top of page
Original.png

కొలను భారతి - సంగమేశ్వర స్వామి : కర్నూలు

కొలను భారతి, సంగమేశ్వర స్వామి, కర్నూలు, ఆంధ్ర బాసర, సరస్వతి దేవి, జనార్ధన స్వామి, సంగమేశ్వరం, శ్రీశైలం, దేవాలయ యాత్ర, ఆధ్యాత్మిక యాత్ర

కర్నూలు జిల్లాలోని కొలను భారతి సరస్వతి ఆలయం, సప్తలింగాలు, సప్తనదుల సంగమంలో వెలసిన సంగమేశ్వర స్వామి ఆలయ దృశ్యం
కర్నూలు జిల్లాలోని కొలను భారతి సరస్వతి ఆలయం, సప్తలింగాలు, సప్తనదుల సంగమంలో వెలసిన సంగమేశ్వర స్వామి ఆలయ దృశ్యం

Kolanu Bharathi Sangameswara Swamy Kurnool - Telugu Devotional Article | Sudhavishwam Akondi

కొలను భారతి - సంగమేశ్వర స్వామి : కర్నూలు తెలుగు ఆధ్యాత్మిక వ్యాసం | సుధావిశ్వం ఆకొండి

Published in manatelugukathalu.com on 29/07/2026


కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకలైన కొలను భారతి (ఆంధ్ర బాసర) మరియు సంగమేశ్వర స్వామి క్షేత్రం భక్తులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి. జ్ఞాన సరస్వతి అమ్మవారి అనుగ్రహం, సప్త ఋషుల యాగగాథ, సప్త నదుల సంగమం, సంవత్సరంలో ఎక్కువ కాలం నీటిలో మునిగే సంగమేశ్వర ఆలయ విశేషాలు ఈ యాత్రను మరింత పవిత్రంగా నిలబెడతాయి.


దత్త పీఠం స్థాపించిన గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా స్థాపించిన సూర్యనారాయణ స్వామి టెంపుల్‌ను దర్శించుకున్నాం.


ఆ తర్వాత ఆంధ్ర బాసరగా ప్రసిద్ధి చెందిన కొలను భారతి క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళ్లాం. రోడ్డుకి ఇరువైపులా విస్తరించిన దట్టమైన అడవి మార్గంలో ప్రయాణించి ఇక్కడికి వెళ్లాం.


వెళ్లగానే ఎదురుగా సప్త లింగాల ఆలయాలు దర్శనమిస్తాయి. మధ్యలో పెద్ద నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుని చుట్టూ మహర్షుల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగాలు ఉన్నాయి. మొదట గణపతి, తర్వాత వరుసగా శ్రీ వైష్ణవి దేవి సమేత కశ్యప లింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ వారాహి సమేత అత్రి లింగేశ్వర స్వామి, శ్రీ ఇంద్రాణి దేవి సమేత భరద్వాజ లింగేశ్వర స్వామి, శ్రీ చాముండేశ్వరి సమేత విశ్వామిత్ర లింగేశ్వర స్వామి, శ్రీ బ్రాహ్మిదేవి సమేత గౌతమ లింగేశ్వర స్వామి, శ్రీ మహేశ్వరి దేవి సమేత జమదగ్ని లింగేశ్వర స్వామి, శ్రీ కౌమారి దేవి సమేత వశిష్ట లింగేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి.


వశిష్ఠ లింగేశ్వర స్వామి ద్వారం ప్రక్కన కాలభైరవుడు కొలువై ఉన్నాడు. వెనుక శ్రీదేవి భూదేవి సమేత జనార్ధనస్వామి కొలువైన ఆలయం ఉంది. ఈ ఆలయ విశేషం ఏమిటంటే, ఎక్కడా లేని విధంగా పానవట్టం పైన జనార్దన స్వామి ఉండడం ప్రత్యేకం.

శివకేశవ అభేదంగా అలా వెలిసి ఉండవచ్చు. ఈ ఆలయాలు శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నాయిట.


కుడి వైపున కొలను భారతిగా సరస్వతి దేవి కొలువై, ప్రధాన దేవతగా శ్రీచక్ర సహితంగా అర్చించబడుతోంది. ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకుంటారట. 


ఎంతోమంది భక్తులు వస్తుంటారు. అందమైన ప్రకృతి ఒడిలో ఉన్న ఈ ఆలయ దర్శనం అమ్మవారి అనుగ్రహం మాత్రమే. అమ్మ ప్రసాదం ఇచ్చి అనుగ్రహించింది.


ఇక్కడ ప్రధాన దైవమైన సరస్వతి అమ్మవారితో పాటు, సప్త ఋషుల యాగానికి రక్షణగా నిలిచిన మహావిష్ణువు జనార్ధన స్వామిగా వెలిశారని పురాణ ప్రాశస్త్యం.


జనార్ధన స్వామి ఆలయ స్థలపురాణం ప్రకారం, కృతయుగంలో సప్తర్షులు ఇక్కడ యాగం తలపెట్టారు. ఆ యాగానికి రాక్షసులు విఘ్నం కలిగించడానికి ప్రయత్నం చేయగా, ఆ ఋషుల ప్రార్థన మేరకు మహావిష్ణువు జనార్థన స్వామిగా యాగ సంరక్షణ చేయడం జరిగిందట. 


వారి ప్రార్థన మేరకు జ్ఞాన సరస్వతి అమ్మవారు భారతిగా స్వయంగా వెలిశారని ప్రతీతి. ఇక్కడి తీర్థం (కొలను) (ఇప్పుడు నీళ్లు కొన్నే ఉండి, అవి కూడా కలుషితమై ఉన్నాయి) వరుణ తీర్థం అని పేరు. జనార్థన స్వామి వారికి, భారతీదేవి అభిషేకం కోసం ఈ తీర్థాన్ని దేవతలే ఏర్పాటు చేశారని స్థల పురాణం చెబుతోంది.


ఈ క్షేత్రం దర్శించుకోవడం మరిచిపోలేని అద్భుతమైన అనుభవం.


ఆ తర్వాత సంగమేశ్వరం క్షేత్రానికి బయలుదేరాం.

కర్నూలు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ప్రసిద్ధ సంగమేశ్వర ఆలయం, పాండవుల కాలం నాటి పవిత్ర పుణ్యక్షేత్రం. సప్త నదుల సంగమ ప్రదేశంలో వెలిసినది ఈ ఆలయం.


శ్రీశైలం జలాశయం నిండినప్పుడు ఈ ఆలయం దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది నెలల పాటు నీటిలోనే మునిగిపోతుంది. ఆ తర్వాత బయటకు వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ వానలు లేకపోవడంతో స్వామిని స్పృశించి దర్శించుకున్నాం. నీటిలో మునిగి ఉన్నప్పుడు ఆలయ గోపురం చుట్టూ బోటులో దర్శించుకుంటారట.


ఇప్పుడు ఆలయం వరకూ కారు వెళ్లింది. ఆలయం ప్రాంగణ ద్వారం నుండి లోపలికి వెళ్లగానే ఎడమ వైపు నుండి ముఖ మండపంలోకి అడుగుపెడతాం. అక్కడి ద్వారానికి ఇరువైపులా పంచముఖ ఆంజనేయుడు, సీతారాముల విగ్రహాలు ఉన్నాయి. అలా లోపలికి వెళ్లి, మరో ద్వారం గుండా అంతరాలయంలోకి వెళ్లాం. 


గణపతి, అమ్మవారు ఒక వైపు ఉండగా, మధ్యలో సంగమేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆ ప్రక్కనే ఉత్సవ మూర్తులు ఉన్నాయి. సంగమేశ్వర స్వామి స్పర్శ దర్శనం ఉంది ఇక్కడ. స్వామిని స్పృశించి దండం పెట్టుకుని పులకించిపోయాం. ఆ తర్వాత ఆ ఆలయం చుట్టూ సుబ్రహ్మణ్యుడు, ఇంకా శివలింగాలు, లక్ష్మీ నారాయణుల ఆలయాలు ఉన్నాయి. ఓ వైపు నవగ్రహ మండపం కూడా ఉంది.


కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలాపహారిణి, భీమరథి, భవనాశిని అనే ఏడు నదులు సంగమించిన ప్రదేశం ఇది. భవనాశిని అనే నది పురుష నది, మిగతావి స్త్రీ నదులని చెబుతున్నారు. ప్రధానంగా తుంగభద్ర, కృష్ణవేణి నదులుగా పైకి మనకు స్పష్టంగా తేడా తెలుస్తుంది. భాగీరథి, అలకనంద నదులు కలిసినట్లుగా దేవప్రయాగలో ఎలా కనిపిస్తుందో, ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. బోటింగ్ కూడా ఉంది, కానీ మేము వెళ్లలేదు.


స్థల పురాణం:


ఎంతో ప్రత్యేకమైన స్థలపురాణం ఉంది. పాండవులు శ్రీశైలం వెళ్లే మార్గంలో ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని భావించారు. భీముడు కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావడానికి ఆలస్యం కావడంతో, ధర్మరాజు వేపచెక్కతో సంగమేశ్వర లింగాన్ని స్వయంగా తయారుచేసి ప్రతిష్ఠించారు.


ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపలింగం ఏటా దాదాపు ఎనిమిది నెలల పాటు శ్రీశైలం జలాశయం నీటిలో మునిగి ఉంటుంది. నీటిలో ఉన్నప్పటికీ ఈ లింగం చెక్కుచెదరకుండా ఉండటం ఒక అద్భుతంగా భావిస్తారు.


ఆలస్యంగా వచ్చిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో పడేయగా, ధర్మరాజు దానిని నది ఒడ్డున ప్రతిష్ఠించారు. అదే భీమలింగ సంగమేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది.


శ్రీశైలం డ్యామ్ నిర్మాణ సమయంలో ఈ ప్రాంతం ముంపునకు గురికావడంతో, మరో సంగమేశ్వర లింగాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాథ గట్టుపై రూపాల సంగమేశ్వర స్వామిగా పునర్నిర్మించారు. అది రూపాల సంగమేశ్వర స్వామి.


చాళుక్యుల కాలంలో ఇక్కడి ఆలయాలు వైభవంగా విలసిల్లాయట. ఇది ఇక్కడి స్థల పురాణం.


పరమేశ్వరార్పణమస్తు.


🙏🙏🙏🙏🙏

సుధావిశ్వం 


సుధావిశ్వం గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):










-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page