మనీ… షీ…
- Lalitha Sripathi

- 3 hours ago
- 6 min read
ఈ కథ ఉగాది షడ్రుచుల కథల పోటీకి పంపబడింది.

Money - She - Telugu Family Story Written By Sripathi Lalitha
Published in manatelugukathalu.com on 30/04/2026
మనీ… షీ… - తెలుగు కుటుంబ కథ | శ్రీపతి లలిత
ప్రేమ పేరుతో చేసే సేవ… నిజమా?లేదా లాభం కోసం వేసే ముసుగా?
ఈ కథ ఒక కుటుంబంలో దాచిన నిజాలను బయటపెడుతుంది.మాటల్లో త్యాగం… చేతల్లో స్వార్థం… చివరికి కర్మ తీర్పు.
“మా అత్తగారికి తొంభై ఏళ్లు. దాదాపు ఏడెనిమిదేళ్ల నుంచి, మొన్న పోయేదాకా అంతా మంచం మీదే. మీరే చూశారుగా! ఎవ్వరూ రాలేదు, ఒక్క పూట ఉండి ఆవిడకి ఏమీ చేయలేదు. అంతా నేనే చేశాను!
మా అమ్మానాన్నలను కూడా అంత బాగా చూడబట్టి, మా దగ్గరే చివరి రోజులు గడిపి, మా వారి చేతుల మీదుగా, ప్రశాంతంగా పోయారు.
ఈ ముసలివాళ్ళని చూడడం ఎంత ఇబ్బందయినా, నేనూ, మా ఆయనా, అన్నీ భరించి, మిగిలిన పిల్లలందరూ వాళ్ళని వదిలేసినా, ఎంతో ఓర్పుగా చూశాం. ఇంత చిన్న ఫ్లాట్, ఉన్నవి రెండు బెడ్ రూములు, అందులోనే మా అబ్బాయితో సహా ఆరుగురం ఇరుక్కునో, సరుక్కునో ఉన్నామా లేదా!
అమెరికాలో ఉన్న మా చెల్లెలు, విశాఖపట్నంలో ఉన్న మా అక్కా, దులిపేసుకుని వెళ్ళిపోయినా, మా అమ్మానాన్నను ఎక్కడో ఓల్డేజ్ హోమ్‌లో ఉంచడానికి మా మనసు ఒప్పుకోలేదు సుమండీ! అలాగే మా అత్తగారిని కూడా ఈయన అన్నదమ్ములు, 'మా వల్ల కాదమ్మా!' అని వదిలించుకున్నారు. మేము అలా ఆవిడని రోడ్డు మీద వదిలేయలేదు కదా.
ఇప్పటికే ఇద్దరు వయసు మళ్ళినవాళ్ళు ఉన్నా, ఆవిడనీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం.
ఒక పెళ్లి లేదు, ఓ పేరంటం లేదు, ఓ సినిమా లేదు, ఓ షికారు లేదు, ఇల్లు కదలకుండా చాకిరీ చేస్తున్నాం, మీకు తెలియనిదా?
తల్లిదండ్రులూ, అత్తగార్ల సేవ కోసం, మేమిద్దరం ఎన్నెన్ని సరదాలు వదులుకున్నాం. అవన్నీ బయట వాళ్ళకి ఏం తెలుస్తాయి చెప్పండి! ఏదో మీరు రోజూ చూస్తున్నారు కనక ఇవన్నీ మీరు అర్థం చేసుకోగలరు!” పక్కింటి పరిమళను ఊదర గొట్టేస్తోంది మనీష.
మనీష అత్తగారు సావిత్రి చనిపోయి, పదమూడో రోజు వైకుంఠ సమారాధనకి చుట్టుపక్కల వాళ్ళని, కొందరు బంధువులని పిలిచారు. వాళ్ళున్నది పదహారు ఫ్లాట్స్ ఉన్న చిన్న కమ్యూనిటీ. భోజనాలు ఒక ఫ్లాట్ ఖాళీగా ఉంటే అక్కడ ఏర్పాటు చేశారు.
మనీష మాటలన్నీ, ఒక పక్క అక్క లత, చెల్లెలు లావణ్య, ఇంకో వైపు తోటికోడలు జయ, శ్రీదేవి వింటూనే ఉన్నారు.
