top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 11


'Life Is Love - Episode 11'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 12/03/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

లైఫ్ ఈజ్ లవ్ 11



ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.


దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని. యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.

చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ ని కలుస్తారు నాయుడుగారు. కొడుకు కోసం ముకుందరావును కలవడానికి నిశ్చయించుకుంటారు వరదరాజులు నాయుడు గారు.


ఇంటికి వచ్చిన నాయుడు గారిని అవమానించి పంపుతాడు ముకుందరావు. నాయుడుగారి చిన్నకూతురు అమృత తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడుతుంది. ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది.


వాణి భర్త నవీన్ కి రోజ్ అనే యువతిని పరిచయం చేస్తాడు ఫణి. 

భర్త ఊర్లో లేని సమయంలో యామిని వివాహం దీపక్ తో  రిజిస్ట్రార్ ఆఫీసులో  జరిపిస్తుంది ఆమె తల్లి వసంత. 


ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 11 చదవండి.   


ఉదయం ఏడుగంటలకు స్నానాదులు ముగించి, టిఫిన్ చేసిన తర్వాత యామిని, దీపక్‍లు హాల్లోకి వచ్చారు.

"కూర్చోండి ఇప్పుడే వస్తాను."


"యామినీ! మీ అమ్మగారు రియల్లీ గ్రేట్!" ఎంతో ఆనందంగా చెప్పాడు దీపక్.


"నాన్న అమ్మకు పూర్తిగా వ్యతిరేకం" విచారంగా చెప్పింది యామిని.


దీపక్ ఆమె ముఖంలోకి చూచాడు. ఆమె వదనంలో విచారం.

"నాన్న వచ్చాక ఏమౌతుందోనని భయంగా ఉంది" విచారంగా చెప్పింది యామిని.


"ఏమీ కాదు అప్పటిదాకా మనం ఇక్కడ ఉండబోముగా. మన ఊరికి వెళ్ళిపోదాం. ఆ పిల్లను మనింటికి తీసుకురా. నేను మీపెండ్లి జరిపిస్తాను అని నాన్నగారు అన్నారు. ఇప్పుడు మీ అమ్మ అదే.... అత్తయ్యగారే మన పెండ్లి జరిపించారన్న మాటను మా అమ్మా, నాన్న విని ఎంతో సంతోషిస్తారు" ఆనందంగా చెప్పాడు దీపక్.


యామిని పేలవంగా నవ్వింది. మనస్సున తండ్రిని గురించిన భయం....


వసంత హాల్లోకి వచ్చింది. ఆమె చేతిలో ఓ బ్యాగ్ ఉంది. దాన్ని దీపక్‍కు అందించింది.

"బాబూ! ఇందులో యాభైలక్షలు, అమ్మాయికి నేను చేయించిన నగలు ఉన్నాయి. వీటిని తీసుకొని మీరు ఈ హైదరాబాదుకు దూరంగా నార్త్ సైడ్ వెళ్ళిపోండి. ఏదైనా వ్యాపారం ప్రారంభించి మీరు హాయిగా బ్రతకండి. కాలం ఎప్పుడూ ఒకేలాగే ఉండదు. మనుష్యుల తత్వాలు మారుతుంటాయి. కాలగతిలో మామయ్యగారి మనస్సు మారవచ్చు. పగలు పదిగంటల తర్వాత నాకు ఫోన్ చెయ్యండి. ఇక్కడి సమాచారాన్ని మీకు నేను చెబుతాను. ఆయన తత్వం మారిందని నాకు అనిపించిన నాడు... నేను మిమ్మల్ని రమ్మంటాను. అప్పుడు రండి" నిశ్చలంగా ఎంతో ప్రశాంతతో చెప్పింది. 


"అలాగే అత్తయ్యగారూ"


"అమ్మా... నీవు...."


"తల్లీ యామినీ! నాకేం ఫర్వాలేదు. నీ తల్లిగా, నీ ఆశయాన్ని తీర్చగలిగాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎవరు ఏమన్నా లెక్క చేయను, భయపడను, బాధపడను. సర్వేశ్వరుడు మీకు సదా అండగా వుంటాడు. లేవండి బయలుదేరండి" అనునయంగా చెప్పింది వసంత.

యామినీ, దీపక్‍లు లేచారు. ఆమె పాదాలను తాకారు.


