ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు…

Eda Lopali Mamakaram Ekkadiki Podhu... - Telugu Emotional Family Story | Parupalli Ajay Kumar
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు… - తెలుగు కుటుంబ భావోద్వేగ కథ | పారుపల్లి అజయ్ కుమార్
Published In manatelugukathalu.com On 11/11/2026
ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదు… కథ అన్నదమ్ముల మధ్య ఉండే అపురూపమైన ప్రేమ, త్యాగం, కుటుంబ అనుబంధాల విలువను హృదయానికి హత్తుకునేలా తెలియజేస్తుంది. ఆస్తి కంటే ఆప్యాయత గొప్పదని చాటిచెప్పే ఈ భావోద్వేగ కుటుంబ కథ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది.
“అమ్మా! నువ్వు ఎంత చెప్పినా నేను ఈ విషయంలో వెనక్కి తగ్గను. పొలంలో, ఇంటిలో నా వాటా నాకు రావాల్సిందే. అది నా వారసత్వపు హక్కు.
నేను కష్టపడి చదువుకున్నాను. నేను చదివిన చదువుతో, నా తెలివితేటలతో అమెరికా వెళ్లాను. అక్కడ ఎవరి అండా లేకపోయినా నా స్వశక్తితో మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుని, నా జీవితాన్ని నేను నిర్మించుకున్నాను.
నాలుగు డబ్బులు కూడబెట్టుకున్నాను.
అన్నయ్యకు చదువు అబ్బలేదు. అందుకే ఇక్కడే ఉండి పొలం చూసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు. అన్నయ్య చదువుకోకపోవడం నా తప్పు కాదు కదా!
ఆ కారణంగా ఆస్తిలోనూ, పొలంలోనూ సింహభాగం అన్నయ్యకే ఇవ్వాలనడం ఎంతవరకు న్యాయం? నేను విదేశాల్లో ఉన్నానని ఇక్కడ నా హక్కును వదులుకోవాలా? నేను సంపాదిస్తున్నానని, ఉమ్మడి ఆస్తిలో నాకు వాటా అవసరం లేదని ఎలా అనుకుంటారు?
అమ్మా... నేను అన్నయ్యకు అన్యాయం చేయమని అడగడం లేదు.
కానీ నాకు రావాల్సినదాన్ని మాత్రం వదులుకోను. ఆస్తి పంపకం విషయంలో తేడా చూపించవద్దు” కోపంగా అన్నాడు రవి.
కొడుకు మాటలకు రుక్మిణమ్మ హృదయం ముక్కలైపోయింది. కళ్లల్లో ఆగిన కన్నీళ్లు చివరకు కట్టలు తెంచుకుని ముడతలు పడిన చెంపలపై నెమ్మదిగా జారాయి.
పెదవులు కదిలినా మాట బయటకు రాలేదు. గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. చిన్న కొడుకు తన కళ్ల ముందే ఇలా అనగలడని కలలో కూడా ఊహించలేదు ఆమె.
కొద్దిసేపు ఆమె అక్కడే కదలకుండా నిలబడిపోయింది.
గుండెల్లో గూడు కట్టుకున్న బాధ నెమ్మది నెమ్మదిగా నొప్పిగా మారి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, ఇక నిలబడలేక వరండాలో ఉన్న మంచం వైపు తడబడుతూ నడిచింది.
మంచంపై కూలబడిపోయి, గుండెలపై చేయి వేసుకుని కన్నీళ్లను ఆపుకోలేక మౌనంగా విలపించింది. కొద్దిసేపటికి కన్నీళ్లు తుడుచుకుని, తనలో తాను ధైర్యం తెచ్చుకుంటూ రవిని చూసింది.
“రవీ… నువ్వు చెప్పింది నిజమే. నువ్వు కష్టపడి చదువుకున్నావు. నీ తెలివితేటలతో, నీ శ్రమతో ఈ స్థాయికి ఎదిగావు. నువ్వు జీవితంలో మేం ఊహించనంత ఎత్తుకు ఎదగడం నిజంగా మాకు గర్వకారణమే...” అంటున్న ఆమె గొంతు కొద్దిగా వణికింది.
