top of page

సినీ ప్రొడ్యూసర్.. సినీ డైరెక్టర్


'Cini Producer Cini Director' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao

'సినీ ప్రొడ్యూసర్ సినీ డైరెక్టర్' తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

అవి..


మద్రాస్ లో పాతుకుపోయిన తెలుగు సినిమా పరి శ్రమ.. వేళ్ళతో సహా పెకిలింపబడి హైదరాబాదుకు తరలి వచ్చిన తొలి రోజులు.. ఇంచుమించు రెండున్నర పుష్కరాల క్రితం మాట.


సుబ్రహ్మణ్యేశ్వర రావు ఒక పల్లెటూరు నుంచి తన పొలం పుట్ట అమ్ముకొని హైదరాబాద్ వచ్చాడు. సినిమాలంటే వల్ల మాలిన అభిమానం అతనికి. అది ఎందుకు అంటే అతని తండ్రి సినిమా పరిశ్రమలో ఒక వెలుగు వెలిగాడు.


దాంతో సుబ్రహ్మణ్యేశ్వరరావుకు పరిశ్రమ కొత్త అని పించలేదు. ఎక్కడికి వెళ్లినా అతని తండ్రి పేరుతో గౌరవించేవారు. దాంతో సుబ్రహ్మణ్యేశ్వరరావు తక్కువ పెట్టుబడితో కొత్త నటులతో చిన్న సినిమా తీయాలనుకున్నాడు.. తీశాడు. అదృష్టం కలసి వచ్చింది అతని రూపాయి మూడు రూపాయలు అయింది. ఈసారి పెద్ద సినిమా తీశాడు.. పెద్ద నటులతో. అది కూడా హిట్ అయి కూర్చుంది.


ఇంకేముంది! అలా అలా సుబ్రహ్మణ్యేశ్వర రావు సంవత్సరానికి రెండు సినిమాలు చొప్పున 4 సంవత్సరాలలో 8 సినిమాలు తీసి తీసినవన్నీ బ్రహ్మాండమైన హిట్ అనిపించుకుని అతి పెద్ద సినీ నిర్మాతలలో ఒకడుగా మిగిలాడు హైదరాబాదు మహానగరంలో.


రివార్డులు అవార్డులు సన్మానాలు సత్కారాలతో అతను పైమెట్టు మీద ఉన్నాడు. మనిషి కొంచెం మంచివాడు కావడం వల్ల అతను కొత్త దర్శకులను.. కొత్త కెమెరామెన్లను.. కొత్త నటినటులను.. కొత్త రచయితలను కూడా పరిచయం చేస్తూ పరిశ్రమను నమ్ముకున్న చాలా మందికి తిండి పెడుతున్నాడు.


అలా 2000 సంవత్సరం వచ్చింది.


ఆనందరావు, సునందరావు, మహదానందరావు అనే ముగ్గురు కొత్త దర్శకులు సుబ్రహ్మణ్యేశ్వర దృష్టిలో పడ్డారు. అదిగో అలా అలా అతని చేతి చలవతో మంచి మంచి సినిమాలు తీసే అవకాశం వాళ్లకు కలిగింది. ఆ విధంగా పైకి వచ్చిన దర్శకులుగా ఆ ముగ్గురు దర్శకులు సినీ పరిశ్రమను రమారమీ 10 సంవత్సరాలు ఏలారు. అంటే మహోన్నతమైన మహోజ్వలమైన మణిపూసల లాంటి సినిమాలు తీసి ముగ్గురు కూడా ఇంటర్నేషనల్ దర్శకుల జాబితాలో చేరిపోయారు..


ఆ ముగ్గురు కూడా తమకు మొట్టమొదటగా దారి చూపించిన సుబ్రహ్మణ్యేశ్వర రావు సినిమాలు ఒకపక్క చేస్తూ, మరోపక్క బయట సంస్థల వారు తీస్తున్న సినిమాలు కూడా చేస్తూ.. దశాబ్దకాలం పాటు త్రిమూర్తులుల పరిశ్రమను ఏలేశారు.


