top of page
Original.png

వందేమాతరం...వందేమాతరం… 


దేశభక్తి, సమానత్వం, ప్రకృతి, అబ్దుల్ కలాం, అంబేద్కర్, అమ్మ మమతను ప్రతిబింబించే తెలుగు కవితల సమాహారం

Vandematharam Vandematharam - Telugu Poem | Polayya Kavi

వందేమాతరం...వందేమాతరం… - తెలుగు కవిత |  పోలయ్య కవి 

Published In manatelugukathalu.com On 15/08/2026


తెలుగు కవిత్వం కేవలం భావాలను పలికించే అక్షరాల సమాహారం కాదు—అది సమాజాన్ని ప్రశ్నించే స్వరం, దేశభక్తిని రగిలించే నినాదం, మానవత్వాన్ని మేల్కొలిపే సందేశం. ఈ ప్రత్యేక కవితా సంకలనంలో వందేమాతరం స్ఫూర్తి నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమానత్వ దృక్పథం వరకు, డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం ఆదర్శ జీవితం నుంచి ప్రకృతి వైభవం వరకు, కులవివక్షపై ప్రశ్నించే ఆలోచనల నుంచి అమ్మ మమత వరకు అనేక భావప్రపంచాలు కవితా రూపంలో పలికాయి.


వందేమాతరం...వందేమాతరం…


వందేమాతరమంటే

అది భరతజాతి ఉద్యమగీతంరా

అది నిప్పులు చెరిగే నినాదంరా


వందేమాతరం ఒక్కసారి

ఆలపించిన చాలును రా

ఉప్పెనలా ఉప్పొంగునురా

గుండెల్లో అగ్నిజ్వాలలు

అది వెయ్యేనుగుల బలంరా

అది ప్రాణవాయువును

పోరాడే స్ఫూర్తినందించే మంత్రంరా


వందేమాతరం ఒక్కసారి 

ఆలపించిన చాలును రా

అది జైళ్ళను లెక్కచేయని ధిక్కారంరా

అది బ్రిటిష్ దొరల గుండెల్లో

గుబులు పుట్టించిన నినాదంరా


|| వందేమాతరమంటే...

అది భరతజాతి ఉద్రమగీతంరా

అది నిప్పులు చెరిగే నినాదంరా ||


ఏ పాట వింటే

భారతీయులందరి

ఒళ్ళు పులకరిస్తుందో

ఏ పాట వింటే

తెల్లదొరల గుండెల్లో

మరఫిరంగులు మ్రోగుతాయో


ఏ పాట వింటే

ప్రజలు ఒక ప్రభంజనమై

ఒక ఉప్పెనై విరుచుకుపడతారో

ఏ పాట వింటే

పశువులు శిశువులు

ఉలిక్కిపడి లేస్తాయో


||అదేరా వందేమాతరమంటే...

అది భరతజాతి ఉద్యమగీతంరా

అది నిప్పులు చెరిగే నినాదంరా


ఏ పాట వింటే

అణువణువునా

తరతరాలుగా నరనరాలలో

స్వాతంత్ర్య కాంక్ష

దేశభక్తి రగులుతుందో


ఏ పాట వింటే

మన స్వాతంత్ర్య

సమరయోధులంతా

పిడికిళ్లు బిగించి సింహాలై

సమరానికి సిద్దమౌతారో


ఏ మంత్రదండంతోనైతే

మన విప్లవవీరులు

భగత్ సింగ్, ఝాన్సీలక్ష్మీబాయి

అల్లూరి సీతారామరాజు

పరమక్రూరులైన,

ఆ తెల్లదొరలను ఎదిరించి

వారి గుండెల్లో నిదురించారో


||అదేరా వందేమాతరమంటే...

అది భరతజాతి ఉద్యమగీతంరా

అది నిప్పులు చెరిగే నినాదంరా ||


వందేమాతరమంటే

ఒక పాట కాదురా

అది ఒక తూటారా

వందేమాతరమంటే 

ఒక గేయం కాదురా

అది ఒక ఆయుధంరా


వందేమాతరమంటే 

ఒక శంఖారావం కాదురా

అది ఒక సింహ నినాదంరా


||వందేమాతరమంటే...

అది భరతజాతి ఉద్యమగీతంరా

అది నిప్పులు చెరిగే నినాదంరా||


వందేమాతరమంటే..?

జాతిపిత మనకిచ్చిన

జైలు పిలుపురా...


వందేమాతరమంటే..?

చారిత్రాత్మకమైన

గొప్ప మలుపురా...


వందేమాతరమంటే..?

మన బంగారుతల్లి

భరతమాత గెలుపురా


||వందేమాతరమంటే...

