top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 12


'Life Is Love - Episode 12'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 18/03/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్జరిగిన కథ:


ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.

దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని. యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.


ఇంటికి వచ్చిన నాయుడు గారిని అవమానించి పంపుతాడు ముకుందరావు. నాయుడుగారి చిన్నకూతురు అమృత తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడుతుంది. ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది.


వాణి భర్త నవీన్ కి రోజ్ అనే యువతిని పరిచయం చేస్తాడు ఫణి. 

భర్త ఊర్లో లేని సమయంలో యామిని వివాహం దీపక్ తో రిజిస్ట్రార్ ఆఫీసులో జరిపిస్తుంది ఆమె తల్లి వసంత. 

దీపక్, యామినీలు పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆ రాత్రి హనీమూన్‍కి బయలుదేరారు.


ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 12 చదవండి. 


శివ, జగన్నాథ్ గారు నిర్మించదలచుకున్న హాస్పిటల్, గృహ ప్లాన్స్ ను తయారుచేసుకొని నాయుడిగారి ఇంటికి వచ్చారు.

నాయుడుగారికి, జగన్నాథ్‍కు ఆ డ్రాయింగ్స్ చూపించాడు. జగన్నాథ్ దీపికను పిలిచి ఆ ప్లాన్స్ చూపించాడు.


"అమ్మా! నీవు ఆర్కిటెక్ట్ వేగా వీటిని చూడు ఎలా వున్నాయో? నీ అభిప్రాయం చెప్పు."

చిరునవ్వుతో దీపిక శివ ముఖంలోనికి చూచి ఆ డ్రాయింగ్‍లను అందుకొని పరీక్షగా చూచింది.

శివ ప్లానింగ్ ఆమెకు బాగా నచ్చింది. పది నిమిషాల తర్వాత "మీరు నన్ను వేయమన్నా నేను ఇలా వేసేదాన్ని నాన్నా ప్లానింగ్ చాలా బాగుంది" ఆనందంగా నవ్వుతూ చెప్పింది. 


శివ ముఖంలోకి చూచింది.

శివ చిరునవ్వుతో కళ్ళతో ధన్యవాదాలను తెలియజేశాడు. ముసిముసి నవ్వులతో దీపిక తల దించుకొంది.

శివ పెద్దవారిరువురికి నమస్కరించి వెళ్ళిపోయాడు.


నాయుడుగారు తనకు సన్నిహితుడైన శ్రీకాంత్ బిల్డరును పిలిపించారు. శ్రీకాంత్, జగన్నాథ్‍లు చిన్ననాటి మిత్రులే. గత జ్ఞాపకాలను తలచుకొంటూ ఆ ఇరువురు మిత్రులు కౌగలించుకున్నారు. నాయుడుగారు తాను హైదరాబాదులో జగన్నాథ్‍ను కలిసినప్పటి నుంచి జరిగిన అన్ని విషయాలను శ్రీకాంత్‍కు వివరించారు. 


పురోహితులు వచ్చారు. శివ, దీపిక నిశ్చితార్థ వివాహాలకు ముహూర్తాలు నిర్ణయించబడ్డాయి.


జగన్నాథ్, పార్వతిలు ఎంతగానో సంతోషించారు. బిల్డరు శ్రీకాంత్ వచ్చాడు. నిర్మించాల్సిన ప్లాన్స్ వారికి చూపించారు. తొమ్మిది నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తానని చెప్పాడు.


రెండు రోజుల తర్వాత శుభముహూర్తాన భూమిపూజ జరిగింది. హాస్పిటల్, భవన నిర్మాణ పనులు ప్రారంభించాడు బిల్డరు శ్రీకాంత్.


నిర్మాణ వ్యవహారాలను చూచుకోవాల్సిన బాధ్యతను నాయుడుగారు శివకు అప్పగించారు.

వారంరోజుల తర్వాత జగన్నాథ్, పార్వతి, దీపిక హైదరాబాద్ వెళ్ళిపోయారు.

