top of page
Original.png

కోటీశ్వరుడు

5 hours ago
9 min read

ప్రేమ పేరుతో మహిళా పోలీసును మోసం చేసిన నకిలీ కోటీశ్వరుడి సైబర్ క్రైమ్ కథ

Koteeswarudu - Telugu Cyber Crime Thriller Story | Ch. Pratap

కోటీశ్వరుడు - తెలుగు సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కథ | Ch. ప్రతాప్   

Published in manatelugukathalu.com on 11/11/2026


కోటీశ్వరుడిలా కనిపిస్తూ ప్రేమ పేరుతో నమ్మించి డబ్బులు వసూలు చేసే మోసగాడి కథే “కోటీశ్వరుడు”. సోషల్ మీడియా పరిచయాల విషయంలో అప్రమత్తత, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించే ఈ కథ ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది.


‘‘మీరు పోలీసు కానిస్టేబుల్ కదా! మా చెల్లెలు కూడా పోలీసు ఉద్యోగానికి సిద్ధమవుతోంది.


కొన్ని వివరాలు చెప్పగలరా?’’


ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఆ సందేశాన్ని చూసి హైదరాబాద్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ మేఘన పెద్దగా పట్టించుకోలేదు. 


రెండు రోజుల తరువాత మరో సందేశం వచ్చింది.


‘‘మేడమ్! మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. మా చెల్లెలికి పరీక్షల గురించి కొన్ని సందేహాలున్నాయి. మీకు సమయం దొరికినప్పుడే సమాధానం ఇవ్వండి.’’


అతడి మర్యాదపూర్వకమైన మాటతీరు చూసి మేఘన స్పందించింది.


‘‘పోలీసు నియామకాలకు సంబంధించిన వివరాలన్నీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంటాయి. మీ చెల్లెలిని అవి పరిశీలించమనండి.’’


‘‘థాంక్యూ మేడమ్! నా పేరు ఆదిత్యవర్మ. మాది వరంగల్. హైదరాబాద్‌లో నిర్మాణరంగానికి సంబంధించిన వ్యాపారాలు నిర్వహిస్తున్నాను. ఉద్యోగంతో సంబంధం లేకపోయినా మీలాంటి వాళ్ల కష్టాన్ని చూసి గౌరవిస్తుంటాను.’’


అలా మొదలైన పరిచయం క్రమంగా స్నేహంగా మారింది.


ఆదిత్య ప్రొఫైల్‌లో ఖరీదైన కార్లు, విలాసవంతమైన హోటళ్లు, విదేశీ పర్యటనల చిత్రాలు కనిపించేవి. వ్యాపార సమావేశాలంటూ ఫొటోలు పెట్టేవాడు. అప్పుడప్పుడు తన కంపెనీ వ్యవహారాల గురించి మాట్లాడేవాడు.


అయితే మేఘనను ఆకట్టుకున్నది అతడి సంపద కంటే మాటతీరు.


‘‘మేఘనా! రోజంతా విధి నిర్వహణలో ఉంటారు. ఇంటికి వెళ్లాకైనా విశ్రాంతి దొరుకుతుందా?’’ ఒకరోజు అడిగాడు.


‘‘మా ఉద్యోగంలో సమయానికి ఇంటికి వెళ్తామనే నమ్మకం ఉండదు. కొన్నిసార్లు పండగ రోజున కూడా డ్యూటీ చేయాల్సి వస్తుంది.’’


‘‘మీ కుటుంబం ఎలా అర్థం చేసుకుంటుంది?’’

‘‘మొదట్లో అమ్మ బాధపడేది. ఇప్పుడు అలవాటైంది. కానీ నాన్న మాత్రం నా ఉద్యోగం గురించి చాలా గర్వంగా చెబుతుంటారు.’’


‘‘అలా గర్వపడే తండ్రి ఉండటం మీ అదృష్టం. నిజం చెప్పాలంటే మేఘనా, నా చుట్టూ డబ్బు కోసం తిరిగేవాళ్లే ఎక్కువ. మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్లు చాలా తక్కువ.’’

మేఘనకు అతడిపై సానుభూతి కలిగింది.


కొన్ని వారాల తరువాత ఇద్దరూ బంజారాహిల్స్‌లోని ఒక రెస్టారెంట్‌లో కలుసుకున్నారు.

ఖరీదైన నల్లటి కారులో దిగిన ఆదిత్యను చూసి మేఘన ఆశ్చర్యపోయింది.