ఇంకో వైపు మనీష భర్త మోహన్, “మా అత్తగారు, మామగారు, పాపం ఎప్పుడూ ఏ ఇబ్బంది పెట్టలేదండి. ఇంట్లో కూడా ఏదో ఒక పని సాయం చేస్తూనే ఉండేవారు.
మా అమ్మే మహా కాల్చుకు తినేసింది. అసలు సర్దుకునే సమస్య లేదు. మేము నరకం చూశాం.
అందరూ వదిలించుకున్నారు. మేము ఇరుక్కుపోయాం. మా అబ్బాయికి పెళ్లయ్యాక, ఇల్లు సరిపోక, పాపం మా అబ్బాయి, కోడలు హోటల్‌లో ఉండాల్సి వచ్చింది. వాళ్ళు మమ్మల్ని అమెరికా రమ్మంటే వెళ్ళడానికి అవలేదు!” కష్టాలన్నీ ఏకరువు పెట్టాడు.
అప్పటికీ ఒకాయన, “ఇంకేముంది లెండి, అందరినీ పంపించారుగా, మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లచ్చు!”
“ఆ, ఏం వెళ్తాంలేండి, ఇప్పటికే బోలెడు ఖర్చులు అయ్యాయి, అవన్నీ పూడ్చుకోవాలిగా!” నిట్టూర్చాడు మనసులోనే మిగులు లెక్కలు వేసుకుంటూ.
క్యాటరింగ్ వాళ్ళు భోజనాలు తెస్తే, అందరూ తినేసి, పోయిన ఆవిడ గురించి పైకి నాలుగు ఇచ్చకపు మాటలు చెప్పి, వెళ్తూ, వెళ్తూ, “మీ అత్తగారు పోయి మీకు పీడ వదిలింది!” అని డైరెక్ట్‌గా చెప్పకపోయినా, అదే అర్థం వచ్చేలా కొంచెం మర్యాదగా చెప్పారు.
మనీష కూడా రాని, లేని కన్నీళ్లని తెచ్చుకుని, పమిటతో తుడుచుకుని,
“ఇంట్లో పెద్ద దిక్కు లేకుండా పోయింది!” బుడిబుడి రాగాలు తీసింది.
మనీష అక్కా, చెల్లెలు, మోహన్ అన్నదమ్ములు ఎవరికి వారు కూర్చున్నా, వాళ్ళ పిల్లలందరూ ఒక చోట చేరి, ఒకటే గుసగుసలు.
ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దవాళ్ళు, వెళ్లడానికి సర్దుకుంటుంటే, పిల్లలు హాల్లో చేరారు.
మనీష అక్క కొడుకు, “పిన్నీ, బాబాయ్! ఒకసారి కూర్చుంటే
మీతో మాట్లాడాలి అనుకుంటున్నాం!” అంటే,
‘ఇంతకాలం అమ్మమ్మని ఎంతో బాగా చూసుకున్నావు అని పొగుడుతారు’ అని సంతోషపడుతూ, ఇద్దరూ వచ్చి కూర్చున్నారు.
“పెద్దమ్మా! అసలు అమ్మమ్మ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు?” అడిగాడు చెల్లెలి కొడుకు.
ఈ ప్రశ్న ఇప్పుడు ఎందుకు, అనుకుంటూనే,
“మా అత్తగారు, కూతురి దగ్గరికి ఆరు నెలలు అమెరికా వెళ్లింది. మా అబ్బాయి చిన్నవాడు. మేము ఆఫీసుకి వెళ్తే పిల్లాడిని చూసుకోవడానికి ఎవరైనా కావాలి. అదే టైంలో తాతయ్య సొంత ఇంటికి చాలా రిపేర్లు వచ్చాయి. అది రిపేర్ చేయించే కన్నా, అమ్మేస్తే, ఆ డబ్బుతో ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుని ఉండచ్చు అని రమ్మన్నాం!” మనీష చెప్తుంటే, పక్కనే ఉన్న అక్కా, చెల్లెలు కూడా వచ్చి కూర్చున్నారు.
