top of page

దారి తప్పిన మంద గొర్రె

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి'Dari Thappina Manda Gorre' written by Madduri Bindumadhavi

రచన : మద్దూరి బిందుమాధవి

స్పోర్ట్స్ లో మన దేశం ఎంతో వెనక పడిందని సగటు భారతీయుడి భావన.

కానీ ప్రతి ఒక్కరూ తమ పిల్లలు మాత్రం చదువుకొని ఉద్యోగాలుచెయ్యాలని కోరుకుంటారు.

తన మనవడికి స్పోర్ట్స్ పైన ఉన్న ఆసక్తిని గమనించిన ఒక తాత, అతన్ని సపోర్ట్ చేస్తాడు.

ఆలోచింపజేసే ఈ కథను ప్రముఖ రచయిత్రి మద్దూరి బిందుమాధవి గారు రచించారు.ఎర్ర కోటలో స్వతంత్రదినోత్సవ వేడుకలు సంరంభంగా జరుగుతున్నాయి.

ఇంట్లో సోఫాలో కాళ్ళు చాపుక్కూర్చుని టీవీలో ఆ కార్యక్రమం చూస్తున్నారు ప్రసాద్, చందనలు. అప్పుడు ప్రసాద్ మాట్లాడుతూ "మన వాళ్ళు ఒట్టి సన్నాసులు. ఏ అంతర్జాతీయ ఆటల పోటీల్లోనైనా ఎక్కడో వెనక బెంచీల్లో తప్ప ఉండరు. 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి రావల్సిన పతకాలు ఇన్నేనా? ఆ చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు డజన్లల్లో పతకాలు కొట్టుకు పోతుంటే, మన వాళ్ళు చచ్చీ చెడి ఓ కాంస్యమో, ఓ రజతమో తెచ్చుకునేసరికి కాళ్ళు లాగుతాయి" అన్నాడు ఈసడింపుగా.

"మన చదువుల్లో అసలు ఆటలకి స్థానమే లేదాయే! అదివరకు మధ్యతరగతి వాళ్ళంతా పిల్లలని ప్రభుత్వ స్కూళ్ళల్లో, చదివించేవారు. అక్కడ చదువుతో పాటు కనీస ఆటలు, వ్యాయామాలు ఉండేవి. పాఠాలు లేనప్పుడు...టీచర్ రానప్పుడు గ్రౌండ్ లో కాలికొద్దీ పరుగెత్తేవారు. ఆడపిల్లలు రింగాట, ఫ్రిస్బీ ఆడేవారు. తొక్కుడు బిళ్ళలు, కుంటికాలితో ముట్టించుకునే ఆటలు ఆడేవారు. పిల్లలంతా కలిసి ఏ వాలీబాల్ లాంటివి ప్రాక్టీస్ చెయ్యటమో, ఖోఖో..చెయిన్ కట్ లాంటి ఆటలో, దాగుడు మూతలో ఆడుకునే వారు. ఒంటికి వ్యాయామం ఉండేది. గెలుపుని -ఓటమిని ఆస్వాదించటం తెలిసేది. సమూహతత్వం (టీం స్పిరిట్) ఉండేది."

"ఇంకా క్రీడలంటే ఎక్కువ ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రత్యేక తర్ఫీదు తీసుకోవటానికి ఏ "వై ఎం సి ఏ" లకో ఇతర ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకో వెళ్ళేవారు."

"ఇప్పుడు అందరూ పిల్లలని ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్ళల్లోనే చదివిస్తున్నారు. ఆ స్కూళ్ళు అపార్ట్ మెంటుల్లో నడుపుతున్నారు. ప్లే గ్రౌండే ఉండట్లేదు."

అప్పుడు చందన అంతకంటే నిరసనగా మాట్లాడుతూ "కార్పొరేట్ స్కూళ్ళ నాగరికత వచ్చాక చదువులు అంటే బందిల దొడ్లో కట్టేసే గొడ్ల చందాన నాలుగు గోడల మధ్యన బంధించి అయిన కాడికి రాత్రింబవళ్ళు రుబ్బెయ్యటమేగా" అంది.

అన్ని వేలమంది సమక్షంలో పతకాలు అందుకుంటున్న క్రీడాకారులని, వారిని అత్యంత గౌరవప్రదంగా చూస్తున్న ప్రభుత్వ పెద్దలని...ఎర్రకోటలో జండా వందనంలో దేశ ప్రధాని తో పాటు ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారి అదృష్టాన్ని..ఆ అదృష్టాన్ని ప్రసాదించిన వారి క్రీడా నేపధ్యాన్ని కళ్ళార్పకుండా చూస్తున్నాడు వినీత్, తల్లిదండ్రుల మాటలు వింటూ!

