గోదావరి నవ్వింది

Godhavari Navvindhi - Telugu Social story | Godavarthy Janaki Syamasundar
గోదావరి నవ్వింది - తెలుగు సామాజిక కథ | గొడవర్తి జానకి శ్యామసుందర్
Published in manatelugukathalu.com on 13/09/2026
గోదావరి ఒడ్డున జీవితం కోసం పోరాడుతున్న చిన్నారి గోదా కథే “గోదావరి నవ్వింది”. 2003 గోదావరి పుష్కరాల్లో చూసిన యథార్థ సంఘటన ఆధారంగా గొడవర్తి జానకీ శ్యామసుందర్ రాసిన ఈ తెలుగు సామాజిక కథ మానవత్వం, తల్లిప్రేమ, బాలల ధైర్యాన్ని ఆవిష్కరిస్తుంది.
కుటుంబ కష్టాలను భరిస్తూనే ఒక బాలుడి ప్రాణాలను కాపాడిన గోదా, చివరికి తల్లి స్పర్శతో పొందిన ఆప్యాయతను ఈ కథ హృదయాన్ని హత్తుకునేలా వివరిస్తుంది.
“గోదావరి నవ్వింది” (2003 గోదావరి పుష్కరాలులో చూసిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రాసిన కథ) - గొడవర్తి జానకీ శ్యామసుందర్
“ఏం గోదా! ఈ వేళప్పుడు తీరిగ్గా కూర్చున్నావేంటి? గిరాకీ లేదా?” ఒంటరిగా మెట్లమీద కూర్చున్న గోదాని చూస్తూ అడిగాడు కామేశం ఆశ్చర్యంగా.
“ఎందుకో యియ్యాల ప్రొద్దుటనుండి అమ్మే గుర్తుకొస్తున్నది. ఏ పని సేయ్య బుద్ధి కావటం లేదు” బదులిచ్చింది గోదా విచారంగా.
“నిజమే జ్ఞాపకాలు అలా ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి. వాటిలోంచి ప్రయత్నపూర్వకంగా బయటపడకపోతే మన రోజువారీ జీవితం అస్తవ్యస్తం అవుతుంది. లే లేచివెళ్ళి నీ పని చేసుకో వెళ్ళేటప్పుడు కనిపించు ప్రసాదం ఇస్తా” అంటూ గుడి మెట్లెక్కి వెళ్ళిపోయాడు పూజారి కామేశం.
దేనితోనూ నిమిత్తం లేకుండా గలగలా పారుతున్న గోదావరినే చూస్తూ స్థబ్దుగా నిర్లిప్తంగా కూచుంది గోదా. ఆ చుట్టుప్రక్కలంతా సందడిగా ఉంది. జనం హడావిడిగా తిరుగుతున్నారు. హుషారుగా ఉత్సాహంగా గోదాట్లో మునకలేస్తున్నారు కొందరు. నీళ్లంటేనే భయపడే కొందరు మెట్ల మీదే కూర్చుని చెంబుతో నీళ్ళు గుమ్మరించుకుంటున్నారు. చిన్నపిల్లలు నీళ్ళతో ఆడుకుంటూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారు.
పెద్దలు వాళ్ళ హడావిడిలో వాళ్ళుంటూనే పిల్లల్ని ఒక కంట కనిపెడుతూనే ఉన్నారు. తాడు, అయస్కాంతం, జల్లెడ తీసుకొని నీళ్ళలోకి దిగింది గోదా. అయస్కాంతాన్ని బారెడు పొడుగున్న తాడుకి కట్టి వలలా విసరసాగింది. కాస్సేపు అటూ ఇటూ ఆడించి పైకి తీసింది. అయస్కాంతానికి రెండు రూపాయల బిళ్ళ ఒకటి అతుక్కుని కనిపించింది.
