top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 12

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Kakathi Rudrama Episode 12' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము




గత ఎపిసోడ్ లో…

చాళుక్య వీరభద్రుడు, రుద్రమ దేవి ఉద్యానవనం లో కలుస్తారు.

వారి కలయిక చూసిన శివదేవయ్య సంతోషిస్తాడు.

ఇక చదవండి..

తెల్లారింది.

తూర్పు మబ్బు రాగరంజితమైంది.

రుద్రదేవుడికి రాత్రంతా నిద్రలేదు.

ఎడతెగని ఆలోచనలు.


శత్రువులు దుమకటానికి సిద్దంగా వున్నారు.

ఇటు చూస్తే కాకతీయ సామ్రజ్యం కత్తుల వంతెనవలె వున్నది.

శత్రువులు యెంతమంది వున్నారో, కొమ్ముకాసే మిత్రులూ అంతే వున్నారు.

గన్నారెడ్డి వార్తలు తెలియరావటం లేదు.


లకుమయారెడ్డి - యాదవరాజులతోనూ, హరిహర మురారి దేవులతోనూ, కళింగులతోనూ ఈ సామ్రాజ్యలక్ష్మి ని చేపట్టాలనే పాచికలు వేస్తున్నాడనేది వేగులు తెచ్చిన వార్తలు.

అయితే మురారిదేవుల మహామంత్రి రుద్రయ్యను గోన గన్నారెడ్డి బంధించినాడనీ- అతను యింకా బంధీగానే ఉన్నాడని మరొక్క నిర్దారితమైన కబురు.


గన్నారెడ్డికి తమమీద వున్న అపారమైన ప్రేమకు, ప్రభుభక్తికి యిది మరొక మచ్చు తునక. ఉదాహరణ. అదీగాక, అన్నమాంబిక ను వలచినవాడు, నిండు మనసుతో

ప్రేమను పంచుకున్నవాడు.


చాటుమాటున తమకు సహాయం చేస్తున్నాడు కానీ, తమ సహాయాన్ని అతనెన్నడు ఆశించలేదు. అతడు వీరుడు. మెరుపు యుద్దతంత్రంలో దిట్ట. శత్రువును నిర్జించుటలో సిద్ధహస్తుడు. ఏమైనా అతడు మహావీరుడైన బుద్దారెడ్డి కుమారుడు కదా!

"వెనువెంటనే ప్రభువులను చూడాలని, గొంకప్రభువు పంపిన వార్త"

"వెంటనే ప్రవేశపెట్టు" అన్నారు రుద్రప్రభువులు.


వేగుల ముఖ్యనాయకుడు గొంక ప్రభువు లోపలికి ప్రవేశించి-

"శ్రీశ్రీశ్రీ కాకతీయ రుద్రప్రభువులకు విజయము" అన్నాడు.

రుద్ర దేవుడు: "తెచ్చిన వార్త ఏమిటి?"


గొంక ప్రభువు: " గోనగన్నయ్య వీరత్వ విజృంభణమును గురించి మనవి చేయవలెను".

రుద్ర దేవుడు: "ఆవశ్యము".


గొంక ప్రభువు: "ఆదవోని ప్రభువుల నీడన బ్రతికే, కోసగినగర ప్రభువు, మైలవ నాయకుడు, తుంగభద్రారణ్య భయంకర ప్రాంతాల్లోవున్న గోనగన్నారెడ్డి ని, నిన్న తాకినారు.


అప్పటికే గన్నయ్య మూడురకాల వ్యూహాలతో తుంగభద్రారణ్య ప్రాంతాల్లో, తన సైనికులతో పొంచి యున్నాడు. - ఈ వార్త విని మైలవనాయుడు -


‘మూడు వైపులా గన్నారెడ్డిని ముట్టడించండి’ అన్నాడు. జైత్రయాత్ర సందర్భముగా సంరంభముతో, వాయిద్యాలతో, డప్పుల మోతలతో, భీకర వికటాట్టహాసములతో, సైన్యాలు, గుర్రాలు, ఏనుగులు, గొప్ప సంరంభంతో కదిలాయి. తుంగభద్రా తీరంలో గన్నయ్య సైన్యాలు తమకి ఎదురు పడుతాయని నమ్మకము".


