గంగావతరణము
- Ayyala Somayajula Subramanyam 
- 1 day ago
- 6 min read
#AyyalaSomayajulaSubrahmanyam, #గంగావతరణము, #Gangavatharanamu, #అయ్యలసోమయాజులసుబ్రహ్మణ్యము, #పురాణం, #ఆధ్యాత్మికం, #devotional

Gangavatharanamu - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 30/10/2025
గంగావతరణము - తెలుగు కథ
రచన: అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
పూర్వం అయోధ్యను సగరుడు అను రాజు పాలించెను. ఆయనకు విదర్భ రాజకుమార్తె కేశిని పెద్ద భార్య. రెండవ భార్య కశ్యప వంశజుడగు అరిష్టనేమి కూతురు సుమతి, గరుడుని సోదరి. సగరుడు ఇరువురు భార్యలతో కూడి హిమవత్పర్వతమున భృగు ప్రసన్నమునకు తపమొనరించెను. నూరు వత్సరములు తపమొనరించగా భృగుమహర్షి ఆయనకు వరమిచ్చెను. ఒక భార్య యందు వంశమునకు కీర్తి తెచ్చు కుమారుడు, మరొక భార్య యందు అరవై వేలమంది పుత్రులు ఉదయింతురని అనగా, "మాలో ఎవరికి ఏ విధముగా పుత్రులు కలుగుదురో చెప్పుము" అనగా, వారిలో కేశిని ఒక పుత్రుడు, సుమతి అరవై వేల పుత్రులను కోరగా, వారి కోరిక ప్రకారమే జరుగునని చెప్పెను. సగరుడు భృగుమహర్షుకి నమస్కరించి అయోధ్యకు చేరుకునెను.
కొంతకాలమునకు కేశిని అసమంజసుడు అను కొడుకును కనెను. సుమతి గుండ్రని సొరకాయ వంటి గర్భపిండమును ప్రసవించెను. ఆ పిండము నుండి అరవై వేల మంది పుత్రులు ఉదయించిరి. వారిని నేతితో నిండిన కుండల యందుంచి పెంచింది. కొంతకాలమునకు వారు యువకులైరి.
కేశిని యందు జనియించిన కొడుకు అసమంజసుడు నిత్యము అనేక పాపకార్యము లొనర్చుచు ప్రజాకంటకుడు అయ్యెను. తన తోటిపిల్లలతో ఆడుకొనుచు వారిని సరయూ నదిలో త్రోసి వారు నీట మునిగి ఊపిరాడక ప్రాణములనుపోగొట్టుకొనుచుండగా ఇతడు సంతసించుచుండెను. అందువలన సగరుడు వానిని నగరమునుండి బహిష్కరించెను.
అసమంజసుని కొడుకు అంశుమంతుడు ప్రజలకు ప్రీతిపాత్రుడై అందరితో ప్రియముగా మాట్లాడుచుండెను. ప్రజలు అధర్మవర్తనులు గాకుండా పాలించుటయే రాజధర్మము. అందుచే అసమంజసుడు రాజ్యం నుండి బహిష్కృతుడైనాడు. ఈ విధముగా వుండగా సగరుడు యజ్ఞము చేయ సంకల్పించెను.
