top of page

కాకతి రుద్రమ ఎపిసోడ్ 15

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Kakathi Rudrama Episode 15' New Telugu Web Series


Written By Ayyala Somayajula Subrahmanyam


రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము




అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారు రచించిన ధారావాహిక కాకతి రుద్రమ

15 వ భాగం


గత ఎపిసోడ్ లో…

నిండు సభలో మహామాత్యులు శివదేవయ్య రుద్రమ దేవి స్త్రీ అనీ, ఆమెకు ముందులా సహకారం అందించాలనీ కోరుతాడు. ముమ్ముడాంబిక కి తాను స్త్రీనని చెబుతుంది రుద్రమ దేవి.

ఇక చదవండి..

శివదేవయ్యలు యిప్పటినుంచి కాదు. ఎప్పటినుంచో గన్నారెడ్డిని రాజభక్తిగల వీరుడుగా గ్రహించ గలిగారు. ఆ మాత్రమన్నా ఆకళింపు చేసుకొనలేక పోయినట్లయితే ఈ అఖండ కాకతీ సామ్రాజ్యమునకు మహామాత్యు లెట్లు కాగలరు. గోనబుద్దారెడ్డి ప్రభువుల దగ్గరనుంచి వీక్షించినట్లయితే, ప్రభుభక్తికి వారు పెట్టని కోటలని జగద్విదితమైన విషయమే.

తనకి అన్యాయం జరిగిందని గన్నారెడ్డి సోదరులు కృంగిపోలేదు.గణపతి రుద్రదేవులతో, తమ రాజ్యం తమకిప్పించమని యాచించలేదు. పట్టుమని పాతికేళ్ళయినా నిండకుండానే అరణ్యాల్లో చేరారు. కొండలను పిండి చేయగల వీరులను సేకరించారు. ఖడ్గచాలనం నేర్పాడు. ద్వంద యుద్దము నేర్పారు. మల్లవిద్యలో ప్రవీణులు గావించారు.

విలువిద్యలో శబ్ధభేరుల్ని చేసి శరపరంపరలతో వళ్ళు తూట్లు గొట్టగల నేర్పరులను చేశారు. గదావిద్యలో నేర్పులను చేశారు. ఇక వారి గుర్రపు స్వారి అనన్య సామాన్యమట. కన్ను తెరిస్తే కనిపించే గుర్రం, కన్ను మూస్తే కనిపించదట.

తమ్ముడు అన్నకు తగినవాడు. అన్న ' ఆ' అంటే చాలు, తమ్ముడు ' సై' అంటాడు. సూరారెడ్డి, వీరారెడ్డి, ఎలమరెడ్డి, దామరెడ్డి అందరూ అందరే నట. సింహపు కూనలట.

అతగాడు నాలుగేళ్ళనాడు ఇరవై వొక్క సంవత్సరమన్నా రాని పాలుగారే వయస్సులో కాకతి ప్రభువులకే కమ్మ పంపగలిగిన ధీరుడు. అందులో

‘కాకతీ రాజ్యక్షేమం కోసం మేము దొంగలమై అరణ్యాల్లో మంచికి మంచి- చెడుకు

చెడు. ఊళ్ళేలినా, అరణ్యాల్లో వున్నా ప్రభుభక్తి మా ఊపిరి' అని.

కాకతి రాజ్యమంతా ఈ వార్తను గురించే గుసగుసలు. బుద్దారెడ్డి ప్రభువుల కుమారుడు, తుంగభద్రానదీ తీరమున ఘోరఅరణ్యాల్లో దొంగలవలె జీవించాలని నిశ్చయించుకున్నారట.

మరి ఎటువంటి క్షాత్రవ వీరులున్నారు గన్నారెడ్డి వెనక..

ఒక్క వంశం వారని కాక, అన్నిరకాల వారిని సేకరించాడు. ఎంతటి ఘనత అది. ఒక్క దొంగ వెనక రాజకుమారులు చేరటం.