రుద్ర దేవుడు: "ఆ తరువాత --"


గొంక ప్రభువు: "నిమ్మకు నీరెత్తినట్టు, నిర్భయంగా, ధీరోధాత్తంగా గన్నారెడ్డి సైన్యాలు కదిలినాయి. ఇంతలో అరణ్యానికి నిప్పంటుకున్నట్టు, నాలుగువైపులా నుంచీ సర్రున విషబాణాలు, మైలపనాయకుని సైన్యాలను, గుర్రాలనూ, ఏనుగులనూ తాకాయి. గుర్రాలు బెదిరి పరుగులు తీసాయి. ఏనుగులు భయంతో తమ సైనికులనే ఎడాపెడా తొక్కటం మొదలు పెట్టాయి.


సైన్యం హాహాకారాలు, అరణ్యం దాటిపోవటానికి వీల్లేని గన్నారెడ్డి యుద్దవ్యూహం. కేకలు, భయాలు. శత్రువులు తలలు సర్రుసర్రు నతెగుతున్నాయి. ఈ అరణ్యంలో ఎటు

నుంచి శత్రువు వస్తున్నాడో, తమను నరుకుతున్నాడో తెలియని అయోమయ స్థితి.

ముందుకు పోలేరు.


వెనక్కి రాలేరు.

చస్‌... చస్‌... బాణాల రివ్వు రివ్వు మోతలు.

ఎటు చూసినా అంపశయ్యలే. బాణాలతూట్లే.

సైనికులు మైలవనాయకుని తిట్టి పోశారు. కొన్ని సార్లు యెదురు తిరిగారు.

మైలవనాయకుడి వళ్ళు బాణాల దెబ్బలతో తూట్లుపడింది. దెబ్బ . దెబ్బ మీద దెబ్బ............

నేల కూలాడు---

గన్నారెడ్డి, కళ్ళు మూతలుపడుతున్న మైలవనాయకుని ముందు గంభీర విగ్రహం వలె నిలబడి--


" స్వార్థపరులు, ద్రోహులు అయిన వారికి కాలము విధించిన శిక్ష. నీ చావు, ప్రభువుని నిర్జించాలనే మూర్ఖులకు రేపటి గుణపాఠం. ఇది ప్రభుభక్త పరాయణుని విజయం” అన్నాడు.


ఆ తర్వాత గన్నారెడ్డి తొడగొట్టి వికటాట్టహాసం చేశాడు.

ఆ నవ్వు అరణ్యమంతా ప్రతిద్వనించింది.

అతని చేతి కంకణాలు ఖణేలుమన్నాయి.

అతనిని బంధించవలెనని వచ్చిన సైన్యంలో మూడోవంతు మంది హతమయ్యారు.


"ఇది దారుణం" అన్నాడు రుద్రదేవుడు.


" ప్రభూ!” అన్నాడు గొంక ప్రభువు.


రుద్రదేవుడు: "అతడు చేసిన పని మంచిదే కావచ్చును..

(క్షణం విరామం)

"కానీ మాకు తెలియకుండా, అన్ని బాధ్యతలు భుజంమీదకి తీసుకోగల హక్కు అతనికి ఎవరు ప్రసాదించారు? ఇది క్రూరము కదా!"


గొంక ప్రభువు: నిజమే


రుద్రదేవుడు: అతని విచ్చలవిడితనాన్ని నిర్మూలిస్తాము".


గొంక ప్రభువు: "ఆ పని మనము చేయనక్కర లేదు ప్రభూ!.... అతని చుట్టూ శత్రువులే- ముఖ్యముగా, లకుమయారెడ్డి, కోటారెడ్డి, లకుమయారెడ్డికి ముఖ్యులయిన హరిహర మురారి దేవులు


రుద్రదేవుడు: నిజమే. కానీ అతని మీద యింకా చాలా పితూరీలు వస్తున్నవి. అతను చేసే ఈ దుడుకు పనుల వలన మనము అతనిని అణచక, నిర్భీతిగా వదిలేస్తున్నామని, యిది మన అప్రయోజకత అని ప్రజలు నమ్మరా? అదీగాక, అతగాడు యిటీవల మార్కాపురం ప్రభువులైన సోమనాథున్ని సంహరించాడట.


గొంక ప్రభువు: ఆ వార్త మాకూ తెలిసినది

క్షణం విరామము.

