కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Youtube Video link
'Kakathi Rudrama Episode 13' New Telugu Web Series
Written By Ayyala Somayajula Subrahmanyam
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
గత ఎపిసోడ్ లో…
గొంక ప్రభువు రుద్ర దేవుడిని కలుస్తాడు.
గన్నారెడ్డి, మైలవనాయకుని ఓడించి సంహరించిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు.
గన్నారెడ్డి, మార్కాపురం ప్రభువైన సోమనాధప్రభువుని వధించిన వార్తకు సంబంధించిన వివరాలు అడుగుతాడు రుద్ర దేవుడు.
ద్వంద యుద్ధంలో గన్నారెడ్డి, సోమనాధుడిని ఆలా చంపాడో చెబుతాడు గొంక ప్రభువు.
ఇక చదవండి..
ఓరుగల్లు, నాగరికతా ప్రాభవాలకు పుట్టినిల్లు.
కోటలు,
బాటలు,
వీధులు,
రాచనగరులు,
మంత్రి, సేనానాయకుల నివాసగృహాలు,
బ్రాహ్మణ, వైశ్య వీధులు.
గుర్రపుశాలలు, ఏనుగుల నివేశన స్థలములు,
అంగళ్ళు, రకరకాల అలంకరణ సామగ్రులు, సుగంధ ద్రవ్యాలు.. అన్నీ విరివిగా దొరుకుతూ వుంటాయి. ఓరుగల్లులో దొరకని వస్తువు లేదు.
ఆ నాళ్ళలోనే కవిత్వ, సంగీత, సాహిత్య, చిత్రలేఖనా, శిల్పకళ లు వుద్భవిల్లినాయి.
...... కమనీయ భరతనాట్య భంగిమలకు ఓరుగల్లు పెట్టిన పేరు.
ఎన్నో శత్రురాజుల ఆటు పోట్లకు నిలబడిన కాకతీసామ్రాజ్యము తిన్నన్నీ ఢక్కా
మొక్కీలు మరే సామ్రాజ్యము తినలేదు. గణపతి రుద్రదేవుల విశాలహృదయము , ఈవి, ఠీవి, ఔదార్యము, చరిత్రపుటలలో శాశ్వతకీర్తులతో నిలబడిపోయాయి.
అలాగే రుద్రమదేవి కళాసహృదయత కూడా.
ఒక సామ్రాజ్య ప్రాభవాలు ఆ ప్రభువుల దక్షతమీద, సిద్దహస్తత మీద నిలుస్తాయి.......
ఇది రుద్రమదేవి తాతముత్తాతలనుంచి నిలుపుకున్న మగటిమి.
అయితే గణపతి రుద్రదేవులు, తమసామంతరాజుల విషయంలో ఎంత ఉదారంగా ఉండేవారో, అవసరం వచ్చినప్పుడు అంత కఠోరంగాను వుండేవారు.
తప్పు చేస్తే, వారు ఎవరైనా శిక్షించటానికి ఎన్నడూ వెనుకాడేవారు కాదు.
--------------
గణపతి రుద్రదేవులు అంతిమక్షణాల్లో వున్నారు. మృత్యువు ఆయనను తనవెంట తీసుకు వెళ్ళడానికి అన్ని సంరంభాల్లోనూ సిద్దంగానే వున్నది. ఆయన, మహాభినిష్క్రమణము చెందబోయే వృద్దసింహంలాగా వున్నాడు. శరీరం క్షీణించింది. రాచకార్యాలకు విముఖంగా వున్నారు.
శివదేవయ్యమంత్రులు తీరికలేని పనులతో సతమతమవుతున్నారు. సర్వసేనానులు తమ సైన్యాలతో సిద్దంగా వున్నారు. ఈ క్షణాల్లోనే ఎటు చూసినా , ఎటువైపు నుంచయినా శత్రువులు చుట్టుముట్టుకు రావచ్చు.
ప్రభుభక్తి పరాయణులెంత వున్నారో- శత్రువులు అంతే వున్నారు. నిన్నటివరకు అంతరంగికులూ, ముఖ్యులూ అని అనుకున్న వాళ్ళు కూడా యివ్వాళ కాకతీ సామ్రాజ్యలక్ష్మిని కత్తులతో నరకటానికి సిద్దంగా వున్నారు. రాజ్యం యిప్పుడు కత్తుల వంతెనలాగా, కాలే నిప్పుల కొలిమిలాగా వున్నది. ఇది ఒక అగ్ని పర్వతం..... ఏ క్షణాన పగిలి మానవ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుందో తెలియదు.
