కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి క్షేత్రం
- Sudha Vishwam Akondi

- Jul 10
- 2 min read
కీసరగుట్ట, కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి, కీసరగుట్ట స్థల పురాణం, రామలింగేశ్వర స్వామి ఆలయం, హైదరాబాద్ శివాలయాలు, తెలంగాణ దేవాలయాలు, కీసరగుట్ట దర్శనం, ఆంజనేయ స్వామి, శివక్షేత్రం, యాత్రా వ్యాసం, తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం

Keesara Gutta Ramalingeswara Swamy Kshethram - Telugu Devotional Article | Sudhavishwam Akondi
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి క్షేత్రం - తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | సుధావిశ్వం ఆకొండి
Published in manatelugukathalu.com on 10/07/2026
హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ప్రసిద్ధ శైవక్షేత్రాలలో కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. శ్రీరాముడు ప్రతిష్ఠించిన స్వయంభూ శివలింగం, ఆంజనేయస్వామితో అనుబంధం ఉన్న విశిష్ట స్థలపురాణం, ప్రశాంతమైన ఆలయ వాతావరణం, భక్తులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలతో ఈ క్షేత్రం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కీసరగుట్ట దర్శన విశేషాలు, ఆలయ నిర్మాణం, స్థల పురాణం, అన్నదాన సేవ గురించి ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
అప్పుడెప్పుడో పదిహేనేళ్ల క్రితం ఏదో కేసు విషయంలో కీసర పోలీస్ స్టేషన్ కి వెళ్లాం! అప్పుడు పని పూర్తి చేసుకుని రిటర్న్ లో కీసర రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం! అంతే!
మళ్లీ ఇన్నాళ్లకు నిన్న దర్శనం అయ్యింది. చాలా అభివృద్ధి చేశారు. టీటీడీ ఆలయాల తరహాలో సౌకర్యాలు ఏర్పాట్లు చూసి సంతోషం కలిగింది. కొన్ని కూపన్లు ఇచ్చి, అందరికీ అన్నదానం చేస్తున్నారు. వడ, లడ్డు, పులిహోర ప్రసాదం కౌంటర్లు పెట్టి అమ్ముతున్నారు.
ధ్వజ స్తంభం తర్వాత, పెద్ద నందీశ్వరుని వద్ద నుండి ఆలయంలోకి ప్రవేశం. విశాలమైన మండపంలో అమ్మవారు, స్వామివారి మూర్తులను కూర్చోబెట్టి అక్కడ పూజలు చేయిస్తున్నారు. మరో ప్రక్కన వేదాశీర్వచనం చేసే విభాగం ఉంది. గడప దాటి లోపలికి వెళ్లగానే ఎడమ వైపు భవాని పేరుతో అమ్మ, ఎదురుగా గణపతి దర్శనం చేసుకుని ముందుకు వెళితే ఈశ్వరుడు లింగాకారంలో దర్శనం ఇస్తాడు.
అభిషేకం చేయించుకునేవారు మరో గడప లోపల కూర్చుంటారు. మేము దర్శనం మాత్రమే కనుక ముందునుంచే దర్శనం చేసుకున్నాం. శివుడికి అటు ప్రక్కన గణపతి అయితే ఇటుపక్కన వల్లేదేవసేనా సమేత సుబ్రహ్మణ్యుడు చిరునవ్వులు చిందిస్తూ దీవించాడు. తర్వాత శివదుర్గ పేరుతో మళ్లీ అమ్మ ఉంది.
అలా దర్శనం చేసుకుని బయటకు వస్తే ఆ ప్రాంగణంలో మారుతి శివలింగం ఉంది. లోపల ఉన్న పురాతన కట్టడం మార్చకుండా డెవలప్ చేసినట్టున్నారు. చాలా ప్రశాంతంగా అనిపించింది.
స్థల పురాణం : అక్కడ బోర్డులో స్థల పురాణం వ్రాసి పెట్టారు.
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయ స్థల పురాణం ప్రకారం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతకం నివారణ కోసం ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని భావించారు. వారణాసి నుంచి 101 శివలింగాలను తీసుకురావాలని హనుమంతుడిని కోరారు. హనుమంతుడు తిరిగి రావడం ఆలస్యం కావడంతో, ముహూర్త సమయానికి పరమశివుడే స్వయంగా శ్రీరాముడికి లింగాన్ని ప్రసాదించాడు. అదే స్వయంభూ రామలింగేశ్వరుడు.
ఆలస్యంగా వచ్చిన హనుమంతుడు, తాను తెచ్చిన 101 శివలింగాలను కోపంతో గుట్టపై అంతటా విసిరేశాడు. హనుమంతుడిని ఓదార్చేందుకు, శ్రీరాముడు ఇక్కడ ఆంజనేయ స్వామికి ప్రథమ పూజలు జరుగుతాయని వరం ఇచ్చారు. ఆంజనేయ స్వామి తండ్రి కేసరి పేరు మీదుగా ఈ ప్రాంతానికి 'కేసరిగిరి' (కాలక్రమేణా 'కీసరగుట్ట') అని పేరు వచ్చిందని స్థల పురాణం. గుట్టపైన అక్కడక్కడా శివలింగాలు ఉన్నాయి.
ఇక్కడ అన్నపూర్ణ బ్రాహ్మణ అన్నదాన సత్రంలో భోజనం చేశాం! చాలా చక్కగా బాగుంది. సత్రం శుచిగా పద్ధతిగా ఉంది. కోతులకు రెండు అరటిపడ్లు ఇచ్చి బయలుదేరాం ఇప్పుడే! పులిహోర, వడ ప్రసాదం తీసుకున్నాక అడిగాయి మరి ఇవ్వమని. వాటికి బదులుగా అరటి పండ్లు ఇచ్చాను.
సుధావిశ్వం
సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):

-సుధావిశ్వం









Comments