ఎనిమిదవ స్వరం
- Dr. Brinda M. N.
- Oct 27
- 5 min read
Updated: Oct 28
#EnimidavaSwaram, #ఎనిమిదవస్వరం, #DrBrindaMN, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Enimidava Swaram - New Telugu Story Written By Dr. Brinda M N
Published In manatelugukathalu.com On 27/10/2025
ఎనిమిదవ స్వరం - తెలుగు కథ
రచన: డాక్టర్ బృంద ఎం. ఎన్
వకుళ, పార్థసారథిలకు రెండవ సంతానంగా నార్మల్ డెలివరీలో పాప జన్మించింది.
"తక్కువ బరువుతో ఉన్నా చూడముచ్చటగా ఉంది పాప" అనుకుంటూ సిస్టర్ ఊయలలో పడుకోబెట్టింది.
"శుభాకాంక్షలు, అండి" మీకు లక్ష్మీదేవి పుట్టింది సంతోషంతో శుభవార్త చెప్పింది డాక్టర్.
"ధన్యవాదాలు అండి, పాపను చూడవచ్చా"
"ఎస్, వెళ్లండి"
మూడు రోజుల అనంతరం ఇంటికి వచ్చారు పాపను తీసుకుని. వారం రోజుల తర్వాత రెండు కాళ్లపై ఎర్రటి పుండ్లు ఏర్పడ్డాయి పాపకు. ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆయింట్మెంట్ అప్లై చేయమని చెప్పి పంపించేశారు. రోజురోజుకీ వాటి పరిమాణం పెరగసాగింది. తల్లిదండ్రులకు భయమేసి మళ్ళీ డాక్టర్లకు చూపించగా, “పదమూడవ రోజున ఆపరేషన్ చేస్తాము తీసుకురండి” అని సూది మందులు వేసి పంపించారు.
"ఆ.. సిస్టర్! ఆ బేబీ ఆపరేషన్ కు కావలసినవన్నీ సిద్ధం చేశారా?" అడిగాడు సర్జన్.
"ఎస్, డాక్టర్. బేబీని బెడ్ పైన కూడా ఉంచాము"
పదమూడు రోజుల పాపకు రెండు కాళ్ల మీద టమాట రంగులో పెద్ద పెద్ద పుండ్లు, చీము పట్టి బాగా వాచిపోయి ఉంటే ఆపరేషన్ చేసి కుట్లు వేశారు. తగిన జాగ్రత్తలు చెప్పి వారం వారం చెకప్ కు రమ్మన్నారు. కొన్ని రోజుల పిదప అవి పూర్తిగా నయమైపోయాయి.
"ఒసేయ్, బేబీ! ఏడవకుండా పడుకో" అంటూ వేగంగా ఊయల ఊపాడు అన్నయ్య.
"బేబీ క్రింద పడిపోతుంది రా! మెల్లగా" వకుళ బుజ్జగింపు.
"నేనున్నాగా అమ్మ, చెల్లిని ఎలా పడేస్తాను.. గట్టిగా పట్టుకుంటాను"
ఊయలలోని చెల్లిని ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తుంటే
"నీకు రాదు రా, జారిపోతుంది పాప" అంది భయంతో వకుళ.
"ఏ బేబీ! నువ్వు జారిపోకుండా నా భుజాలపై పడుకో" అన్నయ్య ఆరాటం.
"నీకేం తెలుసురా, గడుగ్గాయి! పెద్ద ఆరిందలా సమాధానాలు నువ్వు" నానమ్మ మందలింపు.
రెండేళ్లు చెల్లిపై విపరీత ప్రేమజల్లు కురిపించి అనుకోకుండా ఒక రోజు అమావాస్య చీకటిలో కలిసిపోయాడు అన్నయ్య. ఇక ఆ ఊయల ఊసులు ఊరు విడిచిపోయాయి. తల్లిదండ్రులు పాప ఉందనే వాస్తవాన్ని మరిచిపోయారు. అదో ధ్యాసలో పడిపోయారు. నానమ్మ సంరక్షణలో పెరిగింది పాప. ఇక ఐదవ ఏట రాగానే బడిలో చేర్పించారు సుపర్ణికను.