అది తీసి చెవిలో దోపుకుని మళ్ళీ నీళ్ళలోకి తాడు - అయస్కాంతం విసిరింది. మోకాళ్ళలోతు నీళ్ళల్లో భయం లేకుండా అటూ ఇటూ తిరుగుతున్న గోదాని కష్టమెరగని పిల్లలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. గలగలా పారే గోదావరిలో భయంలేకుండా మోకాళ్ళలోతు నీళ్ళల్లో పైన నెత్తిమాడ్చే ఎండని భరిస్తూ అటూ ఇటూ తిరుగుతున్న చిన్నపిల్ల గోదాని చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది.
“ఏం పిల్లా నీ పేరేమిటి?” అప్పుడే స్నానం ముగించిన ఓ పండుముత్తయిదువు పలకరించింది.
“గోదావరండి. అందరూ గోదా అంటారండి.”
“మంచి పేరు. ఇక్కడే వుంటావా? ఇంత చిన్న పిల్లవి తిరుగుతున్నావు కూడా పెద్దవాళ్ళు ఎవరూ రాలేదా?” కొంగు నీళ్ళు పిండుకుంటూ అడిగింది ఆవిడ.
“నిరుడు పుష్కరాల్లో మా అమ్మ నన్ను కని కన్నుమూసిందండి. మా అమ్మకి గోదావరంటే చాలా యిష్టమంటండి. ఆడపిల్ల పుడితే నీ పేరే పెట్టుకొంటా తల్లి అంటూ దండమెట్టుకుందటండీ. నన్నీ గోదారమ్మకి ఒదిలేసి తనెళ్ళిపోయింది. నాకప్పటినుంచీ ఈ గోదారే తల్లమ్మా. కళ్ళతో ఎన్నడూ సూడని మాయమ్మను ఈ గోదాట్లోనే చూసుకొంటానమ్మా” చెమ్మగిల్లిన కళ్ళను చేతులతో వత్తుకుంటూ అంది గోదా.
“నిజమే ఆ గోదారి తల్లి అందరికీ తల్లిలాంటిదే. బాధపడకమ్మా” అంటూ ఓదారుస్తూ చేతి సంచిలోంచి ఐదు రూపాయలు, రెండరటిపళ్ళు తీసి గోదాకిచ్చింది ఆ పెద్ద ముత్తయిదువ నిండుమనస్సుతో.
“మీ నాన్నేం చేస్తుంటాడు?” అడిగింది ఆవిడ ఆరాగా.
“కూలీపనికి వెడతాడమ్మా, మా పిన్నమ్మ కూడా ఇళ్ళల్లో పనికి వెళుతుంది. ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లె వున్నారమ్మా” అన్నది గోదా.
“ఇంట్లో పనంతా చేసి ఈడకొచ్చి గోదారమ్మ ఇచ్చేదంతా తీసుకుపోయి మా పిన్నమ్మచేతికే ఇస్తా. ఈ చల్లని గోదారమ్మను చూడందే ఒక్కరోజు కూడా వుండలేనమ్మా. వస్తానమ్మా” అంటూ చకచకా తన పనిమీద దృష్టి కేంద్రీకరించింది గోదావరి.
ఒడ్డునున్న ప్రసన్నాంజనేయస్వామి కోవెల్లోంచి గంటలమోతా మంత్రాల శబ్దం గాలిలో తేలి వస్తోంది. గుళ్ళో జనం ఒక మోస్తరుగా ఉన్నారు. భక్తులందరికీ తీర్థప్రసాదాలిచ్చి మండపం అంచున కూర్చున్నాడు కామేశం.
“బాబుగారు నేనింటికి పోతున్నా. ప్రసాదం తొందరగియ్యండి” అంటూ వచ్చింది గోదా.
“అదేం ఇవాళ యింత వేగిరం వెళుతున్నావు” ప్రశ్నించారు కామేశం.
