top of page

కొత్త కెరటం! ఎపిసోడ్ 16


'Kotha Keratam Episode 16' - New Telugu Web Series Written By Dinavahi Sathyavathi Published In manatelugukathalu.com On 04/11/2023

'కొత్త కెరటం! ఎపిసోడ్ - 16' తెలుగు ధారావాహిక

రచన: దినవహి సత్యవతి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


అచ్యుతాపురం గ్రామంలోని ఒక మోతుబరి రైతు రామయ్య, ఆయన భార్య జానకి. వారి కుమారుడు రాజేంద్ర, కోడలు కళ్యాణి. డెలివరీ కోసం అడ్మిట్ అయిన కళ్యాణి, బిడ్డను కోల్పోతుంది. హాస్పిటల్ లో రామయ్య గారి శిష్యుడు సూరజ్ అనే వ్యక్తి తారసపడతాడు రాజేంద్రకి.


డెలివరీ సమయంలో బిడ్డను మిగిల్చి తన భార్య చనిపోయిందని రాజేంద్రతో చెబుతాడు. తాను అమెరికా వెళ్ళిపోతున్నట్లు చెప్పి, తన కొడుకును పెంచుకోమంటాడు. అంగీకరిస్తాడు రాజేంద్ర.

రామయ్యకి మనవడితో అనుబంధం పెరుగుతుంది. పరిస్థితులను ఎదుర్కోవడం మనవడికి నేర్పుతాడు. భార్గవ బలహీనంగా ఉండటంతో పోషకాహారాలు తీసుకోవాలని చెబుతాడు రామయ్య.

రామయ్య ఇంటి దగ్గర పాతకాలం నాటి మర్రి చెట్టు ఉంది. రోడ్ వెడల్పు చెయ్యడం కోసం దాన్ని కొట్టబోతుంటే, ప్రభుత్వ అధికారులకు చెప్పి ఆపిస్తాడు భార్గవ.


తమ గ్రామంలో ఉన్న స్పోర్ట్స్ అకాడమీలో భార్గవను చేరుస్తాడు రామయ్య.

స్నేహితుడు అనిల్ తండ్రికి క్యాన్సర్ అని తెలిసి బాధ పడతాడు భార్గవ. తాతయ్య సలహాతో స్నేహితులతో డొనేషన్స్ కలెక్ట్ చేస్తాడు.

భార్గవ సిగెరెట్స్ తాగడం గమనించి, సున్నితంగా కన్విన్స్ చేసి మానిపిస్తాడు రామయ్య.


ఇక కొత్త కెరటం! ఎపిసోడ్ - 16 చదవండి.


“తాతయ్యా మీరూ ఒక సెల్ కొనుక్కోండి ఎంచక్కా మనం వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చును” అన్నాడోరోజు.


సెల్ ఫోన్ పొడే కిట్టదు రామయ్యకి. కొడుకు ఎన్నో సార్లు ఫోన్ కొనిస్తానన్నా ససేమిరా వద్దన్నారు. అలాంటిది మనవడు చెప్తే కొనడమా!

నిర్ద్వందంగా తృణీకరించడమే కాదు ఇక సెల్ఫోన్ మాటే తన ముందు ఎత్తవద్దని ఖరాఖండిగా చెప్పేసరికి మనవడు ముఖం చిన్న బుచ్చుకున్నా తాత మనసు కరగలేదు.


ఒకరోజు స్కూలునుంచి వచ్చి, తాతగారు ఏ విషయంగానో ఆందోళనగా ఉండడం గమనించి ఉండబట్టలేక “ఏమైంది తాతయ్యా అంత కంగారు పడుతున్నారు?” ప్రక్కనే కూర్చుని అడిగాడు.


“పెద్ద సమస్యే వచ్చిందిరా మనవడా” నుదుట పట్టిన చెమట తుడుచుకుంటూ బదులిచ్చారు.

“ఏంటో చెప్పండి?”


“నేనిక్కడికి వచ్చేముందే, తల్లికి ఆరోగ్యం బాగా లేదని మన పాలేరు స్వగ్రామం వెళ్లాడు. వెళ్ళేముందే ఆమె వైద్యానికి డబ్బు అవసరమైతే ఫోన్ చేస్తాననీ పంపించమనీ చెప్పే వెళ్ళాడు.