‘‘ఇంత పెద్ద కారులో వచ్చారా! నగరంలో ట్రాఫిక్‌కు ఇలాంటి కారు అవసరమా?’’

ఆదిత్య నవ్వాడు.


‘‘వ్యాపారంలో కొన్నిసార్లు మన స్థాయిని ఎదుటివాళ్లకు చూపించాల్సి ఉంటుంది. నాకు మాత్రం సాధారణంగా ఉండటమే ఇష్టం.’’


ఆమె కూడా నవ్వింది.


మాటల మధ్య మేఘన తన కుటుంబం గురించి చెప్పింది.


‘‘నాన్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు. అమ్మ గృహిణి. తమ్ముడు ఇంకా చదువుకుంటున్నాడు. ఇంట్లో పెద్ద బాధ్యత నాదే.’’


‘‘అంటే మీ సంపాదనలో ఎక్కువ భాగం ఇంటికే ఇస్తారా?’’

‘‘అవును. కానీ అది నాకు భారం అనిపించదు. నన్ను చదివించడానికి నాన్న చాలా కష్టపడ్డారు.’’


‘‘అలాంటి కుటుంబంలో పుట్టిన అమ్మాయి జీవిత భాగస్వామిగా దొరికితే అదృష్టమే.’’

మేఘన ఆ మాటకు సమాధానం చెప్పలేదు.


ఆ తరువాత వారి సమావేశాలు పెరిగాయి. ఆదిత్య అప్పుడప్పుడు ఖరీదైన బహుమతులు తీసుకొచ్చేవాడు. మేఘన వద్దంటే మరీ పట్టుబట్టేవాడు కాదు. ఆమె అభిరుచులు, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు ఆశలు తెలుసుకునేవాడు.


మూడు నెలల తరువాత ఒక సాయంత్రం హుస్సేన్‌సాగర్ ఒడ్డున అతడు తన మనసులోని మాట బయటపెట్టాడు.


‘‘మేఘనా! మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. తప్పుగా అనుకోకండి.’’

‘‘చెప్పండి.’’


‘‘మన పరిచయం నాకు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. జీవితంలో డబ్బు సంపాదించాను. 


కానీ నా సంతోషాన్నీ బాధనీ పంచుకునే మనిషి కోసం ఎదురుచూస్తున్నాను. మీకూ ఇష్టమైతే మన పెళ్లి గురించి ఆలోచిద్దామనుకుంటున్నాను.’’


‘‘ఆదిత్యా! పెళ్లి చిన్న విషయం కాదు. మీ కుటుంబం గురించి నాకు పూర్తిగా తెలియదు. మీవాళ్లు కూడా నన్ను అంగీకరించాలి కదా!’’


‘‘మా ఇంట్లో నా నిర్ణయాన్ని గౌరవిస్తారు. వచ్చే నెలలో అమ్మానాన్నలను హైదరాబాద్‌కు తీసుకొస్తాను. ముందు మీ నాన్నగారితో మాట్లాడతాను.’’


‘‘నాన్నకు మాటిచ్చే ముందు మీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆయన నన్ను ఎంతో నమ్ముతారు.’’


‘‘అది నాకు తెలుసు మేఘనా. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా బాధ్యత.’’

అతడి మాటలను ఆమె విశ్వసించింది.


మరో నెల గడిచింది.


ఒకరోజు రాత్రి ఆదిత్య ఫోన్ చేశాడు. అతడి గొంతులో మునుపటి ఉత్సాహం లేదు.

‘‘మేఘనా! ఒక సమస్య వచ్చింది. నీతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను.’’


‘‘ఏమైంది? ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేదా?’’

‘‘అలాంటిదేమీ కాదు. మా కంపెనీకి రావాల్సిన పెద్ద చెల్లింపు ఆలస్యమైంది. రేపటిలోగా ఒక ప్రాజెక్టు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. లేకపోతే ఒప్పందం రద్దవుతుంది.’’


‘‘మీ వ్యాపార భాగస్వాములను అడగొచ్చు కదా!’’

‘‘అడిగాను. వాళ్ల డబ్బు కూడా ఇతర పనుల్లో చిక్కుకుంది. బ్యాంకు రుణం రావడానికి సమయం పడుతుంది.’’


‘‘అయితే ఏం చేస్తారు?’’

‘‘ఏదో ఒక మార్గం చూసుకుంటాను. నీతో చెప్పుకుంటే మనసు తేలికపడుతుందని అనిపించింది.’’


