top of page

లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 14


'Life Is Love - Episode 14'  - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 29/03/2024

'లైఫ్ ఈజ్ లవ్ - ఎపిసోడ్ 14' తెలుగు ధారావాహిక 

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


ప్రిన్సిపాల్ గా పనిచేసి రిటైర్ అవుతారు వరదరాజుల నాయుడుగారు. మూడు మాసాల క్రితం పెళ్ళైన కూతురు వాణి, భర్తతో కాక ఒంటరిగా ఇంటికి వస్తుంది. ఆమె మనసులో ఉన్నది చెప్పమని తరచి తరచి అడుగుతారు.


తన వాటా ఆస్తి అడగమని భర్త పంపినట్లు చెబుతుంది వాణి. అడ్వకేట్ రామశర్మని పిలిపించి ఆ ఏర్పాట్లు చూడమంటారు నాయుడుగారు.


ముకుందరావు అనే కోటీశ్వరుడు వరదరాజులు నాయుడుగారి కొడుకు దీపక్ కి, తన కూతురు యామినిని ఇస్తానని అడుగుతాడు. పెద్ద కొడుకు, రెండవ కూతురు పెళ్లిళ్లు అయ్యాకే దీపక్ వివాహమని చెబుతారు నాయుడుగారు.


యామినితో తన పరిచయం గుర్తుకు తెచ్చుకుంటాడు దీపక్. ట్రైన్ లో జరిగిన వారి పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే నాయుడుగారు వెంటనే అంగీకరించక పోవడంతో ముకుందరావుకి కోపం వస్తుంది. యామినికి వేరే పెళ్లి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.


దీపక్ ని ప్రేమిస్తున్నట్లు తల్లితో చెబుతుంది యామిని. యామినిని వివాహం చేసుకోబోతున్నట్లు తండ్రితో చెబుతాడు దీపక్.


ఇంటికి వచ్చిన నాయుడు గారిని అవమానించి పంపుతాడు ముకుందరావు. నాయుడుగారి చిన్నకూతురు అమృత తన క్లాస్ మేట్ తో ప్రేమలో పడుతుంది. ప్రేమించిన అతన్నే చేసుకుంటానని తండ్రికి చెబుతుంది.


వాణి భర్త నవీన్ కి రోజ్ అనే యువతిని పరిచయం చేస్తాడు ఫణి. 


భర్త ఊర్లో లేని సమయంలో యామిని వివాహం దీపక్ తో రిజిస్ట్రార్ ఆఫీసులో జరిపిస్తుంది ఆమె తల్లి వసంత. 


దీపక్, యామినీలు పెద్దల ఆశీర్వాదం తీసుకుని ఆ రాత్రి హనీమూన్‍కి బయలుదేరారు.

నవీన్ రోజ్ తో కలిసి ఉంటాడు.


నాయుడుగారి పెద్ద కొడుకు భాస్కర్ విక్టోరియా అనే ఆంగ్ల యువతిని వివాహం చేసుకొని ఇండియాకు తీసుకొని వస్తాడు.

ఊటీ దగ్గర దీపక్ యామినీలను ఎవరో షూట్ చేసి చంపుతారు.

దీపక్, యామినీల బాడీలని అంబులెన్స్ లో ఇంటికి చేరుస్తారు.




ఇక లైఫ్ ఈజ్ లవ్ ఎపిసోడ్ 14 చదవండి. 


అందరూ వారికి హితులే, అభిమానులే. కన్నీటితో అంతులేని హృదయవేదనతో ముందూ వెనుక నడిచారు. శివ, నరసపనాయుడు నాయుడిగారి ప్రక్కన వారు పడిపోకుండా నడుముచుట్టూ చేయిచేసి జాగ్రత్తగా ముందుకు నడిచారు..


స్మశాన ప్రవేశం జరిగింది. అక్కడ రెండు చితులు అమర్చబడి వున్నాయి.


జగన్నాథ్ వాటిని చూచాడు. అతని కళ్ళముందు దీపక్, యామినీలు వారి నిర్ణయాలు గుర్తుకు వచ్చాయి. వారి మాట ప్రకారం ఇరువురి శరీరాలు ఒకే చితిపైకి చేర్చబడ్డాయి. శివ సాయంతో నాయుడుగారు చితికి నిప్పంటించారు. భోరున ఏడుస్తూ..


