దోషి ఎవరు పార్ట్ - 3
- Pudipeddi Ugadi Vasantha
- Jul 3, 2023
- 11 min read
Updated: Jul 29, 2023

'Doshi Evaru Part 3/3' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha
'దోషి ఎవరు పార్ట్ 3/3' తెలుగు పెద్ద కథ
రచన : పూడిపెద్ది ఉగాది వసంత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
జరిగిన కథ:
సుమ, సుధాకర్ భార్యాభర్తలు. ఇద్దరూ ఉద్యోగస్తులు.
కూతురు లాస్యని చూసుకోవడానికి పనిమనిషి కావాలని స్నేహితురాలు మాధవిని అడుగుతుంది సుమ. అర్చన అనే అమ్మాయిని పనికి పంపిస్తుంది మాధవి.
కొద్ది రోజులకు సుమ ఇంట్లో దొంగతనం జరుగుతుంది.
పోలీసు విచారణ జరుగుతూ ఉంది. అర్చన వాళ్ళ అమ్మ, తన కూతుర్ని పోలీసులు అరెస్ట్ చేసారని, కాపాడమని మాధవిని వేడుకుంటుంది.
అర్చనకు బెయిల్ ఇచ్చి బయటకు తెస్తుంది మాధవి.
భర్త సహకారంతో అసలు నేరస్తుల్ని పట్టుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తుంది.
ఇక దోషి ఎవరు పెద్దకథ చివరి భాగం చదవండి..
మర్నాడు ఉదయాన్నే, ఆరున్నర కే, ఏసీ మెకానిక్ రహీం వచ్చాడు. అప్పటికే తను తయారు చేసి పెట్టుకున్న కొన్ని ప్రశ్నలు అడిగి, అతనిచ్చిన సమాధానాలు రాసి, అందులో అతని సంతకం తీసుకుని పంపేస్తుంటే, అతని కళ్ళలో కాస్త భయం చూసింది మాధవి.
రహీం జంకుతూనే అడిగాడు,
"మేంసాబ్, మాకి ఏమీ దిఖ్ఖత్ ఉండ దీ కదా, పిల్లలు కలవాడిని మేంసాబ్!”
“ఏమీ పర్వాలేదు, ఏమీ వర్రీ అవకండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. మీరు నిర్దోషి అని నిరూపించడానికి, మా, ఈ, ప్రయత్నం. మీరు కూడా అల్లాహ్ కి ప్రార్ధనలు చేయండి. అంతా మంచే జరుగుతుంది” అతనికి ధైర్యాన్నిచ్చి పంపింది.
“అల్లాహ్ ఆప్ సబీ కో కుషియా ప్రధాన్ కరే! మాకి మీరు సల్లగా సూడాలి మేంసాబ్.. ఆదాబ్”..
తను రాసుకున్న దర్యాప్తు రిపోర్టులన్నింటిని, ఓ పద్దతి లో ఫైల్స్ లో అమర్చుకుని, తను తయారు చేసుకున్న టేబుల్ లో, సంఘటనలన్నింటిని ఓ వరుస క్రమం లో రాసుకుని, సంఘటన సారాంశాన్ని క్లుప్తం గా, ఓ పేరా లో రాసుకుంది. సంబంధిత ఫోటోలు, ప్రింట్లు వేయించి, వాటిని కూడా ఓ కవర్ లో పెట్టి ఫైల్ లో సర్దుకుంది.
వంట చేసే టైం లేక, ఆన్ లైన్ లో డిన్నర్, పుల్కాలు, మిక్స్డ్ వెజిటల్ కర్రీ ఆర్డర్ చేసి, డెలివరీ బాయ్ వస్తే, అవి తీసుకొమ్మని వాళ్ళమ్మకి చెప్పి, స్నానం చేసి వచ్చేసరికి, గోపాల్ ఆఫీస్ నించి వచ్చాడు.
వస్తూనే, “మాధవీ, మనకి ఎప్పోయింట్మెంట్, 830 కి ఉందిట. డీజీ పీ సర్ చెప్పేరు. పద త్వరగా బయలుదేరుదాం” అని హడావిడి చేసేడు
“నేను రెడీ, నువ్వు త్వరగా రా. డిన్నర్ చేసేసి వెళ్ళిపోదాం, రావడం కొంచెం అటు ఇటు గా అయినా పర్వాలేదు”
ఇద్దరు నేరుగా కమీషనర్ గారింటికి 8 గంటలకల్లా చేరుకున్నారు.
కమీషనర్ గారు డైరెక్ట్ గా టాపిక్ ప్రారంభించేసారు. పెద్దవాళ్ళు, కాలాన్ని తూకం వేసి మరీ వాడతారు.
మాధవి చాలా క్రిస్ప్ గా, కేసు ని వివరించింది. తాను జరిపిన దర్యాప్తు గురించి వివరంగా చెప్పి, తానెలా సంఘటలన్నింటిని క్రోడీకరించిందీ చెప్పి, తాను సేకరించిన సాక్ష్యాలు కూడా చూపించి, దోషి ని ఎలా పసిగట్టిందీ చెప్పింది. అయన చాల శ్రద్ధగా, మాధవి చెప్పిందంతా తల తటాయిస్తూ వినడం మాధవి గ్రహించింది.
“మీకు క్రైమ్ ని ఛేదించడం లో ఏమైనా అనుభవం ఉందా అమ్మా?”