మేఘన కొద్దిసేపు మౌనంగా ఉంది.


‘‘ఎంత డబ్బు అవసరం?’’

‘‘పన్నెండు లక్షలు. కానీ నిన్ను అడగలేను. నీ కుటుంబ బాధ్యతలు నాకు తెలుసు.’’

‘‘నా దగ్గర అంత డబ్బు లేదు ఆదిత్యా.’’


‘‘తెలుసు. నువ్వు బాధపడకు. రెండు మూడు రోజుల్లో సర్దుబాటు చేసుకుంటాను.’’

ఫోన్ పెట్టేసిన తరువాత మేఘన ఆలోచనలో పడింది.


మరుసటి రోజు ఆమెనే ఫోన్ చేసింది.


‘‘ఆదిత్యా! బ్యాంకులో వ్యక్తిగత రుణం తీసుకునే అవకాశం ఉంది. కానీ ఒక షరతు. నెల రోజుల్లో తప్పకుండా తిరిగి ఇవ్వాలి. మా ఇంట్లో ఎవరికీ ఈ విషయం తెలియదు.’’


‘‘మేఘనా! నాకోసం అంత పెద్ద బాధ్యత తీసుకోవద్దు.’’


‘‘మనిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు నీ కష్టం నాది కాదా? కానీ నువ్విచ్చిన మాట నిలబెట్టుకోవాలి.’’


‘‘నువ్వు నా మీద ఉంచిన నమ్మకానికి జీవితాంతం రుణపడి ఉంటాను.’’


రుణం మంజూరైన తరువాత మేఘన పన్నెండు లక్షలు అతడు సూచించిన ఖాతాకు బదిలీ చేసింది. ఆదిత్య ఆ మొత్తం అందినట్లు సందేశం పంపాడు.


మొదటి వారం అతడు మామూలుగానే మాట్లాడాడు. తరువాత ఫోన్ కాల్స్ తగ్గాయి.

నెల గడిచినా డబ్బు రాలేదు.


‘‘ఆదిత్యా! బ్యాంకు మొదటి వాయిదా కట్టాను. డబ్బు ఎప్పుడు ఇస్తావు?’’

‘‘మేఘనా! చెల్లింపు ఇంకాస్త ఆలస్యమైంది. నీకు ఇబ్బంది లేకుండా చూస్తాను.’’


‘‘ఇబ్బంది లేదని ఎలా అంటావు? నా జీతంలో పెద్ద భాగం రుణవాయిదాకే పోతోంది. ఇంట్లోనూ డబ్బు ఇవ్వాలి.’’


‘‘నాకు అర్థమవుతోంది. ఇంకో పది రోజులు ఓపిక పట్టు.’’

పది రోజులు గడిచాక మరో సమస్య ముందుకొచ్చింది.


‘‘మేఘనా! మన డబ్బు విడుదల కావాలంటే కొన్ని పెండింగ్ చెల్లింపులు పూర్తి చేయాలట. ఇంకో ఎనిమిది లక్షలు అవసరం. అవి కట్టగానే మొత్తం తిరిగి వస్తుంది.’’

మేఘన దిగ్భ్రాంతి చెందింది.


‘‘మళ్లీ డబ్బా? మొదట ఇచ్చిన పన్నెండు లక్షల సంగతేంటి? వ్యాపారంలో ఇన్ని సమస్యలుంటే ముందు ఎందుకు చెప్పలేదు?’’


‘‘నేనేమైనా కావాలని చేస్తున్నానా? నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను.’’


‘‘ఆదిత్యా! నాకు భయంగా ఉంది. నాన్నకు తెలిస్తే చాలా బాధపడతారు.’’


‘‘అయితే ఇప్పుడే చెప్పేయి. నన్ను నమ్మి డబ్బిచ్చానని చెప్పు. కానీ ఇప్పటివరకు ఇచ్చిన డబ్బు కూడా చిక్కుకుపోతే నన్ను నిందించకు.’’

ఆ మాటలకు మేఘన మరింత ఆందోళన చెందింది.


ఇచ్చిన డబ్బు తిరిగి రాదేమోనన్న భయంతో తన పొదుపు సొమ్ము, స్నేహితుల దగ్గర తీసుకున్న అప్పులు కలిపి మరో ఎనిమిది లక్షలు పంపించింది.


తరువాత కూడా పలు చిన్నచిన్న అవసరాల పేరుతో ఆదిత్య మరో నాలుగు లక్షలు తీసుకున్నాడు.