రేచర్లవారూ, మాల్యాలవారు ఎంతటి దిట్టలు. వారి పుత్రులు- మనమలు కూడా అందులో చేరినారట. అది చిచ్చరపిడుగుల విహారస్థలమట. వీరవతంసుల అడవి.

అయితే అరణ్యంలో నిర్మించబడిన ఈ కోట ఎక్కడుంది? ఒకానొకనాటి శాతవాహనుల ప్రభువులది. వారు నల్లమల అడవుల్లో దుర్భేద్యమైన కోటను నిర్మించారు. కాలం అవిచ్ఛిన్నమైనది. అది శాతవాహన సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేసింది. రాజులు పోయారు. రాజ్యాలు పోయాయి.

ఈ కోటను ఒక సుందరనగరంగా తీర్చిదిద్ద వచ్చని పసిగట్టాడు. ఈ కొండలు, అడవి తమకు రక్షణగా భావించాడు. ఈ కోటను చుట్టూ భయంకరమైన అడవి. వృక్షాలు తమ కొమ్మల ఆకులనీడల్లో కప్పి చల్లగా వుంచుతాయి. ఈ దారిలోకి రావాలంటే లోతైన లోయల్లోకి దిగాలి. వచ్చినా, పోయినా ఈ దారి వెంటే రావాలీ, పోవాలీ. ఎక్కణ్ణుంచి శత్రువులు వస్తారు.

ఒకవేళ వస్తే, ఎత్తయిన కొండలమీద నుంచి రాళ్ళు దొర్లుతాయి. చెట్లకొమ్మల మీంచి విషపు బాణాలు రయ్యి రయ్యిమని తగులుతాయి. గుండెలను పగల గొడుతాయి. అగమ్య గోచరమైన మార్గాల్లో శత్రువులు బెంబేలెత్తిపోతారు.

కోట చుట్టూ కొండలు, కొండపై తట్టునుంచి ఎల్లకాలము జీవనగంగ లాగా, స్వచ్ఛమైన నీళ్ళతో ప్రవహించే సెలయేరు, అన్ని కాలాల్లోనూ విస్తారంగా ఫళ్ళూ, ఫలాలను యిచ్చేచెట్లు, చిన్నచిన్న వుద్యాన వనములు, వీరులు నివసించే పెద్ద పెద్ద విడిది యిళ్ళూ, అశ్వశాలలూ అన్నీ వున్నాయట. ప్రతిరోజు వీరులు కసరత్తు చెయ్యాలట.

పోతే వేగులు; అంతగా వార్తలను పసిగట్ట వేగులు అరుదట. లోకులు అనుకుంటూ వుంటారు.

అదృష్టవంతుడైన గన్నారెడ్డి, శాతవాహన ప్రభువులు పాతరవేసి వుంచిన నిధి నిక్షేపాలు దొరికాయట. అరణ్యం చుట్టుప్రక్కల వున్న పేదరైతులకు అతడు దేవుడట. చెంచులూ, ఉప్పరివాళ్ళు, పాముల వాళ్ళూ, బోయలూ, భిల్లులూ శత్రువుల వార్తలను చిటికల్లో గన్నారెడ్డి ప్రభువులకు అందిస్తారట.

అసలు ఈ దుర్గం ఎక్కడుందో ఎవ్వరికీ తెలీదట. చెట్లవృక్షాల క్రింద దాక్కున్న ఈ కోట ఎవ్వరికి తెలుస్తుంది.

చిత్రమేమిటంటే గన్నారెడ్డి ప్రభువుక్కూడా కప్పం కట్టే సామంతులున్నారట.ఇప్పుడు గన్నారెడ్డి చిన్నరాజ్యమునకు రాజే. అతనికి యీనాడు అంగబలమున్నది.అర్దబలమున్నది. ఎవరిని కొట్టవలెనో తెలుసు. ఎవరికి పెట్టవలెనో తెలుసు. ఇదే అతని ప్రాజ్ఞత.