*******

ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్న ప్రసాద్ రెండు నెలలకు ఒకసారి విజయవాడ వెళ్ళి తల్లిదండ్రులని చూసొస్తూ ఉంటాడు. అలా వస్తూ ఈ సారి కొడుకు వినీత్ ని వెంటపెట్టుకొచ్చాడు.

"ఏరా తాతా చదువెలా సాగుతున్నది?" అంటూ మనవడిని దగ్గరికి తీసుకున్నారు తాత వెంకట్రామయ్యగారు.

"బానే ఉంది తాతయ్యా. నాకేమో బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆటలు ఇష్టం. నాన్నేమో ‘ఎప్పుడూ ఆటలు ఆటలు అని టైం వేస్ట్ చేస్తే, చదువు చంక నాకిపోతుంది. ఇప్పటి నించి ఫోకస్ చెయ్యకపోతే ర్యాంక్ రాదు’ అని కేకలేస్తారు. నాన్నే కదా నాకు ఆటల్లో ప్రత్యేక కోచింగ్ కోసం డబ్బు కట్టాల్సింది! అక్కడికి నన్ను స్కూటర్ మీద తెలుసుకెళ్ళాల్సింది. నువ్వైనా చెప్పు తాతయ్యా" అని తాతయ్య దగ్గర దూరిపోయి ఆ అండతో ధైర్యంగా తండ్రి మీద ఆరోపణ చేశాడు వినీత్.

"చూడండి నాన్నా! మీ మనవడు చెప్పిన మాట వినకుండా ఆటల పేరు చెప్పి చదువుని అశ్రద్ధ చేస్తున్నాడు. ‘మన బోటి వాళ్ళకి ఆటలంటూ చదువుని నిర్లక్ష్యం చేసే అవకాశం లేదురా’ అంటే అర్ధం చేసుకోవట్లేదు. చదువు లేకపోతే రేపు అడుక్కు తినాలి. ఆటలు అనేవి ఖరీదైన విషయమనీ, బోలెడంత ఏకాగ్రత ఉండాలనీ, నిరంతర సాధన ఉండాలనీ తెలియట్లేదు వాడికి. ‘స్కూల్ కి ప్రాతినిధ్యం వహించటం దగ్గరనించీ, రాష్ట్ర ప్రతినిధిగా ఆడే స్థాయి వరకు...ఎవరో ఒకరి సహాయం అవసరం. మళ్ళీ అందులో బోలెడు రాజకీయాలు’ అని చెబితే అర్ధం చేసుకునే వయసులేదు. మీరైనా చెప్పండి" అన్నాడు అమ్మ చేతి కాఫీ అందుకుంటూ.

"మొన్న నాన్న టీవీ చూస్తూ... ఇంత పెద్ద దేశంలో పుట్టి మనం అంతర్జాతీయ క్రీడల్లో ఎంత వెనకపడ్డాం! సిగ్గుచేటు అన్నారు. మరి నేను ఆటలు ఆడతానంటే ఎందుకు తాతయ్యా ఇలా అంటున్నారు" అన్నాడు వినీత్

అప్పుడు వెంకట్రామయ్య గారు మాట్లాడుతూ

"నువ్వన్నట్టు చదువు ముఖ్యమే! నీ ఆరాటమూ నిజమేరా” అన్నాడు కొడుకు వీపు నిమురుతూ. “కానీ ఆటలూ ముఖ్యమే. మానసిక వికాసానికి..శారీరక దారుఢ్యానికి ఆటలు ఎంతో అవసరం! అందుకే చైనా వారు మూడు నాలుగేళ్ళ వయసు నించే పిల్లలందరికీ ఆటల్లో తర్ఫీదు ఇస్తారుట. అక్కడ అది తప్పనిసరిట. అందుకే వాళ్ళు శారీరకంగా ఫిట్ గా ఉండి చురుకుగా ఉంటారు. చదువులోను, సాంకేతిక విషయాల్లోను కూడా బాగా రాణిస్తారు. విశ్వ క్రీడల్లో వారివే పతకాలన్నీను..మనం చూస్తూనే ఉన్నాంగా!"