మొత్తం ఇరవై నాలుగు లక్షలు!

ఆ తరువాత ఆదిత్య పూర్తిగా మారిపోయాడు.


మేఘన ఫోన్ చేస్తే ఎత్తేవాడు కాదు. సందేశాలకు ఆలస్యంగా సమాధానమిచ్చేవాడు.

ఒకరోజు ఆమె వరుసగా ఫోన్ చేయడంతో విసుగ్గా మాట్లాడాడు.


‘‘ఎందుకు పదేపదే ఫోన్ చేస్తున్నావు? నాకు వేరే పనులుండవా?’’

‘‘నువ్వు మాటిచ్చిన గడువు దాటిపోయింది ఆదిత్యా! బ్యాంకు వాయిదాలు కట్టలేకపోతున్నాను. నా స్నేహితులు కూడా డబ్బు అడుగుతున్నారు.’’


‘‘వ్యాపారంలో డబ్బు ఎప్పుడు వస్తుందో నా చేతుల్లో ఉండదు.’’


‘‘మరి నన్నెందుకు అప్పు తీసుకోమన్నావు? నెల రోజుల్లో తిరిగి ఇస్తానని చెప్పావు కదా!’’

‘‘నేను బలవంతంగా తీసుకోలేదు. నువ్వే ఇస్తానన్నావు.’’


ఆ మాటతో మేఘన గొంతు ఆగిపోయింది.

‘‘ఆదిత్యా! నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు. మా నాన్నతో మాట్లాడతానన్నావు. మన భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానన్నావు. అవన్నీ అబద్ధాలేనా?’’

‘‘ప్రతి మాటను పట్టుకొని కూర్చుంటే ఎలా? పరిస్థితులు మారుతుంటాయి.’’


‘‘పరిస్థితులు మారవచ్చు. కానీ మనుషుల నిజాయితీ మారకూడదు కదా! కనీసం నువ్వెక్కడున్నావో చెప్పు. నేరుగా వచ్చి మాట్లాడతాను.’’


‘‘ఇప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నించకు. డబ్బు వచ్చినప్పుడు పంపిస్తాను.’’

ఫోన్ కట్ అయింది.


ఆ రాత్రంతా మేఘన ఏడుస్తూనే ఉంది.

మరుసటి రోజు ఆమె స్నేహితురాలు, సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ దీప్తి ఇంటికి వచ్చింది.


‘‘మేఘనా! ఈ మధ్య ఎందుకిలా ఉంటున్నావు? డ్యూటీలో కూడా పరధ్యానంగా కనిపిస్తున్నావు. ఏమైనా సమస్యా?’’


‘‘దీప్తీ! నన్ను ఒక వ్యక్తి దారుణంగా మోసం చేశాడు. నా జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు.’’


జరిగినదంతా చెప్పేసరికి మేఘన కన్నీళ్లు ఆగలేదు.

దీప్తి ఆమె మాటలను మధ్యలో ఆపలేదు.


‘‘అయితే నీ దగ్గర అతడి ఫోన్ నంబర్లు, ఫొటోలు, డబ్బు పంపిన వివరాలు అన్నీ ఉన్నాయా?’’

‘‘ఉన్నాయి. కానీ దీప్తీ! అతడు మోసగాడని నమ్మలేకపోతున్నాను. నాతో ఎంతో ప్రేమగా మాట్లాడేవాడు. నా కుటుంబం గురించి కూడా ఆలోచించేవాడు.’’


‘‘మేఘనా! నీ కుటుంబం గురించి అడగడం ప్రేమతోనే అయి ఉండాలని లేదు. నీ బాధ్యతలు, బలహీనతలు తెలుసుకోవడానికి కూడా అయి ఉండవచ్చు. ముందుగా నిజానిజాలు తెలుసుకుందాం.’’


దీప్తి అతడి ఫొటోలు పరిశీలించింది.

‘‘ఈ కారు అతడిదేనని చెప్పాడా?’’

‘‘అవును. చాలాసార్లు అందులోనే వచ్చేవాడు.’’


‘‘ఇక్కడ కారు రిజిస్ట్రేషన్ నంబర్ స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా పరిశీలించవచ్చు. అలాగే అతడు చెప్పిన కంపెనీలను కూడా ధ్రువీకరించాలి.’’

‘‘అతడు నిజంగా వ్యాపారవేత్త కాకపోతే?’’

