top of page

కాల వాహినిలో - పార్ట్ 14

#ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #KalaVahinilo, #కాలవాహినిలో, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు, #TeluguSerials, #TeluguNovel, #TeluguDharavahika


'Kala Vahinilo - Part 14'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma   

Published In manatelugukathalu.com On 14/10/2024

'కాల వాహినిలో - పార్ట్ 14' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్






జరిగిన కథ:

సత్యానందరావు ఆ గ్రామానికి పెద్ద. ఆయన చెల్లెలి కూతురు కావ్య. అయన అక్క కొడుకు తిరుమల. గ్రామంలో అయన ప్రత్యర్థి రాంబాబు. రాంబాబు కూతురు దివ్య. పెద్దల మనస్పర్ధలతో సంబంధం లేకుండా దివ్య, కావ్య మంచి స్నేహితులుగా ఉంటారు. 


ఇల్లు వదిలి వెళ్లిపోయిన తన బావ, సత్యానందరావు గారి కుమారుడు ఐన చంద్రాన్ని పెళ్లి చేసుకోవాలను కుంటున్నట్లు తండ్రి నరేంద్రతో చెబుతుంది కావ్య. తన చిన మామయ్య రఘునందన్ రావు మరణంపై పరిశోధన ప్రారంభిస్తుంది కావ్య. కొత్తగా వస్తున్న జిల్లా కలెక్టర్ పేరు చందా సింగ్ అని తెలియడంతో తన బావ చంద్రం గుర్తుకు వస్తాడు కావ్యకు.


తిరుమల, కావ్యాలకు తానే చందూనన్న విషయం చెబుతాడు చందా సింగ్.


ఇక కాల వాహినిలో.. పార్ట్ 14 చదవండి. 


చందాసింగ్ ఆఫీసులో ప్రవేశించాడు. విక్రమ్ లోనికి వచ్చాడు "సార్!.... నందాదేవి నాలుగు గంటలకు వస్తానని ఫోన్ చేశారు."


"మనం వారిని రమ్మనలేదుగా!"


"అవును సార్!"


"ఫోన్ చేసి చెప్పండి. ఈ రోజు కుదరదని రేపు ఉదయం ఎనిమిది గంటలకు నా బంగళాకు రమ్మని చెప్పండి."


"ఓకే సార్!" విక్రమ్ బయటికి నడిచాడు.


తిరుమలరావు కోర్టు పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు.


రాంబాబు, నందాదేవీలు దివ్యకు వివాహ సంబంధాన్ని చూచారు. ఆ విషయం మాట్లాటానికి రాంబాబు అతని భార్య కావలి వెళ్ళారు.


తిరుమలరావు అంటే ఎంతో అభిమానం ప్రేమ ఉన్న దివ్య ఇంట్లో తల్లి తండ్రి లేనందున తిరుమలరావు ఇంటికి వచ్చింది. ఆమె ప్రక్కనే రామయోగి.


ఇంటిముందు మంచాలపై వడియాలు పెడుతున్న తిరుమలరావు తల్లి అన్నమ్మ ఆమెను చూచి ఆశ్చర్యపోయింది.


"పిన్నీ! నీ కోడలు" నవ్వుతూ చెప్పాడు రామయోగి.


అతని మాటలకు ఆశ్చర్యపోయింది అన్నమ్మ.

"ఎందుకు పిన్నీ అంతగా ఆశ్చర్యపోతున్నావు. సుబ్బారాయుడిగారి మనుమరాలు పేరు వినే వుంటావు. దివ్య ఎం.ఆర్. ఓ మా అన్నకు కూడా ఇష్టమే!" నవ్వుతూ చెప్పాడు రామయోగి.


"అత్తయ్యా! నమస్కారం" అన్నమ్మ పక్కకు వచ్చి చెప్పింది దివ్య.


అన్నమ్మ బెదిరిపోయింది. ఆశ్చర్యంతో రామయోగి ముఖంలోనికి చూచింది.

"ఒరే యోగి! ఏందిరా నువ్వన్నది?"


"అవును పిన్నీ! అన్నకు ఈ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం. ఈ అమ్మాయికీ అన్న అంటే ఇష్టం. నీవు సరే అంటే నేను సత్యానందరావు బాబాయి గారితో మాట్లాడుతాను" నవ్వుతూ చెప్పాడు రామయోగి.


"ఒరేయ్! వాళ్ళకూ మనకూ!"


"అదొ ఒకప్పుడు. పగ, ప్రతీకారాలకు ఇప్పుడు తావు లేదు. వాళ్ళు మారారు పిన్నీ!"


