తీగ మెరుపు
- Bhattu Venkata Rao

- 52 minutes ago
- 3 min read

Teega Merupu - Telugu Comedy Story | Bhattu Venkata Rao
తీగ మెరుపు - తెలుగు హాస్య కథ | భట్టు వెంకటరావు
Published in manatelugukathalu.com on 24/08/2026
భట్టు వెంకటరావు రచించిన “తీగ మెరుపు” ఒక సరదా, సహజమైన గ్రామీణ నేపథ్యంలోని స్నేహ కథ. వానాకాలంలో రోడ్లు బురదమయం కావడంతో బస్సు గ్రామానికి రాకపోవడం, ఇద్దరు యువకులు రెండు మైళ్ల దూరం నడుచుకుంటూ ఇంటికి వెళ్లడం కథకు నేపథ్యంగా నిలుస్తుంది. మెరుపులకు భయపడే సాంబయ్యను అతని స్నేహితుడు మాటల్లో పెట్టడానికి చేసే ప్రయత్నాలు కథలో హాస్యాన్ని పండిస్తాయి. యువతలోని అమాయకత్వం, స్నేహితుల మధ్య ఉండే చనువు, తొలి ప్రేమపై ఆసక్తి వంటి అంశాలు సహజమైన సంభాషణల ద్వారా ఆవిష్కృతమవుతాయి. చివర్లో “సౌదామిని” అనే పేరు, ఆకాశంలో మెరిసే తీగ మెరుపుతో కలిసే సందర్భం కథకు చక్కని హాస్యాత్మక ముగింపు భావాన్ని ఇస్తుంది.
వానలు కురవకపోతే మనం బతకలేం అనేది నిజమే గాని, వానాకాలంతో మాకొక తలనొప్పి ఉంది. వానలు మొదలైన కాణ్ణుంచి మా ఊరికి బస్సెళ్ళదు. గుంతలు గుంతలుగా ఉంటుంది మట్టి రోడ్డు. అందుకని బస్సు నడపరు. అడ్డరోడ్డు దగ్గరే తిప్పేసుకుని ఎనక్కెళ్ళిపోతారు.
అడ్డరోడ్డు నుంచి రెండు మైళ్ళు నడిస్తే మా ఊరొస్తది. అడ్డరోడ్డు దగ్గర బస్సు దిగిన మావూరి జనమంతా నడిచే వెళతారు. ఒకరోజు నేనూ మా సాంబయ్య అట్లానే దిగి నడుస్తా ఉన్నాం. మేమిద్దరం ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాం టౌన్లో కాలేజీలో. మావూరి నుంచి ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంటది ఆ టౌను. అక్కడొక డిగ్రీ కాలేజీ ఉంది. ఆ కాలేజీలో నేను హెచ్.ఇ.సి., వాడు బై.పి.సి. గ్రూపుల్లో చదువుతా ఉన్నాం. రొండ్రోజులు సెలవులుంటే మా ఊరెళ్తున్నాం.
ఆకాశం మబ్బులతో నిండి ఉంది. ఉరుములు లేవు గాని, తీగ మెరుపులు మెరుస్తా ఉన్నై. ఇంకో గంటలో చీకటి పడిపోద్ది. ఆపాటికి మేము మా ఊరెళ్ళిపోతాం. వాడికి మెరుపులంటే భయం. తీగమెరుపులంటే మరీను. వాటి వెలుగు కళ్ళలో పడితే తిమ్మిరెక్కినట్లై, కాసేపటికి బాగా తలనొచ్చుతది అని అంటాడు వాడు. అలాంటిది ఇప్పుడేమో ఒకటేనైతే తీగ మెరుపులు మెరుస్తా ఉన్నై ఆకాశంలో. చాలా ఇబ్బందిపడతా ఉన్నాడు వాడు. నా పక్కనే, నన్ను అడ్డం పెట్టుకుని, దాక్కుని, దాక్కుని నడుస్తా ఉన్నాడు.
వాడి దృష్టి మళ్ళించాలని “అవున్రా, మొన్నామద్య క్లాసులో ఎవురో అమ్మాయి నిన్ను చూసి నవ్విందన్నావే, ఏమైంది కత?” అని అడిగినా.
వాడికి ఇట్టాంటి విషయాలు చెప్పుకోడానికి ఇంకెవరూ లేరు. అందుకని అన్నీ నాకే చెబుతాడు. సలహాలు కూడా నన్నే అడుగుతాడు. నేను చెప్పినట్టే చేస్తాడు. అంత గురి నేనంటే మా సాంబయ్యకి.
“కతా లేదు గితా లేదు ఊరుకోహె!” అని విసిరికొట్టాడు వాడు.
వీడు మాంచి చిరాకులో ఉన్నాడ్లే... ఇప్పుడుగాదని... సైలెంటుగా ఉన్నా. వాడు ఎక్కువసేపు నాతో మాట్లాడకుండా ఉండలేడు. కాసేపటి తరువాత వాడే మళ్ళీ సమాధానం చెప్తాడని నాకు తెలుసు.
నేననుకున్నట్లుగానే ఓ నిమిషం తరువాత...
“అడిగాన్రా!” అన్నాడు.
“ఏవఁని?” అన్నా.
“ఏందమ్మాయ్ నన్ను చూసి నవ్వుతావున్నావ్ అని!” అన్నాడు.
“అట్టా అడిగినావా?! ఏమనిందేంది?” అన్నా కాస్త ఆతృతగా.
“నేను నిన్ను చూసి నవ్వట్లా!” అంది.
“కరెక్టుగానే చెప్పుళ్ళా...” అన్నా.
“పోరా...” అంటూ కోపంగా నావైపుకు చూడబోయాడు వాడు.
అంతలో ఆకాశంలో ఒక పెద్ద తీగ మెరుపు తళుక్కున మెరిసింది. “అబ్బా...” అని కళ్ళకు చేతులను అడ్డం పెట్టుకుని, కళ్ళు మూసుకుని మొహం పక్కకు తిప్పుకుంటూ నా వెనక్కి జరిగాడు వాడు.
పాపం అనిపించింది నాకు. స్పీడుగానే నడుస్తా ఉన్నాం. ఇంకో అరగంటదాకా పడాలి ఈ బాదంతా వాడు.
“సరే, మరి నువ్వేమన్నా?” అన్నాను కాసేపటి తరువాత అదే సంభాషణ కొనసాగిస్తూ.
“ఏమన్లా... సరెలే పో! అన్నా".
వాడి తెలివికి నాకేంమాట్లాడాలో తెలీక సైలెంటైపోయా.
“అప్పట్నుంచి నాకేసి చూడడం మానేసింది!” అన్నాడు, కాసేపటి తరువాత వాడే.
ముందే చెప్పాను గదా, నేను పక్కనుంటే నాతో రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు మాట్లాడకుండా ఉండలేడు మా సాంబయ్య.
"అంతేగా మరి!" అని నవ్వుకుని ఊరకున్నా.
మెరుపులు మెరుస్తానే ఉన్నై. నన్ను అడ్డంగా పెట్టుకుని పక్కనే నడుస్తూ వాడు తంటాలు పడతానే ఉన్నాడు.
“ఇంతకీ, ఏం పేరురా ఆ అమ్మాయిది?” అనడిగా, మళ్ళీ మాటల్లో పెడదామని.
“సౌదామిని!” అన్నాడు వాడు.
వాడాపేరు చెబుతున్నంతలో మరో పెద్ద తీగ మెరుపు ఆకాశంలో తళుక్కున మెరిసింది.
“ఓర్నాయన, పెద్ద తీగ మెరుపురా సాంబయ్యా. నీకు బాగా తలనొచ్చేటిదిరా. బేగి పక్కకు తప్పుకో!” అని అరిచా కంగారుగా, రిక్వెస్టింగ్ గా.
“ఎప్పుడో తప్పుకున్నాగా...” అన్నాడు వాడు, మరింతగా నా వెనక్కి జరిగి దాక్కుని.
నా కంగారు గానీ, వాడి జాగ్రత్త గురించి వాడికి తెలీదా... అనుకున్నా!
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
భట్టు వెంకటరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: భట్టు వెంకటరావు