ఇంకో ఆలోచన ఏమిటంటే -----
రుద్రమదేవికి రాజ్యంమీద అదివరకంతటి అపారమైన దీక్షలేదు. ఆమె స్త్రీత్వం ఆమెను నిలదీసి ప్రశ్నిస్తున్నది -- ‘ఓ స్త్రీ.. నీవు చక్రవర్తిణివి కావచ్చు, కానీ నీలోని సుఖాలను చంపే హక్కు నీకులేదు. నీవు సామ్రాజ్యానికి రాణివి, కానీ నా మనసుకు కాదు, అని.
అమె నిర్ణయము మంచిదే- కానీ పరిణామాలని మాత్రం చాలా జాగ్రత్తగా గ్రహించవలసి వుంది- ఆమె పధకము నిర్ణయించుకుంది. దానిని మళ్ళించ గలిగేవారు లేరు.
ఆమెకు బాల్యం ఏనాడో దాటిపోయింది. ఆమె ప్రాజ్ఞ...... ప్రాజ్ఞత కలిగిన ఆమెను ఎట్లా మార్చగలరు.
ఇంకా సంతోషించాల్సిన విషయమేమిటంటే,
ఆమెది ఉత్తమమయిన ఎన్నిక.
పరాక్రంలోనూ, ఉన్నతి లోనూ , స్థిరనిర్ణయ విధానంలోనూ చాళుక్య ప్రభువుని మెచ్చుకోవలసిందే. అతడు 'అతనిని' ఆమెను చేశాడు. స్త్రీత్వము నేర్పినాడు. మనస్సు ని తట్టిలేపి రెచ్చగొట్టినాడు. ఈ ఇద్దరి కలయిక అద్భుతమే!
మరో కొత్తవార్త. ! గన్నారెడ్డి ప్రభువు, అన్నమాంబికను అపహరించి తెచ్చినాడట.
ఆమె తనకీ వివాహం యిష్టంలేక అంతఃపురంలో , రుద్రమదేవి సంరక్షణలో వుందట. ఈ చిచ్చరపిడుగు ఇటువంటి పనులనే తెచ్చి పెడతాడు. అయితే, అతను చేసే పనుల వెనుక లోకకళ్యాణం వుంటుంది. ప్రభు భక్త పరాయణతో పాటు, రాజ నీతిజ్ఞత కూడా వుంటుంది.
అసలు గన్నారెడ్డి ఈ మధ్యన మూడు గొప్పపనులు చేశాడు.
మొదటిది: హరిహర మురారి దేవుల మంత్రి రుద్రయ్యను అపహరించి - వారికి ' ముందునడక' చూపించే మార్గాన్ని మూసివేశాడు. శత్రువులు భయంతో చెమటలు కక్కుతున్నారు.
రెండవది: రుద్రమదేవుని తక్కువచేసిన వారి మదం తగ్గించటం దీనిభావం. ఇంకా మా లాంటి వీరులు , ప్రభుభక్త కలిగినవారు కాకతీయసామ్రజ్యంలో వున్నారని రుజువు చెయ్యడం.
అన్నమాంబికను తెచ్చి కోటారెడ్డి దేవరకూ, లకుమయారెడ్డి ప్రభువుకూ మధ్యవున్న సంబంధ భాందవ్యాలను శాశ్వతంగా తెంపివేయటం. నిజానికి ఈ వర్ధమాన పురపు సింహాసనాన్ని పాలించే హక్కు తనకే వున్నదని లకుమయారెడ్డికి తెలియజేసి గుండెలదరగొట్టడం.
ఇటు చాళుక్య వీరభద్ర ప్రభువూ-- రుద్రమదేవి
అటు గన్నారెడ్డి ప్రభువూ -- అన్నమాంబికాదేవి.
ఈ వీరభూమికి వెలలేని విలువైన మణిపూసలవంటి బిడ్డలనివ్వరా! అసలు ఈ అఖండ హిందూ సామ్రజ్యం ఎన్ని తాకిడులను చూడలేదు. ఎన్ని కత్తుల మోతలకు కాణాచి కాలేదు. నిజానికి యింత విశుద్ధ కర్మభూమిలో ఎంత స్వార్ధపరులు జన్మిం
చారు. ఈ భూమిని రుద్రభూమిగా చెయ్యాలనుకున్నారు.