ముగ్గురు జాతీయస్థాయి ఉత్తమ చిత్రాలు కూడా తీసి ముగ్గురు రాష్ట్రపతి నుండి మెమొంటోలు అందుకొని దేశచరిత్రలో మణిపూసలు లాంటి దర్శకులుగా ప్రశంసలందుకొని మహోన్నతమైన జీవితాలు అనుభవించారు.


ఎక్కడికి వెళ్లినా సత్కారాలు, సన్మానాలు.. సినీ చరిత్ర పుటల్లో వాళ్ళ పేరు సువర్ణాక్షరాలతో మెరిసిపో తుంది.. అలా ఇంచుమించుగా 2010వ సంవత్సరం చివరకు వచ్చింది అన్నమాట.


***

ప్రపంచంలో పుట్టిన ఏ మనిషికైనా చాలా దశలు జరుగుతూ ఉంటాయి. ఒక్కో దశ కొన్ని సంవత్సరాలు ఉండి మారిపోయి మరో దశ ప్రారంభమవుతూ ఉంటుంది.


జాతకాలు గురించి మాట్లాడుకుంటూ ఉండకపోయినా..


ప్రతి వాళ్ళ జీవితంలోనూ మార్పులు అనివార్యంగా జరుగుతూ ఉండటం ప్రపంచంలో ప్రతిదేశంలో ప్రతి రంగంలో కనిపిస్తూనే ఉంది.


రాజకీయంలో సింహ భాగాన పదవి అలంకరించిన వాళ్ళు జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. సినిమా పరిశ్రమ కూడా అలా జీవితాలు పతనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. పరిశ్రమ రంగములో కూడా ఎన్నో వందల మంది చరిత్రలు ఎవరెస్టు శిఖరం నుండి పాతాళంలో పడిపోయినట్టు మనకి దాఖలాలు ఉన్నాయి.


ఇక్కడ అదే జరిగింది. అదేంటో చాలా చిత్రంగా విచిత్రంగా ఆ సంవత్సరంలో ఆనందరావు, సునంద రావు, మహాదానందరావు తీసిన మూడు సినిమాలు కూడా.. దారుణంగా పరాజయం పాలు అయ్యాయి.


వాళ్లు చక్రం తిప్పిన సంవత్సరాల కాలంలో ఒక్కొక్కళ్ళు రమారమీ 25 సినిమాలు తీశారు, వాట్లలో 10 సినిమాలు రజితోత్సవాలు, మరో 10 సినిమాలు శత దినోత్సవాలు, మిగిలిన 5 సాధారణ విజయంతో అపురూపమైన దర్శకులుగా కళామతల్లి ముద్దు బిడ్డలుగా పేరు పొందారు. అలాంటి వాళ్ళ ముగ్గురు సినిమాలు ఒకే సంవత్సరంలో ఒకేసారి విచిత్రంగా అతి భారీగా తీసినప్పటికీ కూడా ఆడకుండా అట్టర్ ప్లాప్ అయిపోయాయి.


పెట్టిన డబ్బులలో పదో వంతు కూడా రాకుండా.. అట్టర్ ప్లాప్ అవ్వడం వల్ల ఆ సినిమాలు తీసిన నిర్మాతలు దారుణంగా నష్టపోయారు. అప్పటి పరిస్థితులను బట్టి నిర్మాతల నష్టాన్ని తిరిగి ఇవ్వవలసి వచ్చింది ఆ ముగ్గురు దర్శకులకి.


తప్పని పరిస్థితులలో అలాగే చేశారు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని. ఆ తర్వాత ఏమి చేయలేక.. కుటుంబాల్ని పోషించుకోలేని స్థితిలోకి మారిపోయి వాళ్ళ వాళ్ళ కుటుంబాల్ని సొంత ఊర్లకు పంపించేశారు మళ్లీ కొత్త సినిమాలు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.. ఎవరి మటుకు వారు విడివిడిగా.


