top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 13


'Life Is Love - Episode 13'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 23/03/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 13' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.


దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని. యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.


ఇంటికి వచ్చిన నాయుడు గారిని అవమానించి పంపుతాడు ముకుందరావు. నాయుడుగారి చిన్నకూతురు అమృత తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడుతుంది. ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది.


వాణి భర్త నవీన్ కి రోజ్ అనే యువతిని పరిచయం చేస్తాడు ఫణి. 


భర్త ఊర్లో లేని సమయంలో యామిని వివాహం దీపక్ తో రిజిస్ట్రార్ ఆఫీసులో జరిపిస్తుంది ఆమె తల్లి వసంత. 


దీపక్, యామినీలు పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆ రాత్రి హనీమూన్‍కి బయలుదేరారు.

నవీన్ రోజ్ తో కలిసి ఉంటాడు.


నాయుడుగారి పెద్ద కొడుకు భాస్కర్ విక్టోరియా అనే ఆంగ్ల యువతిని వివాహం చేసుకొని ఇండియాకు తీసుకొని వస్తాడు.


ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 13 చదవండి. 


దీపక్ జగన్నాథ్ గారికి ఫోన్ చేశాడు.


"పెదనాన్నా! నన్ను, యామినీని ముకుందరావు మనుషులు ఫాలో చేస్తున్నారు. ఒకవేళ మేము వారిచేత చంపబడితే.... మా ఇరువురి శరీరాల్లోని ముఖ్యభాగాలు వికలాంగులకు అవయవ లోపాలున్న వారికి ఉపయోగించి, వారి జీవితాలను ఆనందమయం చేయాలని డి.ఎం.ఓ గారికి హైదరాబాదులో మేమిద్దరం హృదయపూర్వకంగా వ్రాసి ఇచ్చాము. దాన్ని అమలు జరుపవలసిన బాధ్యత మీదే పెదనాన్నా!!" అభ్యర్థనతో చెప్పాడు దీపక్. సెల్ కట్ చేశాడు. 


దీపక్ మాటలకు ఆశ్చర్య... ఆందోళనలకు గురియైన జగన్నాథ్ దీపక్‍కు ఫోన్ చేశాడు. కాని దీపక్ వారి కాల్‍ను రిసీవ్ చేసుకోలేదు.


ఒకవైపు వాణి జీవిత సమస్య దాన్ని ఎలా చెప్పాలా అనే మధనంలో వున్న జగన్నాథ్ గారికి దీపక్ మాటలు ఎంతగానో కలవరపరిచాయి. ఈ రెండు విషయాలు నేరుగా నాయుడుగారిని కలిసి అనునయంగా చెప్పాలని నిర్ణయించుకొన్నాడు. అందుకే నెల్లూరు బయలుదేరాడు.


సీనియర్ లాయర్ ధర్మారావు గారి వద్ద పనిచేసే అనంత్, వాణి తన భర్త చేసిన పనిని గురించి ధర్మారావు గారితో చెబుతుండగా విన్నాడు.

అనంత్ భార్య నవ్య మగబిడ్డను ప్రసవించి బాలింత గుణంతో చనిపోయింది ఆరునెలల క్రింద. అతని తల్లి శాంతమ్మ ఆ పసిబిడ్డను సాకుతోంది.


అనంత్‍కు వాణి అంటే ఎంతో గౌరవం, అభిమానం. ఆమె విడాకుల విషయం, ఆమె తన తల్లిదండ్రుల దగ్గరకు వెళుతున్న విషయం, ఆమె తన సీనియర్ లాయర్ ధర్మారావు గారికి చెబుతున్న సమయంలో విన్న అనంత్ ఓ నిర్ణయానికి వచ్చాడు. వాణి తల్లిదండ్రులను సంప్రదించి ఆమెను వివాహం చేసుకోవాలనే అభిప్రాయంతో అతనూ నెల్లూరు బయలుదేరాడు.


జగన్నాథ్, పార్వతి, దీపిక, వాణి నెల్లురుకి చేరారు. 

వచ్చేటప్పుడు.....


"అమ్మా వాణీ! నీవు జరిగిన విషయాన్ని అమ్మా నాన్నలతో చెప్పవద్దు. సమయం చూచి నేను నాయుడికి చెప్పవలసిన రీతిలో చెబుతాను. మిమ్మల్ని చూడలనిపించింది పెదనాన్నతో కలిసి వచ్చాను అని మాత్రం చెప్పు" అనునయంగా చెప్పాడు జగన్నాథ్.


ఉదయం ఏడుగంటల ప్రాంతంలో వారు నెల్లూరులోని నాయుడుగారి ఇంటికి చేరారు.


భాస్కర్, విక్టోరియాలను చూచి అందరూ ఆనందించారు. లోన ఎన్ని బాధలు ఉన్నా యాంత్రికంగా నవ్వుతూ, ఒకరినొకరు పలకరించుకున్నారు. కలిసి టిఫిన్ తిన్నారు. విక్టోరియా వారి వారి సంబంధాలను భాస్కర్ వలన తెలుసుకొని అందరితో ఎంతో ఆదరాభిమానాలతో వ్యవహరించింది. తన చర్యల వలన అందరికీ ఆనందాన్ని పంచేదానికి ప్రయత్నించింది. 


