక్కు చెప్పిన ప్రతి అక్షరం సత్యం. అందులో నా స్వార్థం ఏమీ లేదు... మీ అందరి సమస్య పరిష్కారానికే నేను అలా చేశాను... దాన్ని తప్పుగా భావించి... నా కొడుకు వివాహ విషయంలో నా నిర్ణయానికి మీరు వ్యతిరేకత చూపరని... నన్ను సమర్థిస్తారని.... నాకు మీమీదవున్న నమ్మకం అండీ !.. మహేశ్వరి.. నా మరదలు... మీ చెల్లెలు... తెగిపోయిన బంధాన్ని తిరిగి నా కొడుకు హరి నా మరదలు కూతురు నారాయణిల వివాహంతో కలపాలన్నది నా నిర్ణయం. ఆఫీస్కు వెళ్లి సావధానంగా ఆలోచించుకొని మీ నిర్ణయాన్ని నాకు తెలియజేయండి... జాగ్రత్తగా వెళ్లిరండి..." ఈ చివరి పదాల వరకు ఎంతో గంభీరంగా చెప్పిన పార్వతి ఆ రెండు పదాలను చిరునవ్వుతో ఎంతో సౌమ్యంగా చెప్పింది. మోహన్ బాబు కారు కదిలింది. పార్వతి చిరునవ్వుతో ఇంట్లోకి నడిచింది.
* * *
కాలింగ్బెల్ మ్రోగింది.
హరి వెళ్లి తలుపు తెరిచాడు.
ఎదురుగా నిలబడివున్న... తండ్రి మోహన్ బాబును చూచి ఆశ్చర్యపోయాడు.
జారిపోబోతున్న లుంగీని పైకిలాగి కట్టుకొని...
“నాన్నా!..."
“ఆ... నేనేరా !..."
"ఏంటి నాన్నా... ఈ రాక ?... రండి... లోపలికి రండి..."
నవ్వుతూ మోహన్ బాబు లోనికి ప్రవేశించాడు.
“హరీ !..."
“ఏం నాన్నా!...'
"క్రింద వాకిట్లో ముగ్గు వేస్తున్న అమ్మాయి ఎవరురా !..”
"అమ్మాయా !..."
“అవును...”
"ఎలా వుంది ?..."
“మీ అమ్మ పోలికలు ఉన్నాయి..."
“ఆమె ... ఇల్లు కలవారి అమ్మాయి...”
“పేరు నారాయణి కదూ !..."
"అవును... ఆమె పేరు నీకు ఎలా తెలిసింది నాన్నా!..." ఆశ్చర్యంతో అడిగాడు హరి.
“మీ అమ్మ చెప్పింది....”
హరి క్షణం సేపు తండ్రి ముఖంలోకి చూచి తలను ప్రక్కకు త్రిప్పుకున్నాడు.
“హరీ !..."
“చెప్పండి... నాన్నా!..."
"నేను... మీ ఇంటివారితో మాట్లాడాలి... నీవు క్రిందికి వెళ్లి వారితో నేను వచ్చినట్టుగా చెప్పిరా !..."
"విషయం ఏమిటి నాన్నా !...".
"మీ అమ్మ నీకు ఏమీ చెప్పలేదా !...”.
"ఏ విషయంలో..."
"నీ వివాహ విషయంలో...."
"ఆ విషయానికి... ఈ ఇంటివారికి ఏమిటి నాన్నా సంబంధం ?...
“వుంది...”.
“ఏమిటది ?...”
“మహేశ్వరి నా చెల్లెలు నాన్నా !..” విచారంగా చెప్పాడు మోహన్ బాబు..
"నాన్నా.... మీరు చెప్పింది !...."
"సత్యం నాన్నా!..."
“నేను వారితో ఏం చెప్పాలి నాన్నా !...".
"ఎందుకురా అంతగా ఫీల్ అయిపోతావ్ ?.... ఫీల్ ఫ్రీ... నేరుగా క్రిందకు వెళ్లు... ఎవరు కనిపించినా... వారితో 'మా నాన్నగారు వచ్చారు... మీతో మాట్లాడాలనుకొంటున్నారు... మీరు పైకి వస్తారా.. వారిని క్రిందికి రమ్మంటారా.. అని అడిగి... వారి జవాబు తెలుసుకొనిరా... నేను ఈలోగా ఫ్రెష్ అవుతాను... ఆ.. అవును... నీ రూమ్ మేట్...రూమ్ మేట్... వాడి పేరు..."
“సత్య నాన్నా!...”
“ఆ... ఆ... సత్య... వాడేడీ ?..."
“వూరికి వెళ్లాడు నాన్నా !..."
"ఏమిటి విషయం ? ...”
“వాడికి పెళ్లి చూపులట...
“ఓహో.... మంచిది... నీవు క్రిందకు వెళ్లి వారికి విషయం చెప్పి... వారి జవాబును తెలిసికొనిరా!...” మోహన్ బాబు రెస్టురూమ్లోకి వెళ్లాడు.