అదుగో అప్పుడే ప్రపంచంలో మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఆ ముగ్గురు దర్శకులకు బాగా అర్థం అయ్యాయి. గతంలో బాగా పాముకున్నవాడు దారిలో కనిపిస్తే మొఖం పక్కకు తిప్పుకునేవాడు.


అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచి గుండెలకు హత్తుకున్న ప్రతి వాళ్లు ఫోన్ ఎత్తడం మానేశారు.


సినిమాలకు కొత్తగా కథలు తయారు చేసుకుని నిర్మాతలకు కథలు చెప్పడానికి.. దర్శకత్వం చేయ డానికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఐరన్ లెగ్ అనేవారు. వాళ్లకు ఎదురైన బోలెడన్ని అనుభవాల సారంతో బంగారం లాంటి కథలు తయారు చేసుకునేలా వాళ్లకు మార్గం సుగమము అయింది. అలా ఇంకా చాలా సరికొత్త కథలు తయారు చేసుకున్నారు కూడా.. అయినా ఫలితం దక్కలేదు.


ఆ సమయంలోనే కొత్త దర్శకులు వచ్చి మహోన్నతమైన సినిమాలు తీసి రూపాయకు పది రూపాయలు లాభం తెచ్చేలా చేస్తుండడంతో.. ఆనంద సునంద మహదానందరావులకు కొత్త సినిమా ఒప్పుకుని చేసే అవకాశం రావడం చాలా కష్టమైంది. కొత్త మోజు పాత రోత అన్నట్లు తయారయింది వాళ్ళ పరిస్థితి.


అలా అలా సంవత్సరాలు గడుస్తున్నాయి. ఖాళీగా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నట్లు 8 సంవత్సరాలు పూర్తయినా.. చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. పరిశ్రమకు వచ్చిన కొత్తలో కృష్ణానగర్లో గతంలో కలిసిన గార్డెన్ లో సడన్ గా కలుసుకున్నారు ముగ్గురు. ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకుంటూ.. ఇక తమ భవిష్యత్తు ఏమిటి అన్నట్టు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు.


సినీ పరిశ్రమలోనే కాదు ఎక్కడైనా ఈ మనుషుల మనస్తత్వాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కుటుంబంలో పెద్ద 50 సంవత్సరాలు కుటుంబంలోని వారందరికీ ఉపకారాలు చేసి చేసి ఒక సంవత్సరం చేయకపోతే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ చి చి ఛి ఛి అనేస్తారు. ఏమాత్రం మొహమాటం, విశ్వాసం, పెద్దతనం లేకుండా.


ఎన్నో ఉపకారాలు చేసిన ఒక వ్యక్తి అనుకోకుండా పోలీస్ కేసు లో ఇరుక్కుంటే అతని వల్ల ఉపకారాలు పొంది జీవితంలో అభివృద్ధి చెందిని వాళ్ళు అతనికి కొంచెం కూడా ఉపకారం చెయ్యరు.


దౌర్భాగ్యపు మనుషులు.. ఈ మనుషులు ఇంతే.


*

కానీ దేవుడు అనే వాడు ఉన్నాడు. అతను ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా ఆలోచించి అక్కడ పెడుతూ ఉంటాడు.


ఆ దైవం ఆడించిన లీల లో భాగంగా ఒకరోజు ఏం జరిగింది అంటే.. సుబ్రహ్మణ్యేశ్వర రావు నుండి ఈ ముగ్గురు దర్శకులను ఒకేసారి రమ్మని కబురు వచ్చింది. అర్థం కాని ఈ ముగ్గురు ఎలాగోలా కలుసు కొని మొత్తానికి సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆఫీసుకు చేరారు.