ఇవాళ ఉదయం ఫోన్ చేసి కొంత డబ్బు తన అకౌంట్ లో జమ చేయమని అభ్యర్థించాడు. బ్యాంకుకి వెళితే వరుస సెలవలని తెలిసింది. ఇప్పటికిప్పుడు అంత పైకం ఎలా పంపాలో తెలియట్లేదురా? సమయానికి మీ నాన్నా ఇక్కడ లేడు” దిగులుగా అన్నారు.


“ఓ అదా మీ సమస్య. అందుకు నాన్న ఎందుకూ నా దగ్గరే పరిష్కారం ఉందిగా. ”


“బ్యాంకులు మూసుంటే నువ్వు మాత్రం ఎలా చేస్తావురా ఊరికే సోది కబుర్లు చెప్పక” విసుక్కున్నారు.

“ఈ సెల్ఫోన్ తో బ్యాంకుకి వెళ్ళక్కరలేకుండానే ఇక్కడ మీ ఎదురుగా కూర్చునే మీ పని చేసి పెడతాగా”


“అదెలాగరా?” అయోమయంగా చూసారు ఆధునిక పరిజ్ఞానం పరికరాల ఉపయోగాలు లాభాలూ అంతగా తెలియని రామయ్య.


“నే చెప్తాగా! అహ.. హ చేసి చూపిస్తాగా మీరు అలా ప్రశాంతంగా కూర్చోండి ముందు. ఇంతకీ మీ దగ్గర ఆ పాలేరు అకౌంట్ వివరాలు ఉన్నాయా?”


“ఆ ఉన్నాయి. అన్నట్లు చెప్పడం మరిచాను ఆ వివరాలు ఇస్తూ వాడి ఫోన్ కి అదెవరో గుగ్గిళ్ళమ్మతో పంపించొచ్చని చెప్పాడురా”


“గుగ్గిళ్ళమ్మతోనా ఆవిడెవరు మధ్యలో?”


“అదేరా అందరి ఫోన్ లోనూ ఉంటోందిట ఈ మధ్య డబ్బులూ అవీ పంపించుకోవడనికి?”


“ఓ.. హొ.. హో.. చంపారు పొండి గూగుల్ పే కొచ్చిన తిప్పలా! చూసారా తాతయ్యా మన దగ్గర పనిచేసే పాలేరు కూడా టెక్నాలజీ వాడుతుంటే మీరేమో ఇంకా పాతపద్దతులే అవలంబిస్తున్నారు. ఛ ఛ ఎంత అవమానం! నాకస్సలు నచ్చట్లేదు ఇదంతా. ప్రతీ దానిలోనూ మంచీ చెడూ రెండూ ఉంటాయని మంచి తీసుకుని చెడు వదిలేయాలనీ మీరే కదా అంటారు. సెల్ ఫోన్ లోనూ అంతేనని ఎందుకు అనుకోరు? ఇప్పుడు చూడండి ఇదే మిమ్మల్ని నమ్ముకున్న ఒక వ్యక్తి అవసరానికి ఆదుకుంటోంది. ”


“అద్సరేగానీ నీ దగ్గర అసలు అంత డబ్బులు ఎలా ఉన్నాయిరా?” అనుమానంగా చూసారు.


“అబ్బా అదా మీ సందేహం. నాకు చదువుకి అవసరమైనవేవైనా కొనుక్కోవడానికి నాన్న ఈ ఫోన్ వాడుకునేలా ఏర్పాటు చేసారులెండి. ఇందులోంచి నేను ఖర్చు పెట్టినదంతా నాన్నకి తెలుస్తుంది ఎందుకంటే డబ్బులు ఆయన అకౌంట్లోంచే వెళతాయి కనుక. నాన్నకి నే చెప్తాలెండి. ఇక ఆ విషయమై మీరు బెంగపడొద్దు. ముందు పాలేరుకి ఎంత పైకం పంపించాలో చెప్పండి చాలు”


పాలేరు పేరూ, బ్యాంక్ పేరూ, ఫోన్ నంబరూ, పంపించాల్సిన పైకం తెలిసాక గూగుల్ పే ద్వారా ఆతడి అకౌంట్ కి తాతగారు చెప్పిన పైకం బదిలీ చేసాడు.

మరో రెండు నిమిషాలకి పాలేరు వద్దనుంచి డబ్బు అందింది కృతజ్ఞతలంటూ ఫోన్!

రామయ్య ఆశ్చర్యానికి అంతులేదు.