“కానీ ఈ ఇల్లు… ఈ పొలం… ఇవి కేవలం కాగితాల మీదున్న ఆస్తులు కావు రవీ. మీ నాన్న, నీ అన్నయ్య చిందించిన చెమట చుక్కలు, వారిద్దరి జీవితకాల శ్రమ ఈ ఇంటి గోడల్లో, పొలం మట్టిలో దాగి ఉన్నాయి.
ఈ పొలం కోసం మీ అన్నయ్య తన జీవితాన్ని ఫణంగా పెట్టాడు. నీ చదువు కోసం కూడా ఇదే పొలంలో పండించిన పంటలు రెక్కలొచ్చి ఎగిరిపోయాయి. నీ అన్న దానికి ఎప్పుడూ అభ్యంతర పెట్టలేదు. అందుకే…”
ఆమె మాట పూర్తయ్యేలోపే రవి అసహనంగా చేతిని పైకెత్తాడు.
“అమ్మా! చాలు!”
ఆ ఒక్క మాటతో రుక్మిణమ్మ గొంతు మూగబోయింది.
“మళ్లీ అవే పాత కథలు చెప్పకు. న్యాయం, ధర్మం, త్యాగం, కుటుంబం అంటూ నాకు నీతి బోధలు చేయొద్దు. వారసత్వంగా సంక్రమించే ఆస్తి హక్కును నేను వదులుకోలేను. దాన్ని అడగడానికి నేను ఎవరినీ వేడుకోవాల్సిన అవసరం లేదు.
అంతే!” అంటూ రవి ఒక్క క్షణం కూడా వెనక్కి చూడకుండా గుమ్మం దాటి వీధిలోకి నడిచిపోయాడు.
గుమ్మం దగ్గర నిలబడి ఉన్న రుక్మిణమ్మ అతను వెళ్తున్న అడుగులనే చూస్తూ ఉండిపోయింది. ఆ అడుగులు వీధిలోకి వెళ్లిపోతున్నాయి… కానీ తన కొడుకు తన నుంచి ఎంత దూరం వెళ్లిపోయాడో ఆమెకు ఆ క్షణమే అర్థమైంది.
“రవి…” అని ఒక్కసారి పిలవాలని అనిపించింది.
కానీ గొంతులోంచి పిలుపు బయటకు రాలేదు.
ఆమె కళ్లలోంచి మరో రెండు కన్నీటి బొట్లు జారిపడ్డాయి.
అవి నేలపై పడిన శబ్దం ఎవరికీ వినిపించలేదు.
కానీ ఒక తల్లి గుండె పగిలిన శబ్దం మాత్రం ఆ ఇంటి నిశ్శబ్దంలో కలిసిపోయింది.
వీధిలో ఒంటరిగా నడుస్తున్న రవికి ఎదురుగా ఇద్దరు చిన్నపిల్లలు కనిపించారు.
ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకుని, ఏదో సరదా విషయం చెప్పుకుంటూ పగలబడి నవ్వుకుంటున్నారు. వారి నవ్వుల్లో ఎలాంటి కల్మషం లేదు... వారి అల్లరి మాటలు, ఒకరిపై మరొకరు చూపిస్తున్న సహజమైన అనుబంధం రవి అడుగులను ఒక్కసారిగా ఆపేసింది. ఆ పిల్లలను చూస్తూ రవి కొద్దిసేపు అలా నిలబడిపోయాడు. ఆ చిన్నపిల్లల నవ్వు చూసిన రవికి ఒక విచిత్రమైన కోరిక కలిగింది.
‘నేను కూడా మళ్లీ ఒకసారి ఆ చిన్ననాటి రోజులకి వెళ్లగలిగితే ఎంత బాగుంటుంది’ అని మనసులో అనుకున్నాడు.
అంతలో ఆ పిల్లల్లో ఒకడు రవిని చూసి, “అన్నా, ఎందుకలా చూస్తున్నావ్ మమ్మల్ని?” నవ్వుతూ అడిగాడు.
