మగవారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చుండనిద్దాం
- B.N.Satyanarayana

- 17 hours ago
- 3 min read

Magavariki Ketayinchina Seatlallo Varine Kurchonidham - Telugu Social Story | B. N. Satyanarayana
మగవారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చుండనిద్దాం - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ
Published in manatelugukathalu.com on 02/09/2026
అది విజయనగరం బస్సు కాంప్లెక్స్. ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. అప్పుడే విశాఖపట్నం పోయే బస్సు పాయింట్‌లోకి వచ్చి ఆగింది. అప్పటి వరకు ఆ బస్సు రాకకై ఎదురు చూస్తున్న ప్రయాణికుల్లో హడావిడి మొదలైంది. ఉరుకులు పరుగులతో ప్రయాణీకులు బస్సు దగ్గరకు గుంపుగా పోసాగేరు. దాంతో బస్సు డోరు దగ్గర రద్దీ పెరిగిపోయింది. అక్కడ వారిని అదుపు చేసేందుకు ఎటువంటి యంత్రాంగం లేకపోవడంతో ఒకరిని తోసుకుంటూ ఒకరు బస్సులోకి పోయేందుకు పోటీపడుతున్నారు.
దబాయించి బస్సులోకి పోగల్గిన వారు ముందుగా తమకు, తమ వారి కొరకు సీట్లు ఆక్రమించుకోగలిగారు. కొందరైతే తమ చేతి రుమాళ్లు బస్సు కిటికీ గుండా సీట్లలో వేసి, అమ్మయ్యా... తమకు సీట్లు దొరికాయని ఊపిరి పీల్చుకోసాగేరు. ప్రభుత్వం “స్త్రీలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం” కల్పించడంతో బస్సుల్లో ప్రయాణం చేసే స్త్రీల సంఖ్య మరింతగా పెరిగిపోయింది.
బస్సులు స్త్రీ ప్రయాణీకులతోనే నిండిపోసాగేయి. మగ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోసాగింది. దానినిబట్టి మగవారు అవసరమైతే తప్ప బస్సుల్లో ప్రయాణాన్ని కష్టంగా భావిస్తూ ఇష్టపడడం లేదనిపిస్తుంది. బస్సు ప్రయాణీకులతో నిండిపోయింది. కూర్చునేందుకు సీట్లు దొరకని వారు వరుస కట్టి నుంచుంటున్నారు. నుంచొని ప్రయాణం చేయవలసి రావడంతో వారిలో అసహనం, విసుగు కనిపిస్తున్నాయి. బస్సులోని ప్రయాణికుల్ని గణిస్తే కేవలం అయిదుగురు మాత్రమే మగవారు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇద్దరేమో కష్టపడి ఒకే సీటులో చోటు సంపాదించుకోగలిగారు. మిగిలిన వారు వేర్వేరు చోట్ల సీట్లు దక్కించుకోగలిగారు. బస్సు నిండు కుండలా ప్రయాణీకులతో నిండిపోయింది. అప్పటికి డ్రైవర్, కండక్టర్ల జాడ లేదు. కొద్ది నిమిషాల తర్వాత డ్రైవర్ వచ్చి తన సీట్లో కూర్చొని ఇంజన్ స్టార్ట్ చేశాడు. అప్పుడు... కండక్టర్ నెమ్మదిగా బస్సు ఎక్కుతూ అడ్డంగా నుంచున్న ప్రయాణికులపై జులుం ప్రదర్శిస్తూ వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు.
కేష్‌బ్యాగ్ తెరిచాడు. అందులో నుండి విజిల్ తీసి, ఊది డ్రైవర్‌కు బస్సును పోనివ్వాల్సిందిగా సూచన చేశాడు. అప్పుడు బస్సు కదిలి కుదుపులతో ముందుకు సాగింది. కండక్టర్ తన సరంజామా అంతా సర్దుకుంటున్నాడు. ఇంతలో వెనుక సీట్లలో కలకలం మొదలైంది. ఒక సీటులో కూర్చున్న ఒకామె తన ప్రక్కనే కూర్చున్న ఒక మగాడిని లేచి సీటు ఖాళీ చేయవలసిందిగా దబాయిస్తోంది.