ఒకానొకనాడు పాడుబడి శిధిలావస్థలో వుండి, క్రమేణా ప్రాభవలక్ష్మి అంతరించిన శాతవాహనుల ఆత్మ శాంతి కోసమా అన్నట్లు దీపాలు వెలిగినాయి. హార్మ్యాలు బాగుపడినాయి. పురాతన వైభవాలు నిలబడుతున్నాయి. ఏ చక్రవర్తులు యీ భవనంలో బంగారు ఊయలలు ఊగారో!

ఏ రమణీ లలామలు యిక్కడ కాలి అందెల రవళుల సవ్వడితో తిరిగారో! కాలము ఎంత విచిత్రమైనది.

--------------------------------------

ఇప్పుడు ఆంతరంగిక మందిరములో-

రుద్రమదేవి, శివదేవయ్యామాత్యులూ కూర్చుని వున్నారు.

వారు గాఢమైన ఆలోచనలతో వున్నారు.

రుద్రమదేవి: "బాబయ్యగారూ, మీతో ఒక ముఖ్యమైన విషయము చర్చించవలెను".

శివదేవయ్య: "నా దగ్గర ఈ బంగారు తల్లికి దాపరికమా. చెప్పమ్మా".


రుద్రమదేవి: "ఇన్నిరోజులు అన్నమాంబికను మన యింట వుంచుట ధర్మమా?


ఆయన నవ్వి -"నీ కేల సందేహము వచ్చినది".


రుద్రమదేవి: "లోకులు నానా విధములుగా అనుకోరా?


శివదేవయ్య: "అనుకోనీ"


రుద్రమదేవి: "మనము ఒక లేఖ వ్రాసి పంపిన బావుండును గదా".


శివదేవయ్య: "నిజమేననుకో- కానీ లకుమయారెడ్డి యిక్కడికి రావచ్చును".


రుద్రమదేవి: అతడు ప్రస్తుతము మన శత్రువు కదా"!


శివదేవయ్య: "శత్రువును పట్టి బంధించి తేవలెను గదా!"


రుద్రమదేవి: "ఎవరు ఈ పని చేయగలరు!'


శివదేవయ్య: "మన గోనగన్నారెడ్డి".


రుద్రమదేవి: "అతని దగ్గర అంతటి సైన్యమేది?"


శివదేవయ్య: "అంత సైన్యము లేకపోవచ్చును గానీ, అతను బుద్ది బలము అపారము. అతడే చాకచక్యముతో ఈ పనిని నిర్వర్తించగలడు".


రుద్రమదేవి: "మనము లేఖ పంపునది ఆదవోని కదా!


శివదేవయ్య: "అన్నమాంబిక వెళ్ళినచో మరల కళ్యాణపు తంతు మొదలు. లకుమయారెడ్డి పట్టు

బడుటెట్లు? అదీగాక అన్నమాంబిక వెళ్ళుటకు సిద్దముగా నున్నదా!"


రుద్రమదేవి: "నేను అడగలేదు."


శివదేవయ్య: "మంచి పని చేసితివి."


రుద్రమదేవి: "బాబయ్యగారూ!"


శివదేవయ్య: "ఆమె విషము తాగి మరణించవలెనని కోరికగా నున్నచో, ఆమెన కోటారెడ్డి ప్రభువు దగ్గరకు పంపవలెను. ప్రస్తుతము ఆమె నీబహిఃప్రాణము. ఆమెను నీవు వూరడించుచున్నది. ముమ్ముడాంబను దుఃఖమునుంచి మరిపించినది ఆమె కాదా."


రుద్రమదేవి: "ఔను". క్షణము విరామము.

"బాబయ్య గారూ! నాకు గన్నారెడ్డిని తలచుకున్నచో ఆశ్చర్యము కలుగుచున్నది".


శివదేవయ్య: నిజమే!


రుద్రమదేవి: అంత తక్కువ సైన్యముతో అతడు లకుమయారెడ్డిని ఎట్లు బంధించగలడు?

అతని ధైర్యమేమి?


శివదేవయ్య: క్షాత్రము. అతని మార్గములు అతనికున్నవి.


రుద్రమదేవి: అతని కోట ముట్టడించినచో.


శివదేవయ్య: ‘అతనికి కోట ఎక్కడున్నది?’ అని పక పక నవ్వినాడు.