"ఏమోరా.... నాకు నమ్మకం లేదు."


"అత్తయ్యా! మీరు నమ్మినా నమ్మకపోయినా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానో తెలుసా.... మా అమ్మానాన్నలు నాకు సంబంధాన్ని చూచేటందుకు కావలి వెళ్ళారు. నేను వివాహమంటూ చేసుకొంటే అది మీ అబ్బాయినే చేసుకొంటాను. మీరు కాదంటే మావాళ్ళు వేరే సంబంధం చూచి నన్ను బలవంతం చేస్తే నేను చచ్చిపోతాను ఇక మీ ఇష్టం."


"ఒరే రామయోగి ఏమిటా ఇది?"


"దివ్య తన అభిప్రాయాన్ని నీకు చెప్పింది పిన్నీ. ఇప్పుడు నీవు ఓకే అన్నావంటే ఆనందంగా ఇంటికి వెళుతుంది."


"వాణ్ణి అడిగి కనుక్కోవాలి కదరా!"


తిరుమలరావు బులెట్ బండి గృహ ఆవరణంలో ప్రవేశించింది.


"అడుగో! నూరేళ్ళు మాటల్లోనే వచ్చేశాడు మా అన్న" 

ఆనందంగా నవ్వుతూ చెప్పాడూ రామయోగి.


బులెట్ బండి స్టాండ్ వేసి తిరుమలరావు వారిని సమీపించాడు. దివ్యను చూచాడు.


"గుడ్ ఈవెనింగ్ బావా!" నవ్వుతూ చెప్పింది దివ్య.


"ఎందుకొచ్చావ్?"


"మా అత్తయ్యను చూచేదానికి!"


"అన్నా! నేను చెప్పేది విను."


"ఏంట్రా నీవు చెప్పేది"


"వాళ్ళ అమ్మానాన్నలు దివ్యకు సంబంధాన్ని ఖాయం చేసేటందుకు కావలికి వెళ్ళారట."


"అయితే!"


"ఆ విషయాన్ని తన మనసులోని కోర్కెను పిన్నికి చెప్పేందుకు దివ్య వచ్చింది. చెప్పేసింది. నీవు నీ నిర్ణయాన్ని చెపితే ఆనందంగా ఇంటికి వెళుతుంది. పిన్నీ అంతేకదూ!" చిరునవ్వుతో చెప్పాడు రామయోగి.


"ఆ....ఆ.... అంతేగా మరి" అంది అన్నమ్మ.


"అమ్మా!"


"ఒరే తిరూ! నీకు ఇష్టమేనా? నాకు మాత్రం ఎంతో ఇష్టంరా!"


"పిన్నీ! నాకు కూడా పరిపూర్ణ సమ్మతం" నవ్వాడు యోగి. 


"యోగీ!" చురచురా అతని ముఖంలోనికి చూచాడు తిరుమల.


"అత్తయ్యా! బావ అలసిపోయి వచ్చినట్లున్నాడు నేను కాఫీ కలపనా" నవ్వుతూ అడిగింది దివ్య తిరుమల ముఖంలోనికి కొంటెగా చూస్తూ.


"నాకు ఇప్పుడు కాఫీ తాగాలని లేదమ్మా!" 


తిరుమల ముఖంలోకి చిరుకోపంతో చూస్తూ....

"సరే!.... అత్తయ్యా నేను వెళుతున్నా!" అంది దివ్య.


"జాగ్రత్తమ్మా! వెళ్ళిరా" అంది.


దివ్య వీధిలోనికి వచ్చింది. కావ్యకు ఫోన్ చేసి తిరుమల విషయంలో తనకున్న అభిప్రాయాన్ని చెప్పి తన అమ్మానాన్నలు తనకు సంబంధం నిశ్చయించేదానికి వెళ్ళిన విషయాన్ని చెప్పింది. 


అంతా విన్న కావ్య....

"దివ్యా!.... భయపడకు. తిరుమలతో నీ పెండ్లి జరిపించే పూచీ నాది. బీ హ్యాపీ!" అంటూ హామీ ఇచ్చింది కావ్య.


"ఒరేయ్ యోగీ! నేను గంటలో నెల్లూరు బయలుదేరాలి. వార్తను తిరిగి వచ్చి నీకు చెబుతాను. అమ్మా నీకూనూ!" ఆనందంగా చందాసింగ్‍ను తలచుకొంటూ చెప్పాడు తిరుమల.