రుద్రదేవుడు: "మా తండ్రిగారికి, గన్నారెడ్డి మీద అచంచలమైన ప్రేమ, విశ్వాసము. అది మాకూ లేకపోలేదు. కాని, భరించలేని, అంతులేని దురాగతము. అసలు వర్ధమాన పురపు లకుమయారెడ్డి, తను పాలించవలసిన రాజ్యమును దుర్భుద్దితో అపహరించా

డనే ఖేదం వుంది. అందుచేతనే, ఆ పీటలమీద పెళ్ళి చెడగొట్టాడు. మరి సోమనాధప్రభువును సంహరించాల్సిన అవసరం యేమి వచ్చింది?


గొంక ప్రభువు: లకుమయారెడ్డి ముందు పీటలమీద పెళ్ళి చెడిపోయిందని, వర్ధమాన ప్రభువులు ఆదవోని ప్రభువులూ ఖేదంతో చీకాకులు పడుతూ వుంటే, సోమనాధ

ప్రభువు కలగజేసుకుని, ‘పిరికిపంద, బజారుదొంగ ఐన గన్నారెడ్డి తలను తెగనరికి ప్రభువుల పాదాలమీద, అనగా లకుమయారెడ్డి ప్రభువుల పాదాలమీద పడవేస్తా’నని ప్రమాణం చేశాడట.


రుద్రదేవుడు: ఆ అదే విన్నాము.


గొంక ప్రభువు: దానికి పరిహారమే సోమనాధప్రభువు హత్య.


రుద్రదేవుడు: ఔను.


గొంక ప్రభువు: అదీగాక, అతనికి వేలాదిమంది సుశిక్షిత సైన్యమున్నదట- మేలి జాతి గుర్రాలున్నాయట. మెరుపు వేగంతో పోగల అశ్వికులట. దోచుకున్న అపారమైన ధనసంపదలట. అరణ్యంలోనే పెద్దభవనములు నిర్మించినాడట. అతడొక చిన్న చక్రవర్తులట.


రుద్రదేవుడు: అసలు సోమనాధప్రభుని హత్య జరిగినదెట్లు?


గొంక ప్రభువు: ప్రతిజ్ఞచేసిన సోమనాధుడు తన సైన్యంతో వెళుతుంటే, గన్నారెడ్డి తమ్ముడు విఠల్‌ రెడ్డి, ఖడ్గ చాలనంలో చాలా ప్రసిద్దమైన పేరున్న సూరారెడ్డి, మార్గమధ్యం లోనే సోమనాధుడికి తారసపడ్డారట.


మాటాపలుకు లేక, ఉప్పెన వలె పొంగి, సోమనాధుని సైన్యాలపై విరుచుకుపడ్డారట. ఆ దెబ్బకు తాళలేక, సోమనాధుడు దైర్యముంటే తనతో కత్తితో ద్వందయుద్దము చేయమని సవాలు చేశాడట.


రుద్రదేవుడు: ఆ తరువాత?


గొంక ప్రభువు: ఇంతలో గన్నారెడ్డి ఛెంగున గుర్రంమీద ఎదురు ప్రత్యక్షమై అపరరుద్రునివలె దూకి


‘కృతఘ్నుడైన లకుమయారెడ్డి పాదాలమీద వొంగిన పిరికిపందా, అతగాడి పాదాలమీద నా తల తెగనరికి పడదోస్తానన్నావట- నీవు కోరిన విధంగానే ద్వందయుద్దం చేద్దాము రా’ అని ఆహ్వానించాడు-


రుద్రదేవుడు: సరే--


గొంక ప్రభువు: గన్నారెడ్డి పకపకా నవ్వి


‘దేశ దేశాల ఖడ్గచాలనంలో, అపూర్వమైన కీర్తిప్రతిష్టలు కలిగిన వీరుడా. నీవు గజదొంగతో పోరాడబోతున్నావు. అణువణువునా పౌరుషం మూర్తీభవించిన, బుద్దారెడ్డి కుమారుడు గన్నారెడ్డితో యుద్దం చేయబోతున్నావు. శహబాష్‌..... ఒక్కందుకు నిన్ను మెచ్చుకోవాలి. ఒంటరిగా నన్ను ద్వంద యుద్దానికి ఆహ్వానించినందుకు. సరే ..... సిద్దంకా’ అన్నాడట . ప్రభూ... ఉప్పల సోమనాధుని ఖడ్గ విద్యగురించి, ప్రతిరాజ్యం లోనూ, ప్రభువులు కథలు కథలు గా చెప్పుకుంటారు.....

అయితే యిద్దరూ ఆరడుగుల పొడగరులు.

అంతే ఎత్తు, బరువు, తీక్షణత.