అది భరతజాతి ఉద్యమగీతంరా

అది నిప్పులు చెరిగే నినాదంరా ||


వందేమాతరమంటే..?

భరతజాతి గుండెల్లో గర్వంరా

భరతమాత కళ్ళల్లో కాంతిరా

బెంగాల్ కవి బంకించంద్ర ఛటర్జీ ఆ

తల్లి నుదుట దిద్దిన సింధూరతిలకంరా


నూట యాబది ఏళ్ళ

వందేమాతరం నాడు ఆలపించిన

అమరవీరుల సమరయోధుల

బలిదానాల త్యాగ ఫలమేరా 

నేడు సుభిక్షంగా సురక్షితంగా

స్వేచ్చా వాయువులు పీలుస్తూ

మనందరం అనుభవించే

ఈ అర్ధరాత్రి స్వాతంత్రం...


||ఔనురా వందేమాతరమంటే...

అది భరతజాతి ఉద్యమగీతంరా

అది నిప్పులు చెరిగే నినాదంరా ||



డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 

చూపుడువేలిచ్చే శుభసందేశం..?


1. ఆ చూపుడు వేలు... ఒక దిక్సూచి!


ఆరడుగుల ఆజానుబాహుడు—ఆకాశాన్నే తాకిన ఆలోచనలతో

నూట ఇరవై ఐదు అడుగుల 

ఎత్తుకు ఎదిగిన వాడవాడలా కాదు 

విజయవాడ హైదరాబాద్ నగరాల్లో 

వెలసిన విశ్వవిద్యాలయ విగ్రహం..!


ఎప్పుడూ సూటు–బూటు–

టైతో బ్రిటిష్ దొరలా కనిపించినా—

చేతిలో పట్టుకున్న రాజ్యాంగం

రాజ్యాల్ని కాదు...రాజ్యాధికారపు రహస్యాల్ని చదివిన జ్ఞానఖడ్గం..!


ఒక చేతిలో అక్షరాల అగ్నిజ్వాల—

మరో చేతి చూపుడు వేలు

“అదిగో...సమసమాజం

"అదిగో...స్వేచ్ఛా స్వాతంత్ర్యం 

"అదిగో...సమానత్వం  సౌభ్రాతృత్వం

"అదిగో...బంగారు లోకం 

"అదిగో...మరో ప్రపంచం 

అది ఎంతో దూరంలో లేదని”

దిక్సూచిలా చూపుతూనే ఉంది..!


తరతరాలుగా తలలపై 

వ్రేలాడిన కులం కత్తులకు 

తలవంచని తత్వం 

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ది..!


యుగయుగాలుగా అణచివేత 

అగాధాల్లో అడుగడుగునా 

ఎన్నో అవమానాల్ని‌

అనుభవించి...

భరించి...సహించి...

అంటరానితనమనే

అంధకారపు ఉక్కు సంకెళ్లను

అక్షరాల ఉలితో ఒక్కొక్కటిగా విరిచిన అందరి ఆత్మబంధువు మన అంబేద్కర్..! 


కడుపునిండా తిండిలేని రోజులెన్నో—కంటినిండా నిద్రలేని రాత్రులెన్నెన్నో—జీవితాంతం ముళ్లబాటలోనే నడిచి

బ్రతుకంతా ముళ్ళపాన్పుపైనే పవళించి 

మానవత్వపు మహామార్గాన్ని

చెక్కిన మహామనిషి.!మానవతావాది..!

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 

చూపుడువేలిచ్చే శుభసందేశం..?


2. ఆ చూపుడు వేలు... 

అందించే శుభసందేశం!


తన రక్తపు చుక్కలనే

సిరా చుక్కలుగా మార్చి—

పేదల కన్నీటి చుక్కలకు

రాజ్యాంగపు హక్కుల

రక్షణ కవచం తొడిగిన...

నిరుపేదల తలరాతల 

రాజ్యాంగ నిర్మాత మన

డా.బాబాసాహెబ్ అంబేద్కర్..!


ఆయన చూపుడు వేలు

ఒక వేలు కాదు—అది

వేల ప్రశ్నల వెలుగురేఖ..!


“మతం పేరుతో ముళ్లు నాటకని

"కులం పేరుతో కుళ్లును పెంచకని..

"కులం కుళ్లును 

"కడగడానికి చాలవు కడలి నీళ్లని..! 


మనుషులు మారాలని...

వారి మనసులు మారాలని...

మానవత్వమే మతమని...

సమానత్వమే సమాజమని.

ఒక కొత్త మరో ప్రపంచం పుట్టాలని...

ఆ చూపుడు వేలు హెచ్చరిస్తూనే ఉంది..!


