ఘటన - పార్ట్ 1
- Sudha Vishwam Akondi

- 7 hours ago
- 4 min read
ఘటన, సుధావిశ్వం, తెలుగు కథ, సస్పెన్స్ కథ, కుటుంబ కథ, భావోద్వేగ కథ, హ్యూమన్ ట్రాఫికింగ్, మహిళల అక్రమ రవాణా, పోలీస్ దర్యాప్తు, అక్కాచెల్లెళ్ల అనుబంధం, క్రైమ్ థ్రిల్లర్, తెలుగు సాహిత్యం, Mana Telugu Kathalu

Ghatana - Part 1 - Telugu Emotional Story | Sudhavishwam Akondi
ఘటన - పార్ట్ 1 - తెలుగు భావోద్వేగ కథ | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 23/07/2026
ఒక్క చిన్న సంఘటన... ఒక చిన్న పొరపాటు... కొన్ని క్షణాల్లోనే జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. "ఘటన – కథ 1" అలాంటి ఒక హృదయ విదారక తెలుగు కథ. పదహారు సంవత్సరాల క్రితం అదృశ్యమైన అక్కను అనుకోని పరిస్థితుల్లో పోలీసులు గుర్తించడంతో ప్రారంభమయ్యే ఈ కథలో కుటుంబ బంధాలు, మానవ అక్రమ రవాణా (Human Trafficking) వంటి సామాజిక సమస్యలు, అపరాధ భావన, భావోద్వేగాలు పాఠకులను ఆలోచింపజేస్తాయి.
మనిషి జీవితంలో ప్రతి క్షణం విలువైనదే! గడిచిన ఆ క్షణం తిరిగి రాదు! జీవితంలో ఒక్కోసారి చిన్న చిన్న తప్పులు జరుగుతుంటాయి. పెద్ద తప్పులే జరిగినా కాలం వెనక్కి వెళితే ఆ తప్పు చేయకుండా ఉండేవాళ్ళం అని అనుకుంటూ ఉంటారు, కానీ కాలం వెనక్కి వెళ్లనే వెళ్ళదు. కాలానికి ముందుకు సాగడమే తప్ప వెనక్కి వెళ్లే రూల్ లేదు!
అందుకే ప్రతి క్షణం ఆలోచించి ముందుకు వెళ్లాలి! అనుకోకుండా జరిగిన పొరబాట్ల నుంచి పాఠం నేర్చుకుని, మళ్లీ అలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉండడం వరకే చేయగలిగేది! ఒక చిన్న పొరబాటు, అది కూడా అనుకోకుండా చేసిన దానికి పూడ్చలేని నష్టం ఏర్పడితే, అలా చేసి వుండాల్సింది కాదని పదే పదే మధన పడడం జరుగుతూ ఉంటుంది. చేయి దాటి పోయాక చింతించడం తప్ప చేసేది ఏమీ ఉండదు.
ఒకే ఒక్క సంఘటన మనుషుల జీవితాలను ఎన్నో ఒడిదుడుకులకు గురిచేస్తుంది. కొందరి జీవితాలను ఎటో తీసుకుని వెళుతుంది.
అలాంటిదే ఈ కథ కూడా!
*****
అదేపనిగా సెల్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే చేస్తున్న పని ఆపేసి, హాలులోకి వెళ్లింది సుభాషిణి.
పొద్దున్నే లేవడంతోనే పని మొదలుపెడితే వాషింగ్ మెషిన్ నుంచి బట్టలు తీసి ఆరేసే వరకూ ఓ నిమిషం కూర్చోడానికి కుదరదు. అందరి ఇళ్లల్లో ఇది మామూలే!
సుభాషిణి ఎంబీఏ చేసింది. కొన్నాళ్ళు జాబ్ చేసి, పిల్లలు పుట్టడంతో మానేసింది.
ఇంట్లోనే ఉంటావు కదా అని అందరూ అంటూ ఉంటారు కానీ ప్రశాంతంగా ఇంట్లో కాసేపు కూర్చోవడం అయ్యేది కొంతసేపే! ఇప్పుడు పిల్లలు హైస్కూల్ కి వచ్చారు కాబట్టి కాస్త సులువుగానే పని అయిపోతోంది తనకు.
ఒక్కోసారి మధ్యాహ్నం లంచ్ కి ఇంటికి వస్తుంటాడు బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న సుభాషిణి భర్త చిరంజీవి. అప్పుడు ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు. లేదంటే భర్త బాక్స్ తీసుకుని వెళితే ఈమె ఒక్కతే పనవ్వగానే తినేస్తుంది.
ఆరోజు కూడా చిరంజీవి లంచ్ కి వస్తానని చెప్పడంతో మిగతా పనిలో పడింది ఆమె. ఇంతలో సెల్ ఫోన్ రింగ్ అవుతుండడం విని ఛార్జింగ్ లోనుంచి తీసి ఎవరా అని చూస్తే, అన్నోన్ నెంబర్.