రవి ఒక్కసారిగా ఆలోచనల నుండి తేరుకుని చిరునవ్వు నవ్వాడు.
“మీ నవ్వులు చూస్తుంటే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి” అన్నాడు.
ఆ పిల్లలు “అవునా!” అంటూ మరింతగా నవ్వుకుంటూ ముందుకు సాగారు.
రవి మాత్రం అక్కడే కాసేపు నిలబడి, ఆ నవ్వుల ప్రతిధ్వనిని తన హృదయంలో మళ్లీ మళ్లీ వినిపించుకుంటూ నడకను కొనసాగించాడు.
వారిలో అతనికి తన బాల్యం కనిపించింది. ఆ ఇద్దరు పిల్లలు ఒకరినొకరు నవ్వుకుంటూ దూరంగా వెళ్లిపోతుండగా, రవి చూపు మాత్రం వారినే అనుసరించింది. అతని కళ్ల ముందు పిల్లల రూపాలు క్రమంగా మసకబారాయి.
రవికి తన చిన్ననాటి రోజులు జ్ఞాపకం వచ్చాయి. అన్నయ్య తన కోసం చేసిన చిన్న చిన్న త్యాగాలు, తనపై చూపిన ప్రేమ గుర్తుకు వచ్చాయి. అతని మనసులో గత జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కళ్ల ముందు మెదిలాయి.
“అన్నయ్యా, నడిచి నడిచి నా కాళ్లు నొప్పెడుతున్నాయి” స్కూల్ వరకూ నడవలేక రవి రోడ్డు పక్కన నిలబడిపోతూ అన్నాడు.
“రవీ, నువ్వు చిన్నవాడివిగా... ఎక్కువ దూరం నడవలేవు. స్కూల్ దాకా నేను నిన్ను ఎత్తుకుని తీసుకెళ్తాను, సరేనా!” అంటూ రవిని ఎత్తుకుని నడక సాగించాడు శంకర్.
ఒకరోజు సాయంత్రం అన్నదమ్ములిద్దరూ ఇంటి ముందర మెట్లపై కూర్చున్నారు. ఇద్దరి చేతుల్లో ఐస్‌క్రీంలు ఉన్నాయి.
తన చేతిలో ఉన్న ఐస్‌క్రీం తింటూనే, “అన్నయ్యా… నాకు ఇంకో ఐస్‌క్రీం తినాలని ఉంది” అన్నతో మెల్లగా అన్నాడు రవి.
శంకర్ నవ్వుతూ తన చేతిలోని ఐస్‌క్రీం తమ్ముడి చేతికి ఇచ్చి, “తిను తమ్ముడూ…” అన్నాడు.
రవి అన్న వైపు చూసి, “అన్నయ్య… మరి నీకు?” అని అడిగాడు.
శంకర్ తమ్ముడి భుజంపై చేయి వేసి, “నువ్వు తృప్తిగా తింటే చాలు, అదే నాకు ఆనందం” అన్నాడు.
అన్న మాటలు విన్న రవి కళ్లలో ఆనందం ఉరకలు వేసింది. అంత చిన్న వయసులోనే ఐస్‌క్రీం కంటే అన్న ప్రేమ ఎక్కువగా కావాలని అనిపించింది అతనికి.
“అన్నయ్యా… నువ్వు కూడా తిను. మనిద్దరం చెరిసగం పంచుకుందాం…” అంటూ ఐస్‌క్రీంను మధ్యలో విరిచి సగం శంకర్ చేతిలో పెట్టాడు.
శంకర్ ఆశ్చర్యంగా తమ్ముడిని చూసి చిరునవ్వు చిందించాడు.
“ఇదే నిజమైన ప్రేమ తమ్ముడూ… పంచుకుంటేనే ఆనందం రెట్టింపు అవుతుంది” అన్నాడు.
అప్పుడే ఇంటి లోపల నుంచి వారి అమ్మ రుక్మిణమ్మ ఇద్దరి మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని చూసి మురిసిపోయింది.
“మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసిమెలసి ఉండాలి” అని చెప్పింది పిల్లలతో.
ఇద్దరూ తలలు ఊపుతూ, “అలాగే అమ్మా!” అని అన్నారు.
సాయంత్రపు గాలి చల్లగా వీస్తుండగా, అన్నదమ్ములిద్దరూ మెట్లపై కూర్చుని నవ్వుకుంటూ ఐస్‌క్రీం తినసాగారు.
తనతో కలిసి మట్టి రోడ్లపై పరుగులు తీసిన అన్నయ్య...
తన కోసం చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీంలు త్యాగం చేసిన రోజులు...
తాను కోరిన చిన్న చిన్న వస్తువుల కోసం అన్నయ్య తన కోరికలను పక్కన పెట్టిన సందర్భాలు...
తాను తప్పు చేసినప్పుడు మందలించినా, బయటివాళ్లెవరైనా తనను ఒక్క మాట అన్నా తనకు అండగా నిలిచిన అన్నయ్య…
అన్నయ్య భుజంపై కూర్చుని వెళ్లిన రోజులు…
అన్నయ్య దాచుకున్న చివరి మిఠాయి తన కోసం ఇచ్చేయడం...
తాను ఏడిస్తే తన కన్నీళ్లు తుడిచిన ఆ చేతులు…
చీకటి పడితే చేయి పట్టుకుని ఇంటివరకు జాగ్రత్తగా తీసుకెళ్లిన అన్నయ్య ప్రేమ...
జ్వరమొస్తే రాత్రంతా తన పక్కనే కూర్చున్న అన్నయ్య ఆప్యాయత…
అన్నీ ఒక్కసారిగా మనసు తెరపై కదలాడాయి.
ఒక్కొక్క జ్ఞాపకం అతని గుండె తలుపులు తట్టుకుంటూ బయటకు వచ్చాయి.
చిన్నప్పుడు ప్రతీ పండుగకు తనకు కొత్త బట్టలు కావాలని పట్టుబడితే, “నాకు కొనవద్దులే అమ్మా! తమ్ముడికి కొనండి” అంటూ అన్నయ్య అమ్మను, నాన్నను అడగడం గుర్తొచ్చింది.
తన చదువు కోసం అన్నయ్య తాపత్రయపడిన రోజులు గుర్తొచ్చాయి.
తాను సుఖంగా ఉండాలని, తాను ఎదగాలని అన్నయ్య ఎన్నిసార్లు తన సంతోషాలను, తన అవసరాలను త్యాగం చేశాడో ఇప్పుడు రవికి ఒక్కొక్కటిగా గుర్తుకు రావడం మొదలైంది.
అప్పట్లో అవన్నీ తనకు సహజంగానే అనిపించాయి. అన్నయ్య ప్రేమకు విలువ ఏమిటో అర్థం చేసుకునే వయసు కాదు తనది.
కానీ ఇప్పుడు...
కాలం గడిచిపోయింది. తాను పెద్దవాడయ్యాడు. ప్రపంచాన్ని చూశాడు. డబ్బు సంపాదించాడు. దూర దేశంలో మంచి జీవితాన్ని ఏర్పరచుకున్నాడు. అయినా ఏదో అశాంతి మనసును ఛిద్రం చేసేస్తున్నది.
ఆలోచనల మధనంలో పడిన రవికి తన జీవితంలో అశాంతికి కారణం ఒక్కసారిగా తేటతెల్లమైంది. తాను ఎంతో సంపదను కూడబెట్టాడు.
కానీ… కానీ… అన్నయ్య ప్రేమకు సమానమైన సంపదను మాత్రం ఎక్కడా సంపాదించలేకపోయాడు.
అన్నయ్య గురించిన పాత జ్ఞాపకాలు అతని గుండెగోడలను తడిపేశాయి. ఆస్తిలో తన వాటా కోసం పట్టుబట్టిన తాను… తన అన్నయ్య ప్రేమలో తనకు ఉన్న వాటాను మాత్రం ఎప్పుడూ లెక్కించలేదని ఒక్కసారిగా అతనికి అర్థమైంది.