కమీషనర్ గారికి మాధవి కేసు ని డీల్ చేసిన విధానం, చేధించిన పద్దతి బాగా ఆకట్టుకుందని అర్ధమయింది.
“అయ్యో! అలాంటిదేమి లేదు సర్. ఆఫీస్ లో ఏదైనా సమస్యని పరిష్కారించాలంటే, అన్ని కోణాల్లోంచి పరిశీలించి, పరిశోధించి, లాజికల్ గా అలోచించి, పరిష్కారం రాసి, పైవారికి క్షుణ్ణంగా వివరించి, ఫైల్ ని అందజేయడం, మా విధి సర్!
దీన్ని కూడా అలాగే, తీసుకుని, ముందుగా ఒక టేబుల్ తయారు చేసుకుని, ఇందులో ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకోలేదు, కీలక వ్యక్తులు ఎవరు, ఎవరెవరి పాత్ర పరిధి ఎంత.. అని ఆలోచించి, వారికీ మార్కులు వేసుకుంటూ, ప్రాధాన్యతలు నిర్దేశిస్తూ, పధకం తయారుచేసుకుని, పని ప్రారంభించాను సర్! దీన్లో మావారి సహకారం కూడా చాల ఉంది సర్.
సర్, మీరేమి అనుకోనంటే ఒక మాట చెపుతాను సర్.. నేను పధకం తయారు చేసేప్పుడు, ఇంతవరకు, పోలీసులు దృష్టి సారించని విషయాలు ఏంటేంటి.. అనేది లిస్ట్ తయారుచేసుకుని, వాటిపై బాగా ఫోకస్ చేసేను సర్. అంతే! నేనూహించినట్టుగానే, మంచి ఫలితం వచ్చింది సర్”
“గుడ్ అమ్మా! మీ తెలివితేటల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు గనక ఈ దర్యాప్తు చేసి ఉండక పోతే, ఒక నిర్దోషికి అన్యాయంగా శిక్ష పడేది. అందులోను, విధిచే వంచించబడ్డ ఒక అమ్మాయి జీవితం మరింత నాశనమయ్యేది”
“అసలు ఈ దర్యాప్తు నేను చేపట్టాలనుకున్నదే, నిర్దోషి కి శిక్ష పడకూడదనే సర్. ఇక అసలైన దోషి ఎవరో కనిపెడితేనే కదా అది సాధ్యపడుతుంది సర్..”
“ఓకే అమ్మా! ఈ ఫైల్ నాకిచ్చి మీరు నిశ్చింతగా వెళ్ళండి, రేపే దోషిని కస్టడీ లోకి తీసుకుని విచారించి, దొంగిలించిన నగలు స్వాధీనపర్చుకుని, వారికి అప్పగించడం జరుగుతుంది. యు డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్ తల్లి” అన్నారు కమీషనర్ గారు.
********
మర్నాడు ఉదయం మాధవి ఆఫీస్ లో ఉండగా, సుమ ఫోన్ చేసింది, “మాధవి.. ఇది విన్నావా, మన కేసు లో దోషి ఎవరో తెలుసా.. మా వాచ్మాన్ ట! ఇప్పుడే వాచ్మాన్ ని అరెస్ట్ చేసి తీసికెళ్ళేరుట, మా పక్కింటావిడ ఫోన్ చేసి చెప్పింది. నేను సి ఐ గారికి ఫోన్ చేసేను. అయన చెప్పేరు, పోలీస్ కమీషనర్ ఒక స్పెషల్ ఆఫీసర్ ని నియమించి, మన కేసు లో పూర్తి దర్యాప్తు జరిపించేరుట. వాచ్మా నే దోషి అని తేలిందిట. నాకింకా పూర్తి వివరాలు తెలియలేదు”
సుమ గొంతులో తన నగలు దొరుకుతాయనే నమ్మకం స్పష్టం గా తెలుస్తోంది.
"అవునా " అని ఆశ్చర్యంగా అడగాలనుకుంది మాధవి, కానీ మామూలుగానే అనగలిగింది.
“ఓకే నే, నేను, గోపాల్ సాయంత్రం ఏడింటికి వస్తాము మీ ఇంటికి. అప్పుడు అన్ని మాట్లాడుకుందాము. నువ్వు ఇక నిశ్చింతగా ఉండవె తల్లీ” అని కంగ్రాట్స్ చెప్పి ముగించింది.
ఎవరెస్టు పర్వతం ఎక్కినంత ఆనందంగా ఉంది మాధవి కి. అర్జెంటు గా వాష్ రూమ్ లోకెళ్ళి, తన భుజం తానే ఒకసారి చరుచుకుని, చాలా గర్వపడింది, ఓ నిర్దోషిని శిక్ష నించి కాపాడగలిగినందుకు.
‘థాంక్ గాడ్ ! థాంక్ యు సర్ కమీషనర్ గారు!’ తనకి తెలియకుండానే, రెండు దోసిళ్ళు జతపడ్డాయి.
