మౌనం దొరికిన చోటు

Mounam Dorikina Chotu - Telugu Family Story | Bhattu Venkata Rao
మౌనం దొరికిన చోటు - తెలుగు కుటుంబ కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 18/09/2026
“మౌనం దొరికిన చోటు” భట్టు వెంకటరావు రచించిన హృదయాన్ని హత్తుకునే ఆధ్యాత్మిక, తాత్విక కథ. సౌకర్యాల కంటే మనసుకు ప్రశాంతత ఎంత ముఖ్యమో ఒక తండ్రి జీవితానుభవం ద్వారా ఈ కథ చెబుతుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమ, వారి అంతరంగాన్ని అర్థం చేసుకోవడం, మౌనం విలువ వంటి అంశాలు కథలో ప్రతిబింబిస్తాయి. చివర్లోని “శివోహం!” భావన పాఠకుడిని ఆత్మపరిశీలన వైపు తీసుకెళుతుంది.
ఊరికి దూరంగా ఉన్న ఒక చిన్న గుడి అది. శివాలయం. ఎప్పటిదో చాలా ఏళ్ళ క్రితంది. చుట్టూ ప్రహరీగోడ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు లేదు, పడిపోయింది. ఎవరూ పెద్దగా రారు. ఒక పంతులుగారు వచ్చి దీపం పెట్టి వెళ్ళిపోతాడు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం.
చీకటి పడింది. గుడిలో దీపం తప్ప మరో వెలుతురు లేదు. అమావాస్యకు ముందు రోజులు. అలవాటైన వాళ్ళకు తప్ప అంత తొందరగా దారి కనపడదు. చుట్టుపట్ల అన్నీ చిన్న చిన్న చెట్లు, తుప్పలు. గుడి పక్కన ఆనుకుని ప్రవహిస్తున్నట్లుగా ఒక పిల్లకాలువ. దూరంగా ఏవో రాళ్ళ మధ్య నుంచి పుట్టి ప్రవహిస్తూ ఉంటుంది.
సాధారణంగా శబ్దం చెయ్యదు. ఎవరన్నా నీళ్ళలో దిగి నడుస్తూ ఉంటే అయ్యే శబ్దం అప్పుడప్పుడూ వినపడుతూ ఉంటుంది. శివయ్య ప్రసాదం అంటారు ఆ ఊరివాళ్ళు ఆ కాలువ నీళ్ళను. పండగలకు గుడికొచ్చినప్పుడు, శివయ్య ప్రసాదంగానే భావించి, తళతళలాడేలా తోమిన ఇత్తడి చెంబులలో నింపుకుని ఇంటికి తీసుకెళతారు. కొబ్బరినీళ్ళ రుచి ఆ నీళ్ళది.
గుడి మండపంలో కూర్చుని ఉన్నాడు ఒక ముసలాయన. అతనెవరో అడిగి తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఎప్పటి నుండి అక్కడ కూర్చుని ఉన్నాడో కూడా ఎవరూ పట్టించుకోరు. దీపం పెట్టడానికి వచ్చిన పంతులుగారు అడిగారు. సమాధానంగా ఒక నవ్వు నవ్వి ఊరుకున్నాడేగాని నోరు విప్పలేదాయన. దీపం పెట్టి వెళ్ళిపోతూ మళ్ళీ ఓసారి సమాధానం కోసం ఆ ముసలాయన వైపు చూశాడు పంతులుగారు. ఇంతకు ముందు నవ్విన నవ్వునే మరోసారి నవ్వాడు ముసలాయన.
గడ్డం పెరిగి ఉంది. బట్టలు మాసి ఉన్నాయి. బాగా పెరిగిన తెల్ల జుట్టు తలపై నిండుగా ఉండి భుజాలపైకి పడుతోంది. విశాలమైన నుదురు, సూటి ముక్కు. స్ఫురద్రూపమే. కాని ఆయన వాలకం మురికిగా ఉన్నట్లు తెలిసిపోతోంది. ఎప్పటి నుండో అన్నం తిననట్లుగా ఉన్నాడాయన.
