top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 14

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.


Youtube Video link

'Kakathi Rudrama Episode 14' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ పదునాలుగవ భాగం


గత ఎపిసోడ్ లో…

గణపతి రుద్రదేవులు అంతిమక్షణాల్లో వున్నారు.

శివదేవయ్యమంత్రులు తీరికలేని పనులతో సతమతమవుతున్నారు.

ప్రసాదిత్యనాయకులు, రేచెర్ల ప్రభుపులు వచ్చి శివదేవయ్యను కలిశారు.

రుద్రమదేవి స్త్రీ కాబట్టి ఆమెకు రాజ్యార్హత లేదని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెలుసుకుంటాడు శివదేవయ్య.

అది ఎవరో కనిపెట్టమని తన ముఖ్య గూఢచారి సోమనాధాచార్యుల వారిని కోరుతాడు శివదేవయ్య.

ఇక చదవండి..ప్రజలు ఆశ్చర్యంగా యితిమిద్దంగా చెప్పుకునే వార్త సామ్రాజ్యమంతా వెలుగువలె వ్యాపించింది.

అది 'శ్రీ రుద్రదేవచక్రవర్తి రాజ్య నిర్వహణకోసం ధరించిన వేషం కానీ- నిజానికి ఆమె రుద్రమదేవి' అని.

నిండుసభలో ఈ వార్త నానా రాజ్య ప్రముఖుల ముందు ప్రకటించ బడినా, అంచెలంచెలుగా సామ్రాజ్యమంతా పాకింది.

ఆ తరువాత-

జయజయధ్వానాల మధ్య రెండేళ్ళతరువాత యింతమంది ప్రముఖ, ప్రముఖుల

ఎదుటకు వృద్ధసింహం వలె తెల్లగా, యింకా మరణించని వీరత్వంతో, సేనానాయకులు మెల్ల

గా నడిపించుకురాగా, కాకతీ సామ్రజ్యలక్ష్మి నుదుట సింధూరతిలకం దిద్దిన, అపార వీరత్వ ప్రభంజనంతో శత్రురాజ్యాలను గజగజలాడించిన శ్రీ గణపతి దేవచక్రవర్తులు వచ్చి, సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నారు.

రుద్రమదేవి యువరాజు సింహాసనం అధిష్టించారు.

వంగిమాగధుల పాటలతో, ఆ మందిరం మార్మ్రోగింది.

నానా విధాల వాద్యాలతో, పెద్దశృతితో చెవుల తుప్పు వదిలింది.

రుద్రమదేవి వచ్చి యువరాజు సింహాసనం మీద ఆసీనులుకాకముందు- ఆమె వెంట

సేనాపతులు, మంత్రులూ, ముఖ్యంగా ఆమె వెనుక వీరభద్రప్రభువు విచ్చేశారు.

రుద్రమదేవి వచ్చి తండ్రికి నమస్కరించింది.

మరల మరొక్కసారి జయజయధ్వానాలు.

ఆయన ఆమెను ఆర్తిగా చేతులెత్తి, వణుకుతున్న చేతులతో, వణుకుతున్న పెదవులతో నుదుట ముద్దుపెట్టుకుని పక్కనే సగం సింహాసనంలో కూర్చోబెట్టుకున్నాడు.

ఆమె కాస్సేపు కూర్చొని తండ్రిగారికి యిబ్బందిగా వుందని వినమ్రతతో లేచి తమ సింహాసనంలో కూర్చున్నారు.

వెంటనే మహామాత్యులు శివదేవయ్య లేచి-

" సభకు నమస్సులు.

ఇకనుంచి రుద్రమదేవి చక్రవర్తిణికి, అదివరకు శ్రీశ్రీశ్రీ గణపతిదేవచక్రవర్తికి ఎంత

కృతజ్ఞతతో ప్రవర్తించారో యిప్పుడూ ఆమె మీద మీరు అంత ఔదార్యము చూపించ

వలసినదిగా ప్రార్థన! మీరు తెచ్చిన విలువయిన ఆశీస్సులు, కానుకలు అందచేయ

వలసినదిగా తెలియజెప్పుచున్నాము" అన్నారు

తప్పెట్లమ్రోత...