మిత్రులు ఇరువురూ హాస్పిటల్ ఆశ్రమ నిర్మాణం జరిగే స్థలానికి వెళ్ళారు.


వారు చేరిన రెండు గంటలకు అనంత్ కారులో నెల్లూరు చేరి, నాయుడుగారి ఇల్లును కొనుక్కొని వారిని గురించి అనురాధతో విచారించాడు.


అతన్ని చూచిన వాణి ఆశ్చర్యపోయింది. తన తండ్రి వెళ్ళిన చోటు వివరాలను అనంత్‍కు తెలియజేసింది. ఆమె అతన్ని, తల్లి అనురాధకు పెద్దతల్లి పార్వతికి పరిచయం చేసింది.


అనంత్ వారికి అభిమానంతో నమస్కరించాడు.

వాణి ఇచ్చిన కాఫీ త్రాగి కట్టడ నిర్మాణ స్థలాన్ని చేరాడు. 

జగన్నాథ్, నాయుడుగారికి, వాణికి, ఆమె భర్త నవీన్ చేసిన అన్యాయాన్ని గురించి, విడాకులకు గురించి ఎంతో సౌమ్యంగా వివరించాడు.


అంతా విన్న నాయుడుగారు భోరున విలపించారు. జగన్నాథ్ అతన్ని తన హృదయానికి హత్తుకొని....

"నాయుడూ! ఎదిగిన ఇద్దరు కొడుకులూ వారికి.... మేము బ్రతికి వున్నామనే విషయాన్ని మరచి, వారి వైవాహిక జీవిత విషయంలో స్వనిర్ణయాలు తీసుకొని, అన్యులను చేసుకొని, మా ముందుకు వచ్చి నిలబడినప్పుడు నేను మీ వదిన ఎంతగా బాధపడ్డామో మాకు ఆ సర్వేశ్వరునికే తెలుసు. వారి వ్యవస్థలో ఇమిడి మేము జీవచ్ఛవాలుగా బ్రతుకలేక మీ వదినా నేను ఆలోచించుకొని ఏకాభిప్రాయంతో సంపాదించిన దానిలో వారికి చెందవలసిన దాన్ని వారికి వ్రాసియిచ్చి... మన దేశానికి వచ్చేశాం. 


మనం ఎన్నో అనుకుంటాంరా.... అనుకున్నవన్నీ జరుగవుగా! పరిస్థితులను అనుసరించి మనకు ఏది ఆనందాన్ని ఇస్తుందో, ఆ పనినే మనం చేయాలి. మన జీవితాంతం మన సంతతి ఎక్కడ వున్నా, వారు హాయిగా వుండాలని ఆ దైవాన్ని కోరుకోవడం తప్ప ఈ వయస్సులో మనం వారి తత్వాలను మార్చలేమురా! పరిస్థితిని నిబ్బరంతో ఎదుర్కొనాలి గాని, మనస్సుపై భారాన్ని వేసి కుమిలిపోవడం తగదు. యాజ్ ఏ డాక్టర్‍గా చెబుతున్నాను. మన ఆరోగ్యానికి మంచిది కాదురా!" ప్రేమాభిమానాలతో చెప్పాడు జగన్నాథ్.


నాయుడు మౌనంగా జగన్నాథ్ ముఖంలోనికి చూచాడు.

అదే సమయానికి అనంత్ వారిని సమీపించి నమస్కరించాడు.


"సార్! నేను, వాణి కలిసి సీనియర్ లాయర్ చక్రవర్తి గారి వద్ద పనిచేస్తున్నాము. నాపేరు అనంత్" అన్నాడు.


"కూర్చో" అన్నాడు జగన్నాథ్.


అనంత్ కూర్చున్నాడు.

"విషయం ఏమిటో చెప్పండి" అడిగాడు జగన్నాథ్.


అనంత్, వాణి విషయంలో తన నిర్ణయాన్ని తెలియజేశాడు. చివరగా....

"సార్! మీరు ఏ నిర్ణయాన్ని తీసుకొన్నా నాకు సమ్మతమే" అన్నాడు.


"ఈ విషయంలో మేము ఆలోచించి, వాణిని సంప్రదించి ఓ నిర్ణయానికి రావాలి. సమయం పడుతుంది" చెప్పాడు జగన్నాథ్.


నాయుడుగారు వారి మాటలకు తలాడించాడు.

"అలాగేసార్. ఐ విల్ వెయిట్" అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు అనంత్.


"అన్నా! ఏమిటిదంతా!"


"ఆ పైవాడి నిర్ణయం. పద ఇంటికి వెళ్దాం."


ఇరువురూ కారులో కూర్చున్నారు. డ్రైవరు కారును స్టార్ట్ చేశాడు.

