జన్మభూమి రుణం
- Ch. Pratap

- Oct 13
- 3 min read
#JanmabhumiRunam, #జన్మభూమిరుణం, #ChPratap, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Janmabhumi Runam - New Telugu Story Written By Ch. Pratap
Published In manatelugukathalu.com On 13/10/2025
జన్మభూమి రుణం - తెలుగు కథ
రచన: Ch. ప్రతాప్
హైదరాబాద్ శివార్లలోని ఒక చిన్న పల్లెటూరుకు చెందిన రఘురామ్ కుటుంబం మధ్యతరగతికి దిగువన ఉండేది. వారసత్వంగా ఉన్న రెండు ఎకరాల పొలంపై వచ్చే ఆదాయంతో ఆయన కుటుంబాన్ని అతి జాగ్రత్తగా పోషించుకుంటూ వచ్చాడు. అతనికి ఒకే కొడుకు వివేక్.
చిన్నప్పటి నుండీ వివేక్ అసాధారణ తెలివితేటలు కనబరిచేవాడు. పేదరికం ఉన్నా, గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో, ఆపై నగర శివార్లలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. సినిమాలు, సోషల్ మీడియా వంటి సరదాలకు దూరంగా ఉండి, రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకున్నాడు. కృషికి తగ్గ ఫలితం దక్కింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన జె యీ టీ అడ్వాన్స్‌డ్ లో అద్భుతమైన ర్యాంకు సాధించి, ఐ ఐ టి ముంబై లో లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు తెచ్చుకున్నాడు. ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో అతని చదువుకు అయ్యే ఖర్చు పూర్తిగా తగ్గిపోయింది.
ఐఐ టి ముంబై లో వివేక్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. చివరి సంవత్సరంలో, బెంగళూరులోని ఒక అగ్రశ్రేణి మల్టీనేషనల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీనియర్ డేటా సైంటిస్ట్ కింద ఎంపికై, సంవత్సరానికి ₹30 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.
ఉద్యోగంలో చేరే సమయంలో, తల్లిదండ్రులను కూడా బెంగళూరు వచ్చి తమతో ఉండాలని కోరాడు. కానీ, పుట్టి పెరిగిన ఊరు వదిలి, తమ పొలాన్ని, పరిచయస్తులను విడిచి రావడానికి వారు ససేమిరా అంగీకరించలేదు.
ఒక శుభ ముహూర్తాన వివేక్ బెంగళూరులో ఉద్యోగంలో చేరాడు. తన అసమానమైన నైపుణ్యం, పనితీరుతో అంచెలంచెలుగా ప్రమోషన్లు సంపాదించుకుంటూ, కొద్ది కాలంలోనే టీమ్ లీడర్‌గా ఎదిగి జీవితంలో మంచి విజయాలను అందుకున్నాడు.
కొన్నాళ్లకు, తండ్రి రఘురామ్ ఆరోగ్యం క్షీణించి మంచం పట్టినట్లు కబురు వచ్చింది. వివేక్ వెంటనే ఉద్యోగానికి సెలవు పెట్టి, హుటాహుటిన సొంతూరికి చేరుకున్నాడు. తండ్రి చివరి దశలో ఉన్నాడు. కొడుకుతో, "నువ్వు జీవితంలో ఇంత పెద్ద విజయం సాధించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. మన కుటుంబానికి మంచి పేరు తెచ్చి నువ్వు నా ఋణం తీర్చుకున్నావు.
అయితే నువ్వు తీర్చుకోవాల్సిన మరొక ఋణం కూడా ఉంది. అది నీ జన్మభూమి ఋణం. నేను పుట్టినప్పటి నుండి చివరి ఊపిరి వరకు ఈ నేల నన్ను అన్ని విధాలా భరించింది. కాబట్టి, ఈ జన్మభూమికి నా ఆఖరి కోరికగా ఏమైనా చేసి, ఈ ఋణం తీర్చుకో, " అని కోరాడు. అలాగేనని వివేక్ మాటిచ్చిన వెంటనే రఘురామ్ తృప్తిగా కన్ను మూసాడు.
జన్మభూమి ఋణం తీర్చుకునే ప్రణాళిక తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం వివేక్ సొంత ఊరి అభివృద్ధికి ఒక ప్రణాళిక వేసుకున్నాడు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని విదేశాలు తిరిగినా, మనకు పునాది వేసిన మాతృభూమి ని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ నేల, ఈ గాలి, ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలు, అందించిన ప్రోత్సాహం వల్లే నేడు మనం ఉన్నత స్థానంలో ఉండగలిగాం. కాబట్టి, మన ఆర్థిక స్థితి మెరుగుపడినప్పుడు, మనం తప్పకుండా మన గ్రామానికి లేదా పట్టణానికి ఏదో ఒక విధంగా తిరిగి ఇవ్వాలి. ఈ సామాజిక బాధ్యతతోనే, వివేక్ తన మొదటి అడుగు వేసాడు.
తండ్రి జ్ఞాపకార్థం, మొదట చదువుకున్న ప్రభుత్వ పాఠశాలను 'స్మార్ట్ స్కూల్'గా మార్చడానికి ₹10 లక్షలు ఖర్చు చేశాడు. డిజిటల్ తరగతి గదులు, ఆధునిక బెంచీలు, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత సంవత్సరం, గ్రామంలోని ప్రజలకు త్రాగునీటి సమస్య తీర్చడానికి, తండ్రి పేరు మీద ఆర్ వో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి, ప్రతి కుటుంబానికి కేవలం నామమాత్రపు ధరకే శుద్ధి చేసిన నీటిని అందించేలా చేశాడు.
తరువాత, పల్లెటూరి ప్రభుత్వ ప్రాథమిక వైద్య కేంద్రాన్ని ఆధునీకరించడం, రహదారులను మరమ్మతు చేయించడం, అత్యవసర వైద్య సేవలకు సొంత ఖర్చుతో ఒక అంబులెన్స్ కొనడం వంటి పనులను మొదలుపెట్టాడు. వివేక్ తన వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకుని, ఆదా చేసిన డబ్బుతో ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో ప్రజోపకార్యం చేస్తూనే ఉన్నాడు. ఆ విధంగా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం జన్మభూమి ఋణం ఈనాటికీ తీర్చుకుంటూనే ఉన్నాడు.
***
Ch. ప్రతాప్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/pratap