తండ్రీ, కూతురు కృతజ్ఞతగా మహామాత్యుల ముఖంలోకి, సభాముఖంలోకి చూశారు.

ఈ జీవగడ్డ విశ్వాసపాత్రులను ఎంతమందిని ప్రసాదించలేదు.

-------------------------------------

సూర్యుడు అస్తమించటం అంటే, వెలుతురు మాసిన మబ్బులమీదికి, చీకటిని ఆహ్వానించటమే. దిగంతం నిర్జీవమైతేగానీ, వెలుగు నింపుకుని సజీవం కానట్టు, ప్రతి పుట్టుక వెనుకా చీకటి, వెలుతురూ చెట్టాపట్టాలేసుకుని వుంటాయి.

ముఖ్యంగా రాజవంశ చరిత్రలను జాగ్రత్తగా వీక్షిస్తే ఈ కఠోర సత్యాలు మన కర్దమై తీరుతాయి.

రుద్రమదేవి ముత్తాతల రోజుల్లోనూ-

తాతగారి మరణం తరువాత-

ఇప్పుడు తండ్రిగారి అంతిమ క్షణాల్లోనూ

ప్రజలని భయభ్రాంతుల్ని చేసే యుద్దమేఘాలు అలుముకుంటున్నాయి.

ప్రతిక్షణము వాళ్ళు అరచేతిలో ప్రాణాలు పెట్టుకునే జీవిస్తున్నారు. ఇప్పటి దాకా విశ్వాసపాత్రమైన

కుక్కలవలె గుమ్మాల దగ్గర పడుకున్న కొంతమంది రాజులు, తండ్రిగారి అవసానదశలో పులుల వలె దూకటానికి సిద్దంగా వున్నారు. కేవలం అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారు.

ఆమె వెలుతురు అస్తమించిన చీకటి వంక చూస్తున్నది. ఆలోచనలు ఎంతకీ తెగవు.

తన తండ్రిగారి ఎదుట తల ఎత్తడానికి సాహసించని లకుమయారెడ్డి యివ్వాళ కత్తులు నూరు తున్నాడు. ‘ఆడుదాని చేతికింద నీళ్ళెవరు తాగుతారు' అంటున్నాడు.

దీనికి చుక్కెదరు గన్నారెడ్డి, మాల్యాలవారు, గోనవారూ, నతనాటి సీమల ప్రభువులు.

తమ తండ్రిగారి సోదరికి నతనాటి ప్రభువు భర్త.

వెలనాడివారికీ, తమకీ బాందవ్యాలూ- యిచ్చి పుచ్చుకోవటాలు వున్నాయి.

శత్రువులు ఇంకొంతమంది ఉన్నారు. విశ్వాసపాత్రులయిన మిత్రులూ- ముఖ్యంగా చాళుక్య ప్రభువులు అండగా ఉన్నారు.

చాళుక్యులు మొదటినుంచీ తమ వంశాలతో బాందవ్యాలతోనే వున్నారు.

పోతే గణపాంబాదేవి భర్తకూడా కుట్రదారులతో చేతులు కలుపుతున్నారని నమ్మకంగా వార్తలు వస్తున్నవి.

ఏమి రాజరికాలు- ఏమి రక్తపాతాలు?

యుద్దాలు రక్తపాతాన్ని సృష్టిస్తాయి. మానవజీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తాయి. కరువు

కాటకాలు కలిగిస్తాయి. కానీ, స్వార్ధపరులు, తమని గురించి ఆలోచిస్తారే తప్ప, మానవ ప్రపంచాన్ని గురించి ఆలోచించరు.