రుద్రమదేవి: ఐన అతనికి కోట లేదా.


శివదేవయ్య: ఎవరు చూసినారమ్మా, కీకారణ్యము... ఎత్తయిన కొండలు... చుట్టు ఏపుగా పెరిగిన

అడవి వృక్షములు పచ్చని చోటు ఎవరికీ తెలియదు.. !


అదీగాక ఆ చిన్న రాజ్యములో సైనికులు తల్లిదండ్రులతో - భార్యాపిల్లలతో నివసించుచున్నారు. వారి జీవితము నిర్భయముగా, ప్రశాంతంగా వున్నదట. గుర్రపు బళ్ళపై తినుబండారములు, వెచ్చములు సర్వము వచ్చునట. అంతయూ ఉచితమేనట. అక్కడ ప్రభువు లేడు. సైనికులు లేరు. ప్రతిరోజు పెళ్ళిపందిరి వలెనె కలిసిమెలిసి భోజనములట."


రుద్రమదేవి: "ఆశ్చర్యముగా నున్నది."


శివదేవయ్య: "నా దగ్గర శిష్యరికము చేసి - నన్ను సైతం ఆశ్చర్యపరచగల మహామేధావీ. ' చిన

అక్కినమంత్రి' ప్రస్తుతము గన్నారెడ్డి ప్రభువుల మహామాత్యులు.


రుద్రమదేవి: మరి, వేగుల ముఖ్యుడెవరు?"


శివదేవయ్య: "సుబ్బప్పనాయకుడు అతడి వెయ్యని వేషము లేదు. పక్కవారు సైతము అతనిని

పోల్చుకోలేరు.


రుద్రమదేవి: ఔను మేమునూ వినియుంటిమి. మరి గన్నారెడ్డి, వరదారెడ్డిని తమ నివాసమునకు ఎత్తుకొని పోయినాడు కదా! మార్గము తెలియదా!


శివదేవయ్య: కొంత వరకు తెలుసు.


రుద్రమదేవి: కొండలు ఎక్కి గ్రహించవచ్చును గదా! అచ్చట కోట వున్నదని-


శివదేవయ్య: అది చాలా కష్టము చిట్టితల్లీ. నీవు గన్నారెడ్డిని గురించి భయపడవలసిన పనిలేదు

లకుమయారెడ్డిని వీధిన వేయుటకూ, బంధీచుటకూ- అన్నమాంబికను తెచ్చి, తనపై శత్రువు దూకుటకు సిద్దము చేసిన మహా తెలివిగలవాడు.


రుద్రమదేవి: మరి సైన్యం, అడవి చుట్టూ విడిది చేసిందని విన్నాము.


శివదేవయ్య: ఔను.


రుద్రమదేవి: లకుమయారెడ్డి మార్గాలన్నీ మూసివేస్తే!


శివదేవయ్య: దానికీ మార్గం ఆలోచించాడా గడసరి గజదొంగ. అదీగాక, యిప్పటికే వర్దమాన పురపు సైన్యం అడవి చుట్టూ కాపలా వున్నదట. పొగరాకుండా వంట చేయుదురట. దుర్గ రహస్యం, వందలాది వేగులు వెదుకుతున్నా దొరకటం లేదట. అంగుళమంగుళము గాలించి, హతాశులై పోతున్నారట.


రుద్రమదేవి: అహ


శివదేవయ్య: లకుమయారెడ్డి అంతులేని సైన్యంతో శ్రీశైలం దగ్గర వున్నారట. ఏక్షణాన్నయినా వారు సైన్యంతో వురుకెత్తి రావచ్చును. ఇప్పటికే గన్నారెడ్డి సైన్యం వీరి మార్గాలను తప్పించింది. లకుమయారెడ్డి సైన్యం దోవ తప్పుతున్నట్టు వినికిడి. గన్నారెడ్డి ఒక సైనిక దళంతో - విఠలరెడ్డి మరొకదళంతో -మరొకదళం సుబ్బారెడ్డి, యింకొంతమంది వీరులతో బాల్‌రెడ్డి - అరణ్యమార్గం నుంచి తప్పుకుని చాన్నాళ్ళయింది.