“భలేరా మనవడా ఇదేదో మంత్ర దండంలా ఉందే! ఇలా ఇక్కడ నొక్కగానే అలా అక్కడ పని జరిగిపోయింది” సమయానికి డబ్బులు అందజేయగలిగానని తృప్తి కలిగింది. అంతే కాదు సెల్ ఫోన్ ఉపయోగం తెలిసొచ్చి అదంటే ఉన్న అపోహలు తొలగిపోయి సదభిప్రాయం కలిగింది.

“ఒరే మనవడా పదరా ఇప్పుడే బజారుకి వెళదాము. నాకోసం సెల్ ఫోన్ కొనుక్కుంటాను”


“వావ్ తాతగారూ ఇంతలో అంత మార్పా! ఈ తాజా వార్త ఇప్పుడే అమ్మకీ నాన్నకీ చెప్తాను. అయితే ఒక షరతు మీ ఫోన్ నేను సెలక్ట్ చేస్తాను. మీరు కాదనకూడదు”


“అలాగే లేరా కాదు అనను సరేనా” తాతగారు గంభీరంగా పలికిన తీరుకి ఫక్కున నవ్వాడు. మనవడి నవ్వుతో జత కలిపారు రామయ్య.


ఆ తరువాత వారానికి ఆఫీసు పని ముగించుకుని, రెండు రోజుల తేడాలో, స్వదేశం తిరిగొచ్చారు కళ్యాణీ రాజేంద్ర.


కొడుకు కోడలితో కబుర్లు చెప్తూ తన సెల్ ఫోన్ చూపించారు.

“ఊ.. మొత్తానికి మీ చేతిలోకీ వచ్చిందన్నమాట ఈ ఆధునిక మంత్రదండం” నవ్వాడు.


“తాతని మార్చిన మనవడా అయితే?” నవ్వింది కళ్యాణి.


“ఏం చేస్తాం మరి మనవడు ముందుకు దూసుకుపోతుంటే తాత కూడా పరుగెత్తి అందుకోవాలిగా! లేకపోతే వెనుక బడిన తాత అని లోకం నన్ను చూసి నవ్వదూ!” తమషాగా అని తానూ నవ్వేసారు రామయ్య.


ఆ మర్నాడు మాటల సందర్భంలో “అన్నట్లు నాన్నా అడుగుదామనుకుంటూనే మర్చిపోతున్నాను మన మునసబుగారి మనుమరాలి విషయం ఏం తేలింది?”


“ఆ రోజు చెప్పాను కదా రక్త పరీక్ష కాకుండా అదేదో ఇంకో పరీక్ష, ఏంటబ్బా అదీ.. ”


“డి. ఎన్. ఎ”


“ఆ ఆ అదే, అది కూడా చేసాక ఆ అమ్మాయి అతని కూతురేనని తేలింది”


“ఇదంతా ఎప్పుడు జరిగింది?”


“మీరు విదేశాలకి వెళ్ళిన రెండ్రోజులకి మునసబు వచ్చి తోడు రమ్మంటే వెళ్ళాను. డాక్టర్ తో రిపోర్ట్ నిర్థారించుకుని, లాయర్ ని కలుసుకుని, భార్గవ స్కూలునుంచి వచ్చే టైమవుతోందని నేను ఇంటికి వచ్చేసాను. తర్వాత వారం ఫోన్ చేసి జరిగినది చెప్పారు మునసబు”


“అమ్మయ్య మంచి వార్త చెప్పారు నాన్నా. ఇప్పుడేమంటున్నాడు వాళ్ళబ్బాయి?”


“మునసబు ముక్క చీవాట్లు వేసారట కొడుకుని. ఇంకోసారి పిచ్చి పిచ్చి అనుమానాలతో కోడలిని అనుమానిస్తే ఊరుకునేది లేదనీ, బుద్ధిగా భార్యనీ కూతురినీ ఏలుకోమనీ లేదంటే ఆస్తంతా వాళ్ళ పేరునే వ్రాసి అతడిని ఇంట్లోంచి తరిమేస్తాననీ హెచ్చరించారట”


“మంచి పని చేసారు. అప్పుడు కానీ బుద్ధి రాదు అలాంటి అనుమానపు పిశాచంగాళ్ళకి”


“అవునమ్మా బాగా అన్నావు. మునసబు నిర్ణయం విని నాకూ ఆనందం కలిగింది. మనవరాలి జీవితం కుదుట పడిందని అతడూ సంతోషించాడు. ”


&&&

‘చూస్తూ చూస్తుండగానే భార్గవ పదవ తరగతిలోకి రానేవచ్చాడు. కాలం ఎంత త్వరగా గడిచిపోయిందీ?’ అహర్నిశలూ పుస్తకాలతో కుస్తీ పడుతున్న మనవడిని చూసి అనుకున్నారు రామయ్య.