నాయుడు, జగన్నాథ్‍లు ఆకాశం వైపు చూచారు. ఎంతో ఆనందంగా దీపక్, యామినీలు చేతులు పట్టుకొని ధవళ వస్త్రాలతో నవ్వుతూ కనిపించి, కనుమరుగైనారు. అందరూ స్మశానం బయటకు నడిచారు విచార వదనాలతో.

సాధారణంగా తల్లిదండ్రులు పెద్దవారైన కారణంగా వారు గతించడం, సంతతిలో కొడుకు వారి అంతిమక్రియలు జరపడం, సహజం. కానీ నాయుడుగారి విషయంలో అది తలక్రిందులైంది. దీపక్, యామినీ క్రతువులను వారు నిర్వర్తింపవలసి వచ్చింది. జగన్నాథ్, నరసపనాయుడు, రామశర్మ, శివ, భాస్కర్‍ల సాయంతో అవధులు లేని దుఃఖంతో ఆ ధర్మాన్ని నాయుడుగారు నిర్వహించారు. ఆ కుటుంబ సభ్యుల మధ్యన రోజులు చాలా భారంగా జరిగిపోతున్నాయి. ఓ నెల జరిగిపోయింది.


"అన్నా!"


"చెప్పు నాయుడూ"


"పండుటాకును ఎప్పుడు రాలిపోతానో తెలియదు. పోయే లోపల వాణి-అనంత్‍ల వివాహం, దీపిక-శివల వివాహాలను జరిపించాలని వుంది నీవు ఏమంటావ్ అన్నా!" దీనంగా అడిగారు నాయుడుగారు.


"త్వరలో తప్పక జరిపిద్దాం నాయుడూ" అన్నారు జగన్నాథ్.

పంతులు గారిని పిలిపించి వివాహ ముహూర్తాలను నిర్ణయించారు.


వాణి వివాహం రిజిష్టరు ఆఫీసులో, దీపిక వివాహం నాయుడుగారి ఇంట్లో వైభవంగా జరిపించారు ఆ ఆప్తమిత్రులు.


అమెరికా నుంచి తిరిగి వచ్చేస్తానని భాస్కర్ ఒక్కడే వెళ్ళిపోయాడు. ఎవరూ లేని అనంత్ హైదరాబాదు నుంచి నెల్లూరు వచ్చేశాడు. జగన్నాథ్ కూడా నెల్లూరు షిఫ్ట్ అయినాడు.

వాణి, విక్టోరియాలు ఆ పెద్దవారిని ఎంతో ప్రేమాభిమానాలతో చూసుకోసాగారు. వారి హృదయాలకు తగిలిన గాయాలు క్రమంగా ఆరసాగాయి.


ఆ రోజు ఉదయం కాలేజి ప్రస్తుత ప్రిన్సిపాల్ కొందరు అధ్యాపకులు నాయుడి గారి ఇంటికి వచ్చారు.


"సార్! మన కాలేజీ ప్రారంభించి పాతిక సంవత్సరాల వార్షికోత్సవం మీ అధ్వర్యంలోనే జరిపించాలని నిర్ణయించుకొన్నాము. మీరు కాదనకుండా అంగీకరించాలి" అంటూ అభ్యర్థించారు ప్రిన్సిపాల్ గారు.


నాయుడుగారు ’అలాగే’ అంటూ అంగీకరించారు. 

ఆ రోజు కాలేజీ వార్షికోత్సవం. నాయుడుగారు, జగన్నాథ్, నరసపనాయుడు కార్లో కాలేజీ ఆవరణంలో ప్రవేశించారు. అధ్యాపకులు, సీనియర్ విద్యార్థులు వారికి ఎదురై స్వాగతం పలికారు. అందంగా అలంకరించిన వేదికపైన ఆ ముగ్గురినీ ఆసీనులను చేశారు. పూలమాలలతో శాలువాలతో సత్కరించారు. స్టేజికి ముందు అధ్యాపకులు, ఆడ, మగ పిల్లలు ఆసీనులై ఉన్నారు.


నాటి ప్రధానోపాధాయులు శశాంక్ గారు.