చూసి ఊరుకోలేక, "ఏ ఊరు మీది?" అని అడిగారు పంతులుగారు.
చేతులు జోడించి దణ్ణం పెట్టి, ఏమీ అడగొద్దన్నట్లుగా తలదించుకున్నాడాయన.
"సరే! ఏదన్నా అవసరమైతే మా ఇల్లు ఆ రోడ్డవతలే!" అని చేత్తో చూపించి వెళ్ళిపోయాడు పంతులుగారు.
(2)
ఆ మరుసటి రోజు ఉదయం గుడిలో దీపం పెట్టడానికి వచ్చిన పంతులుగారికి గుడి ముందు ఒక ఖరీదైన కారు, ఆ కారు ముందు ఖరీదైన వేషంలో ఒక మధ్యవయస్కుడు నిలబడి ఉండి కనిపించారు. అప్రయత్నంగా పంతులుగారి కళ్ళు ముందురోజు సాయంత్రం కనిపించిన ముసలాయన కోసం వెదికాయి. ఆ ప్రాంతంలో ఎక్కడా ఆయన జాడ లేదు. విషయం విచారించిన పంతులుగారికి ఆ ఖరీదైన వేషంలోని మధ్యవయస్కుడు ఇలా చెప్పాడు:
"ఆయన మా నాన్న. డెబ్బై ఏళ్ళ పైనే వయసు. ఈ మధ్యనే మా అమ్మ చనిపోయింది. ఆమె పోయిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడడం మానేశాడు. ఇంట్లో దేనికీ కొరత లేదు. అన్నీ ఉన్నాయి. అయినా ఈ మధ్య ఇల్లు వదిలి రావడం మొదలుపెట్టాడు. ఇది మూడో సారి. ఇంతకు ముందు రెండు సార్లు వెదికితే దగ్గరలోనే దొరికాడు. రెండ్రోజుల నుండి ఆయన కోసం వెదుకుతున్నాను. ఇప్పుడు పరిస్థితి అలా లేదు..."
ఇరువురి మధ్య ఒక నిమిషం నిశ్శబ్దం తరువాత, "ఆయన దొరికితే ఏం చేద్దామని మీ ఆలోచన?" అడిగారు పంతులుగారు.
ఆ ప్రశ్న అర్థం కానట్లుగా ఒక్క క్షణం పంతులుగారి కళ్ళలోకి చూసి, "ఏముంది, ఇంటికి తీసుకుని వెళతాను. ఇంట్లో ఉంచుకుని జాగ్రత్తగా చూసుకుంటాను!" అన్నాడు ఆ మధ్యవయస్కుడు.
"అంటే ఇప్పటి వరకు మీరు జాగ్రత్తగా చూసుకోవడం లేదనా దాని అర్థం?" అడిగారు పంతులుగారు.
ఆ మధ్యవయస్కుడు మౌనం వహించాడు.
"అది కాదు అసలు విషయం. మీరు సరిగా చూసుకోవడం లేదని ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోలేదు. ఆయనకి ఒక ప్రశాంతమైన మౌనం కావాల్సి, ఇల్లు వదిలి వెళ్ళిపోయి ఇటు వచ్చాడని, ఆయనను చూసినప్పుడు నాకు అనిపించింది..." అన్నారు పంతులుగారు.
కొన్ని క్షణాల మౌనం తరువాత...
"మీరన్నది నిజమే కావచ్చు. కానీ అలాగని ఆయనని అలా వదిలేసి ఊరుకోలేను కదా. ఆయనకు నేను ఒక్కడినే కొడుకును. నాకోసం ఎంతో త్యాగం చేశారాయన. మొదట్లో మాది చాలా పేద కుటుంబం. ఎన్నో కష్టాలు ఎదుర్కొని, నన్ను విదేశాలకు కూడా పంపించి చదివించి, ఈ స్థితికి తెచ్చాడు.