ప్రశ్నించు—ప్రతిఘటించు—

బోధించు...సమీకరించు...పోరాడు..!

పోరాడితే పోయేదేమీ లేదు...

పోయేదొక్కటే—తరతరాలుగా 

మీరు బలైపోయిన మీ బానిసత్వమేనని...

ఆ చూపుడు వేలు హెచ్చరిస్తూనే ఉంది..!


అమాయకపు మేకల్ని తప్ప

పులుల్నెవ్వరూ పూజకు బలివ్వరని.!

ఇకనైనా అమాయకత్వాన్ని విడిచి 

అక్షరాన్ని ఆయుధంగా చేసుకోమని..!


విద్యే విముక్తి—విద్యే విజ్ఞానం—

విద్యే సమానత్వానికి వజ్రద్వారమని..!

ఆ చూపుడు వేలు హెచ్చరిస్తూనే ఉంది..!

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 

చూపుడువేలిచ్చే శుభసందేశం..?


3. ఆ చూపుడు వేలు...ఒక వజ్రాయుధం!


నిజానికి బహుజనుల చేతుల్లో 

"ఓటనే వజ్రాయుధం" ఉన్నంతకాలం

అధికారమెవరి సొత్తుకాదని అందరిదని

అది ప్రజల హక్కని! ప్రజాస్వామ్యమని.!


రాజ్యాంగపు బీజాక్షరాలను

అధికార దాహంతో మార్చాలని 

రహస్య ఎజెండాతో కుట్రలు పన్నే మనువాదుల మాయాజాలానికి

ఒక్కఓటుతోనే తిక్క కుదిరించాలని...

ఆ చూపుడు వేలు హెచ్చరిస్తూనే ఉంది..!


ఎందుకంటే—

అంబేద్కర్ చూపుడు వేలు 

విశ్వం వైపు కాదు—విజ్ఞానం వైపు 

వివాదం వైపు కాదు—విముక్తి వైపు 

వేదాల వైపు కాదు......వెలుగు వైపు బంగారు భవిష్యత్తు వైపు... 


ఆ చూపుడు వేలి చూపిన ఆశయాల దారిలో ఒక్క అడుగైనా వేయడమే—

డాక్టర్ బాబా సాహెబ్‌కు మనమిచ్చే 

పుష్పమాల కాదు...మన జీవితాలతో అర్పించే ఘనమైన నిజమైన నివాళి..!


కవిత కమ్మగా ముగింపు ముచ్చటగా..!


కవిత రాస్తే పూలవానై—

పలికే పెదవులపై పరిమళించాలి..!


పదాలు పేరిస్తే ముత్యాలమాలై—

మనసు ముంగిట మురిసిపోవాలి..!


భావం పలికితే భానుకిరణమై—

చీకటి చింతల్ని చీల్చుకుపోవాలి..!


ఉపమానాలు కొత్త పెళ్లికూతురి

నుదుటి బొట్టులా మెరిసిపోవాలి..!


అలంకారాలు అందాల ఆభరణాలై—

అక్షరాలను అంగాంగాన అలరించాలి..!


జంటపదాలు జలజలమంటూ—

జలపాతాల గానంలా జారిపోవాలి..!


కొత్త పదాలు కోయిల కూతలై—

విన్న చెవుల్లో వసంతాలు పూయాలి..!


కవిత్వం వాక్యాల వరుస కాదు—

వెలిగే వాక్యాల వెన్నెల కావాలి..!


చదివినవాడు కవిని చూడకున్నా—

కవి హృదయాన్ని దర్శించగలగాలి..!


అక్షరం అక్షరాన్ని ఆలింగనం చేసుకుని—

భావం భావాన్ని ముద్దాడుతూ సాగాలి..!


చివరి పాదంలో సందేశం కొసమెరుపైతే

మరోసారి కవితపై పాఠకుని కన్నుపడాలి..!


ఆ మెరుపే అక్షర శిల్పానికి

అందమైన ఓ  ఆభరణం

ఆ కవితే మదిలో శాశ్వతంగా

మిగిలిపోయే ఓ మధురామృతం...!


ఓ జాలిలేని నీలి మేఘమా…!


నీలాల నింగిలో

గాలిలో తేలిపోయే

ఓ జాలిచూపుల

నీలి మేఘమా...!

ఒక్కోసారి నేలపై

చినుకువై రాలిపోవా..!


ఓ నీలి మేఘమా…!

నీవు ఆకాశపు అంచులపై

ప్రకృతి గీసిన వర్ణ చిత్రమా?

సముద్రగర్భాన జనియించి

ఆవిరై ఆకాశపు ఒడిలో పెరిగేవట...