హరికి అంతా అయోమయంగా తోచింది. 'చెప్పా పెట్టకుండ ఈ మహానుభావుడు వుదయాన్నే ఎందుకు దిగినట్టు ?... ఈ ఆదేశం ఏమిటి ?... తప్పదుగా !... పోయి చెప్పాల్సిందేగా !... జనకుడి ఆజ్ఞ... నేను కాదనలేనుగా!... విచారంగా మెట్లు దిగాడు.
హరి కాలింగ్ బెల్ నొక్కాడు.
ఓ నిముషం తర్వాత నారాయణి... తలుపు తెరచింది.
హరిని చూచి...
“ఏం కావాలి?...”
"మీ అమ్మా.. నాన్నా....
“వారు వూరు వెళ్లారు..."
“ఎపుడొస్తారు..."
"రేపు గాని... ఎల్లుండి గాని....".
"అయితే... ఇంట్లో మీరు ఒక్కరే...".
"వుంటున్నాను. నాకేం భయం లేదు... అవును మా అమ్మా నాన్నలతో మీకేం పని ?...."
"నాకు కాదు... మా నాన్నగారికి... వారు మీ నాన్నగారితో మాట్లాడాలని..." హరి పూర్తి చేయకముందే...
“వూర్లో లేరని చెప్పండి...." అంటూ తలుపు మూసింది నారాయణి.
'అదే డబ్బున్న బలుపు' అనుకుంటూ మెట్లెక్కి పైకి వచ్చాడు...
ఐదు నిముషాల్లో మోహన్ బాబు ఫ్రష్ అయి వచ్చాడు... హరిని చూచి...
“హరీ... ఏమన్నారు ?....”
“వారు వూర్లో లేరు...”
"ఎవరు చెప్పారు ?"
“వాళ్ల అమ్మాయి...”
“ఎపుడు వస్తారట..."
“రెండు రోజుల తర్వాత...".
“ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు ?...”
"ఆ అమ్మాయి మాత్రమే వుందట... తనే చెప్పింది...”
హరి... అప్రసన్నతను చూచి మోహన్బాబు... ఆ పిల్ల సమాధానం కొడుక్కు నచ్చలేదని ఫీలింగ్తో వున్నాడని నవ్వుతూ...
"హరీ .. నాన్నా!..."
"ఏం నాన్నా!..”
“రా... ఇలా కూర్చో...” సోఫాను తట్టి చెప్పాడు...
హరి బిక్కమొహంతో తండ్రి ప్రక్కన కూర్చున్నాడు. తండ్రి ముఖంలోకి చూచాడు.
“నాన్నా... నేను వచ్చింది ఆ అమ్మాయి అమ్మా నాన్నలతో మాట్లాడాలని. మీ అమ్మకు ఆ అమ్మాయి బాగా నచ్చింది. యథార్థంగా ఆ పిల్ల తల్లి నా పెద్ద చెల్లెలు. అతన్ని ప్రేమించి మాకు ఎవ్వరికి చెప్పకుండా ఇంటినుంచి బయటికి వచ్చి పెళ్లి చేసుకొంది. ఇది జరిగి ఇరవై ఒక్క సంవత్సరాలయింది..."
"అవును... ఆ అమ్మాయి ఏం చేస్తూ వుందీ ?..."
“ప్యాషన్ డిజైనర్... ఏదో కంపెనీలో వర్క్ చేస్తూ వుంది నాన్నా!..."
"ఎక్కడ పనిచేస్తోందో తెలుసుకోలేదా !...”
“ఆ విషయం ... నాకు అవసరమా నాన్నా...”
“ఇంతవరకు లేకపోయినా..ఇకమీదట అవసరం అవుతుందిరా !..."
“నాకెందుకు అవసరం ?..."
"ఆ పిల్ల నీ కాబోయే భార్య... ఇది మీ తల్లి నిర్ణయం..."
హరి నిట్టూర్చి తండ్రి ముఖంలోకి క్షణం సేపు చూచి తల దించుకున్నాడు.
"నాన్నా!... నాకు ఆ పిల్ల ఇష్టం లేదు. వెళ్లి అమ్మకు చెప్పండి....."
"ఒరే... ఆ మాటను నేను ఎలా చెప్పగలనురా... అదేదో నీవే చెప్పుకోవాలి సుమా !.. సరే... ఇక నేను బయలుదేరుతాను. వెళ్లి విషయం మీ తల్లికి వివరిస్తాను. నీకు నిజంగా ఆ పిల్ల ఇష్టం లేకపోతే... నీ నిర్ణయాన్ని మీ తల్లికి తెలియచేయి. నేను ఆఫీసు నుండి నేరుగా తనకు చెప్పకుండా వచ్చాను. ఇక బయలుదేరుతాను."
తండ్రీ కొడుకులు కిందకు వచ్చారు... మోహన్ బాబు కార్లో కూర్చున్నాడు. స్టార్ట్ చేశాడు.
