భావగ్రాహి - మానవాభివృద్ధి
- Pavana Datta Sai Kulakarni

- 2 hours ago
- 3 min read
భావగ్రాహి, మానవాభివృద్ధి, ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ కథ, జంతు ప్రేమ, ప్లాస్టిక్ కాలుష్యం, శబ్ద కాలుష్యం, జీవ వైవిధ్యం, తెలుగు కథ, కులకర్ణి పవన దత్తసాయి

Bhavagrahi - Manavabhivruddi - Telugu Inspirational Story | Kulakarni Pavana Dattasai
భావగ్రాహి - మానవాభివృద్ధి - తెలుగు ప్రేరణాత్మక కథ | కులకర్ణి పవన దత్తసాయి
Published in manatelugukathalu.com on 12/07/2026
అభివృద్ధి అంటే కేవలం నగరాలు, రహదారులు, సాంకేతికత మాత్రమేనా? లేక మనతో పాటు భూమిపై జీవిస్తున్న ప్రతి జీవికి సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించడమా? మనిషి చేసే ప్రతి చర్యను జంతువుల దృష్టిలోంచి చూపిస్తూ, ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ బాధ్యత, నిజమైన మానవత్వం గురించి లోతైన సందేశాన్ని అందించే ఆలోచనాత్మక కథే "భావగ్రాహి - మానవాభివృద్ధి."
డాక్టర్ భావగ్రాహి అనే మనస్తత్వ శాస్త్రవేత్త ఉండేవాడు. అతడు ప్రతి మనిషి ఆలోచనా సరళిని సరిగ్గా అంచనా వేసేవాడు. ఎవరు ఎలా ఆలోచిస్తారో ఊహించగల మేధాశక్తి ఆయన సొంతం. ఒకరోజు ఆయనకు ఒక వింత కోరిక కలిగింది. "నేను మనుషుల ఆలోచనలను అంచనా వేయగలను, కానీ జంతువులు ఎలా ఆలోచిస్తాయో, అవి మనుషుల గురించి ఏం అనుకుంటాయో తెలుసుకోవా”లనుకున్నాడు.
శాస్త్రవేత్త అయినప్పటికీ వివేకం ఉన్నవాడు కాబట్టి, ఇది మానవ ప్రయత్నం కంటే దైవబలంతోనే సాధ్యమవుతుందని తపస్సు ప్రారంభించాడు. శాస్త్రవేత్త చేస్తున్న తపస్సుకు భగవంతుడికి ముచ్చటేసి, ఎక్కువగా పరీక్ష పెట్టకుండా తొందరగానే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. భావగ్రాహి తన మనసులోని భావాన్ని బయటపెట్టాడు.
భగవంతుడు నవ్వి, "సరే, నీకు పరకాయ ప్రవేశ విద్యను ప్రసాదిస్తున్నాను. దీనితో నీకు కావాల్సిన జంతువులోకి నిన్ను ప్రవేశపెట్టగలను" అన్నాడు.
సంతోషపడిన భావగ్రాహి, తనను మొదట అందరూ పూజించే ఆవు శరీరంలోకి ప్రవేశపెట్టమని అడిగితే, భగవంతుడు తథాస్తు అని ప్రవేశపెట్టాడు. భావగ్రాహి ఒక అందమైన ఆవులోకి ప్రవేశించాడు. ఎక్కడికి పోయినా మనుషులు తనని గౌరవించడం, దండాలు పెట్టడం చూసి, "సంతోషంతో ఆహా, ఈ మనుషులు ఎంత మంచివాళ్లు! జంతువులంటే ఎంత మర్యాద" అని సంతోషపడుతూ తిరుగుతున్నాడు.
అంతలో బాగా ఆకలేసి దగ్గరలో కనిపించిన గడ్డి తిని పడుకున్నాడు. తిన్న గడ్డిని నెమరువేస్తూ కూర్చున్నప్పుడు విపరీతమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోయాడు. కారణం ఏంటని ఆలోచిస్తే, తాను తిన్న గడ్డిలో మనుషులు విచ్చలవిడిగా వాడి పడేసిన ప్లాస్టిక్ కలిసిందని గ్రహించాడు.
ఆ ప్లాస్టిక్ వలన కడుపులో జన్యుపరమైన సమస్యలొచ్చి పాల ఉత్పత్తి తగ్గిపోయింది. దానితో ఆ ఆవు యజమాని దాన్ని కబేళాకి అమ్మేశాడు. తనని కబేళాకి తీసుకెళ్తున్నారని గ్రహించిన ఆవులోని భావగ్రాహి, "బాబోయ్! ఈ మనుషులు నన్ను చంపేసేలా ఉన్నారు, నన్ను వెనక్కి తీసుకో భగవంతుడా" అని అరిచాడు.
అతని అభ్యర్థన మేరకు దేవుడు అతన్ని వెనక్కి తీసుకొచ్చాడు. "ఇదేంటి దేవుడా, మనుషులు ఇంత దారుణంగా ఉన్నారు. ఒకవైపు ఆవుని పూజిస్తూనే మరోవైపు ప్లాస్టిక్ పెట్టి చంపుతున్నారు."