ముకుందరావు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాడు. గార్డెనర్ గంగరాజు తనకు నమ్మినబంటు. అతని ద్వారా తాను ఊరిలో లేని సమయంలో జరిగిన యామిని వివాహ విషయం తెలిసింది.


భార్య వసంతను ఆవేశంలో అడిగాడు. 


"ఔను.... వారిరువురూ ఒకరినొకరు ఎంతగానో అభిమానించుకున్నారు. ప్రేమించుకున్నారు. వివాహం చేసుకొని జీవితాంతం కలిసి ఒక్కటిగా బ్రతకాలనుకొన్నారు. అందుకే వారి వివాహాన్ని నేను జరిపించాను" నిర్భయంగా చెప్పింది వసంత.


ముకుందరావు ఆవేశంతో ఆమెను చెంపపై కొట్టాడు.

వసంత ఆవేశంతో చేతిని పైకెత్తింది.

"మీరు అమానుషంగా నన్ను కొట్టారు. నేనూ ఆ పని చేయగలను. అలా చేస్తే మీరూ నేను ఒకటే అవుతాము. నేను మంచి మనసున్న మనిషిని. మీలాంటిదాన్ని కాను. ఛీ!" అని చేతికి క్రిందికి దించింది వసంత. 


అవమానంతో, ఆవేశంతో ముకుందరావు తన గదికి వెళ్ళిపోయాడు.


తనకు బాగా తెలిసిన రౌడీ రాంబాబుకు ఫోన్ చేసి దీపక్‍ను చంపి తన కూతురు యామినీని లాక్కుని వచ్చి తనకు అప్పగించవలసిందిగా చెప్పాడు. వారి ఫోటోలను వాట్సప్‍లో అతనికి పంపాడు.


యామినీకి ఫోన్ చేసి ఎక్కడవున్నారో కనుక్కొని జాగ్రత్తగా వుండవలసిందిగా చెప్పింది వసంత.


రాంబాబు నెల్లూరికి వచ్చి నాయుడుగారిని కలిసి ’ముకుందరావుగారు మనస్సు మార్చుకొన్నారని వారి ఆరోగ్యం సరిగా లేదని, యామినీని దీపక్‍ను హైదరాబాదు రమ్మన్నారని’ నక్కవినయంగా చెప్పాడు.


అమాయకులైన... నాయుడుగారు వాడి మాటలను నమ్మి వారు హనీమూన్‍ కోసం ఊటీకి వెళ్ళారని, నాలుగు రోజుల్లో తిరిగి వస్తారని చెప్పారు రాంబాబు గారు.

నవీన్, రోజ్‍మన్‍ల స్నేహం బాగా బలపడింది. అతను వాణిని నిర్లక్ష్యం చేసి ప్రతిరోజు రోజ్‍తో ఆనందంగా గడిపేవాడు. రోజ్ గర్భవతి అయింది.

రాత్రి సమయంలో ఇంటికి రాని భర్తపై వాణికి అనుమానం కలిగింది. ఆ ఆవేదనను భరించలేక ఆరోజు ఆఫీసుకు బయలుదేరబోతున్న నవీన్‍ను అడిగింది వాణి. 


"ఈరోజు ఇంటికి వస్తారా రారా!"


భార్య ముఖంలోనికి పరీక్షగా చూచిన నవీన్....

"రాను" ముక్తసరిగా జవాబు చెప్పాడు.


దుర్గామాత సీన్‍లో ప్రవేశించింది.

"రాత్రి సమయంలో ఎక్కడ పడుకొంటున్నారు?" అడిగింది వాణి.


ఆవేశంగా వాణి ముఖంలోకి చూచాడు నవీన్.

"నాకు ఇష్టమైన చోట, స్నేహితుని ఇంట్లో..."


"ఆ స్నేహం మగవారితోనా, ఆడవారితోనా" నిర్భయంగా అడిగింది వాణి.


"ఆ వివరాలు నీకు అనవసరం."