****************
సాయంత్రం ఆఫీస్ నించి ఇంటికెళ్లి, తల్లి తో కలిసి టీ, స్నాక్స్ కానిచ్చి, షాలిని తో కాసేపు గడిపి, సుమ ఇంటికి వెళ్తున్నాము, తాము వచ్చేసరికి కొంచెం అటు ఇటు అవొచ్చు, తల్లిని తమ కోసం ఎదురు చూడొద్దని, త్వరగా తినేసి, పడుకొమ్మని చెప్పి, ఆరున్నర కి సుమ ఇంటికి బయల్దేరి వెళ్ళింది మాధవి, గోపాల్ డైరెక్ట్ గా ఆఫీస్ నించి సుమ ఇంటికి వచేస్తాడని చెప్పి.
దారిలో ఉండగానే, సుమ ఫోన్ చేసింది, సి ఐ గారు ఫోన్ చేసేరని, 730 కమీషనర్ గారి ప్రెస్ మీట్ ఉందిట, కేసుని ఎలా చేధించిందీ వివరిస్తారట. సుమ మాటల్లో తెలుస్తోంది ఆమె మనసు ఆనందంతో యమున్ కళ్యాణ్ రాగమాలపిస్తోందని, అది దూది పింజలా ఉంది అనీను.
****************
కమీషనర్ ఆఫీస్ మొత్తం విలేకరులతో కిట కిట లాడిపోతోంది. అందరికి ప్రెస్ నోట్ కాపీలు పంచిపెట్టి కుర్చోపెట్టేరు.. ప్రెస్ నోట్ సారాంశం, మొన్నామధ్య, ఎల్లారెడ్డిగూడ లో సుమ, సుధాకర్ అనే ఇద్దరు సాఫ్ట్ వెర్ ఉద్యోగుల ఇంటిలో జరిగిన భారీ దొంగతనం కేసు లో.. నిందితుడు దొరికాడని, ఆ వివరాలు, కమీషనర్ గారు వెల్లడిస్తారని, నిందితుడిని కూడా హాజరు పరుస్తారని ఉంది.
ఈ దొంగతనం గురించి, న్యూస్ పేపర్లలో చూసినప్పుడు అందరు చర్చించుకున్నారు, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని, అది ఇది అని. అయితే, అది జరిగి నెల పైనే అవడంవలన, దాదాపుగా అందరూ మరిచిపోయేరు.
కమీషనర్ గారు వచ్చి, ముందుగా, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కరించి, తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్యతలు చెప్పి, వెంటనే కేసు వివరాలు ఇలా తెలియచేసేరు.
యెల్లారెడ్డి గూడా లో, స్ట్రీట్ నెంబర్ 4 లో ఉన్న లక్ష్మి ప్రియా అపార్ట్మెంట్ లో, ఫ్లాట్ నెంబర్ 201 లో, రెండవ ఫ్లోర్ లో, సుధాకర్, సుమ అనే ఇద్దరు సాఫ్ట్ వెర్ ఉద్యోగులు, తమ ఏకైక కూతురు, లాస్య తో కల్సి ఉంటున్నారు. ఇద్దరూ ఉద్యోగులు కావడం చేత, నేటికి రెండు నెలల క్రితం, అర్చన అనే పనమ్మాయిని నియమించుకున్నారు, పాపని, ఇంటిని చూసుకోడం కోసం. ఈ అర్చన కి 20 ఏళ్ళు, వివాహిత. ఈమె, సుమగారి స్నేహితురాలు మాధవి గారికి పరిచయస్తురాలు, వారి ద్వారానే, ఈమె వీరింటికి వచ్చింది.
గత నెల, మార్చ్ పదవ తారీఖున, వీరింట్లో దొంగతనం జరిగింది. వీధి తలుపు, వేసింది వేసినట్టే ఉండగానే, ఈ దొంగతనం జరగడం విశేషం. బంగారు నగలు, వెండి వస్తువులు అంతా కలిపి, ఓ ముప్పై లక్షల పైచిలుకు విలువ చేస్తాయి ఆ నగలు. ఇది బాగా తెల్సిన వారి పనే అయివుంటుందనే కోణం లో, మాయెల్లారెడ్డి గూడా సి ఐ బృందం, ఈ కేసు నిపూర్తి స్థాయి లో దర్యాప్తు జరిపారు.
అనుమానితులందరిని ప్రశ్నించడం, వారి స్టేట్మెంట్లు తీసుకోడం జరిగింది, ఆలా విచారించిన వారిలో, వారింట్లో ఉన్న పనమ్మాయి అర్చన, పాచి పని చేసుకునే పార్వతి- 40 సంవత్సరాలు, వాచ్ మెన్ రంగా- 45 సంవత్సరాలు, ఇంకా దొంగతనం జరిగిన రోజు మద్యాహ్నం, వారింట్లో ఏసీ పాడయ్యిందని కంప్లైంట్ ఇవ్వగా రిపేర్ చెయ్యడానికి వారింటికి వచ్చిన, ఏసీ సర్వీస్ ఇంజనీర్ రహీం- 35 సంవత్సరాలు ఉన్నారు.
అయితే, అనుమానితులెవరి పైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ లు లేకపోవడం చేతనూ, మెయిన్ డోర్ వేసింది వేసినట్టే ఉండుట చేతనూ, ఇంట్లోనే వీరితో పాటు నివసిస్తున్న, అర్చన మీద మా బృందం ఫోకస్ పెట్టింది. ఆమెగా ఆమె తీసి ఉండకపోవచ్చు లేదా తీసి ఉండను వచ్చు. లేదా వేరే బయటివారికి సహకరించి ఉండొచ్చు అనే కోణం లో బాగా క్షుణ్ణం గా అర్చనని విచారించినా, ఆమె పోలీసులని చూస్తూనే, భయపడి పోయి, ఏడుస్తుండడం తో, మా బృందానికి సరిఅయిన ఆధారం లభించలేదు.
