'Bhale Mogudu Bhale Pellam' New Telugu Story
Written By Nallabati Raghavendra Rao
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
లంబోదరం బీకాం భోజన ప్రియుడు. తీయ తీయని లడ్డూలు, హాట్ హాట్ పకోడీలు జిహ్వకు చంచలం పుట్టించే ఏ జీడి పాకం శాల్తీ నయనా చొంగలు కార్చుకుంటూ లాగించేస్తాడు. ఖచ్చి తంగా చెప్పాలంటే కారుతున్న చొంగని సైతం చూపుడు వేలుతో అందిపుచ్చుకొని మరీ జుర్రే స్తాడు. అంతా బాగానే ఉంది అదృష్టమే కలిసి రాలేదన్నట్లు అతని ఒక్కగా నొక్క భార్యామణి పేరు… అనుకూలవతి అతనికి అననుకూలంగా తయారైంది!
సమస్యల్లా ఏమిటంటే పెళ్లి అయిన తర్వాత ఈ ఆరు సంవత్సరాల కాలంలో అనుకూలవతి భర్తకి ఇష్టమయ్యేలా ఏ వంట చేసి పెట్టలేక పోయింది.
ఇంకా పిల్లలు పుట్టలేదు కదా బోల్డంత ఖాళీ సమయం.. వంటలు భలే భలే పసందుగా.. మసాలావిందుగా.. తీపి ఘుమఘుమలతో ఎందుకు వండలేకపోతుంది.. ఇదీ భార్య విషయంలో లంబోదరం సమస్య.
భార్య అనుకూలవతి బెల్లం గారెలు చాలా బాగా చేస్తుంది కానీ బెల్లం మాత్రం ఏబులానికి బదులు 50 గ్రాములే వేస్తుంది.. ఇక కూరల విషయాని కొస్తే కోడి మాంసం కూర సూపర్ గా వండేస్తుంది… అందులో కారం మాత్రం ఆరు స్పూనులకు బదులు అర స్పూనే వేస్తుంది. గుత్తి వంకాయ కూర అదరహో వండేస్తుంది. కానీ అందులో ఉప్పు మాత్రం మూడు స్పూనులకు బదులు ముప్పావు స్పూనుడే వేస్తుంది... ఇక రుచి ఎక్కడ ఏడుస్తుంది?
పెళ్లయిన కొత్తలో లంబోదరం పెళ్ళానికి కొత్త కదా.. అని ఇవేవో సరికొత్త వంటకాలేమోనని సరిపెట్టు కున్నాడు.. కొత్త మోజుతో. కానీ బయట హోటల్ తిండికి, తన ఇంట్లో తిండికి ఏదో తేడా కొట్టొచ్చినట్లు కనపడడమే కాకుండా.. ఈమధ్య తినలేక తినలేక తిన్నప్పటికి అరగక ఒకవేళ అరిగిన.. మళ్లీ పెళుక్కున భళక్కున వాంతులు కూడా అయిపోతున్నాయి.
ఒకరోజు భార్యను దగ్గరగా పిలిచి.. '' ఏమోయ్ అనుకూలవతి.. పెళ్లికి ముందు నీ పేరు విని మోసపోయానోయ్. ధర్మారావు అంటారు ధర్మా లు చేయడు.. శ్రీరామచంద్రమూర్తి అంటారు అతగాడేమో కృష్ణుడిలా శృంగారపు పురుషుడు అవుతాడు. సరే సతి అనసూయ అన్న పేరు పెడితే సూర్యకాంతంలా దడదడ లాడించేస్తుంది.
అక్కడికి నీ సంబంధం కుదుర్చుకోపోయే ముందు మా అమ్మతో అన్నాను.. 'అమ్మా! పెళ్లి కూతురు పేరు అనుకూలవతి అట. అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుందేమో అని.. దానికి మా అమ్మ ఏమందో తెలుసా.. ‘నీకు అనుకూలంగా లేకపోయినా పర్వా లేదురా భడవా! మాకు అనుకూలంగా ఉంటే చాలు’ అంటూ నా మెడలు వంచి ఒప్పించేశారు. నేనే వేసానో ఇంకెవరైనా వేశారో తెలియదు కానీ మొత్తానికి మూడు ముళ్ళు పడిపోయాయి నీ మెడలో.