"మరి ఇప్పుడు ఏ జంతువు శరీరంలోకి ప్రవేశిస్తావు?" అని భగవంతుడు అడగగా, "ఈ దేశంలో జంతు ప్రేమికులు కొంతమంది ఉన్నారు స్వామి, కాకపోతే సమస్యల్లా వాళ్లకి కుక్కలు తప్ప ఇంకేవీ జంతువుల్లా కనిపించవు" అని బదులిచ్చాడు భావగ్రాహి.
"కనీసం వాళ్ల ప్రేమ అయినా పొందుతాను" అని కుక్క శరీరంలోకి ప్రవేశించాడు భావగ్రాహి.
సరదాగా వీధిలో తనకి నచ్చినట్టు తిరుగుతున్న ఇతనికి, అంతలో అటుగా వెళ్తున్న ఒక రాజకీయ నాయకుడి ఊరేగింపు కనిపించింది. అందులోని బాణసంచా మరియు ఇతర శబ్దాలకి కుక్కలోని భావగ్రాహికి పిచ్చెక్కుతున్నట్టుగా అనిపించింది. గట్టిగా వాళ్ల మీదకి అరుస్తూ వెళ్తే రాళ్లతో తరిమేశారు.
"ఎంతసేపు వీళ్ల సరదా వీళ్లకే గాని, ఆ భయంకరమైన శబ్దాలకి మేం ఎంతలా భయకంపితులవుతామో వీళ్లకి పట్టిలేదా?" అని విసుక్కుంటూ మళ్ళీ దేవుడిని పిలిచాడు.
భూమి మీద మనుషులు చాలా దారుణంగా ఉన్నారు స్వామి, వాళ్లు లేని చోట నీళ్లలో చేపలాగా నన్ను పంపు అని అడగ్గా, "సరే" అన్నాడు దేవుడు.
అక్కడ కూడా ప్లాస్టిక్ అవశేషాలను తినలేక, మిగతా సముద్రపు జీవుల పట్ల మానవుడి క్రూరత్వాన్ని చూసి, చివరికి వలస పక్షుల్లోకి ప్రవేశించాడు. పగలు రాత్రి తేడా లేకుండా మనిషి చేస్తున్న కాంతి కాలుష్యానికి తన గతి తప్పాడు. ఇంక అలసిపోయి భూమి మీద ఏ ప్రాణినీ మనిషి వదలట్లేదని గ్రహించి ఆత్మావలోకనంలో పడ్డాడు.
అసలు మానవాభివృద్ధి అంటే ఇలా మిగతా జీవరాసుల్ని హింసించి పొందేదా? 'జంతూనామ్ నరజన్మ దుర్లభం' అంటారు కదా! అంతటి దుర్లభమైన మానవ జన్మ పొంది మనిషి మిగతా జీవరాసుల్ని హింసించడమే అభివృద్ధి అనుకుంటున్నాడు.
నిజమైన అభివృద్ధి ఒక మనిషి దృష్టిలో ఇంకొకడు గొప్పగా ఉండడం కాదుగా. మిగిలిన జీవజాతుల దృష్టిలో మనిషి గొప్పగా ఉండడం. ఎందుకంటే మనిషి లేకపోయినా మిగిలిన జీవరాసులు ఉంటాయి కానీ, అవి లేని రోజు మానవజాతికి మనుగడ లేదు కదా.
బాగా ఆలోచించి ఒక వరం అడిగాడు భావగ్రాహి. "నేను ఇప్పటివరకు అన్ని జీవులలో ఉన్న సమయంలో నేను అనుకునే మాటల్ని ('భావాన్ని') మనిషికి వినిపించేలా, వాడు 'గ్రహించేలా' చేసి భావగ్రాహి అనే నా పేరు అందరికీ వర్తింపజేసి, ఆ పేరుకి సార్థకతని చేకూర్చు స్వామి" అని అడిగాడు. దేవుడు తథాస్తు అన్నాడు.
అప్పటినుండి మనుషులు చేసే ప్రతి పని గురించి అక్కడ దగ్గరలో ఉంటే జంతువులు ఏమనుకుంటున్నాయో వీరికి అర్థం అవడం మొదలైంది. కారులోంచి తిని పడేసిన లేస్ ప్యాకెట్ల గురించి పక్కనే వెళ్తున్న ఆవు అనే మాట, రాత్రిళ్లు విపరీతమైన శబ్దాలు చేసేవాళ్లకి ఆ వీధిలో ఉండే కుక్కల మాటలు, చైనా మాంజా వాడుతూ పతంగులు ఎగరేసే పిల్లలకి పక్షుల మాటలు, అభివృద్ధి పేరుతో అడవులను కబ్జా చేసే మనుషులకి ఆ అడవి జంతువుల మాటలు వినిపిస్తూ, వాళ్లు చేసే పనిని మానేయటమో లేదా తీవ్రతని తగ్గించడమో చేయడం ఆరంభించారు.
ఇలా కొన్ని రోజులకి మనుషులు చేసే పనులు జంతువులు తిట్టే తిట్ల మీద కాకుండా స్వయంగా ప్రకృతిని అనుకరిస్తూ చేయడం మొదలైంది.
వృక్షజాలం, జంతుజాలం నిర్భీతిగా బతకగలిగే ప్రకృతిలో బతకడమే మనిషికి నిజమైన అభివృద్ధి.
***
కులకర్ణి పవన దత్తసాయి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: కులకర్ణి పవన దత్తసాయి
నమస్కారం.. నేను కులకర్ణి పవన దత్తసాయి.
వృత్తి రీత్యా AG office Hyderabad లో auditor గా పని చేస్తున్నాను. ప్రవృత్తి రీత్యా సాహితీ ప్రియుడిని.







"ఈ దేశంలో జంతు ప్రేమికులు కొంతమంది ఉన్నారు స్వామి, కాకపోతే సమస్యల్లా వాళ్లకి కుక్కలు తప్ప ఇంకేవీ జంతువుల్లా కనిపించవు" అని బదులిచ్చాడు భావగ్రాహి.