చల్లారని అలనాటి గుండెమంట
- Nallabati Raghavendra Rao

- 3 minutes ago
- 6 min read

Challarani Alanati Gunde Manta | Telugu Comedy Story | Nallabati Raghavendra Rao
చల్లారని అలనాటి గుండెమంట | తెలుగు హాస్య కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు
Published in manatelugukathalu.com on 08/04/2026
గ్రామీణ జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనలు…కొన్ని సార్లు జీవితాంతం నవ్వులు పూయించే జ్ఞాపకాలుగా మారిపోతాయి.
చల్లారని అలనాటి గుండెమంట అనే ఈ సరదా కథలో, ఒక చిన్న తప్పిదం ఎలా పెద్ద కామెడీగా మారిందో మనం ఆస్వాదిస్తాం.
ఈ కథ చదివేటప్పుడు మీరు నవ్వకుండా ఉండలేరు 😂
"ఆయ్.. నాది చెల్లూరండి.... రాంపురం పక్కనన్నమాటండి... నా చిన్నప్పుడు జరిగిన సరదా సరదా "కితకితలు.." సరదాగా మీ అందరితో సెబుదామని ఉందండి.. "
"ఆయ్.. నాకు సైకిల్ తొక్కడం రాదండి.. ఎటకారం కాదండీ నిజమండి. మా ఊర్లో 'బుడ్డోరిదిబ్బ' కాడ మాది ఎంకట్రావు.. మా ఫ్రెండండి... అతనికి నేను ప్రైవేటు చెప్పాలండి... పదో తరగతి పాస్ చేయించాలండి.. అతను నాకు సైకిల్ నేర్పాలండి....' అదండీ.. ఒప్పందం.
ఆయ్.... ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించానండి.. అతను నన్ను ఆళ్ల పొలం తీసుకెళ్ళిపోయి.. అన్నమాట ప్రకారం... సైకిల్ నేర్పించాడు. పూర్తిగా కాదండి.. సగమే.. అందరిలాగా పెడల్ మీద కాలు పెట్టి.. ఎక్కలేనండి... డైరెక్టుగా సీటు మీద ఎక్కేసి తొక్కేయడమే... దానితస్సాదియ్య దిగాలంటే సానా కష్టమయ్యేది... ఒకోసారి... పడిపోయేవాడినన్న మాట...!!!
నాకొక డొక్కు సైకిలు ఉండేదండి. అప్పుడు అడ్డదారి బుట్టాయిపేట నుంచి.. జనం ఉండరని.. నా డొక్కు సైకిల్ మీద... రాంపురం వెళ్ళి విజయ టైపు ఇన్స్టిట్యూట్లో... షార్ట్ హ్యాండ్ నేర్చుకునేవాడిని.
ఓమారు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు.. కొంచెం చీకటి పడుతూ ఉంది.... సన్నగట్ల మీద సైకిలు తొక్కుతూ
.... వస్తున్నాను.. సైకిలు తొక్కుతూ... వస్తున్నాను..
తొక్కుతూ... వస్తున్నాను.. వస్తున్నాను.. వస్తున్నాను.
అర్థం అవుతుందాండి... ఎదురుగుండా.... పదిమంది..... పొలం పనులు చేసుకొని సన్నగట్టు మీన గంపలు నెత్తిమీద పెట్టుకొని వస్తున్న ఆడోళ్ళు..!!
ఆయ్.. ఇక్కడే కూతంత మీరు జాగ్రత్తగా వినాలండి.
ఏదీ మళ్ళీ సెప్పు అనకూడదండి. వింటున్నారు కదండీ.
సరే.. అటుపక్క ఇటుపక్క వరిపొలాలు.. పొలాల్లో సైకిల్తో పడితే ఏ బండ అయినా తగిలితే నా బుర్ర పగిలిపోద్ది... ఆ టైములో నాకు దెబ్బ తగలకుండా ఉండాలంటే ఆడోళ్ళ మీద సైకిల్ ఎట్టడమే మంచిదనిపించింది... కరెక్ట్ అవునా కాదా మీరే న్యాయం సెప్పండి. గట్టు సానా సన్నమండీ. ఆడోళ్ళను తప్పించుకొని సైకిల్ తొక్కడం అసలు కుదర
దండి.
ఇప్పుడు.. మనకు ప్రాణం ముఖ్యం కదా.. ఆయ్....
పెట్టేసేనండి.
వెళ్ళి వెళ్ళిపోయి ఆళ్ళు అందరి మీద సైకిల్ ఎట్టేసి ఆళ్ళ మీద దభీలున పడిపోయానండి.
నాకు పైసా దెబ్బ తగల్లేదండి.
ఇక చూస్కోండి.. సినిమా మొదలయ్యింది.....
ఆళ్ళూరుకుంటారా.... సైకిల్ని... నన్ను కలిపి మడతొక్కేసేరండి... ఆళ్ళందరివీ కలిపి ఇరవై చేతులు, ఇరవై కాళ్ళు, 200 బండతిట్లు...