‘‘అప్పుడు నీ అనుమానాలకు బలం చేకూరుతుంది. కానీ మనకు అనుమానాలు కాదు, ఆధారాలు కావాలి. పోలీసులకు ఫిర్యాదు చేద్దాం.’’


మేఘన తలదించుకుంది.


‘‘నేనే పోలీసుని. నేను మోసపోయానని తెలిస్తే అందరూ ఏమనుకుంటారు?’’

దీప్తి ఆమె చేతిని పట్టుకుంది.


‘‘మోసగాళ్లు పోలీసులను కూడా మోసం చేయగలరు మేఘనా. ఉద్యోగం మనకు చట్టం గురించి అవగాహన ఇస్తుంది. కానీ ప్రతి మనిషి మనసులో ఏముందో చెప్పదు. పరువు పోతుందని నువ్వు మౌనంగా ఉంటే అతడు మరొకరిని మోసం చేస్తాడు.’’


ఆ మాటలు మేఘనకు ధైర్యాన్నిచ్చాయి.

మేఘన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ వేదాంత్ దర్యాప్తు ప్రారంభించాడు.


‘‘మేఘనా! మీరు ఇచ్చిన వివరాలన్నీ పరిశీలించాం. డబ్బు వెళ్లిన ఖాతాల్లో కొన్ని ఇతర వ్యక్తుల పేర్లపై ఉన్నాయి. వాటిలో ఒకదాని నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు ప్రాథమికంగా గుర్తించాం.’’


‘‘అంటే నా డబ్బంతా బెట్టింగ్‌లో పోగొట్టాడా సార్?’’

‘‘అలా ఇప్పుడే చెప్పలేం. ప్రతి లావాదేవీని పరిశీలించాలి. అతడు ఉపయోగించిన ఖాతాలు ఎవరివో, డబ్బు చివరకు ఎక్కడికి చేరిందో తెలుసుకోవాలి.’’


‘‘అతడిని పట్టుకోగలమా సార్?’’

‘‘మీరు ఇచ్చిన ఆధారాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా బ్యాంకు బదిలీలు, సందేశాలు, అతడు ఇచ్చిన హామీలు దర్యాప్తునకు కీలకం.’’


అతడు చెప్పిన నిర్మాణ సంస్థల పేర్లతో నమోదైన వ్యాపార వివరాలను పోలీసులు పరిశీలించారు. ఆదిత్య తెలిపిన చిరునామాల్లో అతడి కార్యాలయాలు లేవని గుర్తించారు.


కారు రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా అద్దె సంస్థను సంప్రదించగా మరో విషయం వెల్లడైంది. ఆదిత్య ఖరీదైన కార్లను ఎనిమిది గంటల చొప్పున అద్దెకు తీసుకునేవాడు.


అంతేకాదు, అద్దె సమయంలో సమర్పించిన గుర్తింపు పత్రాలు, చెల్లింపు వివరాలు దర్యాప్తునకు ఉపయోగపడ్డాయి.


ఇంతలో మరో మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు వేదాంత్ దృష్టికి వచ్చింది.

అందులోనూ అదే వ్యక్తి ఫొటోలు!


‘‘దీప్తీ! ఈ రెండు ఫిర్యాదుల్లోనూ ఒకే విధానం కనిపిస్తోంది. ముందుగా సోషల్ మీడియాలో పరిచయం, తరువాత వివాహం ప్రస్తావన, ఆర్థిక సమస్య పేరుతో డబ్బు వసూలు. ఇతడు ఇంకెంతమందిని మోసం చేశాడో తెలుసుకోవాలి.’’


దర్యాప్తు విస్తరించడంతో మరికొందరు మహిళలు ముందుకు వచ్చారు.

అందరూ పోలీసు ఉద్యోగులే కావడం అధికారులను ఆశ్చర్యపరిచింది.


ఒకరు ఆరు లక్షలు ఇచ్చానన్నారు. మరొకరు తొమ్మిది లక్షలు నష్టపోయానని చెప్పారు. ఇంకొకరు పెళ్లి చేసుకుంటానని నమ్మించి అప్పులు చేయించాడని వాపోయారు.

కొంతమంది మాత్రం తమ వివరాలు బయటపడకూడదని కోరారు.


అందుబాటులోకి వచ్చిన ఫిర్యాదులు, ఇతర సమాచారాన్ని బట్టి సుమారు ఇరవై మంది మహిళలను అతడు లక్ష్యంగా చేసుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానించారు.

ఒకరోజు దీప్తి వేదాంత్‌ను అడిగింది.