నారాయణి ఆ తండ్రీ కొడుకుల కదలికలను గమనించింది. హరి తలవంచుకొని... నారాయణిని గురించి ఆలోచిస్తూ మెట్లు ఎక్కబోయాడు.
“హలో...." పిలిచింది నారాయణి.
బిక్క ముఖంతో నారాయణి ముఖంలోకి చూచాడు హరి...
“వారెవరు ?... అడిగింది నారాయణి.
నిరసనగా ఆమె ముఖంలోకి చూచి... "మా నాన్నగారు...” అంటూ వేగంగా మెట్లు ఎక్కాడు హరి...
* * *
సమయం ఉదయం ఆరుగంటలు. రాత్రి పొద్దుపోయే వరకు క్రికెట్ మ్యాచ్ని చూస్తున్న హరి... సత్యలు హాయిగా నిద్రపోతున్నారు.
హరి సెల్ మ్రోగింది...
నిద్ర మైకంలో సెల్ను చేతికి తీసుకొన్నాడు.
“హలో !...”
“నేనురా... అమ్మను...”
గద్దించినట్టు చెప్పింది పార్వతి.
హరి మైకం దిగి పోయింది.
"రేయ్ !... నిద్రమైకంలో వున్నట్టున్నావు... జాగ్రత్తగా విను... నా కోడలు నారాయణిని తీసుకొని వెంటనే మన పూరికిరా... మిగతా విషయాలు నీవు ఇక్కడకు వచ్చాక చెపుతాను. స్టార్ట్ నౌ..."
హరి ఆశ్చర్యపోయాడు. 'ఆ పిల్లతో నేను వూరికి వెళ్లాలా... ఈ నా తల్లి నిర్ణయం ఏమిటో నాకు అర్థం కావడంలేదు...' సెల్ తీసుకొని తల్లికి రింగ్ చేయబోయాడు.
కాలింగ్ బెల్ మ్రోగింది.
ఆ శబ్దం... చెవులకు సమ్మెట దెబ్బలా వినబడింది.
విసుగుతో... వెళ్లి తలుపు తెరిచాడు.
సుందరంగా అలంకరణతో నారాయణి నవ్వుతూ నిలబడి వుంది.
"ఏం సార్ !... ఇంకా మీరు తయారు కాలేదా !... మా అత్తయ్య, మామయ్యా... అమ్మా నాన్నలు నన్ను మిమ్మల్ని వెంటనే బయలుదేరి రమ్మన్నారు... గీజర్ ఆన్ చేశాను. కాఫీ రెడీ... క్రిందకు రండి... మీరు స్నానం చేసి వెంటనే బయలుదేరాలి... ప్లీజ్ కమ్..." అని చెప్పి క్రిందకు వెళ్లిపోయింది నారాయణి.
భుజాన టవల్ వేసుకొని మంత్రముగ్ధుడిలా క్రిందకు దిగాడు. నారాయణి రెస్ట్ రూమ్ చూపించింది. హరి లోనికి వెళ్లి స్నానం చేసి పదినిముషాల్లో హాల్లోకి వచ్చాడు. డ్రస్ మార్చుకొన్నాడు.
నారాయణి అందించిన కాఫీ త్రాగాడు.
వాకిట్లో కారు హారన్....
ఇరువురూ బయటికి వచ్చారు... నారాయణి ఇంటికి తాళం బిగించింది.
కారువైపు చూచాడు హరి అమాయకంగా.....
“బావా... ఎక్కు... అమ్మా నారాయణి... వెనుక కూర్చోండి....” అన్నాడు సత్య.
“ఒరేయ్... సత్యా... ఏమిట్రా ఇదీ !..." ఆశ్చర్యంతో అడిగాడు హరి...
“మా అత్తయ్య ఆన... ఎక్కండి" నవ్వాడు హరి.. సత్య ప్రక్కన డ్రయివర్ వున్నాడు.
హరి అయోమయ స్థితిలో నారాయణి ముఖంలోకి చూచాడు....
ఆమె కార్లో కూర్చుంది... అందంగా నవ్వుతూ... “రండి బావగారూ..." అంది.
ఆ పిలుపు విన్న హరి... ఆశ్చర్యంతో... మౌనంగా కూర్చున్నాడు. కారు కదిలింది.
"అన్నా!... పిలిచింది నారాయణి....
“ఏమిటమ్మా!..." సత్య జవాబు....
“మన బావ... చాలా భయస్తుడా !..." నవ్వింది నారాయణి.
"అవును మరి ..." అన్నాడు సత్య.
“ఒరేయ్... సత్యా !...” ఆవేశంగా అన్నాడు హరి.
“బావా !... కూల్.. కూల్..." నవ్వాడు సత్య.
హరిని చూస్తూ నారాయణి గలగలా నవ్వింది.
వారి నవ్వులతో హరి శృతి కలిపాడు.... అందరి ఆ నవ్వులకు కారణం. పవిత్ర మైన బాంధవ్య బంధం...
***
// సమాప్తి//
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments