కార్య, కారణ సంబంధాలలో మార్మికత

Karya, Karana Sambandalalo Marmikatha - Telugu Mythological Article | Bhattu Venkata Rao
కార్య, కారణ సంబంధాలలో మార్మికత - తెలుగు పౌరాణిక వ్యాసం | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 29/10/2026
మహాభారతంలోని ద్రోణాచార్యుడు, ద్రుపదుడు, అర్జునుడు, ధర్మరాజుల జీవిత సంఘటనల ద్వారా కార్య-కారణ సంబంధాలలో దాగి ఉన్న విధి రహస్యాలను తెలుసుకుందాం. మనిషి ఆలోచనలకు అందని పరిణామాలు జీవితంలో ఎలా ఊహించని ప్రయోజనాలను కలిగిస్తాయో వివరించే ఆలోచనాత్మక వ్యాసమే “కార్య, కారణ సంబంధాలలో మార్మికత.”
చెట్టు ఎక్కడ ఉంటే ఆ చెట్టుకు కాచే కాయ కూడా అక్కడే ఉండడం మనిషి చిత్తానికి అర్థమయ్యే ప్రాకృతిక న్యాయం.
చెట్టు ఎక్కడో ఉండి, ఆ చెట్టు అందించే ఫలం వేరెక్కడో ఉన్న ఒకడి దోసిలిలోకి, ఆ ఫలం అతడికి దక్కవలసినదే అన్న విధంగా చేరడం ప్రాకృతిక న్యాయం కాలేదు; అది దైవికంగా జరిగే న్యాయమై ఉంటుంది.
అలా దైవికంగా జరిగే న్యాయాలకు ఒక వ్యక్తి అర్హుడు కావాలంటే, అతడు పాండవాగ్రజుడైన ధర్మరాజు అంతటివాడై ఉండాలి.
కౌరవ, పాండవ రాకుమారులకు అస్త్రవిద్య పరీక్ష ముగిసిన మరుసటి రోజుననే, అస్త్రవిద్యలో వాళ్లకు గురువైన ద్రోణాచార్యుడు, తనకు గురుదక్షిణగా పాంచాలరాజైన ద్రుపదుడిని బందీగా పట్టితెచ్చి తన ముందు నిలబెట్టమన్నాడు.
ముందుగా తాము వెళ్లా ద్రుపదుడిని బందీగా తెచ్చి గురుదక్షిణ చెల్లించుకుని, ద్రోణాచార్యుడి మెప్పు పొందాలన్న కోరికతో దుర్యోధన, దుశ్శాసన, వికర్ణ, యుయుత్స, జలసంధాదులైన ధార్తరాష్ట్రులు బయలుదేరి వెళ్లారు. కానీ వెళ్లినంత వేగంగానే ద్రుపదుడి సైన్యం చేతిలో దెబ్బలు తిని పారిపోయి వచ్చేశారు.
భీముడు, యుధిష్ఠిరుడు ముందుండిన్నీ, నకుల సహదేవులు వెనుక కాపు కాచి ద్రుపదుడి సైన్యంతో పోరుతూ సహాయపడగా, అర్జునుడు ద్రుపదుడిని ద్వంద్వ యుద్ధంలో ఓడించి, బందీని చేసి తన రథచక్రానికి కట్టి తెచ్చి ద్రోణాచార్యుడి ముందు నిలబెట్టాడు.
తన ప్రియ శిష్యుడైన అర్జునుడు సాధించిన ఆ విజయానికి ద్రోణాచార్యుడు ఎంతగానో ఆనందించాడు.
అయితే అర్జునుడు చెల్లించిన ఈ గురుదక్షిణకు అసలు ఫలితం మరో రూపంలో యుధిష్ఠిరుడిని వరించి, పాండవులకు సమకూరింది. అదేమిటంటే — ఆ విజయం తరువాతనే ధృతరాష్ట్రుడు తనంత తానుగా భీష్మ, విదురులతో సంప్రదించి యుధిష్ఠిరుడిని యువరాజు హోదాకు తగినవాడుగా నిర్ణయించి, మరి ఆలస్యం చేయకుండా కురురాజ్యానికి యౌవరాజ్యాభిషిక్తుడిని చేశాడు.
అలా విశాలమైన కురుసామ్రాజ్యానికి ధృతరాష్ట్రుడు పేరుకు సామ్రాట్టు అయినప్పటికీ, యుధిష్ఠిరుడు అన్ని విషయాలలో అసలైన రాజుగా సేవించబడి, భీమార్జున నకులసహదేవులు సమీప రాజ్యాల రాజులను తమ అధీనంలోకి తెచ్చుకుని, వారి చేత ధనకనకవస్తురాసులను కప్పములుగా చెల్లింపజేసి తెచ్చి ధనాగారాన్ని నింపుతూ ఉండగా, సర్వాధికారంతో సార్వభౌముడై వెలిగాడు.
