గుడ్డి ప్రేమ
- Veluri Sarada

- 8 hours ago
- 5 min read
గుడ్డి ప్రేమ, మయూఖ, అమ్మమ్మ మనవరాలు కథ, emotional Telugu story, grandmother love story, family emotions, Telugu short story, heart touching Telugu story, elderly loneliness, family values Telugu, grandmother granddaughter bond, Telugu literature, sentimental story, motherhood and love, emotional family story

Guddi Prema - Telugu Emotional Family Story | Mayukha
గుడ్డి ప్రేమ - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | మయూఖ
Published in manatelugukathalu.com on 18/06/2026
ప్రేమకు హద్దులు ఉండవు. కానీ కొన్నిసార్లు అదే ప్రేమ గుడ్డిగా మారి బాధను మాత్రమే మిగులుస్తుంది. "గుడ్డి ప్రేమ" కథలో ఆదెమ్మ అనే వృద్ధురాలు తన మనవరాలు మాధురిని ప్రాణంగా పెంచుతుంది. చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా చూసుకున్న మనవరాలు పెద్దయ్యాక మారిపోయిన తీరు, ఆ మార్పును కూడా సమర్థించుకుంటూ జీవించే అమ్మమ్మ ప్రేమ, పాఠకుల హృదయాలను కదిలిస్తుంది. త్యాగం, అనుబంధం, వృద్ధాప్య వేదన, ఆధునిక జీవితపు దూరాలను ప్రతిబింబించే భావోద్వేగ కథ ఇది.
ఆదెమ్మ మనసంతా బాధతో నిండిపోయింది. ఒకవైపు వృద్ధాప్యపు బాధలు, మరొకవైపు మానసిక వేదన. "మానసిక రోగానికి మందు లేదన్నట్లుగా" ఆదెమ్మ మనసు చిరిగిన బొంతలా పీలికలైపోయింది.
మనసు ఉత్సాహంగా ఉంటే శరీర బాధలు ఎన్ని ఉన్నా, అది అంతగా బాధ అనిపించదు. దీనికంతటికీ కారణం తను ఎంతో ప్రేమతో పెంచుకున్న తన మనవరాలి ప్రవర్తన.
******
కూతురు, అల్లుడు యాక్సిడెంట్‌లో పోవడంతో చిన్నపిల్లగా ఉన్న మాధురిని తీసుకుని తన ఇంటికి వచ్చింది. ఆ పసిగుడ్డుకి తల్లిదండ్రులు లేరనే వాస్తవాన్ని తెలియనివ్వకుండా పెంచింది.
మాధురికి మూడో ఏడు వచ్చినప్పుడు,
"ఆదెమ్మా! పిల్లని స్కూల్లో జాయిన్ చేయవా? శ్రీకారం చుట్టించవా?" అంది పక్కింటి రమణి.
రమణికి కూడా ఇద్దరు ఆడపిల్లలు. వాళ్లు మాధురి కంటే పెద్దవాళ్లు.
"అవును! చంటిపిల్ల ఆటపాటలతో మునిగిపోయి, దానికి మూడో ఏడు వచ్చిందనే విషయం మర్చిపోయాను. పంతులుగారిని అడుగుతాను, శ్రీకారం చుట్టడానికి ఎప్పుడు మంచిదో!" అంది ఆదెమ్మ మాధురి వంక ప్రేమగా చూస్తూ.
"అమ్మా! అయితే మాధురి కూడా మాతో స్కూల్ కి వస్తుందా?" అడిగారు రమణి పిల్లలు.
"మంచి రోజులని ఇప్పుడు శ్రీకారం చుట్టిస్తాను కానీ, ఇప్పుడే స్కూల్ కి పంపను. నా బంగారు తల్లిని" అంటూ ముద్దు పెట్టుకుంటూ అంది ఆదెమ్మ.
******
మాధురి ముద్దు మాటలతో ఆ వీధి అంతా సందడిగా ఉండేది. ఒకసారి మాధురికి జ్వరం వస్తే, మూడు రోజులపాటు తిండి లేకుండా మాధురి మంచం పక్కనే ఉండి, మందులు ఇస్తూ తల్లడిల్లిపోయింది ఆదెమ్మ.
ఈ తతంగం అంతా చూసిన రమణి, "చాల్లే ఆదెమ్మా! మరి ఎక్కువ చేస్తున్నావ్! పిల్లలు అన్న తర్వాత జ్వరాలు రాకుండా ఉంటాయా! చిన్నపిల్ల, అది కోలుకుంటుంది కానీ, నువ్వు చూడు ఎలా అయిపోయావో! లంఖణం చేసిన మనిషిలా ఉన్నావ్! కళ్ళు నిద్రలేక లోతుకి వెళ్ళిపోయాయి"
అని మందలించి, వేడివేడి అన్నం, చారు కలిపి తీసుకువచ్చి ఆదెమ్మకు తినిపించింది.
కళ్ళనీళ్లతో ఆదెమ్మ,
"నా బంగారు తల్లికి ఏదైనా వస్తే నేను తట్టుకోలేను రమణి! నా ప్రాణాలు అన్నీ దాని మీదే పెట్టుకుని బతుకుతున్నాను" అంటూ బోరున ఏడ్చింది.
******
కాలం గడుస్తోంది. ఆదెమ్మకి మాధురే లోకమైపోయింది. మాధురి స్కూల్ కి వెళుతుంది. చదువులో ఫస్ట్ వస్తున్న మాధురి అంటే టీచర్స్ అందరికీ ఇష్టం. తల్లిండ్రులు లేరనే సానుభూతి ఉంది.
పెద్ద పెద్ద కళ్ళతో, తెల్లగా అందంగా ఉన్న మాధురి స్కూల్ నుంచి రాగానే రోజు ఆదెమ్మ దిష్టి తీసేది.
"ఎందుకు అమ్మమ్మ రోజు తీస్తావు?" అంది మాధురి.
"నీకు తెలియదు తల్లి! అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. ఏ పాపిష్టి చూపు నీ మీద పడకూడదు, అందుకని రోజు దిష్టి తీస్తాను" అంది ఆదెమ్మ.
రోజు స్కూల్ నుంచి రాగానే అమ్మమ్మ మెడ చుట్టూ చేతులేసి, ఒళ్లో కూర్చుని స్కూల్ కబుర్లు చెబుతూ ఉండేది.
మాధురి పెద్దదయింది. 10వ క్లాసు ఫస్ట్ క్లాసులో పాస్ అయింది.
రమణికి ఎప్పటి నుంచో తన మనసులో,
తన తమ్ముడికి మాధురిని ఇవ్వాలి, ఒద్దికైన పిల్ల అనుకుని ఆదెమ్మని అడిగింది.
"రమణి! ఏమీ అనుకోకు! మొన్న స్కూల్లో మాస్టారు కనిపించి, "బాగా చదువుతుంది కదా, పట్నం పంపించు, పెద్ద చదువులకి" అన్నారు.
అందుకని కాలేజీకి పంపుతాను, ఇప్పుడే దానికి పెళ్లి చేయను" అంది ఒక నిర్ణయానికి వచ్చి ఆదెమ్మ.
చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది రమణి. మాధురి చదువులకి పట్నం వెళుతూ, ఆదెమ్మని పట్టుకుని "అమ్మమ్మా! నిన్ను వదిలి వెళ్లాలంటే ఏడుపొస్తుంది, నిన్ను వదిలి ఉండలేను! నువ్వు నాతో రా అమ్మమ్మా!" అంటూ ఏడ్చింది.
నిజానికి ఆదెమ్మకి బెంగగానే ఉంది. మాధురిని వదిలి ఎప్పుడూ ఉండక.
తను ఏడిస్తే పిల్ల అధైర్యపడిపోతుందని లేని గాంభీర్యం తెచ్చుకొని,
"ఏడవకు బంగారు తల్లి! పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, అప్పుడప్పుడు సెలవులకి వస్తావుగా! బెంగ పెట్టుకోకు, ఫోన్ చేస్తూ ఉంటాలే" అంటూ మాధురిని సముదాయించి పంపించింది.
******
రోజు మాధురి ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఆదెమ్మ.
మాధురి వెళ్ళిన కొత్తలో రోజు ఫోన్ చేసేది.
తర్వాత తగ్గించేసింది. "అవునులే, పిల్ల చదువులో పడిందిగా! ఖాళీ ఎక్కడ ఉంటుంది?" అనుకుని
మాధురి జ్ఞాపకాలతో గడుపుతూ ఉంటోంది ఆదెమ్మ.
మాధురికి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చింది. ఈ వార్త తెలిసి ఆదెమ్మ ఎంతో సంతోషపడింది. కానీ ఆదెమ్మకి తెలియని విషయం ఏమిటంటే,
మాధురికి ఉద్యోగం వచ్చి అప్పటికి చాలా కాలం అయింది.
