బంగారు గాజులు
- Addanki Lakshmi

- 6 hours ago
- 3 min read
#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #BangaruGajulu, #బంగారుగాజులు, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Bangaru Gajulu - New Telugu Story Written By Addanki Lakshmi
Published In manatelugukathalu.com On 10/11/2025
బంగారు గాజులు - తెలుగు కథ
రచన: అద్దంకి లక్ష్మి
“అమ్మా! అమ్మా! ఇలా రా!” అంటూ కంగారు పెట్టాడు అప్పుడే ఆఫీసు నుంచి వచ్చిన రాకేష్.
“వస్తున్నాను రా, ఉండు!” అంటూ తల్లి పద్మావతి వంటగదిలోంచి వచ్చింది.
“ఏమిట్రా హడావుడి?” అన్నాడు రామారావు టీవీ చూస్తూ.
రాకేష్ చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాడు. అందులోంచి ఒక డబ్బా తీశాడు.
“అమ్మా! నువ్వు ఇటు కూర్చో, నాన్నగారి దగ్గర,” అన్నాడు.
లలిత జ్యువెలరీ నుంచి తెచ్చిన బాక్స్ అది. అందులోంచి రెండు జతల బంగారు గాజులు తీశాడు.
రామారావు, పద్మావతి ఇద్దరూ ఒకటే ఆశ్చర్యం.
“ఇవి ఎక్కడి నుంచి తెచ్చావురా?” అని అడిగింది తల్లి.
“అమ్మా! రేపు వరలక్ష్మి పండుగ కదా! నువ్వు అమ్మవారికి పూజ చేసుకుంటావు. అందుచేత నీకు ఈ బంగారు గాజులు తెచ్చాను,” అన్నాడు సంతోషంగా రాకేష్.
తల్లిదండ్రులిద్దరూ సంతోషంతో ఉప్పొంగిపోయారు.
“ఇంత డబ్బు నీ దగ్గర ఎక్కడ వచ్చింది రా?” అన్నాడు తండ్రి.
“నాన్నగారు! ఏడాది పాటు నా సాలరీ అంతా సేవ్ చేసి అమ్మకి ఈ బంగారు గాజులు కొన్నాను,” అన్నాడు రాకేష్ ఆనందంగా.
“అమ్మా, ఇదిగో తీసుకో,” అంటూ తల్లికి ఇచ్చి తల్లిదండ్రులిద్దరి కాళ్లకు వందనం చేశాడు. తల్లిదండ్రులు ఇద్దరూ పిల్లవాడిని ఆశీర్వదించారు.
పద్మావతి గాజులు చేతికి తొడుక్కుంది. సరిగ్గా సరిపోయాయి — తళతళ మెరిసిపోతున్న బంగారు గాజులు!
“నా సైజు నీకు ఎట్లా తెలిసింది రా?” అంది పద్మావతి ఆశ్చర్యంగా.
“ఏంటమ్మా! నీ గాజులో ఒకటి తీసుకెళ్లాను అంతే,” అన్నాడు నవ్వుతూ రాకేష్.
“అమ్మా, నేను స్నానం చేసి వస్తాను. అన్నం వడ్డించు,” అంటూ బెడ్‌రూం లోకి వెళ్లిపోయాడు.
“పద్మా! నీ జీవితంలో బంగారపు గాజులు వేసుకునే చిన్న కోరికను నేను నెరవేర్చలేకపోయాను. కనీసం ఈరోజు నీ పుత్రుడు నీ కోరికను తీర్చాడు,” అంటూ బాధతో అన్నాడు రామారావు.
“ఊరుకోండి, అలా బాధపడవద్దు”
“అవును నిజమే — ఈ సంసార జీవితంలో సగటు మనిషి ప్రయాసలు అందరికీ తెలుసు కదా! కట్టుకున్న భార్యకు చిన్న చిన్న కోరికలు కూడా తీర్చలేని బ్రతుకులు… నాలాంటి వారి జీవితాలు,” అన్నాడు రామారావు.
గతం గుర్తొచ్చింది —తండ్రి చిన్న గుమాస్తా ఉద్యోగం చేసేవాడు. రామారావు తర్వాత ముగ్గురు చెల్లెళ్లు. తండ్రి రామారావుకి డిగ్రీ వరకు చెప్పించాడు. మున్సిపల్ ఆఫీసులో గుమాస్తాగా చేరాడు.
తల్లి తండ్రి, వచ్చే పోయే చుట్టాలు, ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేసేసరికి తల ప్రాణం తోకకి వచ్చింది.
పద్మావతికి పెళ్లిలో పెట్టిన గొలుసు — నల్లపూసల గొలుసు! వాళ్ల పుట్టింటివారు కూడా అంతంతే.
పద్మావతికి బంగారు గాజులు కొనాలని ఎప్పటినుంచో ఆశ.బాధ్యతలన్నీ తీరిన తర్వాత రామారావు ఒకసారి లోను పెట్టి, “శ్రావణమాసం వరలక్ష్మి వ్రతానికి గాజుల జత కొందాం” అనుకున్నాడు.
తీరా డబ్బు చేతికి వచ్చేసరికి తల్లికి అనారోగ్యం వచ్చింది. హాస్పిటల్‌లో చేర్పించేసరికి డబ్బంతా ఖర్చయిపోయింది.తండ్రి పోవడం, చెల్లెలు పురుడు పుణ్యాలకు రావడం… ఎన్నో బాధ్యతలు!
ఎప్పుడూ లోను పెట్టుకోవడం — తీర్చుకోవడం.
పద్మావతి కోరిక తీర్చలేదని రామారావు మనసులో బాధపడుతూనే ఉండేవాడు.
రిటైర్మెంట్ డబ్బులు వస్తే బంగారు గాజుల జత కొని ఆమెకి కానుక చేద్దామని నిర్ణయించుకున్నాడు.
రాకేష్ ఒక్కడే కొడుకు. చాలా తెలివైనవాడు. బాగా చదివాడు. స్కాలర్‌షిప్‌తో బీటెక్ చదివి మంచి ఉద్యోగం సంపాదించాడు కంపెనీలో.
ఈరోజు కొడుకు ఎదిగి తల్లికి కోరిక తీర్చాడని రామారావు మనసులో ఎంతో ఆనందపడ్డాడు.
“భోజనం వడ్డించాను రండి!” అంటూ పద్మావతి పిలిచింది.
ఇదీ సగటు మనిషిగా తన జీవితం — కనీసం ఆమె కోరికను కొడుకే తీర్చాడు అని అనుకొని నిట్టూర్చాడు రామారావు.
&&&&&&_
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు సేవా కార్యక్రమాలు నిర్వహించాను. నాటకాలు వ్రాసి విద్యార్థుల నాటకాలు వేయించాను. బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను. సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి.
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను.
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు, పద్యాలు ప్రచురించ బడినవి. కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు, పంచపదులు, సున్నితాలు, ఇష్టపదులు
**గేయాలు, వ్యాసాలు, నాటకాలు, పద్యాలు, గజల్స్,
కథలు, రుబాయీలు, బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు, తొణుకులు, చిలక పలుకులు, పరిమళాలు, మధురిమలు, ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు, సున్నితాలు, పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,, 2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
ప్రచురణ: కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,



Comments