అదిగో అక్కడ నుంచి మహాఖర్మ మొదలైంది నాకు. చక్కగా కడుపార ఏరోజైనా తింటే ఒట్టు. అందుచేత ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణ యానికి వచ్చేసానోయ్.. ఇక నీతో కాపురం చేయలేను గాక చేయలేను. ఒక రోజా.. రెండు రోజులా.. అర్థ పుష్కరకాలం పుష్కలంగా దాటి పోయింది.. పదహారణాల తిండి తిని. ఇదిగో ఈరోజే మీఅమ్మ. నాన్న, నా బంధువులు. నీ బంధువులు అందరూ వస్తున్నారు.. రౌండ్టేబుల్ సమావేశం పెట్టి నీ అంతు తేల్చేస్తాను. రుచిగా వండమని నీకు ప్రతిరోజు చెప్పి చెప్పి ఏడ్చి ఏడ్చి ఈ నిర్ణయానికి వచ్చాను. అటో ఇటో తాడో పేడో అట్టో ముక్కో తేల్చేసుకుంటాను. '' అంటూ ఆవేశంతో ఆయాసంతో కరచినట్టు అరిచాడు లంబోదరం.
కాసేపటికి అనుకున్నట్టు అందరూ వచ్చేసారు.
అనుకూలవతి రౌండ్ టేబుల్ సమావేశంలో అందరి ముందు దోషి లా నిలబడింది.
''ఏమ్మా ఆయన చెప్పింది నిజమేనా? కారం ఉప్పు తీపి సరిపడా వేయటం నీకు ఎప్పటికీ అలవాటు కావడం లేదట. భర్తను అలా బాధ పెట్టడం ధర్మమేనా ?.. ''
అంటూ అడిగాడు తాతవరస పెద్ద మనిషి.
''తాతయ్యగారూ.. పొదుపు చేస్తే నా సంసారమే బాగుంటుందని ఎప్పుడైనా కాస్తంత కారం, ఉప్పు, తీపి తగ్గించి వేసి వంట చేశానేమో... అమ్మా, నాన్న గారు.. దీనికి ఇంత అల్లరా? సరే.. రేపటినుండి ఆయనకు అన్నీ ఓ పిసిరంత ఎక్కు వే వేసి వండుతానులే. '' అంటూ అందరికీ సర్ది చెప్పి పంపించేసింది.. అలా ఆ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది అప్పటికి.
అప్పటినుండి అనుకూలవతి వంటలు సూపర్ సెన్సేషనల్ గా నచ్చడం మొదలైంది లంబో దరానికి.
''ఆహా ఓహో అయ్యారే భళీభళీ భళారే... " అనుకుంటూ చిందు నాట్యం చేస్తూ పెదాలతో తీపి పాకం జుర్రుకోవటం నాలికతో కారం కూరలు నాకేయడం, నాలిక ఘాటెక్కితే నాగలోకంలో నాగరాజులా మెలికలు తిరుగుతూ ముక్కు చీదటం.. కళ్ళ వెంట కారే కారం కన్నీళ్లు.. స్పెషల్ ఎపియరెన్స్ గా భావించటం మొదలు పెట్టేసాడు లంబోదరం.
అంతేకాదు మీసాలు పెంచుకొని వాటిలని మెలిక తిప్పడం.. పెరుగుతున్న చిరు బొజ్జని చూసి అష్టైశ్వర్యాలకు అది చిహ్నమని చిలిపి నవ్వు నవ్వడం... అంతేకాకుండా ప్రతి రోజు రాత్రికి భార్యకు మూర బదులు మీటరు మల్లెపూదండ తేవడం... వగైరా వగైరా లంబో దరానికి రోజువారి చర్యలయ్యాయి.