చదువులో, ఆటలో, పాటలో ఎంతో చురుకుగా, చలాకీగా, హుషారుగా ఉండేది. యూకేజీ చివర్లో పరీక్షలకు ముందుగా ఫ్రాగ్ రేస్ పోటీలు నిర్వహించారు. అందులో ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది సుపర్ణిక. మొట్టమొదటి బహుమతిగా వచ్చిన ఒక కాటన్ సంచిని ఎంతో పదిలంగా దాచుకుంది సుపర్ణిక.
"మీ అమ్మాయి ఎంత చలాకీగా, అచ్చు కప్పలాగే అలాగే గెంతుతూ, గెంతుతూ ముందుకు దూసుకెళ్లి ప్రథమ బహుమతి సాధించింది. కచ్చితంగా ఆటల్లో తర్ఫీదు ఇప్పించండి" చెప్పింది ప్రధానోపాధ్యాయురాలు.
"అలాగేనండి, తప్పకుండా!" పార్థసారథి జవాబు
ఇలా ప్రాథమిక విద్యలో చేరిన తర్వాత కూడా అటు చదువులోనూ, ఇటు ఆటలోనూ పోటాపోటీగా పాల్గొనేది. రెండవ తరగతిలో రన్నింగ్ రేసులో ప్రథమ బహుమతి, మూడవ తరగతిలో మరలా రన్నింగ్ రేసులోనే రెండవ బహుమతిని గెలుచుకుంది. చెట్టాట, పుట్టాట, స్తంభాలాటలో ఓడిపోకూడదని పడుతూ లేస్తూ ఆడేది.
నరదృష్టి ప్రభావమో, విధి వైపరీత్యమో అంచనా వేయడం చాలా కష్టతరమైనది. చిన్నప్పుడు ఆపరేషన్ జరిగిన ఒక కాలి గాయం పైనే పలుమార్లు పడడం వలన ఎముక వంకర తిరిగింది. తాళలేని నొప్పి, వాపు, బాధా భరించలేక ఏడవ సాగింది సుపర్ణిక.
తెలిసినవారు చెప్పగా మూడు రోజులు నాటు కట్టు కట్టించారు. పది రోజుల అలాగే కొనసాగించమన్నారు నాటు వైద్యులు. సరేనని తీసుకొచ్చారు తండ్రి. మూడవ సంతానం మరీ పాప పుట్టడంతో బాగా కలిసి వచ్చింది పార్థసారథికి. ఇక గాలి ఆ వైపు మళ్ళింది, సుపర్ణికపై శ్రద్ధ తగ్గింది.
తల్లిదండ్రులు ఇద్దరిలోనూ ఈ మార్పు గమనించింది సుపర్ణిక. అప్పుడప్పుడు కాళ్ళు నొప్పి రావడం వాపు ఉండడంతో ఆర్థోపెడిక్ సర్జన్కు చూపించగా ఇక పాపను ఆటలకు దూరంగా ఉంచండి, పౌష్టికాహారం అందించండి అని చెప్పారు.
ఐదవ తరగతి రాగానే ఆటల ఆశల సౌధాలు కూలిపోయాయి కదా అని బాధపడడం ఎందుకని ఆటల స్నేహితులు పాటలు కదా.. వాటి వైపు పయనిద్దాం అనుకుంది చిన్నారి సుపర్ణిక. ఇక వారానికి మూడుసార్లు కోవెలలో భజన పాటలు పాడడం ప్రారంభించింది. ఎంతోమంది భజన సంఘాల సత్సంగం ఏర్పడింది. చదువు, పాటలు అప్పుడప్పుడు సాహిత్యం వైపు కూడా పయనించేది.