మీ అందరికి బాగా తెలుసు, ఎఫ్ ఐ ఆర్ తెరిచిన నిర్దేశిత సమయం లోగా, మేము ఫైనల్ రిపోర్ట్ పంపవలిసి ఉంటుంది. డిపార్ట్మెంట్ కి ఇదో పెద్ద సవాల్ అయి కూర్చుంది. ఎవరిని దోషులుగా నిర్ధారిస్తూ, ఫైనల్ రిపోర్ట్ తయారు చేయాలి? చూస్తూ చూస్తూ నిర్దోషుల్ని, దోషులు గా చిత్రించడం మా వృత్తికే విరుద్ధం. మేమందరం ఏమి చేయాలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్న సమయం లో, అదిగో అప్పుడే మా, మా యెల్లారెడ్డి గూడా పోలీస్ స్టేషన్ కి, ఓ ఆగంతకుడి నించి ఫోన్ వచ్చింది.
“సర్, ఫలానా దొంగతనం కేసు లో, మీరు దోషిని ఎందుకు అరెస్ట్ చేయడం లో జాప్యం చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఈ దొంగతనం అర్చన యే చేసింది. మీదైన పద్దతిలో స్టేషన్ లో ప్రశ్నిస్తే, దీని వెనక ఉన్న డొంకంతా కదుల్తుంది”.. పేరు చెప్పకుండా ఫోన్ పెట్టేసేడు, మళ్ళీ ఆ సెల్ కి చేస్తే, ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది.
అప్పుడు మాధవి గారి ద్వారా ఈ అర్చన వచ్చింది కదా, ఆమెతో ఓ సారి మాట్లాడితే, ఈ అమ్మాయి గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయని, మాధవి గారిని కలిసింది మా బృందం. ఆమె అర్చన వృతాంతం అంతా చెప్పేరు. ఆమెకెవరైనా శత్రువులున్నారా అని అడిగితే, ‘ఆలా ఎవరు లేరండి, ఆమె భర్త కూడా, ఈమెని వదిలేసి, వేరే ఆమెతో ఎక్కడో జీవిస్తున్నాడు. ఎందుకండీ ఆలా అడిగారు’ అని మాధవి గారు అడిగినప్పుడు, మా సి ఐ గారు ఈ బ్లాంక్ కాల్ గురించి చెప్పేరు.
ఆమె మాకు కొంత సమాచారం ఇచ్చిన మీదట, ఈ కేసు మీద ఒక స్పెషల్ బృందాన్ని నియమించడం జరిగింది. ఈ కేసు విషయం లో, త్వరిత గతిని మా స్పెషల్ బృందం, మళ్ళీ అనుమానితులందర్నీ ప్రశ్నించింది. అయితే ఈసారి, మా మొదటి బృందం దృష్టికి వెళ్ళని కొన్ని విషయాల్లోకి లోతుగా వెళ్ళింది.
మొదటిగా, పనిమనిషి పార్వతి ని తరచి తరచి ప్రశ్నించగా, ఆమె ఒక కీలక మైన విషయం చెప్పింది. ఏసీ మెకానిక్ వెళ్ళిపోతూ, ఏసీ లోంచి నీళ్లు కారడం అనే సమస్యని సమూలం గా రిపేర్ చేసేసినట్టు చెప్పాడని, అయితే, ట్యూబ్ లో అడుగున మిగిలి ఉన్న నీరు చుక్క చుక్కా చొప్పున, మరో రోజు కారుతుందని, అందుకని ఆ ట్యూబ్ ని, బెడ్ రూమ్ కి ఆనుకుని వున్నబాల్కనీ లోకి పెట్టి వదిలినట్టు చెప్పాడని, ఆ ట్యూబ్ అడ్డం రావడం వలన, బాల్కనీ తలుపు మూయడం కుదరదని, నీరు కారడం ఆగగానే, ఆ ట్యూబ్ తీసేస్తే, మాములుగా తలుపు వేసుకోవచ్చని చెప్పాడని, చెప్పింది.
ఈ విషయం ఇంతకు ముందు దర్యాప్తులో రాబట్టలేక పోయారు. దీన్ని బట్టి మాకు ఒకటి రూఢి అయింది, దొంగ బాల్కనీ డోర్ లోంచి లోపలి వచ్చి, వెళ్లినట్టుగా. అయితే అది ఎవరు ?..
దీన్ని ఆధారంగా చేసుకుని, ఏసీ మెకానిక్ రహీం ని మళ్ళీ పిలిపించి, ప్రశ్నించింది మా స్పెషల్ బృందం. పార్వతి చెప్పినట్టుగానే, రహీం కూడా అంతా, అలాగే చెప్పాడు. ఆ సమయంలో అక్కడ ఎవరెవరున్నారు అని అడగగా, పార్వతితో తాను చెపుతున్నప్పుడు వాచ్ మెన్ అక్కడే డస్టింగ్ చేస్తూ ఉన్నాడని చెప్పేడు.