రవి కిరణం తాకగానే

నవకమలం విరిసినట్లు—

చల్లగాలి తాకగానే

నల్లమబ్బుగా మారిపోతావట...


మెరుపు తీగవై ధగధగ మెరిసి

ఉరుముల డమరుకం మోగించి,

చిటపట చినుకుల చిరునవ్వుల

చిగురుటారాకులతో మురిపిస్తావట...


తొలకరి తలపాగాతో

అన్నదాత ఆశలను అలంకరిస్తావట...


ఓ జాలిచూపుల

నీలి మేఘమా..! నీవు

ఒకచోట అమృతధారగా మారి

పిల్లకాలువల కడుపులు నింపి

పంట పొలాల ఒడిలో

పచ్చని పసిడిని పండిస్తావట...

రైతు నుదుటి చెమట చుక్కల్ని

పచ్చని పంటలుగా మార్చే

ఆకలి మంటలు ఆర్పే

అన్నపూర్ణ వౌతావట...


ఓ జాలిలేని నీలి మేఘమా..!

నీవు మరొకచోట కన్నీటి ధారగా

అవతరించి కుంభవర్షమై

ఉరుములతో మెరుపులతో

పిడుగుల నిప్పులు కురిపిస్తావట...


వరదల వలలు విసురుతావట

తుఫానుల్ని సునామీలను సృష్టిస్తావట

పచ్చని‌ పంట పొలాలను ముంచెత్తి

రైతులు కన్న కమ్మని కలల్ని

కన్నీటి కడలిలో కలిపేస్తావట...


ఓ నీలి మేఘమా..!

నీది స్వేచ్ఛా విహారమా..?

ఆకాశం నీ ఆవాసమా..?

సముద్రం నీ జన్మస్థలమా..?

వరుణుడు నీ సూత్రధారినా..?

గాలితో నీది అనురాగ బంధమా..?

అది నీవు విహరించే అదృశ్య రథమా..?


ఓ నీలి మేఘమా..!

నీవు కేవలం ఆకాశపు నీడవు కావట... 

నీవు కడలి కన్నీటి ఆవిరివట...

నేలతల్లి దాహాన్ని

అన్నదాత ఆకలిని తీర్చేందుకు

ఆకాశపుతండ్రి పంపే అమృతధారవట..!

అందుకే ఓ నీలి మేఘమా..!

నీకు స్వాగతం..! సుస్వాగతం..! ఘనస్వాగతం..!


అమరజ్యోతి

డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం..!


సముద్రతీరపు చిన్న పూరిగుడిసె నుంచి

విశ్వవేదికలపై వెలిగిన జ్ఞానసూర్యుడు...

మిసైల్‌ మేధస్సుతో దేశానికి కవచమై...

రాష్ట్రపతి భవన్‌లోనూ

రాచమర్యాదలకు..

రాజభోగాలకు అతీతంగా...

నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనమై...!


ఆస్తులను కూడబెట్టని ఆత్మగా...

అంతస్తులను అధిరోహించిన 

ఆదర్శమూర్తిగా...

త్యాగధనుడిగా...

మతపు గోడలను దాటి

మానవత్వానికి చిరునామాగా...

చింతలేని స్వచ్ఛమైన

జీవితానికి చిత్రపటమై...!


పరోపకారానికి

నిండు పాలకుండై...

మచ్చలేని పచ్చని

జీవితానికి ప్రతిరూపమై...

విద్యార్థుల కలలకు

విజ్ఞానపు రెక్కలు తొడిగిన

యువతకు స్ఫూర్తి ప్రదాతగా...

వెలుగులు పంచిన డాక్టర్ అబ్దుల్ కలాం..!


పదవి ముగిసినా...

పాఠం ముగియని గురువై...

చివరి శ్వాసలోనూ

బోధనే బ్రతుకు భాషగా...

భారత భవిత భవిష్య తరాల

హృదయాలలో అమరజ్యోతిగా...వెలిగిన

బహుదూరపు బాటసారి అబ్దుల్ కలాం..!


అత్యున్నత పదవులెన్ని అలంకరించినా

అందని అందలాలెన్ని అధిరోహించినా

అహంకారమంటని అతిసామాన్యుడు...

మానవాళికే మార్గదర్శి...

విశ్వగురువు...

అందరివాడు...

అజాతశత్రువు...

ఆదర్శనీయుడు...

ఆరని అమరజ్యోతి...డా. అబ్దుల్ కలాం..!


కడవరకు

కాలాంతం వరకు

చెరగని అఖండ కీర్తిని...

తరగని అంతర్జాతీయ ఖ్యాతిని...