"గొల్లిగా... గుంజిగా.. గొల్లిగా... గుంజిగా... సచ్చినోడా...." నన్ను ఆళ్ళ ఇష్టమొచ్చిన కాడ చితక మతక చితక బాదేశారు... నా సైకిలు కూడా మూడు ముక్కలయిపోయినాది. ఒక్కడిని ఏం చేయాలండి...
ఇంటికొచ్చి ఆ తిట్లన్నీ జ్ఞాపకం తెచ్చుకొని మరీ కాగితం మీద రాసి పెట్టుకున్నానండి. ఇంటికి వచ్చాక మా వీధిలో పెద్దమనిషి మహానుభావుడు అబ్బాయి గారు... ఆళ్ళ అల్లుడు గారు చుండ్రు మోహన్ రావు గారు.. ఇద్దరికీ... చెప్దామనుకున్నానండి... కానీ.. కానీ 'మందే..' తప్పు కదా అని ఆగిపోయానండి.. మరేమో మా ఇల్లు జంజం వెంకన్న హోటల్ కాడండి.. మా పక్కనే వైట్ల కిట్టారావు గారు.... ఊరి అందగాడు.. ఆయన కృష్ణుడి వేషంలో ఎన్టీవోడిలాగే ఉండేవాడు.. ఆయన చెవిలో ఈ విషయం వేద్దామనుకున్నానండి... అదే పోయింది కదా అని ఊరుకున్నానండి.
మా గోదారోళ్లకి జాలెక్కువండి మరి.
ఏంటో ప్రజలందరూ మాకు కూతంత ఎటకారం ఎక్కువ అంటారు గానీ మాకసలు ఎటకారం అంటే ఏంటో తెలీదండీ
బాబూ.
ఇప్పుడు మీరే సెప్పండి నా కథ మీకు సెప్తున్నాను కదా
నా మాటల్లో ఏదైనా ఎటకారం ఉందండీ? మీరే సెప్పండి.
అయినా.. ఆ ఆడోళ్ళని నేను ఊరుకోనండి...
ఇంతకీ.. ఇది జరిగి 30 ఏళ్ళు అయిపోయింది... ఇప్పటికీ తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది. అయినా ఆళ్ళు తిట్టిన తిట్లు కాగితం రాసి పెట్టుకున్న కాయితం నా దగ్గర జాగ్రత్తగా ఉందిలెండి. ఆళ్ళెప్పుడు కనపడినా తిట్టుకు తిట్టు తిట్టి తీరుతానండి... నాకసలు సానా కోపం ఎక్కువండి.. అందుకనే అసలు... 30 ఏళ్ళ నుంచి నేను ఆ దారిన వెళ్ళనేలేదు.. మరి గంటే.. ఆ దారిన వెళ్తేనే కదా ఆళ్ళు నాకు కనబడేది....
నేనేమో అటు వెళ్లడం లేదు.. అంటే భయం కాదండీ .. మళ్ళీ
అలాగనుకుంటారేమో.
నాకు అసలు భయం లేదండి.. మా ఇంట్లో ఎవరికీ భయం లేదండి... మరి ఇంక ... నేను ఆ దారెంటా వెళ్లనపుడు ..
ఆళ్ళు నాకు ఎలా కనపడతారండి... కనపడరు కదండీ..
ఉన్నది ఉన్నట్లు మీ అందరికీ చెప్పాలి ... అబద్ధం సెప్పకూడదు.
అదన్నమాట..... అన్నట్టు మొన్న తెలిసిందండి... మన పెద్ద రాజుగారు కూడా... చెల్లూరులోనే పుట్టారంట. డైరెక్టుగా కలిసినపుడు.. నా బాధ సెప్తానండి.. ఆయనకు. ఆ తిట్ల కాగితం కూడా... అందరికీ చూపిత్తానండి.
ఇప్పుడు నా 30 ఏళ్ల నాటి కథ అంతా విన్న మీరంతా కలిసి ఆళ్ళని ఎలాగైనా వెతికి పెట్టి నాకు "న్యాయం" చేయాలి... పైన దేవుడు ఉన్నాడండి... పడ్డ వాడు చెడ్డవాడు కాదు. నాకు న్యాయం ధర్మం తెలుసండి... మా సైడోళ్ళు చానా మంచివాళ్ళు అంటారు కదా అండి అందరూ... అందుకే ఆ పేరు పోగొట్టటం ఎందుకండీ... అందరి పేర్లు పోగొట్టడం నాకు ఇష్టం లేదు మరి అందుకని... కొంచెం తగ్గి ఉన్నాను. అందరినీ కలిసినప్పుడు ఇంకా.... వివరంగా చెప్తానండి.... ఆయ్.... ఉంటానండి మళ్ళీ కలుస్తానండి మీ అందరి మధ్య కూర్చొని... ఇంకా చాలా బాధలు సెప్పుకోవాలండి... మీతో.. ఆయ్...
ఉంటానండి....... ఉంటానండి...!
ఏదేమైనా నన్ను అన్యాయంగా తిట్టి కొట్టేసిన ఆ ఆడోళ్ళని మాత్రం ఇంకో 20 ఏళ్ళు పోయినా వదిలిపెట్టనండి.
ఆయ్.. నిజమండి చచ్చిపోయిన మా తాత మీద ప్రమాణం.
ఉంటానండి....... ఉంటానండి...!
***
ఇది ఒక యధార్ధ సంఘటనకు కథారూపం.
ఈ కథ కేవలం సరదా కోసం మాత్రమే.
ఎవరినీ కించపరచడానికి కాదు.
****
సమాప్తం
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు




Comments