రుద్రమదేవి: నిజమే.


శివదేవయ్య: అవునమ్మా। నాకే ఆశ్చర్యముగా నున్నది. ఇతడి బుర్ర ఎంత పెద్దదా ? అని. అదీగాక, రుద్రమదేవి చక్రవర్తిణి పేర, బీదప్రజలకు చాలా మేళ్ళు జరుగుచున్నవి. నీ పేర అంతులేని దానధర్మాలు జరుగుతున్నవి. ఊళ్ళలో కాకతి సామ్రాజ్య చక్రవర్తణి పేర శాసనములు నిర్మించబడినవి.


రుద్రమదేవి: ఆశ్చర్యముగా నున్నది.


శివదేవయ్య: ఇప్పటికే సుబ్బనాయకుడు శివభక్తుల వేషాలలో శ్రీశైలం చేరినాడట. అతని వేషములు అద్భుతములని జగమెరిగిన సంగతే. ఒకసారి పులి తప్పుకుని సైనికుల గుడారము లోనికి వచ్చినది. ఒకడు బాణముతో సంహరించబోతుంటే పక్కవాడు అన్నాడట. ‘దీనిని చంపకురా. ఇది సుబ్బనాయకుని వేషమేమో’నని. అంతటి ధీమంతుడు.

"ఆ తరువాత.." అని రుద్రమదేవి పసిపిల్లవలె నవ్వింది.


శివదేవయ్య: రేపురాత్రి శ్రీశైలంలో శివారాధన. గన్నారెడ్డి జనమంతా వివిధ ప్రదేశాల్లో వూరంతా నిండివుంటారు. గన్నారెడ్డి ప్రభువులు కూడా మారు వేషాల్లోనే వుంటారు. సహజంగా శివభక్తులైన లకుమయారెడ్డి భక్తితన్మయత్వం స్థితిలో వుంటాడు. ఆ తరువాత అదృశ్యమౌతాడు.

రుద్రమదేవి: అట్లా గన్నారెడ్డి ప్రభువులు లకుమయారెడ్డిని ఆశీర్వదిస్తున్నారన్నమాట.


శివదేవయ్య: ‘ఉన్న మాటే..’ అని క్షణం ఆగి,

‘అమ్మా! ఇంకా చేయవలసిన రాచకార్యాలు చాలా వున్నాయి. వస్తాను.


రుద్రమదేవి: మంచిది బాబయ్యగారూ, అన్నమాంబక విషయంలో వేరే ఆలోచనలు వద్దు. పంపవద్దు.


శివదేవయ్య: అట్లాగే.


ఆ మాట అని శివదేవయ్య మంత్రులూ వెళ్ళిపోయారు.

శ్రీశైలము శివారాధకులకు పుట్టినిల్లు. శ్రీశైల మల్లికార్జునుడు తెలుగు శైవుల ఇలవేల్పు. అట్లాగే ద్రాక్షరామ భీమేశ్వరుడు, కాశీలో విశ్వనాధుడు....


అట్లాగే తిరుపతి కొండలపై కూర్చున్న కళ్యాణ చక్రవర్తి - శ్రీ వెంకటేశ్వరుడు మహత్తర

మైన మూర్తి- కొండెక్కి ' గోవిందా' అంటే కోటి కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. విశ్వాసం.

లకుమయారెడ్డి శివరాత్రికి ముందే వచ్చి విడిది చేసి, తన అపారసేనలను గన్నారెడ్డిపై ముట్టడికి పంపి, యిక్కడ మల్లికార్జునస్వామివి ప్రార్థించటానికి వచ్చి యున్నాడు. ఆయన చుట్టూ కంటికి కునుకు వెయ్యకుండా సైనికులు కాపలా కాస్తున్నారు.

శివరాత్రి రానే వచ్చింది.

ఎటు చూసినా జనమే.