ప్రస్తుతం లంబోదరం బ్రతుకు బంగారు పూల బాటల తోటలాగా స్వర్గ స్వర్ణ సింహాసనం మీద రాజు లాగా మారిపోయింది.. అతను మహదానందంతో చిందునాట్యాలు బిందె మీద నాట్యా లు... భరత నాట్యాలు బురద మీద కూడా నాట్యాలు... కూచిపూడి నాట్యాలు.. కుoడ మీద కూడా నాట్యాలు.... చేసి పడేస్తున్నాడు. అలా అలా సంవత్సరం గడిచింది.
ఆ తర్వాత......
లంబోదరం దశానాథుడు వక్రమార్గాన పయని స్తున్న ఒక అశుభసమయాన అతను తమ యొక్క ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లి రెండు గంటల తర్వాత తిరిగి వచ్చాక... వచ్చాక...
చాలా సేపు తన రూమ్లో ఒంటరిగా కూర్చుని మౌనంగా గడిపాడు. సీలింగ్ ఫ్యాన్ చల్లగా గాలి వేస్తున్న శరీరం అంత చెమటలు పట్టింది. అతని మనసు తనకు తెలియ కుండానే కిందామీద కుదుపులకు గురయ్యాక... చివరికి దుర్ముహూర్తం రాహు కాలం ముగిసే సమయాన ఖచ్చితమైన ఓ నిర్ణయంతో బయటకు వచ్చి..
''ఏమోయ్ అనుకూలవతి.. అనుకూలం నా అనుకూలం.. '' అంటూ భార్యను పిలిచాడు, మహత్తర బృహత్తరమైన ప్రేమ వలకబోస్తూ.
''అనుకూలం.. నీ రూటే కరెక్ట్. ఇదివరకు.. అంటే ఒక సంవత్సరం క్రితo.... వివరంగా చెప్పాలంటే రౌండ్ టేబుల్ సమావేశానికి ముందురోజు వరకు నువ్వు వంటలు ఎలా చేసేదానివో ఇప్పుడు కూడా అలాగే చెయ్యి. నిన్ను నేను ఏమీ అనను'' అన్నాడు బుజ్జగిస్తూ.
''అర్థమయ్యేలా చెప్పండి. '' అదోలా ముఖం పెట్టి అడిగింది అనుకూలవతి.
''చెప్తా చెప్తా వస్తున్నా వస్తున్నా. అదిగదిగో నువ్వు మొదట్లో వండే దానివి చూడు ఆ ఉప్పు తక్కువైన కూర, తీపి తక్కువయిన గారెలు, కారం బహు తక్కువగా వేసిన చికెన్ కర్రీ.. మళ్లీ సేమ్ డిటో అదేవిధంగా వండాలోయ్''.
భార్య చేతులు రెండు పట్టుకు అడిగాడు లంబోదరం.
''మీకేమైనా మతి పోయిందా? అదెలా కుదురుతుందండి.. అలా వండడం ఎప్పుడో మర్చిపో యాను.. మీ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఇప్పుడు ఈ విధంగా వండడం నేర్చేసుకున్నాను కదా. '' ఖచ్చితంగా చెప్పేసింది అనుకూలవతి.
''నా బుజ్జివి కదూ.. నా బజ్జీవి కదూ.. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో! కానీ నా అతి చిన్న ఈ కోరిక అనుకూలవతి అయిన భార్యగా తీర్చేవు అనుకో... నీకు నెలకు ఒక పట్టుచీర గిఫ్ట్. '' తాయిలం పెట్టబోయాడు భార్యకు.
''నావల్ల కాదంటే కాదు. నేనే మా వాళ్ళతో మాట్లాడి మీకు 15 రోజులకు ఒక జత పెట్టి స్తాను.. నన్ను కంఫ్యూజ్ చేయకండి బాబు. మీరు 100 చెప్పండి నా చేత కాదు మీ మనసు మారిందని నా మైండ్ మారాలి కదా.. కుదరదు గాక కుదరదు'.. అంది అనుకూలవతి కరాకండిగా.