"నిండుగా నూరేళ్ళు చక్కటి పిల్లలతో ఆనందంగా వర్థిల్లండి" అది ఆ ఇరువురికి ఆ ఉత్తమ ఇల్లాలి హృదయపూర్వక దీవెన.


దీపక్, యామినీలు బయలుదేరారు. వాకిట్లో ఓలా క్యాబ్ వచ్చి ఆగింది.

"అమ్మా కారు!"


"నేనే బుక్ చేశాను జాగ్రత్తగా వెళ్ళిరండి" 


ఆ క్షణంలో అంతవరకు అణిచిపెట్టుకున్న కన్నీరు ఇక ఆగలేను అంటూ వసంత చెక్కిళ్ళపైకి జారాయి.

యామిని కన్నీళ్లతో తల్లిని గట్టిగా కౌగలించుకొంది.


"ఎందుకే పిచ్చితల్లి బాధపడతావ్. నా అల్లుడు బంగారే. నిన్ను పువ్వుల్లో పెట్టి చూచుకొంటాడు. ఆనందంగా వెళ్ళిరా" అంది వసంత.


ఇరువురూ టాక్సీలో కూర్చున్నారు.

వసంత వారికి వీడ్కోలు చెప్పింది. డ్రైవరు కారును కదిలించాడు.

***

ఉదయం.... ఆరున్నర గంటల ప్రాంతం నాయుడుగారు వాహ్యాళికి వెళ్ళి ఇంటికి సమీపించారు. అదే సమయానికి ఒక కారు వచ్చి వీధి గేటుముందు ఆగింది.

జగన్నాథ్, పార్వతి, దీపిక కారునుండి దిగారు. వేగాన్నిపెంచి నాయుడుగారు వారిని సమీపించారు. 


"అన్నా! అన్నమాట ప్రకారం వచ్చేశావు. నాకు చాలా ఆనందంగా ఉంది" నవ్వుతూ చెప్పారు వరదరాజుల నాయుడుగారు. 


వాకిట కారు ఆగిన శబ్దం విని అనురాధ వరండాలోనికి వచ్చి వాకిట కారునుండి దిగినవారిని... నాయుడుగారిని చూచింది. వేగంగా వీధి గేటువైపుకు వచ్చింది.

అనూను చూచిన నాయుడుగారు నవ్వుతూ....

"అనూ! ఎవరో చెప్పగలవా!"


అనురాధ జగన్నాథ్, పారూను చూచి " నమస్కారం బావగారూ! అక్కయ్యా" చేతులు జోడించింది.

పార్వతి నవ్వుతూ అనురాధ చేతిని తన చేతిలోనికి తీసుకొంది.


"అనూ! బాగున్నావా అమ్మా" ఆప్యాయంగా అడిగింది. అను చిరునవ్వుతో నాయుడిగారి ముఖంలోనికి చూచి తలాడించింది.

"బావగారూ.... అక్కా... రండి" దీపిక ముఖంలోనికి చూచి....

"అమ్మా... దీపికా నీ గురించి మీ చిన్నాన్న నాకు గొప్పగా చెప్పారు. నిన్ను చూస్తుంటే అందులో ఒక్కమాట పొల్లులేదనిపిస్తోంది. రా... తల్లీ... రా... దీపిక" అని చేతిని తన చేతిలోనికి తీసుకొంది అనురాధ.


నలుగురూ వరండాలోనికి ప్రవేశించారు.

"ఒరేయ్ నాయుడూ! ఈరోజు సోమవారం. ముందు వెంటనే స్నానం చెయ్యాలి. ఓ పావుగంట ఆ సర్వేశ్వరుని ధ్యానించాలి. టిఫిన్ తింటూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం" అన్నాడు జగన్నాథ్.


"అలాగే అన్నయ్యా!"


"బావగారూ! వేడినీళ్ళు రెడీ. రండి స్నానాల గది చూపిస్తాను" ఇంట్లోకి నడిచింది అనురాధ. వెనుతిరిగి "ముందు ఓ కప్పు కాఫీ త్రాగుతారా బావగారూ" అడిగింది.


"వద్దమ్మా. స్నానం, పూజ అయిన తర్వాత తీసుకొంటాను" సాంత్వనంగా చెప్పారు జగన్నాథ్.