"మన దగ్గర ఇప్పుడున్న విద్యా విధానం లో శారీరక వ్యాయామం, ఆటలు అనేదానికి అవకాశమే లేదు. చరిత్రలోకి వెళితే.... మన సనాతన భారతీయ విద్యా విధానంలో పిల్లలందరూ గురుకులవాసం చేసి చదువుకునేవారు. రొడ్డుకొట్టుడు చదువు కాకుండా... పిల్లల తెలివితేటలని బట్టి, శరీర దార్ఢ్యాన్ని బట్టి ఎవరికి ఏది హితవో గురువుగారు ఆ చదువే నేర్పేవారు."

"మహారాజులు కూడా తమ పిల్లలని ఆ గురుకులాలకి పంపించేవారు. రాజకుమారులతో పాటు కులాలతో సంబంధం లేకుండా వారి వారి ఆసక్తులని బట్టి మిగిలిన పిల్లలు కూడా అన్ని రకాల క్రీడలు, యుద్ధ విద్యలు, సాము గరిడీలు, కర్ర సాము, సంగీతం, హస్త కళలు, సాంకేతిక విద్యలు నేర్చుకునేవారు. అసలు విద్యాభ్యాసం అంటే ఇవన్నీ కలిసిన సమాహారమే. జన్మతః బ్రాహ్మణుడై ఉండి కూడా, ద్రోణుడు రాజకుమారుడైన దృపదునితో సమానంగా తన తండ్రి నించి అలాగే కదా యుద్ధవిద్యలన్నీ నేర్చుకున్నది!"

"అనేక రకాల విదేశీ దాడులతో దెబ్బతిని మన సంప్రదాయ విద్యా విధానం భ్రష్టు పట్టిపోయింది. అది చాలనట్టు ఇప్పుడు చదువు ఒక పాడికుండ లాంటి వ్యాపారం అయిపోయింది. హోరెత్తించే వ్యాపార ప్రకటనల ద్వారా కార్పొరేట్ విద్యా సంస్థలు....మనుషులు తమ బుర్రతో తమని ఆలోచించుకోనివ్వకుండా 'మా దగ్గర చేరితే ఫస్ట్ ర్యాంక్ గ్యారంటీ, ఒకటి నించి పదిలోపు ర్యాంకులన్నీ మావే ' అంటూ ఊదరకొట్టేస్తూ ఆకర్షిస్తున్నాయి. మనమూ ఆ వ్యవస్థలో చిక్కుకున్న శలభాలమే!"

"ఇక నువ్వన్నట్టు ఆటలకి కావలసిన ఆర్ధిక స్థోమతు విషయానికొస్తే.... పూర్వం రాజులే క్రీడలని, వ్యాయామాలని, కళలని, సంగీత సాహిత్యాలని పోషించేవారు. ఇప్పుడు రాజులు లేరు. కానీ ఆ బాధ్యత వహించవలసిన మన ప్రభుత్వాలు తమ బాధ్యతలు ఎలా వదిలించుకుందామా అని చూస్తున్నారే కానీ ప్రణాళికా బద్ధంగా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటం తమ కర్తవ్యం అనుకోవట్లేదు. విత్తనం నాటే రోజులనించి బడ్జెట్ కేటాయింపుల ద్వారా శ్రద్ధ పెడితేనే అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ళు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, శాస్త్రవేత్తలు కానీ తయారవుతారు. అంత చిత్తశుద్ధి ఏది? అన్ని రాజకీయాలే!."

"నీ చిన్నప్పుడు నీకు ఇష్టమని నాకు వీలైనప్పుడల్లా క్యారం బోర్డ్ టార్నమెంట్స్ కి తీసుకెళ్ళేవాడిని కదా! కొంచెం పెద్దయ్యాక సైకిల్ మీద నువ్వే వెళ్ళేవాడివి. మరిప్పుడు జనాభా పెరిగింది. వారి అవసరాల కొరకు వాహనాలు పెరిగాయి. రోడ్ల మీద ట్రాఫిక్ పెరిగింది. పిల్లలని ఒంటరిగా పంపలేము కాబట్టి మనమే తీసుకెళ్ళాలి. ఆటల మీద ఆసక్తి నీకున్నట్టే వాడికీ ఉన్నది. కాకపోతే ఇప్పుడు నీ చిన్నప్పటికంటే చదువుల మీద అనారోగ్యకర పోటీ పెరిగి మిమ్మల్ని సరిగా ఆలోచించనివ్వట్లేదు" అన్నారు.