ఇప్పుడు గన్నారెడ్డి అనేజాతి విషనాగు విద్వేషంతో బుసలు కొడుతున్నది. అతనిది పాము పగే. ఈ గజదొంగకు తామన్న యింత భక్తి ఎందుకో అర్థంకాదు.

అట్లాగే చాళుక్యవీరభద్రులు మొదటినుంచి తమమీద అపారమైన గౌరవప్రపత్తులు

చూపిస్తున్నారు. తనలో స్తీత్వమను మేల్కొల్పినదీ, శిలా సదృశ్యమైన తన హృదయమును జాగృతం చేసింది ఆ సుందరపురుషుడే కదా!

పరిస్థితులు చేయిదాటి పోతున్నవని గ్రహించిన శివదేవయ్యామాత్యులు రహస్యమును లోకమునకు విప్పిజెప్పి, నన్ను క్షుద్రపురుగునుండి బయటకు తీసి, సీతాకోకచిలుకగా చేసినారు. అది కలగూరగంప ల పరిస్థితి నుండి తలలు బద్దలు కొట్టుకొనకుండా చేసిన మంచి పని. శివదేవయ్య మాత్యుల మేధకు సరి ఐన మేధావి మరొక్కరేరి?

ఎటుతరంలో చూసినా, కాకతీ ప్రభువులకు మగపిల్లలు ప్రస్తుతము లేరు. అందు వలననే కదా తాను సింహాసనారూఢ ఐనది.

స్త్రీలు భర్తలను పొందుటకు, మరల వారికి పిల్లలను కని ప్రభువులుగా చేయుటకుఅర్హులేగానీ, రాజ్యాలను పాలించుటకు అర్హులు గారా! ఇది స్త్రీల మేధస్సును యింకనూ పరిగణనకు తీసుకోని మగవారి మూర్ఖత్వమా?

అయితే తాను పురుషుడుగానే వుండిపోయి నట్లయేతే ఈ భయంకరమైన ఖేదమునుంచి తాను తప్పుకొనగలిగేది. ఎంత విషమస్థితి.

ఆమె యిట్లా అనుకుంటున్నది----

"నా లోని స్త్రీత్వము నశించు గాక. నా లోని ప్రేమానురాగాలు సంపూర్తిగా అస్తమిం

చుగాక. నేను అన్నింటినీ పోగొట్టుకున్న అభాగ్యనౌదును గాక. "

ఇన్ని ఆలోచనలు...

------------------------

తీరిక లేని పనులు..

రాత్రి రెండు ఝాములైనా యింకా పనులు మిగిలిపోతూనే వున్నాయి. కళంగరాజుల మీదికి, యుద్దానికి బయలుదేరిన చాళుక్య వీరభద్రులు, కాకతీయ మహాసామ్రాజ్యాన్ని కంటికి రెప్పలా చూస్తున్నారు. గణపాంబాదేవి, మొన్న ఉదయం వచ్చి, నిన్న మధ్యాహ్నం వెళ్ళిపోయింది. ఆమెతో ఎక్కువ సేపు గడపలేక పోయింది.

ఈ మధ్య ముమ్ముడాంబికాదేవి తనమీద అలిగినట్టుంది. - ఇటుకేసి రావటము లేదు. తను అదివరకటిలా ఆమెను తన పక్కన కూర్చోబెట్టుకోలేక పోతున్నది. తెలియని జుగుప్స.

స్త్రీ నుంచి మరొక స్త్రీ కోరుకునేది ఏమిటీ?

చిత్రం కాకపోతే . తను భర్త. ఆమె భార్య.

రుద్రమదేవికి నవ్వు వచ్చింది.

కబురు మీద కబురు నాలుగు నాళ్ళనుంచి, ముమ్ముడాంబ దగ్గరనుంచి.

" ఒక్కసారి వచ్చి వెళ్ళిపోవలసిందిగా ప్రార్థన. "

అదీగాక, ఆ ముగ్ధను, యింకా అజ్ఞానంలో వుంచి, తనమీద యింకా ప్రేమాభిమానాలు పెంచుకోనివ్వటంలోనూ ధర్మం లేదు.