లంబోదరానికి కోపం వచ్చింది... '' ఇదిగో ఇలాగైతే మళ్లీ మీ వాళ్లను మా వాళ్లను పిలిచి గతంలో లాగే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి నీ పరువు మరోసారి తీసేస్తాను. భర్తను గౌరవించడం నేర్చుకోవే. భర్తకు అనుకూలంగా అణిగి మణగి ఉండి... వండక... పోతే ఎట్లా?''
బెదిరించినట్టు మాట్లాడాడు లంబోదరం.
''పిలవండి పిలవండి.. పిలిచి రౌండ్ టేబుల్ సమావేశం మాత్రమే కాదు త్రికోణాల సమావేశం, దీర్ఘ చతురస్రాకారపు సమావేశం, వంకర టింకర సమావేశం ఇలాంటివన్నీ పెట్టేసుకోండి... పెట్టి.. మీరు ఈ విషయం అంత చెప్పేసరికి మిమ్మల్ని పిచ్చివాడు అనుకుంటారు. కాస్తంత ఎండిపోయిన పచ్చిగడ్డి నోటి నిండా పెట్టి వెళ్తారు. లేదంటే మెంటల్ హాస్పిటల్ కి లాక్కుని వెళ్ళమని నేనే రికమెండ్ చేస్తాను. '' వీరనారిలా మాట్లాడింది అనుకూలపతి.
లంబోదరం కాళ్ళ బేరానికి వస్తు.. ''అనుకూలం అదికాదే అసలు సిసలు విషయం
ఏం జరిగిందంటే.. ?'' నసుగుతూ చెప్పబోయాడు లంబోదరం.
''ఏమిటట అసలు సిసలు విషయం?'' అడిగేసింది అనుకూలవతి.
''ఇదిగో ఇప్పటికీ ఆ విషయం మన ఫ్యామిలీ డాక్టర్ గారికి.. నాకు మాత్రమే తెలుసు.. బ్రహ్మ దేవుడికి కూడా తెలియదు.. మూడో బుర్రకి తెలియ కూడదు. సమయం సందర్భం వచ్చి నప్పుడు అదే బయటపడుతుందిలే. '' కొంచెం బాధపూరితంగా సీక్రెట్ గా అన్నాడు లంబోదరం.
''ఏమిటి అంత సీక్రెట్?.. '''
మరింత సీక్రెట్ గా అడిగింది అనుకూలవతి.
''ఆ విషయం అలా పక్కన పెట్టు నువ్వు ఇంతకీ నాకు అనుకూలంగా వండుతావా లేదా?? నువ్వు ఆ చప్పిడి తిండి వండగలవా లేదా??'' మళ్లీ ప్రశ్నించాడు లంబోదర.
''మీరు తిన్నప్పటికీ అటువంటి తిండి నేను తినలేను బాబు. మీకు ఇష్టమైతే కాపురం చేయండి లేకుంటే సాధువుల్లో కలిసిపోయి కాశీలో ఆవుల్ని మేపుకోండి. అవి రోజు బోల్డంత పేడ వేస్తాయి.. పిడకలు చేసుకుని అమ్ముకొని హాయి గా బ్రతికేయవచ్చు. '' చరచరా లోపలకు వెళ్ళిపోయింది అనుకూలవతి వైఫ్ ఆఫ్ లంబోదరం బీకాం.
***
అల్లుడు లంబోదరం ఫోన్ చేయడంతో పరిగెట్టు కొని వచ్చారు అనుకూలవతి తల్లి తండ్రి..
''ఇంతకీ ఏమంటారమ్మా అల్లుడు గారు..” అప్పుడే వచ్చిన అనుకూలవతి తల్లి సత్యవతి ప్రశ్నించింది.. ఆమె తండ్రి కూడా అడిగారు కూతురుని.
''నాన్న.. అమ్మ.. మిమ్మల్ని అందరిని ఫోన్ చేసి రప్పించారు కదా! ఆయన్నే అడగండి. ''... అంది మూతి ముడుచుకుంటూ.
''ఆయనతో మాట్లాడాను. నువ్వు సంవత్సరం క్రితంలా కారం ఉప్పు తీపి లేకుండా పదార్థాల వండాలట.. అది ఆయన కండిషన్.''
