top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 10'Life Is Love - Episode 10'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 06/03/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 10' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ: 


ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.


దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని. యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.


చిన్ననాటి స్నేహితుడు జగన్నాథ్ ని కలుస్తారు నాయుడుగారు. కొడుకు కోసం ముకుందరావును కలవడానికి నిశ్చయించుకుంటారు వరదరాజులు నాయుడు గారు.


ఇంటికి వచ్చిన నాయుడు గారిని అవమానించి పంపుతాడు ముకుందరావు. నాయుడుగారి చిన్నకూతురు అమృత తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడుతుంది. ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది.

వాణి భర్త నవీన్ కి రోజ్ అనే యువతిని పరిచయం చేస్తాడు ఫణి. 


ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 10 చదవండి. 


యామినీ, దీపక్‍లు నెక్లెసు రోడ్డు ప్రాంతంలో వున్న పార్కులో ప్రవేశించారు. ఆ ప్రాంతం ఎంతో విశాలమైంది. రకరకాల చెట్లు పూలమొక్కలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దంపతులు, ప్రేమికులకు అది ఏకాంత స్థలం. అక్కడ ప్రవేశించినవారు ఎవరి లోకంలో వారు ఉంటారు. ఒకరినొకరు పట్టించుకోరు. అక్కడ వచ్చేవారంతా కాలాన్ని ఆనందంగా వారి ఇష్టానుసారంగా గడిపేటందుకే... ఏ జంటకాజంట ఒకరితో వేరొకరికి నిమిత్తం లేదు. 


యామినీ, దీపక్‍లు ఓ మూల విశాలమైన చెట్టుక్రింద పచ్చికపై కూర్చుని వున్నారు.

"దీపూ!"


"చెప్పు యామినీ"


"మన ప్రేమను గురించి నీ అభిప్రాయం."


"బ్రతికి ఉన్నంతకాలం కలిసే వుందాం. చావాల్సి వస్తే ఇద్దరం కలిసే చస్తాం కానీ..."


"కానీ ఏమిటి?"


"కొందరు కళ్ళు, గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటారు. మనంపోయాక మన ఆ శరీర భాగాలు, ఆ బాధితులకు ఉపయోగపడాలి. వాళ్ళ జీవితం ఆనందమయం కావాలి. డి.ఎం.ఓ ను కలిసి మన నిర్ణయాన్ని వారికి లిఖితపూర్వకంగా ఇవ్వాలని నా కోరిక... అందుకు నీకు సమ్మతమా?"


యామిని నవ్వుతూ అతని ముఖంలోకి చూచింది.

"దీపూ! నీ నిర్ణయం ఎంతో గొప్పది! నీ ఆశయమే నా ఆశయం" అందంగా నవ్వుతూ చెప్పింది.


"యామినీ! ఈ ఒక్కమాటలో నాకు అర్థమయింది నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావన్నది. నేను చాలా అదృష్టవంతుణ్ణి" ఆనందంగా చెప్పాడు దీపక్.


యామిని అతని దగ్గరికి జరిగి తన చేతులను అతని మెడకు చుట్టి అతని హృదయంపై వాలిపోయింది. దీపక్ ఆమె వీపుపై తన చేతులు వేసి ఆమెను గట్టిగా కౌగలించుకొన్నాడు.


"యామినీ! మనుషులకు చావు తప్పదు. కాని వారి పవిత్ర ప్రేమకు చావులేదు. లైలా, మజ్ను, షీరి ఫర్‍హాద్, రోమియో జూలియట్, దేవదాస్, పార్వతి ఆకోవకు చెందినవారు. వారు పోయారు. కాని వారి చరిత్ర కధగా, కావ్యంగా మారిపోయింది. మన ప్రేమ కథ కూడా అలా కావాలనేది నా ఆశ."


"నా ఆశ కూడా అదే దీపూ" పరవశంతో చెప్పింది యామిని. 

"రేపు మనం డి.ఎం.ఓ గారిని కలవాలి. మన నిర్ణయాన్ని లిఖిత పూర్వకంగా వారికి ఇవ్వాలి."


"తప్పకుండా దీపూ"


మరింత దగ్గరికి జరిగి అతన్ని చుట్టేసుకుంది యామిని.

ఆ క్షణంలో వారిరువురికీ ఎంతో ప్రశాంతత, మనస్సున ఎంతో ఆనందం, పరవశం.

అలా వారు పరవశంలో మునిగిపోయారు. కళ్ళు మూసుకున్నారు.

కొంత సమయం వారి మధ్యన ఎంతో ప్రశాంతంగా గడిచిపోయింది.

దీపక్ కళ్ళు తెరిచాడు. దాదాపు నిద్రావస్థలో వున్న యామినీని చూచాడు.

"యామినీ!" మెల్లగా పిలిచాడు. 


భారమైన కనురెప్పలను పైకెత్తి అతని ముఖంలోనికి చూచింది యామిని.


"ఇక మనం బయలుదేరుదాం యామినీ"


"అప్పుడే వెళ్ళాలా?"


"వెళ్ళాలిగా"


"సరే.... మీ యిష్టం"


దీపక్ లేచి నిలబడి తన కుడిచేతిని యామిని వైపు సాచాడు. యామిని తన వామ హస్తాన్ని అతని చేతిలో వుంచింది. గట్టిగా పట్టుకొని యామినీని లేపాడు దీపక్.

ఇరువురూ ఒకరి ముఖాలు ఒకరు చూచుకొన్నారు.

ఆనందంగా నవ్వుకున్నారు.


చేతులు పట్టుకొని ఆ ఇరువురూ పార్కు గేటు దాటారు. ఆటోలో ఎక్కారు. నలభై నిమిషాల్లో ఆటో యామిని ఇంటిముందు ఆగింది.