కోర్ట్ డ్రస్ మార్చుకొని రెడీ అయ్యాడు. కావ్య పోలీస్ డ్రస్ మార్చుకుని చక్కగా చీర జాకెట్‍తో తయారై తిరుమల ఇంటికి వచ్చింది.


"అన్నా రెడీయేనా!" ఇంట్లోకి ప్రవేశిస్తూనే అరిచింది.


"ఏమిటమ్మా... కావ్యా చాలా సంతోషంగా వున్నావ్!" ఆప్యాయంగా అడిగింది అన్నమ్మ. 


"అవును పెద్దమ్మా!... గొప్ప కారణం వుంది. రేపు చెబుతాను" 

ఆనందంగా నవ్వింది.


"మీతో నేనూ రానా అన్నా!" దీనంగా అడిగాడు యోగి.


"అరేయ్ యోగీ వద్దురా మేమిద్దరం వెళ్ళి వస్తాం" అన్నాడు తిరుమల.


"సరే అన్నా!... వెళ్ళిరండి"


అన్నమ్మతో చెప్పి తిరుమలరావు కావ్య చందాసింగ్ వద్దకు బయలుదేరారు.


చందాసింగ్ వరండాలో కూర్చొని తిరుమలరావు కావ్య రాకకు ఎదురుచూస్తున్నాడు.


సెల్ మ్రోగింది.


"చందా బేటే! కైసా హైరే!" చందాసింగ్ పెంపుడూ తండ్రి భగత్ సింగ్.


"పాపా! మై బహూత్ అచ్ఛాహుం. అమ్మాజీ ఆప్ కైసే హై!"


"అచ్ఛాహై మున్నా!..... ఆ.... వహ సబ్‍కుచ్ అచ్ఛాహైనా!"


"హా.... హా.... ఠీక్ హై పాపా!"


"అమ్మాజీ తుఝే దేక్‍నా చాహతీహై... హమ్ వహా ఆరహేహై!"


"క్యా!.... ఆప్ ఆరహేహై?"


"హా బేటా!.... బహూత్ ఖుష్ హై పాపా!.... ఆజాయియే!"


"ఆజ్ ఢిల్లీ పహుంచేంగే కల్ సవేర్ చెన్నై పహూంచేంగే!"


"బహూత్ అఛ్ఛాహై పాపా! మేరా సెక్రటరీ విక్రమ్... ఆప్‍కో చెన్నై ఎయిర్ పోర్ట్ మే రిసీవ్ కరేగా... ఫ్లయిట్ నెంబర్.... టైమ్ యం.ఎస్ కీజీయో!"


"హా.... హా..." భగత్ సింగ్ సెల్ కట్ చేశాడు.


కావ్య కారు పోర్టికోలో ఆగింది.


తిరుమలరావు కావ్య కారునుండి ఎంతో హుషారుగా దిగారు. వారిని చూచి చందాసింగ్ లేచి మెట్లు దిగాడు. తన రెండుచేతుల్లోకి వారి చేతులను తీసుకొన్నాడు ఆనందంగా.

ముగ్గురూ హాల్లోకి ప్రవేశించారు.

"తిరుమలా....!"


"బావా!" పరవశంతో ఆనందంగా చందును కౌగలించుకొన్నాడు తిరుమల.


ఆ ఇరువురి హృదయాల్లో ఒకే భావన. బాధ.... కొన్ని క్షణాలు ఆత్మీయతా భావానికి వివశులైనారు.

"అన్నయ్యా! బావా!...." ఇరువురి చేతులు పట్టుకొని కావ్య వారి ముఖాల్లోకి చూచింది.


ఇరువురు నవ్వుతూ కావ్య ముఖంలోనికి చూచారు.

పాండు ట్రేలో మూడు కాఫీ కప్‍లతో వచ్చి ముగ్గురికీ అందించాడు.


"పాండూ భాయ్! కల్ మాజీ... బాప్‍జీ ఆనేవాలేహై" నవ్వుతూ చెప్పాడు చందాసింగ్.


"బహూత్ ఖుషీ సాబ్!" ఆనందంగా నవ్వాడు పాండు. 


ముగ్గురు ఖాళీ కప్పులను ట్రేలో వుంచారు. ట్రేని తీసుకొని పాండు వంటగది వైపునకు వెళ్ళాడు. చందాసింగ్ తన పి.ఏ విక్రమ్‍కు ఫోన్ చేసి రేపు తన తల్లిదండ్రులను చెన్నైనుంచి తీసుకొని రావాలని చెప్పాడు.