"ఏంటే!.... నీ మాటలు... వాడు మగవాడు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాడు. పైకి రావాలంటే పగలు, రాత్రి కూడా పనిచేయాల్సి ఉంటుంది. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి వాణ్ణి నిందించకు" ఆవేశంతో చెప్పింది దుర్గ.


’దుర్గ మనిషి కాదు..... రాక్షసి. వాదిస్తే.... మనస్తాపమే... పెంటమీదికి రాయి విసిరితే ముఖాన పడినట్లు ఛీ... సంస్కారం లేని మనుషులు’ అనుకొని మౌనంగా వెళ్ళిపోయింది.


నవీన్ తల్లికి చెప్పి ఆఫీసుకు వెళ్ళిపోయాడు.

వాణి తన సీనియర్ లాయర్ సత్యానందరావుగారి ఆఫీసుకు వెళ్ళిపోయింది. 


తనకు చెప్పకుండా వెళ్ళిపోయిన వాణిపై పళ్ళు నూరింది దుర్గాదేవి.


మనస్తత్వాల బేధంతో ఆడవారికి ఆడవారే శత్రువులు. ఎందుకో కొందరు అతివలు, కన్నకూతురికి ఒక న్యాయం. కోడలికి మరో న్యాయం అని భావించి వర్తించేవారు కొందరు. ఇక కోడళ్ళు తల్లికి, అత్తకు ఎంతో వ్యత్యాసంగా భావించి అత్తను గౌరవించకపోవడం, వారితో వ్యతిరేకించి వర్తించడం సహజమైపోయింది. భర్తలు బేధభావాలతో వున్న తల్లి, ఇల్లాలు మధ్యన ఎవరికీ నచ్చచెప్పుకోలేక వారి తత్వాలను మార్చలేక తల్లిదండ్రులకు దూరంగా వేరు కాపురం పెట్టడమో... వ్యసనాలకు లోనుకావడమో, కొందరి విషయంలో మామూలైపోయింది. తల్లిపై ఎంతో గౌరవం, మర్యాద, అభిమానం వున్న కొందరు యువకులు, భార్యకు విడాకులు ఇచ్చేదానికి సిద్ధం అవుతున్నారు. ఇస్తున్నారు. హైందవ పవిత్ర వివాహ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. విడిపోతున్నారు.

ఈ తీరుకు కారణం తల్లిదండ్రులే. వివాహం నూరేళ్ళ పంట అని రెండు కుటుంబాల మధ్యన ఏర్పడే పవిత్ర బాధ్యత అనే విషయాన్ని మరిచిపోతున్నారు.


నవీన్, వాణికి విడాకులు ఇచ్చే నిర్ణయానికి వచ్చాడు. లాయర్‍ను సంప్రదించాడు. విడాకుల పత్రంపై సంతకం చేశాడు. రోజ్‍మన్‍ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఆ మరుదినం రోజ్‍ను చర్చిలో పెండ్లి చేసుకున్నాడు. 


వాణి తన పేరున వచ్చిన కవర్‍ను చేతిలోనికి తీసుకొంది. కవర్ చించి లోన ఉన్న కాగితాన్ని తీసి చూచింది. 

ఆశ్చర్యపోయింది. ఆఫీస్‍కు బయలుదేరి వెళుతున్న నవీన్‍ను సమీపించింది. 


"ఏమిటండి ఇది?" నవీన్ పంపిన విడాకుల పత్రాలను అతనికి చూపిస్తూ అడిగింది.

"విడాకుల పత్రాలు. నీవంటే నాకు ఇష్టం లేదు. నా ఇంట్లోనుంచి వెళ్ళిపో. నీకు సంబంధించిన ఏ గుర్తులూ నా ఇంట్లో వుండకూడదు" అని తీక్షణ దృష్టితో చెప్పి వెళ్ళిపోయాడు నవీన్.


వాణి అయోమయ స్థితిలో కన్నీటితో నిలబడిపోయింది.