"అన్నయ్యగారు! ఈరోజు గుడిలో ముఖ్యమైన విశేష పూజ ఉంది, భజన చేయాలి పంపించండి" సంఘాల వారి వినతి.
"కుదరదమ్మ! పెద్ద పరీక్షలు దగ్గరలో ఉన్నాయి చదువుకోవాలిగా” పార్థసారథి నిర్మొహమాటంగా చెప్పాడు.
"ఒక గంటనే కదా, అన్నయ్యగారు.. పాప రాకపోతే ఏదో వెలితిగా ఉంటుంది” అన్నారు వాళ్ళు.
"కానీ పాపకు ఇప్పటికే భక్తి ఎక్కువైపోయింది. మీరెళ్లిరండి" వకుళ వ్యంగ్యం.
"వదినగారు, మీరు కూడా ఏంటి.. సుపర్ణిక పాడుతూ ఉంటే ఆధ్యాత్మిక సాగరంలో ఓలలా డినట్టుగా ఉంటుంది, పంపించరూ" అన్నారు సత్సంగ సభ్యులు.
అలా కొన్ని రోజులు భజనలకు దూరంగా ఉంచారు. వెళ్తానంటే తిట్టి, కొట్టి, మూల కూర్చోబెట్టారు. మానసిక వ్యధ ఎక్కువైనప్పుడు రోగ సంతతి హెచ్చి రాగాలు పాడుతాయంట. అలాగా సుపర్ణికకు టైఫాయిడ్, మలేరియా జంట స్వరాలు పాడేవి అప్పుడప్పుడు. చిన్న వయసుకే ఎక్కువ డోసు మందులు వాడడం, బలమైన ఆహారం లేకపోవడం వలన రోగనిరోధక శక్తి సన్నగిల్లుతూ ఉండేది సుపర్ణికకు.
సాహిత్య సువాసన సుతారంగా తగిలిన తర్వాత ఆధ్యాత్మిక గ్రంథాలు, సామాజిక నవలలు, డిటెక్టివ్ నవలల్లో పూర్తిగా మునిగిపోయింది కానీ చదువులో మాత్రం ఎప్పుడూ టాపరే. నయనాలు నయాగరా జలపాతంలా నిత్యం అక్షరాల కడలిలో సేద దీరుతుంటే ఆకాశంలో తెల్ల మబ్బులు వచ్చినట్టు కళ్లద్దాలు కనువిందు చేశాయి సుపర్ణికకు.
"అబ్బా! తీసేయవే ముసలమ్మలా ఉన్నావు" చెల్లి కపట హాస్యం.
"పర్వాలేదు" అంది సుపర్ణిక
"ఏంటే? బూజు పట్టిన దానిలా నువ్వు.. నీ మొహమూను" స్నేహితుల వేళాకోళం.
"అయ్యో ఏంటమ్మా! అద్దాలు, ఎక్కడిదీ ముద నష్టం. మన వంశంలో ఇలాంటి వింత ఎరుగుదుమా" అమ్మమ్మ మాట.
"సుపర్ణిక, నీ అందమంతా పోయింది తెలుసా" చుట్టుపక్కల వారి వైఖరి.
అందరి మాటలు విన్న సుపర్ణిక ఎంతో అనుభవ జ్ఞానం ఉన్న దానిలా "చూడండి, నేను చూసే ప్రపంచం నాకు అందంగా కనిపిస్తే చాలు, నేను ఎవరికీ అందంగా కనిపించనవసరం లేదు. ఎంతమంది ఎన్ని చెప్పినా ఈరోజు నుండి ఇవి నాకు ఒక శరీర భాగంతో సమానం".
సమాధానం విన్న వారందరూ ముక్కున వేలేసుకున్నారు.
"అక్క! నీకు పెళ్లి కాదే. నిన్ను ఎవరు చేసుకోరు" చెల్లి వ్యంగ్యం.
"పర్వాలేదు! నో ప్రాబ్లెమ్ ఎట్ ఆల్!".