"ఆ.... తిరుమలా!..... చిన్నీ!.... ముందు నా కథను మీకు చెబుతాను. పన్నెండు సంవత్సరాల క్రిందట జరిగిన సంఘటన....


నందాదేవి నా గురించి అమ్మా నాన్న బాబాయిలకు చెప్పిన అసత్యం... దాన్ని నిజమని నమ్మి నన్ను నాన్నగారు అసహ్యించుకోవడం, ఈ జన్మలో నీ ముఖాన్ని నాకు చూపకు అనడం, నిరపరాధినైన నా హౄదయంపై పెద్దగాయాన్ని ఏర్పరచింది. ఇంటినుండి నడిరేయి పారిపోయాను. రెండురోజుల తర్వాత వారణాసి చేరాను. జగన్మాతా పితరులను దర్శించాను. 


గంగానదిలో పడవ తిరుగబడిన ప్రమాదంలో ప్రాణాపాయంలో వున్న భగత్‍సింగ్‍ను వారి సతీమణిని రక్షించాను. కానీ నా వయస్సు వాడే అయిన వారి కుమారుడు అర్జున్‍సింగ్‍ను రక్షించలేకపోయాను. ఆ దంపతుల ఆవేదన.... నా ఆవేదనకు మించినది. అర్జున్‍సింగ్ అంత్యక్రియలు కాశీలో జరిగాయి. ఆ దంపతులకు సాయంగా వున్న నన్ను వారు ఎంతగానో అభిమానించారు. రెండూ వారాల తర్వాత పంజాబ్‍లోని బటెండాకు వెళుతూ వారు నన్ను....

’బేటా హమారే సాత్ పంజాబ్ ఆయేగా! హమారా బేటా బన్‍కే!’ దీనంగా కన్నీటితో అడిగారు.


వారి ఆ మాటను ఏ దారి లేని నాకు ఆ విశ్వేశ్వర సందేశంగా భావించాను. వారితో బయలుదేరి పంజాబ్‍లోని ’బటెండా’ వారి వూరికి వెళ్ళిపోయాను. వారు వారి బంధువులకు తెలిసినవారికి నన్ను చందాసింగ్ అని పరిచయం చేశారు. 


పాపాజీతో పొలంపనులు చేసేవాణ్ణి.. ఏడు సంవత్సరాల్లో ఎం.ఎ ముగించి ఆ తరువాత నా ఇష్టానుసారంగా ఐ.ఎ.ఎస్ పాసైనాను. పంజాబ్‍లోనే రెండు సంవత్సరాలు కలెక్టరుగా పనిచేశాను. ఇక్కడినుండి పోయేరోజున అనుకొన్నాను. ఎంతకాలం అయినా సరే బాగా చదవాలి మంచి పదవిని సంపాదించాలి. ఆ స్థితి కలిగిన నాడు తిరిగి వూరికి వచ్చి నాకు ఉన్న పవర్‍తో అబద్ధపు ముసుగులో వున్న నిజాన్ని నందాదేవి నోటినుంచి చెప్పించాలనుకొన్నాను. ఆ దైవ కృప వల్ల నా లక్ష్యం నెరవేరింది. 


ఆనందంగా నావారైన మీ అందరినీ చూడాలని వచ్చాను. శివాలయంలో అమ్మా నాన్న అత్తయ్య మామయ్యలను ఇక్కడ మిమ్మల్ని చూచాను. రఘునందన బాబాయ్ మరణవార్తను కావ్య చెప్పింది. మనస్సుకు చాలా బాధగా ఉంది. ఇక్కడినుంచి వెళ్ళేటప్పుడు పదవిని, డబ్బును సంపాదించి నన్ను అవమానించిన వారిపై కక్ష తీర్చుకోవాలనుకున్నాను. 


కలెక్టర్ అయ్యాక... పంజాబ్‍లో అన్ని ప్రాంతాలను చూచాను. స్వాతంత్ర్యం సిద్ధించి డైభ్భై మూడేళ్ళయినా దేశంలో వుండే ప్రజలు కొంతమంది కష్టాల్లోనే వున్నారు. కారణం విద్యాలోపం. కలవారు లేనివారనే తారతమ్యం. ఆ పేదవారు ఆనందంగా బ్రతకాలంటే వున్నవారు లేనివారికి సాయం చేయాలి. చులకనగా చూడటం మాని... మానవత్వంతో వారు తమలాంటి వారే అని భావించి సమదృష్టితో చూడాలి. దాన్ని సాధించాలంటే మనస్సున పగ... ద్వేషం... వుండకూడదు. జిలాలో నేను అలాంటి మార్పును తేవాలనేది నా ఆశయం. ఆ..... నాన్నగారు బాబాయిని చంపిన వారిపై కేసు పెట్టలేదా?"