"సరిలే.. శేషాచలం మామయ్య రమ్మని కబురు పెట్టాను. అలా మాట్లాడుకుంటూ వెళ్ళొద్దాం పద" అని కొడుకు భుజం మీద చెయ్యేసి బయలుదేర దీశాడు.

వెంకట్రామయ్యగారు దారిలో తన సంభాషణని కొనసాగిస్తూ "ఇప్పుడు అదివరకు లాగా ఒక ఇంట్లో నలుగురైదుగురు పిల్లలుండట్లేదు. ఉన్న ఒక్కరినో ఇద్దరినో బాగా చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగు పడతాయని శక్తికి మించి కోచింగులు ఇప్పించి చదివించాలనుకుంటున్నారే కానీ, ఆటలని ప్రోత్సహించలేకపోతున్నారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు పిల్లల చదువుల విషయంలో పోటీలు పడుతున్నార్రా మీ తరం వాళ్ళు! వాళ్ళకి ఆసక్తి లేని ఇంజనీరింగు చదువులో బలవంతానా చేర్చాలని తాపత్రయ పడుతున్నారు. పూర్వం ఆర్ట్స్, కామర్స్, సైన్స్, లిటరేచర్, మ్యాత్స్...ఇలా అనేక కోర్సులు చదివే వారు. ఆ కోర్సులకి చదువు భారం తక్కువగా ఉండటంతో ఆటలమీద కూడా శ్రద్ధ పెట్టేవారు. ఇప్పుడు గొర్రెల మంద లాగా అందరూ ఇంజనీరింగేనాయే! కానీ, సరైన మార్కులతో పాస్ అవకపోతే ఆ చదువుకి మాత్రం మంచి ఉద్యోగాలు ఏం వస్తాయని ఆలోచించట్లేదు."

ఇలా మాట్లాడుకుంటూ నడుస్తూ ఉండగా శేషాచలం గారి ఇల్లు వచ్చేసింది. బయట వరండాలో ఉన్న శేషాచలం "ఓరి ప్రసాదు..నువ్వు కూడా వచ్చావా? రండి రండి" అని ఇంట్లోకి తొంగి చూసి "ఏమోయ్ మీ వెంకట్రామయ్య అన్నయ్య వచ్చాడు. ప్రసాద్ కూడా వచ్చాడు. ముగ్గురికీ కాఫీ పట్రా" అన్నాడు.

"ఏదో పనుంది రమ్మన్నావని వీడిని కూడా తీసుకొచ్చానోయ్" అన్నారు వెంకట్రామయ్యగారు.

"ఆ పెద్ద విషయం ఏమీ కాదు. మా మనవడు స్విమ్మింగ్ నేర్చుకుని, జాతీయ పోటీల్లో పాల్గొంటాను అని ఒకటే గొడవ చేస్తున్నాడుట. మొన్న మా అమ్మాయి ఫోన్ చేసి మాటల్లో ఈ విషయం చెప్పి, ఈ "ఒలింపిక్ క్రీడలు" టీవీలో చూసి నేను కూడా పతకం సాధిస్తా అని పట్టుపడుతున్నాడని చెప్పింది. వాడు ఈత బాగానే కొడతాడు. కానీ మన దేశంలో క్రీడలకి ప్రభుత్వం తరఫున పెద్దగా సౌకర్యాలు కానీ, ప్రోత్సాహం కానీ లేవు కద నాన్నా!"

"కష్టం అంతా మనం స్వంతంగా పడి రాణించి ఏ పతకాలో గెలుచుకొస్తే మాత్రం ఆకాశానికెత్తేస్తారు. అప్పుడు పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు ఉద్యోగాలిస్తామని, క్యాష్ ప్రైజులిస్తామని ప్రకటనలిచ్చేస్తారు. అవన్నీ నిజంగా క్రీడాకారులని ప్రోత్సహించే ఉద్దేశ్యం తో కాదు, వాళ్ళ ట్యాక్స్ బరువులు తగ్గించుకోవటానికే అనిపిస్తుంది నా మటుకు నాకు. మరీ ఒలింపిక్స్, కామన్వెల్త్, వింబుల్డన్ స్థాయి అయితే ఇస్తారేమో కానీ..మన దేశంలోనే ఏ జాతీయ స్థాయిలోనో పతకాలు గెలిస్తే ప్రకటనలకి పరిమితం కాకుండా నిజంగా ఇస్తారంటావా?" అని తన సందేహం తను వెలిబుచ్చింది.

