top of page
Original.png

మరో జీవితం

1 hour ago
3 min read

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన గౌరీ టిఫిన్స్ అండ్ ధాబా నడుపుతున్న రాధాకృష్ణ, గౌరి దంపతులు

Maro Jeevitham - Telugu Social Family Story | Harish Babu Pondugula

మరో జీవితం తెలుగు సామాజిక కుటుంబ కథ | హరీష్ బాబు పొందుగుల

Published in manatelugukathalu.com on 18/09/2026


“మరో జీవితం” తల్లిదండ్రుల ఆత్మగౌరవం, పిల్లల బాధ్యతను గుర్తుచేసే హృదయస్పర్శి కుటుంబ కథ.వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే నిర్లక్ష్యం, బాధ, ఒంటరితనాన్ని ఈ కథ భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. ఆత్మగౌరవంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన రాధాకృష్ణ, గౌరి దంపతుల ప్రయాణం ఆలోచింపజేస్తుంది. హరీష్ బాబు రచించిన ఈ కథ కుటుంబ విలువలు, మానవ సంబంధాల గురించి బలమైన సందేశాన్ని అందిస్తుంది.


రాత్రి ఎనిమిది అయింది. గౌరి, రాధాకృష్ణ ఇద్దరు భోజనానికి కూర్చున్నారు. గిన్నెలు చూస్తే అన్నము, కూర ఖాళీగా కనిపించాయి.


"అయ్యో, చెప్పటం మరచిపోయా అత్తయ్యా! కూరలన్నీ అయిపోయాయి.. మీరు కొంచం పెరుగుతో కానిస్తారా ఇవాళ..." అంటూ లోపలి నుంచి చెప్పింది కోడలు శారద.


ఇద్దరూ తెల్లమొహాలు వేశారు.

"కొంచం ముందే చెబితే.. గుడ్డు అయినా చేసేదాన్ని కదా.." అనుకుంది గౌరి.


ఈ నెలలో ఇలా చేయటం నాలుగో సారి.


ఇద్దరూ ఖాళీ కడుపుతోటే పడుకున్నారు.

పొద్దునే వాకింగ్ నెపంతో బయటపడ్డారు. దారిలో గౌరి అంది:

"ఏంటండీ మనకి ఈ ఖర్మ... మీ పెన్షన్ డబ్బు అంతా ఇద్దరికీ ఇచ్చేయొద్దు అంటే విన్నారు కాదు.. ఉన్న ఇల్లు కూడా అమ్మించేసారు.. కనీసం మనసులో మాట ఏదైనా మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదు... ఆరు నెలలు ఆ కొడుకు దగ్గర.. ఆరు నెలలు ఈ కొడుకు దగ్గరా ఉండటం ఇంకా నా వల్ల కావటం లేదండి.."


"అదే నేను ఆలోచిస్తున్నా.." అంటూ ఏదో ధ్యాసలో నడుస్తూ ఉన్నారు రాధాకృష్ణ.


ఇంతలో ఎవరో వెనకాల నుంచి, "సార్..." అంటూ పిలిచారు.


"సార్, మీరు కృష్ణ సార్ కదా... నన్ను గుర్తుపట్టారా... నేను అన్వర్ని సార్... గుంటూరులో మీ దగ్గరే చదువుకున్నాను.." అన్నాడు.


"ఓహ్, అవునా.. చాలా కాలం అయింది కదా బాబు.. బాగున్నావా బాబు? ఇక్కడ హైదరాబాద్ ఎప్పుడు వచ్చావ్? ఏమి చేస్తున్నావ్?" అడిగారు రాధాకృష్ణ గారు.


"ఏమో సార్, అప్పుడు చదువు అబ్బలేదు.. టెన్త్ అయ్యాక హైదరాబాద్ వచ్చేసాను.. చిన్న హోటల్స్లో సర్వర్గా చేసాను.. ఇప్పుడు సొంతంగా ఏదైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను.. డబ్బు లేదు.. ఎలాగా అని ఆలోచిస్తున్నాను.."


"మంచిది నాయనా, చాలా మంచి ఆలోచన.. నీ నెంబర్ ఇవ్వు, సండే కాల్ చేస్తాను. రాగలవా?"


"తప్పకుండా సార్, ఉంటాను సార్" అంటూ వెళ్లిపోయాడు.


ఆలోచనలో పడ్డాడు రాధాకృష్ణ. గౌరి మౌనంగా చూస్తూ నడుస్తోంది. గౌరి ఆయన వ్యవహారం అంతా గమనిస్తూ ఉంది.