‘‘సార్! అతడు ముఖ్యంగా పోలీసు ఉద్యోగులనే ఎందుకు ఎంచుకున్నాడు?’’

‘‘అందుకు ఖచ్చితమైన సమాధానం ఇంకా లేదు. కానీ స్థిరమైన జీతం, వ్యక్తిగత రుణం పొందే అవకాశం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకొని ఉండవచ్చు. 


మహిళా పోలీసుల పరిచయాలను అతడికి ఎవరు అందించారన్నది కూడా పరిశీలిస్తున్నాం.’’


‘‘అంటే ఈ వ్యవహారంలో మరొకరి సహకారం ఉండవచ్చా?’’


‘‘ఉండవచ్చు. లేకపోవచ్చు. ఆధారాలు లేకుండా ఎవరినీ నిందించకూడదు. 


మన పని అనుమానాలను నిజాలుగా మార్చడం కాదు. నిజాలను ఆధారాలతో వెలికితీయడం.’’

ఆదిత్య కోసం గాలింపు మొదలైంది.


అతడు వాడిన ప్రధాన ఫోన్ నంబర్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. పాత చిరునామాలో కనిపించలేదు. అతడి ఆర్థిక లావాదేవీలు, కారు అద్దె రికార్డులు, అందుబాటులో ఉన్న ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలించారు.


ఇదే సమయంలో మేఘనకు తెలియని నంబర్ నుంచి సందేశం వచ్చింది.

‘‘నీ డబ్బు తిరిగి కావాలంటే నన్ను కలవాలి. అనవసరంగా కేసులు పెట్టి నీ జీవితాన్నే ఇబ్బందుల్లోకి నెట్టుకోకు.’’


మేఘన వెంటనే వేదాంత్‌కు సమాచారం ఇచ్చింది.

‘‘సార్! అతడే అయి ఉంటాడని అనుకుంటున్నాను.’’


‘‘అవకాశం ఉంది. కానీ ఎవరు పంపారో నిర్ధారించుకోవాలి. మీరేమీ తొందరపడి సమాధానం ఇవ్వకండి.’’


పోలీసుల సూచనల మేరకు మేఘన స్పందించింది.


‘‘నాకు గొడవలు వద్దు. తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తే చాలు. ఎక్కడ కలవాలో చెప్పు.’’

కొద్దిసేపటి తరువాత సమాధానం వచ్చింది.


‘‘రేపు సాయంత్రం ఏడు గంటలకు గచ్చిబౌలిలోని హోటల్ దగ్గరకు రా. ఒంటరిగా రావాలి.’’

పోలీసులు ఆ సందేశం, ఫోన్ నంబర్, గతంలో సేకరించిన ఆధారాలను పరిశీలించారు. ఆదిత్య అక్కడికి వచ్చే అవకాశముందని భావించి అతడిని గుర్తించి అరెస్టు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.


వేదాంత్ మేఘనతో మాట్లాడాడు.


‘‘మీరు అతడిని కలవాల్సిన అవసరం లేదు. మీ భద్రత ముఖ్యం. మేము అతడిని గుర్తించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం.’’


‘‘సార్! అతడు నిజంగానే వస్తాడా?’’


‘‘అది చెప్పలేం. కానీ వస్తే తప్పించుకోకుండా చట్టబద్ధంగా అదుపులోకి తీసుకుంటాం.’’

మరుసటి రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు గచ్చిబౌలిలోని హోటల్ పరిసరాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు.


ఏడు గంటల పది నిమిషాలకు ఒక తెల్లటి లగ్జరీ కారు హోటల్ ముందు ఆగింది.

అందులో నుంచి ఆదిత్య దిగాడు.


చేతికి ఖరీదైన గడియారం, కళ్లకు నల్లటి అద్దాలు, ఒంటిపై బ్రాండెడ్ దుస్తులు.

అతడు ఫోన్ తీసి మేఘనకు కాల్ చేశాడు.

‘‘ఎక్కడున్నావు? నేను వచ్చాను.’’


‘‘హోటల్ దగ్గరే ఉన్నాను. రెండు నిమిషాలు ఆగు’’ అని ఆమె సమాధానం ఇచ్చింది.

ఫోన్ పెట్టి చుట్టూ చూస్తున్న ఆదిత్య దగ్గరకు ఇద్దరు పోలీసులు వెళ్లారు.


‘‘మీ పేరు ఆదిత్యవర్మ కదా?’’

‘‘అవును. మీకేం కావాలి?’’