అన్నమాంబిక చేసినది తప్పుకాదని , రుద్రమదేవికి నచ్చచెప్ప వలసిన బాధ్యత కూడా తనదే. ముఖ్యంగా గన్నారెడ్డి మీద వున్న అపప్రధలు తొలగించాలి. హృదయమున్న మనుష్యులు ప్రేమిస్తారు. ప్రేమకు త్యాగాలు చేయించే స్వభావం వుంది.
రుద్రమదేవికి ప్రేమించి ఆరాధించే హక్కు ఎంత వున్నదో, అన్నమాంబిక కు కూడా అంతే వున్నది.
శివదేవయ్యమాత్యులకు ఆలోచనలు ఆగవు. కంటికి నిద్రరాదు. ఇంత తిండి తిని, కన్ను కాసేపు మూసి విశ్రాంతి తీసుకుందామనే లోపే, ఎవరో ఒకరు , ఆంతరంగికులు వస్తారు. అతి ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు.
ఇప్పుడు వచ్చిన వారు-
ప్రసాదిత్యనాయకులు , రేచెర్ల ప్రభుపులు వచ్చి , వారు శివ దేవయ్యమాత్యులకు వినయ పూర్వకమైన నమస్కారం చేశారు.
అపర విశ్వనాధునివలె వున్న ఈ మహా వేదాంత సారునకు, విజ్ఞానఖనికీ, నమస్కరించని దెవ్వరు? ఎంతమంది శివదేవయ్య వంటి రాజనీతిజ్ఞులు ఈ అఖండ హిందూ ఖండమున జన్మించినారు.
శివదేవయ్య: " కూర్చోండి ప్రసాదనాయకా"
ప్రసాదిత్యనాయకులు: " చిత్తము స్వామీ".
శివదేవయ్య: " వచ్చినకారణము".
ప్రసాదిత్యనాయకులు: "యాదవరాజులు తీవ్ర యుద్ధ ప్రయత్నములు చేస్తున్నారు".
శివదేవయ్యమాత్యులు చిరునవ్వుతో.
" ప్రసాద నాయకమణీ! మీర భయపడవలదు. ఇక్కడ అన్నీ ప్రయత్నాలు చేశాము. సేనలు సిద్దంగా వున్నాయి. కాకతీ ప్రభువుల కత్తిదెబ్బల వల్ల ఐన గాయాలు అంత త్వరగా మాను పట్టినవని మేము అనుకోవటం లేదు. దేవగిరి కృష్ణభూపతి నిలువునా యాదవ సైన్యాలను చీల్చి , పేగులను హారాలుగా మెడలో వేసుకొనగల ధీశాలి.
ప్రసాదిత్యనాయకులు: "కృష్ణభూపతి కుమారుడు , దేవరాజు శత్రువులతో మంతనాలు రహస్యంగా చేస్తున్నాడన్న వార్తలు. "
శివదేవయ్య: "వార్తలు కావు నిజాలు. కానీ కృష్ణభూపతి మాట సైన్యాధిపతులు దాటరు. వారి మాటమీద ' వారి'కున్న అపారమైన గౌరవము”
ప్రసాదిత్యనాయకులు: " నాకు అంతా అగమ్యగోచరంగా వుంది".
శివదేవయ్య: " ఇంకా మీకు కొంత తెలియవలెను. ఇక్కడ గోన గన్నారెడ్డి అనే చిచ్చరపిడుగు ఉద్భవించినాడు. అతడు మేధావి. ప్రాజ్ఞుడు. అపజయం అన్నది ఎరుగని వాడు.
రేచర్ల, సతనాటిసీమ, కోటవారు, మాల్యాలవారు,
వారి బావగారు- తదాదులు అతనిమాట జవదాటరు.
అదీగాక అతనికి వీరశ్రేణి అయిన యోధులు చాలామంది వున్నారని, అతని మాటే వేదమని మీకు తెలియవలెను".
ప్రసాదిత్యనాయకులు: "చిత్తము! తెలిసినది. "
శివదేవయ్య: " అదీగాక అతను మెరుపువంటివాడట. ఇక్కడ చూస్తే వుంటాడట. కన్నుమూసి తెరిచేలోగా మరోచోట కనిపిస్తారట. అదే అతని ఘనత".