"పాపం వాళ్ళు నిజంగా ఆ స్థాయికి రావాలంటే ఎంత పౌష్టికాహారం తీసుకోవాలి? కుటుంబ సభ్యులు ఎంత త్యాగం చేస్తే వాళ్ళని పోషించగలరు? క్రీడల పట్ల ఆసక్తి, ఆడగల సమర్ధత..ఆర్ధిక స్థోమత ఒకదానికి ఒకటి సంబంధంలేని విషయాలు! ఆటల మీదే దృష్టి పెట్టాల్సిన క్రీడాకారులకి నికర ఆదాయ వనరులు ఉండాలి. క్రీడాకారులు సరైన గుర్తింపు, తీరైన ఉద్యోగము లేక కుటుంబ పోషణ కొరకు రోజు కూలీలకి వెళుతున్నారని మనం ఎన్నోసార్లు పేపర్లల్లో చదువుతున్నాం."

"నిన్న పేపర్లో చదివాను..ఒలింపిక్స్ లో పతకాలు సాధించే స్థాయి అథ్లెట్స్ ని అందిస్తున్న ఆఫ్రికాలో చాలా దేశాలు ఆకలి చావులకి నిలయాలు. అక్కడ వనరులు తక్కువ. అయినా కెన్యా, జమైకా లాంటి దేశాలు ప్రపంచ స్థాయి 'అథ్లెట్స్ 'ని అందిస్తున్నాయి. అంటే ఆర్ధిక స్థితి గతులతో సంబంధం లేకుండా విశ్వక్రీడల్లో మనం కూడా భాగస్వాములమవ్వాలి అనే స్పృహ దేశ ప్రభుత్వాలకి తప్పనిసరిగా ఉండాలి."

"క్రీడలపై పరిశోధనలు, క్రీడాకారులకి వసతులు కల్పించటంలో ఆస్ట్రేలియా దేశం ప్రపంచంలోనే ప్రధమ స్థానంలో ఉన్నదిట. అలాగే జపాన్, స్విట్జర్లాండ్, డెన్మార్క్ పతకాల పట్టికలో ప్రధమ స్థానాల్లో ఉంటున్నారు. అసలు చైనా వారయితే పిల్లలని ఐదో సంవత్సరం నించే నిర్బంధంగా క్రీడల్లో తర్ఫీదు ఇస్తారుట. వారికి ఆసక్తి ఉన్న క్రీడలో ప్రోత్సహిస్తారుట. అందుకే ఎక్కువ సంఖ్యలో పతకాలు కూడా వాళ్ళే గెలుచుకుంటారు. దక్షిణ కొరియా ప్రపంచంలో అన్ని దేశాల కంటే క్రీడల అభివృద్ధికి ఎక్కువగా నిధులు కేటాయిస్తుందిట. మన దేశంలో క్రీడల గురించిన కనీస అవగాహన లేకుండానే కాలేజి స్థాయి చదువులు అయిపోతున్నాయి."

"క్రీడల అభివృద్ధికి బడ్జెట్ కేటాయింపులతో పాటు ప్రభుత్వాలకి సమగ్ర క్రీడా విధానం ఉండాలి. అప్పుడే మన మనవలు కోరుకున్నట్టు, క్రీడల్లో వారిని మనం ప్రోత్సహించగలము. వారికి కూడా భవిష్యత్తుకి ఒక భరోసా ఉంటుంది అని నమ్మగలము. అదే నీతో మాట్లాడదామని రమ్మన్నాను" అన్నారు శేషాచలం గారు తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించి ఊపిరి తీసుకుంటూ!

"సరిపోయింది..నీ మనవడే కాదు, నా మనవడూ వాళ్ళ నాన్న తనని ఆటల్లో ప్రోత్సహించట్లేదని బిక్క మొహం వేశాడు. ఏవయినా అంతర్జాతీయ ఈవెంట్స్ జరిగినప్పుడు జనాలు హాట్ హాట్ గా ఆ విషయం చర్చించుకుంటారు. రొటీన్ లో పడితే మళ్ళీ మన గొర్రెల మంద ఆలోచనలు మనవే! కనీసం మన మనవలు మనకంటే భిన్నంగా ఆలోచిస్తున్నారని సంతోషంగా ఉంది."