''ఆలోచించండి ఇలా గంటకో రకంగా మాట్లాడే మనిషితో నేను కాపురం ఎలా చేయగలనమ్మ'' అంది అనుకూలవతి.
''సత్యవతి.. మన అల్లుడు మానసికంగా దెబ్బ తిన్నాడంటావా?..” ప్రక్కనే ఉన్న తండ్రి విశ్వేశ్వ రయ్య ప్రశ్నించాడు భార్య సత్యవతి ని.
''నాకు కూడా అలాగే అనిపిస్తుందoడి. ఇది పూర్తిగా మెంటల్ వ్యాధి. ఖచ్చితంగా ఎర్రగడ్డ తీసుకెళ్లి.. మెంటల్ డాక్టర్ గారికి చూపించాలి మన అల్లుడు గార్ని ''.. అంది సత్యవతి.
''మెంటల్ డాక్టర్ గారికి చూపించాలా... అంటే నీ ఉద్దేశ్యo ప్రకారంగా మెంటల్ ఉన్న డాక్టర్ గారికి చూపించాలనా నీ భావం.” కించిత్తు అనుమానంగా అడిగాడు విశ్వేశ్వరయ్య భార్యను.
''మీ భావాలు... అనుమానాలు ముగ్గుబుట్టలో
పెట్ట..... మెంటల్ డాక్టర్ అంటే... మెంటల్ ఉన్న వాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ అని అర్థం.. మీరో రకం.. మీతో కూడా పడలేకపోతున్నాను బాబు'' చిరాగ్గా అన్నది సత్యవతి.
''అమ్మాయి అనుకూలవతి చెప్పినట్టు ఇలా గంట గంటకు రకరకాల ఆలోచనలు మార్చే బిహేవియర్ చాలాడేంజర్. ఖచ్చితంగా చెప్పా లంటే ఇది... మెంటల్ వ్యాధి. మెంటల్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్దాం పదండి అలా చూస్తు న్నారు ఏంటి... మెంటల్ డాక్టర్ అంటే మెంటల్ ఉన్న డాక్టరు అనికాదు మెంటల్ ఉన్న వాళ్ళకి వైద్యం చేసే డాక్టర్ అని.. అర్థం చేసుకోండి పదండి పదండి.'' అంటూ కంగారు పెట్టాడు విశ్వేశ్వరయ్య.
''అల్లుడుగారు.. అల్లుడుగారు" తలుపు తోసుకొని అందరూ అల్లుడు లంబోదరం ఉండే రూమ్ లోపలికి వెళ్లారు.
తెల్ల కాగితం మీద నల్లని అక్షరాలతో లంబోదరం రాసిన కాగితం బల్లమీద ఉంది తప్పిస్తే లంబోదరం అనే ప్రాణం ఉన్న శాల్తీ రూమ్ లో లేదు!
ఆ కాగితం మడత విప్పి చదవడం ఆరంభించారు. ''
“అందరికీ నమస్కారం. నాకు పిచ్చి లేదు, గజ్జి లేదు, బూచి కూడా లేదు. మీరంతా నన్ను పిచ్చి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి ఇంజక్షన్లు పొడిపించి పిచ్చి పిచ్చి చూపులతో జాలిగా చూస్తారని, మీ మాటల్ని బట్టి నాకు భయం వేసింది. అలా కనక చేస్తే నాకు పిచ్చి లేకపోయినా నిజంగా పిచ్చి పట్టేయవచ్చు. కనుక మీకు అందరికీ భయపడి మీకు కనపడకుండా నా మనశ్శాంతి కోసం ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. ఆరు నెలలు తీర్థ యాత్రలు చేసి తిరిగి వస్తాను..
ఇట్లు పిచ్చి లంబోదరం
సారీ.. పీహెచ్ లంబోదరం బీకాం. "
అంతా చదివిన వచ్చిన వాళ్ళందరూ నవ్వు కోవాలో ఏడవాలో తెలియని స్థితిలోకి వెళ్ళి పోయారు.
ఇక ఇప్పుడు.. అనుకూలవతి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఆమెను ఓదార్చి.. ధైర్యం చెప్పి ఆరు నెలలు ఈజీగా గడిచిపోతాయి అని నమ్మించి.. ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.