హిమవంతుడు, వింధ్య పర్వతముల మధ్య ఎత్తైన పర్వతములు లేకుండా అవి రెండు చూచుకొనునట్లుండును. ఆ రెంటి మధ్య దేశమును “ఆర్యావర్తము” అందురు. ఆ యాగాశ్వము వెనుక మనుమడైన అంశుమంతుని పంపెను. ఆ అశ్వమును వదిలిన వెంటనే ఇంద్రుడు తన మాయచే రాక్షస రూపియై యజ్ఞాశ్వమును దొంగిలించెను. అప్పుడు ఋత్విజులు "ఈ పర్వదినమున ఎవరో యజ్ఞాశ్వమును దొంగలించిరి. యజ్ఞభంగమైనచో యజమానికి, ఋత్విజులకు అరిష్టమగునని. యజ్ఞము నిర్విఘ్నంగా నెరవేరవలె" ననిరి. సగరుడు తన అరవై వేల కుమారులతో "యజ్ఞాశ్వమును వెతికి తెండని సముద్రము పర్యంతం భూమిని ఒక్కొక్కరు ఒక యోజన విస్తారముగా పంచుకొని వెతకండి. ఒకవేళ భూమిపై కనబడనిచో భూమిని త్రవ్వి యైనా వెదకి తెండని" ఆజ్ఞాపించెను. వారు తండ్రి యాజ్ఞచే భూమండల మంతయూ వెదకిరి. గుఱ్ఱపు జాడ తెలియలేదు. వారందరూ భూమిని త్రవ్విరి. అందుండి మహానాదములు వినబడినవి.
వారు భూమిని త్రవ్వగా పాతాళలోకమందలి ప్రాణులన్నియు తల్లడిల్లినవి. పర్వత సహిత జంబూద్వీపమంతయూ త్రవ్వబడినది. దేవతలు, గంధర్వులు మొదలగు వారు వికలమనస్కులై బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్ళిరి. విషయమును తెలిపి ప్రార్థించిరి. "ఆ సగరపుత్రులు ప్రతివారిని అనుమానించి సంహరించుచున్నారని" విన్నవించిరి. ఇచట సగరపుత్రుల దుర్మార్గము తెలియును. వారు ప్రతీవారినిని అనుమానించి యజ్ఞాశ్వము దొంగలించినారని వారిని చంపుట యున్నది పాలించు ప్రభువులకు ఉండవలసిన లక్షణము కాదు.
దొంగ ఎవరో తెలియక అనుమానించి, అవమానించి హింసించుట పాపకృత్యము. బ్రహ్మ దేవుడు దేవతల ప్రార్థన విని "ఈ నవద్వీపములతో కూడిన భూమి నిత్యము వాసు దేవునిది. ఈ మహాత్ముడు కపిలావతారడై భూమిని భరించును. ఆయన కోపాగ్ని చే సగర కుమారులను భస్మము చేయగలడు" అని దేవతల నోదార్చెను.
"మనకు ప్రతిరోజూ ఎటులో, మన కల్పము బ్రహ్మ దేవునకు ఒకరోజు. ప్రతిరోజు దైనందిన కార్యక్రమాలు నెట్లు కొంచెం భేదముతో మనము జరుపుకొందుము. అట్లే బ్రహ్మ కల్పమున జరుగును. ప్రతి కల్పమునందు స్థితిగతులు ఒకేవిధంగా ఉన్ననూ, జీవాత్మలు ఉన్నతిని పొందగా క్రొత్తగా కొన్ని జీవాత్మలు ఆయా కార్యమలను జేయుచుండును" అని చెప్పెను. దేవతలు సంతసించి తమతమ నివాసములకు చనిరి.
సగరపుత్రులు భూమినంతయు త్రవ్వి అశ్వము కానరాక వారు భూమికి ప్రదక్షిణము చేసి తండ్రి వద్దకు వచ్చిరి. వారు యజ్ఞాశ్వము కానరాలేదని చెప్పినపుడు సగరుడు మళ్ళీ భూమిని త్రవ్వి అశ్వమును, దాని అపకర్తను పట్టి బంధించి తెండని ఆజ్ఞాపించెను. వారు పాతాళమునకు పరుగులు తీసి ఇంకను త్రవ్వగా, తూర్పు దిక్కు భూభారము మోయు ‘విరూపాక్షము’ అను మహాగజము కనబడెను. అది భూమిని శిరమున మోయుచు అలసట ధీరుటకై శిరమును కదిలించినప్పుడు భూకంపము కలుగును. వారు దానికి పూజ లొనర్చి ప్రదక్షిణలు చేసి తిరిగి దక్షిణ దిశను త్రవ్విరి. అచట “మహాపద్మము” అను మహా గజమును దర్శించి పూజలు చేసిరి. అట్లే పశ్చిమ దిశను త్రవ్వి “సౌమనసము” అను మహాగజమును దర్శించి దానికి కూడా పూజ, ప్రదక్షిణలు సలిపిరి. తిరిగి ఉత్తర దిక్కున త్రవ్వి మంచువలె తెల్లనైన “భద్రము” అను మహాగజమును దర్శించి దానికి పూజాది కములు గావించిరి. పిదప ఈశాన్య దిశను త్రవ్వగా అచట శ్రీమహావిష్ణువు అవతారమైన కపిలమునిని గాంచిరి.