ప్రసాదిత్యనాయకులు: అదీగాక , మాల్యాల ప్రభువుల దేవేరి కుప్పసానమ్మ గారు, ఆదవోని ప్రభువుల కుమార్తె అన్నమాంబికాదేవి ఓరుగల్లు చేరినారని తెలిసింది. "
శివదేవయ్య:" అదీ నిజమే. వారు ప్రభువులను కలుసుకుంటారు. "
ప్రసాదిత్యనాయకులు: " మరి ఆదవోని ప్రభువులకు , మాల్యాల ప్రభువులకూ యుద్దం జరగక తప్పదు కదా!"
శివదేవయ్య: " కానీ రుద్రప్రభువులు ఈ రాత్రికే కోటారెడ్డి ప్రభువులకు ‘అన్నమాంబిక మా సంరక్షణలో జాగ్రత్తగా వుంది. వీలు చూసుకుని మీ కుమార్తెను ఆదవోని పంపుతాము. మీరు మాకు విశ్వాసపాత్రులు. ముఖ్యులూ’ అని కబురు పంపుతారు. "
ప్రసాదిత్యనాయకులు: ( తలవూపి) " ఎంత అద్భుమైన ఆలోచన" అన్నాడు.
శివదేవయ్య: "తప్పదు కదా! గన్నారెడ్డి రుద్రదేవుడు- రుద్రమదేవి, చక్రవర్తిణి.. అని తెలియజేసి మా భారము చాలా వరకు తగ్గించాడు.
" అతను వార్తలను గాలితోపాటు పంపగల తెంపరి". అని నవ్వినాడు ప్రసాదిత్యనాయకులు.
---------------------------------------
ఇప్పుడు జరుగుతున్న ప్రచ్ఛనకుట్రలకు యింకా తెరతీయటం జరగలేదు. అన్నీ చీకటిమాటు మంతనాలే.
కుట్రలూ, కుతంత్రాల బాటలు ఏర్పడుచున్నవి.
బుల్లి బుల్లి చీకటివీరులు, ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు.
కాకతీ- యాదవ వంశాలకు మొదటినుంచీ చుక్కెదురే.
హరిహరమురారి దేవులు అవకాశం కోసం వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. లకుమయారెడ్డి తెలివి గల దొంగ. అంతా పూర్తి అయ్యేదాకా బైటపడడు. అతనికి కాకతీ సామ్రాజ్యం మీద కన్ను లేకపోలేదు.
అయితే ఈ తెరవెనుక జరిగే కుట్రలన్నింటికి మూలపురుషుడైన జ్ఞాని ఎవరో యింత వరకూ బయట పడలేదు.
అదీగాక " రుద్రమదేవి ఆడది. ఆమె చేతికింద నీళ్ళు తాగి బ్రతకగల రాజులకు మీసాలు లేవా? పురుషత్వము పోయినదా? " అనే మాట పదే పదే పనిగట్టుకుని ప్రచారం జరుగుతున్నది. ఇది వీరులైన రాజులను రెచ్చగొట్టటం.
ఇది ప్రచారం చేసే మనిషి కోసం తీవ్రమైన గాలింపులు జరుగుతూనే వున్నాయి.
అతడు తెస్తున్న పెద్ద విప్లవానికి వెనుక వున్న వొకే వొక వాక్యం. " ఆడది రాజ్యం చేయుటయా".
ఇది ప్రశ్నలాగా కనిపించవచ్చు. కానీ, యిన్ని అనర్థాలకూ ఈ వాక్యమే మూలస్తంభం.
ఈ రెచ్చగొట్టే మనిషికి ఈ కాకతీసామ్రాజ్యం మీద అపారమైన ప్రేమ వున్నది. కాజేయాలని కన్ను వున్నది. జనాన్ని ఇంకా రెచ్చగొట్టక ముందే
' రుద్రమదేవి స్త్రీ ' అని తెలియ జెయ్యాలి.
అదీగాక ఎవరిని నమ్మాలో, నమ్మకూడదో తెలీని విషమపరిస్థితి వొకటి వుంది. విశ్వాస పాత్రులు ఆఖరికి ఎంతమంది తేలుతారు?