చేసేది లేక రాత్రి కావడంతో గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుంది ఒంటరిగా అనుకూల వతి.
దబుక్కున అటక మీద నుండి రాగి చెంబు తన మీద పడింది. అదిరిపడి లేచి ట్యూబ్ లైట్ వేసింది. అటక మీద తాటి ఆకు బుట్టల చాటు నుండి నల్లని రెండు గుడ్లు తననే చూస్తున్నాయి. అమ్మో బావురుపిల్లి.. గండుపిల్లి ఎప్పుడు దూరింది ఇంట్లో అనుకుంటూ అక్కడే ఉన్న రెండు కర్రలతో ఆ కళ్ళు పొడి చేయాలనుకుంది అనుకూలవతి.
''ఏమే అనుకూలం.. గండుపిల్లి కాదే బాబు.. నేనే నీ మొగుడ్ని.. లంబోదరం బీకాం ని.'' గట్టిగా అరిచాడు పైనుండి లంబోదరం.
“మీరా తీర్థయాత్రలకు వెళ్లలేదా.. పుణ్యం వచ్చును కదా. ''
అన్నది అనుకూలవతి ఆశ్చర్యంగా తలపైకెత్తి.
''తీర్థం లేదు అర్థంలేదు యాత్ర లేదు...'అసలు జరిగిందేంటంటే.. '... చెప్పబోయాడు లంబోదరం.
''ముందు కిందకి దిగి రండి తర్వాత చెప్తిరి గాని'' అంది అనుకూలవతి.
''ఎక్కేటప్పుడు ఎలాగో ఎక్కేసేనే.. ఇప్పుడు కిందకు ఎలా దిగాలో తెలియటం లేదే బాబు.'' అన్నాడు లంబోదరం.
స్టూలు తెచ్చి వేసింది భార్య అనుకూలవతి.
''సరే ఎలాగోలా దిగుతాను గాని నువ్వు నాకో మాట ఇస్తావా? నేను చెప్పే రహస్యం ఎవరికీ చెప్పనని రహస్యంగా మాట ఇయ్యి. '' ప్రాధేయంగా అడిగాడు లంబోదరం.
''ముందు స్టూలు మీద కాలు వేసి కిందకు దిగండి ఎవరికి చెప్పను ఏమిటా రహస్యం??'' అడిగింది అనుకూలవతి.
''అమ్మమ్మో దిగను గాక దిగను ముందుమాట ఇయ్''
''మీ మీద ఒట్టు. ఇదిగోమాటిస్తున్నాను.. ఎవరికీ చెప్పను.. అసలు ఏం జరిగిందో చెప్పండి.''
''అనుకూలం ఆ మధ్యన ఒంట్లో అదోలా ఉంటే చెకింగ్ కోసం మన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆయన పరీక్షించి ఆ రెండు.. నాకు వచ్చేసాయి అన్నాడే.''..
ఇంచుమించు ఏడుపు ముఖం పెట్టి అన్నాడు పై నుండి లంబోదరం.
''ఆ రెండు అంటే... ఏ రెండు.. ?'' అర్థం కాక ప్రశ్నించింది అనుకూలవతి.
''అమ్మో వాటి పేరు చెప్పడానికే భయమేస్తుంది.
ఎవరికీ చెప్పవు కదూ అదో పెద్ద రహస్యమే
బాబు''.
''గాలికి కూడా చెప్పను. ఇప్పటికైనా ఏమిటో చెప్పండి ఆ రహస్యo. ''
''చెవి కొంచెం దగ్గరగా పెట్టవే వీధిలో వెళ్లే వాళ్లకు వినపడొచ్చు.. వాట్ల పేరు బీపీ షుగర్.. అవి నాకు వచ్చేసాయట!''.. అన్నాడు అతి భయంకరంగా.
''ఓస్ ఈ మాత్రానికేనా'''... సునాయాసంగా అంది అనుకూలవతి.