తను స్త్రీననే వార్త ఆమెతో చెప్పాలి.

చాళుక్యవీరభద్రులు తనను ఎంతగా కాంక్షిస్తున్నారో, అంతగా ఆమె, తనని ఆరాధిస్తోంది-

ఆమెకు నెమ్మదిగా చెప్పాలి.... లేకపోతే

ఆమె అందాల పందిరి కాలిపోతుంది. భరించరాని ఏ అఘాయిత్యమైనా చేయవచ్చు.

రుద్రమదేవి బయలుదేర బోతుండగా------

భువికి దిగిన అప్సరకాంతకి మల్లె, వెన్నెలసోనకి మల్లె, రతీదేవివలె, గంధర్వకాంతకి మల్లే, ప్రపంచాన్ని పాదాక్రాంతం చేయించగల అపురూపసౌందర్యమూర్తికి మల్లే-

నడకలో హంసలగుంపులై, చూపులు వెలుతురు దారులై, అడుగడుగునా అందెల సవ్వడులతో - గలగల పారే గోదార్లా, ఎదురుగా వస్తున్న ముమ్ముడాంబిక .

రుద్రమ ప్రభువు క్షణం సేపు అట్లా నిలబడిపోయాడు, ఆమె వంక కన్నార్పకుండా చూస్తూ.

ఆమెకు ఈ రాజకీయతంత్రాలు తెలీవు. ఈ బాదరబంధీలు అర్థం కావు.

" ప్రభూ!"

"దేవీ.... !"

ఆమె గాఢంగా రుద్రమదేవుణ్ణి కావలించుకుని పెదవుల మీద ముద్దు పెట్టుకుని,

" ఎన్నాళ్ళయిందో ప్రభూ మిమ్మల్ని చూసి" అంది.

ఆమె చెక్కిళ్ళ మీద కన్నీటి జాలు.

" దేవీ!"

"వూ !"

"ఇటు చూడండి”

"వుహూ!”

"మీరు నాకు గుర్తుకురాని క్షణమే లేదు. తీరిక లేని పనులు.. "

"అబద్దం".

"మీ మీద ఒట్టు".

ఆమె తడిసిన కళ్ళతో రుద్రదేవుడి ముఖంలోకి చూసింది.

" స్వామీ- మీరు లేకపోతే నేను బ్రతకలేను ... మిమ్మల్ని వదిలి నేను యిక వుండలేను"

" నేనూ అంతే... ఐతే మేము మీతో ఒక విషయం ముచ్చటించాలి. "

"ఏమిటది. "

" అది ఏకాంతము లోనే చెప్పవలెను".

ఆమె బుగ్గలు ఎర్రతామరలైనవి.

"మీ యిష్టము".

"మన పడక గదిలోనికి పోవుదము"

" వూ........ "

రుద్రదేవుడు, ఆమె నడుంచుట్టూ చేయివేసి, అంతఃపురములోని, పడకగదిదాకా

నడిపించుకుంటూ వచ్చాడు.

..................................

" దేవీ.... "

" ప్రభూ "

"మమ్ముడాంబికా"

"చెప్పండి ప్రభూ ......... "

"నీవు ఈ నిజమును భరించవలెను".

"ఫరవాలేదు ప్రభూ "

"ఇది మా కులదేవత, కాకతీదేవిపైన ప్రమాణము - నేను చెప్పబోయేది నిన్ను బాధ పెట్టవచ్చు...... కానీ నిన్ను నీవు సమాధానపరుచుకో- చెప్పనా!"

ఆమె బిత్తరి కళ్ళతో రుద్రదేవుని వంకే చూస్తున్నది.