ఉదయం ఆరుగంటల ప్రాంతం. నాయుడు, జగన్నాథ్ వాహ్యాళికి బయలుదేరి వీధి గేటును సమీపించారు.

అంబులెన్స్ వచ్చి వాకిట ముందు ఆగింది. 

ఇరువురు ఆశ్చర్యపోయి ఒకరిముఖాలు ఒకరు చూచుకొన్నారు.


హాస్పిటల్ స్టాఫ్ అంబులెన్స్ దిగి వారిని సమీపించాడు.

"సార్! మీలో దీపక్ తండ్రి ఎవరు?"


ఆదుర్దాగా "నేను బాబు. నా దీపక్, కోడలు ఎక్కడ?" అడిగారు నాయుడుగారు. 


"వారిద్దరినీ ఎవరో ఊటీలో కాల్చి చంపేశారు సార్. శవాలుగా వున్న వారిని చూచి ఎవరో మా హాస్పిటల్‍కు తెలియజేశారు. మేము అక్కడికి వెళ్ళి వారిని హాస్పిటల్‍కు చేర్చి పరీక్షించాము. వారి కధ ముగిసిపోయింది. దీపక్ గారి జేబులో ఉన్న అడ్రస్ ప్రకారం శవాలను ఇక్కడకు తీసుకొని వచ్చాం" అంటూ అంబులెన్స్ డోరును తెరిచి స్ట్రెచర్‍ను కిందికి దించారు ఆ బృందం.


నాయుడు, జగన్నాథ్‍లు అచేతనంగా శిలల్లా నిలబడి పోయారు. వాకిట ముగ్గువేయడానికి వచ్చిన అనురాధ గేటు దగ్గర వున్నవారినీ, క్రిందకు దించిన స్ట్రెచర్‍ను చూచి పరుగున గేటును సమీపించింది. స్ట్రెచర్‍పై శవాలుగా పడివున్న దీపక్, యామినీలను చూచి భోరున ఏడవసాగింది.


హాప్సిటల్ స్టాఫ్ స్ట్రెచర్పై వున్న వారిని వరండాలోకి చేర్చారు. వారిని దించి చాపలపై పరుండబెట్టారు. వారు వెళ్ళిపోయారు.

పదినిమిషాల ముందు ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ ఇంటి వాతావరణం అందరి ఏడ్పులతో కలుషితం అయిపోయింది. వారందరి ఏడ్పులు ఆ నాలుగు గోడల మధ్యన మారుమ్రోగాయి.


ఈ వార్త విని వాడ జనం, నరసపనాయుడు, రామశర్మ గార్ల కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, విద్యార్థులు పరుగున వచ్చారు.


నాయుడుగారు, అనురాధల ప్రక్కన చేరి వారూ కూడా కన్నీరు కార్చుతూ ఓదార్చసాగారు.


జగన్నాథ్‍కు దీపక్ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి. మెల్లగా జగన్నాథ్ నాయుడుగారి పక్కకు చేరి గద్గద స్వరంతో దీపక్, యామినీల నిర్ణయాన్ని, వారు హైదరాబాదులో డి.ఎం.ఓ కు వ్రాసి ఇచ్చిన పత్రాన్ని గురించి చెప్పి ఒప్పించారు. హాస్పిటల్‍కు ఫోన్ చేసి అంబులెన్సును పిలిపించారు. ఆ ప్రేమికుల ఇరువురు శరీరాలను అంబులెన్స్ ఎక్కించారు.


అంబులెన్స్ వెళ్ళిపోయింది. దానితోపాటు జగన్నాథ్ కూడా హాస్పిటల్‍కు వెళ్ళారు. శవాలను ఆపరేషన్ థియేటర్‍కు చేర్చారు. వారిరువురి నయనాలు, కిడ్నీలు, గుండెలను శరీరాన్నుంచి వేరుపరచి భద్రపరిచారు. తెల్ల వస్త్రాలను శరీరాలకు చుట్టి అంబులెన్స్ ఎక్కించారు. నాయుడుగారి ఇంటికి చేర్చారు. అంతవరకు కన్నీటితో కార్యక్రమాన్ని సాగించిన జగన్నాథ్ ఆ ఇరువురి శవాలపై పడి భోరున ఏడ్చాడు. అతని బాధను, ఏడ్పును చూచి అందరూ ఆశ్చర్యపోయారు.


నరసపనాయుడు, రామశర్మలు జగన్నాథం భుజంపై చేయి వేసి గద్గద స్వరంతో జరుగవలసిన కార్యక్రమాన్ని గుర్తుచేశారు. ఇరువురూ నాయుడిగారి దగ్గరకు జరిగి చెవిలో చెప్పవలసింది చెప్పారు. శివ తండ్రి మాటలను పాటించి కన్నీటితో సిద్ధం చేయవలసిన వాటిని సిద్ధం చేశాడు. 

సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆ అపురూప ప్రేమికుల అంతిమ యాత్ర నాయుడుగారి ఇంటివద్ద నుంచి బయలుదేరింది,.


========================================================================

ఇంకా వుంది..

========================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

52 views0 comments
bottom of page