"హలో!" అనగానే అవతల వున్న వ్యక్తి చెప్పిన మాటలు వినగానే ఎన్నో భావాలు ఉవ్వెత్తున లేచాయి ఆమెలో.
లంచ్ టైంలో అప్పుడే ఇంటికి వచ్చిన చిరంజీవి ఏదో ఫోన్ కాల్ లో ఉన్నాడు. ఆమె ఫోన్ మాట్లాడుతూ ఉద్వేగపడడం గమనించాడు. ఆమెకు దగ్గరగా వెళ్లాడు.
సుభాషిణి వైపు నిశితంగా చూశాడు.
వివరం అడిగాడు.
"ఎవరు కాల్ చేశారు? ఏమైంది?" అని అడిగాడు.
"మనం అర్జెంట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లాలి. పదండి! ...." అని ఇంకా ఏదో గొణుక్కున్నట్టుగా అంటోంది సుభాషిణి.
చిరంజీవి అయోమయంగా చూశాడు. వెంటనే తన కాల్ లో మాటలు ఫినిష్ చేసి, కట్ చేశాడు.
"పోలీస్ స్టేషన్ కి దేనికి? ఏమైందో చెప్పు? ఏమైనా పోగొట్టుకున్నావా?"
"హా! పోగొట్టుకున్నాను!"
"పోతేపోనీ! మళ్లీ కొనుక్కోవచ్చు! వాళ్లు కంప్లైంట్ ఇచ్చినా వెదికే పని చెయ్యరు! పైగా లంచాలు అడుగుతారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించు కుంటూనే ఉంటారు. బ్యాంక్ పని వదిలిపెట్టి, అన్నిసార్లు వెళ్లడం కష్టం!" అని భార్యతో నెమ్మదిగా చెప్పబోయాడు చిరంజీవి.
బయటకు వెళ్లినప్పుడు ఏదో పోయి వుంటుందని అనుకున్నాడు అతను.
"ఏళ్ల క్రితం పోగొట్టుకున్నది ఇప్పుడు దొరికింది. పోలీసులే కాల్ చేసి రమ్మని పిలిచారు. మీరు రాకుంటే ఒక్కదాన్నే వెళతాను! నా జీవితంలో ఇది ఒక ముఖ్యమైన రోజు...." అంటూ సాగుతున్న ఆమె మాటలు అర్థం కానట్టుగా ఉంది చిరంజీవికి.
ఆమె ముఖంలో ఎంతోకాలం క్రితం పోగొట్టుకున్న ఏదో నిధి దొరికినంతగా ఆనందం ఓ వైపు, ఉద్వేగం మరో వైపు తాండవిస్తున్నాయి.
***
చిరంజీవి, సుభాషిణి చూడ చక్కని జంట! ఆమెను చూసి ఇష్టపడి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చిరంజీవి. పెద్దలు కుదిర్చిన పెళ్లే అయినా వారికి నచ్చజెప్పి, వారి ఆశీస్సులతో సుభాషిణిని కట్న కానుకలు తీసుకోకుండానే పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి చూపుల సమయంలో కానీ, పెళ్లి సమయంలో కానీ ఏదో వెలితి ఆమె ముఖంలో కనిపించింది చిరంజీవికి. చిరంజీవి కారణం అడిగితే ఏమీ చెప్పలేదు. తనంటే ఇష్టం లేకపోతే చెప్పమని అడిగాడు కూడా! కానీ అలాంటిదేమీ లేదని చెప్పింది. తనకు ఇష్టమేనని చెప్పింది.
పెళ్లి తర్వాత కూడా తరచూ ఏదో పరధ్యానంలో ఉండేది! కారణం మాత్రం అంతుపట్టలేదు చిరంజీవికి. ఎన్నిసార్లు అడిగినా సుభాషిణి చెప్పలేదు. ఓ కంపెనీలో జాబ్ లో చేరింది. అయినా పెద్దగా మార్పు లేదు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కొంత మెరుగు! పిల్లల కోసమని జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటోంది.
***
"అసలు విషయం ఏంటో చెబితే కదా తెలిసేది. తెలిస్తేనే కదా అక్కడ నేను మాట్లాడేది.." అన్నాడు భార్యతో నెమ్మదిగానే.
"ముందు పదండి! మీకు వివరంగా తర్వాత చెబుతాను!" అని తొందరపెట్టింది.
ఆమె మాటను కాదనలేక పోలీస్ స్టేషన్ కి భార్యను తీసుకుని బయలుదేరాడు చిరంజీవి.
***
"రా అమ్మా!" అంటూ సుభాషిణిని లోపలికి రమ్మని పోలీస్ స్టేషన్ లోని ఒక రూమ్ లోకి తీసుకుని వెళ్లాడు అక్కడి కానిస్టేబుల్. వెనుకే వెళ్లాడు చిరంజీవి కూడా!
రూమ్ లోకి వెళ్లి డోర్ తీయగానే లోపలికి ప్రవేశించిన కొద్ది వెలుగుకే భయపడిపోతూ కళ్లు మూసుకుని అల్లాడిపోతోంది అక్కడ కూర్చుని ఉన్న ఒకావిడ.