“ఆ డబ్బులు పెట్టి ఫ్లాట్ కొన్నారు, అమ్మానాన్నను అక్కడ ఉంచకుండా, ఆ ఇల్లు అద్దెకిచ్చి, ఆ అద్దె మీరు తీసుకున్నారు. వయసయిపోయాక ఎక్కడ పడుకుంటే ఏమిటి అని, అమ్మా, నాన్నని హాల్‌లో పడుకోమన్నారు” అంది అక్క లత.
“నేను బతిమిలాడితే, అమ్మని, నాన్నని అతి కష్టం మీద అమెరికాకి మూడు నెలలు పంపావు. ఇంకా ఉంటే, నీకు చాకిరీ చేసేవాళ్ళుండరని, నాకు డబ్బో, నగలో ఇస్తారని భయపడ్డావు. అమ్మానాన్నకి ఖర్చు పెడతావని, అయిదు వందల డాలర్ల చొప్పున, ఏడాదిలో కనీసం నాలుగు సార్లు పంపేదాన్ని. అది పెట్టి నువ్వు ఏడాదికి ఒక నగ చేయించుకున్నావని అమ్మ చెప్పేది” చెల్లెలు లావణ్య కొద్దిగా కోపంగా అంది.
వీళ్ళేదో తనని మెచ్చుకుంటారనుకుంటే, సీను రివర్స్ అయిందనుకుంది మనీష.
“అంత ప్రేమ ఉంటే మీరే అమ్మానాన్నని తీసుకెళ్లి పెట్టుకోవాల్సిందిగా!” మూతి తిప్పుకుంటూ అంది మనీష.
“అదీ అయ్యిందిగా! మా ఇంట్లో కొన్ని రోజులు ఉందామని వచ్చారు. అప్పుడు మా అత్తగారికి బాగాలేక, మేము ఆసుపత్రి హడావిడిలో ఉన్నాం. అమ్మ వంట చేస్తుంటే, నువ్వు వచ్చి ఎంత రాద్ధాంతం చేశావో గుర్తులేదా! మళ్లీ వాళ్ళని పిలిస్తే ఊరుకోనని మా ఆయన చెప్పారు” కళ్లు తుడుచుకుంది లత.
“అమ్మానాన్నకి విడిగా ఇల్లు ఉండుంటే, మాకూ, వాళ్ళకి కూడా హాయిగా ఉండేది. మాకు పుట్టిల్లు లేకుండా చేశావు. మేమేదో మీ సొమ్ము తినిపోయినట్టు మీరు ప్రవర్తించేవారు. ఇల్లు ఇరుకని హోటల్‌లో ఉండేవాళ్ళం. అంత దూరం నుంచి అమ్మవాళ్ళతో గడుపుదామని మేమొస్తే, గూఢచారిలాగా మా మెడల మీదే మీరిద్దరూ ఉండేవాళ్ళు. మాకేదో దోచి పెడతారని మీ భయం. నాన్నకి వచ్చిన పెన్షన్‌లో నుంచి, నీ కొడుకు ఫీజులు కట్టారు, కార్ కొన్నారు, స్థలాలు కొన్నారు. పైకి మాత్రం, మీరేదో కష్టపడి చూసినట్లు పెద్ద బిల్డప్” చెల్లి కోపంగా అంటే,
“ఇంట్లో పనికి, మీరు తిరగడానికి వెళ్తే కాపలాకి అమ్మ, పిల్లాడి చదువు, ఆటలు చూడడం నాన్న పని… చివరి రోజు దాకా వాళ్ళ సొమ్ముతోనే ఇల్లు గడిపి, లక్షలు వెనకేసుకుని, ఆఖరికి ఆ ఫ్లాట్ అమ్మి నువ్వే తీసుకున్నావు. అది నాన్న సొమ్ము, అందులో మాకూ భాగం ఉందిగా?” అక్క ‘లా’ పాయింట్లకి బిత్తరపోయింది మనీష.
“వాళ్లవల్ల ఇంత లాభం పొంది, మేము వాళ్ళని వదిలేసినట్లు, నువ్వేదో ఉద్ధరించినట్లు అందరికీ చెప్పుకుంటున్నావు!” చెల్లెలు లావణ్య అంటుంటే, మోహన్ వదినలు ఇద్దరూ వచ్చారు రంగంలోకి.