అందరూ హాల్లోకి ప్రవేశించారు. నాయుడుగారు జగన్నాథ్‍కు రెస్ట్ రూం చూపించారు.


అనురాధ, ఆమె వెనకాల పార్వతి, దీపిక వంటగదిలో ప్రవేశించారు.

"అనూ! నేను స్నానం చేస్తానమ్మా" అంది పార్వతి.


"అలాగే అక్కయ్యా! రండి..." మరో రెస్ట్ రూంను చూపించింది. పార్వతి లోనికి వెళ్ళిపోయింది.

"పిన్నీ! నేను మీకు ఏమైనా సాయం చేయనా" చిరునవ్వుతో అడిగింది దీపిక.

అనూ దీపికను పరిశీలనగా చూచింది. ఆమెకు అమృత గుర్తుకు వచ్చింది.

దాదాపు ఇరువురూ ఒకే వయస్సువారే ’చిన్ని ఎక్కడ? ఎలా ఉందో? ఎప్పుడైనా వస్తుందో రాదో’ అనుకొంది.


"పిన్నీ! దేన్ని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు" అడిగింది దీపిక.


"నా చిన్నికూతురు అమృతను గురించమ్మా. ఆ పిల్ల అచ్చం నీలాగే ఉంటుంది. నిన్ను చూడగానే తాను గుర్తుకు వచ్చిందమ్మా" విచారంగా చెప్పింది అనురాధ.


"ఓ అలాగా పిన్నీ. పరీక్షలు అవగానే వస్తుందిగా. బాబాయిగారు హైదరాబాదులో చెప్పారు."

"ఆ.... ఆ..... మరో నెల తర్వాతట"



"అంతవరకు నేను ఇక్కడే మీకు తోడుగా వుంటానులే పిన్నీ. బాధపడకండి" ప్రీతిగా చెప్పింది దీపిక.

పార్వతి స్నానం చేసి బట్టలు మార్చుకొని వంట గదిలోనికి వచ్చింది.

"అక్కా రండి టిఫెన్ రెడీ" అంది అనురాధ నవ్వుతూ.


"అనూ! నేను మా అన్నయ్యా డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని వున్నాము" హెచ్చుస్థాయిలో చెప్పారు నాయుడుగారు.


"ఆ.... ఆ.... వస్తున్నానండీ...." అదే స్థాయిలో అనురాధ జవాబు.

"అమ్మా! దీపికా"


"చెప్పండి పిన్నీ"


"ఈ బౌల్‍ను డైనింగ్ టేబుల్ మీద పెట్టమ్మా!"


బౌల్ అందుకొని దీపిక డైనింగ్ టేబుల్ వైపునకు నడిచింది. స్టీల్ ప్లేట్లను గారెల ప్లేటును చేతిలోనికి తీసుకొని "అక్కయ్యా... రండి" అంది అనురాధ.


ఇరువురూ డైనింగ్ టేబుల్‍ను సమీపించారు. తన చేతిలోని వాటిని డైనింగ్ టేబిల్ మీద వుంచింది అనురాధ.


"అక్కా! దీపికా కూర్చోండి. అందరం కలిసి టిఫిన్ తిందాం."


ఐదు ప్లేట్లను టేబుల్‍పైన ఉంచి ఉప్మాను వడ్డించింది.

రెండేసి వేడి గారెలను కూడా ఆ ప్లేట్లలో పెట్టింది.

దీపిక గ్లాసుల్లో నీళ్ళు పోసింది. ఆడవారు ముగ్గురూ కూర్చున్నారు. అందరూ తినడం ప్రారంభించారు.


"అనూ! ఉప్మా సూపర్ అమ్మా" చిరునవ్వుతో చెప్పాడు జగన్నాథ్.


"పిన్నీ! నాన్న చెప్పింది నిజం" నవ్వుతూ చెప్పింది దీపిక.


"నాయుడూ"


"చెప్పండన్నా"


"టిఫిన్ తిన్నాక మనం మన స్థలాన్ని చూచేందుకు వెళదాం" చెప్పాడు జగన్నాథ్.