దుర్గ వాణిని సమీపించింది.


"ఏం శిలలా అలా నిలబడ్డావ్! గదికి వెళ్ళి నీ వస్తువులను సర్దుకొని మా ఇంట్లోనుంచి వెళ్ళిపో!" కర్కశ స్వరంతో చెప్పి వెళ్ళిపోయింది దుర్గ.


వాణి, భర్త, అత్తల నుంచి ఊహించని మాటలను విన్నది. మనోవ్యధ కన్నీటి రూపంలో జలజలా రాలసాగాయి. తన గదికి వెళ్ళి మంచంపై పడి భోరున ఏడవసాగింది.


మనస్సున పరిపరివిధాల భావాలు, సంఘర్షణ, ఆవేదన దాదాపు గంటసేపు ఆ స్థితిలో వుండిపోయింది. వాణి ఓ నిర్ణయానికి వచ్చింది.


మంచంపై నుంచి లేచి రెస్ట్ రూంకు వెళ్ళి స్నానం చేసి డ్రెస్ మార్చుకొని నవీన్ ఆఫీసు వైపునకు ఆటోలో బయలుదేరింది.

రిసెప్షన్‍కు తానెవరో చెప్పి నవీన్ క్యాబిన్‍ను సమీపించి తలుపు తెరిచింది.


నవీన్ సీట్లో కూర్చుని వున్నాడు. అతని ఒడిలో రోజ్‍మన్ వాలిపోయి ఉంది. తన ముఖాన్ని రోజ్ ముఖానికి దగ్గరగా చేర్చి ఏదో మాట్లాడుతున్నాడు నవీన్.


వాణికి విషయం అర్థమయిపోయింది. వేగంగా వెనక్కి తిరిగి ఆటోలో ఇల్లు చేరింది.


నవీన్ పోస్టులో పంపిన విడాకుల పత్రాలపై సంతకం చేసి దుర్గకు ఇచ్చింది. 

సూట్‍కేసులో తన బట్టలను, వస్తువులను సర్దుకొని ఆ ఇంటినుండి బయటకు వచ్చి వీధిలో ప్రవేశించి ఆటో ఎక్కింది వాణి.

నాయుడిగారి పెద్ద కుమారుడు భాస్కర్ చెన్నైలో ఫ్లైట్ దిగి టాక్సీలో నెల్లూరు చేరాడు.


భాస్కర్ ప్రక్కన ఓ తెల్లదొరసాని వుండటాన్ని శివ చూచాడు. భాస్కర్ తనతో వచ్చిన ఆంగ్లయువతితో హొటల్లో ప్రవేశించాడు.


అరగంట తర్వాత భాస్కర్ గదినుండి బయటికి వచ్చి ఆటో ఎక్కి.... నాయుడుగారి ఇంటిముందు దిగాడు.


అతని రాకకు ముందే భాస్కర్‍ని అతని ప్రక్కన వున్న యువతిని గురించి శివ నాయుడిగారి ఇంటికి వచ్చి తాను చూచిన దృశ్యాన్ని గురించి అనురాధకు చెప్పి తన ఇంటికి బయలుదేరాడు. తనకు ఎదురైన ఆటోలో ఉన్న భాస్కర్‍ను చూచాడు. భాస్కర్ ఆటో దిగి వరండాలో ప్రవేశించాడు.

"అమ్మా!"


వంటింట్లో నుంచి అనురాధ బయటికి వచ్చింది. ఎదురుగా నిలబడి వున్న భాస్కర్‍ను చూచింది. ఆతృతతో వచ్చి "భాస్కరా!" అంటూ అతని చేతులు పట్టుంది ప్రేమతో. 


"ఎలా వున్నావు నాన్నా" ప్రీతిగా కొడుకు ముఖంలోకి చూస్తూ అడిగింది అనురాధ.

"నేను బాగున్నానమ్మా! నాన్నగారు ఏరి?" నాలుగువైపులా చూశాడు భాస్కర్.