సోమనాధుడు మెరుపులా దూకి, గన్నారెడ్డి వక్షాన్ని కత్తితో చీల్చబోయినాడు. కత్తి తగిలితే శరీరము రెండుగా చీలికలయ్యేదే. కత్తి మొనకి గన్నయ్య వక్షమునకు వెంట్రుకవాసి దూరము.

అతగాడు ఎట్లాతప్పుకున్నాడో!

తప్పుకుని మరొక్కసారి నవ్వి..

‘కృతఘ్నుడా---- అన్నం పెట్టిన చేతిని నరికేవాడా.

లకుమయారెడ్డి పెంపుడుకుక్కా..

యాదవ, కళింగ ప్రభువుల చేతికూడు తింటూ బ్రతుకుతున్న తెంపరీ.....


ఇదేనా, నానా రాజ్యాలు ఘనతతో చెప్పుకుంటున్న నీ కత్తి విద్యప్రావీణ్యత ?

రుద్రమదేవి చేతికూడు నీకు చేదయ్యిందా? ఇంతకాలము నీవు కాకతీయప్రభువుల నీడలో బ్రతకలేదా? ఆ ఉప్పుకారమే కాదా నీవు తిన్నది.. బెల్లం చేదయ్యిందా?’

అంటూ వివిధ భంగిమలతో యుద్దం చేశాడట.

అదే చెరగని చిరునవ్వట.

వీరులకు వళ్ళు జలదరించిందట.

శభాష్‌!

భళాభళీ!

ఔరా!

అనే కేకలట. విజయద్వనులంట.


ఉప్పలసోముడు తడిసిపోయినాడట. - ఇద్దరి కత్తులూ నిప్పులు రాలుస్తున్నాయట.

ఆ తర్వాత వంగి, తలపైకెత్తిన సోమప్రభువు శిరస్సు కత్తితో ‘ఝస్‌’ యని నరికినాడట. - గన్నారెడ్డి కత్తిదెబ్బ తిన్న సోముని తల యింత ఎత్తున ఎగిరి దబ్బున పడి పోయిందట.


రుద్రదేవుడు: ఎంత అధోగతి చావు సోమునిది.


గొంక ప్రభువు: అంతేగాక, ‘వీరుడైన గన్నారెడ్డి చేతిలో చావు ఎంత అదృష్టము’ అని వీరులు అనుకున్నారట.


రుద్రదేవుడు: ఆ.


గొంక ప్రభువు: ప్రభూ! అతడికి మీ రన్నా, రాజ్యమన్నా ఎక్కువ మక్కువ.


రుద్రదేవుడు: నిజమే. కానీ అతనిని హద్దులలో వుంచ వలెను.


గొంక ప్రభువు: చిత్తము-----.


రుద్రదేవుడు: అతని వార్తలు మాకు వెనువెంటనే తెలియవలెను.


గొంక ప్రభువు: తప్పక ప్రభూ.

--------------------------------------------

రుద్రమదేవిని స్త్రీగా చూసినవారు, ఖచ్చితంగా పొరబడినట్లే. ఎందుకంటే, అంతటి వీరాదివీరులైన వారెవ్వరూ కాకతీయసామ్రాజ్యంలో కనబడటం లేదు.


‘స్త్రీలు రాజ్యార్హత లేనివారు’ అనేమాట పిచ్చిమాట అని, రుద్రమదేవి పౌరుషం తెలిసిన వారు అనుకుంటూ వుంటారు.


యుద్దతంత్రంలో గానీ,

రాజకీయ చతురత లో గానీ,

స్థిరనిర్ణయంలో గానీ,

గంభీర వచన విన్యాసంలో గానీ


ఆమె సాటిరాగల మేటిపురుషులు అరుదు. కేవలము స్త్రీ అను భావనతో చూడటం తప్పు. ఆమె ఎందులోనూ తక్కువకాదు.


ఆమె స్త్రీ ఐతేనేమీ, ఒక మగవానికి భార్య ఐతేనేమీ.


ఆమె క్షాత్రం రంగరించి, ఉగ్గుపాలతో పోసి, వీరత్వాన్ని తన పురిటి సమయముననే పిల్లలకు నేర్పించదా? పదునుమీద నడిపించగల వీరకిశోరమును ఈ జాతికి అందించదా:


అటువంటి తల్లులు ఎంతమంది ఉద్భవించగలరు?

ఇంకా వుంది...

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


82 views0 comments

Comments


bottom of page