ఆస్తిగా ఆర్జించి సొంతం చేసుకున్న

అమరజీవి డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాంకిదే

నా అక్షర నీరాజనం..!


మనువు సృష్టి..? మారిన దృష్టి..?


బుద్ధిబలం, మేధస్సు కలిగి

జ్ఞానవంతులై విద్య నభ్యసించే...

వేదాలను బోధించే...జనావళిని

ఆధ్యాత్మిక మార్గంలో నడిపించే...

బ్రాహ్మణులు...

మనిషికి శిరస్సు వంటి వారన్నది

నాటి మనువు భావమేమో.....?

ఆలోచనల అంతరార్థమేమో...? కానీ...


ఈ బ్రాహ్మణులు...

బ్రహ్మ ముఖము నుండి పుట్టారన్నది...

నమ్మశక్యం కాకున్నది...

ఇది కాలగమనంలో మారిన

ఆధునిక పండితుల ఆలోచనేమో...కానీ

ఇది నిండు అమావాస్య వేళ

పున్నమి చంద్రుడు పుట్టాడనడమే...!


భుజబలం, శౌర్యం, ధైర్యం,

పరాక్రమం, సాహసాలకు

ప్రతిరూపాలై దేశాన్ని రక్షించే...

పరిపాలించే...ధర్మాన్ని పరిరక్షించే...

క్షత్రియులు మనిషికి బలమైన

బాహువుల వంటి వారన్నది

నాటి మనువు భావమేమో....?

ఆలోచనల అంతరార్థమేమో..? కానీ...


ఈ క్షత్రియులు...

బ్రహ్మ భుజాల నుండి పుట్టారన్నది...

నమ్మశక్యం కాకున్నది...

ఇది కాలగమనంలో మారిన

ఆధునిక పండితుల ఆలోచనేమో...కానీ

ఇది పడమర దిక్కున

సూర్యుడు ఉదయించాడనడమే...

పగటి పూట ఆకాశంలో

చుక్కలు కనిపించాయనడమే...!


వ్యాపారం వ్యవసాయం చేసే

సంపదను సృష్టించే ఆర్థికసేవల్లో

ఆరితేరి.....అమ్మి వస్తువుల్ని

అందరి ఆకలి అవసరాలు తీర్చే

ఆర్య వైశ్యులు...

మనిషికి ఊరువుల వంటి వారన్నది

నాటి మనువు భావమేమో....?

ఆలోచనల అంతరార్థమేమో..? కానీ...


ఈ ఆర్య వైశ్యులు...

బ్రహ్మ ఊరువుల నుండి పుట్టారన్నది...

నమ్మశక్యం కాకున్నది...

ఇది కాలగమనంలో మారిన

ఆధునిక పండితుల ఆలోచనేమో...కానీ

ఇది ఎడారిలో నీరు

ఏరులై పారుతున్నదనడమే...!


పై మూడు వర్ణాల వారికి

జీవితాంతం సేవలు చేస్తూ

అవసరాల్లో ఆదుకుంటూ

నీచ వృత్తులు నిర్వహిస్తూ

సమాజ చక్రాన్ని నడిపించే

శూద్రులు...

మనిషికి పాదాలవంటి వారన్నది

నాటి మనువు భావమేమో....?

ఆలోచనల అంతరార్థమేమో..? కానీ...


ఈ శూద్రులు...

బ్రహ్మ పాదాల నుండి పుట్టారన్నది...

నమ్మశక్యం కాకున్నది...

ఇది కాలగమనంలో మారిన

ఆధునిక పండితుల ఆలోచనేమో...కానీ

ఇది అలలు ఆగిపోయాక

సముద్రంలో స్నానం చేశామనడమే...!


నిజానికి ఈ వర్ణవ్యవస్థ...

ఈ నిచ్చెనమెట్ల నిర్మాణం...

కనిపించక కాటువేసే

ఈ కులసర్పాల భావనలు...

అంటరానితనమనే

ఈ ఆరని అగ్నిగుండాలు...

మనువు మూలవాణి కాదేమో...

కాలగర్భంలో కలిసిన ప్రక్షిప్తాలేమో...

ఎవరికి ఎరుక..? వేదశాస్త్రాలను

ఔపాసన పట్టిన మేధావులకు తప్ప...!


మనిషిని ఉద్ధరించే భావమే శాశ్వతం...

మనిషిని అజ్ఞానాంధకారపు చెరలోకి నెట్టి బానిసత్వపు సంకెళ్లలో బంధించే...

ఏ భావమైనా ఏ తరానిదైనా ఏ యుగానిదైనా 

అది ప్రశ్నించ దగిందే..! ప్రతిఘటించ దగిందే..!


అమ్మ...ఒక మమతల కోవెల..!