తదుపరి మా బృందం, బాల్కనీ ని, చుట్టుపక్కల పరిసరాల్ని నిశితంగా పరిశీలించాక, వారి దృష్టి, బాల్కనీ ని అనుకుని ఉన్న ప్రహరీ గోడ మీద, ఓ కాలి గుర్తు మీద పడింది. అది ఎర్ర మట్టిలో తొక్కిన పాదం గుర్తు. గోడ మీద నించి కింద వైపుకి దిగుతున్నప్పుడు, ఆసరాకు గోడకి ఊతం తీసుకున్నట్టుగా ఉంది. ఇదిగో ఈ ఫోటో చూడండి” అని ఫోటో చూపించారు.
అంటే అది నిందితుడి పాదం గుర్తు.
ఇంకో విషయం, బాల్కనీ కి అనుకుని వున్న ప్రహరీ గోడ కి, పైన ఉన్న సీలింగ్ కి మధ్య గ్యాప్ చాల చిన్నదిగా ఉంది. అంటే అందులోంచి, బక్క పలచగా ఉన్న వ్యక్తి మాత్రమే దూరగలడు.
అనుమానితుల్లో, రహీం అనే వ్యక్తి చాలా లావుగా ఉన్నాడు. ఆడవారు అంత ఎత్తు నించి దిగడం, ఎక్కడం లాంటివి చేయలేరు. పైగా ఒకరికి నలభై ఏళ్ళు, కాస్త లావు. ఇంకొకరికి, ఇరవై ఏళ్ళు, బాగా పొట్టిగా ఉంది. ఇక మిగిలింది వాచ్ మెన్ రంగా.. చాలా సన్నగా, 5. 6 ఎత్తు ఉన్నాడు. ఈ వ్యక్తే ఆ పని చేసి ఉంటాడని, ఒక అభిప్రాయానికి వచ్చింది మా బృందం.
అయితే సన్నగా ఉన్నాడు కదా అని, దోషి అని నిర్ణయించేయ కూడదు కదా. దాన్ని కూడా నిర్ధారించుకోడానికి, మా బృందం మళ్ళీ, పార్వతిని, వాచ్ మెన్ ని విడి విడి గా ప్రశ్నించింది.
పార్వతి మళ్ళీ ఇంకో కొత్త విషయం చెప్పింది. వాచ్ మెన్ తనతో, సుమ అమ్మగారు ఆఫీస్ నించి ఫోన్ చేసి, ఏసీ మెకానిక్, రిపేర్ చేస్తున్నప్పుడు, బెడ్ మీద అంతా డస్ట్ పడుతుంది, రూమ్ అంతా కూడా పాడైపోతుంది కనక, తనని వెళ్లి అంతా క్లీన్ చేసి, బెడ్ షీట్ కూడా మార్చమన్నారని చెప్పాడని, చెప్పింది. బీరువా తాళాలు ఎక్కడ ఉంటాయి అని చాలా సార్లు అడిగాడు.
తనకి తెలీదని చెప్పానని పార్వతి చెప్పింది. దేనికి బీరువా తాళాలు అని అడిగితె, బెడ్ షీట్ మార్చాలి కదా అందుకు, కొత్త బెడ్ షీట్ తీద్దామని అన్నాడని చెప్పింది. అప్పుడు, అర్చనని పిలిచి, తనకి చెప్పినట్టుగానే చెప్పి, బీరువా తాళాలు తీసి బెడ్ షీట్ ఇమ్మని అడిగాడని చెప్పింది.
అర్చన, తాళాలు తెచ్చి, బీరువా తెరచి బెడ్ షీట్ ఇచ్చి, తాళం వెయ్యబోతుంటే, ఉండు ముందు ఈ బెడ్ షీట్ మార్చడానికి సహాయం చేసి అప్పుడు తాళాలు వేసుకుందువుగాని, ట్యాంక్ లో వాటర్ నింపడానికి, మోటార్ ఆన్ చేసి వచ్చానని, నీళ్లు నిండి బయటికి పారితే, సార్లు తనని తిడతారని, నానా గాభరా పెట్టేసినట్టుగా చెప్పింది.
ఈలోగా, సుమగారి కూతురు నిద్ర లేచి పక్క రూమ్ లో ఏడుస్తుంటే, అర్చన, తాళాలు బీరువా కే వదిలేసి, పరిగెత్తింది అని చెప్పింది.
ఇంక. మళ్ళీ వాచ్ మెన్ ని పిలిచి ప్రశ్నించారు మా బృందం, అతను అన్ని పొంతన లేని మాటలు చెప్పడం తో, వారి అనుమానం రూఢి అయిపొయింది.
చివరిగా, అర్చనని మళ్ళీ ప్రశ్నించారు, కేవలం, బెడ్ షీట్ ఇవ్వడం ఎపిసోడ్ వరకు, పార్వతి చెప్పిందే. అర్చన నోటి వెంట కూడా, అక్షరం పొల్లుపోకుండా వచ్చేసరికి, దోషి ఎవరో, మావాళ్లకి బోధపడింది స్పష్టం గా. తాళాలు గురించి, సుమ అమ్మగారు ఇంటికొచ్చేక గుర్తొచ్చి, తీద్దామని, బీరువా దగ్గరికి వెళితే, బీరువా తాళం వేసి ఉంది. పైగా తాళాలు దానికి లేవు. తనేమైనా మర్చిపోతే, అమ్మగారు చూస్తే, వెంటనే ఆ పని పూర్తి చేసేస్తారు. అదే జరిగిందనుకుని ఊరుకున్నట్టుగా చెప్పింది. అంటే, రావడానికి బాల్కనీ తలుపు తీసి ఉండడం, దొంగిలించడానికి అనువుగా, తాళాలు చేతికి చిక్కడం, ఆరోజు నక్కని, తొక్కి వచ్చినట్టైంది వాచ్ మెన్ కి.