''అయ్యయ్యో అలా అనకే బాబు అవి ఉన్నా యని తెలిస్తే ముందు అత్తమామల దగ్గర, ఆ తర్వాత బంధు వర్గం లో, నా ఫ్రెండ్స్ సర్కిల్లో.. నా చరిష్మా దెబ్బతింటాది. నా చార్మింగ్ బ్యూటీ కి మచ్చపడుతుంది. నన్ను ముసలాడి కింద జమ కట్టేసి ఈ 35ఏళ్లకే ఆ ముసలి వాళ్ళ గ్రూపులో చేర్చేసుకుంటారు నన్ను. నేను ఇంకా యువకుడినే బాబు. '' లంబోదరం తెగ ఇదైపోతూ భార్య వైపు జాలిగా చూస్తూ అన్నాడు.
''ప్రపంచంలో చాలామందికి ఉన్నాయి కదా ఈ రెండు ను.. మీరు మరీ పెద్ద బడాయి చేస్తు న్నారు... కిందకిరండి''.. పిలిచింది అనుకూలవతి.
''నువ్వు అలాగని.. అందరినీ పిలిచి మరీ చెప్పేస్తావా.. ఇదిగో చార్మినార్ టాప్ నుంచి దూకి చచ్చిపోతాను.. ఆ.. '' అన్నాడు లంబోదరం కిందకు దూకబోతు.
''అంత అవసరం లేదండి. మన ఇంటి పక్క పాత బిల్డింగు పైకప్పు ఎక్కిపడితే.. మీరు అనుకున్న గోల్ రీచ్ కావచ్చు. సరే మీ గురించి నాకు తెలుసు కదా ఆ పని కూడా చేయలేరు మీరు. దిగండి దిగండి''.. చిరాగ్గా అన్నది అనుకూలవతి.
“అబ్బబ్బా.. నీ మొఖం చూస్తుంటే వీధిలోంచి వెళ్లే అమ్మలక్కలను పనిగట్టుకుని మరీ పిలిచి.. సుబ్బయ్యమ్మ.. మాఆయనకు బీపీషుగర్ లేవు.. నువ్వు ఒకవేళ ఉన్నాయని అనుకుంటు న్నావేమో ఖచ్చితంగా లేవని అందరికీ చెప్పు.... అని పని గట్టుకుని మరీ చెప్పేలాగా ఉన్నావు. అలాగైతే ఇంక నేను గొప్పవాడిని కాలేనే బాబు.. ఆ బెంగతో సంపాదించలేను.. నీకు బంగారపు వడ్డాణం చేయించలేను” లంబోదరం నిరాశగా అన్నాడు.
''ఇదిగో ఇప్పుడు బీపీ షుగర్ బీపీ షుగర్ అంటూ భయపడటం.. కాదు... కారం ఉప్పు తీపి.. కారం ఉప్పు తీపి.. అని ఎగిరి గంతులు వేశారు కదా.. ఇలాంటివి వస్తాయని అప్పుడు తెలియదా మీకు. ఎవరిని పిలిచి మాత్రం చెప్పను కానీ.. ఎవరైనా మీ ఆయనకు బీపీ షుగర్ ఉన్నాయా అమ్మ అని అడిగితే మాత్రం అబద్దం చెప్పలేను. అబద్ధం ఆడటం మా ఇంట వంట లేదు బాబు..'' అంటూ అనుకూలపతి తన చేతిని అందించి భర్త లంబోదరాన్ని జాగ్రత్తగా కిందకు దించే ప్రయత్నం చేసింది.
''హమ్మయ్య ఇప్పుడు నాకు అనుకూలపతి అయి న భార్య వనిపించుకున్నావు. భార్య అంటే నీలాగా ఉండాలే బాబు. ''
నెమ్మదిగా భార్య సహాయంతో అటక మీద నుండి క్రిందకు దిగాడు లంబోదరం బీకాం.. విత్ బీపీ & షుగర్!!!!!!!!.
(హాస్యం కరువైన ఈ రోజుల్లో కేవలం సరదా కోసమే ఈ కథ. ఎవరిని కించపరచడం కాదు ) - రచయిత..
***
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు
Comments