అమ్మే మన తొలి పొద్దు...

చీకటి తెరలను చీల్చిన

చైతన్య సూర్యోదయం.


అమ్మే మన తొలి ముద్దు...

ఆకలిని అమృతంగా మార్చిన

మమతల మకరందం.


అమ్మే మన తొలి గోరుముద్ద...

గుండె నిండా గారాబం

కుమ్మరించిన ప్రేమ ప్రసాదం.


అమ్మే మన తొలి ప్రేమ...

ప్రతిఫలం కోరని

పరమ పవిత్ర పరిమళం.


అమ్మే మన తొలి నేస్తం...

నవ్వులనూ కన్నీళ్లనూ

నిశ్శబ్దంగా పంచుకునే నీడ.


అమ్మే మన తొలి గురువు...

అక్షరాలకంటే ముందు

ఆచరణ నేర్పిన ఆత్మదీపం.


అమ్మే మన తొలి దైవం...

పిలవక ముందే పలికే ప్రత్యక్ష దైవం


అమ్మే మన తొలి జోలపాట...

కలల ఊయలలో

ఊరించే కోయిల గానం.


అమ్మే మన తొలి మాట...

జీవిత వేదానికి తొలి మంగళాక్షరం.


అమ్మే మన తొలి పూదోట...

పరిమళాలై వికసించిన బాల్య వసంతం.


అమ్మే మన తొలి ఒడి...

అలసిన మదికి ఆప్యాయతల ఆలయం.


అమ్మే మన తొలి బడి...

మనిషిగా చెక్కిన మహా విశ్వవిద్యాలయం


అమ్మే మన తొలి గుడి...

కరుణకు చిరునామా అయిన కల్పవల్లి.


అమ్మే మన తొలి గొడుగు...

ఎండడావానల్లో కాపాడిన కరుణాకవచం.


అమ్మే మన తొలి నేల...

వేర్లు తొడిగిన జీవన జన్మభూమి.


అమ్మే మన తొలి ఆకాశం...

ఆశలకు రెక్కలిచ్చిన విశాల విశ్వం.


అమ్మే మన తొలి వసంతం...

జీవితాన్ని ఫలాలతో నింపిన పచ్చనివృక్షం


అమ్మే మన తొలి సంతకం...

భగవంతుడు ఎదపై చెక్కిన ప్రేమాక్షరం.


అమ్మే మన తొలి ఆశ...

ఓటమిని జయంగా మార్చే ఆత్మవిశ్వాసం.


అమ్మే మన తొలి విజయం...

బిడ్డ చిరునవ్వులో చిరంజీవిగా

నిలిచే మాతృత్వపు మహిమ.


అమ్మను వర్ణించ

చాలవే అక్షరాలు లక్షలైనా ...

అమ్మను ప్రేమించే

హృదయం చాలును ఒక్కటైనా ...

అమ్మే ప్రత్యక్ష దైవమని

గుర్తించే గుండె చాలును ఒక్కటైనా...

అమ్మను అనురాగదేవతగా పూజించే

స్మరించే బ్రతుకు చాలును క్షణమైనా..!



కూకట్లపల్లి పోలయ్య కవి

రచయిత పరిచయం: కూకట్లపల్లి పోలయ్య కవి


జన్మస్థలం : 

కందివారి పల్లె  : గ్రామం 

మార్కాపురం  : మునిసిపాలిటీ 

ప్రకాశం : జిల్లా  ఆంధ్రప్రదేశ్ : రాష్ట్రం. 


తండ్రి పేరు. : కీ.శే.కూకట్లపల్లి ప్రకాశరావు

తల్లి పేరు    : శ్రీమతి కూకట్లపల్లి భాగ్యమ్మ

భార్య పేరు : శ్రీమతి పోతిరెడ్డి సుధారాణి


సంతానం        :ముగ్గురు

పెద్ద కూతురు   : ప్రతిభా లావణ్య

చిన్న కూతురు : లక్ష్మీ సౌజన్య

కుమారుడు     : వంశీ కృష్ణ


పొందిన డిగ్రీలు : M .Com, LLB, CAIIB, 

విద్యాభ్యాసం:

ప్రాథమిక విద్య - ప్రకాశం జిల్లా - తర్లుపాడులో


కాలేజీ చదువు - 1973 -78లో...

Inter‌mediate, B.Com 

శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి కళాశాల...మార్కాపురంలో...


ఉన్నత విద్య - 1978 - 80లో...

M .Com, LLB, CAIIB, 

వాణిజ్య శాస్త్రంలో పట్టా...

నాగార్జునవిశ్వవిద్యాలయం...

గుంటూరులో...