"అవును నాన్నా..పోయిన సారి ఒలింపిక్ గేంస్ తరువాత మా కొలీగ్ వాళ్ళబ్బాయిని బలవంతంగా ఆటల్లో చేర్పించాడు. "వాడికి ఆటల పట్ల ఏ ఆసక్తి లేదు కదా, ఎందుకు చేర్చావ్" అని అడిగా! 'ఇంజనీరింగ్ కాలేజిలో స్పోర్ట్స్ కోటా ఉంటుంది..అలా అయినా మా వాడికి సీట్ గ్యారంటీ ఉంటుందని ' సిగ్గులేని సమాధానం చెప్పాడు.

"అటు ప్రభుత్వాలు కానీ, ఇటు ప్రజలు కానీ స్పోర్ట్స్ గురించి చిత్త శుద్ధితో సరైన పంధాలో ఆలోచించట్లేదు. ఉద్యోగాల్లో, కాలేజిల్లో స్పోర్ట్స్ కోటాలుంటాయని ఆలోచించే జనాలు కొందరైతే, ప్రభుత్వ ప్రోత్సాహం లేక నిజమైన క్రీడాసక్తిని చంపేసుకుంటున్న జనాలు కొందరు!"

"వ్యక్తిగతంగా మనం ఈ మూస పద్ధతి నించి బయటపడాలి. పిల్లలకి చదువుతో పాటు క్రీడలకి ప్రాధాన్యం ఇచ్చి ప్రోత్సహించే స్కూళ్ళల్లో చేర్చాలి. అందరూ జాతీయ చాంపియన్స్ అవుతారని కాదు. అవ్వాలని అత్యాశ కూడా పనికి రాదు. అంతమాత్రాన చదువు పేరు చెప్పి మొగ్గలోనే వారి ఆశలని, ఆసక్తిని తుంచే ప్రయత్నం చెయ్యకూడదు. కాలేజి స్థాయి వరకు క్రీడానుభవం ఉన్నవారు, పెద్దయ్యాక తాము పనిచేసే కంపెనీలో యాజమాన్యం తో సంప్రదించి ప్రతి సంవత్సరం "స్పోర్ట్స్ స్పాన్సర్షిప్" ప్రారంభింప చెయ్యచ్చు. అలా పెద్ద కంపెనీలు కొన్ని కలిసి ప్రభుత్వ పెద్దలతో విశ్వక్రీడల ప్రోత్సాహానికి కావలసిన ప్రణాళికలు తయారు చెయ్యచ్చు. లేదా తామే స్వంత కంపెనీ పెట్టే స్థాయికి వస్తే తమ సామాజిక బాధ్యతగా తమ వార్షిక ఆదాయంలొ తప్పక కొంత బడ్జెట్ క్రీడలకి కేటాయించచ్చు. ఇలా అన్ని కోణాల్లోను ప్రయత్నిస్తే క్రమేణా మార్పు రావచ్చు" అన్నారు వెంకట్రామయ్య గారు.

"ముందుగా మన వినీత్ ని, శేషాచలం మామయ్య మనవడు అరుణ్ ని క్రీడల్లో చేర్పించే నిర్ణయం తీసుకుందాం. ప్రసాదు నువ్వు ఇంకొక ఖర్చు తగ్గించుకుని వాడిని కోచింగుకి పంపే పని చెయ్యి. నేను నా వంతు సహాయంగా పక్క పోర్షన్ అద్దె డబ్బు నెల నెలా నీకు పంపిస్తాను. నా పెన్షన్ నాకు, మీ అమ్మకి సరిపోతుందిలే! వాడు కాస్త నిలదొక్కుకోగలిగితే, అప్పుడు టార్నమెంట్స్ కి తయారవటానికి మీ ఫ్రెండ్స్ బృందంలో స్పాన్సరర్ల కోసం ప్రయత్నించచ్చు" అన్నారు.

అలా ఒక నిర్ణయానికి రాగలిగినందుకూ..తన కొడుకు లాగే ఇంకొకరు కూడా క్రీడల్లోకి వెళ్ళటానికి ఆసక్తిగా ఉన్నారని తెలిసినందుకూ సంతోషించిన ప్రసాద్ గుండెల నిండా తృప్తిగా గాలి పీల్చుకుని, తన ఈ ట్రిప్ విజయవంతమైనట్లు భావించాడు..

***శుభం***

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :  63099 58851 కు పంపవచ్చును.


మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత్రి పరిచయం : ఎం బిందుమాధవి

నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.

సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు


94 views0 comments

Comments


bottom of page