మనసే మన నేస్తం
- Kolluru Padmaja Sankar

- May 7
- 2 min read
Updated: May 10

Manase Mana Nestham -Telugu Poem | - Kolluru Padmaja Sankar
Published in manatelugukathalu.com on 07/05/2026
మనసే మన నేస్తం - తెలుగు కవిత | కొల్లూరు పద్మజా శంకర్
మనసు అనేది భావాల సముద్రం.
ఆనందం, ఆశ, ప్రేమ, జ్ఞాపకాలు, కలలు… ప్రతి భావాన్ని మధురమైన పదాలతో అల్లిన అందమైన కవిత “మనసే మన నేస్తం”. కొల్లూరు పద్మజా శంకర్ గారి ఈ రచన ప్రతి హృదయాన్ని తాకే భావోద్వేగ కవితగా నిలుస్తుంది.
మంచి జరిగితే మల్లెలాగ నవ్వేది మనసు!
మంచి మాటకు మంచులా కరిగేది మనసు!
//మంచి//
వెన్నెల వెలుగులలో వెల్లువై పొంగేది మనసు!
కొత్త వసంతంలో కోయిలై కూసేది మనసు!
పరువం పరుగుకు పగ్గాలు వేసేది మనసు!
ఊహలు ఉరకలేస్తే ఊయలూగేది మనసు!!
//మంచి//
చక్కని ఊసులకు చుక్కలా మెరిసేది మనసు !
తీరని ఆశలకు ముక్కలై విరిగేది మనసు!
కన్నె కలలకు కలువలా విరిసేది మనసు!
కలలు కల్లలైతే కన్నీరు కురిసేది మనసు!!
//మంచి//
తనను మెచ్చినది తాను నచ్చేది మనసు!
తనకే నచ్చినది తనలో దాచుకునేది మనసు!
ఆనంద రావాలను ఆలకించేది మనసు!
అనురాగ గీతాలను ఆలపించేది మనసు!!
/) మంచి//
జ్ఞాపకాల పందిరినే
అల్లుకునేది మనసు!
మనసుకు మించిన నేస్తం లేదని-
పద్మజ! నీకు తెలుసు!!
// మంచి//
================================

Naa Athma Telugu -Telugu Poem | - Kolluru Padmaja Sankar
Published in manatelugukathalu.com on 02/05/2026
నా ఆత్మ తెలుగు - తెలుగు కవిత | కొల్లూరు పద్మజా శంకర్
తెలుగు భాష అనేది కేవలం సంభాషణ సాధనం కాదు, అది మన భావాలను, మన సంస్కృతిని, మన ఆత్మను ప్రతిబింబించే అద్భుతమైన వారసత్వం. ఈ పద్యం తెలుగు భాష మాధుర్యాన్ని, భావ గంభీరతను, కవిత్వ సౌందర్యాన్ని మనసును తాకేలా వివరిస్తుంది.
సీసము
ఉగ్గు పాల కలిపి యూపిరి నందించు
ఉల్లాస భరిత నా ఊసు తెలుగు!
మాటలందు మసలి మనసును దోచేటి
మాధుర్య సుధ నా మాట తెలుగు!
భావనా సంద్రాన బహుబాగ నుప్పొంగు
భావతరంగి నా భాష తెలుగు!
కవులచే కలమున కమనీయ కావ్యమై
కాంచిన రమణి నా కవిత తెలుగు!
ఆటవెలది
ఎన్ని భాషలున్న యెన్నదగినదేను
అమ్మ నేర్పు భాష అవనియందు!
జన్మనిచ్చినట్టి జనని ఋణము దీర్చు
నాదు తెలుగు మరువ నాత్మ వశమె?!
------------------------
తేటగీతి
కృష్ణరాయని హృది నిండ కృతులు నిల్పి
అష్ట దిగ్గజంబులు బల్క నాశువుగను
గ్రంథరూపమై మేటిగా ఘనత నొంద
పాతదైనట్టి తెలుగేమొ పట్టమొందె!!
ఆటవెలది
బంధులెందరున్న బాంధవ్యమే మిన్న
పరిఢవిల్లునెపుడు పృథివి పైన;
అమ్మ తోడ వచ్చు అనుబంధమగునట్టి
ఆత్మ బంధువదియె అమ్మ భాష!!
***
కొల్లూరు పద్మజా శంకర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

రచయిత్రి పరిచయం: కొల్లూరు పద్మజా శంకర్
నా గురించి:
కొల్లూరు పద్మజా శంకర్
వృత్తి: ఉపాధ్యాయిని
ప్రవృత్తి: కవయిత్రి, గాయని, బాలసాహిత్య వేత్త.
పనిచేస్తున్న పాఠశాల: ఎం పి పి పాఠశాల, పెదమజ్జిపాలెం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా.






Comments