“పిన్నమ్మకి రెండ్రోజులనుండి జ్వరంగా వుంది. నేనెళ్ళి పిల్లలకు అన్నం పెట్టాలి. అయ్యకు గూడా దగ్గు వస్తున్నది. బేగిరం ఇంటికెళ్ళి వాళ్ళకి ఇంత గంజిపోయాలి” అన్నది గోదా.
“అలాగా! అయితే ఇంటికెళ్ళి అమ్మనడిగి మందు పట్టుకెళ్ళు. మూడు పూటలా పొట్లం మందు వెయ్యి. పల్చగా, పొడిగా కొంచెం చారు అన్నం పెట్టు. ఏం భయం లేదు. యిదిగో ఈ ప్రసాదాలు నువ్వు మిగిలిన వాళ్ళు తినండి” అంటూ పులిహారా, పొంగలి బాదం ఆకుల్లో ఇచ్చాడు కామేశం.
“వస్తా అయ్యగారూ! మళ్ళీ సాయంత్రం వస్తాను” అంటూ పరుగెత్తుకుంటూ వెళ్ళింది గోదా. గోదావరొడ్డునున్న ఓ చిన్నపల్లెటూరది. అంతా కలిపితే రెండొందల గడప.
పాతకాలపు కోవెలైన ప్రసన్నాంజనేయస్వామికి పేరు ప్రఖ్యాతలు బానే ఉన్నాయి. ఆ గుడి పూజారి కామేశం వారసత్వంగా వచ్చిన అర్చకత్వాన్ని, ఇంటి భారాన్ని మీద వేసుకొని తాను యధాలాపంగా నేర్చుకున్న ఆయుర్వేదాన్ని ఆసరాచేసుకొని సంసారరథం లాకొస్తున్నాడు. అటు మాధవసేవ ఇటు మానవసేవ చేస్తూ బీదాబిక్కికి తను చేతనైన సాయం చేస్తూ అందరి చేతా మంచి అనిపించుకుంటున్నాడు.
బావిదెగ్గర కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి అడుగుపెట్టాడు. “వచ్చావా నాయనా ఈ వేళ కాస్త ఆలస్యమైనట్లుంది. రా వడ్డించేస్తాను” హడావిడి పడసాగింది తల్లి సుభద్రమ్మ.
“అవునమ్మా! ఏదో ఆలోచిస్తూ గుడి దెగ్గరే కూర్చుండిపోయాను” కామేశం జవాబు.
“నిజమే, ఇంత సంసారాభారాన్ని మోస్తుంటే ఎడతెగని ఆలోచనలు కాక అందమైన ఊహలెలా వస్తాయి చెప్పు” అన్నది సుభద్రమ్మ మొఖాన రాని నవ్వు పులుముకొంటూ.
“అమ్మా! ఇంకెప్పుడూ ఆ వూసెత్తకు. పెద్దకొడుకుగా నా బాధ్యతలను ఎలా విస్మరించగలను. ఆ మాత్రం దానికే భారం అంటూ పెద్ద విశేషంగా మాట్లాడతావేమ్మా” బదులిచ్చాడు కామేశం.
“అది నీ మంచితనం నాయనా, లోకంలో ఎంతమంది పెద్దకొడుకులు యింత భారాన్ని నెత్తినెత్తుకుంటున్నారు. తమ నెత్తిన బాధ్యత ఎక్కడ పడుతుందో అని తెలివిగా ఎంతమంది తప్పుకోవట్లేదు. ఆ మహారాజు హఠాత్తుగా నిష్క్రమించడంతో పదిహేనేళ్ళుగా ఒకదాని తరువాత ఒకటిగా తమ్ముళ్ళ చదువులు, చెళ్ళెళ్ళ వివాహాలు, పురుళ్ళూ, పుణ్యాలు బాధ్యతగా నిర్వహిస్తున్నావ్, నీ గురించి ఎప్పుడైనా ఆలోచించావా” బాధగా అన్నది సుభద్రమ్మ.