సహజంగా తెలివిగలవాడూ ఏకసంథాగ్రాహీ అయినప్పటికీ పదవ తరగతి అనగానే ఏదో జంకు మొదలైంది భార్గవకి. అంతకంటే చిత్రంగా వాడి తల్లీదండ్రీ హఠాత్తుగా మేలుకున్నారు కొడుకు చదువు గురించి.


వాళ్ళిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో కొడుకు సాయంత్రం కాసేపు అటూ ఇటూ తిరుగుతూ కనిపిస్తే చాలు “ఏరా ఎందుకలా సమయం వృథా చేస్తావు? పోయి చదువుకో” అని గదిమి గదిలోకి తరిమేవారు.

అసలే స్కూల్లో రోజు రోజూ ఈ పరీక్షలనీ ఆ పరీక్షలని ఒత్తిడీ, ఇంట్లో తల్లిదండ్రుల ఒత్తిడీ, ఈ రెండిటి మధ్యనా అడకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతున్నాడు భార్గవ.


పిల్లల బాధ్యత ప్రధానంగా తల్లిదండ్రులదే కనుక మధ్యలో తాను కలగజేసుకోవడం సబబు కాదని మౌనంగా ఉంటున్నారే తప్ప, మనవడి పాట్లు చూస్తుంటే రామయ్య మనసు బాధతో మూలుగుతోంది.

అర్థ సంవత్సర పరీక్షలయ్యాయి. ఎందుచేతనో కానీ భార్గవ బాగా వ్రాయలేక పోయాడు.


రిపోర్ట్ కార్డ్ చూసి భార్గవమీద విరుచుకు పడ్డారు కళ్యాణి దంపతులు.

రామయ్య వారించబోతే “మీరు ఊరుకోండి నాన్నా అసలు మీ గారంవల్లనే వాడిలా తయారయ్యాడు” కోపగించుకున్నాడు రాజేంద్ర.


కొడుకు మూడ్ బాగోకపోవడం గమనించి అప్పటికి మిన్నకుండిపోయారు రామయ్య.


ఆ మర్నాడు సెలవు రోజైనా కూడా భార్గవ స్పెషల్ క్లాస్ ఉందని స్కూలుకి వెళ్ళాడు.


అదే సరైన సమయమనుకుని “మీ మీ పన్లు ఆపి ఇద్దరూ ఇలా రండి హాల్లోకి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి” కొడుకునీ కోడల్నీ పిలిచారు.


“నాన్నా మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలుసు”


“లేదు నీకు తెలియదు అందుకనే పిలిచాను. ముందు నువ్వు ప్రశాంతంగా కూర్చుని నే చెప్పేది శ్రద్ధగా విను. అమ్మాయ్ నువ్వూ కూర్చో”


“మీ అబ్బాయికి వత్తాసు పలుకుతున్నానని అపార్థం చేసుకోనంటే, భార్గవకి చదువు మీద శ్రద్ధ తగ్గుతోందని నాకూ అనిపిస్తోంది మామయ్యా” భర్త ప్రక్కనే సోఫాలో కూర్చుంటూ అంది కళ్యాణి.


“ఏదో ఒకసారి మార్కులు తగ్గినంత మాత్రాన వాడ్నసలు బొత్తిగా తీసిపారేయడం ఎంతవరకూ సబబు?” కోపం ధ్వనించింది రామయ్య స్వరంలో.


“మరీ! మీరే చెప్పండి మార్కులేగా పిల్లల చదువుకి కొలబద్దలు?”