‘‘మేము పోలీసులం. మీపై నమోదైన కేసు దర్యాప్తుకు సంబంధించి మాట్లాడాలి.’’

ఆదిత్య ముఖంలో ఆందోళన కనిపించింది.


‘‘ఏ కేసు? మీరేదో పొరబడుతున్నారు. నేను వ్యాపారవేత్తను.’’

అప్పటికే ఇన్‌స్పెక్టర్ వేదాంత్ అక్కడికి చేరుకున్నాడు.


‘‘మీరు ఎవరో మాకు తెలుసు. మీపై నమోదైన మోసం కేసులో ఆధారాలు సేకరించాం. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం.’’


ఆదిత్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి కారువైపు వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు అతడిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.


‘‘సార్! నేను ఎవరి డబ్బూ దొంగిలించలేదు. వాళ్లే నాకు ఇచ్చారు. వ్యాపారంలో నష్టం వచ్చింది. అంతమాత్రాన మోసం అంటారా?’’

వేదాంత్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు.


‘‘వ్యాపారంలో నష్టం రావడం ఒక విషయం. లేని వ్యాపారాలను ఉన్నట్లు చెప్పడం, తప్పుడు హామీలతో డబ్బు తీసుకోవడం మరో విషయం. మీరు చెప్పిన కంపెనీలు, ఉపయోగించిన ఖాతాలు, మహిళలకు పంపిన సందేశాలు అన్నీ దర్యాప్తులో ఉన్నాయి. మీ వివరణను కూడా నమోదు చేస్తాం.’’


‘‘నాకు పెద్దపెద్ద వాళ్లతో పరిచయాలున్నాయి సార్. మీరు అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోకండి.’’


‘‘పరిచయాలు ఎవరితో ఉన్నాయన్నది ముఖ్యం కాదు. ఆధారాలు ఏం చెబుతున్నాయన్నదే ముఖ్యం.’’


అతడికి అరెస్టు కారణాలు తెలియజేసి పోలీసులు వాహనంలోకి ఎక్కించారు.

కొంత దూరంలో దీప్తితో కలిసి ఉన్న మేఘన ఆ దృశ్యాన్ని చూసింది.

ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.


‘‘దీప్తీ! అతడిని చూసినప్పుడల్లా ఎంతో గొప్ప మనిషని అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే ఒక్క విషయం కూడా నిజంగా అనిపించడం లేదు.’’


‘‘మేఘనా! డబ్బున్నవాడిలా కనిపించడం సులభం. నిజాయితీగా ఉండటం కష్టం. అతడు చూపించిన జీవితాన్ని నమ్మావు. కానీ ఇప్పుడు నిజం తెలుసుకున్నావు.’’


‘‘అతడిని నమ్మి అప్పులు చేశాను. నాన్నకు ఏం చెప్పాలో ఇప్పటికీ తెలియడం లేదు.’’


‘‘జరిగిన విషయం చెప్పు. నీ కుటుంబం నీకు అండగా ఉంటుంది. డబ్బు తిరిగి వచ్చే విషయం చట్టపరమైన ప్రక్రియలో తేలుతుంది. కానీ నువ్వు ధైర్యంగా ముందుకు రావడం వల్ల మరికొందరు కూడా ఫిర్యాదు చేయగలిగారు.’’

మేఘన నిశ్శబ్దంగా తల ఊపింది.


ఇంతలో అద్దె కార్ల సంస్థకు చెందిన ప్రతినిధి వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు పోలీసుల సూచనల మేరకు అక్కడికి వచ్చాడు. అవసరమైన వివరాలు నమోదు చేసిన తరువాత కారును తదుపరి ప్రక్రియ కోసం తరలించారు.

మేఘన ఆ కారువైపు చివరిసారి చూసింది.


ఎన్నోసార్లు అదే కారులో ప్రయాణించింది. దాని విలాసాన్ని చూసి ఆదిత్య సంపదను నమ్మింది. అతడి మాటల్లో భవిష్యత్తును ఊహించుకుంది.


ఇప్పుడు ఆ కారు మీద ఉన్న చిన్న అద్దె సంస్థ గుర్తు ఆమెకు స్పష్టంగా కనిపించింది.

‘‘దీప్తీ! ఎంత విచిత్రం! ఆ కారు అతడిది కాదని తెలిసుంటే బహుశా అప్పుడే అనుమానం వచ్చేదేమో!’’