సిటీలో ఈ మధ్యనే రెండున్నర కోట్లతో ముప్పైయ్యో అంతస్తులో ఒక అద్భుతమైన అపార్టుమెంటు కొన్నాను. అందులో ఆయనకు ఒక ప్రత్యేకమైన గది ఉంది. అందులో లేని సౌకర్యమంటూ లేదు. మీరన్నట్లుగా, అందులో ఆయన కావాలనుకున్న మౌనం కూడా పుష్కలంగా సమకూర్చి పెట్టాననే నేను అనుకుంటాను. అయినా ఆయన అందులో ఉండకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు..." అన్నాడా మధ్యవయస్కుడు.
పంతులుగారు ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నారు.
"ఇక్కడి నుండి ఎటుగా వెళ్ళి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు?" కొన్ని క్షణాల తరువాత ఆ మధ్యవయస్కుడు అడిగాడు.
"ఈ పిల్లకాలువ దాటి అవతలికెళితే, అంతా ఒక చిట్టడవి వంటి ప్రాంతం. ఆయన వాలకం బట్టి చూస్తే, అటువైపు వెళ్ళి ఉండొచ్చని నా నమ్మకం" అన్నాడాయన.
"అడవి అంటున్నారు, ప్రమాదం కాదు కదా?" అడిగాడా మధ్యవయస్కుడు.
"అంత ప్రమాదకరమైన ప్రదేశమేమీ కాదు. అయినా చూసి అడుగు వేయడం మంచిది. పురుగూ పుట్రా ఉంటాయి కదా!" అన్నాడాయన.
"అలాగేనండీ!" అని ఆ వైపుకు అడుగులు వేశాడు ఆ మధ్యవయస్కుడు.
గుడి పక్కగా ప్రవహిస్తున్న కాలువ దాటి, అడవిలా ఉన్న ప్రాంతంలోకి అడుగులు వేసి, నెమ్మదిగా నడవసాగాడు.
కొంతదూరం, ఎత్తుగా పెరిగి ఉన్న చెట్ల మధ్య, లోపలికి నడిచాడు. అలా ఒక అరఫర్లాంగు దూరం అడవి లోపలికి నడవగానే, ఆ మధ్యవయస్కుడికి, దూరంగా ఒక చెట్టు కింద కూర్చుని, చేతిలో ఏదో పండుని పట్టుకుని, కొరికి తింటున్న అతడి తండ్రి కనిపించాడు.
"నాన్నా..." అని ఒక్కసారి బిగ్గరగా అరిచాడు ఆ మధ్యవయస్కుడు ఆశ్చర్యంతో.
ఆ పిలుపుకి ఉలికిపడి, ఆ పిలుపు వచ్చిన వైపు చూసి, ఒక్క ఉడుటున లేచి నిలబడి, చేతిలోని పండుని కొడుకు వైపు బలంగా విసిరేసి, అక్కడి నుంచి పరిగెత్తాడు ఆయన.
తండ్రి ఆ చర్యకు మొదట ఆశ్చర్యపడి, బాధపడిన ఆ మధ్యవయస్కుడు, "నాన్నా ఆగండి, అలా పరిగెత్తకండి. నేనేమీ మిమ్మల్ని పట్టుకోవడానికి రావడం లేదు. ఆగండి, పడిపోతారు..." అని అంటుండగానే, ఆయన ఎండుటాకుల మధ్య ఏదో కాలికి తగిలి తడబడి ముందుకు పడిపోయాడు.
అది చూసిన ఆ మధ్యవయస్కుడు, "అయ్యో... నాన్నా..." అంటూ ముందుకు ఉరకబోయేంతలో ఆ తండ్రి గట్టిగా అరిచాడు...
"రావద్దు. నువ్వు రావద్దు. వెళ్ళిపో... ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో... నీ ఇంటికి వెళ్ళిపో..."