ఇక తన కష్టాలు తీరుతాయని ఆనందపడింది. ఇన్ని సంవత్సరాలు మాధురిని వదిలి ఉండలేక ఎంతో బాధపడింది. ఇక మాధురి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అనుకుని సంతోషంతో, "రమణి! నా బంగారానికి ఉద్యోగం వచ్చింది, ఇక నేను ఇక్కడ ఉండను, నా మనవరాలి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇన్ని సంవత్సరాలు దాన్ని వదిలి ఎలా ఉన్నానా అని ఆశ్చర్యంగా ఉంది, నాలుగు రోజుల్లో అన్నీ సద్దుకుని వెళ్లిపోతాను" అంది ఆదెమ్మ.
"వయసు పైపడుతోంది, వార్ధక్యపు లక్షణాలు కనిపిస్తున్నాయి, ఇదివరకులా పనిచేసుకోలేకపోతోంది. మనవరాలి దగ్గరికి వెళితే మంచిదే కానీ, మాధురి ఇక్కడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? పెద్ద చదువులు చదువుకున్న పిల్లకి అప్పటి ప్రేమ ఉంటుందా! అయినా సొంత అమ్మమ్మ అంటే ఉండదేవిటి, నా పిచ్చిగాని"
అనుకుని, "వెళ్లిరా ఆదెమ్మ! మమ్మల్ని మర్చిపోకు" అంది రమణి.
******
చిన్నప్పటి జ్ఞాపకాలు, ఇష్టాలు గుర్తుంచుకునే వాళ్లకే ఉంటాయి. కాలంతో పాటు అభిప్రాయాలు, అభిరుచులు కూడా మారిపోతాయి. మాధురికి కొత్త స్నేహాలు, అలవాట్లు,
కార్పొరేట్ కల్చర్ అలవాటయ్యింది.
ఇవేమీ తెలియని ఆదెమ్మ మాధురికి ఇష్టమైనవన్నీ తీసుకుని వెళ్ళింది.
ఇంటి అడ్రస్ తీసుకుని ఆదెమ్మ మాధురి ఇంటికి వెళ్ళింది. మంచి అధునాతనమైన ఇల్లు.
ఇల్లు చూసి ఆదెమ్మ అబ్బురపడింది.
పనిమనిషి వచ్చి ఆదెమ్మ సామాన్లు లోపలికి తీసుకువెళ్లి,
"అమ్మగారు ఆఫీస్ కి వెళ్లారు, అన్నీ టేబుల్ మీద పెట్టాను తినండి అమ్మ! నేను వెళతాను"
అంటూ వెళ్లిపోయింది.
మాధురి గురించి ఆలోచిస్తూ రెండు ముద్దలు తిని పడుకుంది.
సాయంత్రం అయినప్పటి నుంచి చిన్నపిల్లలు తల్లి కోసం ఎదురుచూస్తున్నట్లుగా మాధురి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తోంది. ఎప్పటికో వచ్చింది. ఫోన్లో మాట్లాడుతూ, "బంగారు తల్లి!" అంటూ ఆప్యాయంగా ఎదురెళ్లింది. "ఉష్..." అంటూ నోటి మీద వేలు పెట్టుకుని, మాట్లాడవద్దు అన్నట్టు గదిలోకి వెళ్ళిపోయింది.
ఆదెమ్మ ఒక్క క్షణం బిత్తరపోయింది.
"ఇదేంటి? నేను ఎన్నో ఊహించుకుంటూ ఇక్కడికి వచ్చాను, అసలు మనవరాలు ఈ రోజు ఆఫీస్ కి వెళ్లకుండా తనతో చిన్నప్పటి కబుర్లు చెప్తూ ఉంటుందనుకున్నాను. నాతోటి మాట్లాడకుండా అలా గదిలోకి వెళ్ళిపోయింది. అవునులే! పొద్దుటి నుంచి అలసిపోయింది కదా!" అనుకుని అసంతృప్తిగా సరిపెట్టుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఆదెమ్మ.
మర్నాడు ఆదెమ్మ లేచేటప్పటికే మాధురి వెళ్ళిపోయింది. మళ్లీ మామూలే. ఇక ఉండబట్టలేక ఆదెమ్మ ఆ రాత్రి మాధురి గదిలోకి వెళ్లి, "అమ్మలూ! ఎలా ఉన్నావ్? ఈ అమ్మమ్మని మర్చిపోయావా?" అంటూ ఆప్యాయంగా మాధురి చెయ్యి పట్టుకుంది.
చివ్వున లేచి కూర్చుని, "వదులు, నన్ను పట్టుకోకు"
అంటూ విడిపించుకుంది.
