top of page
Original.png

ఒక భారీ సినిమా - పార్ట్ 3

4 minutes ago
4 min read

సముద్రంలో క్లైమాక్స్ షూటింగ్ సమయంలో అదుపుతప్పి మరో బోటును ఢీకొన్న నూకరాజు బోట్ దృశ్యం

Oka Baari Cinema - Part 3 - Telugu Comedy Story | Bhaskara Rao B. R. K. V.

ఒక భారీ సినిమా - పార్ట్ 3 - తెలుగు హాస్య కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 11/11/2026


సినిమా తీయాలనే సుబ్బరాజు కల, హీరోగా నిలవాలనే నూకరాజు ఆశ చివరకు సముద్రంలో జరిగే భారీ క్లైమాక్స్‌కు దారి తీస్తాయి. ఊహించని ప్రమాదాలు, హాస్యభరిత సంఘటనలతో సాగే ఈ కథ చివర్లో అనూహ్యమైన ట్విస్ట్ ఇస్తుంది.



ఒక భారీ సినిమా - పార్ట్ 3 చదవండి.


నూకరాజు భయం పోగొట్టడానికి ఎంతోమంది మానసిక వైద్యులకు చూపించాడు సుబ్బరాజు. 


పెద్దగా ఫలితం లేకపోవడంతో భూతవైద్యులను సంప్రదించాడు. 


వాళ్ళు ఇచ్చిన తాళ్ళు, రక్షరేకులు కట్టుకోవడంతో రెండు చేతులు వాచిపోవడంతో పాటు, మొలతాడు కూడా వాటి బరువుకు అప్పుడప్పుడు జారి పాదాల మీదకు వచ్చేది. 


దయ్యం పట్టిన వానిలా చాలా కాలం పాటు పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ నిద్దట్లో లేచి కెవ్వున కేక పెట్టేవాడు. పట్టపగలు కూడా ఉలిక్కిపడేవాడు అప్పుడప్పుడు. రెండేళ్లకు కానీ మామూలు మనిషి కాలేదు నూకరాజు.


కానీ సుబ్బరాజు మనసు మాత్రం ఇంకా సినిమా తీయాలనే కాంక్షను వదలలేకపోతోంది. కొడుక్కి, భార్యకు చెప్పే ధైర్యం లేక తనలో తాను క్రుంగిపోసాగాడు.


ప్రతి సంవత్సరం లానే ఆ ఏడు కూడా సంక్రాంతికి మోటార్ బైక్ రాలీ టౌన్ చివర నిర్వహిస్తుంటే, రెండు సంవత్సరాల తర్వాత చూడటానికి వెళ్ళాడు నూకరాజు తన బైక్ మీద.


రేసులో నెగ్గినవాణ్ణి మిగిలిన వారిలానే భుజం మీద చెయ్యి వేసి అభినందిస్తుంటే, విసురుగా నూకరాజు చెయ్యిని నెట్టేసి అతను — "అవకాశం వచ్చినప్పుడు హీరోయిన్‌తో రొమాన్స్ చేయడం చేతకాక అడవిలో బొక్కబోర్లా పడ్డ నువ్వు కూడా నన్ను అభినందిస్తున్నావా?" అని నలుగురిలో ఎగతాళి చేసేసరికి నూకరాజుకు తల కొట్టేసినట్టయ్యింది. 


నీళ్ళు నిండిన కళ్ళతో సరాసరి ఇంటికి వచ్చి తనకు జరిగిన అవమానాన్ని తండ్రితో చెప్పి, "నాన్నా! ఆరు నూరైనా నేను మిగిలిపోయిన క్లైమాక్స్ సీన్ యాక్ట్ చేస్తాను. డైరెక్టరు గారికి కబురు పెట్టు" అన్నాడు రోషంగా.


అప్పటికే క్రుంగిపోతున్న సుబ్బరాజుకు ఆ మాట కొత్త ఉత్సాహాన్ని తెచ్చింది.

రెండు రోజులకు రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు, బంగాళాఖాతంలో కన్యాకుమారి దగ్గర యాభై బోట్లతో క్లైమాక్స్ ప్లాన్ చేశారు.


"బాబూ నూకా! ఇది మదర్ సెంటిమెంట్ సీన్. నీ తల్లిని విలన్స్ బోట్స్ మీద తీసుకుపోతుంటే నువ్వు హెలికాప్టర్ మీద నుంచి వాళ్ళపై దూకి రక్షించాలి. ఇది నేను అనుకున్న స్క్రిప్ట్. కానీ మనకు హెలికాప్టర్ అచ్చిరాలేదు కనుక నువ్వు కూడా వేరే బోట్ మీద వెళ్ళి నీ తల్లిని రక్షించుకోవాలి."