“అమ్మా ఏమిటి ఇవాళ ఇలా మాట్లాడుతున్నావ్. తమ్ముళ్లు చెళ్ళెళ్ళకు ఒక దారి చూపించడం ఏం గొప్ప ఘనకార్యం చేసినట్టు కాదు. నువ్వు మాటి మాటికీ ఆ మాట అనకు” గబగబా భోజనం ముగించి లేచాడు కామేశం.
“ఇందాక గోదా వచ్చి వాళ్ళ అమ్మానాన్నలకి మందులిమ్మన్నావని అడిగి తీసుకెళ్ళింది. పాపం ఇంత చిన్న వయస్సులో ఆ అమ్మాయికి డబ్బు సంపాదన కై ఎంత కష్టపడుతోందో తలుచుకుంటే జాలేస్తుంది” అన్నది సుభద్రమ్మ గోదావరిని తలుచుకొంటూ.
“నిజమే నమ్మా! అంతా పసి వయసులోకూడా సవితితల్లి పెట్టే కష్టాలు గంభీరంగా నిండు గోదావరిలా పైకి తేలకుండా భరిస్తోంది. నీళ్ళలోని ఇసుక జల్లించగా వచ్చిన డబ్బులు, అయస్కాంతానికి అతుక్కునే నాలుగు చిల్లర డబ్బులకోసం నిత్యం నీళ్ళలో నానుతూ తిరుగుతూ ఉంటుంది. పిలిచి ఏదైనా పెడితే తప్ప, ఏం అడగదు.
ఏమిటో ఆ భగవంతుడి మాయ. అంతా చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళు బాధ్యతల సుడిగుండంలో చిక్కుకొని గిరగిరా తిరుగుతుంటే, మరికొందరు అసలు కష్టమంటే ఏమిటో కూడా తెలియకుండా పెరుగుతారు. వాళ్ళ వాళ్ళ అదృష్టాలు అనుకోవాల్సిందే” పడకుర్చిలో వాలుతూ అన్నాడు కామేశం వేదాంతిలా.
“అంతే అంతే, ఆయన లీలలు ఎంతమందికి అర్థమౌతాయి” అంటూ నిట్టూరుస్తూ లేచి లోనికెళ్ళింది సుభద్రమ్మ.
ఎవరి కష్ట సుఖాలతో పనిలేకుండా కాలచక్రం గిర్రున తిరుగుతోంది. గోదా జీవితంలో ఏ మార్పూ లేదు. తెలతెలవారుతూనే లేవటం, గుడి చుట్టూ శుభ్రం చేసి నీళ్ళుజల్లి ముగ్గు వెయ్యటం, ఇంటికి వెళ్లి పినతల్లికి సాయం చేసి, ఇంత ముద్దతిని గోదావరి దెగ్గరకు రావటం, గోదావరిలో భక్తులు వేసే చిల్లర డబ్బులు ఏరుకుంటూ, వాళ్ళువీళ్ళు ఇచ్చిన చిరుకానుకలు తీసుకోవడం, పూజారిగారిచ్చే ప్రసాదంతో కడుపునింపుకోవడం నిత్యకృత్యమైనాయి గోదాకి.
పర్వదినాల్లో, కార్తీక మాసం నెలలల్లూ వచ్చే భక్తుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండటంతో గోదావరి శ్రమకూడా రెట్టింపయ్యేది. మామూలుగానే నీళ్ళల్లోకి దిగి యాత్రికులు వేస్తున్న చిల్లర పోగుచేస్తున్న గోదావరికి, ఆరోజు ప్రొద్దున్న జరిగిన సంఘటనే మాటిమాటికీ గుర్తుకొస్తోంది. పొద్దున్న లేస్తూనే సవితితల్లి తిట్లు లంకించుకుంది. కారణమేమిటో ఎంతకూ గోదాకి అర్థం కాలేదు. సణుగుతూ ఉన్న దగ్గరే ఉన్న గోదాకి స్పష్టంగా వినిపించాయి సవితితల్లి మాటలు, “ఈ పీడాకారం నాపాలబడింది.