ఆ సీటులో తాను ముందుగా తన కూతురికోసం రుమాలు వేసి ఉంచానంటూ, ఆ సీటు తమదేనంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అతడు ఆమె అరుపుల్ని బేఖాతరు చేస్తూ, సీటులో ఏ రుమాలు లేదు! ఖాళీగా ఉన్న సీట్లోనే నేను కూర్చున్నాను అంటూ చెబుతుంటే, ఆమె వినిపించుకోకుండా మరింతగా రెచ్చిపోతూ అతడిని బూతులతో తిట్టడం మొదలుపెట్టింది.
అంతేకాకుండా పైకి లేచి అతడి ముఖంపై కొట్టడం మొదలుపెట్టింది. ఒక్క క్షణం ఆ వ్యక్తి బిత్తరపోయాడు. ఏం జరుగుతుందో అతడికి అర్థం కాలేదు. సిగ్గుపడిపోయాడు. తేరుకుని ఆమె కొట్టే దెబ్బల్ని అడ్డుకుంటూ తనుకూడా తిట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఆగడం లేదు. మరింతగా రెచ్చిపోతూ తిట్ల వర్షం కురిపిస్తోంది. ఆమె దాడికి అతడు మదనపడుతూ మనసులో ఒక్క క్షణం ఆలోచించాడు.
తాను మగాడు. ఆమె ఆడది. తానైతే బలవంతుడు. ఆమెను తిరిగి కొట్టడం తనకు పెద్ద పనేమీ కాదు. అయితే ఒక స్త్రీని, ఆమె చేసింది తప్పు అయినా ఆమెపై తిరిగి దాడి చేయడం సభ్యత అనిపించుకోదు. దౌర్జన్యం అనిపించుకుంటోంది. పైగా నేరంగాను పరిగణించబడుతుంది. అంతేకాదు పొరపాటున ఈ విషయం పోలీసుల వరకు పోతే... బస్సులో అందరూ స్త్రీలే కనుక తాను పౌరుషపడితే... వారందరూ తననే నిందిస్తారు.
తననెవ్వరూ సమర్థించరు అని తలపోసి జరిగిన అవమానానికి సిగ్గుపడుతూనే తిట్టుకుంటూ లేచి సీటు ఖాళీ చేసి వెళ్లి నుంచున్న వారితో కలిసిపోయాడు. అరిచి గోల చేసిన ఆ స్త్రీ డ్రైవర్ దగ్గరగా ముందులో నుంచొని ఉన్న తన కూతురిని వచ్చి కూర్చోమంటూ కేకలు పెట్టి పిలవడంతో ఆ అమ్మాయి తాత్సారం చేయకుండా నుంచున్నవారిని తోసుకుంటూ వెళ్లి ఖాళీ అయిన సీట్లో గమ్మున కూర్చుండిపోయింది.
అప్పటికి... ఆ స్త్రీలో ఆవేశం తగ్గింది. ఇంత జరుగుతున్నా బస్సులో ఉన్న వారెవరూ కల్పించుకోనేలేదు. నిత్యం ఇటువంటి అనేక ఘటనలు తమ కళ్ల ముందే జరుగుతుండడంతో కండక్టర్ గానీ డ్రైవర్ గానీ తమ నోళ్లు విప్పనేలేదు. ప్రభుత్వం “బస్సుల్లో స్త్రీలకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యం” స్త్రీని బలవంతురాలిని చేసింది. ఇటువంటి ఘటనలు చూస్తుంటే మనకు “జంబలకిడి పంబ” అనే సినిమా గుర్తుకురాకుండా పోదు.
ఇటువంటి ఘటనలు ఇప్పుడు బస్సుల్లో మగవారికి తప్పకుండా కొన్ని సీట్లు కేటాయించవలసిన అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అంతేకాదు బస్సుల్లో రాయబడి ఉన్న "ఆడవారిని గౌరవిద్దాం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చుండనిద్దాం" అనే రాతల్ని చెరిపివేసి కొత్తగా ఆ స్థలంలో
"మగవారిని గౌరవిద్దాం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చుండనిద్దాం" అని రాయవలసి వస్తుంది. ఇంకా ఏమేమి చిత్రాలు జరగనున్నాయో వేచి చూడడమే మన పని.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.
( బొడ్డేడ నూక సత్యనారాయణ )
బి. ఎ.
వయసు: 75 సం॥లు
స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)
ప్రస్తుతం
హైదరాబాద్ లో
స్థిరపడ్డాను
వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో
అక్కౌంటెంట్‌గా చేసి
రిటైర్ అయ్యాను
ప్రస్తుతం వ్యాపార
రంగంలో ఉన్నాను
ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై
పత్రికలకు లేఖలు
రాయడం
రెండు సంపుటాలు కూడా
ప్రచురించడం జరిగింది
ఛిన్న కథలు వ్రాయడం
మొదలుపెట్టాను






Comments