సన్నగా బక్కచిక్కిపోయి, కళ్లు పీక్కుపోయి భయంకరమైన ఆకారంతో ఉంది ఆమె.
ఆమెను చూడగానే పరుగున వెళ్లి కౌగలించుకుంది సుభాషిణి. పట్టుకుని తనివితీరా ఏడ్చింది.
"నావల్లే నీకు ఈ గతి పట్టింది. ఆరోజు అలా జరిగి ఉండకపోయి ఉంటే ఇలా నిన్ను ఈ స్థితిలో చూసేదాన్ని కాదు....." అంటూ ఏడుస్తోంది సుభాషిణి.
ఆమె ఎవరూ అన్నట్లుగా సుభాషిణి వైపు చూసి, నిర్లిప్తంగా, తల గోక్కుంటూ ఎటో చూడసాగింది ఆమె.
చిరంజీవికి ఏమీ అర్థం కాలేదు. కానిస్టేబుల్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
"ఇన్ని ఏళ్ల తర్వాత అక్కను చూసిన ఆనందంలో అలా మాట్లాడుతోంది మీ ఆవిడ. మీ ఆవిడకు పదహారు ఏళ్లు ఉన్నప్పుడు, ఈవిడకు పద్దెనిమిదేళ్లు. అప్పుడు కనపడకుండా పోయి, ముంబై రెడ్ లైట్ ఏరియాలోకి చేరింది ఈమె.
అప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. కానీ మావాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా దొరకలేదు. నెలకోసారి అయినా పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి మా అక్క ఆచూకీ తెలిసిందా అని అడుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు మా ప్రయత్నం ఫలించింది.
మా డిపార్ట్మెంట్ లో కొత్తగా జాయిన్ అయిన లేడీ ఆఫీసర్ చొరవతో ఈవిడతో పాటుగా చాలామంది రక్షింపబడ్డారు. మన సిటీ నుంచి ముంబైకి తరలిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు.
వాళ్లను తగిలిస్తే తీగ లాగితే డొంక అంతా కదిలినట్లు గ్యాంగ్ మొత్తం పట్టుబడింది. ఉమెన్ ట్రాఫికింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది సార్! ఆ ముఠాల వాళ్లు అందరినీ అరెస్ట్ చేశాం..." అని వివరణ ఇచ్చాడు కానిస్టేబుల్.
ఆమెను చూసి పాపం అనుకున్నాడు. కానీ నావల్లే అని సుభాషిణి ఏడుస్తూ ఉండడం అర్థం కాలేదు.
"మరి నా వల్ల ఇలా అయ్యిందని ఏడుస్తోంది ఎందుకు?" అని అడిగాడు చిరంజీవి.
"ఆ విషయం తెలియదు సార్!"
కాసేపటికి తేరుకున్న సుభాషిణి భర్త దగ్గరకు వచ్చి, మాట్లాడింది.
"తను మా అక్క సుహాసిని! తన ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. మన దగ్గరే ఉంచుకుని వైద్యం చేయుద్దాం! ప్లీజ్" అని మాత్రం అంది.
అసలు తను ఏం చెప్పినా వినే స్థితిలో ఆమె లేదని చిరంజీవికి అర్థం అయ్యింది.
"అలాగే లే!" అన్నాడు అప్పటికి.
ఏదైనా హాస్పిటల్ లో జాయిన్ చేయాలని అనుకున్నాడు. ఇంటికి తీసుకుని వచ్చారు. బ్యాంకుకి రెండు రోజులు సెలవు పెట్టేసి, పిల్లలను పక్క వీధిలోనే ఉంటున్న తన అక్కకు అప్పజెప్పి, విషయం టూకీగా చెప్పేసి, వాళ్ల ఇంట్లో వదిలేసి ఇంటికి వచ్చాడు.
ఆ తర్వాత తన డాక్టర్ ఫ్రెండ్ సాయంతో ఆమెను హాస్పిటల్ లో జాయిన్ చేశాడు.
అప్పటికి కొంత ప్రశాంత స్థితికి వచ్చింది సుభాషిణి.
***
ఉదయాన్నే పేపర్ చదువుతూ కూర్చున్న చిరంజీవి వద్దకు కాఫీ కప్పు పట్టుకుని వచ్చింది సుభాషిణి. భర్తకు కాఫీ కప్పు చేతికి ఇచ్చి, తన కప్పు తీసుకుని పక్కనే సోఫాలో కూర్చుంది. ఇద్దరూ మౌనంగా కాఫీ తాగారు. భర్త వైపు సంతోషంగా చూసింది. అంతలోనే ఏదో గుర్తు వచ్చిన దానిలో బాధ పడింది.
==================================
ఇంకా ఉంది. ఘటన - పార్ట్ 2
త్వరలో మీ ముందుకు రానుంది.
===================================

-సుధావిశ్వం




Comments