సుబ్రహ్మణ్యేశ్వర రావు ఓ.. ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడి.. “మీకు పూర్వ వైభవం కోసం నా వంతు ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచన పెట్టుకొన్నాను.. మీ వల్ల గొప్పవాడిని అయిన నేను డౌన్ ఫాల్ లో ఉన్న మీకు ఏదైనా చేయాలి అన్న విశ్వాసపాత్రపు మంచి ఆలోచన చేశాను. చాలా సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్నారు కనుక మీ గురించి నేను ఏదైనా చేయాలి అని నిర్ణయించుకున్నాను.

నా స్నేహితుడు ఒక సినిమా తీయాలనుకుంటున్నాడు.. మీ ముగ్గురు కలిసి ఒకే సినిమా డైరెక్ట్ చేస్తే బాగుంటుందేమో అని అతనికి సలహా ఇచ్చాను.. ఆ సలహా అతనికి నచ్చింది మీకు అభ్యంతరం లేకపోతే అతని దగ్గరకు పంపిస్తాను. పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మడం అని మీరు మనసులో ఏమాత్రం భావించకండి.. ఇది భగవంతుడు మీకు ఇచ్చిన ఒక మంచి అవకాశంగా భావించండి.


ప్రధానమంత్రి అయిన ఒక వ్యక్తి ఓడిపోతే ప్రతిపక్షంలో కూర్చోవలసి వస్తుంది, కూర్చుంటాడు.. అప్పుడు చులకనగా భావించడు. అలాగే పర్వతం ఎక్కుతున్న వ్యక్తి జారి పడిపోతే అదే స్పీడ్ లో ఎక్కలేడు కదా నెమ్మదిగా ఎక్కడానికి రెండోసారి ప్రయత్నం చేయాలి.. ఇలాంటి విషయాలన్నీ మీకు నేను చెప్పవలసిన పనిలేదు. ఎందుకంటే మీరు ముగ్గురు పెద్దదర్శకులు, గొప్ప దర్శకులు. మీ నిర్ణయం నాకు చెప్పండి'' అన్నాడు.


ముగ్గురు కలిసి ఒకే సినిమా డైరెక్టర్ చేయడమా.. ఈ కాన్సెప్ట్ ఏదో చిత్రంగా సరికొత్తగా పిచ్చిదిగా కూడా ఉంది. మహోన్నతమైన జీవితం గౌరవం అనుభవించిన తమని అవమాన పరుస్తున్నాడా ఇతను.. అనుకున్నారు మనసులో ఆ ముగ్గురు దర్శకులు..


'' సార్ మా ముగ్గురికి కొత్త సినిమాలు కమిట్ అయ్యాయి. మీకు మేము తర్వాత కనపడతాం. '' అంటూ బయటికి వచ్చేసారు.


సుబ్రహ్మణ్యేశ్వరరావు తనలో తాను నవ్వుకొన్నాడు.****


ఆనంద సునంద మహాదానందరావుల జీవితం చక్రం తిరగడం ఆగిపోయింది. తాము వచ్చిన కొత్తలో కృష్ణానగర్ లో ఒక పాకలో 2 రూపాయలకు టీ తాగిన రోజులు గుర్తుకు వచ్చాయి. ముగ్గురు మాసిన చొక్కాలతో ఎండలో తిరిగి తిరిగి అక్కడికి వచ్చారు. అక్కడ ఆ హోటల్ లేదు ఫైవ్ స్టార్ హోటల్ ఉంది.


ఆ హోటల్ బయట కలుసుకున్న ముగ్గురు జేబులో చేతులు పెట్టుకొని చూసుకున్నారు అవి ఖాళీగా ఉండడంతో.. నవ్వుకున్నారు.


తిరిగి వెళ్ళిపోతుంటే.. ఆ హోటల్ యజమాని లోపలికి రమ్మని పిలిచాడు. ముగ్గురికి సంతుష్టగా భోజనం పెట్టాడు.