ఉద్యోగవివరాలు:


1981 డిశంబర్ లో...

ఆంధ్రాబ్యాంకులో...ఉద్యోగం..

33 సంవత్సరాల...సుదీర్ఘ ప్రయాణం...

1995 జూన్ లో....హైదరాబాద్ లో...

సీనియర్ బ్రాంచి మేనేజర్ గా పదవీ విరమణ...


ప్రవృత్తి: వచన కవితారచన

పుస్తకపఠనం, కవితాగానం...నటన


వ్రాసిన వచన కవితా రచనల సంఖ్య:

...రమారమి 5000 వచన కవితలు

...దినపత్రికల్లో ప్రింట్ ఐన కవితలు: 

...దాదాపుగా 4600 (75 పత్రికల్లో)

...250 పద్య కవితలు (ద్విశతకం)

... అన్న పోలన్న సుభాషితం

...విన్న మీకు శుభోదయం అన్న

...మధురమైన మకుటంతో

...130 కరోనా కవితలు


స్వీయరచనలు :


(1) ముద్రిత రచనలు : 7

1. కవితా కిరణాలు 

2. సుభాషితాలు - సూర్యకిరణాలు(ద్విశతకం) 

"అన్న పోలన్న సుభాషితం 

"విన్న మీకు శుభోదయం"..

"అన్నమకుటంతో

3. కంప్యూటర్ యుగంలో కాకి

4. జయించడానికే నీవు జన్మించావు

5. స్వామి వివేకానందలా ఆలోచించు 

రామకృష్ణ పరమహంసలా జీవించు

6. Secret of Success.

7. అభిషిక్తుని అమృత వాక్కులు. 


అముద్రితాలు : 

ఇట్లు ప్రేమతో నాన్న ఆశతో అమ్మ

మరో15 పుస్తకాలు...


పొందిన సన్మానాలు/ సత్కారాలు :

1. రాగరమ్య కల్చరల్  ఆర్గనైజేషన్

2. సీనియర్ సిటిజన్స్ వెల్ ఫేర్ సొసైటీ

3. కవన కిరణాలు ముంబై

4. ఉదయం సాహితీ వేదిక

5. తెలుగు సాహిత్య సమితి

6. ఆరికపుడి పూర్ణ చంద్రారావు ఫౌండేషన్

7. సైమన్ ఫౌండేషన్

8. మేడిది సుబ్బయ్య ట్రస్ట్

9. మహర్షి వాల్మీకి సాంస్కృతిక

సేవా సంస్థ

10. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్


ప్రశంసాపత్రాలు...

అందించిన ప్రముఖ సంస్థలు 

 

1. తెలుగు వెలుగు సాహితీ వేదిక 

2. కవన కిరణాలు

3. ఉదయ  సాహితీ వేదిక

4 పున్నమి పత్రిక...

5..ఏ.కె‌ తెలుగుమీడియా ముంబై...

(ఆంధ్రరత్న అవార్డు) 

6. కర్నాటక తెలుగు రచయితల సంఘం...

7. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్

8. ఆరికపుడి పూర్ణచంద్రారావు ఫౌండేషన్

9. సైమన్ ఫౌండేషన్

10. మహర్షి వాల్మీకి

సాంస్కృతిక సేవా సంస్థ

11. తెలుగు సాహిత్య సమితి12. సీనియర్ సిటిజన్ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్

13. శ్రీ శ్రీ కళావేదిక

14. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్


సత్కరించిన ప్రముఖ వ్యక్తులు/కవులు


1. ఉదయ సాహితీ వేదిక పురస్కారం

 (ప్రముఖ కవి ‌రచయిత)

నందిని సిధారెడ్డి గారిచే సన్మానం


2. రాగరమ్య కల్చరల్ ఆర్గనైజేషన్ పురస్కారం

(హాస్య బ్రహ్మ) శ్రీ గౌరీ శంకర్‌

(సినీ గేయ రచయిత) మౌనశ్రీ మల్లిక్ గార్లచే సన్మానం


3. కవన కిరణాలు సాహితీ‌ వేదిక పురస్కారం

(ప్రముఖ కవి ‌రచయిత) నందిని సిధారెడ్డి

(సినీ గేయ రచయిత) మౌనశ్రీ మల్లిక్

(ప్రముఖ విశ్లేషకులు)

నాళేశ్వరం శంకరం గార్లచే సన్మానం


4.ఆరికపుడి పూర్ణచంద్రారావు

ఫౌండేషన్ పురస్కారం

లయన్ శ్రీ విజయకుమార్ గారిచే సన్మానం


5. సైమన్ ఫౌండేషన్ పురస్కారం

(మాజీ సిబిఐ జేడీ )