ఆయనకు సమీపమున చరించు యజ్ఞాశ్వమను గాంచి క్రోధముతో అతడే యజ్ఞాశ్వమును హరించెనని ఆయుధములతో ఆయన మీదికి దండెత్తిరి. వీరి క్రోధావేశపు మాటలు విన్న కపిలమహర్షి వారిని చూసి హుంకరించెను. వారందరూ భస్మమయ్యారు. మూర్ఖులు, యుక్తా యుక్త విచక్షణ లేక ప్రవర్తించువారి జీవితాలు ఇట్లాగే ఉంటాయి.
(కపిలమహర్షి పేరు మీదే కపిలారణ్యం. అదే నేటి కాలిఫోర్నియా. పాతాళం అంటే నేటి అమెరికా అని దయానంద సరస్వతీ వంటి పండితుల అభిప్రాయం. భూగోళంలో భారతదేశానికి సరిగ్గా అవతలివైపున అమెరికా ఖండం ఉంది. భారతదేశంలో నిలుచున్న వారి పాదాల క్రింద ఉన్నది కావున దానికి పాతాళంగా వ్యవహరిస్తారు. సగరచక్రవర్తి కుమారులు అరవైవేలమంది అశ్వమేధయాగం కోసం విడువబడిన అశ్వం కోసం భూమిని వజ్రం వంటి తమ గోర్లతో చీల్చి పాతాళానికి చేరుకుంటారు. అక్కడ ధ్యానంలో ఉన్న కపిలమహర్షిని చూసి, ఆయనే అశ్వాన్ని దొంగిలించాడని ఆయన మీద దాడికి వెళ్ళగా, ఆయన వారిని భస్మం చేస్తారు.
ఆ కపిలమహర్షి తపస్సు చేసుకున్న ప్రదేశమే ‘కపిలారణ్యము’ గా ప్రసిద్ధి చెందింది. అదే ఈ నాటి కాలిఫోర్నియా. (శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారు 1935 లో ఒక ఉపన్యాసంలో చెప్పారు.) కాలిఫోర్నియాకు దగ్గరలో ఉన్న ఆష్ లాండ్ (Ashland) సగరపుత్రులు బూడిదకుప్పలుగా మారిన ప్రదేశం. హార్స్ లాండ్ (Horseland) యాగాశ్వం కట్టిన ప్రదేశం. అవే ప్రదేశాలకు సరిగ్గా వ్యతిరేకదిశలో గంగానది ఉద్భవించిన గంగోత్రి హిమానీ నది (Gangotri Glacier) ఉంది. ఈ రెండు ప్రదేశాలు కూడా సరళరేఖలో 30 డిగ్రీల అక్షాంశం (Latitude) మీద ఉన్నాయి.)