ఆ మహాతల్లి పోతూ పోతూ ఈ శనిని నాకొదిలేసి పోయింది. ఎప్పుడు వదులుతుందో ఏమో” అన్న భార్య మాటలు వింటూ కూడా నిర్లిప్తంగా చూస్తూవున్నాడే గాని, గోదావరి తండ్రి భార్యని వారించే ప్రయత్నం చెయ్యలేదు.
గోదా పసిమనసు బాగా గాయపడింది. తను చేసిన తప్పు ఏమిటో ఎంతకూ అర్థం కాలేదు. పనిలో సాయం చేస్తుంది. తమ్ముడు, చెల్లాయిలను చూసుకుంటుంది. గోదాట్లో దొరికిందంతా తీసుకెళ్ళి పిన్నమ్మ చేతిలోనే పోస్తుంది. కన్నపిల్లలకి పక్కలు వెచ్చబడితే కంగారుపడే పిన్నమ్మ, తను తిన్నదా, లేదా అని ఒక్కరోజుగూడా ఆప్యాయంగా చూడలేదు, దగ్గరకు తీసుకోలేదు.
ఎందుకింత కోపం తనంటే? తనేం తప్పు చేసిందని ఇంట్లో ఎవరూ సరిగ్గా మాట్లాడరు? తండ్రిమాత్రం ఎప్పుడన్నా దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడు, అదీ భార్య కంటపడకుండా. అమ్మ ఒడిలోని వెచ్చదనం, హాయి అనుభవించాలని గోదా పసి మనస్సు ఉవ్విళ్లూరుతుండేది.
కాని అది ఎండమావే అయ్యింది. నడినెత్తికొచ్చిన సూరీడి తాపం కూడా ఆలోచనల్ని భంగపర్చలేదు. ప్రొద్దుటనుండి ఏమీ తినకపోవటం వల్ల కడుపులో తిప్పుతున్నట్టుగా కళ్ళు తిరుగుతున్నట్టుగాను ఉంది. చేస్తున్న పని మీద ధ్యాసవుండటం లేదు. ఆలోచనలలో పడి ప్రవాహంలో ఎంత దూరమొచ్చింది చూసుకోలేదు గోదా.
పెద్ద పెద్ద అరుపులకి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది గోదా. ఒక్కసారి చుట్టూ చూసి కలవర పడింది. ప్రవాహవేగపు వడి ఉధృతంగా ఉంది. ఒడ్డు దగ్గెర ఆడా మగా గోలగోలగా అరుస్తున్నారు. ఒక ఆడమనిషి గుండెలు బాదుకుంటూ నీళ్ళలోకి దూకడానికి ప్రయత్నిస్తోంది. చుట్టూ వాళ్ళు ఆమెని నీళ్ళలోకి వెళ్ళకుండా పట్టుకుంటున్నారు. కొంచెం దూరంలో ఏదో ఒక ఆకారం నీటిలో మునుగుతూ, తేలుతూ ప్రవాహంలో కొట్టుకొస్తోంది.
అది చూసిన గోదా క్షణంలో జరిగిందేమిటో గ్రహించింది. స్నానానికి వచ్చిన వాళ్ళలో ఎవరో కాలు జారి నీళ్లలో పడిపోయుంటారు. చుట్టువాళ్ళు అది గ్రహించే లోపలే ప్రవాహ వేగం దూరంగా నెట్టేసి ఉంటుంది. ఆలస్యం చేయకుండా మెరుపులా ఈదుకుంటూ ఆ వ్యక్తి వైపు ఈదసాగింది గోదా. అతి కష్టం మీద ప్రవాహానికి ఎదురీది, బలమంతా ఉపయోగించి ఆ వ్యక్తి జుట్టు పట్టుకొని నీళ్ళఅంచుకి లేపింది గోదా.