" నీవు రాచకాంతవు.... ధైర్యము మన రక్త లక్షణము. నీవు నా ముఖం వంక దీక్షగా చూడు. ఇప్పుడు నాకు ఇరువది రెండేళ్ళు. నా వయసు వారి వలె నాకు మీసములు లేవు. గడ్డములు లేవు. ఎందుచేత? కనీసము నూనూగు మీసమైనా మొలవలె కదా!

" నిజమే ప్రభూ.... నే నెన్నడూ ఆలోచించలేదు. "

"ఎందుకని".

" మీ మీద నాకున్న అపురూపమైన ప్రేమచేత మీ ముఖంలో చూసి నన్ను నేను మరిచి పోయేదాన్ని. తన్ను చూసి తనకు మరిచిపోయే స్త్రీ ఇంకేమి ఆలోచించగలదు. ?”

" ఔను------- ముమ్ముడాంబికా! ఓ ముగ్ధ సౌందర్యహేలా...... అనురాగమయీ! నేను నీ వనుకున్నట్లు పురుషుడను కాను".

ఈ మాట వినగానే ముమ్ముడాంబిక గడ్డకట్టుకు పోయినది. కళ్ళు అట్లాగే విప్పారుకు

చూస్తున్నది. చలనము లేనిదానికి మల్లే.

" ప్రభూ !'

"ఔను పిచ్చిపిల్లా.... ఈ కాకతీయ సామ్రాజ్య చక్రవర్తులకి మగ సంతానము లేరు. పుట్టిన వారిద్దరూ ఆడపిల్లలే. పెద్దపిల్ల రుద్రమదేవి అనే రుద్రదేవుడు. చిన్నితనం నుంచి మగపిల్లవాడుగా - భావిచక్రవర్తిగా పెంచబడిన ఆడపిల్ల. రెండవపిల్ల

గణపాంబదేవి- నిన్నగాక మొన్న అత్తగారింటికి వెళ్ళిన చిన్నది.

" మీరు............ "

"నేను రుద్రమదేవిని".

క్షణం విరామం.

రుద్రమదేవి ముమ్ముడాంబికను దగ్గరగా కౌగిలిలోకి తీసుకొని- పెదవులపైన ప్రేమతో ముద్దు పెట్టుకుని - జాలిగా చెక్కిళ్ళు నిమిరి......

" నీవు చూసే పురుషుడు. నీవు ఆరాధించే ప్రభువు కేవలం స్త్రీ. వేను రుద్రమదేవిని. నీవు భావించినట్టు గణపతిదేవ చక్రవర్తి మొదటి సంతానం పురుషుడు కాడు.... "

ఆమె గుండె పగిలిపోయింది. నిజమును భరించగల ధైర్యము ఆ ముగ్ధకు లేదు.

ఆమె, గాలికి కంపించే చిగురు మొక్కలాగా కదలబారిపోయింది.

" ప్రభూ ".

" నిజము దేవీ!'

ఆమె కన్నులు మైకముతో మూతలు పడినవి.

రుద్రమదేవికి తెలుసు. ఇట్లా జరుగుతుందని . కానీ ఏదోఒకనాడు నిజం తెలీక మానదు. ఆనాడు ఈ దుఃఖము తప్పదు.

ఆమె తట్టుకొనలేక పోతున్నది.

రుద్రమదేవి ముమ్మడాంబిక తలను సన్నటి వేళ్ళతో నిమురుతున్నది. ఉద్యానవనం లోంచి చల్లని పిల్లగాలులు తగులుతున్నాయి.

ఆమె అట్లాగే దీక్షగా ముమ్ముడాంబిక ముఖంలోకి చూస్తూ కూర్చున్నది.

" ప్రభూ !"