“మిమ్మల్ని మాత్రమే కాదమ్మా, మమ్మల్ని కూడా ఇలానే చేశారు వీళ్లు. మా అత్తగారి పెన్షన్‌కి ప్లాను వేసి, ఆవిడకి మా మీద తెగ చాడీలు చెప్పి, మా ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. అక్కడ ఇప్పటికే మనీషా వాళ్ల అమ్మనాన్న ఉన్నారు కదా! అంటే వినకుండా ఇక్కడికి వచ్చి నానా బాధలు పడ్డారు.
మనిషిని పెట్టి మా అత్తగారిని చూసుకుంటాను అని చెప్పిన ఈయనగారు,
ఆవిడ పెన్షన్ మొత్తం స్వాహా చేసి, ఆవిడకి కనీసం స్నానం చేయడానికి కూడా, మనిషి సాయం లేకుండా చేశారు. ఎక్కడ మనసు మారి మా దగ్గరికి వస్తుందో అని, ఎప్పుడూ మా మీద చాడీలు చెప్పేవారు ఇద్దరూ. ఆ పిచ్చావిడ అది నమ్మి, ఇక్కడే ఉండిపోయింది. చివర చివర 'నేను నా అంతట నేను స్నానం చేయలేకపోతున్నాను, భోజనం చేయలేకపోతున్నాను, కూర్చోలేను' అంటే కూడా ఆవిడకి మనిషిని ఏర్పాటు చేయలేదు.
అందరికీ మా అత్తగారు వీళ్లని బాధ పెట్టిందని, వీళ్ళు ఏవేవో త్యాగాలు చేశారని చెప్పుకుంటున్నారు. ఉన్నంతకాలం ఆవిడ పాస్బుక్, చెక్ బుక్ అన్నీ వీళ్ళ దగ్గరే. ఎంత వస్తోంది, ఎంత పోతోందీ ఆవిడకి తెలియదు. మా పిల్లల చేతిలో ఏమన్నా పెట్టాలన్నా వీళ్ళని అడిగి ఇవ్వాల్సిందే! ఆవిడ బంగారం, డిపాజిట్లు ఏమయ్యాయి దాని గురించి మాట్లాడరు!”
తోటికోడలి మాటలు లెక్క లేనట్లే, ఫోన్ లో ఏదో చూసుకుంటోంది మనీష.
మోహన్ అన్న వచ్చి, “ఇదిగో వీళ్లతో మనకేమిటి? ఇప్పుడు అమ్మ లేదు, ఆవిడ ఉన్నప్పుడు ఆవిడని చూడడానికి వచ్చి, ఎన్నో మాటలు పడ్డాం. ఇంక వీళ్ళ మొహం చూసేది లేదు.
మనకి చెప్పలేదు కానీ, ఆ డబ్బులన్నీ పెట్టి కొత్త ఫ్లాట్ కొన్నారు. ఇందాకే వీళ్ళ ఫ్రెండ్ చెప్పాడు, అందరికీ 'మేము అమ్మకి ఇంత చేశాం, ఆయనకి ఇంత చేశాం' అని వెధవ కబుర్లు.
ఈ ఇరుకు ఇంట్లో, ముగ్గురు పెద్దవాళ్ళనీ ఎవరికీ సుఖం లేకుండా ఉంచి, ఏదో చేశామని గొప్పలు చెప్తున్నారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదనుకుంటుంది. అందరికీ ఈ సంగతులు తెలుసు! ఎవరి పాపం వాళ్ళకే కొడుతుంది. పదండి ఇంక వెళ్దాం!” కోపంగా అన్నాడు.
‘ఆఁ, మాకే శాపనార్ధాలు తగలవు, మాకు రావాల్సిన డబ్బులు వచ్చాయి చాలు!’ అన్నట్లు పెదవి విరిచింది మనీష కాదు.. కాదు, మనీ.. షీ.
కాలం ఎవరి కోసం ఆగదు. దాదాపు పదేళ్లు గడిచాయి. మోహన్, మనీషల గురించి, అటు అతని అన్నదమ్ములు, ఇటు ఈమె అక్కాచెల్లెళ్లు పట్టించుకోవడం మానేశారు.
కాలం ఎవరికోసం ఆగదు. దాదాపు పదేళ్లు గడిచాయి. మోహన్, మనీషల గురించి, అటు అతని అన్నదమ్ములు, ఇటు ఈమె అక్కాచెల్లెళ్లు పట్టించుకోవడం మానేసారు.