"లేదు బావా! కానీ...."


అన్నయ్య... నేను... ఆ కేసుకు సంబంధించిన దోషులను కలిసికొన్నాము. వారి వాంగ్మూలాలను రికార్డు చేశాము వినండి."


లాప్‍టాప్‍ను టేబుల్‍పై ఉంచింది.

తన హ్యాండ్ బ్యాగులోని సి.డిని అందులో వుంచి ఆన్ చేసింది.


ముందు జోగయ్య, మీరా చివరిగా సోమయ్య చెప్పిన నిజాలను ఆ ముగ్గురూ విన్నారు.


సి.డి ఆగిపోయింది.

చందాసింగ్ కళ్ళు మూసుకొని అంతా విన్నాడు.


"మీ అన్నా చెల్లెళ్ళ ప్రయత్నం ఫలితం రియల్లీ గ్రేట్. నెక్ట్స్ స్టెప్ ఏమిటని మీరు నిర్ణయించుకొన్నారు?" కళ్ళు తెరిచి అడిగాడు చందాసింగ్.


"ఇకపై జరుగవలసినదంతా మీ ఇష్టప్రకారమే బావా!" అన్నాడు తిరుమలరావు.


"అవును బావా! మీ నిర్ణయమే మా నిర్ణయం"


"చిన్నీ! తిరుమలా! పన్నెండు సంవత్సరాల ముందు ఇల్లు విడిచి పారిపోయిన రోజున నేను. ఇంతకాలం తర్వాత ఇలాంటి అదృష్టం వుంటుందనుకోలేదు. నేను చేసిందల్లా నీతి... నిజాయితీ.... సత్యం.... ధర్మాలను పాటించడం. అపకారికి ఉపకారం చేయడం. నా చుట్టూ వున్న నా వాళ్ళంతా బాగుండాలని ఆ దేవున్ని కోరుకోవడం.... ఇవే నేను చేసింది. 


వాటివల్ల నేను అనుభవిస్తున్న ఫలితం... చాలా గొప్పది... నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ వుంది. ఇప్పుడు నా మనస్సులో ఆ కుటుంబం మీద ఎలాంటి పగ, ద్బేషం లేదు. ఇరువురి వ్యక్తుల మధ్యన.... రెండు కుటుంబాల మధ్య బేధభావం ఉంటే అది ఎవరికీ మనశ్శాంతిని ఇవ్వదు. అదే సాగింది ఇంతకాలం. ఇకపై ఇలా జరుగకూడదు. రేపు నేను నందాదేవితో మాట్లాడుతాను" సాలోచనగా చెప్పాడు చందాసింగ్.


"ఏమని బావా!" మెల్లగా అడిగింది కావ్య.


"తన తమ్ముని కూతురు దివ్యను మన తిరుమలకిచ్చి పెండ్లి చేయమని.... రెండు కుటుంబాలను ఒకటిగా చేయమని...."

"అందుకు ఆమె అంగీకరిస్తుందా!" అడిగాడు తిరుమల.

"అంగీకరించాలి. కారణం... తాను నా విషయంలో తప్పు చేసింది కనుక.... దిద్దుకొనేదానికి ఇది నేను తనకు ఇచ్చే సువర్ణావకాశం."


"ఒకవేళ కాదంటే బావా!" అడిగింది కావ్య.


"చిన్నీ! నీకెందుకే ఆ సందేహం? ఒకవేళ నందాదేవి అలా అన్నా నేను తిరుమలకు దివ్యకు మన ఇంట్లో అమ్మా నాన్నల సమక్షంలో వివాహాన్ని జరిపిస్తాను. ఎవరైనా ఎదురుతిరిగితే నీవు వున్నావుగా సంకెళ్ళు వేసి లోపల తోసెయ్!" నవ్వాడు చందాసింగ్.


క్షణం తర్వాత రేపు సాయంత్రం నేను అమ్మా నాన్నలను కలవబోతున్నాను. అంతవరకూ నా రాక విషయం సస్పెన్స్" చిరునవ్వుతో చెప్పాడు చందాసింగ్.


"లేవండి.... భోంచేద్దాం" అన్నాడు చందు.


ముగ్గురూ లేచి డైనింగు టేబుల్ వైపునకు నడిచారు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


16 views0 comments

Comments


bottom of page