ఆదివారం రోజు సాయంత్రం.. రాధాకృష్ణ గారు అన్వర్కి ఫోన్ చేసి ఎక్కడో కలవమన్నారు.


నెల తరువాత ఒక రోజు ప్రొద్దున.. పెద్ద కోడలు డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఉత్తరం చూసి షాక్ అయింది.


"మేము ఇద్దరం ఇల్లు వదిలి వెళ్తున్నాం.. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంటాం... మీ క్షేమం కోరే మీ అమ్మ నాన్న" అని ఉత్తరం సారాంశం.


ఇది జరిగి నాలుగేళ్ళు అయింది.

అది విజయవాడ నేషనల్ హైవే... హైదరాబాద్కి 40 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఒక పెద్ద బోర్డు..

"గౌరీ టిఫిన్స్ అండ్ ధాబా.. వెజ్ అండ్ నాన్ వెజ్"


ఒక రోజు అటుగా వెళ్తున్న రాధాకృష్ణ పెద్దకొడుకు శ్రీధర్ ఫ్యామిలీ ఆ ధాబాలో ఆగి టిఫిన్ ఆర్డర్ చేశారు. అక్కడ చూస్తే.. ఉన్నది అమ్మ, నాన్న.


శ్రీధర్.. రాధాకృష్ణ గారిని బిల్లింగ్ కౌంటర్లో చూస్తూనే..

"నాన్న.. ఎక్కడికి వెళ్లిపోయారు నాన్నా ఇన్ని రోజులు.. మిమ్మల్ని వెదకని చోటంటూ లేదు.. రండి నాన్న, ఇంటికి వెళదాం.." అన్నాడు.


రాధాకృష్ణ గారు అతన్ని చూస్తూ..

"ఎవరు బాబు మీరు... ఎప్పుడూ చూడలేదు... ఏ టిఫిన్ కావాలో చెప్పండి, పంపిస్తాను.." అన్నాడు.


శ్రీధర్కి మతి పోయింది. అక్కడి నుంచి వెళ్లిపోయాడు.


ఆ మరుసటి రోజు.. పొద్దున్నే నిద్రలేచి తలుపు తీశారు రాధాకృష్ణ. ఇంటి ముందు ఉన్న ఇద్దరు కొడుకులను చూసి షాక్ అయ్యాడు. అలాగే వారిని పట్టించుకోకుండా.. తన పని తాను చూసుకుని.. తొమ్మిదింటికి భార్యతో కలిసి హోటల్కు బయలుదేరుతున్నారు.


ఇంతలో శ్రీధర్ మళ్ళీ నాన్నకి అడ్డుపడి, "ఏంటి నాన్న, గుర్తుపట్టనట్లు చేస్తున్నారు" అని అడిగాడు.


దానికి రాధాకృష్ణ గారు అన్నారు:

"అయ్యో, మేము ఇప్పుడు మర్చిపోయామా బాబు.. మీరు మమ్మల్ని ఎప్పుడో మర్చిపోయారు కదరా... ఇపుడు కూడా మీరు ఎందుకు వచ్చారు అంటే, ఇంత పెద్ద హోటల్ ఉంది.. ఎంత సంపాదించారో ఏమో మళ్ళీ పంచుకుందాం అనుకుని వచ్చారు అంతేనా...


ఇందులో పూచికపుల్ల కూడా మాది కాదు లేదు... అంతా అన్వర్దే.. నిజంగా చెప్పండ్రా... ఒకవేళ ఇదే రోజు మమ్మల్ని మీరు ఏ గుడి దగ్గరో మేము బిక్షం ఎత్తుకుంటే.. నువ్వు ఆగే వాడివిరా? ఇలాగే ఇంటికి రమ్మని అనేవాడివా లేక గుర్తుపట్టనట్టు వెళ్లిపోయేవాడివా? మమ్మల్ని గుర్తుపట్టలేదు అని తెగ బాధపడిపోతున్నావు... పోండి రా.. పోయి పని చూసుకోండి.."


"గౌరి, త్వరగా రా, హోటల్ టైమ్ అవుతోంది.." అంటూ ఇంటికి తాళం వేసి ఇద్దరూ కారులో ఎక్కగా.. అన్వర్ హోటల్ వైపుకి కారుని పోనిచ్చాడు.


***


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.



హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:




హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



హరీష్ బాబు పొందుగుల

పరిచయం: హరీష్ బాబు పొందుగుల


ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు.   వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష . 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page