"ఈ వార్షికోత్సవానికి విచ్చేసిన పెద్దలకు నా నమస్కారాలు. పిన్నలకందరికీ నా శుభాశీస్సులు. ఈ కాలేజీ అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన గ్రేట్ ప్రిన్సిపాల్ శ్రీయుతులు వరదరాజుల నాయుడుగారు ఇప్పుడు ప్రసంగిస్తారు" అంటూ నవ్వుతూ నాయుడిగారి వైపు చూచారు.


నాయుడుగారు మైక్ ముందుకు వచ్చారు. “నాకంటే ముందు నా ప్రక్కన కూర్చొని వున్న నా ప్రాణమిత్రులు, బాల్య మిత్రులు ముఫ్ఫై సంవత్సరాల తర్వాత నన్ను కలిసినవారు, నన్ను ఎంతగానో అభిమానించినవారు, నా సమస్యలు తీర్చినవారు మా జగన్నాథ అన్నయ్య ప్రసంగిస్తారు. అన్నా రా!" అంటూ జగన్నాథ్ వైపు తిరిగి వారిని ఆహ్వానించారు నాయుడుగారు.


జగన్నాథ్, నాయుడుగారిని సమీపించారు. నాయుడుగారు వచ్చి తన స్థానంలో కూర్చున్నారు.


"గౌరవనీయులైన ప్రిన్సిపాల్ గారికి సహా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి" చేతులు జోడించారు.


"ప్రియమైన యువతీ యువకులకు నా శుభాశీస్సులు. వృత్తిరీత్యా నేను ఒక డాక్టర్‍ని. ముప్ఫై సంవత్సరాలు అమెరికాలో పనిచేశాను. నా అనుకున్న నా యిద్దరు కొడుకులు ప్రయోజకులై వారికి నచ్చిన, వారు మెచ్చిన, పరభాషా దేశ యువతులను వివాహం చేసుకొన్నారు. వారికి తల్లీతండ్రీ అవసరం తీరిపోయింది. వారి దృష్టిలో నేనూ, నా అర్థాంగి పరాయివారుగా అయిపోయాము. నాకు నా అనేవారు కావాలి. అందుకే ఇండియాకు తిరిగి వచ్చాను. 

నా మిత్రుడు, సోదరుడు అయిన వరదరాజుల నాయుడుగారిని కలిశాను. భూతకాల విశేషాలను చర్చించుకున్నాము. ఈ వయస్సులో ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రశాంతత, మంచి స్నేహం, ఆత్మీయత, అభిమానం, వాటిని నా సోదరుడు నాయుడు నాకు పంచాడు. అందుకే నా జన్మభూమికి వచ్చాను. నేను చెప్పదలచుకొన్నది చెప్పాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ నా ధన్యవాదాలు”. చేతులు జోడించి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు జగన్నాథ్.


నాయుడుగారు చిరునవ్వుతో మైక్ దగ్గరకు వచ్చారు.

"ప్రియాతి ప్రియమైన సహా ఉపాధ్యాయులకు నమస్సుమాంజలి. విద్యార్థులైన యువతీ యువకులు భావి భారత దేశాధినేతలు. భారతమాత సుచరిత్రలో నూతన స్వర్ణశక నిర్మాణానికి కారణకర్తలుగా.. కావాల్సిన మీకందరికీ నా శుభాశీస్సులు. మాతాపితా గురు దైవం. ఇది మన హైందవ సనాతనులు మనకు తరతరాలుగా ముందు తరానికి నేర్పిన అద్వితీయ సందేశం. నేనూ నా మిత్రులు పాటించింది మీరంతా పాటించాల్సింది, మన దేశ అద్వితీయ నాగరికత. 


వారు ఎవరైనా సరే ఎదుటివారు మనలాంటి వారే అనుకొనే మనస్తత్వం. ఆ తత్వాన్ని ఆధారంగా చేసుకొని ఇతరులు ఈ పవిత్ర భారతావనిపై కాలుపెట్టగలిగారు. మనవారి మధ్యన పరస్పర విభేదాలను కల్పించి బలమైన వర్గం వైపు చేరి, వారి తమ గుప్పెట్లో పెట్టుకొని పక్షపాతం, వంచన, ద్రోహంతో అంతఃకలహాలను ఏర్పరచి యుద్ధాలను సృష్టించి మనవారిని భ్రష్టులను చేసి పాలకులై దేశాన్ని పాలించారు దోచుకున్నారు. వారు ఆ విధంగా విజయులైన దానికి కారణం మనలో లేని ఐకమత్యం. 