'' నమస్తే నా పేరు చక్రవర్తి.. మీరు సినిమాలు తీయని క్రితం ఇదే స్థలంలో పాకలో ఉండే హోటల్ మా నాన్నగారిది. అప్పుడు నేను చిన్న వాడిని. మా హోటల్ కి వచ్చి మీ ముగ్గురు టీ తాగడం నాకు తెలుసు. అందుకనే గుర్తుపట్టి పిలిచాను. నాన్న గారు సంవత్సరం నుండి అరుణాచలంలోనే విశ్రాంతి తీసుకుంటున్నారు.


బై ది బై.. నాకు సినిమాలంటే కొంచెం మోజు ఎక్కువ.. మీ ముగ్గురు గొప్ప దర్శకులు అన్న విషయం నాకు తెలుసు కనుక మీరు తీసే ప్రతి సినిమా చూస్తూ.. నేను మీ స్టైల్ ను ఫాలో అవుతూ వస్తున్నాను.


విషయం ఏమిటి అంటే ఇప్పుడు నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ముందు పాత దర్శకులను పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాను. పాత దర్శకులలో మీరు ముగ్గురే ఘనా పాటీలు.. మిగిలిన వాళ్ళు అంతా ఓ మాదిరి పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లే. సరే ఇప్పుడొస్తున్న కొత్త దర్శకుడు అంటారా అయితే హిట్ లేకపోతే ఫట్టు.


ఈ పరిస్థితులలో దర్శకుడిగా ఎవరుని పెట్టుకోవాలి అని బాగా ఆలోచిస్తున్నాను సంవత్సరం నుండి.


నాకు ఒక ఐడియా వచ్చింది. మీరు ముగ్గురు అసాధారణమైన దర్శకులు. కానీ విధి వక్రీకరించి ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి బొత్తిగా ఖాళీగా ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితి ఏ రంగంలో వాళ్లకైనా తప్పదనుకోండి.


అయితే మీ ముగ్గురు తీసిన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. అందుచేత మీ ముగ్గురిలో ఎవరో ఒకరికి దర్శకత్వ బాధ్యత ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాను.. కానీ మీరు ప్లాప్ దిశలో ఉన్నారు కనుక అది కరెక్ట్ కాదని మళ్లీ నా మనసుకు కనిపించింది.. మరి ఏం చేయాలి అప్పుడే నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది.. నిజానికి ఈ ఐడియా నాది కాదు. 30 సంవత్సరాల నుండి ఇప్పటివరకు సినీ పరిశ్రమ లో ఏకచ్చత్రాధిపత్యంగా రాజ్యం ఏలుతున్న మన నిర్మాత సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిది.


నిజం చెప్పాలంటే మీ ముగ్గురు ఇప్పుడు టీ తాగడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరో ఒకరికి దర్శకత్వ బాధ్యత అప్పచెబితే మిగిలిన ఇద్దరు ఏమవుతారు?.. అందుకని నా సినిమాను మీ ముగ్గురు కలిసి చర్చించుకుని ఎవరో ఒకరు దర్శకత్వపేరు పెట్టి తీస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అగ్ర దర్శకులైన మీ ముగ్గురి ఆలోచనతో నాకు సక్సెస్ దక్కుతుంది. నేను ఇచ్చే రెమ్యునరేషన్ మీ ముగ్గురు పంచుకుంటారు కనుక ప్రస్తుతం మీ సమస్యలు కూడా గట్టిెక్కుతాయి. ఈ విధానం మీకు ఇష్టమేనా.. ''.. ప్రశ్నించి వాళ్ళ సమాధానం కోసం నిలబడ్డాడు చక్రవర్తి.


ఆ ముగ్గురు దర్శకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వికటంగా నవ్వుకున్నారు.