అయితే, అంత పెద్ద మొత్తం లో నగలు ఎవరైనా బ్యాంకు లాకర్ లో పెట్టుకుంటారు కదా, ఇంట్లో ఎందుకు పెట్టుకున్నట్టు ?, ఇద్దరు చదువుకున్నవారు, పైగా ఇంటిని, పనిమనుషుల చేతుల్లో ఉంచి వెళ్తుంటారు, ఇదేమైనా బ్లాక్ మనీ కి సంబందిందేమో అని అనుమానం కూడా వచ్చింది మా బృందానికి. ఎంతైనా పోలీసు వాళ్ళం కదా, అని చిరు నవ్వు నవ్వారు కమీషనర్ గారు.
అప్పుడు, మళ్ళీ, సుమగారిని ప్రశ్నించడం జరిగింది. ఆవిడ క్లారిటీ గా చెప్పేరు, బ్లాక్ మనీ అయితే, పోలీస్ కంప్లైంట్ ఎలా ఇస్తాము సర్, ఇది మా కష్టార్జితం. ఇంట్లో ఎందుకు పెట్టుకున్నామంటే, ఆ మధ్య పెద్ద దుమారం రేగింది కదా, ప్రభుత్వం బ్యాంకు లాకర్ లన్ని చూసి, బిల్లులు లేని నగలని జాతీయం చేస్తుందనీను.. లేదా దానికి పెనాల్టీ కట్టించుకుంటుందనీను..
ఆ టైం లో, చాలా మంది మా ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, లాకర్లని ఖాళీ చేసేసి, నగలు ఇళ్లలోనే పెట్టుకున్నారని, ఆలా మేము కూడా, ఈ నగలని ఇంట్లో పెట్టుకోడం జరిగింది అని చెప్పారు.
అయితే ఈ విషయం వాచ్ మెన్ కి ఎలా తెలిసి ఉంటుంది అని ఆరా తీస్తే, వాచ్ మెన్, వారానికోసారి అందరి ఇళ్లలో, ఫ్యాన్ లు, ఏసీ లు, ట్యూబ్ లైట్ లు, వగైరా శుభ్ర పరుస్తుంటాడని, తాను, ప్రతి ఆదివారం తన ఇంట్లో శుభ్రం చేయించుకుంటానని, తను తన తల్లితండ్రులతోను, అక్కచెల్లెళ్ల తోను ఆదివారాల్లోనే ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటుందని, ఆలా తాను మాట్లాడినప్పుడు విని ఉంటాడని చెప్పింది.
చివరి ఘట్టం, మా బృందం వాచ్ మెన్ ని అరెస్ట్ చేసేక, అతను వెల్లడించిన విషయాలు వినండి.
అతను ఏమి పేరు మోసిన దొంగ కాదు, అవకాశం ఉందికదా ఎందుకు వదులుకోవాలి అని ఓ ట్రయల్ వేసేడు, విజయం పొందాడు. పైగా మా దృష్టి అర్చన పైన, రహీం పైన ఉందని గ్రహించాడు. తను సేఫ్ అనుకున్నాడు, అందుకే అర్చనని అరెస్ట్ చేయగానే, ఎంతో ఆనందం పొంది, ఆ న్యూస్ ని తానే, సుమకి ఫోన్ చేసి చెప్పేడు.
చాలా సులువుగా జీవితం లో సెటిల్ అయిపొచ్చు, ఆడ పిల్లకి పెళ్లి చేసేయొచ్చు, తన ఊరిలో ఓ చిన్న పెంకుటిల్లు కట్టుకుని, వ్యవసాయం చేసుకుంటూ, శేష జీవితం ఆనందం గా గడిపేయొచ్చు అనుకున్నాడు. ఈదొంగతనం చేయడానికి అతను పెద్దగా ఏమికష్టపడలేదు, పధకాలు వేసుకోలేదు, అన్ని అతనికి ఆలా అనుకూలించాయి.
ఆయా పరిస్థితులని వాడుకున్నాడు అంతే. ఏసీ మెకానిక్ బాల్కనీ తలుపు తెరిచే ఉంచాలి ఓ రోజంతా అనగానే, చిన్న ఆలోచన వచ్చిందన్నాడు. అర్చన తాళాలు వదిలి వెళ్లడం చూసాక, ఆ కోరిక బలపడిందన్నాడు. ట్యాంక్ నిండిపోతుందని నిజంగానే గాభరా పడ్డానని, అప్పటికి ఆ ఆలోచన అంతా బలం గా లేదని చెప్పాడు.
చూసారా, ఒకరి అజాగ్రత్త, ఇంకొకరికి ఎలాటి చెడు ఆలోచనలు కలిగిస్తోందో ? ఇక నగల విషయానికి వస్తే, వాచ్ మెన్ స్వయంగా, తన ఇంట్లోనే దాచిన మూట, మాకు అందజేశాడు. అవి సుమగారికి అందజేస్తాము, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాక.