అతని ముఖంలో ప్రసన్నత గమనించిన అనురాధ "నాన్నా! వట్టిచేతులతో వచ్చావు నీ లగేజి ఏది?" ఆశ్చర్యంతో అడిగింది.


"అమ్మా.... అదీ....."


"ఏమిటో చెప్పు" ప్రీతిగా భాస్కర్ ముఖంలోనికి చూచింది.


క్షణం తర్వాత "నీ ముఖంలో చాలా అలసట కనపడుతూ ఉంది. రెస్ట్ రూంకు వెళ్ళి ముఖం కడుక్కొని రా! కాఫీ తెస్తాను" వంటగదివైపునకు నడిచింది అనురాధ.


భాస్కర్ రెస్టురూంలో ప్రవేశించాడు. 


రోడ్డుమీద శివకు నాయుడుగారు కనిపించారు. భాస్కర్ వచ్చాడని, అతని ప్రక్కన తాను చూచిన తెల్లదొరసాని గురించి నాయుడుగారికి చెప్పాడు శివ.


నాయుడుగారు ఆశ్చర్యపోయారు. ఆయన మనస్సున అనుమానం. వేగంగా ఇంటివైపునకు నడిచారు.

అనురాధ భాస్కర్‍కు కాఫీ అందించింది.


"త్రాగు నాన్నా" ప్రీతిగా చెప్పింది.


సోఫాలో అతని ప్రక్కన కూర్చుంది.


భాస్కర్ కాఫీ త్రాగాడు. గ్లాసును టీపాయ్‍ పైన ఉంచాడు. తల్లి ముఖంలోనికి చూచాడు. శివ చెప్పిన విషయం గురించి అడగాలా వద్దా అనే సమస్యతో ఆమె వదనంలో వ్యాకులం.

"అమ్మా!"


"ఏం నాన్నా!"


"నేను..."


"నీవు...!" ఆశ్చర్యంతో చూచింది భాస్కర్ ముఖంలోకి.


"నేను ఓ అమెరికన్ అమ్మాయిని పెండ్లి చేసుకొన్నాను."


"ఏమిటీ!!" ఆశ్చర్యంతో నోరు తెరిచింది అనురాధ.


అదే సమయంలో నాయుడుగారు గృహంలో ప్రవేశించారు. 

భాస్కర్, అనురాధల మాటలను విన్నారు.

’నా అనుమానం నిజమైంది’ అనుకొంది అనురాధ.


ఆమె యధాలాపంగా సింహద్వారం వైపు చూచింది. లోనికి వచ్చి ద్వారం దగ్గరే ఆగివున్న నాయుడుగారిని చూచింది.

వేగంగా లేచి వారిని సమీపించింది.


"ఏమండీ! మీరు.....!!"


"మీ మాటలను విన్నాను."


మౌనంగా వచ్చి సోఫాలో కూర్చున్నారు. ఆవేదనతో క్షణంసేపు భాస్కర్ ముఖంలోనికి చూచి తలదించుకున్నారు.


అనురాధ నాయుడిగారి ప్రక్కన సోఫాలో కూర్చుంది. 

కన్నీటితో వారి ముఖంలోనికి చూచింది.

భాస్కర్ భయంతో తలదించుకున్నాడు.


తల్లిదండ్రులతో చెప్పకుండా తాను తనతో కలిసి పనిచేసే విక్టోరియాను వివాహం చేసుకున్నాడు ఆరునెలల ముందు. అది అతను చేసిన నేరం. అందుకే ఆ భయం.


నాయుడుగారు ప్రక్కవూరి పరంధామనాయుడి గారి కుమార్తె దివ్య ఎం.ఆర్.ఓ, తో భాస్కరం వివాహం జరిపించాలని వారితో సంప్రదించి భాస్కర్ రాకకోసం ఎదురుచూస్తున్నారు.