ఆ వృద్ధుడి ఆ అరుపు మాటలకు, చెట్లపై కొమ్మల్లో దాగి ఉన్న పిట్టలు, ఒక్కసారిగా లేచి గలగలమంటూ ఎగిరి, ఆ అడవి ప్రశాంతతను పెద్ద శబ్దంతో నింపాయి.
"అలాగే నాన్నా... మీరు చెప్పినట్లే వెళ్ళిపోతాను. కానీ మీరిక్కడ ఎలా ఉంటారు?" అన్నాడా మధ్యవయస్కుడు బాధ నిండిన స్వరంతో.
"నాకేమీ పరవాలేదు. నా సంగతి నేను చూసుకోగలను. నువ్వెళ్ళిపో..." అన్నాడా వృద్ధుడు.
'చేసేదేమీ లేదిక' అని భావించినట్లుగా, ఆ మధ్యవయస్కుడు అక్కడి నుండి వెనుదిరిగి, నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు.
(3)
నాలుగు రోజుల తరువాత...
తెలతెలవారుతుండగా గుడి దగ్గరకు చేరుకున్న పంతులుగారికి, దోసిలిలో నాలుగు దోరగా పండిన జామపండ్లతో ఆ ముసలాయన దర్శనమిచ్చాడు.
అంతకు ముందు కనిపించినట్లుగా మురికిగా లేదు ఆయన వాలకం. అప్పుడే స్నానం చేసి వచ్చినట్లుగా ఉంది. ఆయన ధరించిన పంచ, చొక్కా కూడా ఉతికి ఆరేసిన వస్త్రాల్లా శుభ్రంగా ఉన్నాయి. ముఖం ఏదో దిగులు తీరిన తరువాత ఆవరించిన ప్రశాంతతో మెరుస్తున్నట్లుగా ఉంది.
తన దోసిలిలోని పళ్ళను దేవుడికి సమర్పణగా పంతులుగారికి ఇచ్చాడాయన.
'ప్రకృతిలో చెట్ల మధ్య ఆయన కోరుకున్న కొత్త జీవితం ఆరంభించినట్లున్నాడీయన...' అని మనసులో అనుకుంటూ, ఆయన చేతికందించిన పండ్లను అందుకుని, శివయ్య పాదాల దగ్గర పెట్టి, నిత్య పూజాకార్యక్రమాలలో నిమగ్నమయ్యారు పంతులుగారు.
ఆ కార్యక్రమమంతా ముగించుకుని, ఆయన ఇచ్చిన పండ్లలో రెండు పండ్లను తాను తీసుకుని, రెండింటిని శివప్రసాదంగా ఆయనకు తిరిగి ఇచ్చాడు.
తీసుకుని కళ్ళకద్దుకుంటూ, "రాత్రుళ్ళు రోజూ ఈ గుడిలో శివసాన్నిధ్యంలో నిద్రపోతున్నాను. ఇక్కడ పడుకోవడం మీకేమీ అభ్యంతరం కాదుగా?" అని అడిగాడాయన.
గుడి పక్కనే ప్రవహిస్తున్న పిల్లకాలువలో నీటి ప్రవాహమంత ప్రశాంతంగా, మెత్తగా ఉన్నట్లనిపించాయి ఆయన మాటలు పంతులుగారికి.
"అయ్యో, భలేవారే... అందులో అభ్యంతరం ఏమి ఉంటుంది చెప్పండి? నిజానికి నాకూ ఆ కోరిక ఉంది. ప్రతిరాత్రీ ఈ శివయ్య సాన్నిధ్యంలో గడపాలని. కానీ, మీలా సంసార బంధనాలు నాకింకా వదలలేదు. ఆ రోజు వచ్చినప్పుడు నేను కూడా మీకు తోడవుతాను..." అని బదులిచ్చాడు నవ్వుతూ పంతులుగారు.
పెదవుల మీద మందహాసంతో, "శివోహం!" అన్నాడాయన.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.





Comments