“అన్నయ్య...”
అతని పెదవులపై ఆ ఒక్క మాట మాత్రమే కదిలింది.
గొంతు బిగుసుకుపోయింది.
ఇప్పటివరకు ఆస్తి గురించి ఆలోచించిన అతని మనసులో, తొలిసారిగా అన్నయ్య ప్రేమ విలువ ఆస్తి కంటే ఎంతో గొప్పదిగా కనిపించింది.
రవి హృదయం అన్నయ్య తనపట్ల చూపిన ప్రేమ జ్ఞాపకాలతో తడిసి ముద్దయింది. పశ్చాత్తాపం నిండిన మనసుతో ఇంటికి వచ్చాడు.
శంకర్ ఇంటి అరుగు మీద రవి కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నాడు. రవిని చూస్తూనే “రవీ” అంటూ తమ్ముడి దగ్గరకు వచ్చి భుజం మీద చేయి వేశాడు.
“రవీ, ఇందాక నువ్వు అన్నది నిజమే. నువ్వు చదువుకున్నావు. కష్టపడ్డావు. నీ స్వశక్తితో ఎదిగావు. నాకు చదువు అంతగా రాలేదు” శంకర్ ఒక్క క్షణం ఆగి, రవి ముఖాన్ని చూశాడు.
“తుఫాన్లు వచ్చి పంటలు దెబ్బతిన్నా, నాన్న ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరినా… నీ చదువు ఆగకూడదని ఇక్కడ మా బాధలు, కష్టాలు నీకు తెలియజేయలేదు.
అక్కడ నువ్వు సాధించిన ప్రతి విజయాన్ని ఇక్కడ మేము ఓ పండుగలా జరుపుకున్నాం. నువ్వు మాకు దూరంగా ఉన్నా, మా గుండెల్లోనే నువ్వున్నావు. ఈ ఆస్తులు, ఈ పొలాలు అన్నీ నాన్న చెమటతో సమకూరినవే.
వీటన్నింటిలో నీకూ సగభాగం ఉంది. అమ్మ నేనేదో కష్టపడిపోతున్నట్లు భావించి నాకు ఎక్కువ భాగం ఇవ్వమని అంది. అది నాకు ఇష్టం లేదు.
ఆస్తి సమానంగా పంచుకుందాం. కానీ మన ఆస్తుల మధ్య హద్దుల గీతలు గీయొద్దు. అన్నదమ్ముల ప్రేమను కొలిచే కొలమానం ఏదీ లేదురా” ఆప్యాయంగా అన్నాడు శంకర్.
రవికి దుఃఖంతో నోట మాటరాలేదు.
రుక్మిణమ్మ రవి చేయి పట్టుకుని తనతో పాటు మంచం మీద కూర్చోబెట్టుకుంది.
“రవీ, నీ అన్నయ్య పెద్దగా చదువుకోలేదు... నిజమే. కానీ ఎందుకు చదవలేదో ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు చదువుకోవడానికి, హాస్టల్ ఫీజులు, పుస్తకాలు ఆ ఖర్చులన్నీ ఎవరు భరించారో తెలుసా?” రుక్మిణమ్మ అడిగిన ప్రశ్నకు రవి దగ్గర సమాధానం లేదు. మౌనంగా ఉండిపోయాడు.
“మీ నాన్న ఇంటి ఖర్చుల కోసం, పొలం సాగుబడి కోసం ఎన్నో అప్పులు చేశాడు. పంటలు పండకపోతే మళ్లీ మళ్లీ అప్పులు తీసుకున్నాడు. అప్పులన్నీ తడిపి మోపెడయ్యేసరికి ఆ దిగులుతోనే మీ నాన్న కన్నుమూశారు. ఆ అప్పులు తీర్చడానికి, ఈ ఇంటిని నిలబెట్టడానికి… నీ అన్నయ్య చిన్న వయసులోనే చదువు వదిలేసి పొలం పనులు చేయడం మొదలుపెట్టాడు.