లక్ష్మీనారాయణ గారిచే సన్మానం


6. మహర్షి వాల్మీకి సాంస్కృతిక

సేవా సంస్థ పురస్కారం

హిమాలయ శివసాయి గురూజీ గారిచే సన్మానం


7.సీనియర్ సిటిజన్

ఇంటర్నేషనల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్

పురస్కారం

(హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి)‌

శ్రీ చంద్రయ్య గారిచే సన్మానం 


8. మేడిది సుబ్బయ్య ట్రస్ట్‌ పురస్కారం

(ప్రముఖ గజల్ రచయిత)

కళారత్న బిక్కికృష్ణ గారిచే సన్మానం


9. తెలుగు సాహిత్య సమితి ‌మరియు

ఆరు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన

మాతృ భాషాదినోత్సవ పురస్కారం

శ్రీ నందినీ సిధారెడ్డి గారిచే సన్మానం


10. విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్

అధ్యక్షురాలు శ్రీమతి విజయలక్ష్మి

పండిట్ గారిచే సన్మానం...


ప్రముఖుల చేతులమీదుగా

సన్మానాలు సత్కారాలు...


1. నందిని సిధారెడ్డి (ప్రముఖ కవి ‌రచయిత)

2. చంద్రయ్య  హైకోర్టు (ప్రధాన న్యాయమూర్తి) 

3. మౌనశ్రీ మల్లిక్ (సినీ గేయ రచయిత)

4. నాళేశ్వరం శంకరం ( ప్రముఖ విశ్లేషకులు)

5. లక్ష్మీనారాయణ(మాజీ సిబిఐ జేడీ )

6. కళారత్న బిక్కి కృష్ణ (ప్రముఖ గజల్ రచయిత)

7. హిమాలయ శివసాయి గురూజీచే సన్మానం

8. మహర్షి వాల్మీకి సాంస్కృతిక సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు డాక్టర్ రాజగోపాల్ గారు


ప్రస్తుతనివాసం & చిరునామా :

పోలయ్య కవి కూకట్లపల్లి

మేనేజర్ ఆంధ్రా బ్యాంకు (రిటైర్డ్)

ప్లాట్ నె.201 

శ్రీ సాయిదత్తా అపార్ట్మెంటు. 

గుమ్మకొండ కాలనీ

గౌతం మోడల్ స్కూల్ వెనుక

అత్తాపూర్ హైదర్ గూడ  

రంగారెడ్డి జిల్లా

హైదరాబాద్ -500048


క్లుప్తంగా...నా గురించి...


మనసులోమాటగా, నా పేరు కూకట్లపల్లి పోలయ్య, కలం పేరు,పోలయ్య కవి కూకట్లపల్లి. ప్రస్తుత నివాసం...అత్తాపూర్ హైదరాబాద్ లో...పదవీవిరమణ జూన్ 2015లో. ఆంధ్రా బ్యాంక్ నుండి అధికారిగా...


ఐతే ఎన్నో ఏళ్ళ తర్వాత చిక్కిన ఒక చక్కని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని విహారయాత్రలు చేసి వీలైనన్ని కొత్తప్రదేశాలను దర్శించాలన్న ఆలోచనలో వున్న ఉన్న నేను కరోనాకాలంలో ఇంట్లోనే బంధీనైపోవడంతో... నా ఊహలకు రెక్కలొచ్చాయి...అనేక నా కవితలు వెలుగు చూశాయి


క్లుప్తంగా... నాసాహితీ సేవ

1975 నుండి 2026 వరకు రమారమి - 51 సంవత్సరాల సాహితీ ప్రయాణం. వృత్తిరీత్యా బ్యాంకు అధికారి‌గా వుంటూ

ప్రవృత్తిరీత్యా కవితలు అల్లడం...నా హాబీ.అనేకానేక సామాజిక అంశాలమీద, సమాజంలోనిఅనేక సమస్యల మీద, మానవ సంబంధాలమీద,

5000 పైగా వచన కవితలు

రచించడంతో పాటు 4600 కవితలు

75 పాత్రికలలో ప్రచురితం

250 వేమనవంటి కవితా పద్యాలు...

130 కరోనా కవితలు...

200 సూక్తులు...

కొత్తగా వ్రాయడం జరిగింది...


నిన్నటి మొన్నటివరకు కారుచీకట్లో

ఉన్న నా కవితలన్ని అనేకమంది సహృదయులైన సంపాదకుల

ఆదరణతో ప్రోత్సాహంతో గత

6 సంవత్సరాలలో సుమారుగా

75 దినపత్రికల్లో

4600 కవితల పైచిలుకు ప్రచురించబడినాయి..




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page