నేను Ch. ప్రతాప్. వృత్తిరీత్యా ఒక ప్రభుత్వ రంగ సంస్థలో సివిల్ ఇంజనీర్‌గా ముంబయిలో పని చేస్తున్నాను. అయితే నా నిజమైన ఆసక్తి, ప్రాణం సాహిత్యానికే అంకితం..
తెలుగు పుస్తకాల సుగంధం నా జీవనంలో 1984 నుంచే పరిమళించింది. అప్పటి నుంచి పఠనం నా దినచర్యలో భాగమై, రచన నా అంతరంగపు స్వరం అయ్యింది. ఆధ్యాత్మికత, మానవ సంబంధాల లోతులు, సామాజిక ధృక్పథం, ప్రజాసేవ పట్ల నాలో కలిగిన మమకారం నా ప్రతి రచనలో ప్రతిఫలిస్తుంది.
ఇప్పటివరకు నేను రాసిన రెండు వందలకుపైగా కథలు, ఐదు నవలలు, రెండు వేల వ్యాసాలు పలు దిన, వార, మాస పత్రికలలో, డిజిటల్ వేదికలలో వెలువడి పాఠకులను చేరాయి. ప్రతి రచన నా అనుభవాలకు, ఆలోచనలకు ప్రతిబింబమే కాక, పాఠకునితో ఒక సంభాషణ.
నాకు సాహిత్యం హాబీ కాదు, అది నా జీవితయానం. కొత్త ఆలోచనలను అన్వేషిస్తూ, తెలుగు సాహిత్య సముద్రంలో నిరంతరం మునిగిపోతూ ఉండటం నా ఆనందం. రచన ద్వారా సమాజానికి ఉపయోగపడే మార్గాలను వెతికే ప్రయత్నం నాకెప్పుడూ ఆగదు.




Comments