సగరమహారాజు తన పుత్రులు ఎంతకాలానికి తిరిగి రాకపోయేసరికి తన మనుమడు అంశుమంతుని అశ్వాన్ని తేవలసిందిగా ఆజ్ఞాపించాడు. అతడు తన పినతండ్రులు భూమిని త్రవ్విన మార్గముననే వెడలి తూర్పుదిక్కున భూమిని మోయు విరూపాక్ష మహాగజమును దర్శించి దానికి ప్రదక్షిణించి తన పినతండ్రుల జాడ తెలుపమని ప్రార్థించగా, వారి జాడ త్వరలోనే తెలియునని చెప్పి పంపినది. అట్లే దక్షిణమున మహాపద్మమును, పశ్చిమమున సౌమనసమును, ఉత్తరమున భద్రమును దర్శించి వారి ఆశీస్సులు స్వీకరించి, ఈశాన్యముగా వెళ్ళి తన పినతండ్రుల బూడిదరాశులను చూసెను. అచటనే యజ్ఞాశ్వము కనిపించినది. తన పినతండ్రుల స్థితికి దుఃఖించి వారికి తర్పణములు ఇచ్చుటకు చూడగా అచట జలమే లేదు. తన మేనమామ గరుత్మంతుడు “మీ పినతండ్రుల మృతి లోకహితమునకే జరిగినది. మహాముని యైన కపిలుడి కోపాగ్నిచే దగ్దమైరి. లోక మర్యాద ననుసరించి తర్పణాలు విడువరాదు. వీరిపై గంగ ప్రవహించినప్పుడు వీరికి పుణ్య లోకములు కలుగును. యజ్ఞాశ్వమును తీసుకొని వెళ్ళి యజ్ఞమును పూర్తి చేయుము" అనెను. అంశుమంతుడు యజ్ఞాశ్వమును తీసుకొని వచ్చి యజ్ఞమును పరిసమాప్తి కావించెను.
సగరమహారాజు భయంకరమైన పుత్రమరణ వార్త విని రోధించి, పరితపించి గంగను తెచ్చు విషయమున ఏ నిర్ణయం తీసుకోలేక ముప్పై వేల ఏళ్ళు పాలించి దివంగతుడయ్యెను. సగరుని మనుమడు అంశుమంతుడు. అతని కొడుకు దిలీపుడు. అంశుమంతుడు దిలీపునకు రాజ్యభారము నొప్పించి తాను తీవ్రమైన తపమొనరించుటకు వెళ్ళెను. ముప్పై రెండు వేల ఏళ్ళు తపమొనరించి గంగను తీసుకొని రాలేకపోయెను. తుదకు స్వర్గము చేరెను. దిలీపుడు తన తాతకు పుణ్యంతో ప్రాప్తి కలిగించుటకు, గంగోదకములు తెచ్చుట ఎటుల యని తీవ్రముగా ఆలోచించుచుండెను. అతనికి భగీరథుడు పుత్రుడు కలిగెను. దిలీపుడు అనేక యజ్ఞములు చేసి ముప్పై వేల ఏళ్ళు పాలించి స్వర్గతి నందెను. భగీరథునకు సంతానము కలుగలేదు.
అతడు తన ముత్తాత లగు సగరపుత్రులకు పుణ్య లోక ప్రాప్తికై గంగను భువికి తెచ్చుటకు ఆలోచించెను. అతడు రాజ్యభారము మంత్రుల కప్పగించి దీర్ఘకాలము తపమొనరించెను. పంచాగ్ని మధ్యమున వేలకొలది సంవత్సరములు తపమొనర్చగా బ్రహ్మ దేవుడు ప్రీతుడై ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనగా, తన ముత్తాతలు సగరపుత్రులు అరవైవేల మందికి తానిచ్చు జలాంజలులు చేరునట్లు వారి భస్మరాశి గంగాజలముతో తడియునట్లు, తన వంశము అంతటితో ఆగిపోకుండా తనకు సంతానము కలిగించమని కోరెను. బ్రహ్మ సంతసించి "అట్లే జరుగుగాక" యని ఆశీర్వదించెను. హిమవంతుని జ్యేష్టపుత్రికగా గంగానది క్రిందకు అవతరించినప్పుడు, ఆమెను భరించగల వాడు శివుడు మాత్రమే. ఆయనను ఆశ్రయించుము. అని తెలిపి తన వద్దనున్న గంగతో “అమ్మాయి; ఈ భగీరథుననుగ్రహింపుము" యని పలికి తన సత్యలోకమున కేగెను.