అది అలా ఉండగా, అర్జునుడి చేతిలో ఓడిపోయి, పాండవ రాకుమారులకు పట్టుబడి, తన చిన్ననాటి స్నేహితుడైన ద్రోణుడి ముందు బందీగా నిలబడిన ద్రుపదుడు, ఆ సంఘటనను తేలికగా తీసుకుని మరిచిపోలేదు.
అర్జునుడి చేతిలో తన ఓటమిని తనకు మేలు జరిగే విధంగా ఎలా మలుచుకోవాలో ఆలోచించాడు. తాను ఏ పాండవ రాకుమారుడి చేతిలో ఓటమిని చవిచూశాడో, ఆ అర్జునుడిని తనకు అల్లుడుగా చేసుకోదలచాడు.
అంతే కాకుండా, ద్రోణుడిని సమరరంగంలో ఓడించగలిగిన ఒక మహావీరుడైన కొడుకును కూడా పొందాలని ఆ అవమానకర సందర్భంలోనే మనసులో గట్టిగా తలచాడు.
అటువంటి ఇరువురు సంతానం కోసం కష్టమైన ఎన్నో క్రతువులు చేశాడు. చివరికి ఫలితం దక్కింది. ద్రౌపది కూతురుగాను, ధృష్టద్యుమ్నుడు కొడుకుగాను ద్రుపదుడికి యజ్ఞాగ్నిజ్వాలల నుండి లభ్యమయ్యారు. జన్మ ధన్యమైనట్లుగా భావించాడు ద్రుపదుడు.
నిజానికి ఈ పరిణామం ఒకవైపు ద్రుపదుడి కోరికను తీరుస్తూనే, మరోవైపు రాబోయే రోజులలో పాండవుల ఉన్నతికి, వారు ఊహించని విధంగా పనికివచ్చింది.
ద్రౌపది వంటి అగ్నిజాత అయిన స్త్రీ సహధర్మచారిణిగా దొరకడం, ధృష్టద్యుమ్నుడి వంటి వీరుడు బావమరిదిగా దొరకడం పాండవులకు వారి ప్రమేయం ఎంతమాత్రమూ లేకుండా, కేవలం విధి చేతలుగా, ద్రుపదుడి ద్వారా సమకూరిన అత్యుత్తమ ప్రయోజనాలయ్యాయి.
చ: నలువురు దమ్ములున్ బలిమి నాలుగు దిక్కులు నోర్చి సర్వభూతలమున రాజనందనుల దర్పమడంచుచు భూరివస్తురాసులు గొనివచ్చి యీఁగొని విశుద్ధయశోనిధి యొప్పె ధర్మజుండలఘుఁడు యౌవరాజ్యయుతుఁ డయ్యును బెంపున సార్వభౌముఁడై.(ఆదిపర్వం, షష్ఠాశ్వాసం, 93)
తమ్ముళ్లు నలుగురూ నాలుగు దిక్కుల రాజులను తమ అధీనంలోకి తీసుకొనడం వలన భూమండలంలో ఉన్న రాజులందరూ ధర్మరాజు అధికారానికి లోబడినవారై, ధనకనకవస్తువాహనాది బహుమతులను తెచ్చి ఇవ్వడం వలన సమకూరిన అశేషమైన సంపదతోను, కీర్తితోను ధర్మరాజు, మాటకు యువరాజైనప్పటికీ సార్వభౌముడిగా వెలిగిపోయాడు అని ఆంధ్ర మహాభారతం, ఆదిపర్వం, షష్ఠాశ్వాసంలోని పై పద్యం విశదపరిచింది.
పాండవులకు సమకూరిన ఈ ఉత్తమ ప్రయోజనాలకు బీజాలు, పాండవులు వారికివారై చేసిన ప్రార్థనలలో కంటే, కోరుకున్న కోరికలలో కంటే మిన్నగా... గురుదక్షిణ పేరుతో ద్రోణుడు, అర్జునుడి ద్వారా ద్రుపదుడి అవమానాన్ని కళ్లారా చూడాలని తలచిన తలపులో ఉన్నాయన్న సత్యాన్ని గుర్తించినప్పుడు, కార్య-కారణ సంబంధాలలో మనిషి బుద్ధికి అర్థం కాకుండా దాగి ఉండే మార్మికత ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
(సమాప్తం)
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.










Comments