ఎవరు ఏదైనా సాధించాలంటే సఖ్యత అతిముఖ్యం. పరస్పర అవగాహన, అభిమానం స్నేహానికి అతి ముఖ్యం. మామధ్య మా అన్నయ్య జగన్నాథ్, హితుడు రామశర్మ, నా బావ నరసపనాయుడుగారి మధ్యన ఉన్నది అదే. అది మా జీవితాంతం ఉంటుంది. నాకు నలుగురు పిల్లలు. అందరినీ వారి వారి ఇష్టానుసారంగా చదివించాను. రెక్కలు వచ్చాయి. గూటిని వీడి ఉపాధి పేరుతో ఎగిరిపోయారు. పెద్దవాడు భాస్కర్ నేను తనకు తగిన పిల్లను చూచి పెండ్లి చేయలేనని తనకు నచ్చిన అమెరికన్ యువతిని వివాహం చేసుకున్నాడు. 


రెండవది వాణి మా ఇష్టానుసారంగానే మాకు, తనకు నచ్చినవాడితో ఆమె వివాహం జరిగింది. అతనికి కొంతకాలానికి వాణి నచ్చలేదు విడాకులు ఇచ్చాడు. 


మూడవవాడు దీపక్. యామినీ అనే ఓ యువతిని ప్రేమించాడు. రిజిష్టరు మ్యారేజి చేసుకొన్నారు. ఆ యామినీ తండ్రి ముకుందరావుకి ఆ వివాహం ఇష్టం లేని కారణంగా నా కొడుకును, కోడలిని కాల్చి చంపించాడు. 


నాల్గవ సంతతి అమృత ఎం.బి.బి.ఎస్. తన సహా విద్యార్థి మహీధర్ ను ప్రేమించి, వివాహం చేసుకొని ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. 

దయచేసి మీరెవరూ నా సంతతిలా వర్తించకండి. మీ తల్లిదండ్రుల హృదయాలకు ఆరని చిచ్చును, తీరని వేదనను మిగల్చకండి. నా కష్టకాలంలో నన్ను ఓదార్చి, అండగా నిలబడింది నా అర్థాంగి అనురాధ, నా ప్రాణమిత్రులు జగన్నాథ్. ఈ సృష్టిలో మనకంటూ మనవారుగా వుండగలిగినవారు. మగవాడికైతే భార్య, ఆడవారికైతే భర్త, మీ ప్రాణ స్నేహితులు మాత్రమే. 


దైవాన్ని నమ్మండి. తల్లిదండ్రులను గౌరవించండి. హైందవ సంప్రదాయాలను గౌరవించండి. ప్రేమ పేరుతో, వ్యామోహంతో మతంమారి సనాతన హైందవ మతానికి కళంకాన్ని ఆపాదించకండి! ఈ సువిశాల భారతభూమిని అభిమానించండి. మన భారతమాతను గౌరవించండి. మాతాపితా గురుదైవం అనే మధుర మహిమాన్విత వాక్కులను మరువకండి. యదార్థంగా మన ఈ జన్మకు కారణం అమ్మా నాన్నల ప్రేమ. అందుకే నేను అంటాను ’లైఫ్ ఈజ్ లవ్’. 


అమ్మా నాన్నలను, తోబుట్టువులను, బంధువులను, హితులను, ఆప్తులను అందరినీ గౌరవించండి, ప్రేమించండి, అభిమానించండి. మీ ప్రవర్తనతో జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించండి. వారిని అనాధాశ్రమాల పాలు చేయకండి. అందరికీ ఆదర్శప్రాయంగా మీ తల్లిదండ్రులకు గర్వకారణంగా జీవితాన్ని సాగించండి. జైహింద్.. జై.. జయహో.. భరతమాత" సుదీర్ఘమైన ఉపన్యాసాన్ని ముగించి నాయుడుగారు అందరికీ నమస్కరించారు. 


ఆ సమయంలో వారి కళ్ళల్లో కన్నీరు.. అవి భావావేశానికి నిదర్శనం. 


శివ.. ప్రారంభించిన చప్పట్లతో.. వందల సంఖ్యలో వున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల చప్పట్లతో ఆ ఆవరణం దద్దరిల్లింది.


===============================================================================

సమాప్తం

ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ సిహెచ్. సీఎస్. శర్మ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

===============================================================================

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

43 views0 comments
bottom of page