'' ఏం చేస్తాం, మా కర్మ! ఇప్పుడు మా ట్రెండ్ బాలేదు. ప్రతివాడికి చులకనైపోయాం. చక్రవర్తి గారు.. మీరు చెప్పింది ఎలా ఉందంటే ఒక ఆకులో పంచభక్ష్యపరమాన్నాలు పెట్టి మూడు కుక్కల్ని ఉసిగొలిపి తిన మన్నట్టు ఉంది. మా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు మేము తిన్న ఫుడ్ చార్జి పట్టుకొని వచ్చి ఇచ్చేస్తాం. , .. గౌరవనీయులైన సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని మా గురించి పెద్దగా ఆలోచించి బాధ పడవద్దు అని చెప్పండి''


అంటూ ఆ ముగ్గురు బయటకు వచ్చి స్పీడుగా నడుచుకుంటూ ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు.


మళ్లీ ప్రయత్నాలు ప్రయత్నాలు ప్రయత్నాలు. ప్రస్తుతము వాళ్లని స్టోరీ డిస్కషన్ కు పిలిచే వాళ్ళు కూడా కరువయ్యారు.


‘అద్భుతమైన కథ చెప్తాము.. అద్భుతంగా డైరెక్షన్ చేస్తాం వినండి’ అంటూ అరిచి గీ పెట్టిన నిర్మాతలు మెయిన్ డోర్ తీయకుండా బయటకు గెంటేసే పరిస్థితికి వచ్చేసారు.


అలా అలా మరో ఐదు సంవత్సరాలు గడిచిపోయింది.. ప్రస్తుతం 2023 వచ్చింది.


‘13 సంవత్సరాల నుండి ఖాళీగా ఉన్న దర్శకులు ఏం పీకుతారు వీళ్ళు.. కొత్త సినిమా తీస్తారట’.


‘గాడిద గుడ్డేం కాదు’.


‘వీళ్లు ఇంకా ఫీల్డ్ లోనే ఉన్నారా ఇంటికి వెళ్లి పకోడీలు అమ్ముకుంటున్నారు ఏమో అనుకున్నాను..’


‘గురూ.. మనము నాశనం అవ్వాలంటే ఆ ముగ్గురిలో ఎవడో ఒకరితో సినిమా తీస్తే సరి’.


ఇలాంటి డైలాగులు ఫీల్డ్ లో అందరూ మాట్లాడుకోవడం ఒక అలవాటైపోయింది.


ఆనంద సునంద మహానందరావు లు మళ్లీ సడన్ గా కలుసుకున్నారు ఒకరోజు పార్కులో.


'' నిజమే మనలాంటి వాళ్లకు ఎవరో ఒకరు పిలిచి సినిమా దర్శకత్వం ఇవ్వడం చాలా గొప్ప విషయం. కానీ ఆ భగవంతుడు చక్రవర్తి లాంటి ఒక వ్యక్తిని మనకు చూపించాడు. మనం సద్వినియోగం చేసుకోలేకపోయాo. అసలు ప్రపంచంలో అలాంటి అవకాశం ఎవరికైనా వస్తుందా. అప్పుడే మనం ఇగో కి పోకుండా ఉండి ముగ్గురం కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించుకుంటే.. ఈ ఐదేళ్ల లో ముగ్గురం విడివిడిగా బ్రహ్మాండమైన సినిమాలు తీసి పూర్వ వైభవాన్ని పొంది ఉండి ఉండేవాళ్ళమేమో.


కలసి వచ్చిన అదృష్టాన్ని కాలతన్నుకోవడం అంటే ఇదే. ఇప్పటికైనా మనం జ్ఞానోదయం పొంది మంచి ఆలోచనలు చేసుకోకపోతే ఆ భగవంతుడు మనల్ని క్షమించడు. ఈ ఐదు సంవత్సరాలలో మనం కాలితో తన్నిన చక్రవర్తి గారు బ్రహ్మాండమైన నాలుగు సినిమాలు తీశారు. 400 కోట్లు కలెక్షన్లు వెనక వేసుకున్నట్టు అందరికీ తెలుసు.