ఇలా సాగుతున్న తరుణంలో విషజ్వరాలతో అనారోగ్యంతో ఎన్నిసార్లు ఆస్పత్రుల చుట్టు ప్రదర్శన చేసిందో, మందు మాత్రలనే ఆహారం లాగా భోంచేసిందో లెక్కకు అందవు సుపర్ణిక ఖాతాలలో.
ఏడవ తరగతి హాఫ్ ఇయర్లీ పరీక్షలు. వారం ముందుగా మళ్లీ పాత కాలి గాయం నవ్వుతూ పలకరించింది. కాలు క్రింద పెట్టలేని వాపు, అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. ఆసుపత్రికి తీసుకెళ్తే పాపకు బెడ్ రెస్ట్ ఇవ్వండి అన్నారు. తల్లిదండ్రులు బడికి పంపలేదు. ఆ చిన్నారి మనసులో ఉప్పెనంత గందరగోళం,వేదన. పరీక్షలు ఎలా రాయాలి? ఎలా వెళ్లాలి?
"అమ్మా! పరీక్షలు రాయకపోతే ఈ సంవత్సరం వృధా అవుతుంది"
"రాయకపోతే నష్టమేమీ లేదులే"
"నాన్నా! నేను బాగా ప్రిపేర్ అయ్యాను, రివిజన్ కూడా చేశాను, ప్లీజ్ నన్ను పరీక్షలకు పంపించండి"
"ఎలాగూ కుంటిదానివయ్యావు, నోరు మూసుకొని ఇంట్లో కూర్చో, ఉన్నన్నాళ్ళు ఎలాగోలాగా సాకుతాం" వకుళ గట్టిగా మందలింపు.
"నాన్న! ప్లీజ్ నాన్న! ఒక్కసారి బడికి వెళ్ళొస్తాను, మా క్లాస్ టీచర్ కు విషయం చెప్పి వస్తాను, లేదంటే సార్ కోప్పడతారు"
"ఎలా వెళ్తావ్ అమ్మ? ఇంట్లోనే ఇబ్బంది పడుతున్నావు కదా!"తండ్రి ప్రశ్న.
"నాన్న, రిక్షాలో వెళ్లొస్తాను".
"ఎందుకే రిక్షాకు మరల అనవసర ఖర్చు" కోపంగా అంది వకుళ.
"ఒసే అక్క! ఇన్ని రోజులు అన్నిట్లో ఫస్ట్ ఫస్ట్ వన్టూ, నీ గురించే చెప్పేవారు, ఇక నీ పని అయిపోయిందన్నమాట" చెల్లి ఓర్వలేనితనం.
ఎలాగో అలాగా పాఠశాలకు వెళ్లి మాస్టారుతో వివరాలన్నీ చెప్పింది సుపర్ణిక. సుపర్ణిక వినయ, విధేయతలు, క్రమశిక్షణ, శ్రద్ధ, అంకితభావం, కష్టపడి చదవడం, అన్ని పోటీల్లో పాల్గొనడం వలన పాఠశాలలోని ప్రతి టీచర్ కే కాగా ప్రధానోపాధ్యాయులకు కూడా తనను బాగా ఎరుగుదురు. కావున వారందరూ ఒకసారి తమ తండ్రిని వచ్చి కలువమన్నారు.
"సుపర్ణిక, నీ హాల్టికెట్ కూడా వచ్చిందమ్మా. ఇక మూడు రోజుల్లోనే ఉంది. మీ నాన్నగారిని పిలుచుకురా" మాస్టారు గంభీరంగా అన్నారు.
"సరే మాస్టారు"
ఎంతో ఊరట కలిగింది సుపర్ణికకు. రిక్షా ఆయనకు నమస్కరించింది.