"అలాగే అన్నా"


"నాయుడూ! మనం అక్కడ ఓ ఆశ్రమాన్ని, ఓ హాస్పిటల్‍ను నిర్మించాలనేది నా ఉద్దేశ్యం. నీకు ముందే చెప్పానుగా మనం పుట్టి పెరిగిన మన ఈ ప్రాంత ప్రజలకు నా శేష జీవితంలో ఏదో మనం చేయతగిన సహాయం చేయాలన్నది నా ఆశయం" చెప్పాడు జగన్నాథ్.


"చాలా మంచి ఆశయం అన్నయ్యా!"


"ప్రస్తుతంలో హైదరాబాదులో కొన్ని హాస్పిటల్స్ ని పార్ట్ టైమ్ విజిట్ చేస్తున్నాను. మన హాస్పిటల్ నిర్మాణం జరిగితే.... నేనూ ఇక్కడికి వస్తాను. నాకు నీవు.... నీకు నేను... అండ... నీకూ ఆనందమేగా."


"చాలా... చాలా జగ్గన్నా మాటలతో చెప్పలేను" ఎంతో సంతోషంతో చెప్పారు వరదరాజుల నాయుడుగారు.


టిఫిన్ తినడం ముగిసింది.

అనురాధ వంట గదిలోనికి వెళ్ళింది.


దీపిక ప్లేట్లను తీసి వాష్ రూం ముందున్న ప్లాస్టిక్ టబ్‍లో పెట్టింది. వంటగదికి వెళ్ళింది. 

అనురాధ  కప్పుల్లో పోసిన కాఫీని ట్రేలో పెట్టుకొని డైనింగు టేబుల్‍ను సమీపించి నాయుడుగారికి, జగన్నాథ్‍కు, తన తల్లి పార్వతికి అందించింది. తనూ ఓ కప్పును చేతికి తీసుకుంది. అనురాధ వచ్చింది. ఆ కప్పును ఆమెకు అందించింది. ఐదవ కప్పును తాను చేతికి తీసుకొంది. 


అందరూ కాఫీలు తాగారు.

వాకిట్లో కారు ఆగిన శబ్దం.

అందరూ వరండాలోనికి వచ్చారు.

దీపక్, యామినీలు టాక్సీ దిగారు.


ఆ యిరువురిని చూచి వరండాలోని వారంతా ఆశ్చర్యపోయారు. అనురాధకు నాయుడుగారు హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చాక చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.


"అనూ! మనవాడు ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించాడు. వాడి వివాహాన్ని జరిపించాలని ముకుందరావును కలిశాను. అతను అహంకారంతో నా మాటను కాదన్నాడు. నాకు నా బిడ్డ ఆనందం ముఖ్యం. అందుకే వారిరువురికీ వివాహం జరిపించాలని నిర్ణయించుకొన్నాను. ఆ అమ్మాయిని తీసుకొని మన వూరికి రమ్మని దీపక్‍కు చెప్పి వచ్చాను" చెప్పాడు నాయుడుగారు.

వారిరువురినీ పరీక్షగా చూచి వెనుతిరిగి ఇంట్లోకి వెళ్ళింది పార్వతి.


ఎర్రనీళ్లతో వరండాలోనికి వచ్చింది.

దీపక్, యామినీలు వరండా మెట్లను సమీపించారు.


"ఆగండ్రా..."


ముందుకు వచ్చి చేతిని ఎర్రనీళ్ళ ప్లేటుతో వారికి దిష్టి తీసింది అనురాధ. 


"ఆ..... ఇక లోనికి రండి" నవ్వుతూ చెప్పింది అనురాధ.


ఆమె చేతిలోని ప్లేటును దీపిక అందుకొంది. వరండా మెట్లు దిగి ప్రక్కన ఆ నీళ్ళను పారబోసింది. లేడీలా పరుగున వరండాలోనికి ప్రవేశించింది.


"నాన్నా! మా వివాహాన్ని యామిని అమ్మగారు రిజిష్ట్రారు ఆఫీసులో జరిపించారు" తండ్రి ముఖంలోనికి చూస్తూ మెల్లగా చెప్పాడు దీపక్.


నాయుడుగారు కొడుకును కోడలిని పరీక్షగా చూచారు. తప్పు చేసినవారిలా వారు తలలు దించుకొన్నారు.

"రేయ్! దీపక్ తలను పైకెత్తరా. అమ్మాయి చేతిని నీ చేతిలోనికి తీసుకో" నవ్వుతూ చెప్పాడు జగన్నాథ్.