అందుకని మన ముగ్గురం మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లి తప్పు జరిగింది క్షమించమని కాళ్లు పట్టుకుందాం. ''


అంటూ ఒక నిర్ణయానికి వచ్చారు ఆ ముగ్గురు దర్శకులు 13 సంవత్సరాలు ఖాళీగా ఉన్న మీదట.


వాళ్ళ ఇగో పూర్తిగా తొలగిపోయి అహం మంటలో పడి కాలిపోయి.. మానసిక పరివర్తనతో.. ఒక శుభ సమయాన ఐదు సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చిన చక్రవర్తిగారి దగ్గరికి వెళ్లారు.


అప్పటికే ఆయన తన రాజమహల్ బిల్డింగు బయట 8 కోట్ల విలువైన ఖరీదైనకారు ఎక్కబోతు వీళ్ళ ముగ్గురిని చూసి గుర్తుపట్టి కాసేపు నిలబడ్డారు.


నమస్కారం పెట్టి ఆ ముగ్గురు తాము వచ్చిన విషయం సవినయంగా విన్నవించుకున్నారు ఆయనకు.


'' సార్.. గతంలో మీరు చెప్పినట్లుగా మేము ముగ్గురం కలిసి ఒకే సినిమాకు దర్శకత్వం వహించి మా డైరెక్షన్ ప్రతిభను నిరూపించుకుంటాం.. దయచేసి అవకాశం ఇవ్వండి'' అంటూ వినయంగా కోరారు.


'' సారీ! మీరు ముగ్గురు అంటే నాకు ఎప్పటికీ ఇష్టమే. మీరు మూడు నెలల ముందు వస్తే నా ఆలోచన మీకు అనుకూలంగా తప్పకుండా ఉండి ఉండేది. నెల క్రితమే నేను అమెరికాలో ఒక వ్యాపారం స్టార్ట్ చేశాను. అందుచేత ఇక్కడ ఉన్న నా ప్రాపర్టీస్ నా బంధువులకు అప్పజెప్పి నిర్మాతగా సినిమాలు తీయాలన్న ఉద్దేశాన్ని ఆపుచేసి.. ఈరోజే నేను ఇప్పుడే ప్రయాణం అవుతున్నాను అమెరికా వెళ్ళ డానికి. సో.. మీ ప్రయత్నాలు మీరు చేయండి. నేను పది సంవత్సరాలు అక్కడే ఉండాలి అనుకుంటున్నాను తిరిగి వస్తే.. నా మనసు సినిమా తీయమని అప్పుడు చెప్తే ఆలోచిద్దాం. విష్ యు ఆల్ ద బెస్ట్. '' అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండా తన ఖరీదైన కారు ఎక్కేసాడు చక్రవర్తి. కారు రివ్వు రివ్వున దూసుకుపోతుంది అలా సుదూరంగా..


పూర్తిగా మునిగిపోతున్న మనిషికి కూడా ఒడ్డుకు చేరే అవకాశం ఒకసారి భగవంతుడు ఇస్తాడు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని తనకు తానుగా ఒడ్డుకు చేరే ఏర్పాట్లు మనిషి చేసుకోవాలి. అప్పుడు దేవుడు సంతోషించి మరిన్ని అవకాశాలు ఇవ్వవచ్చు.


అలా కాకుండా అహంభావాలకు అహంకారాలకు పోయి శరీరం మదమెక్కి ఆలోచనారహితంగా ప్రవర్తించే మనుషులను ఏ దేవుడు రక్షించడు రక్షించకూడదు కూడా!


ఒక సినిమా రంగానికే కాదు, ప్రతి రంగానికి ఈ కథలోని పరమార్ధం అన్వయింపబడుతుంది.


ఇగోలను పక్కన పెట్టండి. మిగిలి ఉన్న కూసంత జీవితాన్ని పండించుకునే ప్రయత్నం చేయండి.


*****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు48 views0 comments
bottom of page