‘‘కారు అతడిదైనా కాకపోయినా మేఘనా, మనిషి నిజాయితీని దానితో కొలవలేం. నమ్మకానికి ఆధారం అతడి ప్రవర్తన, చెప్పే విషయాల్లో నిజం, అవసరమైనప్పుడు చూపించే బాధ్యత. ఖరీదైన వస్తువులు కాదు.’’


పోలీసు వాహనం నెమ్మదిగా ముందుకు కదిలింది.

అందులో కూర్చున్న ఆదిత్య తలదించుకున్నాడు.


అద్దె కార్లలో కోటీశ్వరుడిగా తిరిగిన అతడి ప్రయాణం చివరకు పోలీసు వాహనంలో ముగిసింది.

అతడు ప్రదర్శించిన సంపద అద్దెది. చెప్పిన వ్యాపారం కల్పితం. 


చూపించిన ప్రేమ నటన. కానీ అతడిని నమ్మినవారి కన్నీళ్లు, అప్పులు, ఆవేదన మాత్రం నిజమైనవే.


***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


మనతెలుగుకథలు.కామ్ — తెలుగు కథలకు మీ సొంత వేదిక


***









Ch. ప్రతాప్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):










Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/pratap

Ch. Pratap

నేను వృత్తిరీత్యా ఒక సివిల్ ఇంజనీర్‌ అయినప్పటికీ, నా నిజమైన ఆసక్తి, నా జీవనసారం సాహిత్యానికే అంకితం. తెలుగు పుస్తకాల సువాసన నా జీవితంలో 1984 నుంచే పరిమళించింది. అప్పటి నుంచి పఠనం నా అలవాటుగా కాక, నా జీవనశైలిగా మారింది. పుస్తకాలు నా మనసును తీర్చిదిద్దాయి, ఆ పఠనమే క్రమంగా రచనగా రూపాంతరం చెందింది. ఆలోచనల రూపం, అనుభవాల ప్రతిబింబం, హృదయానికి స్వరం — అదే నా రచన.

ఆధ్యాత్మికత, మానవ సంబంధాల లోతులు, సామాజిక స్పృహ, ప్రజాసేవ పట్ల నాలో ఉన్న మమకారం ప్రతి రచనలోనూ ప్రతిఫలిస్తుంది. నేను రాసే ప్రతి వాక్యం పాఠకునితో చేసే ఒక మౌన సంభాషణ. నా కలం కేవలం అక్షరాలు కాదు; అది జీవనాన్ని గ్రహించే ఒక మార్గం.

ఇప్పటివరకు నేను రచించినవి రెండు వందలకుపైగా కథలు, ఐదు నవలలు, రెండు వేల వ్యాసాలు. ఇవి పలు దిన, వార, మాస పత్రికలలో, అలాగే డిజిటల్ వేదికలలో వెలువడి విభిన్న వయస్సుల పాఠకులను చేరాయి. ప్రతి రచన నా అనుభవాల సారాన్ని పాఠకుని మనసుతో కలిపే ఒక మాధ్యమంగా నిలిచింది.

సాహిత్యం నాకు హాబీ కాదు — అది నా జీవిత యానం. కొత్త ఆలోచనలను అన్వేషించడం, తెలుగు భాషా సౌందర్యాన్ని కొత్త రూపాల్లో వ్యక్తపరచడం, సమాజానికి ఉపయోగపడే మార్గాలను వెతకడం — ఇవే నా సాహిత్య సాధనకు మూలాధారం. రచన ద్వారా మనసులను మేల్కొలపడం, మనసుల్లో విలువల జ్యోతిని వెలిగించడం నా నిశ్చయం.

ఇటీవల నా కృషికి గాను ఒక ప్రముఖ సంస్థ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం నా జీవితంలో ఒక విశిష్ట ఘట్టం. అది కేవలం గుర్తింపే కాదు, మరింత బాధ్యతను జోడించిన ప్రేరణ.

మన పురాణాలు, ఉపనిషత్తులు, వేద వాక్యాలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక పాఠకులకు అందించడం, వాటి సారాన్ని సమాజానికి చేరవేయడం నా సాహిత్య లక్ష్యం. ఆ దిశగా ప్రతి రచన ఒక నూతన యత్నం, ఒక అంతర్ముఖ ప్రయాణం.

సాహిత్యం నా కోసం కేవలం అభిరుచి కాదు; అది నా ఆత్మ స్వరూపం. నా కలం నా ఆలోచనలకు శ్వాస, నా రచన నా జీవితయానం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page