ఎర్రటి మనిషి. ఆజానుబాహుడు. స్ఫురద్రూపి. ముఖాన తెల్లగా అడ్డబొట్టు పెట్టినాడు.

వెనక పదిమంది శిష్యులు . ముఖమున ఎర్రబొట్టు చిందిన రక్తమువలె ధగధగ లాడుచున్నది. ఉఛ్ఛ స్వరమున శివస్తోత్రము చదువుచున్నారు. శిష్యులు తమ గొంతులతో వంత పాడుచున్నారు.

అర్దరాత్రి ఐనది. మల్లికార్జునస్వామి దగ్గర భక్తులు ప్రణమిల్లుతున్నారు. అఖండ నీరాజనములు వెలుగుచున్నవి.

మల్లికార్జున స్వామి అపర అవతారమువలె ఉన్న ‘శివమూర్తి', శిష్యులతో లకుమయారెడ్డి ఆవాసనమునకు వచ్చినారు. శిష్యులు"శివా శంభో మల్లికార్జునా" అని ముక్త కంఠములతో శ్రవణానందము గావిస్తున్నారు.

స్వామి చిరునవ్వుతో లకుమయారెడ్డిని చూసినారు. ఆయన భక్తితో నమస్కరించినాడు. ఆ తరువాత ప్రసాదము పంచబడినది. సైనికులు- సేనానులు- సేవకులు భక్తితో ప్రసాదం కళ్ళకద్దుకుని భుజించారు.


ఆ తరువాత--

కళ్ళు మూతలు పడినవి. ఒక్కరికీ స్పృహలేదు. ప్రజలు ఎవరి సందడిలో ఎవరి భక్తిలో వారు వున్నారు.


తెల్లారింది. కొండపైన భాస్కరుని పసిడి రంగు.

హంసతూలికాతల్పం పై పడుకున్న లకుమయారెడ్డి లేడు. సైనికులలో- సేనానులలో గందరగోళం, ఆందోళన.


మూర్చబోగలిగినంత ఆశ్చర్యము

ఇది గన్నారెడ్డి ప్రజ్ఞ....... నెరవేర్చుకున్న ప్రజ్ఞ.

ఓరుగల్లు నగరంలో ఎక్కడ విన్నా ఈ వార్తే.

శ్రీశైలంనుంచి, గుర్రాలు పూన్చిన పట్టు పరుపుల బండిలో, లకుమయారెడ్డి ప్రభువులను గన్నారెడ్డి ప్రభువులు కళ్ళుగంతలు కట్టి తెచ్చినారట.

ఆ వార్త శివదేవయ్యమాత్యులకు వచ్చినది.

"మహామాత్యులకు వినయపూర్వకమైన వందనములు. మేము ముందే రుద్రయామాత్యులను అపహరించి, మా కోటలోనే వుంచి- వారికి ఏ మాత్రము అగౌరవం లేకుండా, కంటికి రెప్పవలె కాపాడినాము.


నేడు శ్రీశ్రీశ్రీ వర్దమాన పురపు ప్రభువులు లకుమయారెడ్డి గారిని బంధీలుగా పట్టుకున్నాము. వారినీ, వారి మంత్రి రుద్రయామాత్యులనూ పిల్లలమర్రి కడ, కాకతీయ చక్రవర్తులకు అప్ప

గించగలము. మీకు అభ్యంతరము లేకపోయి నట్లయితే, వారు మా కోటలోనే సురక్షితముగా వుండగలరు.

సర్వదా విధేయుడు,

మీ గజదొంగ గోనగన్నారెడ్డి

ఈ ఉత్తరమును చూసి శివదేవయ్య నవ్వినారు.

---------------------------

ఇంకా వుంది...

--------------------------------------

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.


110 views1 comment

1 Comment


Kameswari Sista • 5 hours ago

Gannareddy gurinchi cheppe vidhanamu, prakruti soundaryamu varnana baga chepparu.Sivadeyayya, Rudramadevi gurinchi vaari sambhashana varnanateetam, nammakam anta Gonagannareddy gurinche.Ila cheppuku potunte charitra ki antamu ledu.Excellent explanation.

Like
bottom of page