వచ్చిన భాస్కర్ వినిపించిన మాటలు.... నాయుడుగారు వూహించనివి. వారి మనస్సున ఆశ్చర్యం, అవమానం మాట తప్పిన వాడినైనాననే ఆవేదన.


నేటి పిల్లల చర్యలకు తల్లిదండ్రులు వారి భావా వేశాలను దిగమ్రింగి కాంప్రమైజ్ కావాల్సి వస్తోంది. ఇంటిగుట్టు రచ్చకు ఎక్కకుండా వుండేందుకు.


"అనూ! వీడు అమెరికాకు తిరిగి ఎప్పుడు వెళతాడట!" మెల్లగా అడిగారు నాయుడుగారు. 

"వాడు వచ్చి ఇంకా అరగంట కూడా కాలేదండి!" ఆవేదనతో అంది అనురాధ.


"వాడు రావాల్సిన పద్ధతిలో తిరిగి రాలేదుగా అనూ" దీనంగా అడిగారు నాయుడుగారు.


క్షణం తర్వాత "ఆ పెద్దమనిషి పరంధామనాయుడుగారు నా గురించి ఏమనుకుంటారు ఆలోచించు" ప్రాధేయపూర్వకంగా చెప్పారు నాయుడుగారు. అనురాధ వారి ముఖంలోకి క్షణంసేపు చూచి... కన్నీటితో తలదించుకుంది.

"భాస్కర్!"


నాయుడిగారి ముఖంలోకి క్షణంసేపు చూచి భయం, అవమానంతో తలను ప్రక్కకు తిప్పుకున్నాడు.


"వెళ్ళి హోటల్లో దించిన ఆ అమ్మాయిని ఇంటికి తీసుకుని రా!" అని చెప్పి నాయుడుగారు సోఫాలోంచి లేచి తన గదికి వెళ్ళిపోయారు.


అనురాధ లేచి భాస్కర్ ముఖంలోనికి చూచి....

"నాన్నగారు చెప్పిన పనిచెయ్యి" అని చెప్పి నాయుడుగారి గదివైపునకు వెళ్ళింది అనురాధ.


భాస్కర్ లేచి వేగంగా నడిచి వీధిలో ప్రవేశించాడు.

సమస్య సులువుగా పరిష్కారం అయినందుకు సంతోషించాడు.

అనురాధ గదిలో ప్రవేశించింది. నాయుడుగారు మంచంపై పడుకొని నిద్రపోతున్నారు. అది నిద్ర కాదు. మనోవేదనకు వారి కళ్ళు మూసుకొని ఆ పరాత్పరుణ్ణి మనస్సుకు శాంతిని ప్రసాదించమని చేసే వేడుకోలు.


వారిని పలకరించి వారి మనోవేదనను ఇంకా పెంచకూడదని మౌనంగా అనురాధ గది నుండి బయటకు నడిచింది. వరండాలో కూర్చుని కొడుకు కోడలి రాక కోసం ఎదురుచూస్తుంది.


అరగంట తర్వాత భాస్కర్, విక్టోరియాలు వాకిట్లో ఆగిన ఆటోనుంచి దిగారు.


వారికోసమే ఎదురు చూస్తున్న అనురాధ వారిని చూచి పరుగున వీధి వాకిట వైపునకు నడిచింది. విక్టోరియాను చూచి ఆశ్చర్యపోయింది.


పట్టుచీర, రవిక, తలలో మల్లెపూలు, కళ్ళకు కాటుక, నొసట సింధూరపు బొట్టు అచ్చం తెలుగింటి ఆడపడుచులా ఉంది.

అనురాధను చూడగానే వంగి ఆమె పాదాలను తాకి లేచి చిరునవ్వుతో చేతులు జోడించింది.


అనురాధ ఆశ్చర్యంతో ఆమెను పరిశీలనగా చూచింది.

"అమ్మా! విక్టోరియా. నేను తనకు పెట్టిన పేరు సత్య. నీ కోడలు బాగుందా అమ్మా" చిరునవ్వుతో అడిగాడు భాస్కర్.