ఏది ఏమైనా, ఈ దొంగతనం, వేసిన తలుపు వేసినట్లుండగానే, జరిగిన పద్దతి చూసి, పేరుమోసిన గజ దొంగలు, పకడ్బందీగా ప్లాన్ చేసి, ఈ పని చేసి ఉంటారని అనుకున్నాము, పైగా ఒకంతట ఎలాంటి సాక్ష్యాధారాలు లభించకపోడం కూడా, మా అనుమానం బలపడడానికి దోహద పడింది, మాకు ఈ కేసు పెద్ద పరీక్షగా మారింది.
ఏది ఏమైనా, కేసు లో నిర్దోషి ని కాపాడగలిగాము, నిందితుడిని పట్టుకోగలిగాము.
చెప్పడం ముగించి, ఏవైనా సందేహాలుంటే, అడగమని, విలేఖరులనుద్దేశించి చెప్పేరు కమీషనర్ గారు.
“సర్, ఈ కేసు ని ఛేదించిన తీరు, విదేశాల్లోని ఎఫ్ బీ ఐ వారిని తలపింప చేసింది సర్. అయితే ఒక సందేహం.. యే సాక్ష్యాధారాలు లేకుండా, నేరం నిరూపిత మవకుండానే, అర్చనని ఎలా అరెస్ట్ చేసేరు సర్? అదొక్కటే కాస్త న్యాయానికి విరుద్ధం గా జరిగినట్టు అనిపిస్తోంది సర్, మీ కామెంట్ ప్లీజ్” అని ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక విలేకరి అడిగారు.
“చాలా మంచి ప్రశ్న సర్, అసలైన దోషి బయట పడాలంటే, దోషి దృష్టి ని మరల్చాలి, అందుకే, ఆమే నిందితురాలు అనడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ, ఆమెని మా సేఫ్ కస్టడీ లో ఉంచి, రాయల్ గా చూడడం జరిగింది. ఇది కూడా మా స్పెషల్ బృందం ఇచ్చిన సలహా మేరకే జరిగింది. అయితే, అర్చన, ఆమె అమ్మగారు బాగా భయపడిపోతుండడం తో, సీన్ లోకి మాధవి గారిని లాగి, ఆమెని బెయిల్ పేపర్స్ సైన్ చేసి, తానే పూచీకత్తుగా ఉండి, అర్చనని విడిపించి, మాధవి గారి ఇంట్లోనే, సేఫ్ గా ఉంచాలని కోరడం జరిగింది.
వాచ్ మెన్ మీద బాగా నిఘా ఉంచడం జరిగింది, అతని లో రెట్టించిన ఉత్సాహం రావడం కనిపెట్టాము. అతను, అపార్ట్మెంట్ సెక్రటరీ కి చూచాయగా చేప్పట్ట, తను వచ్చే నెల నించి ఉద్యోగం మానేస్తాని, వేరే ఎవరిని అయినా చూసుకోమని.. దొంగిలించిన నగలతో తన కలలు సాకారం చేసుకునే ప్రయత్నం ప్రారంభించే డన్నమాట..
అప్పుడే మా స్పెషల్ బృందం, అపార్ట్మెంట్ కి వెళ్లి, వాచ్ మెన్ ని, సుమ గారి ఫ్లాట్ బాల్కనీ ని ఆనుకునిఉన్న గోడమీదనించి, బయటవైపుకి కిందకి దిగమని చెప్పేరు.
“ముందు, అయ్యో. అదెలా సర్! కింద పడితే నడ్డి విరుగుతుంది.. అది ఇది..” అని తాత్సారం చేసేడు ట.
ఆపైన, గట్టిగా ఆదేశించడం తో, చాలా సునాయాసం గా, ఆ చిన్న గ్యాప్ లోంచి, అపార్ట్మెంట్ ఆవరణలోకి, ఆ గోడమీదనించే దిగేడుట, అది సంగతి. ఇంకేమైనా సందేహాలున్నాయా” అని విలేఖరులనుద్దేశించి అడిగారు కమీషనర్ గారు.
“నో సర్” అని అందరూ అనగానే, కేసు లో ప్రధాన నిందితుడు, వాచ్ మెన్ రంగా ని, ప్రెస్ మీట్ జరుగుతున్న హాల్ లోకి తీసుకొచ్చి చూపించారు. ఫొటోగ్రాఫర్లు.. వాచ్ మెన్ రంగా ఫోటోలు తీసుకున్నారు.
“అయితే ఇంకా, కథ కంచికెళ్ళలేదు, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే, వాచ్ మెన్, సాదాసీదా మనిషి. నగలు ఎలా అమ్ముకుని వెళ్లిపోవాలుకున్నావు, అని మా వాళ్ళు అతన్ని అడిగితే, అమ్మడం లాంటి లావాదేవీలు తెలియవు, కనక, ఓ బ్రోకర్ గురించి తెల్సుకుని, అతన్ని కలిసి, ఆ నగలు అమ్మాలని, కొంత బ్రోకరేజ్ కూడా ఇవ్వడానికి రెడీ అయ్యానని చెప్పాడు. ఆ బ్రోకర్ని వాచ్ మెన్ ఇంటికి పిలిపించమని చెప్పాము.