" నన్ను కేవలం పురుషునిగా పెంచడంలో విజ్ఞత వున్నది. భావి సామ్రాజ్య రక్షణాలక్ష్యం వుంది. నా తరువాత పుట్టిన గణపాంబదేవి మగాడై పుట్టినట్లయితే నేను నేను గా పెరగగలిగి ఉండేదాన్ని. శివదేవయ్య బాబాయి గారు నాకు రుద్రమదేవి అనిపేరు పెట్టి, రుద్రదేవుడు గా పెంచడం ఒక గొప్ప ఆలోచన. నేను శత్రువులను

నిర్జించగల కాకతిని. పార్వతిని. అపర్ణను. కాళికను. దుర్గను..... అదే నా పేరులోని రహస్యము.

నా తండ్రిగారు నాకు క్షాత్రం నేర్పారు. వీరవిద్యలు నేర్పారు. రేపు ఎదురెత్తి వచ్చే శత్రువులను నిర్జించ గల ధైర్యం, మెలకువలు నేర్పారు.

ఆమె రుద్రమదేవి ముఖంలోకి చాలాసేపు చూసింది.

రుద్రమదేవి తన పురుషవేషం తీసి స్త్రీవేషం ప్రదర్శించింది.

శిల్పం అపురూప సౌందర్యవతియైన స్త్రీ అయినట్టు - ఎంత అందం రుద్రమదేవిది!

ముమ్ముడాంబిక ఆశ్చర్యంతో యింతకాలం తన భర్తయిన స్త్రీని చూస్తున్నది. ---

------------------------------

దేశం కష్టాల్లో వున్నప్పుడు తమ దేశం కోసం ప్రాణాలనైనా అర్పించటానికి సిద్దంగా వున్న వీరులకు, మాతృదేశ భక్తులకు ఈ పుణ్యభూమి పురిటిల్లు. ఈ దేశ చక్రవర్తిని చూసినట్లయితే, యిన్ని తాకిళ్ళకు, యిన్ని యుద్దాలకు నిలయమైన దేశం మరొకటి కనిపించదు.

ఎవరు ఎంత చేసినా - దేశపు ఖ్యాతికి లోటులేదు.

ప్రభంజనాలకు లోటులేదు. క్షాత్రత మొక్కపోలేదు.

ఈ దేశాన్ని ఎవరు జయించినా, వెన్నుపోటు పొడిచినా స్వార్దపరుల వల్లనే జరిగింది.

కుట్రలూ- కుతంత్రాలూ అఖండభారతాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. అయితే ఇది వేద

భూమి..... రుద్రభూమి.... కర్మభూమి...... జన్మభూమి అవ్వటం చేత, హిందూ సాంప్రదాయాన్ని మరే ఇతర జాతీ జయించలేక పోయింది.

ఇక్కడ గంగా- కృష్ణా- పెన్నా- గోదావరి- కావేరీ తదాది నదులు ప్రవహిస్తున్నాయి

ఇక్కడ గుడిగంటల నాదాలతో- వేదపండితుల మంత్రాలతో జపాలు- తపాలు జరుగుతాయి..... ఇక్కడ శ్రీరాముడూ, శ్రీకృష్ణుడు, శంకరాచార్యులూ జన్మించారు.

ఇది ఆర్యభూమి.

కాళ్ళకి పారాణి పెట్టుకుని వినూత్న వధువులు తమ భర్తల కోసం సాంప్రదాయానుసారంగా కన్నీళ్ళతో తరలి వెళతారు.

పచ్చని పసుపుకాళ్ళూ. కాళ్ళకు మట్టెలుమెళ్ళో పసుపుతాడు- నల్లపూసలూ.ముఖాన ఎర్రని కుంకుమా..

ఈ దేశపు స్త్రీ జీవితాన్ని ఉజ్వలము, శాంతి ప్రపూర్ణము చేశాయి.

అట్లాగే వీరులు-

తాము నిర్మించుకున్న వేదభూమి కోసం, ఆర్యభూమికోసం, శరీరంలో ఆఖరి రక్తపు

బొట్టు వున్నంత వరకూ కత్తులతో శత్రువుల మస్తకాలను ఖండిస్తూనే వుంటారు.

ఇంకా వుంది...

--------------------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


70 views0 comments

Comments


bottom of page