"నాన్న, మిమ్మల్ని వచ్చి కలవమన్నారు టీచర్లు అందరూ. రేపు వెళ్దాం నాన్న"
"ఎందుకండీ, అది చదివి ఉద్ధరించేది ఏమీ లేదు. ఇక రాదని చెప్పి రండి" రుసరసలాడింది వకుళ.
"అబ్బా.. వెళ్ళిన తర్వాత చూద్దాంలేవే" విసుకున్నాడు పార్థసారథి.
ఉదయాన్నే బడికి వెళ్లారు తండ్రి కూతురు రిక్షాలో క్లాస్ టీచర్ను కలిశారు
"చూడండి. అమ్మాయి చాలా తెలివైన పిల్ల. మంచి మార్కులతో పాస్ అయ్యింది ఇప్పటివరకు. ఇది పబ్లిక్ పరీక్ష. ఈ పరీక్ష రాయకపోతే ముందు తరగతికి పోలేరు. సుపర్ణిక మల్టీ టాలెంటెడ్ అమ్మాయి. చదివే శ్వాసగా ధ్యాసగా బ్రతుకుతుంది. వారం రోజులే పరీక్షలు. రిక్షాలో పంపండి. అమ్మాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాను.
నేను ఒక ప్రధానోపాధ్యాయులుగా చేరి కొన్ని మాసాలే అయినా ఇంతమంది పిల్లల్లో సుపర్ణిక పేరు నాకు గుర్తుంది అంటే అమ్మాయి కష్టపడే తత్వం, పెద్దల పట్ల గౌరవం, గురువు పట్ల భక్తి భావమే. మీరు మరి ఏమీ ఆలోచనలు పెట్టుకోకుండా పరీక్షలకు పంపండి" ఆనందంతో అన్నాడు.
అన్ని విషయాలు చర్చించుకున్న తర్వాత తల్లిదండ్రులు పరీక్షలకు పంపారు. కష్టపడి రాసి డిస్టింక్షన్ లో పాస్ అయింది సుపర్ణిక. ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి తనకు. ప్రధానోపాధ్యాయుడు మొదలుకొని పాఠశాలలోని టీచర్లు అందరూ నాట్ టీచింగ్ స్టాఫ్, రిక్షావారికి, తల్లిదండ్రులకు నమస్కరించింది.
స్నేహితులు తన సత్తాను గుర్తించి ఇంకా దగ్గరయ్యారు. సంగీతం మెలకువలు తెలిసిన ఒక కుటుంబ స్నేహితుడు ఈ విషయాన్నంతా ఆసాంతం విన్న తర్వాత ఆనందభైరవి రాగముతో ఆత్మ పులకించి ఆనందభాష్పాలు గలగల రాలుతుంటే పార్థసారధితో ఇలా అన్నాడు.
"సంగీతంలో ఏ వాద్య పరికరానన్నా తీసుకుని ఇష్టానుసారంగా ఎక్కడంటే అక్కడ నొక్కి నొక్కి పెడతాం కానీ అవి ఆనందంతో అందమైన స్వరాలనే పలుకుతాయి. అలాగే ఇంత చిన్నతనంలోనే సుపర్ణిక జీవన సంగీతంలో ఎన్నో బాధలకు ఓర్చి, పోరాడి, గెలిచి, సుస్వరాలని పలికించి, అందరినీ మురిపించి, మైమరపింప చేసింది. నేను గాంచిన ఎనిమిదవ స్వరం సుపర్ణిక అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. "
ఈ ప్రశంసలు పరవళ్ళు త్రొక్కుతుంటే మౌనంగా ముద్దులతో తన కాళ్లకు కృతజ్ఞతలు చెప్పుకుంది సుపర్ణిక.
నీతి: లోకంలో అవయవ లోపాలు ఉండడం సహజం, కానీ ఆ లోపాలను పాపాలుగా చిత్రించి, చిత్రవిచిత్రంగా వేధించడం శోచనీయం. చేతనైతే సహకరించండి. అంతేగాని అవమానాలపాలు చేయకండి.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.




Comments