"నీవు చేసిన పనికి నాకు ఎంతో ఆనందం చిన్నా. పదండి లోపలికి" ఆనందంతో చెప్పారు నాయుడుగారు.


"వదినా! కుడికాలు ముందు లోన పెట్టాలి తెలుసుగా" నవ్వుతూ చెప్పింది దీపిక.


యామిని సిగ్గుతో, చిరునవ్వుతో వంచిన తలను ఆడించింది.

అందరూ హాల్లోకి ప్రవేశించారు.

"ఇద్దరూ స్నానాలు చేయండి. టిఫిన్ తిందురుగాని" కోడలి ముఖంలోకి ప్రీతిగా చూస్తూ చెప్పింది అనురాధ.


అనురాధ పార్వతి ముఖంలోకి చూచింది.

ఆమె ముఖ భంగిమ గమనించిన పార్వతి "అనూ! మన కోడలు బంగారుబొమ్మ!" నవ్వుతూ చెప్పింది పార్వతి.


యామినీకి దీపిక రెస్ట్ రూం చూపించింది.

ఇరవై నిముషాల్లో యామిని, దీపక్‍లు స్నానం చేసి డ్రస్ మార్చుకొని హాల్లోకి వచ్చారు.

"దీపక్! నేనూ, పెదనాన్నా, మీ వాణి అక్క అమ్మిన భూమిని చూసేందుకు వెళుతున్నాము. ఓ గంటలో తిరిగి వస్తాము. వచ్చిన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం" చెప్పారు నాయుడుగారు.


"అలాగే నాన్నా!"


"అన్నా! బయలుదేరుదామా!"


"ఆ... పద"


నాయుడుగారు జగన్నాథ్ స్థలం చూచేదానికి కారులో బయలుదేరారు. వాళ్ళు వెళ్ళే మార్గంలోనే వుంది నరసపనాయుడు ఇల్లు. వీధి వాకిట వున్న నరసపనాయుణ్ణి చూచిన నాయుడుగారు డ్రైవరును కారు ఆపమన్నారు.

కారు ఆగింది.

నాయుడుగారు కారు దిగి "అన్నా! కారు దిగండి" అన్నారు.


జగన్నాథ్ కారు దిగాడు.

ఇరువురినీ చూచి నరసపనాయుడు వారిని సమీపించారు.


"నమస్కారం బావా" జగన్నాథ్‍ను పరీక్షగా చూస్తూ.... "వీరు...."


నరసపనాయుడు పూర్తిచేయకముందే "నాయుడూ! ఎవరో చెప్పు!" నవ్వారు నాయుడుగారు.


"బావా... వీరు... వీరు...." ఆశ్చర్యంతో జగన్నాథ్‍ను చూచారు నరసపనాయుడు.


"మన జగన్నాథ్!" అన్నాడు నవ్వుతూ.


"ఆ...."


"అవును"


నరసపనాయుడు ఆనందంగా జగన్నాథ్ చేతులను తన చేతుల్లోనికి తీసుకొని "బావా! ఎన్నేళ్ళ తర్వాత మిమ్మల్ని చూడగలిగాను అని నాకు... నాకు చాలా ఆనందంగా ఉంది"


"నాకూ బావా!" ఆనందంగా జగన్నాథ్ నరసపనాయుడిని తన హృదయానికి హత్తుకొన్నాడు.


ఇంట్లోంచి వాకిట్లోకి వచ్చిన శివ వారిని చూచాడు.

వారిని సమీపించాడు.


"అన్నా!.... నరసబావ కొడుకు శివరామనాయుడు ఎం.ఆర్క్, నా ప్రియ శిష్యుడు."


శివ చేతులు జోడించాడు.

"నమస్కారం సార్!" అన్నాడు.


జగన్నాథ్ శివను పరీక్షగా చూచారు.

"నమస్తే బాబూ!" అతని మనస్సున వేరే భావన. యాంత్రికంగా చెప్పాడు.


"బావా! మన వాణి భాగాన్ని జగ్గన్న కొన్నారు. చూచేదానికి వెళుతున్నాము వస్తావా?" అడిగారు నాయుడుగారు.


"వస్తా... బావా... పదండి" అన్నాడు నరసపనాయుడు.


"శివా! నీవూ వస్తావా?"