ఆదెమ్మ ఒంటి నుంచి వచ్చిన ముసలి వాసన,
జారిపోయి ముడతలు పడిన శరీరం, నరాలు కనిపిస్తున్న చెయ్యి, ఇవి చూసేటప్పటికి మాధురికి కంపరం వచ్చింది.
"ఈ గదిలోకి ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో!" అంది కోపంగా.
"అదేమిటి బంగారం అలా అంటావ్! అప్పటి ప్రేమ ఏమైంది? చిన్నప్పుడు నా వళ్ళో పడుకునే దానివి.
ఇంత మారిపోయావా?" అంది కళ్ళనిండా నీరు నింపుకుని ఆదెమ్మ.
"నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఇది నా గది.
నా గదిలోకి ఎవరూ రావడం నాకు ఇష్టం ఉండదు" అంది కోపంగా మాధురి.
అక్కడ ఉండడం ఇష్టం లేక తన గదిలోకి వెళ్ళిపోయింది, తెల్లవార్లు ఏడుస్తూ ఆదెమ్మ. మర్నాడు సాయంత్రం మాధురి ఫ్రెండ్స్ వస్తే, వాళ్లతో నవ్వుతూ మాట్లాడుతోంది. ఆ నవ్వు చూసి ఎన్ని రోజులైంది అనుకుంటూ ఆదెమ్మ గుమ్మం దగ్గర నిలబడింది.
వాళ్లు చిక్కిశల్యమైన ఆదెమ్మని చూసి, "ఎవురు?" అని అడిగారు.
కొంచెం తటపటాయింపుగా, "మా పనిమనిషి, నన్ను చిన్నప్పుడు పెంచినది అన్నాను కదా!" అంది.
"ఎంత మంచి దానివే మాధురి! నువ్వు పెద్దయ్యాక కూడా చిన్నప్పటి పనిమనిషిని మర్చిపోకుండా దగ్గర పెట్టుకున్నావ్!" అన్నారు.
ఆ మాటలు విని గిరుక్కున గదిలోకి వెళ్లి
బోరున ఏడ్చింది ఆదెమ్మ.
ఒక నిర్ణయానికి వచ్చి మర్నాడు ప్రొద్దుటే తన ఊరికి ప్రయాణమైంది.
వెంటనే వచ్చిన ఆదెమ్మను చూసి చుట్టుపక్కల వాళ్ళు, "అదేంటి అప్పుడే వచ్చావు! అక్కడే ఉంటాను అన్నావు కదా! ఏమైంది?" అన్నారు.
"నా మనవరాలు బిజీ. అక్కడ నాకు ఏం తోచట్లేదు. అది ఎక్కువ సేపు ఆఫీసులోనే ఉంటుంది. అందుకే నేను అక్కడ ఉండలేక వచ్చేసాను. నేను వచ్చేస్తుంటే పాపం... పిచ్చి పిల్ల కళ్ళనీళ్లు పెట్టుకుంది. అమ్మమ్మ... నీతో గడపలేకపోతున్నాను అంది వెర్రి పిల్ల" అంటూ సమర్ధించుకుంది ఆదెమ్మ.
******
ఒకరోజు రమణిని పిలిచి,
"నేను చచ్చిపోయినా నా మనవరాలికి తెలపకు. అది బిజీ. దానికి ఖాళీ ఉండదు. నా దినవారాలు అన్నీ మీ ఆయన్ని చేయమని. నా ఇల్లు తర్వాత మీరే తీసుకోండి" అంది ఆదెమ్మ.
"అదేంటి ఆదెమ్మ! చివరి చూపు అయినా మనవరాలు చూడొద్దా! అలా అంటావ్? తర్వాత మాధురి వచ్చి,
'అత్త! మా అమ్మమ్మని నాకు చూపించకుండానే పంపించేసావా! అంటే నేనేం చెప్పాలి?' అంటే ఏమనాలి?" అంది రమణి.
ప్రేమ ఎంత గుడ్డిదంటే, తన మనవరాలు రాదని తెలిసి, ఆ విషయం అందరికీ తెలిస్తే, దాన్ని ఎక్కడ చెడ్డగా అనుకుంటారోనని, మనవరాలు గురించి ఎదుటివాళ్లు చెడ్డగా అనుకోకూడదని, ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకుంది పిచ్చి ప్రేమతో అల్లాడిపోతున్న ఆ ముసలి అమ్మమ్మ.
******శుభం *******
మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.









Comments