నగలు తీసికెళ్ళడానికి రమ్మని పిలవడం తో, ఆ బ్రోకర్ వాచ్ మెన్ ఇంటికి వచ్చిన సమయం లో ఆతన్ని అరెస్ట్ చేసి, ఈ నగలు తనెక్కడ అమ్ముతాడని ప్రశ్నిస్తే, రాజధానిలో జరిగే పలు రకాల దొంగతనాలకు సూత్రధారి అయినా ఒక ముఠా ఉందని, వారికే ఈ నగలు అమ్ముతానని, వారు ఈ పని చేసినందుకు గాను, పది శాతం, బ్రోకరేజ్ గా ఇస్తారని చెప్పాడు. ఈ బ్రోకర్ ద్వారా, ఆ ముఠా నాయకుడిని పట్టుకోడం జరిగింది, ఈ కేసు ని ఛేదించడం తో పాటు, ఒక కరడుగట్టిన గజదొంగని, అతని ముఠాని పట్టుకోడం జరిగింది.
చివరిగా, ప్రజలందరికీ, ఓ విన్నపం: పనిమనుషుల్ని నమ్మండి, పని చేయించుకోండి, ఆవి, జీవి మొత్తం వారి చేతుల్లో పెట్టేయకండి, ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎవ్వరం అంచనా వేయలేము కదా. బీరువా తాళాలు పనివారి చేతికివ్వడం ఎంతో ప్రమాద కరం. మీ పసివారిని పెడుతున్నారు వారి చేతుల్లో. జీవితం లో మీకు అత్యంత విలువైనదే వారి చేతుల్లో పెడుతున్నారు.
ఇంట్లో సి సి కెమెరాలు పెట్టుకోండి, వారి కదలికల్ని నిశితంగా, భార్య భర్తలిద్దరూ, వారి సెల్ ఫోన్లకి అనుసంధానం చేసుకుని, చూసుకుంటూ ఉండడం చాలా అవసరం.
మీరు ఇంట్లో లేనపుడు, ఓ పనిమనిషి చేతిలో మీ పిల్లల్ని వదిలి వెళ్ళినప్పుడు, బయటవారిని ఎవరిని లోనికి రానీయొద్దని, ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వండి మీ పనివారికి.
అది మీ పసివారికి, మీ మీ వస్తువులకు కి కూడా భద్రతనిస్తుంది. మీరు ఇంట్లో లేని సమయం లో, కంపెనీ కి చిందిన మెకానిక్ లు అయినా సరే, తలుపులు తెరవొద్దని, లోనికి రానివ్వొద్దని, మీ పనివారికి, ఖచ్చితమైన ఆదేశాలు ఇవ్వండి. ఆయా కంపెనీ ల వారికీ చెప్పండి. హాలిడే రోజుల్లోనే రావాలని లేదా, సాయంత్రం మీరు ఉండే సమయంలోనే రావాల నీను.
ఆ ముఠా ని క్షుణ్ణంగా విచారించి, ఏయే దొంగతనాల్లో వారి హస్తం ఉందో పరిశీలించి, పూర్తి వివరాలు త్వరలోనే మీకు తెలియజేస్తాము..
***************
టీ వీ ఆఫ్ చేసేసి, ఓ పది నిముషాలు ఎవరు ఏమి మాట్లాడుకోలేదు, నిశ్శబ్దం సోలో పాడుకుంటోంది.. ముందుగా, మాధవే మాట్లాడింది, “ఓకే ఫ్రెండ్స్ కంగ్రాట్స్, మీ కష్టార్జితం మిమ్మల్ని త్వరలో చేరుకుంటుంది, అంతా సుఖాంతమే కదా, సంతోషమేనా ?”
సుమ, సుధాకర్ ఇద్దరు లేచొచ్చి, మాధవి ని అభినందన మందారాలతో చుట్టేశారు.
“ఈ క్రెడిట్ అంతా నీదేనే మాధవీ, నాకు అత్యంత భయాన్ని ఇచ్చిన ఆ దేవుడే, నిన్ను నాకిచ్చాడు. క్రెడిట్, డెబిట్ ఎంట్రీలు వేసేశాడు, లెక్క సరిపోయింది. గాడ్ ఈజ్ గ్రేట్ రా” గట్టిగా హత్తుకుని చెప్పిందీ మాటలు సుమ.
ఈ కేసు లోంచి బయటపడినందుకు, తన ఆనందాన్ని ఎవరికి, ఎలా చెప్పాలో తెలీక, బిడియంలోనే ఉండిపోయిన అర్చన, లాస్యని ఎత్తుకుని, ముద్దాడుతూ లోనికి వెళ్ళిపోయింది.
=================================================================================
***సమాప్తం***
========================================================================
పూడిపెద్ది ఉగాది వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: పూడిపెద్ది ఉగాది వసంత
నా గురించి స్వపరిచయం...మూడు కథా సంకలనాలలో నా కథలు అచ్చయ్యాయి. తెలుగు బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు సంపాయించుకున్నాయి. ప్రముఖ పత్రికలూ తెలుగు వెలుగు, నవ్య, విపుల, స్వాతి, సాక్షి , సహారి, మొదలైన పత్రికలలో నా కథలు విరివిగా అచ్చయ్యాయి . పోటీలలో కూడా చాల బహుమతులు వచ్చాయి .
నా కథ మీ మన్ననలు అందుకుంటుందని విశ్వసిస్తున్నాను.
కృతజ్యతలతో
ఉగాది వసంత
impressive .very good narration