ఒక కార్యసాధనకు కొన్ని తరములు పట్టును. పితృదేవతల ఋణము తీర్చుట సామాన్యమైన విషయము కాదు. పితృ, మాతృమూర్తులకు ఉత్తర క్రియలు జరుపుట మహాయజ్ఞము చేయుటయే. మహాపాపులైనను గంగాజలముచే తాకబడిన వారు తప్పక ముక్తిని పొందుదురు. ఇచట సగరపుత్రుల అహంకారము, దుష్కర్మఫలము వలన వారు మోక్షమును పొందుట ఎంత దుర్లభమైనదో అట్టి కార్యము సాధించుటకు బ్రహ్మ గురించి తపము, శివుని గురించి తపము, తిరిగి గంగ గురించి తపము, పిదప శివుని గురించి తపము, తుదకు జాహ్నమునిని ప్రార్థించినప్పుడు మాత్రమే గంగావతరణము జరిగెను. దీనికంతటికి భగీరథప్రయత్నము అందురు.
బ్రహ్మ వరమిచ్చిన తరువాత భగీరథుడు కాలిబొటన వ్రేలిపై నిలబడి శివుని గూర్చి ఏడాది పాటు తపస్సు చేసెను. అప్పుడు శివుడు పార్వతితో బాటు కలిసి ప్రత్యక్షమై భగీరథునితో “గంగను నా శిరమున ధరింతును” అని చెప్పెను.
అనంతరము గంగానది మహోగ్రరూపం తో శివుని శిరముపైకి దూకినది. శంకరునితో సహా వేగముగా పాతాళమునకు పోవుదునని అనుకొనినది. శివుడామె అహంకారమును తెలిసికొని ఆమె గర్వమును యణచివేయుటకు తన శిరమునందలి జడలయందు గంగను బంధించెను. గంగానది శివుని జడల మధ్య అనేక సంవత్సరాలు తిరిగెను. భగీరథుడు మరల శివుని గురించి తపమాచరించెను. శివుడు భగీరథుని తపస్సుకు మెచ్చి గంగను హిమవత్పర్వతము నందలి బిందుసరోవరము నందు విడిచెను. ఆ విడువబడిన గంగ ఏడు పాయలుగా చీలి తూర్పు దిశగా హ్లాదిని, పావని, నళిని అను పాయలుగా ప్రవహించినది. పశ్చిమ దిశగా సుచక్షువు, సీత, సింధువు అను పాయలుగా ప్రవహించినది. ఏడవ పాయ భగీరథుని అనుసరించినది.
అందున్న జలచరములు, తాబేళ్ళు, మొసళ్ళు, మీనములు, మొదలైనవి భూమిమీదకు వచ్చి శోభను చేకూర్చినవి. అట్లు భూమికి చేరిన గంగను దేవతలు, గంధర్వులు, మొదలైన వారు దర్శించి భూమిపై ప్రవహించునప్పుడు పుణ్యస్నానమాచరించి పునీతులైరి. గంగానది ప్రవాహము పల్లమునకు పోవునప్పుడు వడివడిగా పరిగెత్తెను. సమప్రదేశమునందు మొల్లగా గంభీరంగా నడిచెను. ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిగా తిరిగెను. మెరకపై తిరుగునప్పుడు నాట్యమయూరి వలె గంతులు వేసెను. ఒక్కొక్క చోట మంద్రముగా ప్రవహించును. ముందుగా ప్రవహించు నీటికి అడ్డము కలిగినప్పుడు వెనుకకు మళ్ళీ ఒక్కమారుగా కలిసి వచ్చినప్పుడు మిడిసిపడునట్లుండును. ఆకాశము నుండి క్రిందికి దిగిన గంగ పాతాళ లోకమునకు చేరుట చూడగా ఉత్తముడు దైవవశమున అధమ దశకు చేరినను, వారు లోకమునకు మేలు చేసిన వారగుదురని తెలియుచున్నది.