ఇరువురూ దిగారు. వీధి గేటువైపు చూచారు. యామిని తల్లి వసంత అక్కడ నిలబడి ఉంది. ఆటోకి డబ్బులిచ్చాడు దీపక్. ఆటో వెళ్ళిపోయింది.


యామినీ తల్లివైపునకు నడవసాగింది.

"బాబూ!.... నీవూ రా!" అని పిలిచింది.


ఆశ్చర్యంతో ఆమెవైపు చూచాడు దీపక్.

"రా... బాబు!" ఆప్యాయంగా పిలిచింది వసంత.


యామిని వెనుతిరిగి ’రండి’ అన్నట్టు తలూపింది. 

దీపక్, యామినీలు వసంతను సమీపించారు.

"పదండి లోనికి" అంది.


ముగ్గురూ భవంతి హాల్లో ప్రవేశించారు.

"కూర్చో బాబు!" ప్రేమతో చెప్పింది.


దీపక్ సోఫాలో కూర్చున్నాడు. ప్రశ్నార్థకంగా వసంత ముఖంలోనికి చూచాడు. క్షణం తర్వాత యామిని తల్లి పక్కన కూర్చుంది.


"మా నాన్నగారు మా వివాహానికి అంగీకరించారు ఆంటీ! మీరు మీ యామినీని నాతో మా వూరికి పంపగలరా? మా వివాహాన్ని మా నాన్నగారే జరిపిస్తానన్నారు."


"అలాగా బాబూ!"


"అవును ఆంటీ."


"మీ వివాహాన్ని నేను జరిపిస్తాను."


"మీరా!"


"అవును రేపు రిజిష్టరు ఆఫీసులో"


దీపక్ ఆశ్చర్యంతో వసంత ముఖంలోనికి, యామిని ముఖంలోనికి చూచాడు.


"నేను చెప్పింది నా నిర్ణయం బాబూ! నీకు అభ్యంతరమా?"


"లేదు ఆంటీ లేదు... యామినీ! నీకు సమ్మతమేగా"


"మా అమ్మ నిర్ణయమే నా నిర్ణయం" ఆనందంగా చెప్పింది యామిని.


"ఈ రోజు వారు ఢిల్లీ వెళ్ళారు. నాలుగు రోజుల తర్వాత వస్తారు బాబూ! నీవు దేనికీ భయపడనవసరం లేదు."


"థాంక్యూ ఆంటీ ఇక నేను వెళతాను."


"భోజనం చేసి వెళ్ళు బాబూ"


"దీపూ! అమ్మ మాటను..."


"వింటాను యామినీ అలాగే" నవ్వుతూ చెప్పాడు దీపక్.

ముగ్గురూ కలిసి భోజనం చేశారు. రేపటి ప్రోగ్రాం గురించి వసంతతో మాట్లాడి దీపక్ వెళ్ళిపోయాడు. 


మరుసటి దినం ఉదయం పదిగంటలకు డి.ఎం.ఓ ఆఫీసుకు యామిని, దీపక్‍లు వెళ్ళారు. డి.ఎం.ఓ గారిని కలిశారు. వారి నిర్ణయాన్ని తెలియజేశారు.


ఇంత చిన్నవయస్సులో వారు తీసుకున్న నిర్ణయానికి డి.ఎం.ఓ గారు ఆశ్చర్యపోయారు.


"మీరు బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చారా!" అడిగారు డి.ఎం.ఓ


"ఔను సార్" ఏకకంఠంతో చెప్పారు దీపక్, యామినిలు.

వారు ఇచ్చిన ఫారం పూర్తిచేసి వారికి అందించారు. 


అక్కడినుంచి నేరుగా రిజిష్టరు ఆఫీసునకు వెళ్ళారు.

యామిని తల్లి వసంత, ఆమె స్నేహితురాండ్రు ఇరువురు, దీపక్ స్నేహితులు ముగ్గురు రిజిష్టరు ఆఫీసుకు ప్లాన్ ప్రకారం వచ్చారు.

దీపక్, యామినిలు ఉంగరాలు తొడుక్కొని దండలు మార్చుకొని రిజిష్టరులో సంతకాలు చేశారు.

ఆవిధంగా ఆ ప్రేమికుల వివాహం అతి సింపుల్‍గా.... యామిని తండ్రి ముకుందరావుకు ఇష్టంలేని కారణంగా జరిగింది.


కూతురు అల్లుడుతో వసంత ఇంటికి వెళ్ళిపోయింది. సాక్షులు వారి వారి నిలయాలకు వెళ్ళిపోయారు.

ఇంట్లోకి అడుగుపెట్టగానే యామిని, దీపక్‍లు వసంత పాదాలు తాకి నమస్కరించారు.


ఆమె వారిని హృదయపూర్వకంగా దీవించింది.

నూతన దంపతులు బిర్లా మందిర్‍కు వెళ్ళి జగద్రక్షకుని దర్శించారు. ఎంతో సంతోషంగా శిల్పారామం అంతా ఆనందంగా తిరిగారు. వసంత చెప్పిన ప్రకారం ఏడున్నరకల్లా యామిని, దీపక్‍లు ఇంటికి చేరారు.


వసంత వారి తొలిరేయికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఎనిమిదిన్నరకు భోజనాలు అయిన తర్వాత వసంత ఇరువురిని క్రొత్త తెల్ల వస్త్రాలతో వారి పడక గదిలోకి పంపింది. పరవశంతో ఇరువురూ ఏకమైపోయారు. అలిశారు, సొలిశారు, ఒకరి ఎదపై ఒకరు పరవశంతో మునిగిపోయారు. వారి చిరకాల వాంఛ.... పరమానందంగా తీరింది.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

37 views0 comments

Comments


bottom of page