ఆ వ్యక్తి ఎనిమిదేళ్ల ఒక బాలుడు. నీళ్ళు మింగడంతో దాదాపు స్పృహ కోల్పోయే పరిస్థితిలో ఉన్నాడు. అతణ్ణి వీపుమీద సంచిలా వేసుకొని కొంత దూరం వాలుగా ఈది, కొంచెందూరంలో వడ్డుకొచ్చి పడింది. జనమంతా పరుగు పరుగున వచ్చారు అందరి దృష్టి ఆ పిల్లాడి మీదే.
“ముందు పిల్లవాడి చేత నీళ్ళు కక్కించండి” అన్నారు ఎవరో.
గోదా చేతిలోని పిల్లవాడిని చటుక్కున వాడి తల్లి లాక్కుంది. ఉపచారాలతో స్పృహలోకి వచ్చాడు చిన్న. “ఇంత చిన్నపిల్ల ఎంత సమయస్ఫూర్తిగా కాపాడింది. ఏ తల్లి కన్నదో తన ప్రాణాలు లెక్కచెయ్యకుండా చిన్న ప్రాణాన్ని కాపాడింది” అన్నాడు చిన్న వాళ్ళ మేనమామ.
“అయ్యో, ఆ పిల్ల పరిస్థితి ప్రమాదకరంగా వున్నట్లుంది. కళ్ళు మూసుకుంది అలసటతో కాదు స్పృహకోల్పోయినట్లుంది, చూడండి” అంటూ చుట్టూ మూగిన వారు ఉచిత సలహాలివ్వసాగారు.
“పిల్లవాడు పరవాలేదు తేరుకున్నాడు, ప్రాణభయం లేదు. కానీ, ఈ పిల్ల పరిస్థితి యిలా అయిందేమిటి?” ఆందోళనగా అన్నాడు ఓ పెద్దమనిషి.
అప్పుడే గుడి తలుపులు మూసి అటుగా వచ్చిన కామేశం ఒడ్డున జరుగుతున్న సందడేమిటో అనుకొంటూ హడావిడిగా వచ్చారు. ఒక్కచూపులోనే అంతా గ్రహించి, గోదా నాడి పరీక్షిస్తూ, “అంతా చుట్టూ జరగండి, గాలి రావాలి ఆ పిల్లకి” అంటూ ప్రేక్షకుల్లా చూస్తున్న వాళ్ళని ప్రక్కకి జరగమన్నారు.
కొంత సేపు ఉపచారాలు చేసిన పిమ్మట, “అమ్మా! అమ్మా!” అంటూ కలవరించసాగింది గోదా.
లేగదూడ పిలుపు విన్న గోమాతలా, ఆ పిల్లవాడి తల్లి గోదాను అక్కున చేర్చుకొని తల నిమరసాగింది. చల్లని ఆ స్పర్శతో కళ్ళు తెరిచిన గోదా, వెన్నెట్లో గోదావరిలా తళుక్కున నవ్వింది. అందరూ అమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకున్నారు.
*****
మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
గొడవర్తి జానకి శ్యామసుందర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: గొడవర్తి జానకి శ్యామసుందర్
నా పేరు జానకి రాణి గొడవర్తి, మా వారు గొడవర్తి శ్యామసుందర్. మేము హైదరాబాద్ వాస్తవ్యులము. నేను గుంటూరులో B.A. English చేశాను.
నేను రాసిన కథలు 2003 నుంచి 2006 మధ్య కాలంలో All India రేడియో లో “కథాకేళి” శీర్షికన ప్రసారమయ్యాయి, ప్రముఖ పత్రికలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారి నవ్య, హాసం వారపత్రికలలో ప్రచురితమైనాయి.
నేను చూసిన, నా చుట్టూ జరిగిన చిన్న చిన్న సంఘటనల ఆధారంగా కథలు రాయటం నాకు అలవాటు.







Comments