"సార్! మీ మాటకు అడ్డుతగిలానని అనుకోవద్దు. ఈ టైమ్‌లో హీరోయిన్ కూడా నా ప్రక్కనుంటే గ్లామరస్‌గా ఉంటుందేమో?"


"అమ్మో!!! నీకు కూడా డైరెక్షన్‌లో మెలకువలు తెలిసిపోతున్నాయే! వై నాట్? అలాగే... వెంటనే ఆవిణ్ణి చైనా నుంచి రప్పించాకే షూటింగ్ మొదలుపెడదాం. మనకు అల్టిమేట్‌గా కావాల్సింది సక్సెస్," అని మెచ్చుకోలుగా నూకరాజు భుజం తట్టి నవ్వాడు డైరెక్టర్.


డైరెక్టరు భుజం మీద చెయ్యి వేసేసరికి తనకు జరిగిన అవమానం గుర్తుకువచ్చి నూకరాజు రక్తం సలసలా మరిగిపోయింది. 


ముఖమంతా ఎర్రబడిపోయింది అస్తమిస్తున్న సూర్యునిలా.


హీరోయిన్ రాకతో రెండు రోజుల తరువాత షూటింగ్ ప్రారంభమయ్యింది. చుట్టూ కాపలాగా నలభైకి పైగా బోట్ల మధ్యలో ఉన్న బోటులో తల్లిని తీసుకుపోతుంటే, దాన్ని చేరుకోవడానికి హీరో నూకరాజు... హీరోయిన్ భయంతో గట్టిగా వాటేసుకుంటే డ్రైవ్ చేస్తున్నాడు.


నూకరాజు డ్రైవ్ చేస్తున్న మాటే గాని మనసంతా హీరోయిన్ మీదే ఉంది. డైరెక్టరు సలహా మీదట ఆవిడ మరింత దగ్గర అయ్యేసరికి నూకరాజు గుండె వేగంగా కొట్టుకుంటూ మనసు అదుపుతప్పింది.


అంతే!!! నూకరాజు ఉన్న బోటు కంట్రోల్ తప్పి ఒక్కసారిగా వెళ్ళి పక్కనున్న వేరే బోటును గట్టిగా గుద్దుకోవడమూ, హీరో హీరోయిన్లు తాటిచెట్టంత ఎత్తు ఎగిరి సముద్రంలో పడటమూ క్షణాల్లో జరిగిపోయింది. 


వేరే బోటులో షూట్ చేస్తున్న డైరెక్టరుతో పాటు ఉన్న సుబ్బరాజు మాట లేకుండా వెనక్కి వాలిపోయాడు.


కాసేపటికి హీరోయిన్ తనకు ఇటువంటివి అలవాటే కావడంతో ఈదుకుంటూ సేఫ్‌గా ఒడ్డుకు చేరుకుంది.


నూకరాజు పత్తా లేకుండా పోయాడు.


సుబ్బరాజు కాసేపటికి తేరుకుని, ఒక్కగానొక్క కొడుకు కోసం ఇంటికి వచ్చినా విలపిస్తూనే ఉన్నాడు. ఎంతో ఖర్చు పెట్టి గజఈతగాళ్ళను తీసుకువచ్చి సముద్రమంతా గాలించినా నూకరాజు అడ్రస్ లేదు.


తన కొడుకును ముందుగా తిమింగలం మింగేసిందేమోనని అనుకున్నా, అతని పర్సనాలిటీ గుర్తుకొచ్చి దాని పన్ను అంత ఉండని వాణ్ణి ఏ పెద్ద చేపే భోజనం చేసేసి ఉంటుంది అని అనుకుంటున్న సమయంలో... ప్రభుత్వం నుంచి నూకరాజు సముద్ర జలాల్లో వేరే దేశపు సరిహద్దుల్లోకి కొట్టుకుపోవడం వల్ల వాళ్ళు అరెస్ట్ చేశారనే తియ్యటి కబురు అందేసరికి, అతన్ని విడిపించుకుని తీసుకు రావడానికి బయలుదేరాడు సుబ్బరాజు ప్రక్క దేశానికి.


================================

సమాప్తం

================================








📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


*** 


బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page