మానసిక వైకల్యం
- B. Swathi karunakar

- 43 minutes ago
- 3 min read

Manasika Vaikalyam - Telugu Inspirational Story | B. Swathi Karunakar
మానసిక వైకల్యం - తెలుగు ప్రేరణాత్మక కథ | బి. స్వాతి కరుణాకర్
Published in manatelugukathalu.com on 25/08/2026
మానసిక వైకల్యం ఉన్న పిల్లల పట్ల ప్రేమ, అవగాహన, సహనం ఎంతో అవసరం. చిన్నతనంలో తన స్నేహితురాలి చెల్లెలు వీణ ఎదుర్కొంటున్న సమస్యను చూసిన శ్రీలత, మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు సహాయం చేయాలనే సంకల్పాన్ని జీవిత లక్ష్యంగా మార్చుకుంది. ఆ లక్ష్యంతో ప్రత్యేక శిక్షణ పొంది, వైకల్యం ఉన్న పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేసి, వారికి విద్య, చికిత్స మరియు అవసరమైన సహాయాన్ని అందిస్తూ వారి జీవితాల్లో ఆశాకిరణంగా నిలిచింది.
శ్రీలత 9వ తరగతి చదువుతున్నది. తను అప్పుడప్పుడు తన స్నేహితురాలు పద్మ ఇంటికి ఆడుకోవడానికి వెళ్ళేది. పద్మ వాళ్ళ చెల్లి వీణను చూస్తే.. ఇంట్లో ఏమి మాట్లాడకుండా, ఉలుకు పలుకు లేకుండా కూర్చునేది. శ్రీలత వీణను పలకరించినా సమాధానం ఇచ్చేది కాదు. తదేకంగా తనను చూసేది. ఎటువంటి ప్రతిస్పందన లేకపోయేది.
చాలా రోజుల నుండి అది గమనించిన శ్రీలత ఒకరోజు పద్మని, "మీ ఇంటికి వచ్చినప్పుడల్లా మీ చెల్లి మనతో ఎందుకు ఆడుకోవడానికి రాదు? తనకు మనతో ఆడుకోవాలని ఉండదా?" అని ప్రశ్నించింది.
దానికి సమాధానంగా పద్మ, "మా చెల్లికి మానసిక వైకల్యం ఉందట. తను మనలాగా అందరితో ఆడుకోవాలని, కలిసి తిరగాలని, ఉత్సాహంగా ఉండాలనే కోరికలు ఉండవట. తనకు మెదడు వ్యవస్థలో ఏదో లోపం ఉందట. తన వయస్సుకు తగ్గట్టుగా మెదడు అభివృద్ధి చెందలేదట.
అందుకే పాపం... మా చెల్లిని ఎప్పుడూ మా అమ్మ చూసుకుంటుంది. మా అమ్మ ఎక్కడికి వెళ్లినా తనను వెంట తీసుకువెళుతుంది. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు తనకు అన్ని పనులు మా అమ్మే చేస్తుంది".
"పాపం మా అమ్మ నాన్న ఎప్పుడూ తన గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటారు. మా అమ్మ అయితే భగవంతుడు నాకు అన్యాయం చేశాడంటూ ఏడుస్తుంది" అని చెబుతుంది.
ఇదంతా విన్న శ్రీలతకు మనసులో చాలా బాధ కలిగి తీవ్రంగా ఆలోచించసాగింది. దీనికి పరిష్కారం అంటూ ఏమీ ఉండదా? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది నేను తెలుసుకోవాలి అని పట్టుదలతో ఉంటుంది.
తను పై తరగతులకు వెళ్లినా తన మనసులో పద్మ చెల్లి వీణ పరిస్థితి, దాని వల్ల తన తల్లిదండ్రులు పడుతున్న బాధలు మరిచిపోలేదు. అందుకోసం ఏమైనా ప్రత్యేకమైన కోర్సు చదవాలా అని బాగా ఆలోచించింది. చాలా రకాలుగా అందరిని అడిగి తెలుసుకుని చివరికి తనకు ఆ సమస్యకు పరిష్కారం దొరికింది.
తను ఇంటర్ సెకండియర్ చదివిన తర్వాత 'డెఫ్ అండ్ డమ్' (Deaf and Dumb) కు సంబంధించిన కోర్సు చేసి, కొంతమంది మానసిక వైకల్యంతో ఉన్న పిల్లలను మామూలు స్థితికి తీసుకురావాలనే ఆలోచన వచ్చింది.
తను అనుకున్నట్లుగానే ఇంటర్ తర్వాత ఆ కోర్సును పూర్తి చేసి, అందులో ఉత్తీర్ణత సాధించింది.
ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి, కొంతమంది స్నేహితుల చేత ఒక క్లినిక్ ని స్థాపించి, వైకల్యం ఉన్న పిల్లల కోసం ప్రత్యేకంగా స్కూలు ఏర్పాటు చేసి... వారికి తగిన రీతిలో బోధిస్తూ... వైద్యురాలుగా వాళ్ల మానసిక స్థితిని తెలుసుకొని, మామూలు స్థితికి రావడానికి ప్రయత్నం చేసింది.
తన ప్రయత్నంలో కొంతమంది పిల్లలను మామూలు స్థితిలోనికి తీసుకువచ్చింది. విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీలతను ఒక దేవతలా భావించి, "మిమ్మల్ని ఆ దేవుడు మా కోసం పంపించాడు" అని పొగిడేవారు.
ఇలా శ్రీలత మానసిక వైకల్యం ఉన్న పిల్లల కోసం చికిత్స చేయాలనుకున్న తన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. తనకు చిన్నతనంలో పుట్టిన ఆలోచనను గుర్తుపెట్టుకొని, దాన్ని నెరవేర్చుకోవడానికి "పట్టు వదలని విక్రమార్కుడిలా" విజయం సాధించి... ఎంతోమంది పిల్లలకు మంచి జీవితాన్ని అందిస్తోంది.
శ్రీలత వంటి ఆదర్శవంతమైన విద్యార్థులు మన ప్రపంచంలో ఉంటే... మానసిక వైకల్యం ఉన్న అందరి కుటుంబాలలో వెలుగు నిండుతుంది.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
బి స్వాతి కరుణాకర్ ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: నా పేరు బి స్వాతి కరుణాకర్,
నివాసం హైదరాబాద్,
విద్యాభ్యాసం MA, M.ed పూర్తి చేశాను. ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నాను.
నాకు చిన్నప్పటినుండి సాహిత్యం అంటే ఎంతో అభిరుచి. తీరిక సమయాల్లో కవితలు, కథలు వ్రాయడం చాలా ఇష్టం. నా కవితా శరాలతో సమాజంలో చైతన్య దీప్తులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదములు.🙏






Comments