నా పేరు భట్టు వెంకటరావు.
కేంద్ర ప్రభుత్వ విశ్రాంత అధికారిని.
సాహిత్యంపై అభిలాషతో విశ్రాంత జీవితంలో తెలుగు సంప్రదాయ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అలా చదవడం మొదలుపెట్టిన కొన్నాళ్ళకి చిన్న చిన్న వ్యాసాలు వ్రాయడం ఆరంభించి, కొనసాగిస్తున్నాను.
నా రచనా వ్యాసంగం ప్రథానంగా పూర్వ కవుల రచనలలోని ఆసక్తికరమైన విషయాలపై సాహిత్య సంబంధమైన వ్యాఖ్యలతో కూడినదిగా ఉంటుంది. అన్ని ప్రథాన దినపత్రికల సాహిత్యం పేజీలలో నా వ్యాసాలు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి. వాటితో పాటు అప్పుడప్పుడు ఛందోబద్ధమైన పద్యాలను, కంద పద్యం వ్రాయడంతో మొదలుపెట్టి, వ్రాస్తున్నాను.
ప్రస్తుతానికి నా రచనా వ్యాసంగం గురించి చెప్పుకోగలిగినది ఇంతవరకే. ధన్యవాదములు!
నమస్కారములతో,
భట్టు వెంకటరావు,
హైదరాబాదు.




Comments