“అదే మనం చేస్తున్న పొరపాటు. అసలు మన విద్యా విధానంలోనే మార్పు రావాలి. అది మన ఒక్కరివల్లా సాధ్యమయేది కాదు కనుక మన పిల్లల్ని మనం సరిగ్గా అర్థంచేసుకుని సహకరిద్దాము. ఎవరైనా శక్తికి మించి ఏ పనీ చేయలేరు ముఖ్యంగా పిల్లలు. భార్గవ కూడా అంతే. వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి. అంతే కానీ గొంతు చించుకుని అరిచీ గదమాయిస్తే మొదటికే మోసం వచ్చి అసలు చదవమని మొండికేస్తారు. అప్పుడిక మనం చేయగలిగిందేమీ ఉండదు”


“మీవన్నీ పాతకాలపు ఆలోచనలు నాన్నా. ఇప్పటి పిల్లలు మీరు అనుకుంటున్నట్లుగా లేరు. చాలా చురుకు. తతిమ్మా పిల్లల్ని చూడండి ఇరవై నాలుగు గంటలూ చదివిన వాళ్ళు చదివినట్లుంటారు. వీడేమో పది నిమిషాలు చదివి ఇరవై నిమిషాలు అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తాడు”


“ఆ ఆలోచనే సరికాదంటాను. అందరి తెలివి తేటలూ, చదివే విధానం ఒక్కలా ఉండవు. అన్నిటికంటే ముఖ్యంగా మీ పిల్లవాడిని ప్రక్కవాళ్ళతో పోల్చడం మానుకోండి. అది మీకూ వాడికీ మనందరికీ మంచిది. ”


“అలా పోలిస్తేనైనా బుద్ధొచ్చి చదువుతాడు”


“బుద్ధిరావడం మాట అటుంచి పిల్లవాడి బుర్ర చెడుతుంది. అసలే పదవ తరగతి దానికి తోడు తోటి పిల్లలనుంచి పోటీ ఇవి చాలవన్నట్లు స్కూల్లో టీచర్లనుంచి ర్యాంకులు కోసం ఒత్తిడి.. ఇలా చెప్పుకుంటూ పోతే భార్గవకి ఇప్పటికే అన్ని వైపులనుంచీ పలు రకాల ఒత్తిళ్ళు. అలాంటప్పుడు అర్థంచేసుకుని సహకరించాల్సిన మీరూ ఇలా మార్కులూ ర్యాంకులంటూ వాడిని మరింత మానసిక ఒత్తిడికి గురి చేస్తే వాడు ఎక్కడికి వెళతాడు ఎవరికి చెప్పుకుంటాడు ఒక్కసారి ఆలోచించండి”


“.... ”


శ్రోతలు ముఖాముఖాలు చూసుకుని తల దించుకున్నారు.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

దినవహి సత్యవతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ దినవహి సత్యవతి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/dsatya

పేరు: దినవహి సత్యవతి

విద్య : బి.టెక్., ఎం.సి.ఎ. ;

వృత్తి : విశ్రాంత కంప్యూటర్ సైన్స్ లెక్చరర్.

ప్రవృత్తి : రచనా వ్యాసంగం.

సాహితీ ప్రయాణంలో నేటివరకూ కథలు, కవితలు(వచన, పద్య, మినీ), నవలలు, గజల్స్, పంచపదులు, పద్యాలు, శతకములు, వ్యాసములు, పద ప్రహేళికలు, లఘు నాటికలు, పంచతంత్రం కథలు, నానీలు, హంసికలు, హైకూలు, సిసింద్రీలు, తెలుగు దోహాలు వంటి వివిధ ప్రక్రియలలో రచనలు చేయడం జరిగింది.


పలు దేశీయ, అంతర్జాల పత్రికలు, బ్లాగులు, ATA & NYTTA జ్ఞాపికలలో రచనలు ప్రచురితమైనవి.

గుర్తింపు : చైతన్య దీపికలు కథా సంపుటీలోని ‘దీక్ష’ కథ మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 12 వ తరగతి విద్యార్థులకు తెలుగు పాఠ్యాంశంగా తీసుకొనబడింది.

పలు కథా, కవితా, పద్య సంకలనములలో కథలు & కవితలు ప్రచురితమైనవి.

ఆటవెలది ఛందస్సులో ‘మధుర సత్య శతకం’ వ్రాయడం జరిగింది.

6 గొలుసుకట్టు నవలలలో భాగస్వామ్యం చేయడం జరిగింది.

ముద్రితములు: ‘చైతన్యదీపికలు’ (బాలల కథల సంపుటి) & ‘ఇంద్రధనుస్సు’ (సప్త కథా సంపుటి) &

గురుదక్షిణ (కథల సంపుటి ) ; ‘పంచతంత్రం కథలు’ (బొమ్మల బాలల కథల సంపుటి);

పంచామృతం!(సత్య! పంచపదులు)


స్వీయ బ్లాగు(My Blog) : “మనోవేదిక” : Blog – id: http://satya-dsp.blogspot.in


76 views0 comments

Comentários


bottom of page