"మీరు రమ్మంటే వస్తాను."


గురు శిష్యుల సంభాషణ.

"రా శివా!" నవ్వుతూ చెప్పారు నాయుడుగారు.


శివ డ్రైవరు ప్రక్కన కూర్చున్నారు.

ముగ్గురు మిత్రులు వెనుక సీట్లో కూర్చున్నారు.

పది నిమిషాల్లో కారు ఆ ప్రాపర్టీ ముందు ఆగింది.


నలుగురూ కారు దిగారు. ప్రాపర్టీలోకి నడిచారు. అది నాలుగు ఎకరాల మెట్టభూమి. పది అడుగుల డయా బావి ఉంది. నీటికి కొరతలేదు. వాస్తు ప్రకారం ఈశాన్యంలో ఉంది.

నలుగురూ అన్నివైపులా తిరిగి చూచారు.


"అన్నా! ఎలా వుంది మన భూమి" అడిగారు నాయుడుగారు.


"చాలా బాగుంది నాయుడూ. నా ప్రణాళికకు అనువైన స్థలం."


"ఆ శివా! నాకు మీరు ఓ నాలుగువేల ఆరువందల చదరపు అడుగుల్లో హాస్పిటల్ వెయ్యిన్ని ఐదువందల రెసిడెన్షియల్ ఫోర్ బెడ్‍రూమ్ హౌస్ డిజైన్ చేసి ఇవ్వగలరా?" అడిగాడు జగన్నాథ్.


"ఇవ్వగలరా కాదు బావా! ఇవ్వగలవా వాడు నీకు అల్లుడి వరస అవుతాడుగా" నవ్వుతూ చెప్పాడు నరసపనాయుడు. 


"ఆ....ఆ..... అవును కదూ!" జగన్నాథ్ ముఖంలోకి చూస్తూ...

"అన్నా.... అల్లుడు" చిరునవ్వుతో చెప్పారు నాయుడుగారు.


"నాయుడూ! నీవు అన్నమాట నేను కాదంటానా."


"ఆ.... బావా! నరసపనాయుడుగారూ! నీ కొడుకును నాకు అల్లుడిగా చేస్తావా! నా కూతురు దీపిక కూడా ఆర్కిటెక్టే" ప్రశ్నార్థకంగా నరసపనాయుడి ముఖంలోనికి చూచాడు జగన్నాథ్.


"మీరిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత నేను కాదని ఎలా అనగలను బావా!" చిరునవ్వుతో చెప్పాడు నరసపనాయుడు.


"శుభమస్తు శీఘ్రం. రేపు దశమి శుక్రవారం. బావా నరసప్పా రేపు పదిగంటలకు మన ఇంటికి వచ్చి మా అమ్మాయిని చూచుకోండి సరేనా!" అడిగారు నాయుడుగారు.


"అలాగే బావా!"


"శివా! నీ అభిప్రాయం" అడిగారు నాయుడుగారు.


"సార్! మీ ఇష్టమే నా ఇష్టం" చిరునవ్వుతో చెప్పాడు శివ.


నలుగురు కారు ఎక్కారు. డ్రైవరు కారును స్టార్ట్ చేశాడు. 

పదినిమిషాల్లో నరసపనాయుడి ఇంటిని సమీపించారు. తండ్రి కొడుకులు దిగారు.


"బావా! మరోసారి చెబుతున్నాను. రేపు పదిగంటలకు నీవు, మా చెల్లెమ్మా, శివా మన ఇంటికి రావాలి బావా" నవ్వుతూ చెప్పారు నాయుడుగారు.


"తప్పకుండా బావా!" అన్నాడు నరసపనాయుడు.


కారు నాయుడిగారి ఇంటివైపు బయలుదేరింది. ఐదు నిమిషాల్లో నాయుడుగారు, జగన్నాథ్‍లు ఇంటికి చేరారు.

పార్వతి, అనసూయకు నాయుడుగారు నరసపనాయుడిని శివాను కలిసిన విషయాన్ని చెప్పి రేపే పెండ్లి చూపులన్నారు.


"అన్నా! నీవు పోయిన వారంలో ఫోన్‍లో చెప్పావుగా. మన దీపకు మంచి సంబంధం చూడమని! నేను అప్పుడు నిర్ణయించుకొన్నాను. శివ మన దీపకు సరైన జోడి అని. నా నిర్ణయాన్ని నీవు అంగీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది" ఆనందంగా చెప్పారు నాయుడుగారు.