"అత్తయ్యగారూ బాగున్నారా" అడిగింది సత్య.


ఆశ్చర్యానందాలతో తలాడించింది అనురాధ.

ముగ్గురూ వరండా మెట్లను సమీపించారు.


"ఆగండి రెండు క్షణాల్లో వస్తాను" అని లోనికి పరుగెత్తింది అనురాధ.


పది సెకండ్లలో ఎర్రనీళ్ల పళ్ళాన్ని చేతబట్టుకొని వచ్చి కొడుకు కోడలికి దిష్టి తీసింది. వరండా మెట్ల ప్రక్కన ఆ నీళ్ళును ఒలకబోసింది. నవ్వుతూ వెనుతిరిగి "అమ్మా సత్య, ఒరేయ్ పెద్దోడా రండి లోపలికి" అంది అనురాధ.


ముగ్గురు హాల్లోకి ప్రవేశించారు. రెండు సూటుకేసులను హాల్లో పక్కనే వున్న గదిలో పెట్టి హాల్లోకి వచ్చాడు భాస్కర్. అనురాధ నాయుడుగారు వున్న గదిలోనికి వెళ్ళింది.


విక్టోరియా.....అదే సత్య సోఫాల మధ్యన నిలబడి హాలు నాలుగువైపుల పరిశీలనగా చూసింది.


నాయుడుగారు అనురాధ హాల్లోకి వచ్చారు.


నిలబడి వున్న విక్టోరియాను కొడుకును చూచారు. ఆమె కట్టు బొట్టు తీరును చూచిన నాయుడుగారు ఆశ్చర్యపోయారు.

"సత్యా! మా నాన్నగారు" మెల్లగా చెప్పాడు భాస్కర్.


"నమస్కారం మామయ్యగారు!" చేతులు జోడించి సమీపించి వారి పాదాలను తాకింది.

"అమ్మాయికి తెలుగు నేర్పాడు మనవాడు" నవ్వుతూ చెప్పింది అనురాధ.


నాయుడుగారు కుడిచేయిని ఆమె తలపై వుంచి దీవించారు. వరండా వైపునకు నడుస్తూ....

"అనూ! కోడల్ని..."


"ఆ...ఆ...! జాగ్రత్తగా చూచుకొంటానండీ" నాయుడుగారి వెనకాలే అనురాధ వరండాలోకి వచ్చింది.


జగన్నాథ్ గారి ఫోన్.

"హలో..."


"జగ్గన్నా చెప్పు"


"నేను, వాణి, మీ వదిన, దీపక్ రేపు నెల్లురు వస్తున్నాం."


"అంతా బాగునారా?"


"ఆ....ఆ.... అంతా క్షేమమే"


సెల్ కట్ చేశాడు జగన్నాథ్.


"రేపు అన్నా, వదిన, దీపిక్, వాణిలు వస్తున్నారట. నేను మన కట్టడ నిర్మాణ స్థలానికి వెళ్ళి వస్తాను" అంటూ నాయుడుగారు వీధి గేటు దాటి రోడ్డు పైకి ప్రవేశించారు. 

అనురాధ ఇంట్లోకి వెళ్ళింది.


తల్లిని చూడగానే భాస్కర్ ఆమెను సమీపించి....

"అమ్మా!.... నీవు రియల్లీ గ్రేట్. అమ్మా... నాన్నగారికి ఏం చెప్పావో ఏమో నా వివాహాన్ని వారు సమ్మతించారు. మా అమ్మ బంగారు" అంటూ తల్లి భుజంపై వాలిపోయాడు.


"భాస్కరా! మా జీవితకాలంలో మీ నలుగురూ ఆనందంగా, గౌరవంగా, హాయిగా బ్రతకాలనేదేరా మా ఇరువురి కోరిక."

ఆ తల్లీ కొడుకుల అభిమానాన్ని విక్టోరియా విచిత్రంగా చూడసాగింది.

========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

41 views0 comments

Comments


bottom of page