దేవతలు పూర్వము శాపము వలననో, లేక మరేదైనా కారణము చేతనో స్వర్గము వదలి భూమిపైకి వచ్చెడివారు. ఇపుడు భూమిపై పరుగెత్తు గంగానది లో స్నానాదులొనర్చి పవిత్రులై తిరిగి స్వర్గమున కేగిరి. గంగా నది ఆకాశవాహిని కంటె భూతలవాహినియే శ్రేష్టమైనది యని ధర్మశాస్త్రముల ఉవాచ. భగీరథుడు తపఃప్రభావము చేత ఆకాశగమన శక్తి గల రథము పై వెళుచుండగా గంగ ఆయనను అనుసరించి ప్రవహించుచుండెను.
ఇట్లు పోవుచుండగా మార్గమధ్యమున జహ్నువు యజ్ఞము చేయు ప్రదేశమును గంగ నీటితో ముంచెను. జహ్నువు గంగ గర్వమును తెలిసికొని ఆ జలమునంతయు ఒక్క క్షణము లో త్రాగివేసెను. అప్పుడు గంగ వెనుకగా వచ్చు దేవ ఋషి గంధర్వాదులు జహ్నువును ప్రార్థించి గంగను నీ పెద్ద కూతురుగా భావించి వదులుమని వేడుకొనిరి. వారి ప్రార్థన విని జహ్నువు తన చెవుల నుంచి గంగను వదిలెను. అప్పటి నుండి గంగకు జాహ్నవి యను నామము పొందినది. ఈ జహ్నువు రాజర్షి భరతవంశమున జనించిన అజామీళుని కుమారుడు. పిదప గంగ ఏ అడ్డంకులు లేకుండా సముద్రమునకు చేరి భగీరథుని కోరిక మేరకు పాతాళమునకు ప్రవేశించి భగీరథుని తాతల భస్మరాశి మీదుగా ప్రవహించినది. సగరపుత్రులందరూ పవిత్రులై ఏ దోషము లేకుండా స్వర్గతులైరి.
భూలోకమందు గంగ భాగీరథీ అని పేరొందెను. ఈ దేవనదిని గంగ, త్రిపథగ, భాగీరథి అని పేర్లుండి సార్థకము చేయును.
ఇచటనొక యోగవిషయక రహస్యము కలదు. యోగశాస్త్రము ఆరోహణ, అవరోహణ క్రమములు కలవు. తపోబలము ప్రాణశక్తి, వాయువును కూడి బ్రహ్మ రంధ్రమునుండి సహస్రారము ప్రవేశించి శివస్థానమగు ఆజ్ఞాచక్రమునకు దిగి, అచట మూడు పాయలుగా (నాడులుగా) మారును. అందలి మధ్య నాడిని తన తపోబలముచే భగీరథుడు తెచ్చి మేరుదండము నందలి కుండలిని దాక్కున్నట్లు చేసెను. అచట నిక్షిప్తమై యున్న మృతకణములు దానిచే తాకబడి ఊర్ధ్వగాములై సహస్రారమునకు పయనించును. ఇదియే స్వర్గమని చెప్పబడును.
**కార్తీకమాసమున గంగాస్నానము, గంగాధరుని నామస్మరణలు అత్యంత ముక్తి సాధనాలు.
——————————————శుభంభూయాత్————————————————
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి
మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్ వాణి,మన తెలుగు కథలు.కామ్.
బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక
ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్.
కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.
ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్ మరియు
తపస్విమనోహరము.
ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్
చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.
సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్ బహుమతులు.
ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.
కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.





Comments