ఆఖరికి, ఈ సామ్రాజ్యం మీద రుద్రమదేవి ఏకైక చెల్లెలు గణపాంబాదేవి భర్త భేతరాజు ప్రభువులకూ వాంఛ వుంది. మరి ఎవరిని చేరదీయాలీ? ఎవరిని దూరం చేయాలీ?
ఈ సామ్రాజ్యలక్ష్మి శాంతి సౌఖ్యాలతో , పాడిపంటలతో , పచ్చగా సుభిక్షంగా బ్రతుకుతున్నది. ఆమె గతి ఈ దుర్మార్గుల చేతిలో పడి ఏమి కానున్నది?
శివదేవయ్యలాంటి మేధావి, ప్రతిక్షణము ఎంత నిబ్బరంగా ఆలోచిస్తున్నారు. లోకులకు తెలీని మరో రహస్యం ఏమిటంటే , శివదేవయ్య గారి ఆధీనం లో వూరూరా తిరిగి వార్తలు సేకరించే వేగులు వున్నారన్నది. అది ఆఖరికి రుద్రమదేవికే తెలీదు. తనకు తెలీని చాలా విషయాలు శివదేవయ్యా మాత్యులకు తెలుసునని ఆమె ఆశ్చర్యపోతూ వుంటుంది.
శివదేవయ్యామాత్యుల వేగులు-
పెళ్ళి పండితులు,
బిచ్చగాళ్ళు,
పాదచారులు..
ఇట్లా రకరకాలుగా వుంటారు. వార్తలు వింటూ వుంటారు. మంత్రులకూ తెలుస్తూ వుంటాయి.
అదీగాక దేశం నలుమూలలా, గుర్రాలమీద నుంచి వార్తలు తక్షణం రాజధాని నగరం చేరుతూ వుంటాయి. ఈ వేగులు చిచ్చరపిడుగులు. యుద్దతంత్ర విద్యలో అఖండులు.
నిర్దయగా శిరస్సును ఖండింగల రక్షకులు.
ఇన్ని కట్టుదిట్టాలు వుండబట్టే ఆంధ్ర
సామ్రాజ్యలక్ష్మి యింత నిర్భయంగా, ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నది.
అధర్మం క్షణాల్లో నిర్మూలమై పోతూ వుంటుంది.
శివదేవయ్య నమ్మిన ముఖ్యవేగులవారు యిద్దరు ముగ్గురిలో 'సోమనాధాచార్యులు' వొకరు. వారు వచ్చి వున్నారన్న వార్త.
సోమనాధాచార్యులు: "మహామాత్యా!"
శివదేవయ్య: "సోమనాధాచార్యా. ఏమిటి కబుర్లు".
సోమనాధాచార్యులు: "నానాటికి కుట్రదారులు పెరుగుతున్నారు".
శివదేవయ్య: " వింటున్నాము".
సోమనాధాచార్యులు: " రుద్రదేవప్రభువులు ఇప్పుడో, యింకాసేపో అనేట్టు వున్నారట".
శివదేవయ్య: "ఆ ".
సోమనాధాచార్యులు: "మనకు ముఖ్యలైన వంశాలవారు సతాయిస్తున్నారు".
శివదేవయ్య: " ఔను. ఈ ధాత్రి విశ్వాసపాత్రులను అతి తక్కువ, విశ్వాసహీనులను ఎక్కువగా కన్నది. అదే జరుగుతున్న తప్పు. "
సోమనాధాచార్యులు: " నిజమే మహామంత్రీ, అక్షరలక్షలు జేసే సత్యము చెప్పినారుట.
శివదేవయ్య: " సోమనాధా! వేగులకు అందరూ అనుకునే వార్తలు తెలియటం ముఖ్యంకాదు.
తెలియవలసినది ఈ కుట్ర వెనుక వున్న కీలక- ముఖ్య- ప్రచ్చన్న హస్తమెవరిది?
సోమనాధాచార్యులు: " దానిమీదే నేను కేంద్రీకరించియున్నాను".
శివదేవయ్య: " కాకతీసామ్రాజ్యస్థిరజీవనము , ఆ వార్తపైన ఆధారపడియున్నది".
సోమనాధాచార్యులు: " ఆ వార్త తెచ్చిన తరువాతనే నేను ప్రాణములతో మీకు కనిపిస్తాను".
శివదేవయ్య: " అవశ్యము. ఇది కీర్తి ప్రతిష్టలకు అగ్నిపరీక్ష
--------------------------------------
ఇంకా వుంది...
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
Comments