మనీష కొడుకు,కోడలు అమెరికాలో సెటిల్ అయ్యారు. వాళ్ళకి అవసరమైనప్పుడు కోడలు, తన తల్లితండ్రులని పిలిపించుకొని, వాళ్ళని అక్కడే ఉంచేసుకుంది.
ఏదో ఒకటి రెండుసార్లు వీళ్లని పిలిపించి, తర్వాత వీళ్ళ దారిన వీళ్లని వదిలేశారు.
ఉన్నట్టుండి ఒక రోజు, ఇరువైపుల వారికి ఫోన్లు వెళ్ళాయి. మోహన్ కొడుకు చేశాడు,
“మా నాన్నకి పక్షవాతం వచ్చింది, ఆసుపత్రిలో చేర్చాం!”
ఎంతైనా రక్తసంబంధం కదా! అందరూ పరిగెత్తుకు వెళ్లారు.
మోహన్‌కి కుడి వైపు చెయ్యి, కాలు, నోరు దెబ్బతిన్నాయి.
ప్రాణానికి ప్రమాదం లేదు కానీ, మళ్లీ మామూలు మనిషి అవడం కష్టమని చెప్పారు.
మనీష కూడా వయసు రీత్యా వచ్చే మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, కేటరాక్ట్ వంటి రకరకాల సమస్యలతో బాధ పడుతోంది.
ఆసుపత్రిలో మోహన్ కొడుకు ఒక్కడే కనిపించాడు. “మీ ఆవిడ ఇంట్లో ఉందా?” అన్న ప్రశ్నకి “తను రాలేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సెలవలు కష్టం. నేను కూడా ఈయనని ఇంటికి పంపగానే మనిషిని పెట్టి వెళ్ళిపోతాను” అన్నాడు.
“మీ నాన్న ఇలా ఉంటే, ఎవరో మనిషిని పెట్టుకుని నేను ఉండలేను. ఆయనని రిహాబ్ సెంటర్ లో చేర్పించు. నా బాధలు నేను పడతాను! మా అక్కాచెల్లెళ్లు, ఆయన అన్నదమ్ములు ఉన్నారుగా, ఎవరో ఒకరు మధ్యలో వెళ్లి చూసుకుంటారు, నాకు అవసరముంటే పలుకుతారు!” తెగించి అంది మనీష.
“అమ్మానాన్నల్ని, మీ అత్తగారిని ఎంతో బాగా చూసుకున్నావు కదా! ఆ పుణ్యఫలమే ఇది. దీంట్లో మాకు వాటా వద్దుమ్మా! అంతా నువ్వే అనుభవించు!” వెళ్లిపోయారు లత, లావణ్య.
“అమ్మానాన్నల్ని, మీ అత్తగారిని ఎంతో బాగా చూసుకున్నావు కదా! ఆ పుణ్యఫలమే ఇది. దీంట్లో మాకు వాటా వద్దమ్మా! అంతా నువ్వే అనుభవించు!” వెళ్లిపోయారు లత,లావణ్య.
“మేము అమ్మనే సరిగ్గా చూడలేదని అన్నారు కదా! ఇప్పుడు నిన్ను మేము చూడలేం! మీ అబ్బాయి ఏ ఏర్పాటు చేస్తే అదే పాటించండి!” సెలవు తీసుకున్నారు మోహన్ అన్నదమ్ములు.
“అమ్మమ్మ, నాన్నమ్మల డబ్బు మొత్తం మీరే తీసుకోవాలని, లోకం దృష్టిలో మీరు మంచి వాళ్ళు అనుకోవాలని అందర్నీ చెడ్డ చేశారు, అదే ఇప్పుడు మీకు తిరిగి కొట్టింది. కొడుకుని కనక డబ్బు పంపుతాను, ఏర్పాట్లు మీరే చేసుకోండి!” కోపంగా అన్న కొడుకుని మూగగా చూశాడు మోహన్. డబ్బు మాట విన్న మనీ…షీ, మనసులో ప్లాన్లు వేస్తోంది, ఎన్ని ఫలిస్తాయో తెలీదు. వేచి చూడాలి.
సమాప్తం
శ్రీపతి లలిత గారి కొన్ని ఇతర రచనలు:
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.








Comments