నీ చదువు ఆగకూడదని తన చదువునే త్యాగం చేశాడు” అని రుక్మిణమ్మ గొంతు కంపించింది.
ఆ మాటలు రవి హృదయాన్ని ద్రవింపజేశాయి.
“నువ్వు అమెరికా వెళ్లి గొప్ప స్థాయికి చేరావు... అది మా అందరికీ గర్వం. కానీ నీ అన్నయ్య ఈ ఇంటిని, మన పొలాన్ని కాపాడాడు.
మన కుటుంబం నిలబడటానికి నీ అన్న ఆరుగాలం కష్టించి శ్రమపడ్డాడురా. రవీ, మీరిద్దరూ నాకు రెండు కళ్లలాంటివారు. ఆస్తుల పేరుతో ఒకరికొకరు దూరమైతే నేను చూడలేనురా” అంది బాధగా.
తాను చదువుకోవడానికి పట్టణానికి వెళ్లిన రోజున, అన్నయ్య తనను బస్సు ఎక్కించడానికి వచ్చి, “నువ్వు బాగా చదువుకోరా… మన ఇంటి పేరు నిలబెట్టు” అని చెప్పిన మాటలు చెవుల్లో మార్మోగాయి. ఆ మాటలు రవి గుండెల్లోకి నేరుగా దూసుకెళ్లాయి. రవి కళ్లలో నీళ్లు తిరిగాయి.
“నన్ను క్షమించమ్మా…” అంటూ తల వంచుకుని అమ్మ పాదాల దగ్గర కూర్చున్నాడు.
అమెరికాలోని విల్లాలు, ఇంపోర్టెడ్ కార్లు, లగ్జరీ జీవితం… అన్నీ ఈ ప్రేమల ముందు చిన్నవిగా అనిపించాయి.
“అన్నయ్యా, నాకు ఏ ఆస్తులూ వద్దు. ఇల్లు, పొలాలు అన్నీ నువ్వే తీసుకో. నీ ప్రేమ, నీ అనురాగం, నీ ఆప్యాయత చాలు నాకు.”
రవి గొంతు ఆనందంతో బరువెక్కింది.
శంకర్ నవ్వుతూ తమ్ముణ్ణి చూశాడు.
రవి ఒక్క అడుగు ముందుకు వేసి అన్నయ్యను ప్రేమతో గట్టిగా హత్తుకున్నాడు.
************************
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
పారుపల్లి అజయ్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పారుపల్లి అజయ్ కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు పారుపల్లి అజయ్ కుమార్ ...
పదవీ విరమణ పొందిన ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుడుని ...
ఖమ్మం జిల్లా, ఖమ్మం పట్టణ వాసిని ...
సాహిత్యం అంటే ఇష్టం .... కథలు,
నవలలు చదవటం మరీ ఇష్టం ...
పదవీ విరమణ తరువాత నా సహచరి దుర్గాభవాని సహకారంతో ఖమ్మం లో
"పారుపల్లి సత్యనారాయణ పుస్తక పూదోట - చావా రామారావు మినీ రీడింగ్ హాల్ " పేరిట ఒక చిన్న లైబ్రరీని మా ఇంటి క్రింది భాగం లో నిర్వహిస్తున్నాను ..
షుమారు 5000 పుస్తకాలు ఉన్నాయి .
నిరుద్యోగ మిత్రులు ఎక్కువుగా వస్తుంటారు ..
రోజుకు 60 నుండి 70 మంది దాకా వస్తుంటారు ...
ఉచిత లైబ్రరీ ....
మంచినీరు ,కుర్చీలు ,రైటింగ్ ప్యాడ్స్ ,వైఫై ,కరెంటు అంతా ఉచితమే ...
ఉదయం 6 A M నుండి రాత్రి 10 P M దాకా ఉంటారు ...మనసున్న
మనిషిగా నాకు చేతనైన సాయం నిరుద్యోగ మిత్రులకు చేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కొంతమందికి జాబ్స్ వస్తున్నాయి.










Comments