"నా సమస్యను అతి సులువుగా నీవు తీర్చేశావురా!" ఆనందంతో చెప్పాడు జగన్నాథ్.


వారి మాటలను విన్న దీపిక అందరి ముఖాల్లోకి ప్రశ్నార్థకంగా చూచింది.

ఆమె భావాన్ని అర్థం చేసుకున్న అనురాధ దీపను సమీపించి....

"చిన్నీ! శివ చాలా మంచివాడు. నేను మీ చిన్నాన్న వాణ్ణి చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. నీవు చాలా అదృష్టవంతురాలివి" అనునయంగా చెప్పింది అనురాధ.


అనురాధ తర్వాత నాయుడిగారి ముఖంలోనికి చూచింది. ఆ చూపులో ఏదో బాధ.

గ్రహించిన నాయుడుగారు అనురాధను సమీపించాడు.


"అనుకొన్నవన్నీ జరుగవు. అనూ! ఎవరికి ఎవరో మనకు తెలియదు. అంతా ఆ దైవ నిర్ణయం. దీపిక మన బిడ్డే అనూ! ఆనందంగా ఆమె వివాహం శివతో జరిపించి అన్నా వదినలకు ఆనందాన్ని కలిగించడం మన బాధ్యత. ఒకరి అదృష్టం మరొకరు చెరుపలేరు" మెల్లగా అనునయంగా చెప్పారు నాయుడుగారు.


"అమ్మా అనూ! నీకు ఈ సంబంధం ఇష్టమేనా?" అడిగారు జగన్నాథ్ ఆమె ముఖ భావాలను గ్రహించి.

"బావగారూ! నాకు పరిపూర్ణ సమ్మతం" నవ్వుతూ చెప్పింది అనురాధ.


దీపును సమీపించి "దీపూ! యు ఆర్ టూ లక్కీ. శివ బావ చాలా మంచివాడమ్మ" ఆనందంగా చెప్పాడు దీపక్.


దీపిక పరవశంతో అతని హృదయంపై వాలిపోయింది.

"తల్లీ! నీవు నిండు నూరేళ్ళు శివతో ఎంతో ఆనందంగా, హాయిగా వర్ధిల్లుతావమ్మా!" తన కుడిచేతిని దీపిక తలపై వుంచి ఆశీర్వదించాడు దీపక్.


యామిని దీపిక చేతిని తన చేతిలోనికి తీసుకొని నవ్వుతూ "కంగ్రాట్యులేషన్ దీపు" ప్రీతిగా చెప్పింది.


అందరి మాటలను విన్న దీపిక హృదయంలో ఎంతో ఆనందం.... సంబరం.... అందరూ కలిసి ఆనందంగా భోజనం చేశారు. భోజనానంతరం దీపక్, యామినీలు రేపటి దీపిక పెండ్లి చూపుల ఏర్పాట్లను, ఇల్లు సర్దడంలో నిమగ్నులైనారు. దీపిక వారికి సాయంగా వారితోనే ఉంది.

పెద్దలు నలుగురూ బజారు వెళ్ళి కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేసి తిరిగి వచ్చారు.

రాత్రి భోజనాలు ముగిశాయి. అందరూ ఆనందంగా రేపటి పెండ్లిచూపుల కార్యక్రమాన్ని గురించి ఆలోచనలతో ప్రశంతంగా నిద్రపోయారు.


చెప్పిన మాట ప్రకారం నరసపనాయుడు అర్థాంగి శారద. కుమారుడు శివ నాయుడుగారి ఇంటికి మరుదినం పదిగంటలకు వచ్చారు.

పెండ్లి కొడుకు, పెండ్లి కూతురు ఒకరినొకరు చూచుకొన్నారు. ఆనందంగా సమ్మతిని తెలియజేశారు. నిశ్చితార్థానికి నాయుడుగారు తేదీని నిర్ణయించారు. నరసపనాయుడు భార్య కుమారునితో ఇంటికి వెళ్ళిపోయారు.


కొత్త దంపతులు దీపక్, యామినీలు పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆ రాత్రి హనీమూన్‍కి బయలుదేరారు.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

38 views0 comments
bottom of page